Monday, March 9, 2015

కచ్చతీవు కథ.. భారత జాలర్ల వ్యధ..

కొన్ని అనాలోచిత నిర్ణయాలు భవిష్యత్తులో వివాదాలకు తావు తీస్తాయి.. కుటుంబ పెద్ద ముందు చూపు లేకుండా వీలునామా రాయడం వల్ల వారసులు కొట్టుకుచావడం చూస్తూనే ఉన్నాం.. అదే పని దేశాధినేతలు చేస్తే?.. ఇప్పడు కచ్చతీవు విషయంలో జరిగింది అదే..
భారత జాలర్లు తమ సముద్రర జలాల పరిధిలోకి వస్తే చాల్చిచంపే హక్కు తమకు ఉందన్నాడు శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమ సింఘే.. భారత ప్రధాని నరేంద్ర మోదీ కొద్ది రోజుల్లో శ్రీలంక పర్యటనకు వెళతారనగా ఆయనీ ప్రకటన చేయడం ఇరు దేశాల సంబంధాలను ఇబ్బందుల్లోకి నెట్టింది.. అసలేమిటీ వివాదం? తెలుసుకోవాలంటే కచ్చతీవు కథలోకి వెళ్లాల్సిందే..
భారత్ శ్రీలంకల మధ్య సముద్రంలో ఉన్న దీవి కచ్చతీవు.. కేవలం 285 ఎకరాల విస్తీర్ణంలో ఒక మైలు పొడవు, 300 గజాల వెడల్పు ఉన్న చిన్న దీవి ఇది.. తమిళనాడుకు చెందిన భారత జాలర్లు సముద్రంలో వేటకు వెళ్లినప్పుడు సేద తీరడానికి, వలలు ఆరబెట్టుకొని బస చేసేందుకు ఉపయోగ పడేది కచ్చతీవు.. ఈ దీవి చుట్టూ అపారమైన రొయ్యల సంపద కూడా ఉంది. కచ్చతీవులో ఓ చర్చి కూడా నిర్మించారు.. ఇలాంటి  దీవి మీద శ్రీలంక కన్ను పడింది. రక్షణ సంబంధమైన కారణాలు చూపి కచ్చతీవును ఇవ్వాలని భారత్ ను కోరింది.. తండ్రి లాగే ప్రపంచ నాయకురాలిగా గుర్తింపు పొందాలని తహతహలాడే నాటి భారత ప్రధాని ఇందిర గాంధీ, ఉదారంగా కచ్చతీవును లంకకు ఇచ్చేసింది.. వద్దు వద్దు అంటూ భారత జాలర్లు, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మొత్తుకుంటున్నా ఇందిర పరిగణనలోకి తీసుకోలేదు.. ఇది 1974లో జరిగింది..
కచ్చతీవు తమ పరిధిలోకి వచ్చినా భారత జాలర్లు, చర్చికి వచ్చే యాత్రికులు యధాతథంగా రవచ్చంటూ శ్రీలంక నమ్మబలికింది. అయితే 1976లో ఇరు దేశాల మధ్య కుదిరిన మన్నార్ జలసంధి ఒప్పందం పరిస్థితి సంక్లిష్టంగా మార్చింది. శ్రీలంకలో ఎల్.టీ.టీ.ఈ. సాయుధపోరాటం ప్రారంభించే సరికి కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి. జాలర్ల ముసుగులో సముద్ర జలాల్లో తీవ్రవాదులు సంచరిస్తున్నారనే కారణంలో లంక నావికాదళం ఆంక్షలు ప్రారంభించింది. భారత జాలర్లు ఆ ప్రాంతంలో కనిపిస్తే కాల్చి చంపడం, అదుపులోకి తీసుకోవడం మొదలైంది..

ఈ సమస్యలన్నింటికీ కారణం కచ్చతీవును ముందు చూపులేకుండా శ్రీలంకకు దారాదత్తం చేయడమే.. సముద్రంలో చేపల వేటలకు వెళ్లే భారత జాలర్లది జీవన్మరణ సమస్య.. సంక్లిష్టంగా మారిన సరిహద్దుల కారణంగా సముద్ర జలాల్లో అడపా దడపా అట్టు ఇటుగా వెళ్లడం సహజం.. కానీ శ్రీలంక నావికాదళం క్రూరంగా వ్యవహరిస్తోంది.. ప్రధాని మోదీ శ్రీలంక పర్యటనలో ఈ సమస్య కూడా ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.. గతంలో జరిగిన పొరపాటును సరిదిద్దిలేకపోయినా లంక ప్రభుత్వ వైఖరిలో కొంత మార్పయినా వస్తే అదే మన జాలర్లకు శ్రీరామ రక్ష..

No comments:

Post a Comment