Monday, February 1, 2016

హైదరాబాద్ ను గెలిపించుకోండి..

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ముగిసింది.. ఎవరికి ఓటు వేయాలనే విషయంలో హైదరాబాద్ వాసులు ఈపాటికే ఓ నిర్ణయానికి వచ్చి ఉంటారు.. అయినా ఓటర్లు కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది..
ఇవి పూర్తిగా స్థానిక సంస్థల ఎన్నికలు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పని తీరుకు ఏరకంగా కూడా ప్లెబిసైట్లు కాదు.. కాబట్టి రాజకీయ పార్టీల అభ్యర్థులకే ఓటు వేయాలనే నియమం లేదు.. గెలిచే అభ్యర్థులు హైదరాబాద్ నగరంలో స్థానిక సమస్యల పరిష్కారానికి మాత్రమే కృషి చేయాలి.. వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో ఏమాత్రం సంబంధం లేదు అని గ్రహించండి.. ఎన్నికల్లో ఎవరు గెలిచినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి నగరానికి న్యాయంగా రావాల్సిన పథకాలు, నిధుల వాటాలు రావాల్సిందే.. తమకు ఓటు వేయలేదని వారు తొక్కి పెట్టే అవకాశం ఏమాత్రం లేదు..
పార్టీ ఫిరాయింపు దారులను, రాజకీయ అవకాశవాదులను కచ్చితంగా ఓడించండి.. స్వలాభాల కోసం అమ్ముడుపోయిన వీరు ప్రజాప్రతనిధులుగా ఏమాత్రం పనికిరారు.. తమ పార్టీలకే ద్రోహం చేసిన వాడు ప్రజలను కూడా మోసగించడనే గ్యారంటీ ఏమిటి?
అభ్యర్థుల పార్టీలను కాకుండా, అభ్యర్థుల గుణగణాలను పరిగణనలోకి తీసుకోండి.. మీకు అన్ని వేళలా అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించే అభ్యర్థినే ఎన్నుకోండి.. గుండాలు, అవినీతిపరులకు అసలు ఓట్ల వేయకండి.. నీతి నిజాయితీ ఉన్న వారినే ఎన్నుకోండి..
కుల, మతాలు, రాజకీయాల ఆధారంగా ఓటు వేస్తే అభ్యర్థులు తమ వర్గాలకే పరిమితం అవుతారే తప్ప నిజమైన ప్రజాప్రతినిధులుకాదు..
అభ్యర్థి బాగా డబ్బు ఖర్చుపెట్టాడు.. జోరుగా ప్రచారం చేశాడు కాబట్టి అతనికే ఓటు వేద్దామని అనుకోకండి.. ఇప్పుడు ఎన్నికల్లో ఖర్చు పెడుతున్న అభ్యర్థులు రేపు గెలిస్తే అవినీతి, అనైతిక కార్యకలాపాలతో ఈ పెట్టుబడిని అంతా రాబట్టుకోవడం ఖాయం.. వీరు కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు గుంజి పనుల నాణ్యతను దెబ్బతీస్తారని గ్రహించండి..
మీ బస్తీకి మంచినీరు సక్రమంగా వస్తోందా?, డ్రైనేజీలు, టాయిలెట్లు, పారిశుధ్యం, రోడ్లు, వీధి దీపాలు, పార్కులు బాగున్నాయా?.. ఏ అభ్యర్థికి వీటిని పరిష్కరించే సత్తా ఉందో వారికే ఓటు వేయండి.. గెలిచే అభ్యర్థులు ప్రజల మధ్య ఉండాలి.. మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి, ప్రభుత్వ పథకాలను మీకు అందించడంలో సాయపడతారనే నమ్మకం ఉన్నవారికే ఓటు వేయండి..

ఈ ఎన్నికల్లో మీకు కచ్చితంగా ఓటు వేయండి.. అది మంచి అభ్యర్థికి మాత్రమే.. స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి మీ ఓటు దోహదపడేలా చూసుకోండి.. 

No comments:

Post a Comment