Sunday, March 8, 2015

ప్రతి రోజూ మహిళల దినోత్సవం కాదా?..

యత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర రమన్తి దేవతాః.. భారత దేశంలో మహిళల స్థానాన్ని మన పెద్దలు ఆనాడే స్పష్టంగా చెప్పారు.. ప్రాచీన భారతీయ సమాజం స్త్రీకి గౌరవనీయ స్థానం ఇచ్చింది.. శక్తి స్వరూపిణులుగా, మాతృ మూర్తులుగా పూజించింది.. పార్వతీ దేవి (దుర్గ)ని శక్తికి, లక్ష్మీదేవిని సంపదకు, సరస్వతి మాతను విద్యకు ప్రతిరూపంగా కొలుస్తున్నాం.. మన దేశం భారత దేశాన్ని భారత మాతగా పూజిస్తాం. వైదిక యుగంలో స్త్రీ, పురుషుల మధ్య తేడాలు లేవు.. చదువు, శక్తి సామర్ధ్యాల్లోనూ సమానత్వమే ఉండేది.. స్త్రీకి నచ్చిన వారిని వివాహమాడే స్వేచ్ఛ కూడా ఉండేది. స్వయంవరాలు ఈ కోవలోనివే.. మన చరిత్రలో రాణి రుద్రమ దేవి, ఝాన్సీ లక్ష్మీభాయి, చెన్నమ్మ లాంటి శక్తిశాలురులైన మహిళా మూర్తులు కనిపిస్తారు..
దురదృష్టవశాత్తు విదేశీయుల దండయాత్రలు ప్రారంభమయ్యాక మన దేశంలో అనాచారాలు, మూఢ నమ్మకాలు వచ్చాయి. వివక్షకు బీజం అక్కడే పడింది.. బాల్య వివాహాలు, వరకట్నం, ఆడ పిల్లలను చదువుకు దూరంగా ఉంచడం, వారిని ఇంటికే పరిమితం చేయడం, పరదా పద్దతి లాంటి దురాచారాలు ప్రవేశించాయి.. మధ్య యుగంలో తీవ్ర రూపం దాల్చిన ఈ పరిణామం ఆధునిక కాలంలోనూ కొనసాగడం దురదృష్టకరం.. అయినా రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీభాయి, చెన్నమ్మ తదితర మహిళా మూర్తులు తమ తెగువ చూపించారు.
ఈ రోజున మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు.  విద్య, ఉపాది అవకాశాల్లో స్త్రీ పురుషులు పోటీ పడుతున్నారు.. మన రాజ్యాంగం అందరికీ సమాన అవకాశాలు ఇచ్చింది.. రాజకీయ, పరిపాలన, ఆర్థిక రంగాల్లో ఎందరో మహిళలు ఉన్నత స్థానంలో ఉన్నారు.. కానీ ఇవన్నీ పైపై మెరుగులేనా అనే బాధ కలుగుతోంది.. ఏ పత్రిక చూసినా, ఏ ఛానల్ మార్చినా లింగ వివక్షకు ఇంకా తెర పడలేదా అనే బాధ కలుగుతోంది.. మహిళలపై అత్యాచారాల వార్తలే ప్రముఖంగా కనిపించడం దురదృష్టకరం..
మనం ఎంత ఆధునికంగా మారుతున్నామనుకుంటున్నా మన మనస్థత్వాల్లో మార్పు రాలేదు.. ఇంకా అనాగరికులమేనా అనిపిస్తోంది.. పాశ్యాత్య సంస్కృతి ప్రభావంతో  స్త్రీని భోగ వస్తువుగానే చూపిస్తోంది మన మీడియా.. వారు చూపిస్తున్నారో, మనం చూస్తున్నామా అనే చర్చ ఇక్కడ అప్రస్తుతం.. సినిమాలు, టీవీలు, పత్రికల్లో కనిపించే దృశ్యాలను ఎలా అర్థం చేసుకోవాలి.. మన పిల్లలకు, యువతకు ఏం సందేశం ఇస్తున్నాం.. కట్టు, బొట్టు విషయంలో కామెంట్స్ చేయడంలో అర్థం లేదు.. పురుషుల వస్త్ర ధారణ మారినట్లుగానే మహిళల విషయంలోనూ అర్థం చేసుకోగలం.. కానీ కాస్త గౌరవ ప్రదంగా ఉండటం ముఖ్యం..
మహిళకు గౌరవం, ప్రాధామ్యం, హక్కుల విషయంలో వారు పోరాడి సాధించుకోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది.. ఈ విషయంలో మనం ఆత్మ విమర్శ చేసుకోవాలి.. మార్పు అనేది ఎక్కడో మొదలవదు.. మన ఇంటి నుండే మార్పు రావాలి.. మన ఆలోచనా విధానం మారాలి.. తమ ఇంట్లోని మహిళా మూర్తులను గౌరవించాలి.. మన పిల్లలను వివక్ష లేకుండా పెంచాలి.. బాలురతో సమానంగా బాలికలనూ చదివించాలి.. వారి స్వశక్తిపై ఎదిగేందుకు ప్రోత్సహించాలి..

దినాలు జరుపుకోవడం మన సంస్కృతి కాదు.. అందునా మహిళల కోసం ప్రత్యేక దినం అర్థం లేనిది.. ఒక్క మార్చి 8వ తేదీ నాడే మహిళా దినోత్సవం ఎందుకు? ప్రతి రోజూ ఎందుకు జరుపుకోకూడదు?

No comments:

Post a Comment