Saturday, March 28, 2015

శ్రీరామ జననం.. కాలగణన

చైత్ర శుక్ల నవమి రోజున పునర్వసు నక్షత్రంలో శ్రీరాముడు జన్మించాడని అందరికీ తెలుసు.. కానీ ఆధునిక కాలమానం ప్రకారం రాముడు పుట్టిన తేదీ ఏమిటో తెలుసా?.. 11 ఫిబ్రవరి, 4433 క్రీ.పూ. ఆదివారం రోజున శ్రీరాముడు జన్మించారు.. అంటే మనం రాముని 6,448వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నమాట..
రామాయణం కేవలం పురాణగాథ, అభూతకల్పన మాత్రమే అని వాదిస్తారు నాస్తికులు.. శ్రీరాముని ఉనికితో ముడిపడి ఉన్న ప్రదేశాలు దేశమంతటా మనకు కనిపిస్తాయి.. పలు పరిశోధనల్లో రామాయణం వాస్తవ చరిత్ర అని తేలుతోంది.. ఈ నేపథ్యంలో DATE OF SRI RAMA అనే గ్రంథం ఆసక్తిని కలిగించింది. ప్రముఖ ఇంజినీర్ ఎన్.నర్సింగ్ రావు రాసిన ఈ పుస్తకంలో రామ జననంతో పాటు రామాయణంలో జరిగిన ముఖ్య ఘట్టాల తేదీలను ఆధునిక ఆంగ్ల కాలమానం ప్రకారం వెల్లడించారు.. వాల్మీకి రామాయణం, మన పంచాంగం, తిథి, వార, నక్షత్రాల ఆధారంగా ఈ కాల గణన చేశారు.. దీని ప్రకారం రామాయణంలోని కొన్ని ప్రధాన సంఘటనల తేదీలు ఇలా ఉన్నాయి..
11 ఫిబ్రవరి, 4433 బిసి ఆదివారం  అయోధ్యలో శ్రీరామ జననం
6 ఫిబ్రవరి, 4421 బిసి జ్ఞ రక్షణ కోసం విశ్వామిత్రునితో పయనం
20 ఫిబ్రవరి, 4421 బిసి శివ ధనుర్భంగం
4 మార్చి, 4421 బిసి సీతారామ కల్యాణం
16 ఫిబ్రవరి, 4409 బిసి వనవాసానికి బయలు దేరిన సీతా రామ లక్ష్మణులు
21 ఫిబ్రవరి, 4409 బిసి దశరథుని మరణం
22 ఫిబ్రవరి, 4409 బిసి చిత్ర కూటంలో నివాసం
26 ఫిబ్రవరి, 4399 బిసి పంచవటిలో నివాసం
20 డిసెంబర్, 4396 బిసి రావణుడిచే సీతాపహరణ
13 జనవరి, 4395 బిసి రామసేతు నిర్మాణం (5 రోజుల పాటు)
19 జనవరి, 4395 బిసి లంకలో యుద్ధం ప్రారంభం
5 ఫిబ్రవరి, 4395 బిసి రామ రావణ యుద్దం మొదలు, నాలుగో రోజున రావణ సంహారం
6 ఫిబ్రవరి, 4395 బిసి విభీషణుని పట్టాభిషేకం
7 ఫిబ్రవరి, 4395 బిసి లంక నుండి పుష్పక విమానంతో తిరుగు పయనం
8 ఫిబ్రవరి 4395 బిసి అయోధ్యలో శ్రీరాముని పట్టాభిషేకం

వాల్మీకి రామాయణం శ్రీరామ పట్టాభిషేకంతో ముగుస్తుంది.. అంత వరకే కాల గణన చేశారు.

సకల గుణాభి రాముడు..

శ్రీరామ నామం ఎంతో మధురం.. రామాయణం కేవలం ఒక పౌరాణిక కథ కాదు.. రామున్ని భగవంతునిగా ఎందుకు పూజిస్తున్నామో అర్థం చేసుకోనిదే రామ కథ పరిపూర్ణం కాదు..
ఆదర్శ నాయకుడు, పితృవాక్య పాలకుడు, గురు భక్తుడు, ఏక పత్నీ వ్రతుడు, మర్యాదా పురుషోత్తముడు, ధర్మ సంరక్షకుడు, సద్గుణవంతుడు, మహా వీరుడు, ప్రేమాస్పదుడు, ఆదర్శ మిత్రుడు.. సకల గుణాభిరాముడు.. శ్రీరామున్ని గురుంచి ఎంత చెప్పినా తక్కువే.. రాముడు కేవలం విష్ణుమూర్తి అవతారం కావడం వల్లే భగవంతుడు కాలేదు.. ఆయన ధర్మాచరణే ఆరాధ్యున్ని చేసింది..
శ్రీరాముడు గొప్ప నాయకుడు.. వ్యక్తిగత ప్రయోజనాలు విడిచిపెట్టి ప్రజల ఆకాంక్షలకే విలువ ఇచ్చాడు.. రామ రాజ్యంలో ప్రజలంతా ఆకలి దప్పుడు లేకుండా సుఖ సంతోషాలతో, సరి సంపదలతో జీవించారు. భయం, దొంగతనాలు లేదు.. ప్రతి పౌరుడు ధర్మాన్ని ఆచరించారు.. మహాత్మా గాంధీ రామ రాజ్యం కావాలని కోరుకున్నది ఇందుకే.. రామ రాజ్యం అంటే ఆదర్శ రాజ్యం..
రామాయణంలో ఎన్నో ఆదర్శపాత్రలు కనిపిస్తాయి.. ఆదర్శ పత్నులుగా సీత, ఊర్మిళ..ఆదర్శ సోదరులుగా లక్ష్మణ, భరత శత్రుజ్ఞులు.. ఆదర్శ భక్తునిగా ఆంజనేయుడు.. ఇలా అన్ని పాత్రలను విశ్లేషించవచ్చు..
రాముడు అందరివాడు.. ఆసేతు హిమాచలం రామతత్వం వ్యాపించింది.. ముఖ్యంగా తెలుగు నేలకు రామభక్తికి విడదీయరాని సంబంధం ఏర్పడింది. ఉత్తరాదిన అయోధ్యలో పుట్టిన రాముడు వనవాసంలో భాగంగా దక్షిణాదికి వచ్చాడు.. సీతాపహరణంతో అయోధ్య వెళ్లి రావణున్ని సంహరించాడు.. రాముని కథ భారత దేశానికే పరిమితం కాలేదు.. తూర్పు ఆసియా దేశాలు కూడా రామాయణాన్ని సొంతం చేసుకున్నాయి..

శ్రీరామ నవమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు..

Friday, March 27, 2015

భారతరత్నం అటల్జీ..

అటల్జీకి భారతరత్న ప్రధానం చేసిన వేళ నా ఆనందం అనిర్వచనీయం.. ఆ మహనీయుడిని అలంకరించిన తర్వాత భారతరత్నానికి మరింత విలువ పెరిగింది.. వాజపేయిజీ తిరిగి సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని నేను భగవంతున్ని కోరుకుంటున్నాను..

గెలిచింది ఎవరు?.. ఓడింది ఎవరు?

అందరి మొహాల్లో ఒకటే విచారం, నిరాశానిస్పృహలు.. కారణం ఇండియా ఓడిందట.. ఓడింది ఇండియాకు సోకాల్డ్ ప్రాతినిధ్యం వహించిన క్రికెట్ జట్టు నాయనా అని సవరించాను.. అదీ మన దేశ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధంలేని బీసీసీఐ వాటి టీమ్ మాత్రమే అని చెప్పాను.. వాళ్లు గెలిచినంత మాత్రాన మనం వారికి కట్లు బానిసలం అయిపోలేదు కదా అని నచ్చజెప్పాను.. ఏదైతేనేం పళ్లు రాలగొట్టుకోవడానికి అంటూ మిట్ట వేదాంత ధోరణిలో నిరాశా నిస్పృహలను చాటుకున్నాడో మిత్రుడు.. క్రికెట్ పిచ్చి నషాలానికి ఎక్కిన వారికి ఎంత చెప్పినా తక్కువే కదా?
"Cricket is a game played by 11 fools and watched by 11,000 fools.." అంటే 11 మంది అవివేకులు ఆడుతుంటే 11,000 మంది అవివేకులు చూసే ఆటే క్రికెట్.. ప్రఖ్యాత మేధావి, నోబుల్ బహుమతి గ్రహీత జార్జ్ బెర్నార్డ్ షా దాదాపు 70 ఏళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలివి.. అప్పట్లో ఇంగ్లాండ్, వారి ఆధీన దేశాల్లో మాత్రమే క్రికెట్ ఆడేవారు.. కానీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది విరగబడి చూస్తున్నారీ ఆటను.. ఇంత ప్రాచుర్యం పొందినా, ప్రపంచ వ్యాప్తంగా పట్టుమని 30 దేశాలకు  కూడా విస్తరించలేదు క్రికెట్.. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆధరణ ఉన్న క్రీడ సాకర్.. ఆ తర్వాతే ఏ క్రీడ అయినా.. ఏ ఆట గొప్పదని నేను చర్చిండం లేదిక్కడ..
బ్రిటిషోడు పోతూ పోతూ మన దేశానికి అంటింటి పోయిన జాడ్యం క్రికెట్ అంటారు కొందరు.. కానీ అది అది పాక్షిక సత్యం మాత్రమే.. వాళ్లు క్రికెట్ ఒక్కటే మనకు నేర్పలేదు. హకీ, ఫుట్ బాల్ లాంటి ఆటలనూ పరిచయం చేశారు.. దేశ స్వాతంత్ర్యానికి ముందు, తర్వాత కూడా మన దేశంలో అత్యంత ఆదరణ ఉన్న ఆట హకీ.. అప్పట్లే ప్రపంచ చాంపియన్లం మనమే.. హకీకి పర్యాయ పడదంగా మన దేశం పేరు తెచ్చుకున్నది భారత్.. కాలక్రమంలో హాకీని దిక్కులేని ఆటగా మార్చేసుకున్నాం.. హాకీ క్రీడాకారులను అంటరాని వారిగా చూస్తూ, క్రికెట్ నూ, ఆ ఆట ఆడే వారిని దేవుళ్లలా పూజిస్తూ నెత్తినెక్కించుకున్నాం..
క్రికెట్ ఇప్పడు కేవలం ఓ వ్యాపార క్రీడ మాత్రమే.. కోట్లాది రూపాయల పారితోషికాలు, ప్రసార అనుమతులు, బెట్టింగులతో ముడిపడిన ఆట ఇది.. టీవీలో మ్యాచి వస్తుంటే పని పాటా మానేసి టీవీ సెట్లకు అతుక్కుపోయి, విరగబడి చూస్తుంటాం.. ఎంత సమయం, ఎంత శ్రమ శక్తి వృధా చేస్తున్నామో ఆలోచించారా?.. క్రికెట్ ఆటపై మన దేశ ప్రభుత్వానికి ఎలాంటి కంట్రోల్ లేదు.. అది మన జాతీయ క్రీడ కూడా కాదు.. బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఆఫ్ ఇండియా అనే  కొంత మంది పెత్తందారుల గుత్తాధిపత్యంలో సాగుతున్న డ్రామా మాత్రమే..  ఎవరో గెలిచారని వెర్రి కేకలతో గంతులేస్తూ సంబరపడాల్సిన అవసరం లేదు.. అలాగే ఎవరో ఓడిపోయారని మనం చంకలు గుద్దుకొని ఆనందించాల్సిన పని కూడా లేదు.. ఆటను, ఆటగాళ్లనూ సమానంగానే చూద్దాం.. నిజమైన క్రీడా స్పూర్తితో వ్యవహరిద్దాం..
( 2015 ప్రపంచం క్రికెట్ కప్ లో బీసీసీఐ జట్టు ఫైనల్స్ కు చేరలేదని కలత చెందుతున్న తోటి భారతీయులకు సానుభూతితో..)

Wednesday, March 25, 2015

రామచంద్ర రావు ఘన విజయం


హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రల శాసనమండలి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్.రామచంద్ర రావు గారికి అభినందనలు.. శుభాకాంక్షలు.. మండలిలో భజన చేసేవారికన్నా, ప్రశ్నించే గళం విజయం సాధించాలన్న ఆకాంక్ష నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. రామచంద్ర రావుగారు ఎలాగైనా గెలవాలని కోరుకున్నాను..ఈ దిశగా గత రెండు నెలలుగా మా జర్నలిస్టు మిత్రులు చేసిన ప్రయత్నాలు చాలా వరకు సఫలం అయ్యాయి. నా వినతి మేరకు రామచంద్రరావు గారికి తమ అమూల్యమైన ఓటు వేసిన బంధుమిత్రులందరికీ ధన్యవాదాలు. సీనియర్ న్యాయవాది, బార్ కౌన్సిల్ సభ్యుడు, ప్రెస్ కౌన్సిల్ సభ్యుడు అయిన రామచంద్ర రావుగారు శాసనమండలిలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను బలంగా వినిపించే అవకాశం ఉంది.. (చిత్రాలు:ఇటీవల రామచంద్రరావు గారితో జర్నలిస్టు మిత్రుల ముఖాముఖి)



Monday, March 23, 2015

నిన్న ఆంధ్ర.. ఇవాళ తెలంగాణ.. ఇదీ పత్రికల తీరు..

పొద్దున్నే న్యూస్ పేపర్ కొందామని రోడ్డు మీదకు వెళ్లాను.. అప్పుడే బైక్ మీద వచ్చిన ఒకాయన ‘తెలంగాణ పేపర్ ఇమ్మని షాపు వానికి డబ్బిచ్చాడు?.. షాపాయన ఏ తెలంగాణ? అని అడిగాడు. వచ్చిన కస్టమర్ పేపర్ల వరుస వైపు చూసి తనకు కావాల్సిన తెలంగాణ పత్రిక కొనుక్కొని పోయాడు.. అవును మరి నిన్న మొన్నటి దాకా నమస్తే తెలంగాణదిన పత్రిక ఒక్కటే ఉండేది..  ఇప్పడు మన తెలంగాణ,  ‘నవ తెలంగాణ వచ్చి చేరాయి.. మరి కొన్ని తెలంగాణ పేపర్లు వస్తాయట(?).. వీటికి తోడు నమస్తే హైదరాబాద్ అనే పత్రిక కూడా ఉంది..
తెలుగు పత్రికలకు మూస పేర్ల ధోరణి కొత్తేమీ కాదు.. ఒకప్పుడు ఆంధ్ర పేరుతో వరుసగా దిన పత్రికలు వచ్చాయి..ఆంధ్ర పత్రిక’ ‘ఆంధ్ర ప్రభ’ ‘ఆంధ్ర భూమి’ ‘ఆంధ్ర జ్యోతి.. ఆంధ్ర పత్రిక ఎప్పుడో మూత పడింది.. మధ్యలో ఆంధ్ర జనత అనే దిన పత్రిక కొంత కాలం నడిచి ఆగిపోయింది.. మద్రాసు రాష్ట్రం నుండి తెలుగు ప్రాంతాలు విడిపోయి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడేందుకు జరిగిన పోరాట కాలంలో ఆ పదానికి డిమాండ్ ఉండేది.. అలా ప్రధాన పత్రికలన్నీ మూసగా ఆంధ్ర పేరిట వచ్చేశాయి..
తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ప్రభావంతో సీన్ రివ్స్ అయింది.. నిన్న మొన్నటి దాకా ఆంధ్రబ్రాండ్ మాదిదే ఇప్పుడు తెలంగాణ బ్రాండ్ పత్రికలు వస్తున్నాయి.. తెలంగాణ అస్థిత్వం, చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ పూర్తిగా లోకల్ ఫ్లేవర్ నింపుకొని వస్తున్న కొత్త తరం దిన పత్రికలకు ఆధరణ బాగానే ఉంది.. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేపథ్యంలో టీఆరెస్ నమస్తే తెలంగాణను ప్రమోట్ చేసింది.. సీపీఐ తన విశాలాంధ్ర దినపత్రిక టైటిల్ తెలంగాణ ప్రాంతంలో గుది బండ అనుకుందేమో అందుకే మన తెలంగాణ పేరుతో కొత్త దిన పత్రికను తెచ్చింది.. మరి సీపీఎం వారి దిన పత్రిక ప్రజాశక్తి టైటిల్ ఎవరికీ అభ్యంతరకరం కాదే? మరి నవ తెలంగాణ ఎందుకు తెచ్చినట్లో?..
ఆంధ్రపేరిట పత్రికలు ఎన్ని వచ్చినా పాఠకులు వాటిని పూర్తి పేరుతో కాకుండా ‘పత్రిక, ప్రభ, భూమి, జ్యోతి, జనత..’ అని పిలుచుకుంటున్నారు. కానీ ‘తెలంగాణ పత్రికలను నమస్తే, మన, నవ.. అని పిలుకోవడం ఇబ్బందే.. నాలుగు దశాబ్దాల క్రితం ఆంధ్ర అనే మూస టైటిల్స్ కు భిన్నంగా ఈనాడు దిన పత్రిక పుట్టుకొచ్చి తెలుగు జర్నలిజంలో సంచలనాలు సృష్టించింది.. ఆ తర్వాత కాలంలొ వచ్చిన ఉదయం, వార్త, సాక్షి దిన పత్రిక విజయానికి వాటి టిటిల్స్ లో ఉన్న వినూత్నత్వం కొంత కారణం..
ప్రస్తుతం తెలుగులో ఉన్న అన్ని ప్రధాన దిన పత్రికల్లాగే  తెలంగాణ టైటిల్ తో వచ్చిన పత్రికలు కూడా రాజకీయ పార్టీలకు అనుబంధమనే ముద్ర వేసుకున్నాయి.. కాదని ఎవరైనా వాదిస్తే వారిని అమాయకంగా చూడటం మినహా మరేం చేయలేను.. ఈ నేపథ్యంలో రాజకీయేతర స్వతంత్ర వార్తల తెలంగాణ పత్రిక కూడా వస్తే బాగుండు అనిపిస్తోంది.. కానీ అది అత్యాశే అనిపిస్తోంది.. ప్రపంచ వ్యాపంగా ప్రధాన దినపత్రికలు సమాచార సాంకేతిక విప్లవం పుణ్యమా అని ప్రింట్ ఎడిషన్లను మూసేని, క్రమంగా ఆన్ లైన్ కు వెళ్లిపోతున్నాయి.. తెలుగులో కూడా ఈ పరిణామం క్రమంగా ప్రారంభమై ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.. ఈ అంతర్జాతీయ పత్రికలైనా ఎంత కాలం ఉంటాయో, మరే కొత్త టెక్నాలజీ వస్తుందో చెప్పలేని పరిస్థితి.. ప్రస్తుతానికైతే అన్ని పత్రికలకూ నేను విష్ యూ ఆల్ ది బెస్ట్ అనే చెబుతున్నా.. పత్రికలు, ఛానళ్లు ఎన్ని వస్తే అన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని నమ్మే సగటు జర్నలిస్టును కదా నేను..

Sunday, March 22, 2015

బిందువు బిందువు కలిస్తేనే సింధువు

ఉదయాన్నే లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా మనం ఎంత నీటిని వృధా చేస్తున్నామో ఆలోచించారా?.. కాలకృత్యాలకు వెళ్లినప్పుడు టాప్ విప్పి పెడతాం.. మొదట పళ్లు తోముకోముకునేటప్పుడు కూడా ఇలాగే నల్లా ఆన్ చేస్తాం.. స్నానానికి, బట్టలు ఉతకడానికి కూడా ఎంతో నీటిని అవసరానికి మించి వృధాగా వదులుతున్నాం.. టాప్ లీక్ అవుతున్నా, వాటర్ ట్యాంకు నిండి వృధాగా పోతున్నా పట్టించుకోము.. ఇలా ఒక మనిషి సగటున రోజుకు 5 బకెట్ల నీటిని వృధా చేస్తున్నాడని అఒక అంఛనా.. ఓ చిన్న కుటుంబంలో నలుగురు సభ్యులు ఉంటే 20 బకెట్లు అలా వృధా అయిపోతున్నాయి.. ఈ లెక్కన పెద్ద కుటుంబం ఎంత వేస్ట్ చేస్తోందో ఆలోచించండి..
భారత దేశంతో సహా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో భూగర్భ జలాలు శరవేగంగా ఇంకిపోతున్నాయి.. పరిస్థితి ఇలాగే కొనసాగితే భావితరాలు తాగునీటికి అల్లాడిపోక తప్పదు.. నీటిని చాలా వరకు వృధా చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. తాగు నీటికి కొరత ఏర్పడితే ఆనేక జబ్బులు మనల్ని చుట్టుముడతాయి..
ప్రతి నీటి బొట్టు విలువైనదే.. ముందు మన ఇంటి నుండే జలసంరక్షణ ప్రారంభించాలి.. నీటిని వృధా చేయడాన్ని అరికట్టండి.. నీటిని వృధాగా వదిలేయకుండా అవసరమైన మేరకే వాడుకోండి.. ముందు మీ కుళాయిలు లీకేజీ లేకుండి చూసుకోండి. ట్యాంకు నిండగానే మోటారు ఆఫ్ చేయడండి.. మీ ఇంటి చుట్టే మొక్కలు పెంచుకోండి.. వర్షాకాలంలో మేడపై నుండి పడే నీరు వృధాగా డ్రైనేజీలో కలవకుండా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోండి.. ఫలితంగా భూగర్భ జలాల మట్టం పెరుగుతుంది. నీటి కొరత ఉన్న గ్రామాల్లో రైతులు ఆరుతడి పంటలు వేసేలా, డ్రిప్ ఇరిగేషన్ చూపట్టేలా ప్రభుత్వం ప్రోత్సాహకాలను పెంచాలి.. కొండ ప్రాంతాల్లో చెక్ డ్యామ్స్ విరివిగా నిర్మించాలి..

బిందువు బిందువు కలిస్తేనే సింధువు అవుతుంది.. చెరువులు, వాగులు, నదులు నిండుగా ఉన్నప్పుడే పర్యావరణ సమతౌల్యం ఉంటుంది.. ఇవాళ ప్రపంచ జల దినోత్సవం (మార్చి 22).. జల సంరక్షణ నేటి నుండే మొదలు పెడదాం..

Saturday, March 21, 2015

సంఘ శిల్పికి 125 ఏళ్లు..

దేశ వ్యాప్తంగా విక్టోరియా మహరాణి రాజ్యాభిషేక వజ్రోత్సవాలు జరుగుతున్నాయి.. పాఠశాలల్లో పిల్లలకు మిఠాయిలు పంచుతున్నారు. ఎనిమిదేళ్ల విద్యార్థి తనకు ఇచ్చిన మిఠాయిని అవమానకరంగా భావించి విసిరకొట్టాడు..  కొంత కాలానికి అదే పాఠశాలకు ఓ బ్రిటిష్ అధికారి తనిఖీకి వచ్చాడు.. ప్రతి తరగతి గదిలోనూ విద్యార్థులంతా వందేమాతరం అంటూ స్వాగతం పలికారు.. మళ్లీ అదే విద్యార్థి ఈ పనికి కారణమని తేలింది.. పాఠశాల నుండి బహిష్కారానికి గురైన ఆ విద్యార్థి పెద్ద వాడయ్యాక డాక్టర్ అయ్యాడు.. కానీ జబ్బులకు కాకుండా దేశానికి పట్టిన రుగ్మతలకు చికిత్స చేయాలని నిర్ణయించుకున్నాడు.. అలా మొదలైందే సంస్థే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS).. దాన్ని స్థాపించిన డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్ జన్మించి ఈ ఉగాదికి 125 ఏళ్లు పూర్తయింది..
1889వ సంవత్సరంలో ఉగాది పర్వదినం రోజుల నాగపూరులో జన్మించారు కేశవ బలిరామ్ హెడ్గేవార్.. హైదరాబాద్ సంస్థానం(నేటి తెలంగాణ) లోని నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి గ్రామం నుండి వలస వెళ్లిన తెలుగు బ్రాహ్మణ కుటుంబం వారిది.. చిన్నప్పటి నుండే కేశవున్ని బ్రిటిష్ వారి పాలనలోని ఆనాటి దేశ పరిస్థితులు కలవర పరిచాయి.. చదువుకునే వయసులోనే సమాజం, దేశం కోసం ఆలోచించడం ప్రారంభించారాయన.. అణువణువునా దేశ భక్తిని నింపుకొని దేశ హితం కోసమే జీవించడం ప్రారంభించారు హెడ్గేవార్.. కాంగ్రెస్ పార్టీతో పాలు పలు విప్లవ సంస్థలతో సంబంధాలు పెంచుకున్నారు. 1916లో కలకత్తాలో వైద్య విద్యను పూర్తి చేసుకొని తిరిగి నాగపూర్ వచ్చారు. పెళ్లి చేసుకొని ప్రాక్టీస్ మొదలు పెట్టమని సూచించారు కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు.. కానీ అప్పటికే హెడ్గేవార్ ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నారు. అందు కోసం జీవితాన్ని దేశం కోసం సమర్పించుకున్నారు. ప్రాక్టీస్ చేయకున్నా సన్నిహితులంతా ఆయనను డాక్టర్జీగా పిలవడం ప్రారంభించారు.
1920లో నాగపూరులో జరిగిన కాంగ్రెస్ మహాసభల నిర్వహణ బాధ్యత డాక్టర్ హెడ్గేవార్ స్వీకరించారు.. ఇందు కోసం పని చేసిన వాలంటీర్లలో క్రమశిక్షణ లోపాన్ని గమనించారాయన.. అప్పటికి కాంగ్రెస్ పార్టీ ఇంకా సంపూర్ణ స్వరాజ్యం మాట ఎత్తలేదు.. ఆ పార్టీ విధానాలలోని లోపాలను గమనించి క్రమంగా దూరం అయ్యారు. మన దేశం, సమాజం కోసం స్వాభిమానం, దేశభక్తి, క్రమశిక్షణ, అంకిత భావం, కులాలకు అతీతంగా హిందువుల ఐక్యత కోసం నిస్వార్ధంగా పని చేసే సంస్థ అవసరం అని భావించారు డాక్టర్జీ.. ఇది చాలా కష్టమైన పని అని ఆయనను అంతా నిరుత్సాహ పరిచారారు. కానీ డాక్టర్జీ వెనుకడుగు వేయకుండా ముందుకు సాగారు. అలా 1925లో ఏర్పాటైన సంస్థే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్.. RSS
RSSను దేశ వ్యాప్తంగా విస్తరించడానికి డాక్టర్జీ దేశమంతా పర్యటించారు. అనేక మంది వ్యక్తులను కలుపుకొనిపోయారు. ఎంతో మంది సమాజ సేవకులను తయారు చేశారు. వ్యక్తి కన్నా సంస్థ, సమాజం గొప్పదని భావించారు డాక్టర్జీ.. అందుకే సంఘానికి తాను గురువుగా ఉండే అవకాశాన్ని తిరస్కరించారు. స్పూర్తినిచ్చే భగవాధ్వజాన్నే గురు స్థానంలో ప్రతిష్టించారు. సర్ సంఘ్ చాలక్ పదవిలో ఉన్నా తాను సాధారణ స్వయంసేవకున్నే అని వినమ్రంగా చెప్పుకునేవారు డాక్టర్జీ.. జగద్గురు శంకరాచార్యులు ఆయనకు రాష్ట్ర సేనాని బిరుదును ప్రధానం చేశారు.. కానీ అలా పిలిపించుకునేందుకు నొచ్చున్నారాయన.. తనకు సన్మానాలు, సత్కారాలు, బిరుదులు వద్దని స్పష్టం చేశారు. సాధారణ వ్యక్తిగా ఉండటానికే ఇష్టపడ్డారు.. డాక్టర్ హెడ్గేవార్ అవిశ్రాంతంగా పని చేసి సంఘాన్ని ఒక అజేయ సంస్థగా రూపు తెచ్చారు.. ఆరోగ్యం పూర్తిగా క్షీణించినా తుది శ్వాస వరకూ సమాజ చింతనతోనే జీవించారు. నిద్రలోనూ దేశ హితం గురుంచే కలవరించారు డాక్టర్జీ.. 1940 జూన్ 21న తుది శ్వాస విడిచారు.

డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్ ఆనాడు నాటిన చిన్ని మొక్క ఇప్పడు వట వృక్షంగా మారి దేశ వ్యాప్తంగా విస్తరించింది.. ప్రపంచ వ్యాప్తమైంది. లక్షలాది మంది స్వయం సేవకులు డాక్టర్జీ చూపించి మార్గంలో నడుస్తున్నారు. భారత దేశాన్ని పరం వైభవం దిశగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు. డాక్టర్జీ జన్మించింది 1889 ఏప్రిల్ 1.. అయితే వారు భారతీయ కాలమానం ప్రకారం వారు ఉగాది నాడు పుట్టారు.. అందుకే ఉగాది రోజునే ఆ మహానీయుని జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీ.. యుగద్రష్ట డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్ 125వ జయంతి సందర్భంగా వారి స్పూర్తితో మనమంతా ముందుకు సాగుదాం..

యుగానికే ఆది రోజు ఇది..

ఉగాది.. యుగానికి ఆది. అంటే సృష్టి ఆరంభమైన రోజు.. చైత్ర శుద్ధ పాడ్యమి రోజన వచ్చే ఉగాదిని దేశంలో తెలుగు వారితో సహా పలు ప్రాంతాల ప్రజలు సంవత్సరాదిగా జరుపుకుంటారు. తెలుగు సాంప్రదాయం ప్రకారం ఇది మన్మథ నామ సంవత్సరం..
ఉగాది అంటే తలంటు స్నానం, దైవ పూజలు, పచ్చడి, పిండి వంటలు అని మాత్రమే నేటి తరం భావిస్తోంది.. ఈ పండుగ విశిష్టలను సంక్షిప్తంగా తెలుసుకుందాం...
ఉగాది అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి.. శడ్రుచుల సమ్మేళనం ఇది. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదుల కలయిక.. జీవితంలో మంచి చెడు, కష్ట సుఖాలను సమాన దృష్టితో స్వీకరించాలనే సందేశం ఈ పచ్చడి ఇచ్చే సందేశం..
పంచాగ శ్రవణం ఉగాది నాటి మరో విశిష్టత.. తెలుగు క్యాలెండర్ ప్రకారం తిథి, వార, నక్షత్ర, యోగ,కరణలు ఉంటాయి ఇందులో.. మనం ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారం దైనందిన విధులను ఆచరిస్తున్నా, శుభ కార్యాలు, మంచి చెడుల విషయంలో తప్పని సరిగా తెలుగు కాలమానం పాటిస్తుంటాం.. ఉగాది నాడు పండితులు పంచాంగ శ్రవణంలో మన రాశి ఫలాలు, గ్రహ స్థితుల ఆధారంగా కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుందో చెబుతారు.
ఇక తెలుగు వారి విషయానికి వచ్చే సరికి ఉగాది నాడు కవి సమ్మేళనాలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కవులు, రచయితలు తాము కొత్తగా చేసిన రచనలు, కవిత్వాలను వినిపిస్తారు.. మన భాషను, సాహిత్యాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడంలో ఈ సమ్మేళనాలు దోహదం చేస్తున్నాయి..

ఉగాది పండుగ సందర్భంగా అందరికీ శుభం, ఆయురారోగ్యాలు, విద్య, జ్ఞాన, సుఖ, సిరి సంపదలు కలగాలని ఆకాంక్షిస్తూ.. మీ క్రాంతి దేవ్ మిత్ర

మన పంచాంగం గురుంచి తెలుసుకుందాం..

 ఉగాది నాడు అందరికీ గుర్తు వచ్చేది పంచాగం.. ఇంగ్లీషు క్యాలెండర్ తో పోలిస్తే మన కాలమానానికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి.. దీని ఆధారంగానే మన పూర్వీకులు చాల స్పష్టంగా కాల గణన చేశారు. మన తెలుగు పంచాంగంలోని కొన్ని విశేషాలను తెలుసుకుందాం..
తెలుగు సంవత్సరాల పేర్లు: 1.ప్రభవ, 2.విభవ, 3.శుక్ల, 4.ప్రమోదూత, 5.ప్రజోత్పత్తి, 6.ఆంగీరస, 7.శ్రీముఖ, 8.భవ, 9.యువ, 10.ధాత, 11.ఈశ్వర, 12.బహుధాన్య, 13.ప్రమాథి, 14.విక్రయ, 15.వృక్ష, 16.చిత్రభాను, 17.స్వభాను, 18.తారణ, 19.పార్థివ, 20.వ్యయ, 21.సర్వజిత్, 22.సర్వధారి, 23.విరోధి, 24.వికృతి, 25.ఖర, 26.నందన, 27.విజయ, 28.జయ, 29.మన్మథ, 30.దుర్ముఖి, 31.హేవలంభి, 32.విలంబి, 33.వికారి, 34.శార్వరి, 35.ప్లవ, 36.శుభకృత్, 37.శోభకృత్, 38.క్రోధి, 39.విశ్వావసు, 40.పరాభవ, 41.ప్లవంగ, 42.కీలక, 43.సౌమ్య, 44.సాధారణ, 45.విరోధికృత్, 46.పరీధావి, 47.ప్రమాదీచ, 48.ఆనంద, 49.రాక్షస, 50.నల, 51.పింగళ, 52.కాళయుక్త, 53.సిద్ధార్థి, 54.రౌద్రి, 55.దుర్మతి, 56.దుందుబి, 57.రుధిరోద్గారి, 58.రక్తాక్షి, 59.క్రోధన, 60.అక్షయ.
ప్రతి సంవత్సరాన్ని రెండు అయనాలుగా విభజించారు.. అవి 1. ఉత్తరాయనం, 2.దక్షిణాయనం. ఉత్తరాయణము: సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినది మొదలు కర్కాటకరాశిలో

ప్రవేశించే వరకు గల కాలము. ఇందులో మొదటి 6 నెలలు ఉంటాయి.
దక్షిణాయణం: కర్కాటకరాశిలో సూర్యుడు ప్రవేశించినది మొదలు మకరరాశిలో
ప్రవేశించు వరకు గల కాలము. ఇందులో తర్వాతి 6 నెలలు ఉంటాయి.
ఆరు ఋతువులు: సంవత్సరాన్ని ఋతువులుగా విభజించారు. అవి... వసంతం, గ్రీష్మం, వర్ష, శరదృతువు, హేమంత, శిశిరం. (రెండు మాసాలు కలిసి ఒక ఋతువు)
12 మాసములు: తెలుగు కాలమానంలో 12 నెలలు ఉన్నాయి. అవి.. 1.చైత్రం, 2.వైశాఖం, 3.జ్యేష్టం, 4.ఆషాడం, 5.శ్రావణ, 6.భాద్రపదం,
7.ఆశ్వయుజం, 8.కార్తీకం, 9.మార్గశిరం, 10.పుష్యం, 11.మాఘం, 12ఫాల్గుణం
కాలాలు: వేసవి కాలం, వర్షా కాలం, చలి కాలం.. 12 నెలలు నాలుగు చొప్పున ఈ మూడు కాలాలకు ఉంటాయి.
పక్షములు: ప్రతి మాసమును కూడా రెండు పక్షాలుగా విభజించారు.. అవి కృష్ణ పక్షం, శుక్ల పక్షం. ఒక్కో పక్షంలో 15 తిథులు (రోజులు) ఉంటాయి. ఇవి పౌర్ణమి, అమావాస్యల మధ్య ఉంటాయి.
తిథులు:  1.పాడ్యమి, 2.విదియ, 3.తదియ, 4.చవితి, 5.పంచమి, 6.షష్టి, 7.సప్తమి, 8.అష్టమి, 9.నవమి, 10.దశమి, 11.ఏకాదశి, 12.ద్వాదశి, 13.త్రయోదశి, 14.చతుర్ధశి, 15.పౌర్ణమి-అమావాస్య
వారాలు: ఒక పక్షానికి రెండు వారాలు. ఒక వారానికి ఏడు రోజులు... అవి 1.ఆది, 2.సోమ, 3.మంగళ, 4.బుధ, 5.గురు, 6.శుక్ర, 7.శని.
ఝాములు: ఒక రోజుకు ఎనిమిది ఝాములు ఉంటాయి. ఒక ఝాము అంటే మూడు గంటలు. ఒక గంటకు 60 నిమిషాలు.
27 కార్తెలు: వీటినే నక్షత్రాలు అంటాం. అవి.. 1.అశ్విని, 2.భరణి, 3. కృత్తిక, 4.రోహిణి, 5.మృగశిర, 6. అర్ద్ర, 7.పునర్వసు, 8.పుష్యమి, 9.ఆశ్లేష, 10.మఖ, 11.పుబ్బ, 12.ఉత్తర, 13.హస్త, 14.చిత్త, 15.స్వాతి, 16.విశాఖ, 17.అనూరాధ, 18.జ్యేష్ఠ, 19.మూల, 20.పూర్వాషాఢ, 21.ఉత్తరాషాఢ, 22.శ్రవణం, 23.ధనిష్ట, 24.శతభిష, 25.పూర్వాభాద్ర, 26.ఉత్తరాభాద్ర, 27.రేవతి..
12 రాశులు: 1.మేషం, 2.వృషభం, 3.మిథునం, 4.కర్కాటకం, 5.సింహం, 6.కన్య, 7.తుల, 8.వృశ్చికం, 9.ధనుస్సు, 10.మకరం, 11. కుంభం, 12.మీనం.
9 గ్రహణాలు: 1,సూర్యుడు, 2.చంద్రుడు, 3.అంగారకుడు(కుజుడు), 4.బుధుడు, 5.బృహస్పతి(గురు), 6.శుక్రుడు, 7.శని, 8.రాహువు, 9.కేతువు
27 యోగాలు:  1.విష్కంభ, 2. ప్రీతి, 3.ఆయుష్మ, 4.సౌభాగ్య, 5.శోభన, 6.అతిగండ, 7.సుకర్మ, 8.ధృతి, 9.శూల, 10.గండ, 11.వృద్ధి, 12.ధ్రువ, 13. వ్యాఘాత, 14.హర్ష, 15.వజ్ర, 16.సిద్ధి, 17.వ్యతీపాత, 18.వరీయో, 19.పరిఘ, 20.శివ, 21.సిద్ధ, 22.సాధ్య, 23.శుభ, 24.శుక్ల, 25. బ్రహ్మ, 26.ఐంద్ర, 27. వైధృతి
11 కరణాలు: 1.బవ, 2.చాలవ. 3.కౌలవ, 4.తైతుల, 5.గరజ, 6.వనజి, 7.భద్ర, 8.శకుని, 9.చతుష్పాతు, 10. నాగవం, 11.కింస్తుఘ్నం

Sunday, March 15, 2015

పీవీకి ఓ న్యాయం.. సింగుకు మరో న్యాయం..

ఇద్దరూ మాజీ ప్రధానులు.. ఇద్దరిదీ ఒకే పార్టీ.. ఇద్దరినీ కేసులు వెంటాడాయి.. కానీ పార్టీ ఇద్దరి విషయంలో వేర్వేరు విధానాలు అవలంభించింది.. ఒకరికి ఒక న్యాయం.. మరొకరికి ఇంకో న్యాయం.. అదే కాంగ్రెస్ నీతి, రీతి, తత్వం..
పాములపర్తి వెంకట నరసింహారావు.. దేశం కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.. పదవీ కాలంలో ఎన్నో కేసులు వెంటాడాయి.. చివరకు అన్నీ వీగిపోయి కడిగిన ముత్యంలా బయట పడ్డారు.. కానీ కాంగ్రెస్ పార్టీ చాలా నరసింహారావు పట్ల అమానుషంగా, అన్యాయంగా వ్యవహరించింది.. చివరకు ఆయన చనిపోతే నివాళ్లర్పించేందుకు ఏఐసీసీ కార్యాలయంలోకి పార్థివ దేహాన్ని అనుమతించలేదు.. దేశ రాజధానిలో పీవీ అంత్యక్రియలకు చోటివ్వలేదు..
డాక్టర్ మన్మోహన్ సింగ్.. అదృష్టం కలిసి వచ్చి అనూహ్యంగా దేశానికి ప్రధానమంత్రి అయిన ఆర్ధిక వేత్త.. పదవిలో ఉన్నప్పుడు జరిగిన కుంభ కోణాలకు ఇప్పుడు కేసులు మొదలయ్యాయి.. ఇంకా న్యాయ స్థానానికి వెళ్లలేదు.. కానీ కాంగ్రెస్ పార్టీ అండగా నిలచింది.. ఏ తప్పూ చేయలేదంటోంది (మరి చేయించిన వారెవరో?) పార్టీ అధ్యక్షురాలు ఏకంగా పాదయాత్ర చేసి ఆయన ఇంటికి వెళ్లి సంఘీభావం ప్రకటించేసింది..
ఎంత తేడా?.. ఎంత వివక్ష?.. ఎందుకిలా?.. ఏమిటీ ద్వంద్వ నీతి?
ఎమ్మెల్యే స్థాయి నుండి ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి పదవుల దాకా పని చేసి చేసిన పీవీ నరసింహారావు రాజకీయాలు చాలించి ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చేద్దామని మూటా, ముల్లె సర్దుకున్నాడు.. అంతలో రాజీవ్ గాంధీ మరణించారు.. ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ నేతలు అనూహ్యంగా ఆయనను ప్రధానమంత్రి పదవికి ఎన్నుకున్నారు.. రాజనీతి కోవిదుడైన పీవీ దేశాన్ని ఆర్ధిక సమస్యల నుండి గట్టెక్కించారు. కానీ ఆయన చేసిన పాపం ఒకటే.. సోనియా గాందీ కోటరీకి విధేయంగా నడచుకోకపోవడం.. స్వతంత్రంగా వ్యవహరించిన ఆయనపై పగబట్టారంతా? ఎన్నికల్లో పార్టీ ఓటమితో పక్కకు నెట్టేశారు.. జీవితాంతం కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన పెద్దాయన చివరకు అనామకుడైపోయాడు.. పదవిలో ఉన్నప్పుడు విధేయంగా మెలిగిన వారంతా చివరి రోజుల్లో పట్టించుకోకుండా ఆయన మానాన ఆయనను వదిలేశాడు..
పీవీ క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా పని చేసిన మన్మోహన్ సింగ్ కూడా అనుకోకుండానే అదృష్టవంతుడయ్యాడు.. అయితే ఈయన పరిస్థితి వేరు.. ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వచ్చేసరికి సోనియా గాంధీకి విదేశీయత శాపంగా మారింది.. తనయునికి రాజకీయ ఓనమాలు వంట బట్టలేదు( ఇప్పటికీ కూడా).. పార్టీలో ప్రణబ్ ముఖర్జీ లాంటి సీనియర్లు ఉన్నా ఎక్కడ పుట్టి ముంచుతారో అనే భయం.. అలా అమ్మగారి దృష్టి మన్మోహన్ సింగ్ పై పడింది.. అలా ప్రధానమంత్రి అయి కూర్చున్న ఈ మౌనీ బాబా అమ్మగారికి విధేయత ప్రదర్శించడంలో రెచ్చిపోయాడు.. ఎంతలా అంటే ఏ ఫైలులో ఏం జరుగుతుందో తెలియనంతగా.. కళ్లకు గంతు కట్టినట్లుగా పెట్టమన్న చోటల్లా సంతకాలు పెట్టేశాడు. చివరకు ఇరుక్కు పోయాడు.. నిలువునా కుంభకోణాల్లో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది..  అయినా సింగు గారికి ఢోకా లేదు..

పీవీకి ఓ న్యాయం.. సింగుకు మరో న్యాయం.. అదే సోనియా మార్క్ రాజకీయం..

Saturday, March 14, 2015

మీకు జీతాలా నాయనా?

ప్రజా ప్రతినిధి అంటే ప్రజల సమస్యల పరిష్కారం కోసం పని చేయాలి.. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి ప్రజల్లో ఒక భాగమే.. వార్డు సభ్యుని మొదలు ఎమ్మెల్యే, ఏంపీలైనా, మంత్రులు,సీఎం, పీఎంలైనా ప్రజల్లోని వారే.. వీరు ప్రజల తరపున పని చేస్తున్నందుకు గౌరవ వేతనం ఇస్తారు.. అది జీతం కాదు. వీరందరికీ సొంతంగా జీవనోపాధి మార్గాలు ఉంటాయి.. లేవంటే వారి చేతగానితనమే. సూటిగా చెప్పాలంటే భార్యా పిల్లలను, కుటుంబాన్ని సొంత రెక్కల కష్టంపై పోషించలేని వారు సోమరిపోతులే.. ప్రజాప్రతినిధులుగా వారు అనర్హులు.. సొంత బరువు బాధ్యతలు తెలిస్తేనే కదా వారికి సమాజం కష్టాలు తెలిసేది.. దేశ, సమాజ హితం కోసం కుటుంబ జీవితాలను త్యాగం చేసే వారి విషయం వేరు..
ఇటీవలి కాలంలో ప్రజాప్రతినిధుల వేతనాలు గణనీయంగా పెంచేసుకోవడం సిగ్గు చేటైన విషయం. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని రాజకీయ కోణంలో చూసి అడ్డుకునే రాజకీయ పార్టీలు తమకు లాభదాయకంగా ఉన్న ఈ విషయంలో చూసీ చూడనట్లుగా ఉంటున్నాయి.. అలా అని కూడా అనలేం గట్టిగా సమర్ధించుకుంటున్నాయి.. ఇప్పుడున్న ప్రజాప్రతినిధుల్లో ఎంత మంది నిజాయితీగా పని చేస్తున్నారు? ఆమ్యామ్యాలు లేకుండా ఏపనైనా చేస్తారా? నిజానికి నిజాయితీగా పని చేసే ఏ ప్రజాప్రతినిధి కూడా తమ జీత భత్యాల గురుంచి పెద్దగా పట్టించుకోరు.. వారి దృష్టి ప్రజల సంక్షేమంపైనే ఉంటుంది.. ఉన్నంతలో సర్దుకునే తత్వం వారిది..

వారి గౌరవ వేతనాలు పెంచుకుంటే ఎవరికీ పెద్ద అభ్యంతరం లేదు.. కానీ సమాజంలో జీవన ప్రమాణాలు అదే స్థాయిలో ఉన్నాయా అనే విషయం కూడా అలోచించాలి. ప్రయివేటు రంగ ప్రాధాన్యత పెరిగాక ఎవరికీ ఉద్యోగ భద్రత లేదు.. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు గణనీయంగా పెరిగిపోతుంటే, ప్రయివేటు ఉద్యోగుల జీతాలు అత్తెసరుగానే ఉన్నాయి.. పైగా కోతలు.. ఎప్పుడు జీతాలు  చేతికొస్తాయో తెలియదు.. కింది స్థాయి ఉద్యోగుల జీవితాలు మరీ దారుణం.. ఈ విషయంలో ఎప్పుడైనా ప్రభుత్వాలు దృష్టి పెట్టాయా? నిజాయితీ గుండెలపై చేయి వేసి ఆలోచించండి.. ఆ తర్వాతే మీ జీత భత్యాలు పెంచుకునే విషయాన్ని పరిశీలించుకోండి..

Monday, March 9, 2015

కచ్చతీవు కథ.. భారత జాలర్ల వ్యధ..

కొన్ని అనాలోచిత నిర్ణయాలు భవిష్యత్తులో వివాదాలకు తావు తీస్తాయి.. కుటుంబ పెద్ద ముందు చూపు లేకుండా వీలునామా రాయడం వల్ల వారసులు కొట్టుకుచావడం చూస్తూనే ఉన్నాం.. అదే పని దేశాధినేతలు చేస్తే?.. ఇప్పడు కచ్చతీవు విషయంలో జరిగింది అదే..
భారత జాలర్లు తమ సముద్రర జలాల పరిధిలోకి వస్తే చాల్చిచంపే హక్కు తమకు ఉందన్నాడు శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమ సింఘే.. భారత ప్రధాని నరేంద్ర మోదీ కొద్ది రోజుల్లో శ్రీలంక పర్యటనకు వెళతారనగా ఆయనీ ప్రకటన చేయడం ఇరు దేశాల సంబంధాలను ఇబ్బందుల్లోకి నెట్టింది.. అసలేమిటీ వివాదం? తెలుసుకోవాలంటే కచ్చతీవు కథలోకి వెళ్లాల్సిందే..
భారత్ శ్రీలంకల మధ్య సముద్రంలో ఉన్న దీవి కచ్చతీవు.. కేవలం 285 ఎకరాల విస్తీర్ణంలో ఒక మైలు పొడవు, 300 గజాల వెడల్పు ఉన్న చిన్న దీవి ఇది.. తమిళనాడుకు చెందిన భారత జాలర్లు సముద్రంలో వేటకు వెళ్లినప్పుడు సేద తీరడానికి, వలలు ఆరబెట్టుకొని బస చేసేందుకు ఉపయోగ పడేది కచ్చతీవు.. ఈ దీవి చుట్టూ అపారమైన రొయ్యల సంపద కూడా ఉంది. కచ్చతీవులో ఓ చర్చి కూడా నిర్మించారు.. ఇలాంటి  దీవి మీద శ్రీలంక కన్ను పడింది. రక్షణ సంబంధమైన కారణాలు చూపి కచ్చతీవును ఇవ్వాలని భారత్ ను కోరింది.. తండ్రి లాగే ప్రపంచ నాయకురాలిగా గుర్తింపు పొందాలని తహతహలాడే నాటి భారత ప్రధాని ఇందిర గాంధీ, ఉదారంగా కచ్చతీవును లంకకు ఇచ్చేసింది.. వద్దు వద్దు అంటూ భారత జాలర్లు, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మొత్తుకుంటున్నా ఇందిర పరిగణనలోకి తీసుకోలేదు.. ఇది 1974లో జరిగింది..
కచ్చతీవు తమ పరిధిలోకి వచ్చినా భారత జాలర్లు, చర్చికి వచ్చే యాత్రికులు యధాతథంగా రవచ్చంటూ శ్రీలంక నమ్మబలికింది. అయితే 1976లో ఇరు దేశాల మధ్య కుదిరిన మన్నార్ జలసంధి ఒప్పందం పరిస్థితి సంక్లిష్టంగా మార్చింది. శ్రీలంకలో ఎల్.టీ.టీ.ఈ. సాయుధపోరాటం ప్రారంభించే సరికి కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి. జాలర్ల ముసుగులో సముద్ర జలాల్లో తీవ్రవాదులు సంచరిస్తున్నారనే కారణంలో లంక నావికాదళం ఆంక్షలు ప్రారంభించింది. భారత జాలర్లు ఆ ప్రాంతంలో కనిపిస్తే కాల్చి చంపడం, అదుపులోకి తీసుకోవడం మొదలైంది..

ఈ సమస్యలన్నింటికీ కారణం కచ్చతీవును ముందు చూపులేకుండా శ్రీలంకకు దారాదత్తం చేయడమే.. సముద్రంలో చేపల వేటలకు వెళ్లే భారత జాలర్లది జీవన్మరణ సమస్య.. సంక్లిష్టంగా మారిన సరిహద్దుల కారణంగా సముద్ర జలాల్లో అడపా దడపా అట్టు ఇటుగా వెళ్లడం సహజం.. కానీ శ్రీలంక నావికాదళం క్రూరంగా వ్యవహరిస్తోంది.. ప్రధాని మోదీ శ్రీలంక పర్యటనలో ఈ సమస్య కూడా ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.. గతంలో జరిగిన పొరపాటును సరిదిద్దిలేకపోయినా లంక ప్రభుత్వ వైఖరిలో కొంత మార్పయినా వస్తే అదే మన జాలర్లకు శ్రీరామ రక్ష..