Thursday, February 19, 2015

ఇండియా టుడే ఆగిపోయింది..

కాల పరీక్షలో ఇండియా టుడే కూడా ఓడిపోయింది.. ఇది జీర్ణించుకోలేని వార్తే..
ఇరవై ఐదేళ్ల క్రితం ఇండియా టుడే తెలుగు పక్ష పత్రిక తొలి సంచిక కొన్నాను. బెనజీర్ భుట్టో ముఖచిత్రంతో వచ్చిన ఆ సంచిక చాలా బాగా గుర్తుంది.. రాజకీయ, సామాజిక వార్తలు అందించే తెలుగు పత్రికలు అప్పటికే మార్కెట్లో ఉన్నా ఒక జాతీయ పత్రిక తెలుగు ఎడిషన్ లుక్కే వేరు కదా.. అప్పట్లో మొహం మొత్తించే కార్యక్రమాలు వచ్చే దూరదర్శన్ తప్ప టీవీ ఛానెల్స్ ఏవీ లేవు.. పుస్తకాలు చదువుకోడానికి చాలా తీరిక ఉండేది.. అప్పటి నుండీ క్రమం తప్పకుండా ఇండియా టుడే చదివేవాన్ని.. కాలక్రమంలో ఇండియా టుడే నాణ్యత మరింత పెరగుతూ వచ్చింది.. ధర, పేజీల హెచ్చు తగ్గులనూ గమనించాను.. ఇండియా టుడేకు జాతీయ స్థాయిలో ఔట్ లుక్ అనే ఆంగ్లవార పత్రిక పోటీగా వచ్చే సరికి, అది కూడా వార పత్రికగా మారక తప్పలేదు.. తెలుగు ఇండియా టుడే కూడా వీక్లీ అయిపోయింది.
ఇండియా టుడే ప్రేరణతో తెలుగులో సుప్రభాతం, వార్తాకాలం, బొబ్బులి పులి, మా భూమి పత్రికలు వచ్చినా పలు కారణాల వల్ల కాలపరీక్షలో నిలవలేదు..మార్కెట్ లో ఇండియా టుడే తెలుగు పత్రిక ఏకైక వీక్లీగా నిలిచింది.. ఇండియా టుడే ప్రాధామ్యాలు కొన్నిసార్లు కోపం తెప్పించేవి. స్థానిక అంశాలకు కాకుండా జాతీయ స్థాయి విషయాలకే ప్రాధాన్యత ఇవ్వడం, అనువాదం సక్రమంగా ఉండకపోవడం చిరాగ్గా అనిపించేది.. అయినా మార్కెట్లో తాజా సంచిక కోసం ఎదురు చూసేవాన్ని.. 


25 ఏళ్లు అంటే తక్కువేం కాదు.. ఒక తరం మారిపోయింది.. కాలం మారింది..అభిరుచులూ మారాయి.. టీవీ ఛానళ్లు వచ్చాయి.. పత్రికల పని అయిపోయిందన్నారు.. అయినా చదువరులు ఉన్నారు పర్వాలేదు అంటూ ఉనికిని చాటుకున్నాయి.. ఇక ఇంటర్నెట్ వచ్చేసింది.. డిజిటల్ పత్రికలు, మొబైల్ ఫోన్, ట్యాబుల్లోనే వార్తలు చూసుకునే రోజులు వచ్చాయి.. చివరకు కాల పరీక్షలో ఇండియా టుడే పత్రిక కూడా ఓడిపోక తప్పలేదు.. తెలుగు, తమిళ, మలయాళ ఇండియా టుడే ఎడిషన్లు మూత పడ్డాయి.. ప్రస్తుతం ఇండియా టుడే తెలుగు ఎడిషన్ చివరి సంచిక మార్కెట్లో ఉంది.. అందరూ కొని దాచుకోండి..
ఇండియా టుడే దోరణిని నేను ఎన్నోసార్లు తిట్టుకున్నాను.. కానీ ఇప్పుడు ఒక పాఠకునిగా, జర్నలిస్టుగా చింతిస్తున్నాను.. మళ్లీ కొత్త కూపంలోొ వస్తామని ఇండియా టుడే యాజమాన్యం చివరి సంచికలో చెప్పింది.. చూద్దాం అదేమిటో..

No comments:

Post a Comment