Monday, September 29, 2014

ఒక అమెరికా.. ఇద్దరు నరేంద్రులు

121 సంవత్సరాల క్రితం అమెరికాలోని షికాగో నగరంలో భారత దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడో నరేంద్రుడు... ఇన్నాళ్ల తర్వాత అదే అమెరికా గడ్డపై న్యూయార్క్ లో ఈ శతాబ్దం భారత దేశానిదేనని ప్రకటించారు మరో నరేంద్రుడు.. యాదృచ్చిరంగా ఇద్దరి పేర్లు ఒకటే.. నెలలు కూడా సెప్టెంబరే..

1893వ సంవత్సరంలో జరిగిన షికాగో సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద చేసిన ప్రసంగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.. అమెరిక్లను అత్యంత ఆకట్టుకున్న తొలి భారతీయడు స్వామీజీయే.. మహాత్మా గాంధీ సత్యం, అహింస సిద్దాంతాలు మార్టిన్ లూథర్ కింగ్ లాంటి యోధులకు స్పూర్తిని ఇచ్చాయి.. కానీ గాంధీజీ తన జీవిత కాలంలో అమెరికా వెళ్లేకపోయారు.. ఇన్నాళ్లకు ఆ ఘనత నరేంద్ర మోదీకి దక్కడం భారతీయులందరికీ గర్వకారణం..

14 ఏళ్ల క్రితం తమ దేశానికి రాకుండా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీకి వీసాను నిరాకరించింది అమెరికా.. కానీ అదే మోదీ ఇప్పుడు భారతీయులంతా అఖండ మెజారిటీతో ఎన్నుకున్న ప్రధానమంత్రి.. భారతీయుల ప్రియతమ నాయకున్ని ఇక ఎలా అడ్డుకోగలదు అమెరికా?.. అమెరికా గడ్డపై ఇప్పటి వరకూ ఏ విదేశీ నాయకునికి లభించనంత ప్రజాధరణ నరేంద్ర మోదీకి లభించిందంటున్నారు విశ్లేషకులు.. ప్రవాస భారతీయులు మోదీకి బ్రహ్మరథం పట్టారు.. మోదీ బస చేసిన హాటల్ దగ్గర, ఆయన ప్రసంగించిన మాడిసన్ స్క్వేర్ దగ్గర వేలాదిగా తరలి వచ్చిన ప్రవాస భారతీయులను కంట్రోల్ చేయడానికి అమెరికన్ పోలీసులకు తల ప్రాణం తోకకు వచ్చిందట..

Sunday, September 28, 2014

చెలి మాయలో పడి..

ఆడంబరాలే అమ్మగారి కొంప ముంచాయి.. స్నేహితురాలు శశికళ మాయలో పడి అవినీతి సొమ్మతో విలాసంగా జీవిద్దామనుకున్నారు.. నగలు, ఆస్తులు, అట్టహాసంగా ప్రదర్శించారు.. దత్త కుమారుని వివాహాన్ని ఎంతో అట్టహాసంగా జరిపించారు.. అందుకే ప్రత్యర్థుల కన్ను కుట్టింది.. చేతులు కాలాక ఆకులు పట్టుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది..
ఎవరైనా దొరికనంత వరకే దొరలు.. దొరికాక దొంగలే.. చేసుకున్నంత వారికి చేసుకున్నంత.. పాపం జయమ్మ..

స్వామికి చిక్కితే అంతే,,

అవి ఎమర్జెన్సీ రోజులు.. ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ప్రతిపక్ష నాయకులందరినీ జైలుకు పంపింది.. కానీ ఓ కీలక పార్లమెంట్ సభ్యుడు మాత్రం దొరకలేదు.. అప్పటికే విదేశాలకు వెళ్లిపోయాడు.. పార్లమెంట్ సమావేశాలు ప్రతిపక్షం లేకుండానే సాగుతున్నాయి..
ఒక శుభోదయాన ఒక వ్యక్తి ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగాడు.. నేరుగా పార్లమెంట్ వెళ్లాడు.. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రశ్న వేశారు.. అందరూ ఆశ్చర్యంగా చూశారు.. ఓహ్ సుబ్రహ్మణ్య స్వామి.. ప్రభుత్వం అలర్ట్ అయింది.. ఆయనను అరెస్ట్ చేయడానికి ఆదేశాలు జారీ అయ్యాయి.. కానీ మన చిక్కడూ దొరకడు గారు నేరుగా మళ్లీ ఎయిర్ పోర్ట్ వెళ్లి ఫ్లైట్ ఎక్కేశారు.. ఇక ఎవరికీ చిక్కలేదు..
సుబ్రహ్మణ్య స్వామి.. జాతీయ భావాలు ఉన్న వ్యక్తి.. గణితం, న్యాయ శాస్త్రాల్లో దిట్ట.. హార్వార్డ్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేసి అదే వర్సిటీకి అసోసియేట్ ఫ్రొఫెసర్ అయ్యారు.. స్వామి సర్వోదయ ఉద్యమం ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు.. భారతీయ జన సంఘ్ లో చేరారు.. జన సంఘ్ ఎమర్జెన్సీ తర్వాత జనతా పార్టీలో కలిసిపోయాక, అదే పార్టీలో కొనసాగారు.. కేంద్ర మంత్రిగా సేవలు అందించారు.. గత ఏడాది జనతా పార్టీని బీజేపీలో విలీనం చేశారు.. స్వామి మొదటి నుండి ఎవరికీ అంతు చిక్కని నాయకుడు.. పార్టీల్లో ఇమడలేని స్వతంత్ర వ్యక్తిత్వం..

సుబ్రహ్మణ్య స్వామి బహుముఖ ప్రజ్ఞాశాలి. రాజకీయ నాయకునిగా, ఆర్థికవేత్తగా, అధ్యాపకునిగా, రచయితగా ఏక కాలంలో పని చేయడం ఆయనకే చెల్లింది.. స్వామికి అవినీతి పరులంటే మంట.. ఆయన దృష్టిలో పడితే ఎంత గొప్పవారైనా న్యాయ స్థానాలకు లాగి ఓ ఆటాడేస్తాడు.. అందుకే మన నాయకులు ఆయనతో పెట్టుకోవాలంటే భయపడి చస్తారు.. పాపం జయలలిత ఆయన బారిన పడింది ఏమి చేస్తాం.. తమిళ రాజకీయాలను అవినీతిమయం చేసిన జయ, కరుణలను ఏకకాలంలో మూడు చెరువుల నీరు తాగిస్తున్నారు స్వామి.. 2జీ స్పెక్ట్రమ్ కేసు కూపీ లాగి డీఎంకే కరుణానిధి సతీమణి దయాళు అమ్మాల్, కూతురు కణిమొళి, మారన్ సోదరులు, రాజా తదితరులను ఒకాట ఆడుకున్నాడు.. ఈ ఒకే ఒక్కడు మున్ముందు ఇంకేం చేస్తాడో చూడాలి..

Saturday, September 27, 2014

ఇవాళ జయమ్మ.. మరి రేపు?

చేసుకున్నవారికి చేసుకున్నఅంటారు.. జయమ్మ కథ కూడా ఇంతే..
సమాజమే దేవలం అయితే సామాన్యుడే దేవుడు.. ప్రజాస్వామ్య ఆలయంలో దేవుళ్లయిన ప్రజల సొమ్ముకు పాలకులు ధర్మకర్తగా ఉండాలి.. మరి ధర్మకర్తే ధర్మం తప్పితే.. అందుకు మూల్యం చెల్లించక తప్పదు జయలలిత మాదిరిగా..

జయలలిత తమిళనాట తిరుగులేని ప్రజాధరణ ఉన్న నాయకురాలు.. ఇందులో అనుమానం లేదు.. అభిమానులు ఆమెను పురచ్చి తలైవిగా కొలుస్తారు.. వారి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభించిన జయ, ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయేందుకు వినూత్న పథకాలు ప్రారంభించారు.. అమ్మ క్యాంటీన్లు, అమ్మ ఉప్పు మొదలుకొని నిన్న అమ్మ సిమెంట్ కూడా వచ్చేంది.. కానీ ఇన్ని చేసినా గతంలో చేసిన పాపం వెంటాడుతూనే ఉండి.. చివరకు ప్రజాక్షేత్రానికి పదేళ్ల పాటు దూరంగా ఉండాల్సిన కర్మ పట్టింది.. అక్రమ ఆస్తుల కేసు విచారణ 18 ఏళ్ల పాటు కోర్టుల్లో కొనసాగింది.. చివరకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా పడింది.. ముఖ్యమంత్రి పదవికి ఎసరు వచ్చేసింది..
మంచి పనులు చేసి ప్రజాభిమానం సంపాదించ వచ్చు గాక.. కానీ ఈ ముసుగులో శిక్షను తప్పించుకోజాలరు.. ఇది తమిళనాడు మాత్రమే కాదు, యావద్దేశానికీ, తెలుగు రాష్ట్రాలకూ వర్తిస్తుంది.. ఇవాళ జయలలిత జైలుకు వెళ్లింది.. అంత మాత్రాన కరుణానిధి పవిత్రడైపోరు.. ఆయన్ని, ఆయన కుటుంబ సభ్యులను, పార్టీ నాయకులను ఎన్నో కేసులు వెంటాడుతున్నాయి.. ఇత మన రాష్ట్రం సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..
మొత్తానికి జయలలిత ఎపిసోడ్ రాజకీయ నాయకులందరికీ గుణపాఠం కావాలి..

Thursday, September 25, 2014

మంగళ్ యాన్ ఖర్చు ఆటో ఛార్జీ కన్నా చవకట..

మంగళ్ యాన్ విజయవంతం అయిన సందర్భంగా ఒక మిత్రుడు వాట్స్ అప్ లో ఇలా పెట్టాడు..
Mangalayan
〰〰〰〰〰〰〰〰
Distance :68 crore KMS.
Cost: 454 crore Rupees
So its Rs 6.67 per km which is less than Hyderabad Auto Rickshaw charge per km

దీన్ దయాళ్జీని స్మరించుకుందాం..


వ్యక్తుల జీవితం మరణంతోనే అంతం.. కానీ మహనీయులు భౌతికంగా లేకపోయినా అందరి హృదయాల్లో చిరస్తాయిగా జీవించే ఉంటారు..
పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఈ కోవకు చెందిన వారే.. భారతీయ జనసంఘ్ ద్వితీయ అధ్యక్షులు దీన్ దయాళ్జీ జీవితం అందరికీ ఆదర్శప్రాయం.. ప్రతి శ్వాసలోనూ దేశ సేవ కోసమే అన్నట్లుగా పని చేసిన మహనీయుడాయన.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ద్వారా దేశ సేవను ఆరభించారు.. జనసంఘ్ వ్యవస్థాపక సభ్యుడైన దీన్ దయాళ్ జీ, శ్యామ ప్రసాద్ ముఖర్జీ తర్వాత అధ్యక్షునిగా పని చేశారు.. ఏకాత్మతా మానవతావాద సిద్దాంతాన్ని సమాజానికి అందించారు.. ఎదిగిన కొద్దీ ఎలా ఒదిగి ఉండాల్లో ఆచరించి చూపించారు.. నిరాడంబరంగా జీవించారు.. చిన్న వయసులోనే హత్యకు గురయ్యారు.. దీన్ దయాళ్జీ జీవించి ఉంటే భారత రాజకీయ పటం మరోలా ఉండేది..
పండిత దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి నేడు..ఆ మహనీయున్ని స్మరించుకుందాం..

శుభోదయం.. దేవీ నవరాత్రులు ఆరంభమవుతున్న వేళ అందరికీ శుభాకాంక్షలు..


విజ్ఞాన్ కీ జయ్..

భారత దేశం నిజంగా చరిత్రను సృష్టించింది.. అసాధ్యం అనుకున్నదాన్ని సుసాధ్యం చేసి చూపింది..
అమెరికా, రష్యాలు గ్రహంపై ఉపగ్రమాన్ని పంపేందుకు ఎన్నో ప్రయోగాలు చేస్తే కానీ సాధ్యం కాలేదు.. చైనా, జపాన్ దేశాలు విఫలమైపోయాయి.. కానీ భారత్ మాత్రం తొలి ప్రయత్నంలోనే అంగారక గ్రహంపై జెండా ఎగురవేసింది.. మంగళ్ యాన్ విజయవంతం అయింది.. ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన విషయం ఇది..  ఇది భారతీయ శాస్త్రవేత్తల కృషి ఫలితం.. మనమంతా వారికి సెల్యూట్ చేయాల్సిందే..

జై విజ్ఞాన్ అంటూ సగర్వంగా నినదిద్దాం.. 

Tuesday, September 23, 2014

బతుకు అమ్మా.. బతకవమ్మా.. బతుకమ్మ అయింది.

తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు మొదలయ్యాయి.. పల్లె, పట్నం, వీధి, గుడి అంతటా బతుకమ్మ పాటలు, ఆటలు వినిపిస్తున్నాయి.. రంగు రంగుల పూలతో త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ పాడే బతుకమ్మ పాటలను, ఆటనూ విని, చూసి తరించాల్సిందే కానీ వర్ణించడం కష్టమే.. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. ఇలా దేని ప్రత్యేకత దానిదే.. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు.. 
ఇంతకీ బతుకమ్మ పాటల్లో ఏమి ఉంటుంది?.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు మేళవిస్తారు.. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి.. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ.. తెలంగాణ అస్థిత్వం బతుకమ్మలోనే ఉంది..
తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు.. ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.. నవాబులు, భూస్వాముల పెత్తందారీ తనంలో నలిగిపోయిన తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి.. వారి అకృత్యాలకు నలిగిపోయిన వారిని, తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నవారిని తలచుకొని తోటి మహిళలు విచారించేవారు.. వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకవమ్మా లేదా బతుకు అమ్మా అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. పాటల వెనుక ఉండే మర్మం ఇదే..
మరో కథనం ప్రకారం ధర్మాంగదుడనే రాజు సంతానం కోసం చేసిన పూజల వల్ల ఆడ కూతురు జన్మించింది.. లేక లేక పుట్టిన ఆ బిడ్డకు బాలా రిష్టాలు గట్టెక్కేందుకు బతుకమ్మా అనే పేరు పెట్టారట.. గ్రామాల్లో ఇంకా ఎన్నో రకాల గాథలు ప్రచారంలో ఉన్నాయి.. ఏ కథనం ఎలా ఉన్నా బతుకమ్మ అంటే బతుకు మెరుగు పరిచే అమ్మ అని చెప్పవచ్చు.. గ్రామీణ మహిళలు లక్ష్మి, పార్వతి దేవతలను బతుకమ్మల రూపంలో కొలుస్తారు.. మొదట గ్రామ సీమలకే పరిమితమైన ఈ పండుగ, అక్కడి నుండి వలస వచ్చే వారితో పట్నాలలోనూ మొదలైంది.. ఒకనాడు గ్రామాలుగా ఉన్న ప్రాంతాలు నగరాలుగా మారినా ఈ సాంస్కృతిక పరంపర కొనసాగుతూ వచ్చింది..
బతుకమ్మ వెనుక సుఖ సంతోషాలే కాదు.. విషాదాలూ ఉన్నాయి.. అసఫ్ జాహీల పాలనలో ముఖ్యంగా చివరి నిజాం నవాబు కాలంలో మహిళలపై రజాకార్ల దాష్టీకాలు కొనసాగాయి.. బీబీనగర్ తదితర ప్రాంతాల్లో ఈ రక్తపిపాసులు మహిళలను నగ్నంగా బతుకమ్మ ఆడించి వారి రహస్యావయాలపై కర్రలతో మోదిన ఘటనలను వినవచ్చు.. తెలంగాణ వ్యాప్తంగా ఇలాంటి విచార గాథలను ఇప్పటికీ బతికే ఉన్న ఆనాటి తరం పెద్ద వారు చెబుతుంతారు..
తెలంగాణ అస్థిత్వం, పోరాటం, తెలంగాణ ఉద్యమం పుణ్యమా అని ఈ రోజున బతుకమ్మ ప్రపంచ వ్యాప్తమైపోయింది.. గత కొన్ని సంవత్సరాలుగా అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లో ఉన్న తెలంగాణ వాసులు, ఆంధ్ర, రాయలసీమ ప్రాంత తెలుగు వారు సైతం బతుకమ్మ సంబురాలను జరుపుకుంటున్నారు.. విదేశాల్లో తెలుగువారి ఐక్యతకు బతుకమ్మ సైతం ప్రతీకగా నిలిచింది.. సీమాంధ్రలో సాగిన సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో అక్కడి మహిళలు కూడా బతుకమ్మ ఆడి కలిసి ఉందాం అనే సందేశాన్ని వినిపించారు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరుణంలో బతుకమ్మ పండుగకు ప్రాధాన్యత మరింతగా పెరిగిపోయింది..

Sunday, September 21, 2014

అమ్మ పెట్టదు.. అడుక్కు తిననీయదు..


కొద్ది వారాల క్రితం హైదరాబాద్ పాతబస్తీలో రెండు మైనారిటీ గ్రూపుల మధ్య మత ఘర్షణలు జరిగాయి.. ప్రాణ నష్టం జరిగినా పోలీసులు సమాచారం ఎక్కువ ప్రచారం కాకుండా జాగ్రత్తగా అదుపు చేశారు.. కర్ఫ్యూ విధించారు.. అక్కడి ప్రజలు రెక్కాడితే కానీ డొక్కాడని పేదలు.. ఒక స్వచ్ఛంద సంస్థ పోలీసుల ద్వారా వారికి బియ్యం తదితర నిత్యావసర వస్తువులు పంపిణీ చేసింది.. కానీ మరునాడే అక్కడి ప్రజలంతా తమకు ఇచ్చినవన్నీ పోలీసులకు తిరిగి ఇచ్చేశారు.. ఏమిటి అని ఆరా తీస్తే సాయం తీసుకున్నందుకు వారి మతానికి చెందిన నాయకులు బెదిరించారట.. పోనీ వారేమైనా సాయపడ్డారా అంటే అదీ లేదు..
ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లోనూ ఇదే జరుగుతోంది.. వరదల్లో సర్వస్వం కోల్పోయిన కాశ్మీరీ వాసులను ఆదుకునేందుకు దేశమంతా కదిలింది.. ముఖ్యంగా మన సైన్యంతో పాటు, స్వచ్చంద సంస్థలు రాత్రింబవళ్లు ప్రజలను రక్షించడంతో పాటు ఆహారం, బట్టలు ఇచ్చి ఆదుకుంటున్నారు.. అయితే ఇదంతా అక్కడి వేర్పాటు వాదులకు నచ్చడం లేదు.. భారత దేశం నుండి వచ్చే సాయం తీసుకోవద్దని బాధితులను బెదిరిస్తున్నారు.. సాయం చేసేవారిపై చేయి చేసుకొని అడ్డుకుంటున్నారు.. సాయం అందుకుంటున్న వారు భారత్ కు ఎక్కడ దగ్గర అవుతారో అని వేర్పాటు వాదుల ఆందోళన అట..  మరి వారేదైనా సాయం చేస్తున్నారా అంటే, ఏ మాత్రం లేదు..

ఇప్పుడు అర్థమైంది కదూ పై సామెతలోని ఆంతర్యం..

Saturday, September 20, 2014

ఇప్పడు వీడి వంతు..

కాశ్మీర్ అంతా పాకిస్తాన్ దే నంట.. ఓ పిల్ల కాకి గోల పెట్టింది.. భారత్ నుండి కాశ్మీర్ అంతా లాక్కుంటాడట.. ఒక్క ఈంచీ కూడా వదలడట.. పాకిస్తాన్ పీపుల్ పార్టీ భవిష్య నాయకుడు, బెనజీర్ భుట్టో తనయుడు బిలావల్ భుట్టో పేలాపన ఇది..
గతంలో పాకిస్తాన్ ప్రధానమంత్రిగా చేసిన వీడి తాత జూల్ఫీకర్ అలీ భుట్టో, అమ్మ బెనజీర్ భుట్టో ఇలాగే వాగారు.. కొత్తగా ఈ పిల్లకాకీ అదే పాచిపాట అందుకుంది..
భారత్ నుండి కాశ్మీర్ను ఎవరూ వేరు చేయలేరు.. బిలావల్ జేజమ్మలు దిగొచ్చినా పీకేదేమీ లేదు.. కాశ్మీర్ సంగతి దేవుడెరుగు ముందు బిలావల్కు సొంత దేశం పాకిస్తాన్లో రక్షణ ఉందా అసలు?
వీడి తాతను సైన్యం ఉరి చంపేసింది.. అమ్మను ఉగ్రవాదులు చంపేశారు.. వీడి నాన్న మిస్టర్ టెన్ పర్సెంట్ అదేనంవడి పాక్ అధ్యక్షునిగా పని చేసిన అసిఫ్ అలీ జర్దారీకి అరెస్టు భయం ఉంది.. మీ దేశంలో మీ ప్రాణాలు కాపాడుకోండి ముందు..బతికుంటే పొరుగు దేశం గురుంచి తీరిగ్గా ఆలోచించొచ్చు..

చైనాతో జాగ్రత అవసరం..

వియ్యానికైనా, కయ్యానికైనా సమవుజ్జీ ఉండాలంటారు.. శత్రువు ముందు డీలాగా కనిపిస్తే శాశ్వతంగా లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తాడు.. మనం ధృడంగా ఉంటే అతడే కాస్త దిగొస్తాడు..
భారత్, ఛైనాల మధ్య ప్రాచీన కాలంగా సాంస్కృతిక సంబంధాలు ఉండేవి.. విదేశీయుల పాలనలో అంతరం ఈ సంబంధాల మధ్య అంతరం పెరిగింది.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మనం చేసిన తప్పుల్లో టిబెట్ పట్ల మన విధానంలో మార్పు.. నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ టిబెట్ నుండి మన రక్షణ దళాలను తొలగించారు.. ఆ తర్వాత చైనాలో మావో నేతృత్వంలో వచ్చిన కమ్యూనిస్టు ప్రభుత్వం టిబెట్ ను కబలించింది.. నెహ్రూజీ దీన్ని ఖండించకపోగా స్వాగతించి చారిత్రిక తప్పిదానికి పాల్పడ్డారు.. టిబెట్ ను చైనాలో అంతర్భాగంగా గుర్తించిన తొలి దేశం భారతే.. పైగా హిందీ, చీనీ భాయి భాయి.. పంచశీల అంటూ చైనాలో అంటకాగారు.. అదే సమయంలో టిబెట్ అధిపతి దలైలామాకు మన దేశంలో ఆశ్రయం కల్పించి ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు శాంతి దూతలా ఫోజు ఇచ్చారు..
మన బలహీనతలను కనిపెట్టిన చైనా దొంగ దెబ్బ తీసింది.. 1962లో ఛైనా మన దేశంపై దురాక్రమణకు దిగడంతో ప్రపంచం ముందు పరువు పోయింది.. ఈ వ్యధతోనే నెహ్రూగారు పోయారంటారు.. ఆక్రమిత కాశ్మీర్ లోని అక్సాయ్ చిక్ ప్రాంతం చైనా కబ్జాలోకి పోయినా మన గట్టిగా ప్రతిఘటించలేకపోయాం.. లద్దాక్ లో చొరబాట్లతో పాటు అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా మనతో తరచూ ఘర్షణలకు దిగుతున్నా గట్టిగా వ్యతిరేకించలేకపోతున్నాం.. చైనాతో యుద్దం తర్వాత దశాబ్దాల పాటు ఇరు దేశాల మధ్య మూసుకుపోయిన సంబంధాల ద్వారాలు, రాజీవ్ గాంధీ హయాంలో తిరిగి తెరుచుకున్నాయి.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గినా, చైనా సంఘర్షణాత్మక వైఖరికి మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నాం..

తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ భారత పర్యటనకు వచ్చారు.. చైనా అధ్యక్షుడు భారత్ లోకి వస్తున్న సమయంలో మళ్లీ సరిహద్దుల్లో ఆ దేశ సైనికులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు.. సరిహద్దు వివాదాలు కూడా చర్చకు వచ్చాయి.. అయితే అప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో ఘననీయంగా మార్పు వచ్చింది.. గతంలో మాదిరిగా భారత్ లో బలహీన మనస్కులు పాలకులుగా లేరు.. ఇరు దేశాల మధ్య ఇచ్చి పుచ్చుకునే వరకూ ఓకే.. మన ప్రధాని పొరుగు దేశాలతో సత్సంబంధాలు కోరుకుంటున్నారు.. అదీ ఒక సమవుజ్జీగా.. కానీ ఎంతైనా శత్రువుతో జాగ్రత్తగా ఉండటం అవసరం..

న్నో...

మొత్తానికి స్కాట్ లాండ్ వాసులు యునైటెడ్ కింగ్ డమ్ లోనే ఉంటామని రిఫరెండమ్ ద్వారా స్పష్టం చేశారు.. ఒకనాటి రవి అస్తమించని సామ్రాజ్యానికి పట్టిన దుస్థితిని చూసి నాటి వలస దేశాలు సంతోషించాయి.. స్కాట్ లాండ్ విడిపోవాలని కోరుకున్నాయి.. ఓ భారతీయుడిగా నాకూ అలా జరిగితే బాగుండు అనిపించింది... కానీ స్కాటిష్ ప్రజలు బ్రిటన్ తో కలిసే ఉండాలని కోరుకుంటున్నారు.. మనమేం చేయగలం అది వారిష్టం..

Thursday, September 18, 2014

ఆసఫ్‌జాహీ వంశం.. ఏడు రొట్టెల కథ

హైదరాబాద్ సంస్థానాన్ని ఆసఫ్‌జాహీ వంశం క్రీ.శ.1724 నుండి 1948 వరకూ పాలించింది.. ఈ వంశానికి చెందిన ఏడుగురు పాలకులు 224 సంవత్సరాల పాటు దక్కన్ హైదరాబాద్రాజ్యాన్ని పాలించారు.. ఏడు తరాలతోనే ఈ వంశ పాలన ముగిసింది.. అందుకు ఏడు రొట్టెలే కారణం అంటారు.. ఇదో ఆసక్తికరమైన కథ..
గోల్కొండ సామ్రాజ్యంపై మొఘల్ సామ్రాట్ ఔరంగజేబు దాడి తర్వాత కుతుబ్ షాహీ పరిపాలన అంతరించింది.. అంతటితో హైదరాబాద్ ప్రాభవం తగ్గిపోయింది.. ఢిల్లీలో ఔరంగజేబు మరణం తర్వాత మొఘల్ సామ్రాజ్యం క్షీణిస్తున్న దశలో మీర్ కమ్రుద్దీన్ ఖాన్ ను 1724లో దక్కన్ సుబేదారుగా నియమించారు.. గోల్కొండ పతనంలో కీలకపాత్ర పోషించిన ఘియాజుద్దీన్ ఫిరోజ్ జంగ్ కొడుకే ఈ కమ్రుద్దీన్.. ఇతని తల్లికి మొదటి ఖలీఫా వారతస్వం ఉందటం విశేషం..
నిజాం ఉల్ ముల్క్ అనే బిరుదుతో మీర్ కమ్రుద్దీన్ ఖాన్ రాజ్యభారం స్వీకరించేందుకు ఓ గుర్రంపై ఢిల్లీ నుండి దక్షిణాదికి బయలు దేరాడు.. మార్గమధ్యలో ఆయనకు ఆకలి వేసింది.. దూరంగా ఒక ఫకీర్ కనిపించాడు.. దగ్గరకు వెళ్లి సలాం చేసి తినడానికి ఏమైనా ఉందా అని అడిగాడు.. ఫకీరు తన దగ్గర ఉన్న రొట్టెల గంప కమ్రుద్దీన్ ముందు పెట్టి ఇష్టమైనన్ని తినమని సూచించాడు.. ఆకలితో ఉన్న కమ్రుద్దీన్ గబాగబా ఏడు రొట్టెలు తిన్నాడు.. ఇక తినలేనని ఫకీరుతో చెప్పాడు.. నీ వంశం ఏడు తరాల పాటు మాత్రమే రాజ్యం ఏలుతుందని కమ్రుద్దీన్ కు ఆ ఫకీరు చెప్పాడు..


దక్కన్ సుబా తొలి రాజధాని ఔరంగాబాద్.. ఆ తర్వాత హైదరాబాద్ కు మారింది.. పరిపాలనా పగ్గాలు చేపట్టిన మీర్ కమ్రుద్దీన్ ఖాన్ మొఘలుల బలహీనతను గమనించి స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు.. ఆ తర్వాత కాలంలో ఆసఫ్‌జాహీ పాలకులు బ్రిటిష్ వారికి సామంతులుగా మారారు.. 
ఆసఫ్‌జాహీ వంశ పాలకులు వీరే .. 1)మీర్ కమ్రుద్దీన్ ఖాన్, 2)నిజాం అలీఖాన్, 3)సికిందర్ జా, 4)నసీరుద్దౌలా, 5)అఫ్జలుద్దౌలా, 6)మహబూబ్ అలీఖాన్, 7)ఉస్మాన్ అలీఖాన్.. నిజాం ఉల్ ముల్క్ బిరుగు కారణంగా వీరు నిజాం నవాబులుగా గుర్తింపు పొందారు.. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనలోనే హైదరాబాద్ సంస్థానంపై పోలీస్ యాక్షన్ జరిగి 17 సెప్టెంబర్ 1948లో భారత దేశంలో విలీనం అయ్యింది.. తన వారసుడిగా మనవడు ముఖరంజాను ప్రకటిద్దామని ఉస్మాన్ అలీఖాన్ భావించాడు.. కానీ ఆయన కోరిక ఫలించలేదు..

అలా ఏడు తరాలతో ఆసఫ్‌జాహీ వంశం కథ ముగిసింది.. ఫకీరు గారి ఏడు రొట్టెల జోస్యం ఫలించింది.. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆసఫ్‌జాహీ పతాకంపై రొట్టెను చూడవచ్చు..

Wednesday, September 17, 2014

ఒక తేదీ.. మూడు తీపి గుర్తులు..

తెలంగాణ, సర్ధార్ పటేల్, నరేంద్ర మోదీ, 17 సెప్టెంబర్..

ఏమిటీ బంధం అనుకుంటున్నారా?.. 17 సెప్టెంబర్ 1948లో తెలంగాణ (హైదరాబాద్ స్టేట్) భారత దేశంలో సంపూర్ణంగా విలీనం అయ్యింది.. ఇది నాటి హోంశాఖా మంత్రి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్.. 17 సెప్టెంబర్ 1950 నాడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మించారు.. మోదీ, పటేల్ యాదృచ్చికంగా గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారు..
భారత ప్రధాని అయిన శుభతరుణంలో ఈ ఏడాది నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను ఘనంగా చేపట్టాలని ఆయన అభిమానులు భావించారు.. అయితే జమ్మూ కాశ్మీర్ వరదల విషాదకర పరిస్థితుల్లో జన్మదినోత్సవాన్ని జరుపుకోరాదని మోదీ నిర్ణయించారు..

నరేంద్ర మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు..

హైదరాబాదీల ప్రాతస్మరణీయుడు పటేల్..

హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో సంపూర్ణంగా విలీనమై ఇక్కడి ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారు.. ఇందుకు కారణం ఎవరో తెలుసా?.. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్..
స్వతంత్ర భారత దేశ తొలి హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సర్ధార్ పటేల్, ముందుగా స్వదేశీ సంస్థానాలపై దృష్టి సారించారు.. బ్రిటిష్ వారు పోతూ పోతూ మెలిక పెట్టి పోయారు.. సంస్థానాలు భారత్, పాకిస్తాన్ ఎందులైనా విలీనం కావచ్చట.. లేదా స్వతంత్రంగా ఉండొచ్చట.. ఇది దేశ సమగ్రతకు మప్పు అని గ్రహించారు పటేల్.. ఐదు వందల పైచిలుకు సంస్థానాలను విలీనం చేయడలో విజయం సాధించారు.. ఈ క్రమంలో మొండి కేసిన హైదరాబాద్, జునాగడ్ లను సైనిక చర్య ద్వారా దారికి తెచ్చారు..
సర్ధార్ వల్లభాయ్ చేసిన ఈ మహత్తర కృషి కారణంగా పాత హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ, మరాఠ్వాడా, హై.కర్ణాటక ప్రజలు భారత దేశంలో భాగమయ్యారు.. తోటి భారత ప్రజలతో స్వేచ్ఛా, స్వాతంత్ర్యం అనుభవిస్తున్నారు..
దురదృష్టవశాత్తు హైదరాబాద్ నగరంలో లో సర్దార్ పటేల్ గారిని మరచిపోయే పరిస్థితి ఏర్పడింది.. తెలంగాణ వాదులు అసెంబ్లీ ముందు అమర వీరుల స్థూపాకిని నివాళులు అర్పిస్తున్నారు.. కానీ దాని ముందే ఉన్న పటేల్ విగ్రహాన్ని మరచిపోతున్నారు.. అసలు భారత దేశంలో హైదరాబాద్ సంస్థానం భాగం కాకపోయి ఉంటే పరిణామాలు ఎలా ఉండేవి.. ఈ రోజున తెలంగాణకు అస్థిత్వం, ప్రత్యేక రాష్ట్రం సిద్దించిందంటే మూల కారకులు ఎవరు?

తెలంగాణ (హైదరాబాద్) విముక్తికి కారకులైన సర్ధార్ వల్లభాయ్ పటేల్ ను 17 సెప్టెంబర్ సందర్భంగా స్మరించుకుందాం..

బానిస సంకెళ్లు తెగిన చారిత్రిక దినోత్సవం..

తరతరాల బూజు వదిలిన రోజు.. శతాబ్దాల ప్యూడల్ పాలన నుండి విముక్తి లభించిన మహోన్నత ఘట్టం.. స్వేచ్ఛ కోసం తపించిన ప్రజల బానిసత్వ సంకెళ్లు తెగిన రోజు ఇది.. 17 సెప్టెంబర్ 1948
భారతదేశం నడిబొడ్డున క్యాన్సర్ కణితిలా తయారైన హైదరాబాద్ సంస్థానంలోకి భారత సైన్యం నలు వైపుల నుండి దూసుకు వచ్చింది.. నిరంకుశ పాలన అందించిన ముసలి నవాబుకు వాస్తవం తెలిసి వచ్చింది.. స్వతంత్ర హైదరాబాద్ కోసం ఆయన కన్న కలలు పటాపంచలయ్యాయి.. మెజారిటీ ప్రజల ప్రజాస్వామ్య ఆకాంక్షలను గౌరవించక తప్పని పరిస్థితి ఏర్పడింది.. ఏడు తరాలు పాలించిన తన సంస్థానాన్ని భారత దేశంలో విలీనం చేయడానికి అంగీకరించాడు మీర్ ఉస్మాన్ అలీఖాన్..
మత మౌఢ్యం, ప్యూడలిజం, నిరంకుశత్వం.. మధ్య యుగం నాటి పాలనా లక్షణాలను సజీవంగా కొనసాగిస్తూ వచ్చింది అసఫ్ జాహీ వంశం.. ప్రపంచమంతా వస్తున్న పరిపాలనా సంస్కరణలు


వారికి పట్టలేదు.. తన సంస్థానంలో మెజారిటీ ప్రజల ఆకాంక్షలను నిర్లక్ష్యం చేశాడు నిజాం నవాబు.. గ్రామీణ ప్రాంత ప్రజలు భూస్వాముల (దేశ్ ముఖ్, దేశ్ పాండే, దొరలు) కింద నలిగిపోయేవారు.. సమాజంలో కొన్ని ఉన్నత వర్గాలకు మాత్రమే గౌరవం, మర్యాదలు దక్కేవి.. మిగతా ప్రజలవి బానిస బతుకులే.. పరిపాలనలో మతత్వం పాతుకుపోయింది.. మెజారిటీ ప్రజల భాష, సంస్కృతి సాంప్రదాయాలకు విలువలేదు.. రక్తపిపాసులైన రజాకార్లను అడ్డం పెట్టుకొని పాలన పాలన సాగించాడు నిజాం ప్రభువు.. రజాకార్లు గ్రామాలపై పడి మారణకాండ సృష్టించారు.. మహిళల మానప్రాణాలు దోచుకున్నారు.. ఇవేవీ పట్టలేదు నవాబుగారికి.. ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడిన ఆంధ్రమహాసభ, ఆర్యసమాజం, స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలను నిషేధించారు.. ఆ పార్టీల నాయకులను జైలు పాలు చేసి చిత్ర హింసలు పెట్టారు..

15 ఆగస్టు 1947న భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది.. అప్పటి వరకూ బ్రిటిష్ వారికి సామంతుడిగా ఉన్న ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ సంస్థానం స్వతంత్ర్యం రాజ్యంగా ఉంటుందని ప్రకటించాడు.. ఇందు కోసం పాకిస్తాన్ మద్దతు తీసుకునే ప్రయత్నం చేశాడు.. ఇతర సంస్థానాల మాదిరే హైదరాబాద్ ను భారత్ లో విలీనం చేయాలని మెజారిటీ ప్రజలు కోరుకుంటే వారి ఆకాంక్షలపై నీళ్లు చల్లాడు నిజాం నవాబు.. ఢిల్లీ ఎర్రకోటపై అసబ్ జాహీ పతాకం ఎగురవేస్తానని విర్రవీగాడు రజాకార్ల నాయకుడు కాశీం రజ్వీ.. హైదరాబాద్ లో పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వచ్చారు కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్.. పరిస్థితులు చేజారక ముందే స్పందించారు.. పోలీస్ యాక్షన్ (ఆపరేషన్ పోలో) అమలు చేశారు.. ఐదు రోజుల యుద్దంలో హైదరాబాద్ సైన్యం తోక ముడిచింది.. భారత సైన్యానికి సంస్థాన ప్రజలు జేజేలు పలికారు.. 17 సెప్టెంబర్ 1948న భారత దేశంలో సంపూర్ణంగా విలీనం అయిపోయింది హైదరాబాద్ సంస్థానం..

Tuesday, September 16, 2014

తెరాస రెండు నాలుకల సిద్దాంతం..

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడం తెరాస ప్రభుత్వానికి ఇష్టం లేదని స్పష్టమైపోయింది.. ఏ పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరోమాట మాట్లాడం ఆనవాయితీ.. ఇందుకు టీఆర్ఎస్ అతీతం కాదు.. సమైక్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించనందుకు తెరాస తప్పు పట్టింది.. మరి ఇప్పడు అధికారంలోనే ఉన్న ఈ పార్టీ చేస్తున్న పనేమిటి? ఒక్కసారి ఈ వీడియో చూడండి.....
http://www.facebook.com/l.php?u=http%3A%2F%2Fwww.youtube.com%2Fwatch%3Fv%3DdJy70USEZsU&h=KAQGaKCLW

ఫలితాలపై నిరాశ వద్దు..

అయిపోయింది.. ఇంకెక్కడి మోదీ.. ఫలితాలు బీజేపీకి వ్యతిరేకంగా వస్తున్నాయి..దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను చూస్తునే ఓ మిత్రుడు గావు కేక పెట్టేశాడు..
ఎన్నికల ఫలితాలు ఆలోచించ తగినవే.. రాజస్థాన్, యూపీ ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే.. కానీ కంగారు పడిపోవాల్సినవేమీ కాదు.. సాధారణ ఎన్నికల్లో దేశ ప్రజలంతా మార్పు కోరుకున్నారు.. నరేంద్ర మోదీ ప్రత్యామ్నాయంగా కనిపించారు.. మోదీ ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలన్నీ దీర్ఘకాలిక ప్రయోజనాలను ఉద్దేశించినవే.. ఆ విషయాన్ని మోదీయే స్వయంగా చెప్పేశారు..
ఈ ఉప ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ కొత్త అధ్యక్షుడు అమిత్ షా ప్రచారానికి పోలేదు.. స్థానిక నాయకత్వానికే బాధ్యతలు వదిలేశారు.. నిజానికి వీరు వెళ్లాల్సిన అవసరమే లేదు.. గత ఎన్నికల్లో దెబ్బతిన్న సమాజ్ వాదీ, కాంగ్రెస్ పార్టీలు కసిగా పని చేశాయి.. వారికి చావు బతుకుల సమస్య కదా.. అదే సమయంలో బీజేపీ నాయకుల్లో మితి మీరిన ఆత్మ విశ్వాసం వచ్చేసింది.. అది కాస్త కొంప ముంచింది.. ఈ అంశంపై భాజపా శ్రేణులు దృష్టి పెడితే మంచిది..

బీజేపీకి ఏ మాత్రం బలం లేని పశ్చిమ బెంగాల్, అసోంలలో వచ్చిన ఫలితాలు ఆశాజనకంగానే ఉన్నాయి.. రాబోయే మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు బీజేపీకీ అత్యంత కీలకం కానున్నాయి..  

Monday, September 15, 2014

విమక్తి ఉత్సవాలకు మతం రంగా?

17 సెప్టెంబర్ వస్తోందంటే కొందరికి ఎందుకో గుండెల్లో రైళ్లు పరుగెత్తుతాయి.. హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనం అయిన రోజు.. నిజాం నవాబు నుండి విముక్తి పొందిన రోజు.. తరతరాల బూజు వదిలిన రోజు ఇది..  అసబ్ జాహీ వంశం నిరంకుశ పాలన, రజాకార్ల దురాగతాల, భూస్వాముల దోపిడి నుండి హైదరాబాద్ ప్రజలకు విముక్తి లభించిన దినమిది.. భారత దేశమంతటికీ 15 ఆగస్టు 1947 నాడు స్వాతంత్ర్యం వస్తే, హైదరాబాద్ ప్రజలు మాత్రం 17 సెప్టెంబర్ 1948 నాడు స్వేచ్ఛా వాయువులు పీల్చారు.. కానీ హైదరాబాద్ సంస్థానంలో భాగమైన తెలంగాణ ప్రజలు ఏనాడు ఉత్సవాలకు నోచుకోలేదు..
హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉండి పొరుగు రాష్ట్రాల్లో కలిసిపోయిన మరాఠ్వాడ, హై.కర్ణాటక ప్రాంతాల్లో అక్కడి ప్రభుత్వాలు అధికారికంగా విలీన ఉత్సవాలు జరుపుతాయి.. కానీ హైదరాబాద్ సంస్థానంలో ప్రధాన భూభాగమై తెలంగాణలో మాత్రం ఉత్సవాలు జరగవు.. ఎందుకు?
సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ఆరున్నర దశాబ్దాల పాలనలో ఏనాడు హైదరాబాద్ విముక్తి ఉత్సవాలను నిర్వహించలేదు.. బీజేపీతో పాటు కమ్యూనిస్టులు సైతం పాలకులను ఉత్సవాలు జరపాలని కోరినా పెడ చెవిన పెడుతూ వచ్చారు.. తెలంగాణ ప్రజల చిరకాల కోరిక ఫలించి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతైనా 17 సెప్టెంబర్ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని అంతా ఆశించారు.. కానీ ఈ విషయంలో తెరాస ప్రభుత్వ స్పందించడం లేదు.. అంటే ఉత్సవాలు లేనట్లే అని అర్ధం చేసుకోవాలి.. ఎందుకిలా జరుగుతోంది?
హైదరాబాద్ సంస్థానం పాలకుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ను గద్దె దింపినందుకు ముస్లింలు బాధ పడ్డారట.. పోలీస్ యాక్షన్ తర్వాత ఎంతో మంది ముస్లింను ఊచకోత కోశారట.. 17 సెప్టెంబర్ ఉత్సవాలు జరిపితే వారి మనోభావాలు దెబ్బతింటాయన.. ఇదండీ కొందరు వితండ వాదుల వాదన..
హైదరాబాద్ విముక్తి పోరాటం ఎందుకు జరిగింది? నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాల కారణంగానే కదా? మరి మతం ప్రసక్తి ఎందుకు వస్తోంది?.. హైదరాబాద్ విముక్తి కోసం పోరాటం చేసింది కేవలం హిందువులేనా?.. ముస్లింలంతా ఏక మొత్తంగా నవాబు పక్షాన నిలిచారా?.. మరి షోయబుల్లా ఖాన్, షేక్ బందగీ,  ముక్దుం మొయినుద్దీన్ ఎవరు?..
నిజాం పాలనపై అక్షరాయుధాలు సంధించిన పాత్రికేయుడు షోయబుల్లాఖాన్ ను రజాకార్ల మూకలు నరికి చంపాయి.. నిజాం పాలనకు ప్రతిరూపమైన విసునూరు దేశ్ ముఖ్ రాంచంద్రారెడ్డిపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన షేక్ బందగీ అనే పేద రైతును పొట్టన పెట్టుకున్నారు.. కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో కార్మిక నాయకుడు ముక్దుం మొయినుద్దీన్ కీలక పాత్ర పోషించారు.. వీరంతా ముస్లింలు కాదా?.. 17 సెప్టెంబర్ దినోత్సవానికి ఎందుకు మతం రంగు పులిమారు? అసలు ఎవరి వత్తిడి కారణంగా ఈ ఉత్సవాలు అధికారికంగా చేపట్టడం లేదు? ఎందుకీ ముసుగులో గుద్దులాట?
అసలు 17 సెప్టెంబర్ 1948 తేదీన హైదరాబాద్ విముక్తి జరగకపోతే చరిత్ర గతి ఎలా ఉండేది? ఒక్కసారి ఊహించుకోండి.. ఆంధ్రప్రదేశ్ అవతరించిన 1 నవంబర్ 1956కు కానీ, తెలంగాణ రాష్ట్రం సిద్దించిన 2 జూన్ 2014కు ప్రాధాన్యత వచ్చేదా?.. అసలు మన పాలకులకు హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనం కావడమే ఇష్టం లేదా?.. సంకుచిత విధానాలు, రాజకీయాలు, కుహనా లౌకికవాద ముసుగును తొలగించుకొని ఇప్పటికైనా హైదరాబాద్ విముక్తి ఉత్సవాలను అధికారికంగా జరపాల్సిన అవసరం ఉంది.. 

Sunday, September 14, 2014


కనీవినీ ఎరుగుని రీతిలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి.. దాదాపు 300 వందల మందికి పైగా చనిపోయారు.. ఆరు లక్షల మంది సర్వస్వం వరదల్లో కోల్పోయారు. సైన్యం లక్షా 10 వేల మందికి రక్షించింది.. ఈ సంఖ్య మరింతగా పెరగవచ్చు.. వరదల కారణంగా ఇళ్లూ ఆస్తులు దెబ్బతిన్నాయి.. రోడ్లు, కమ్యూనికేషన్ల వ్యవస్థ దెబ్బతిన్నిది.. సర్వం కోల్పోయిన బాధితులకు అండగా నివాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది..  ఇందు కోసం జమ్మూ కాశ్మీర్ స్టడీ సెంటర్, హైదరాబాద్ ఛాప్టర్ సేవా భారతి, తెలంగాణ శాఖలు చేపట్టిన సహాయక కార్యక్రమాలకు తమ వంతు చేయూతనివ్వండి..
వందలాది మంది సేవాభారతి కార్యకర్తలు ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో రాత్రింబవళ్లు సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు.. మీరు అందించే ప్రతి వస్తువు, ప్రతి పైసా నూటికి నూరు శాతం సద్వినియోగం అవుతుందని పూచీ ఇచ్చేందుకు దేశంలో పలు ప్రకృతి బీభత్స సమయాల్లో సేవా భారతి చేపట్టిన కార్యక్రమాలే నిదర్శనం.. మీరు అందించే విరాళాలకు 80G ప్రకారం ఆదాయపు పన్ను మినహాయింపు కూడా ఉంది..
మీ సహాయాన్ని నేరుగా Seva Bharathi, A/C: 630501065297,  ICICI Bank, IFSC Code ICIC0006305, Himayatnagar Branch, Hyderabad కి జమ చేయవచ్చు.. రసీదు అందించడానికి మీ పూర్తి పేరు, చిరునామా ఇవ్వడం మరచిపోకండి.. మీ  చెక్కులను నేరుగా Sevabharathi, 3-2-106, Nimboliadda,Kachiguda, Hyderabad 500027 చిరునామాకు కూడా పంపవచ్చు..

ఇతర వివరాలకు జమ్మూ కాశ్మీర్ స్టడీ సెంటర్ హైదరాబాద్ ఛాప్టర్ అధ్యక్షులు ప్రొఫెసట్ టి. తిరుపతి రావు (ఉస్మానియా విశ్వ విద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్) లేదా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్.వి.కె. ప్రసాద్, మొబైల్ నెంబర్: 98496 13445 సంప్రదించవచ్చు..

అయ్యో పాపం.. ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద ఈ నిర్వాసితుల దరకాస్తును పరిశీలించాలి..


Friday, September 12, 2014

భారత్ లోనే కాశ్మీర్ కు భద్రత

అందాల కాశ్మీరాన్ని ఊహించని వరదలు అల్లకల్లోలం చేశాయి.. శ్రీనగర్ సహా చాలా పట్టణాలు, గ్రామాలు నీట మునిగాయి.. ఇళ్లూ, ఆస్తులు పోయాయి.. వందలాది మంది మృత్యవాత పడ్డారు.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.. జమ్మూ కాశ్మీర్ చరిత్రలోనే అతిపెద్ద ప్రకృతి విలయమిది..
బాధితులను ఆదుకోవడంలో భారత ప్రభుత్వం చురుగ్గా స్పందించింది.. రంగంలోకి దిగిన సైన్యం వేలాది మందిని రక్షించింది.. మన జవాన్లు ప్రాణాలకు తెగించి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు ఆహారం, మంచినీరు పంపిణీ చేశారు.. కాశ్మీరీ ప్రజలు సైన్యం చేసిన సేవలను ప్రశంసించకుండా ఉండలేకపోయారు.. ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించాలి..
కాశ్మీర్లో వేర్పాటు వాదులు అర్థం లేని పోరాటంతో అక్కడి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.. కాశ్మీర్ స్వతంత్రంగా ఉన్నా, పాకిస్తాన్లో ఉన్నా ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఏం జరిగేది.. పాకిస్తాన్లో కూడా వరదలు వచ్చాయి.. కానీ ప్రభుత్వం, సైన్యం బాధితులను పెద్దగా ఆదుకోలేకపోతున్నాయి.. మరి కాశ్మీర్ స్వతంత్రంగా ఉంటే ఎలా ఉండేది? పరిస్థితులను ఊహించండి.. భారత ప్రభుత్వం కాశ్మీర్లో మౌళిక సదుపాయాల కోసం, ప్రజల ఉపాధి, విద్య, సబ్సిడీల కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది.. అయినా ఉగ్రవాదులు పాకిస్తాన్ సహకారంతో భారత్ ను నిందిస్తూ అక్కడి నవతరం యువకుల్లో వేర్పాటు వాదాన్ని నూరిపోస్తున్నారు.. కాశ్మీర్లో వరద బాధితులను ఆదుకోవడానికి భారత్ నుండి పెద్ద సంఖ్యలు స్వచ్ఛంద సంస్థలు తరలివెళ్లాయి.. మరి ఏ ఉగ్రవాద సంస్థ అయినా అక్కడి ప్రజలను ఆదుకున్న సందర్భాన్ని గమనించారా?..  భారత దేశంలో భాగంగా ఉంటేనే కాశ్మీర్ కు మనుగడ ఉంటుందనే స్పష్టం అవుతోంది..



విముక్తి దినోత్సవం అధికారికంగా జరుగుతుందా?

17 సెప్టెంబర్ వచ్చేస్తోంది.. తెలంగాణ (హైదరాబాద్ స్టేట్) భారత దేశంలో సంపూర్ణంగా విలీనం అయిన రోజు ఇది.. ఈ ప్రాంత ప్రజలు తొలిసారిగా స్వేచ్ఛా వాయువులు పీల్చిన రోజు.. కానీ ఈ విజయోత్సవాన్ని ఎందుకు తొక్కి పెట్టారు?
దేశానికి 15 ఆగస్టు 1947 నాడు స్వాతంత్ర్యం వచ్చినా హైదరాబాద్ సంస్థానం నిజాం పాలనలో మగ్గింది.. నిరంకుశ నిజాం, రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా ఆర్యసమాజం, స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు మహోద్యమాన్ని నడిపాయి.. ఎందరో ప్రాణాలు కోల్పోయారు.. జైలు పాలయ్యారు.. చివరకు కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకొని 17 సెప్టెంబర్ 1948న ఆపరేషన్ పోలో (పోలీస్ యాక్షన్) ద్వారా హైదరాబాద్ ను భారత్ లో సంపూర్ణంగా విలీనం చేశారు.
1 నవంబర్ 1956 నాడు హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతం, ఆంధ్ర రాష్ట్రం విలీనమై ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.. మరాఠ్వాడా ప్రాంతం బొంబాయి రాష్ట్రం (ప్రస్తుత మహారాష్ట్ర)లో కలిసింది.. హైదరాబాద్ కర్ణాటక ప్రాంతం మైసూర్ స్టేట్ (ప్రస్తుత కర్ణాటక)లో విలీనం అయింది.. మరాఠ్వాడా, హైదరాబాద్ కర్ణాటక ప్రాంతాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏటా 17 సెప్టెంబర్ నాడు హైదరాబాద్ విముక్తి దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నాయి.. కానీ పాత హైదరాబాద్ రాష్ట్రంలోని ప్రధాన భూభాగం తెలంగాణలో మాత్రం విముక్తి దినోత్సవాలను సమైక్య ఆంధ్రప్రదేశ్ పాలకులు ఏనాడూ నిర్వహించిన పాపాన పోలేదు.. అలా నిర్వహిస్తే కొందరు నొచ్చుకుంటారని భయపడుతూ వచ్చారు..
ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది.. 17 సెప్టెంబర్ రాబోతోంది.. నిజాం రాక్షస పాలన నుండి తెలంగాణ (హైదరాబాద్ స్టేట్) స్వతంత్రమైన రోజు ఇది..  తెలంగాణ ప్రభుత్వం కచ్చితంగా విముక్తి దినోత్సవాన్ని అధికారికంగా
నిర్వహించి తీరాలి.. అప్పుడే అమరవీరుల త్యాగాలకు సరైన నివాళి..

జై తెలంగాణ.. జై హింద్..

Thursday, September 11, 2014

వివేక వాణికి 120 ఏళ్లు..

ఓ యువతా మేలుకో.. గమ్యం చేరే వరకూ విశ్రమించకు..
బలమే జీవితం.. బలహీనతే మరణం..
మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి..దాన్నే ధ్యానించండి.. కలగనండి.. శ్వాసించండి.. అదే విజమానికి మార్గం..
స్వామీ వివేకానంద వాణి ఇది..స్వామీజీ షికాగో(అమెరికా)లో జరిగిన సర్వమత సమ్మేళనంలో ప్రసంగించడం ద్వారా తొలిసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించారు.. భారత దేశ ఆధ్యాత్మిక శక్తిని చాటి చెప్పారు.. 11 సెప్టెంబర్ 1893 చరిత్రలో నిలిచిపోయిన రోజు.. నేటికి 120 ఏళ్లు పూర్తయ్యాయి.. స్వామి వివేకానందను గుర్తు చేసుకుందాం.. ఆయన స్పూర్తిని పొందుదాం..

నేను మన జాతీయ పతాకానికి మాత్రమే సెల్యూట్ కొడతాను.. ఎవరికైనా అభ్యంతరమా?


Tuesday, September 9, 2014

మహా మనిషి కాళన్న..

నిజాం నిరంకుశ పాలనను నిరసించాడు.. అక్షరాయుధాలతో తిరగబడి జైలుకెళ్లాడు.. ఆయన అందరి వాడు.. ఆర్యసమాజం, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలతో సహా అందరినీ ఆదరించాడు.. గొప్ప ప్రజాస్వామ్య వాది.. ఆయన గొప్ప మానవతా వాది.. వ్యక్తిగత స్వేచ్ఛను గట్టిగా బలపరిచాడు.. ఎన్నికల్లో ఓటేసే వారిని చంపేస్తాం అని తీవ్రవాదులు బెదిరిస్తే, ఏదీ చంపండి చూద్దాం అని అందరికన్నా ముందు వెళ్లి ఓటేశాడు.. జనం గొడవే ఆయన గోస..
పుట్టింది మరాఠీ కుటుంబంలో.. కానీ తెలుగు భాషను ప్రేమించాడు.. మహాకవిగా మారాడు.. రెండున్నర జిల్లాల భాషే తెలుగు భాష ఎట్లయితది అని ఎదిరించాడు.. తెలంగాణ యాసకు గుర్తింపు తెచ్చాడు.. తెలుగు వారి ఐక్యత కోసం విశాలాంధ్రను స్వాగతించాడు.. ఆ తర్వాత ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని కాంక్షించాడు.. తెలంగాణ వేరైతే దేశానికి ఆపత్తా? అని ప్రశ్నించాడు..
ఆయనే కాళోజీ నారాయణ రావు..

పుట్టుకు నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది అని లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ నింగికేగినప్పుడు వ్యాఖ్యానించాడు కాళోజీ.. అయితే ఇది కాళోజీ జీవితానికి కూడా చక్కగా వర్తిస్తుంది.. చివరి వరకూ ప్రజల మనిషిగానే బతికాడు.. ఆయన జీవితం తెరచి ఉంచిన పుస్తకం.. మహామనిషి కాళోజీ నారాయణ రావును ఆయన శత జయంతి సందర్భంగా యాది తెచ్చుకుందాం..

Friday, September 5, 2014

తప్పుకారు సీరీస్ దే..

మా కాలనీ వాళ్లు ఓ పుణ్యక్షేత్రం వెళ్లితే అక్కడి చెక్ పోస్ట్ దగ్గర చాలా ఇబ్బంది పెట్టారట.. వాళ్లేమీ ఉగ్రవాదులు కాదు.. కానీ దురదృష్టవశాత్తు కొత్తగా రిజిస్టరైన కారు ఆ రాష్ట్ర సీరీస్ ది కాదు.. అది ఏ సీరీసో నేను చెప్పదలచుకోలేదు.. అది వారి తప్పేమీ కాదు.. ఒక ప్రాంతాన్ని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టడంతో వారెంతో నొచ్చుకున్నారు.. విచిత్రం ఏమిటంటే వారు చాలా కాలం క్రితం అక్కడి నుండి వచ్చి మా కాలనీలో స్థిరపడిన వారే.. వారికి ఎలాంటి ప్రాంతాయ విబేధాలు లేవు.. ఇక్కడి సమాజంతో చక్కగా కలిసి మెలిసి ఉంటారు.. మనం ఏ తెలుగు రాష్ట్రానికి చెందిన వాళ్లమైనా భారతీయులం అనే విషయాన్ని మరచిపోతున్నాం..

Wednesday, September 3, 2014

పాక్ సైన్యంలో చేరతారట..

భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్దం వస్తే భారతీయ ముస్లింలు పాక్ ఆర్మీలో చేరాలట.. పాక్ పై ఇండియా యుద్దానికి సాహసిస్తే,250 మిలియన్ల ముస్లింలు ఆ దేశ సైన్యంలో చేరతారట.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నట్లు శ్రీనగర్ నుండి ప్రచురితమయ్యే కాశ్మీర్ అబ్జర్వర్ వెల్లడిస్తోంది.. ఈ వార్తే నిజమైతే
ఓవైసీకి పాకిస్తాన్ పై ప్రేమ ఉంటే అక్కడికే పోవడం మంచిది..

Tuesday, September 2, 2014

గుడ్డి అనుకరణ వద్దు..

నాకు బాపు గారితో పెద్దగా వ్యక్తిగత పరిచయం లేదు.. కానీ ఆయనకు వీరాభిమానిని.. ఆయన బొమ్మలు, కార్టూన్లు, రాతను చాలా ఇష్టపడతాను.. అప్పట్లో నా చేతి రాత చాలా బాగుండేది.. కార్టూన్లు కూడా వేసేవాడిని.. నా రాత కూడా బాపూ స్టైల్లో ఉండాలనుకున్నాను.. ప్రాక్టీస్ చేశాను.. తీరా చూస్తే నా రాత మారిపోయింది.. పరమ చెత్తగా.. ఇదేమిటని బాధపడిపోయాను.. బాపు గారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయనతో ఈ విషయం ప్రస్థావించాను.. అప్పుడు ఆయన చెప్పిందేమిటంటే.. దేన్నీ గుడ్డిగా అనుకరించొద్దు.. మనకంటూ ఓ స్టైల్ ఏర్పరచుకోవాలి.. అప్పుడే గుర్తింపు వస్తుంది.. నిజంగా ఇది అక్షర సత్యం.. 20 ఏళ్ల నాటి మాట ఇది.. ఇప్పటికీ నా మదిలో మెదులుతూనే ఉంటుంది..

'ఛాయ్ పే చర్చా.. జపనీస్ వర్షన్..'

జపాన్ సాంప్రదాయం ప్రకారం భారత ప్రధాని నరేంద్ర మోదీకి తేనీటి విందు ఇచ్చిన జపాన్ ప్రధాని షింజో అబే..