Friday, February 27, 2015

ప్రయాణీకుల ప్రయోజనాలకు పెద్ద పీట.

రైల్వే బడ్జెట్లో తీరని తెలంగాణ, ఏపీలకు తీరని అన్యాయం జరిగింది.. కొత్తగా రైళ్లు, లైన్లు ప్రాజెక్టులు లేవు.. విశాఖ రైల్వే జోన్ ఊసేది?.. వ్యాగన్ కోచ్ ఫ్యాక్టరీలు ఏమయ్యాయి..
బడ్జెట్ ప్రసంగం వినగానే రాజకీయులు, జర్నలిస్టుల, మేధావుల స్పందన ఇది.. ప్రతి ఏటా జరిగే తంతుకు భిన్నంగా రైల్వే మంత్రి సురేష్ ప్రభు సమర్పించిన బడ్జెట్ ఉండటం చూసి అవాక్కయ్యారు.. అసలు ఇది రైల్వే బడ్జెట్లేనా అంటూ పెదవి విరిచిన వారు కొందరు..
ప్రతి ఏటా బడ్జెట్లో అవీ ఇవీ అని వాగ్దానాలు ఇవ్వడం.. అమలు చేయకుండా పెండింగ్ పెట్టడం, మళ్లీ వచ్చే బడ్జెట్లోనూ ఇదే పని చేయడం ప్రభుత్వాలకు అలవాటైపోయింది.. వాటికి అలవాటు పడిపోవడం మనవంతైపోయింది.. అందుకే భిన్నంగా ఉన్నదాన్ని స్వాగతించలేని స్థితికి చేరుకున్నాం..
సురేష్ ప్రభు ప్రతిపాదించిన రైల్వే బడ్జెట్ పూర్తి వాస్తవిక దృక్పథంతో ఉంది. ఛార్జీలను పెంచకుండానే సౌకర్యాలను మెరుగు పరచడానికి ప్రాధాన్యత ఇచ్చారు.. ఏం చేయబోతున్నదీ స్పష్టంగా చెప్పారు. ముందు ఉన్నవాటికి చక్కదిద్దుకున్నాకే కొత్త వాటి జోలికి వెళదామంటున్నారు. ప్రయాణీకుల ప్రయోజనాలకు పెద్ద పీట వేసిన స్పచ్ఛ రైల్వే బడ్జెట్ ఇది..

Tuesday, February 24, 2015

పప్పూ సెలవు మతలబు?..

మా పప్పూ సెలవు పెట్టాడు.. కడుపు నొప్పి అని సాకు.. కానీ ఉత్తుత్తిదే అని మాకు తెలుసు..
ఇదే సమయంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న వేళ రాహుల్ గాంధీ సెలవు పెట్టాడు.. అక్కడ నిద్ర పోవడానికి అవకాశం దొరకదనేమో.. గతంలో చేసిన పని అదేగా..
సార్వత్రిక ఎన్నికలు మొదలు వరుసగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాలు వెంటాడుతున్న వేళ కొంత కాలం సెలవులో ఉండి సమీక్ష చేసుకుంటాడని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.. ప్రతిపక్షాలకు అధికార పక్షాన్ని నిలదీసేందుకు పార్లమెంట్ సమావేశాలే చక్కని వేదిక.. మరి ఇలాంటి వేళ సెలవు ఏమిటి?
పాపం పప్పూకి మొహం చెల్లడం లేదా? నిద్రకు సమయం చాలడం లేదా?.
ఇంతకీ పప్పు.. సారీ రాహుల్ వెళ్లింది ఎక్కడికో తెలుసా? మ్యూనిచ్, గ్రీస్.. సమీక్షకా? ఎంజాయ్ కా?

Sunday, February 22, 2015

జమ్మూ కాశ్మీర్ భారత దేశంలో సంపూర్ణ అంతర్భాగమని పార్లమెంట్ తీర్మానించిన రోజు..

జమ్మూ కాశ్మీర్ విషయంలో ఫిబ్రవరి 22, 1994 నాడు భారత పార్లమెంట్ లో చేసిన ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ రోజును జమ్మూ కాశ్మీర్ సంకల్ప్ దివస్ పేరిట జరుపుకుంటున్నాం.. ఈ తీర్మానంలోని ముఖ్యాంశాలు..
1.జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం పూర్తిగా భారత దేశంలోని అంతర్భాగం. దేశం నుండి జమ్మూ కాశ్మీర్ ను విడగొట్టే ప్రయత్నాలను ఎదుర్కొంటాం.
2.దేశ ఐక్యత, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు వ్యతిరేకంగా సాగించే ఏ చర్యలనైనా తిప్పిట్టే సామర్థ్యం భారత దేశానికి ఉంది.
3.భారత దేశంలో భాగంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని ప్రాంతాల నుండి పాకిస్తాన్ తక్షణం వైదొలగాలి.
4.భారత దేశ ఆంతరంగిక వ్యవహారాల్లో అంతర్జాతీయ జోక్యాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాం..
ఈ చారిత్రిక తీర్మానం వెనుక ఉన్న నేపథ్యం అందరికీ తెలిసిందే..జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో భారత దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా వెర్రి తలలు వేస్తున్న వేర్పాటువాదం వెనుక పాకిస్తాన్ పాత్ర ఉందనే విషయం అందరికీ తెలిసిందే వేర్పాటు వాదులకు ఆయుధాలు, ధన సాయం చేస్తోంది. ఉగ్రవాదులకు శిక్షణ కోసం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో పెద్ద ఎత్తున శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసింది. ఇందులో విదేశీ శక్తుల మద్దతు స్పష్టంగా కనిపిస్తోంది. మతోన్మాదం, భారతీయ వ్యతిరేక కలగలసిపోయాయి.
 సనాతన ధర్మానికి కట్టుబడి ఉన్న కాశ్మీరి పండిట్లు, దేశ భక్తులు ఉగ్రవాదులకు టార్గెట్ అయ్యారు.. అడ్డూ అదుపూ లేకుండా కాశ్మీర్లో హత్యలు, లూఠీలు, గృహ దహనాలు, అత్యాచారాలకు దిగారు. ఆలయాలకు ధ్వసం చేశారు. తమకు మద్దతు ఇవ్వకపోతే కాశ్మీర్లో ఉండటానికి వీలు లేదని హుకుం జారీ చేశారు.. ఆస్తులను బలవంతంగా లాక్కొని తరిమేశారు.. ఫలితంగా లక్షలాది మంది కాశ్మీరీ పండిట్లు కన్నీటితో తమ స్వస్థలమైన కాశ్మీరీ లోయను వదిలి జమ్మూ, ఢిల్లీలతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు వలస వచ్చారు. స్వదేశంలోనే శరణార్ధులుగా బతకాల్సిన దుస్థితి ఏర్పడింది.

సిమ్లా ఒప్పందానికి తూట్లు పొడచిన పాకిస్తాన్ పదే పదే భారత దేశ అంతర్గత వ్యహారాల్లో జోక్యం చేసుకుంటోంది. కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితితో సహా పలు అంతర్జాతీయ వేదికలపై ప్రస్థావిస్తూ అనవసరమైన వివాదాన్ని సృష్టిస్తోంది.. జమ్మూ కాశ్మీర్ లో దాదాపు సగ భాగాన్ని తన కబ్జాలో పెట్టుకున్న పాకిస్తాన్, అందులో నుండి చైనాకు ఉదారంగా అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని దారాదత్తం చేసింది.. ఈ నేపథ్యంలో భారత దేశం పార్లమెంట్లో 1994 ఫిబ్రవరి 22నాడు పై చారిత్రిక తీర్మానాన్ని చేసింది.. ఈ తేదీన జమ్మూ కాశ్మీర్ సంకల్ప్ దివస్ ను దేశ, విదేశాల్లో జరుపుకుంటున్నారు.. 

Saturday, February 21, 2015

రూ.8 వేల సూటు రూ. 4.31 కోట్లు పలికింది.

నిజం నిద్ర లేచే లోపు అబద్దం లోకం చుట్టి వస్తుందంటారు.. ప్రధాని నరేంద్ర మోదీ సూట్ విషయంలో జరిగింది అదే.. కానీ ఒకందుకు మంచే జరిగింది.. కేవలం రూ.8,000 ఖరీదు చేసే సూటు రూ. 4,31,00,000 లకు వేలంలో అమ్ముడు పోయింది..
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ధరించిన ఈ సూటు అందరికీ ఆకట్టుకుంది.. కారణం ఆ సూటుపై ఉన్న నిలువు గీతల్ని పరిశీలిస్తే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అని ఇంగ్లీషులో రాసి ఉండటమే..దీన్ని అడ్డు పెట్టుకొని మోదీకి కీర్తి కండూది ఎక్కువని ప్రత్యర్ధులు విమర్శలకు దిగారు.. అదే సమయంలో ఓ ఆంగ్ల పత్రిక రాసిన  కథనం దుమారానికి తెర తీసింది.. మోదీ ధరించిన సూట్ రూ. 50 వేల నుండి 5 లక్షల దాకా ఖరీదు చేస్తుందని ఓ ఫ్యాషన్ డిజైనర్ చెప్పినట్లు రాసింది.. తాను అలా చెప్పలేదని ఆ డిజైనర్ వివరణ ఇచ్చుకునేసరికి ఖంగుతున్ని ఆ పత్రిక తాము పొరపాటున ఈ డిజైనర్ పేరును ప్రస్థావించామని, తమకు చెప్పింది వేరే డిజైనర్ అంటూ పత్రిక మాట మార్చేసింది. కానీ ఆ డిజైనర్ ఎవరో చెప్పలేదు. అంటే ఆ పత్రిక కథనం ఎంత అబద్దమో అర్థమైపోయింది..
సదరు పత్రిక దుష్ప్రచారాన్ని అడ్డం పెట్టుకొని రాహుల్ గాంధీ మోదీ సూట్ విలువను రూ.10 లక్షలుగా ఢిల్లీ  ఎన్నికల సభలో చెప్పుకొచ్చారు.. కొందరైతే ఏకంగా కోటి రూపాయలకు పెంచేశారు.. మోదీతో పాటు ఆయన టైలర్ కూడా ఈ వార్తను ఖండించినా సదరు పత్రిక దానికి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. వాస్తవానికి ఈ సూట్ అసలు ఖరీదు కేవలం ఎనిమిది వేలేనట..
మోదీ సూట్ విషయంలో అబద్దపు కథనాన్ని వండిన ఆ పత్రికకు ధన్యవాదాలు చెప్పుకోవాలి.. ఈ కోటుకు లభించిన ప్రచారం పుణ్యమా అని కేవలం 8 వేల రూపాయల విలువజేసే ఈ సూట్  ఏకంగా నాలుగు కోట్ల 31 లక్షలకు వేలంలో అమ్ముడుపోయింది. గుజరాత్ వజ్రాల వ్యాపారి లాల్జీ పటేల్ మోదీ సూట్ కొనుగోలు చేశారు.ఈ నిధులను గంగా నది ప్రక్షాళనకు ఉపయోగిస్తున్నారు..

కాశ్మీర్ సమస్య పరిష్కారానికి కవిత మద్దతు

జమ్మూ కాశ్మీర్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి ఇదే సరైన సమయం.. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మంచి మెజారిటీ ఉంది. కాశ్మీర్ ప్రజల సంక్షేమం కోసం కేంద్రం తీసుకునే చర్యలకు మా పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుంది.. జమ్మూ కాశ్మీర్ సంపూర్ణంగా భారత దేశంలో అంతర్భాగం అని 1994లో చేసిన తీర్మానానికి అనుగుణంగా మనమంతా ఆ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు, కాశ్మీరీ పండిట్ల సమస్య పరిష్కరించేందుకు అధికారంలో ఉన్న బీజేపీ పని చేయాల్సిన అవసరం ఉంది.. జమ్మూ కాశ్మీర్ అధ్యయన కేంద్రం హైదరాబాద్ లో నిర్వహించిన  జమ్మూ కాశ్మీర్ సంకల్ప దివస్ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా వచ్చిన నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రసంగంలో అంశాలివి.. అమె ఇంకా ఏమన్నారో చూడండి..
జమ్మూ కాశ్మీర్ లో పీడీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ ఆర్టికల్ 370, సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం విషయంలో యూటర్న్ తీసుకుందా?.. స్వయం ప్రతిపత్తి గురుంచి మాట్లాడే పీడీపీతో రాజీ పడుతోందా?.. కాశ్మీర్ గురుంచి తాను ఏమి మట్లాడినా ప్రశంసలతో పాటు రాళ్లు, కేసులు పడుతున్నాయని చమత్కరించారు కవిత..
ఈ కార్యక్రమానికి జేకేఎస్సీ హైదరాబాద్ ఛాప్టర్ అధ్యక్షులు, ఓయూ మాజీ వైస్ ఛాన్సలర్ అధ్యక్షత వహించారు. ముఖ్యవక్తగా హాజరైన సీనియర్ జర్నలిస్టు రాకా సుధాకర్ రావు జమ్మూ కాశ్మీర్తో భారత దేశంతో ఉన్న అనుబంధాన్ని, ఆ రాష్ట్రానిని కాపాడుకోవడానికి మన సైనికులు చేసిన త్యాగాలను వివరించారు. 1994లో పార్లమెంట్లో చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని, నాటి ప్రతిపక్ష నేత అటల్ బీహారీ వాజపేయి ఐక్యరాజ్య సమితితో పాకిస్తాన్ ను కట్టడి చేసిన తీరును గుర్తు చేశారు.. కార్యక్రమంలో కాశ్మీరీ పండిట్ల కుటుంబాలు ఎంపీ కవితను తస్కరించాయి. చాలా స్వల్ప సమయంలో నిర్వహించానా సంకల్ప్ దివస్ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. బద్రుకా కాలేజీ ఆడిటోరియం అంతా కిక్కిరిసిపోయింది..

ప్రాచీన హోదాతో ఏం సాధించాం..

అరవం వాడు ప్రాచీన భాషా హోదా దక్కించుకున్నాడని మనమూ అరిచాం, మాకూ ఆ హోదా ఇవ్వమని గగ్గోలు పెట్టాం.. తెలుగు భాషపై ఎక్కడలేని ప్రేమ కురిపించాం.. సరే అఘోరించండి అంటూ కేంద్ర ప్రభుత్వం మన భాషకూ ప్రాచీన హోదా విదిల్చింది.. ఇది జరిగింది 2009లో.. అంటే ఐదేళ్లు గడచిపోయాయి. కానీ ఏమైందీ?.. తెలుగు భాషకు ప్రాచీన హోదా తెచ్చుకొని మనం ఏం సాధించామూ?..
కేంద్రం తెలుగు భాషకు ప్రాచీన హోదా ఇచ్చినా, పరిశోధనా కేంద్ర ఏర్పాటు కోసం స్థలం ఇవ్వలేకపోయింది గతించిన ఆంధ్రప్రదేశ్ భాషా ప్రయుక్త రాష్ట్రం.. అడ్డమైన వారందరీకి ఉదారంగా భూములు దోచి పెట్టిన మన నాయకమన్యులకు, మాతృ భాష అభివృద్ది కోసం ఓ పాత బంగళా అయినా కేటాయించడానికి మనస్సు అంగీకరించలేదు.. ఫలితంగా తెలుగు ప్రాచీన భాషా అధ్యయన కేంద్రం మైసూరులోని భారతీయ భాషల అధ్యయన కేంద్రంలోనే కొనసాగుతోంది.. ప్రాచీన భాష హోదాలో తెలుగు భాషా సాహిత్య అధ్యయన, పరిశోధనల కోసం కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.5 కోట్లు కేటాయించింది.. కానీ అవీ ఉపయోగించుకోలేకపోయాం.. దీంతో ఈ మొత్తాన్ని రూ. 2.5 కోట్లకు కుదించింది.. అయినా మనలో చలనం లేదు.. మన పరిస్థితికి జాలి పడిన కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం రూ. కోటి మాత్రమే ఇస్తోంది..
ప్రస్తుతం మనం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశాలుగా విడిపోయాం.. ప్రాచీన భాష హోదా దేవుడెరుగు.. మన తెలుగు భాష ఉనికే పట్టింపులేనిదిగా మారింది.. ఇరు తెలుగు రాష్ట్రాలు పొరుగున ఉన్న తమిళనాడును చూసి బుద్ది తెచ్చుకోవాలి.. వారి భాషకు నిజంగా ప్రాచీన హోదా ఉందా, లేదా అనేది మనకు అనవసరం.. కానీ మాతృభాషను, సంస్కృతిని, ఉనికిని కాపాడుకోవడానకి వారు చేస్తున్న ప్రయత్నాలను అభినందించక తప్పదు..

భారత దేశంలో హిందీ తర్వాత అత్యధికులు మాట్లాడేది తెలుగే.. ఇరు తెలుగు రాష్ట్రాలు, పొరుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్ల మంది తెలుగోళ్లం ఉన్నామని గొప్పగా చెప్పుకుంటాం.. కానీ మన ఉనికినే ప్రమాదంలో పడేసుకుంటున్నాం.. ( ఈ రోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం)

Thursday, February 19, 2015

ఇంతకీ కవిత గారు ఏం మాట్లాడబోతున్నారు?..

జమ్మూ కాశ్మీర్ అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరుగుతున్న కార్యక్రమానికి టీఆర్ఎస్ నాయకురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత గారిని ముఖ్యఅతిధిగా పిలిచారనే ఆహ్వాన పత్రికను చూసి అందరూ ఆశ్చర్యంగా వేసిన ప్రశ్న ఇది.. జమ్మూ కాశ్మీర్ విషయంలో కవిత చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపిన విషయం అందరికీ తెలసిందే.. కొద్ది రోజుల తర్వాత ఆమె కాశ్మీర్ పండితుల సమస్యపై పార్లమెంట్లో ప్రస్థావించి అందరినీ ఆశ్యర్య పరిచారు.. 
ఆ నేపథ్యంలో తాజాగా ఎంపీ కవిత గారు ఏం మాట్లాడతారు అనేది అందరికీ ఆసక్తి ఉండటం సహజమే.. తినబోతూ గారెల రుచి అడగటం ఎందుకు రండి ఈ కార్యక్రమానికి..
జమ్మూ కాశ్మీర్ సంకల్ప్ దివస్ కార్యక్రమానికి రండి.. అసలు కాశ్మీర్లో ఏం జరుగుతోందో తెలుసుకోండి.. తేదీ: 20.02.2015, సమయం: 6pm, వేదిక బద్రుకా కాలేజీ, కాచిగూడ, హైదరాబాద్..:

ఇండియా టుడే ఆగిపోయింది..

కాల పరీక్షలో ఇండియా టుడే కూడా ఓడిపోయింది.. ఇది జీర్ణించుకోలేని వార్తే..
ఇరవై ఐదేళ్ల క్రితం ఇండియా టుడే తెలుగు పక్ష పత్రిక తొలి సంచిక కొన్నాను. బెనజీర్ భుట్టో ముఖచిత్రంతో వచ్చిన ఆ సంచిక చాలా బాగా గుర్తుంది.. రాజకీయ, సామాజిక వార్తలు అందించే తెలుగు పత్రికలు అప్పటికే మార్కెట్లో ఉన్నా ఒక జాతీయ పత్రిక తెలుగు ఎడిషన్ లుక్కే వేరు కదా.. అప్పట్లో మొహం మొత్తించే కార్యక్రమాలు వచ్చే దూరదర్శన్ తప్ప టీవీ ఛానెల్స్ ఏవీ లేవు.. పుస్తకాలు చదువుకోడానికి చాలా తీరిక ఉండేది.. అప్పటి నుండీ క్రమం తప్పకుండా ఇండియా టుడే చదివేవాన్ని.. కాలక్రమంలో ఇండియా టుడే నాణ్యత మరింత పెరగుతూ వచ్చింది.. ధర, పేజీల హెచ్చు తగ్గులనూ గమనించాను.. ఇండియా టుడేకు జాతీయ స్థాయిలో ఔట్ లుక్ అనే ఆంగ్లవార పత్రిక పోటీగా వచ్చే సరికి, అది కూడా వార పత్రికగా మారక తప్పలేదు.. తెలుగు ఇండియా టుడే కూడా వీక్లీ అయిపోయింది.
ఇండియా టుడే ప్రేరణతో తెలుగులో సుప్రభాతం, వార్తాకాలం, బొబ్బులి పులి, మా భూమి పత్రికలు వచ్చినా పలు కారణాల వల్ల కాలపరీక్షలో నిలవలేదు..మార్కెట్ లో ఇండియా టుడే తెలుగు పత్రిక ఏకైక వీక్లీగా నిలిచింది.. ఇండియా టుడే ప్రాధామ్యాలు కొన్నిసార్లు కోపం తెప్పించేవి. స్థానిక అంశాలకు కాకుండా జాతీయ స్థాయి విషయాలకే ప్రాధాన్యత ఇవ్వడం, అనువాదం సక్రమంగా ఉండకపోవడం చిరాగ్గా అనిపించేది.. అయినా మార్కెట్లో తాజా సంచిక కోసం ఎదురు చూసేవాన్ని.. 


25 ఏళ్లు అంటే తక్కువేం కాదు.. ఒక తరం మారిపోయింది.. కాలం మారింది..అభిరుచులూ మారాయి.. టీవీ ఛానళ్లు వచ్చాయి.. పత్రికల పని అయిపోయిందన్నారు.. అయినా చదువరులు ఉన్నారు పర్వాలేదు అంటూ ఉనికిని చాటుకున్నాయి.. ఇక ఇంటర్నెట్ వచ్చేసింది.. డిజిటల్ పత్రికలు, మొబైల్ ఫోన్, ట్యాబుల్లోనే వార్తలు చూసుకునే రోజులు వచ్చాయి.. చివరకు కాల పరీక్షలో ఇండియా టుడే పత్రిక కూడా ఓడిపోక తప్పలేదు.. తెలుగు, తమిళ, మలయాళ ఇండియా టుడే ఎడిషన్లు మూత పడ్డాయి.. ప్రస్తుతం ఇండియా టుడే తెలుగు ఎడిషన్ చివరి సంచిక మార్కెట్లో ఉంది.. అందరూ కొని దాచుకోండి..
ఇండియా టుడే దోరణిని నేను ఎన్నోసార్లు తిట్టుకున్నాను.. కానీ ఇప్పుడు ఒక పాఠకునిగా, జర్నలిస్టుగా చింతిస్తున్నాను.. మళ్లీ కొత్త కూపంలోొ వస్తామని ఇండియా టుడే యాజమాన్యం చివరి సంచికలో చెప్పింది.. చూద్దాం అదేమిటో..

జర్నలిస్టుల ఆరోగ్యం హరతి కర్పూరమేనా..

రాష్ట్ర విభజన కారణంగా ఎక్కవగా నష్టపోయింది ఎవరంటే జర్నలిస్టులే.. అందునా డెస్క్ జర్నలిస్టులే.. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా జర్నలిస్టులకు జరుగుతున్న మేళ్లు ఏమిటని అడిగితే వెంటనే చెప్పడానికి హెల్త్ కార్డులు అనేవి ఉండేది.. జర్నలిస్టులకు, వారి కుటుంబాలకు ఆరోగ్య సమస్యలు వస్తే తక్షణం ఆదుకున్నవి ఈ కార్డులే.. అదీ ఉదారంగా ఇచ్చినవేం కాదు.. ప్రీమియంలో సగం కంట్రిబ్యూషన్ జర్నలిస్టులే భరించేవారు..
రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభమైన జర్నలిస్ట్ ఆరోగ్య బీమా పథకం కిరణ్ కుమార్ కాలానికి పలుచబడింది. అడ్డగోలుగా ఇన్స్యూరెన్స్ సంస్థలను మార్చేశారు.. రాష్ట్ర విభజన కాలంలో జర్నలిస్టులు ప్రీమియమ్ కట్టినా ప్రభుత్వం పాలసీలను రెన్యూ చేయలేదు.. దీంతో ఏడాదిన్నర కాలంగా జర్నలిస్టుల కుటుంబాలు ఆరోగ్యపరంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి..
కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు గత తొమ్మిది మాసాలుగా జర్నలిస్టుల జీవితాలతో దోబూచులాడుతున్నాయి.. తమ ఉద్యోగులకు ఆరోగ్య బీమా, జీత భత్యాల పెంపు, ఇతరత్రా సౌకర్యాల విషయంలో పోటీలు పడి నిర్ణయాలు తీసుకుంటున్న రెండు ప్రభుత్వాలు జర్నలిస్టులను మాత్రం త్రిశంకు స్వర్గంలో పెట్టాయి. అక్రిడిటేషన్లు, హెల్త్ ఇన్స్యూరెన్స్ విషయంలో తేల్చకుండా జాప్యం చేస్తున్నాయి. జర్నలిస్టుల్లో ఎవడు ఏ ప్రాంతం వాడో నిర్ధారించడం కష్టమైనందున, అవతలి ప్రభుత్వం ఇచ్చాక, తమం చూద్దాం అనే విధానం కొనసాగుతోంది. చివరకు ఏపీ ప్రభుత్వం జర్నలిస్టులకు ఆరోగ్య బీమా విషయంలో మొదటి అడుగు వేసింది.. కానీ అక్రిడిటేషన్లు ఉన్నవారికేనట.. మీడియాలో దాదాపు 70 శాతం జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు లేవు, ఇందులో ఎందరో సీనియర్లూ ఉన్నారు.
కొత్త నిబంధన వల్ల ఎక్కువగా నష్టపోతున్నది డెస్క్ జర్నలిస్టులే.. రిపోర్టళ్లు తెచ్చిన వార్తలను వండీ వార్చీ ఒక రూపానికి తెచ్చేది వారే.. రాత్రింబవళ్లు షిప్టుల్లో పని చేయడం కారణంగా అత్యధికంగా ఆరోగ్య సమస్యలు వారికే ఉంటాయి.. దురదృష్టవశాత్తు అక్రిడిటేషన్ల విషయంలో మొదటి నుండి వీరికి మొండి చేయే.. అక్రిడేషన్లు ఇవ్వాల్సిన ప్రభుత్వమే డెస్క్ జర్నలిస్టులకు అవి లేవనే కారణంతో ఆరోగ్య బీమా నిరాకరిస్తోంది. సంయుక్త ఆంధ్రప్రదేశ్ లో వివక్ష లేకుండా అందరికీ హెల్త్ కార్డులు ఇచ్చినప్పుడు, రాష్ట్ర విభజన తర్వాత ఎందుకు ఈ పనికి మాలిన నిబంధన పెట్టిందో ఏపీ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది.  అసలు ప్రభుత్వాన్ని ఎవరైనా తప్పుదోవ పట్టిస్తున్నారా అనే అనుమానాలు ఉన్నాయి..

ఇప్పడు బుగులంతా మా తెలంగాణ జర్నలిస్టులకే.. బాబు ప్రభుత్వ స్పూర్తితో కేసీఆర్ సర్కారు కూడా డెస్క్ జర్నలిస్టులను వీధినా పడేస్తుందా అనే భయం పుట్టుకుంది. డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డుల విషయంలో సానుకూలంగా ఉన్నామని గత తొమ్మిది నెలలుగా చెబుతున్నా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకూ ఏ నిర్ణయాన్ని ప్రకటించలేదు.. మమ్మల్ని రోడ్లెమ్మట తిప్పి నాయకులై కూచ్చున్న జర్నలిస్టు సంఘాల పెద్దలు కూడా నోరు మెదపడం లేదు.. చూడాలి ఏమౌతుందో ఏదో.. గుర్రమూ ఎగరవచ్చనే ఆశలైతే సజీవంగా ఉన్నాయి..

Wednesday, February 18, 2015

పరధ్యాన్నం పరమేశ్వర రావులు..

దున్నపోతు ఈనిందంటే, దూడను కట్టేయమన్నాడట ఓ ఆసామి.. ఇలాంటి పరధ్యానం పరమేశ్వర్రావులు అంతటా ఉంటారు.. 
మన ఆనంద్ గాడు దావత్ ఇస్తాను అందరినీ తప్పకుండా రమ్మన్నాడు అని చెప్పాడో చిన్నప్పటి దోస్తు.. పిల్లికి బిచ్చంవేయని ఆనంద్ గాడు దావత్ ఇవ్వడం ఏమిటి అని సందేహిస్తూనే ఎప్పుడూ? అని అడిగాను.. వాడు చెప్పిన సమాధానం విని నవ్వాగలేదు.. ఎందుకలా నవ్వుతున్నావు అని అడిగాడు.. ఒక్కసారి క్యాలెండర్ చూసుకోమన్నాను.. మొబైల్ క్యాలెండర్ తిరిచి వాడు అవాక్కయ్యాడు.. ఇంతకీ ఆనంద్ దావత్ ఇస్తానన్న తేదీ ఏమిటో తెలుసా?.. ఫిబ్రవరి 30.
రెండు మూడేళ్ల క్రితం ఓ ఛానెల్ కార్యాలయంలో జరిగిన యదార్ధ ఘటన మరొకటి.. ఓ రిపోర్టర్ హడావుడిగా పరుగెత్తుకొచ్చి కో ఆర్డినేటర్ కు చెప్పాడు.. హుస్సేన్ సాగర్ తగలబడిపోతోంది అని.. పాపం కో ఆర్డినేటర్ గారు ఓబీ వ్యాన్ పంపండి అంటూ హడావుడి పడిపోయాడు.. ఆ రోజు ఏప్రిల్ 1..
కొన్నిసార్లు నేనూ పరధ్యాన్నం పరమేశ్వర రావునే.. బంకులో పెట్రోలు కొట్టించుకొని చిల్లర తీసుకోకుండానే బండ్ స్టార్ట్ చేసుకొని వెళ్లిన సందర్భాలు ఎన్నో..

Saturday, February 14, 2015

ప్రేమికులకు దినమా?

ప్రేమలు. పెళ్లిల్లూ భారతీయ సంస్కృతికి కొత్తేమీ కాదు.. పురాతన కాలంలో గంధర్వ వివాహాలు, స్వయంవరాలు తెలిసినవే.. రాధాకృష్ణులు, నల దమయంతులు.. ఇలా ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి.. సమాజ పరిణామ క్రమంలో సామాజిక పరిస్థితుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రేమను వ్యక్తం చేసుకోవడానకి భారతీయులకంటూ ఉత్సవాలున్నాయి.. వసంతోత్సవం తెలిసిందే కదా?

ప్రేమను వ్యక్తీకరించుకోడానకి మన సంస్కృతి ప్రకారమే అవకాశాలు ఉన్నాక వేలంటేన్స్ డేలు ఎందుకో.. నా దృష్టిలో ఒదొక కమర్షియల్ వెస్ట్రన్ కల్చర్ మాత్రమే.. ఫిబ్రవరి 14 అంటే పక్తు వ్యాపారమే కనిపిస్తుంది.. గ్రీటింగ్ కార్డులు, బొకేల వ్యాపారానికి, గిఫ్టులు, హోటల్, రిసార్టుల వేడుకలు, టీవీ చానెళ్ల కమర్షియల్ ప్రోగ్రామ్ కోసమే పనికొచ్చే వేడుక ఇది. ఈ రోజున రోడ్లు, పార్కులు, రిసార్టుల వెంట తిరిగేవారిలో నిజమైన ప్రేమికులు చాలా తక్కువే.. ప్రేమ పేరిట బరితెగించి వాంఛలు తీర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకునే వారూ ఉన్నారు..
ప్రేమికులకు అడ్డు పడుతున్నారంటూ నిందించేవారు కూడా కాస్త ఆలోచించాలి.. విచ్చల విడిగా వ్యవహరించే వారిని ఓ కంట కనిపెట్టకపోతే ఆ నష్టం సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది..
నా వ్యాఖ్యలు కొందరికి కోపం కలిగించి ఉండొచ్చు.. ఉన్నమాటంటే ఎవరికైనా ఉలుకే..

ఎవరికి వారే సాగర తీరే..

చివరకు అనుకున్నట్లే జరిగింది.. రెండు రాష్ట్రాలు బహిరంగ యుద్దానికి దిగుతారని, అందునా పోలీసులే కొట్టుకుంటారని.. దీనికి వేదిక నాగార్జుసాగరే అవుతుందని ఊహించాను.. అనుకున్నట్లే దాయాదుల సంగ్రామానికి సాగర్ కేంద్రంగా మారింది..
తెలంగాణ, అంధ్రప్రదేశ్ రాష్ట్రాల జలజగడం పెద్దదే కానీ.. మరీ ఇలా కొట్టుకునే వరకూ పోవాల్సినంత పెద్దదేం కాదు.. ఇద్దరు సీఎంల ఇగోలే జగడాలకు కారణం అవుతున్నాయి.. చివరకు విజ్ఞతతో గవర్నర్ సమక్షంలో చర్చించుకోవాలని నిర్ణయించుకోవడం గుడ్డిలో మెల్ల..

Wednesday, February 11, 2015

తాబేలు, కుందేలు కథ పునరావృత్తం కావొద్దు..

తాబేలు, కుందేలు కథ అందరికీ తెలిసిందే.. ఇద్దరికీ పరుగు పందెం జరిగింది.. తాను వేగంగా పరుగెత్తగలనని కుందేలుకు ధీమా.. తాబేలు గమ్యం చేరేలోపు తానో కునుకు తీసి, తేలికగా లక్ష్యాన్ని చేరుకోవచ్చనుకుంది.. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. తాబేలు విజేతగా నిలిచింది..

గత సర్వత్రిక ఎన్నికల్లో అనూహ్య మెజరిటీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చింది నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ.. దేశ రాజధాని దిల్లీలో ఏడింటికి ఏడు సీట్లనూ ఊడ్చేసింది. ప్రజలు పాలించడానికి ఐదేళ్ల సమయం ఇచ్చారు. ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చడానకి కావాల్సినంత సమయం ఉంది అని భావించారు కమల నాథులు.. కానీ అవతల ఆకలితో ఉన్నవాడు తీరిగ్గా పరమాన్నం వండి పెడతానంటే ఊరుకోడు.. అలాంటి సమయంలో వాడికి గంజే పరమాన్నంతో సమానం.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. దిల్లీ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాజం. ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.
దిల్లీలో బీజేపీకి పటిష్టమైన కార్యకర్తలు ఉన్నా, స్థానిక నాయకత్వ లోపం స్పష్టంగా కనిపించింది. కాంగ్రెస్ పార్టీదీ అదే పరిస్థితి.. ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న ఒకే ఒక్కడు కేజ్రవాల్.. జనానికి స్పష్టంగా కనిపించాడు.. బీజేపీ కిరణ్ బేడీని తెరపైకి తెచ్చేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. రోడ్డు మీద ఉండే వాడు ఏదైనా మాట్లాడగలడు.. ఎవరినైనా, ఏమైనా అనగలడు.. దాన్నే కడుపు మండినోడి ఆగ్రహం అంటారు.. కానీ అధికారంలో ఉండే వాడు ఆచి చూచి మాట్లాడాలి.. అక్కడే బీజేపీకి నష్టం జరిగింది.. ప్రత్యర్థులంతా ఒకటయ్యారు.. ఫలితం ఆప్ విజేతగా నిలిచింది

గర్వం తలకు ఎక్కితే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు పట్టిన గతే పడుతుందని అరవింద్ కేజ్రీవాల్ తమ కార్యకర్తలతో అన్నారు.. ఇది వాస్తవం.. ఈ మాట అందరికన్నా ఎక్కువగా కేజ్రీవాల్ కే వర్తిస్తుంది.. ఇప్పడాయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు.. ఇంకా పాత ధోరణిలోనే మఫ్లర్ మీద టోపీ పెట్టి మూస ప్రచార ఆర్భాటాలకు పోతే దిల్లీ జనం అంగీకరించరు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చడంపై దృష్టి పెట్టాలి.. లేకపోతే కుందేలు, తాబేలు కథ పునరావృత్తం అవుతుంది.

Tuesday, February 10, 2015

మీ జీతాలకేనా న్యాయం చేయడండి బాబులూ..

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ఉద్యోగుల పని గారెల బుట్టలో పడ్డట్లయింది.. ఇకపై తమ పీఆర్సీలు, జీతాలు, గీతాలు అంటూ పెద్దగా రోడ్లెక్కాల్సిన అవసరం లేదు.. ఉద్యోగులకు ఎవరు ముందు మేళ్లు చేద్దామా అని ఇరు సర్కార్లు పోటీ పడుతుంటాయి. ఒక సర్కారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే మరో సర్కారుకు అదే నిర్ణయం తీసుకోక తప్పదు.. (అవతలి వాడి రెండు కళ్లు పోవాలని తన ఒక కన్ను పోవాలని కోరుకున్నాడనే పురాణ గాథ ఇక్క అప్రస్తుతం అనుకోండి..)

రెండు తెలుగు ప్రభుత్వాలు ఉద్యోగుల ఫిట్ మెంట్ 43 శాతానికి పెంచాయి.. మంచిదే(?)..మరి వారి నుండి మరింత బాధ్యతాయుతమైన పనిని రాబట్టుకునే ఆలోచన ఈ సర్కార్లకు ఏమైనా ఉందా? ఇది చదివేవాళ్లలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు అయివుండి నొచ్చుకుంటే నేనేమి చేయలేను.. నిజం మాట్లాడితే కాస్త నిష్టూరం సహజమే కదా.. నేను గమనించిన ప్రభుత్వ ఉద్యోగుల గురుంచే రాస్తున్నాను.. ముప్పాతిక శాతం (ఇంకా తక్కువే ఉండొచ్చు)
ఉద్యోగులు ఏనాడు సమయానికి ఆఫీసుకు చేరుకోరు.. దాదాపు గంట సేపు ముచ్చట్ల తర్వాతే పని ప్రారంభిస్తారు.. అదీ చాలా లేజీగా, పనిలో నత్తతో పోటీ పడతారనడం నిజం.. మధ్యలో ఛాయ్ పానీ టైమ్ పాస్.. ఈలోగా లంచ్ టైమ్ వచ్చేస్తుంది.. అలా మరో గంట గడుస్తుంది.. తర్వాత కునికి పాట్లు, పనితో కుస్తీ..మధ్యలో మరో టీ బ్రేక్..ఆతర్వాత ఏదో అలా పని చేశామనిపిస్తూ ఆపీస్ అయిపోయే సమయం కోసం ఎదురు చూపులు.. ఆ తర్వాత ఇంటి బాట..రాష్ట్ర సచివాలయంలో ఎప్పుడు చూసినా క్యాంటీన్ పరిసరాల్లో తచ్చాడే ఉద్యోగులను చాలా సార్లు చూసినట్లు గుర్తుంది.. నేనేమి పని గట్టుకొని ప్రభుత్వ ఉద్యోగులను విమర్శించడం లేదు. వారి తత్వాన్ని వివరిస్తున్నానంతే.. సిన్సియర్ ఉద్యోగులను కూడా నేను చూశాను.. వారికి ఎంత కితాబిచ్చినా తక్కువే.. ఇక ప్రభుత్వ ఉపాధ్యాయుల గురుంచి ఎంత చెప్పినా తక్కువే..
మనం తీసుకుంటున్నది ప్రజల సొమ్ము.. వారిలో ప్రయివేటు రంగ ఉద్యోగులు, అల్పాదాయ కార్మికులు పెద్ద సంఖ్యలో ఉంటారు.. ప్రభుత్వ ఉద్యోగులకంటే వారే ఎక్కువ కష్టపడతారు.. పని వేళలు కూడా ఎక్కువే.. సోకాల్గ్ కార్మిక చట్టాలు ఉన్నా వారి పనికి తగ్గ వేతనాలు అసలు ఉండవని తెలిసిందే.. ప్రయివేటు, ప్రభుత్వ ఉద్యోగాలు జీతాల పోలిక ఇబ్బంది కలిగించి ఉండొచ్చు.. కానీ ముందే చెప్పాను నిజం నిష్టూరం లాంటిది కదా..

బాబూలూ (ఉత్తరాదిన సర్కారీ ఉద్యోగులను ఇలాగే పిలుస్తారు).. కనీసం మీ జీతాలకు అయినా న్యాయం చేసేలా పని తీరును మెరుగు పరచుకొండి.. మనం పని చేస్తున్నది ప్రజల కోసం అని గుర్తుంచుకొండి.. కాస్త సేవాభావం పెంచుకోండి.. ఫలితాలు చూపించండి.. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచండి.. ఉత్తమ పాలన అందించండి.. జీతాలతో పాటు పని తీరులోనూ రెండు సర్కార్లు పోటీ పడాలని కోరుకుంటున్నాను..

Sunday, February 8, 2015

బద్రికి నివాళి

మిత్రుడు, న్యూస్ ప్రెజెంటర్, టీవీ9 సహ ఉద్యోగి బద్రి ఇకలేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను.. నిన్నటి వరకూ ఆఫీసులో నా కళ్ల ముందే డెస్క్-స్టూడియోల మధ్య హడావుడిగా తిరుగుతూ, మధ్యలో పలకరించి మరీ వెళ్లే బద్రి జ్ఞాపకాలను మరచిపోవడం కష్టమే.. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన బద్రి ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని కోరుకుంటున్నాను..

Wednesday, February 4, 2015

వెకిలి చేష్టలతో అడ్డగా బుక్కైన కామ పిశాచి..

‘కామాతురానాం నభయం నలజ్జ..’ అంటే కామంతో కళ్లు మూసుకుపోయిన వాడికి భయం, సిగ్గు ఉండవు.. ఇలాంటి వారు ఎంతకైనా తెగిస్తారు.. కానీ ఇకపై మారక తప్పదు.. సోషల్ మీడియా విస్తృతం అయ్యాక ఇకపై ఇలాంటి వారు సమాజంలో తలెత్తుకు తిరగలేరు.. తాజాగా ఇండిగో విమానంలో జరిగిన ఘటన కామ పిశాచులకు కనువిప్పు కలిగించాల్సిందే..
ఢిల్లీ నుండి భువనేశ్వర్ వస్తున్న ఇండిగో విమానంలో ఓ 60 ఏళ్ల పెద్ద మనిషి తోటి ప్రయాణీకురాలితో అసభ్యంగా ప్రవర్తించాడు.. పరువు పోతుందని ఆమె భర్తిస్తూ ఊరుకోలేదు.. అతన్ని మొబైల్ ఫోన్లో బంధిస్తూ అరచి కేకలు పెట్టి అందరి ముందూ పరువు తీసింది.. తోటి ప్రయాణీకులంతా అతగాడిని అసహ్యించుకున్నారు.. భువనేశ్వర్ చేరుకున్నాక అతన్ని పోలీసులకు అప్పగించారు.. ఇతగాడు ఓ పెద్ద వ్యాపారి అట.. సింగపూర్లో ఉంటున్నాడట.. భువనేశ్వర్లో తన తండ్రి దగ్గరకు ఇటీవలే వచ్చాడట.. పాపం పండింది వీడికి.. కొసమెరుపు ఏమిటంటే పోలీసులు కేవలం ప్రశ్నించి వదిలేశారట.. పెద్ద మనుషులంటే వారికి ఎంత గౌరవమో.. 
ఈ వీడియో లింక్ కూడా చూడండి..
http://youtu.be/Rk9MB34cRO8

Tuesday, February 3, 2015

భగంతునికి అందరూ సమానులే అన్న సంత్ రవిదాస్

కులం కాదు గొప్పది, కులం కన్నా కర్తవ్యం ప్రధానం.. ధర్మమే సత్యం, మదిలో నింపుకోండి ధర్మాన్ని..ధర్మం- కర్మం రెండూ సమానం..
సృష్టి జరిగింది ఒకే జ్యోతితో.. అందరూ దేవుని పుత్రులే, కులం-ప్రాంతం బేధం లేదు.. అందరూ సమానమే.. బ్రాహ్మణులైనా, చమారులైనా ఎక్కువ, తక్కువలు లేవు..
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఎవరైనా వారి పవిత్ర కర్మలే శ్రేష్టత్వాన్ని నిర్ణయిస్తాయి.. 
సంత్ రవిదాస్ బోధనలివి. ఉత్తర భారత దేశంలో ఏడు శతాబ్దాల క్రితం భక్తి ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించిన ఆధ్యాత్మిక యోధుడు, కర్మయోగి సంత్ రవిదాస్.. పేదరికంలో అందులో చర్మకార (చమార్) వృత్తిని నిర్వహిస్తూ గొప్ప ఆధ్యాత్మిక గురువుగా, మార్గదర్శకునిగా నిలిచారు. భక్తికి, జ్ఞానానికి కులం ప్రధానం కాదు. పెద్దగా శాస్త్రాలు చదువాల్సిన అవసరమే లేదు. సన్మార్గంతో భగవంతున్ని చేరుకోవచ్చని నిరూపించారు సంత్ రవిదాస్.  
సంత్ రవిదాస్ ఎప్పుడు జన్మించారనే విషయంలో భిన్నవాదనలున్నాయి. 1377 లేదా 1399 సంవత్సరంలో ఆయన జన్మించాడని అంటారు. మరి కొందరు 1450లో జన్మించారని చెబుతున్నారు. పవిత్ర కాశీ నగరానికి సమీపంలోని సీర్ గోవర్ధన్‌పూర్‌కుచ గ్రామంలో మాఘ పూర్ణిమ నాడు  ఖల్‌సాదేవి, సంతోస్ దాస్ దంపతులకు రవిదాస్ జన్మించారు. రవిదాస్ పేరును రైదాస్ అని కూడా చెబుతారు. చమార్ కులంలో జన్మించిన రవిదాస్ చిన్నప్పటి నుండే ఆధ్యాత్మిక జీవితం పట్ల మక్కువ పెంచుకున్నారు. గంగానదిలో స్నానం చేసి, అక్కడ సాధుసంతులు చేసే బోధనలను శ్రద్దగా ఆలకించేవారు.. తాత్విక, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందిన రవిదాస్ భగవంతున్ని స్థుతిస్తూ కీర్తనలు, భజనలు ఆలపిస్తూ అందరినీ ఆకట్టుకునేవారు. సమాజంలో కుల వివక్ష, అంటరానితనం ఆయన్ని తీవ్ర ఆందోళనకు గురి చేసేవి.. రవిదాస్ ధోరణి పట్ల ఆందోళన చెందాడు ఆయన తండ్రి పెళ్లి చేస్తే కానీ దారిలోకి రాడని భావించారు. అలా లోనాదేవితో చిన్న తనంలోనే వివాహం జరిగింది. పెళ్లి చేసుకున్నా ఆధ్యాత్మిక మార్గాన్ని వీడలేదు రవిదాస్. లోనాదేవి తన భర్తను చక్కగా అర్ధం చేసకుంది. ఇద్దరూ కుల వృత్తి అయిన చెప్పులు కుట్టుకుంటూ దైవ చింతనను కొనసాగించారు..
రవిదాసు ఎంతో శ్రద్దగా పాదరక్షలు కుట్టేవాడు. అయితే దాన్ని ఆదాయవనరుగా భావించలేదు. తీర్థయాత్రులు చేసే సాధుసంతులకు ఉచితంగా ఇచ్చేవాడు.. దీంతో భక్తి గడవడం కష్టమైంది. దుర్భర దారిద్ర్యంలో ఉన్నదాంట్లోనే సరి పెట్టుకుంటూ భక్తి మార్గంలో పడిచేవాడు రవిదాస్. క్రమంగా రవిదాస్ కీర్తి అందరికీ తెలియడం మొదలైంది.. పేదరికంలో ఉన్న ఆయన్ని ఆదుకోవాలని భావించారు సంత్ ప్రేమానంద్.. రవిదాసుకు పరుసవేదిని బహుకరించారు. దానితో ఇనుమును తాకితే బంగారం అవుతుందని, ఆర్ధిక పరిస్థితుల నుండి గట్టెక్కవచ్చని సూచించాడు. రవిదాస్ దాన్ని తీసుకోడానికి ఇష్టపడలేదు. ప్రేమానంద్ వత్తిడితో అయిష్టంగానే తీసుకొని చూరులో పెట్టేశాడు. రవిదాస్ దృష్టి దానిపై పడనేలేదు.. తన జీవితం ఎప్పటిలాగే గడుస్తూ వచ్చింది. కొంత కాలం తర్వాత సంత్ ప్రేమేనంద్ మరోసారి రవిదాస్ పూరిపాకకు వెళ్లారు. రవిదాస్ పేదరికం నుండి గట్టెక్కి ఉంటాడని భావించారాయన. కానీ పరుసవేది పెట్టిన చూరులోనే అలాగే భద్రంగా ఉంది. రవిదాస్ నిరాడబరమై జీవితంలోనే అలౌకిక ఆనందం పొందుతున్నాడని గ్రహించి ఆయనకు సవినయంగా నమస్కరించారు ప్రేమానంద్..
రాజస్థాన్ చిత్తోడ్ గడ్ రాజపుత్ర యోధుడు రాణా సాంగా తల్లి రతన్ కువారీకి రవిదాసు గురుంచి తెలుసుకుంది. తన సైన్యంతో సహా వచ్చి రవిదాస్ పూరిపాక ముందు సవినయంగా మోకరిల్లి తనను శిష్యురాలిగా స్వీకరించమని కోరింది. రతన్ కువారీ కోరిక మేరకు రవిదాసు, ఆయన సతీమణి లోనాదేవి చిత్తోడ్ గడ్ వెళ్లారు.. అక్కడ వారిని ఘనంగా సత్కరించి ఏనుగు అంబారీపై ఊరేగించారు.. రాణా సాంగా భార్య మీరాబాయి కూడా రవిదాస్ శిష్యురాలిగా మారిపోయారు. రవిదాస్ ఖ్యాతి నలు దిశలా వ్యాపించింది.. కాశీ మహారాజ దంపతులతో సహా ఎందరో రాజులు, రాణులు, సాధుసంతులు రవిదాస్ బోధనల పట్ల ఆకర్శితులై ఆయన శిష్యులుగా మారారు. సంత్ రవిదాస్ చిత్తోడ్ లోనే తన 120వ ఏట చైత్రశుద్ద చతుర్ధశి నాడు భగవంతునిలో లీనమైపోయారు.

కామ్ కర్తే రహో.. నామ్ జప్తే రహో.. భుక్తి కోసం పని చేస్తుకుంటూనే ఆధ్యాత్మిక చింతనను ఎలా అనుసరించాలో ఆచరణలో చూపించారు సంత్ రవిదాస్.. రవిదాస్ బోధనలు కీర్తనల రూపంలో దోహాలుగా ప్రసిద్ది కెక్కాయి. సమాజంలో కులం, అంటరానితనం, దురాచారాలను తీవ్రంగా నిరసించారాయన. భగవంతున్ని చేర్చేది కేవలం భక్తి మార్గమే అని, కులం కన్నా గుణమే ప్రధానం అని బోధించారు. దేవునికి అందరూ సమానమే అని చాటి చెప్పారు. మొఘలుల పాలనలో దుర్భర కష్టాల్లో ఉన్న హిందూ సమాజంలో ఐక్యత సాధించడంలో రవిదాస్ బోధనలు దోహదపడ్డాయి. సంత్ రవిదాస్ బోధనలను సిక్కుల ఐదో గురువు అర్జున్ దేవ్ పవిత్ర గ్రంధం గురు గ్రంధసాహిబ్ లో చేర్చారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తాను రాసిన అస్పృశ్యులు ఎవరే అనే గ్రంధాన్ని సంత్ రవిదాస్ కు అంకితం ఇచ్చారు. సంత్ రవిదాస్ బోధనలు ఉత్తర భారత దేశానికే పరిమితం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆయన సందేశం నుండి స్పూర్తి పొందారు.. రవిదాస్ సూచించిన మార్గం అందరికీ, ఎప్పటికీ, అన్ని వేళలా అనుసరనీయం.(ఫిబ్రవరి 3న సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా)