Sunday, September 30, 2012

Saturday, September 29, 2012

కపట నాటకాలు కట్టిపెట్టండి..

అంతా వంచన.. కపట నాటకం.. అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం ఒక్కటే.. తెలుగు ప్రజలు దారుణంగా మోసపోతున్నారు.. తెలంగాణ విషయంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అవలంభిస్తున్న విపరీత ధోరణికి అంతు లేకుండా పోయింది.. సమస్య ఎటూ తేలకుండా జఠిలం కావడానికి అటు సోనియా గాంధీ, ఇటు చంద్రబాబు నాయుడు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు..
తెలంగాణపై ప్రధానంగా నిర్ణయం తీసుకోవాల్సింది ఈ రెండు పార్టీలే.. సమస్యకు ఆజ్యం పోస్తూ జాప్యం చేస్తున్నారు.. ఎక్కడ సెల్ఫ్ గోల్ అవుతుందనో ఈ రెండు పార్టీల అధినేతలకు భయం.. అసలు తెలంగాణ సమస్య ముదరడానికి వీరు చేసిన అంతులేని జాప్యమే కారణం.. తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్ర సమితితో 2004 ఎన్నికల్లో కాంగ్రెస్, 2009లో టీడీపీ పొత్తు పెట్టుకున్నాయి.. ఆనాడు తాము తెలంగాణకు అనుకూలమే అంటే ప్రకటించాయి.. ఏరు దాటాక బోడి మల్లన్న అంటూ సమస్యను దాటవేశాయి..
2009లో తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపం దాల్చాక హోంమంత్రి చిదంబరం డిసెంబర్ 9న ప్రకటన చేయగానే కాంగ్రెస్, టీడీపీలోని సీమాంధ్ర నేతలు తమ కపటకాలకు తెర తీశారు.. ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నప్పుడు లేని అభ్యంతరాలు తెలంగాణ ఇవ్వడానికి ఎందుకో? నిజానికి తెలంగాణను ప్రధానంగా వ్యతిరేకిస్తున్న వారంతా వ్యాపారవేత్తల నుండి నాయకులుగా ఎదిగిన వారే.. తమ స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర వాంఛను బలి పెడుతున్నారు.. ఉద్యమంలో బలవుతున్న వారి ఉసురు వీరికి తాకకమానదు..
తమ స్వరాష్ట్రాల్లో విఫల నాయకులైన గులాంనబీ ఆజాద్, వయలార్ రవిలకు తెలంగాణ సమస్యను పరిష్కరించే సత్తా ఎక్కడిది? ఎందుకు చెత్త వాగుడు వాగి తెలంగాణ వాదులను మరింత రెచ్చగొడుతున్నారు.. పరిష్కరించడం చేత కాకపోతు నోరుమూసుకొని పడుండాలి..కాంగ్రెస్ అధిష్టానం ఇంకెంత కాలం మోసం చేస్తుంది?
లేఖ పేరిట హైడ్రామా నడిపిన టీడీపీ అధినేత చంద్రబాబు చివరకు పట్టుకున్నది కొండను తవ్వి ఎలుకను పట్టుకోవడమే.. ఆయన కొత్తగా చెప్పిందేముంది?.. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయమంటున్నారు.. అఖిలపక్షం పెడితే మళ్లీ ఇరు ప్రాంతాల నేతలు మళ్లీ రెండు నాలుకలతో వాధించడం కోసమే కదా?
ఇక తెలంగాణ క్రెడిట్ అంతా తనకే దక్కాలని ఆశపడుతున్నతెరాస అధినేత చంద్రశేఖర రావు ఇంత కీలక సమయంలో ఢిల్లీ వెళ్లి వెలగబెడుతున్న రాచ కార్యం ఏమిటి?.. కొండా లక్ష్మణ్ బాపూజీ అంత్య క్రియల్లో కూడా పాల్గొనే తీరిక లేనంత లాబీయింగ్ అక్కడేమి నడుపుతున్నట్లు? ఉద్యమంలో కలిసొచ్చే పార్టీలను కలుపుకొని పోకుండా, కాంగ్రెస్ అధిష్టానాన్ని ఆయన ఇంకా గుడ్డిగా ఎందుకు నమ్ముతున్నట్లు?..
తెలంగాణ వస్తే అసలు ఎవరికి నష్టం? ఎందుకు తెలుగు ప్రజల్లోభయాన్ని, గందరగోళాన్ని సృష్టిస్తున్నారు? ఇరు ప్రాంతాలు స్వయంప్రతిపత్తితో అభివృద్ది అవుతాయి కదా? ప్రభుత్వ ఉద్యోగాల ప్రాధాన్యత తగ్గన ఈ రోజుల్లో తెలంగాణ, కోస్తా, రాయలసీమలతో సహా దేశంలో ఎక్కడికైనా వెళ్లి ఉపాధిని వెతుక్కునే స్వేచ్ఛ ప్రతి భారతీయునికీ ఉంటుంది.. సీమాంధ్రులు తెలంగాణకు. తెలంగాణ వారు సీమాంధ్రకు వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటే అడ్డుకునేవారెవరు? ఇదేమన్నా దేశ విభజన సమస్యా? బయటి వారు వచ్చి తమను కొల్లగొడుతున్నారనే అపోహలు ఎందుకు?
తెలంగాణ, కోస్తా, రాయలసీమతో సహా ఇతర రాష్ట్రాలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలారా.. మనం వాస్తవిక దృక్పథంతో ఆలోచించి ముందుకు సాగుదాం.. కొందరు నాయకుల స్వార్థ రాజకీయాలకు అతీతంగా ఆలోచించండి.. ఇలాంటి స్వార్థ రాజకీయ పార్టీలకు బుద్ది చెబుదాం.. ప్రజల ఆకాంక్షలను గౌరవిద్దాం.. ముందు మనం భారతీయులం, ఆ తర్వాతే తెలుగువారం..

Monday, September 24, 2012

ఉల్టా చోర్..

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు గేట్లు బార్లా తెరిచిన ప్రధాని మన్మోహన్ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, డబ్బులు చెట్లకు కాయవని దేశ ప్రజలతో నిష్టూరమాడారు.. నిజమే డబ్బు చెట్లకు కాస్తుందని ఎవరూ భావించడం లేదు.. అదే సమయంలో డబ్బు కోసం దేశానికి తాకట్టు పెట్టమని ఎవరూ చెప్పడం లేదు.. ప్రధాని వైఖరి చూస్తుంటే డబ్బు కోసం విలువలను సైతం దిగజార్చుకోవచ్చన్నట్లుగా ఉంది.. మన దేశానికి కొన్ని విలువలు ఉన్న విషయం మన్మోహన్ మరిచిపోయినట్లున్నారు.. మానాభిమానాలు అమ్ముకోవడానికి దేశ ప్రజలు సిద్దంగా లేరని ప్రధానమంత్రిగారు గుర్తుంచుకుంటే మంచిది..
ప్రజల సొమ్ము పందికొక్కుల్లా మేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న మన్మోహన్ సింగ్ తో నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం ఈ దేశ ప్రజలకు లేదు.. 2జీ స్కాం, కామన్ వెల్త్ క్రీడలు, కోల్ గేట్, ఆదర్శ్ కుంభకోణాల్లో వారు తిన్న సొమ్ము కక్కిస్తే, విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని రప్పిస్తే దేశానికి ఈ దుస్థితి ఉండేదా? ప్రజలు పన్నుల ద్వానా మెక్కిన సొమ్మును కాజేసిన దొంగలకు నాయకత్వం వహిస్తున్న వ్యక్తి, డబ్బు చెట్లకు కాయదని పరిహాసమాడటం సిగ్గు లేని తనమే.. ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో మారా’ అంటే ఇదేనేమో?

ఇంకా వీరిని నమ్మాలా?

ఎన్డీఏ అయినా, యూపీఏ అయినా నమ్మదగని వ్యక్తులు మన దేశంలో కొందరు ఉన్నారు.. వీరి వల్ల దేశానికి ఏమాత్రం ప్రయోజనం లేదు.. పైగా నమ్మిన పార్టీలకు నష్టమే అధికంగా ఉంటుంది.. గతంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టిన మమతా బెనర్జీ సిల్లీ కారణాలు చూపించి బయటకు వచ్చి క్రమంగా కాంగ్రెస్ పార్టీకి చేరువయ్యారు.. ఇప్పడు మళ్లీ యూపీఏను వదిలించుకున్నారు.. తృతీయ ఫ్రంట్ నాయకులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ములాయం సింగ్ యాదవ్ వారికి బురిడీ కొట్టి యూపీఏకు మద్దతు పలికారు.. ఇలాంటి అవకాశ వాదులను దేశ ప్రజుల నమ్మడం ఎంత వరకూ సమంజసం? ఫరూక్ అబ్దుల్లా, రాం విలాస్ పశ్వాన్, అజిత్ సింగ్ లాంటి నాయకులు కూడా ఇదే కోవకు చెందిన వారు.. ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడకు చేరిపోయే ఇలాంటి వలస పక్షల వల్ల దేశానికి లాభం కన్నా నష్టమే ఎక్కువ.. వీరి సెక్యులరిజం సొల్లు కబుర్లను నమ్మి మోసపోయేందుకు దేశ ప్రజలు ఏమాత్రం సిద్దంగా లేరు..
మన చంద్రబాబు సైతం ఇలాంటి అవకాశ వాద రాజకీయాల్లో దిట్ట.. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో అత్యధికంగా ప్రయోజనాలు పొందింది చంద్రబాబే.. బాబుకు బీజేపీ నేతలు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్రంలో తమ పార్టీ ప్రయోజనాలను బలి పెట్టుకున్నారు.. కేవలం బీజేపీ కారణంగానే చంద్రబాబు రెండోసారి సీఎం కాగలిగారు.. టీడీపీ అధినేతకు ఇష్టం లేదనే సకారణం వల్లే తెలంగాణ వాదాన్ని బీజేపీ తాత్కాలికంగా పక్కన పెట్టింది.. తీరా కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారం కోల్పోగానే బాబు గారు బీజేపీకి రాంరాం చెప్పేసి సెక్యులరిజం పాచిపాట అందుకున్నారు.. ఏరు దాటగానే బోడి మల్లయ్య అనే నాయకుల పట్ల, రెండు కళ్ల సిద్దంతాలు వళ్లించే కపట నాటక సూత్రదారుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే మళ్లీ మోసపోవడం కాయం..


వినాశ కాలే విపరీత బుద్ది అన్నారు మన పెద్దలు.. ప్రజా వ్యతిరేక విధానాలతో కష్టకాలం ఎదురుకొంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం తన సమాధిని తానే సిద్దం చేసుకుంటోంది.. బస్సు చార్జీలు, విద్యుత్తు చార్జీలు ఎడా పెడా పెంచేసిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం క్రమంగా ప్రజలకు మరింత దూరమౌతోంది.. ఒకవైపు ప్రజల ప్రయోజనాలకు చేటు తెస్తూ, మరో వైపు ఇందిరమ్మ బాట.. యువకిరణాలు అంటే నమ్మేది ఎవరు?

Saturday, September 22, 2012

మీ స్వప్నం.. మా గమ్యం

స్వప్నం సాక్షాత్కారం కాకుండానే నిష్క్రమించావా బాపూ.. మీరు లేకున్నా మీ ఆశయాలు సజీవంగానే ఉంటాయి.. మీ స్పూర్తి ప్రతి వ్యక్తిని నడిపిస్తుంది.. మీ స్వప్నం నెరవేరే రోజు తప్పక వస్తుంది.. అతి త్వరలోనే..

ప్రజలచే సేవయే కర్తవ్యం..

Wednesday, September 19, 2012

Tuesday, September 18, 2012

దేశభక్తి కూడా నేరమేనా?.. హైదరాబాద్ స్వతంత్ర భారత దేశంలో విలీనమైన వేడుకలను జరుపుకోవడం మన ప్రభుత్వ దృష్టిలో తప్పేనేమా?..

Sunday, September 16, 2012

17.09.1948 నాడు ఏం జరిగింది?

సెప్టెంబర్ 17.. ఈ తేదీ దగ్గర పడుతున్న సమయంలో చర్చ మొదలౌతుంది.. ఆ తర్వాత అంతా మరిచిపోతారు.. నిజాలు ఎలా ఉన్నా చరిత్రకు వక్ర భాష్యాలు చెప్పే వారు ఎక్కువయ్యారు.. ఈ భాష్యాలతో చారిత్రిక సత్యాలు మరుగున పడుతున్నాయి.. ఈ చారిత్రిక దిన ప్రతిష్ట దిగజారుతోంది.. ఇంతకీ 1948 సెప్టెంబర్ 17న ఏం జరిగింది?..
హైదరాబాద్ సంస్థానాన్ని పాలించిన అసఫ్ జాహీ వంశ పాలకుడు ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిరంకుశ పాలన గురుంచి తెలుసుకోవాలనుకుంటే ఇంకా జీవించి ఉన్న ఆనాటి వయోవృద్దులను అడిగి చూడండి.. నిజాం పాలనలో ప్రజల కనీస హక్కులపై తీవ్రమైన నిర్భందం ఉండేది.. తెలుగువారు తమ మాతృభాషలో చదువుకునే హక్కు లేదు.. పండుగలు, మత ఆచారాలపై ఆంక్షలు ఉండేవి.. రాజకీయ పార్టీలపై నిషేధం కొనసాగింది.. రజాకార్లు, జాగీర్దార్లు, దేశ్ ముఖ్లు ప్రజలను ఎంతగానో పీడించారు.. బీబీనగర్, బైరోనిపల్లి తదితర గ్రామాలు ఈ దురాగతాలకు సజీవ సాక్ష్యాలు.. తెలంగాణ పల్లెల్లో ఈ అరాచకాల గురుంచి నేటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు.. ఏడో నిజాం నిరంకుశ పాలనపై కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలతో పాటు ఆర్యసమాజ్ తమదైన సైద్దాంతిక దృక్పథాలతో పోరాటం సాగించాయి..

నిజాం నిరంకుశ పాలనపై జరిగిన పోరాటంలో ఎందరో వీరులు అమరులయ్యారు.. వీరి గాథలు వెలుగు చూడకుండాపోయాయి.. రజాకార్ల దౌర్జన్యాలపై ధైర్యంగా రాసిన ఇమ్రోజ్ పత్రిక ఎడిటర్ షోయబుల్లాఖాన్ ను వారి నాయకుడు కాసిం రజ్వీ దారుణంగా హత్య చేయించాడు.. 15 అగస్టు 1947 రోజున భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది.. కానీ హైదరాబాద్ సంస్థాన ప్రజలు ఇంకా చీకటి పాలనలోనే మగ్గిపోయారు.. హైదరాబాద్ స్వతంత్రంగానే ఉంటుందని నిజాం ప్రభువు ప్రకటిస్తే, ఢిల్లీ ఎర్రకోటపై అసఫ్ జాహీ పతాకం (నిజాం జెండా) ఎగురేస్తానని కాసిం రజ్వీ విర్రవీగాడు.. సంస్థానంలో క్షీణిస్తున్న పరిస్థితులను గమనించిన ప్రభుత్వం హైదరాబాద్ నలువైపుల నుండి ఆపరేషన్ పోలో పేరిట సైనిక చర్య (పోలీస్ యాక్షన్) చేపట్టింది.. నాలుగు రోజుల పోరాటం తర్వాత నిజాం ప్రభువు లొంగుబాటును ప్రదర్శించి, 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ ను భారత దేశంలో సంపూర్ణంగా విలీనం చేశారు..

ఆనాటి హైదరాబాద్ సంస్థానంలో భాగాలుగా ఉండి తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో చేరిన జిల్లాల్లో విలీన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.. కానీ హైదరాబాద్ సంస్థానంలోని ప్రధాన భూభాగమైన తెలంగాణలో మాత్రం ఈ ఉత్సవాలు జరగవు.. ఉత్సవాలు జరిపితే మైనారిటీలు నొచ్చుకుంటారని మన పాలకుల భయం.. నిజానికి నిజాం నిరంకుశ పాలనపై పోరాటంలో హిందువులతో పాటు ముస్లింలు కూడా భాగస్వాములుగా ఉన్నారు.. కానీ ఈ చారిత్రిక సత్యాన్ని తొక్కి పెడుతూ, చరిత్రకు వక్రభాష్యాలు చెబుతున్నారు.. ఎందుకీ వంచన?.. విలీనమా? విమోచనమా? దురాక్రమణా? అనే చర్చ అర్థరహితం.. హైదరాబాద్ (తెలంగాణ) ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిన 17 సెప్టెంబర్ వేడుకలను ఘనంగా జరుపుకుందాం..

రెడ్డొచ్చె.. రెడ్డిబాయె..

కిరణ్ కుమార్ రెడ్డిని మార్చేసి జైపాల్ రెడ్డిని సీఎంను చేస్తారట.. మీడియాలో జరుగుతున్న ప్రచారం వాస్తవ రూపం దాలిస్తే మరణ శయ్యపై ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం స్వయంగా తన ఆక్సిజన్ తానే తొలగించుకున్నట్లే.. ముచ్చటగా నాలుగో కృష్ణుడు వచ్చినా నాటకాన్ని రక్తి కట్టించడం అసాధ్యమే.. కిరణ్ చేయలేని ఘన కార్యాలేవో జైపాల్ చేస్తాడని ఊహించడం అత్యాశే.. జైపాల్ రెడ్డిని తెరపైకి  తెలంగాణ వాదాన్ని అడ్డుకుందామని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తే అది అవివేకమే.. రాష్ట్రంలో పరిపాలన ఎప్పడో గాడి తప్పింది.. ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్న తరుణంలో ఎన్ని దిద్దుబాట్లు చేపట్టినా వృధా ప్రయాసే.. వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్ అధినాయకత్వం వరుప తప్పటడుగులు వేస్తోంది.. ఈ అడుగులన్నీ పతనం వైపే..

Saturday, September 15, 2012

ఎఫ్.డి.ఐ.లకు గేట్లు బార్లా.. బరి తెగించిన యూపీఏ

గ్యాస్ డీజిల్ మంటలు చల్లారక ముందే మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది యూపీఏ సర్కారు.. రిటైల్ రంగంలో 51% ఎఫ్‌డీఐలు, 4 ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణ, దేశీయ విమాన యానంలోకి విదేశీ కంపెనీల అనుమతి.. ఇంత కాలం మన నగరాల్లో పెద్ద పెద్ద మాల్స్ చూసి దేశీయ పెట్టుబడిదారులు మన నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నార్లే అని సరిపెట్టుకున్నాం.. ఇప్పడు మన్మోహనుడి పుణ్యమా అని దేశ సంపద క్రమంగా విదేశాలకు వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది.. ఒక్కసారి దేశంలో తిష్టేసిన విదేశీ కంపెనీలు మన ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయనే హామీ ఏమైనా ఉందా? డబ్బు కోసం ఎంతకైనా బరి తెగించే మన పాలకులను నమ్మొచ్చా? మళ్లీ ఈస్టిండియా పాలన రోజులు రానున్నాయా?
సంస్కరణలు అమలులోకి వచ్చి రెండు దశాబ్దాలు అవుతున్నా వాటి ఫలితాలపై అసలు సమీక్షంటూ జరిగిందా? మరుగుదొడ్ల కన్నా సెల్ ఫోన్లు ఎక్కువున్నాయనే విచిత్ర విశ్లేషణలకు బదులు, పేదరికం ఏమేరకు తగ్గింది? వారి బతులుకులు ఏమేరకు మెరుగయ్యాయి అని తెలుసుకునే ప్రయత్నం చేశారా? తెల్ల ఏనుగుల్లాంటి ప్రభుత్వరంగ సంస్థలను ఇలాగే నడపమని కోరుకోవడం సరికాదు, కానీ వాటిని సంస్కరించే బదులు పూర్తిగా వదిలించేసుకోవడం అంటే ప్రభుత్వం బాధ్యత నుండి తప్పుకోవడం కాదా?
మరి కొద్ది నెలల్లో ఎన్నికలు వస్తున్న తరుణంలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకునే అధికారం యూపీఏ సర్కారుకు ఎక్కడిది? పోతూ పోతూ విదేశీ కంపెనీల నుండి అందిన కాడికి దండుకుందామనే ఆలోచనే కదా? మన ప్రతిపక్షాలు కూడా బాధ్యతా రహిత్యంగానే వ్యవహరిస్తున్నాయి.. రోడ్ల మీద తూతూ మంత్రంలా నామ మాత్రం నిరసనలు తెలపడం తప్ప, ప్రభుత్వం మెడలు వంచే ప్రయత్నాలు చేసిన దాఖలాలూ లేవు.. అధికారంలోని వస్తే తమకూ వాటాలు వస్తాయనే దు(దూ)రాలోచన వారికీ ఉందనడంలో సందేహం లేదు.. ఇక ప్రజలే తిరగబడాల్సిన సమయం వచ్చింది..

Friday, September 14, 2012

పేదల బాధలు పట్టని సర్కారు


బ్రిటిష్ వాడు మన దేశంలో టీ ప్రవేశ పెట్టే కొంత కాలం పాటు ఉచితంగా తాగించి అలవాటు చేశాడట.. మన స్వదేశీ ప్రభుత్వం కూడా వంట చెరుకు బదులు గ్యాస్ వాడకాన్ని సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించి, ఇప్పడు సబ్సిడీలు ఎత్తేస్తామంటోంది.. నిజానికి మన దేశంలో పెట్రోలు, డీజిల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీలు రాజకీయ నాయకులు, వారి బంధుమిత్రుల చేతిలోనే ఉన్నాయి.. ధరలు ఎంత పెరిగితే వారికి అంతగా లాభాలు వస్తాయి.. ప్రజల కష్టాలు పాలకులకు పట్టవు.. యూపీఏ పాలనలో మరీ ఘోరంగా పెట్రో బాధలు పెరిగిపోయాయి.. మళ్లీ అధికారంలోని వస్తామన్న ఆశలు లేని కాంగ్రెస్ పాలకులు అందిన కాడికి దండుకోవడమే పనిగా పెట్టుకున్నారు.. ధరలు ఎంత పెరిగినా ధనికులకు బాధ తెలియదు.. కానీ కష్టాలు అనుభవించేది పేదలు, మధ్య తరగతి ప్రజలే.. అసమర్థ పాలకులకు బుద్ది చెప్పేందుకు ఎన్నిక దాకా ఎదురు చూడాలా?.. కన బడిన చోటల్లా 'సత్కారం' చేద్దాం.. అప్పుడైనా బుద్ది వస్తుందోమో చూద్దాం..

Tuesday, September 11, 2012

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వదు

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వదుగాక ఇవ్వదు.. ఈ విషయం మెడ మీద తలకాయ ఉన్నోడికి స్పష్టంగా తెలుసు.. హోంమంత్రి షిండేతో పాటు గతంలో ఎందరో కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు పరోక్ష మాటలతో స్పష్టం చేస్తూనే ఉన్నారు.. ఈ నిజం తెలిసినా తెలంగాణ కోసం పోరాడుతామని చెప్పుకుంటున్న వ్యక్తులు లాబీయింగ్, పోరాటాల పేరిట కాలక్షేపం చేస్తూ తమ సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నారు.. తెలంగాణ పార్టీలు, ఉద్యమకారుల మధ్య ఐక్యతే లేనప్పుడు ప్రభుత్వాలు ఇలాగే చేస్తుంటాయి.. రాష్ట్రంలో అనిశ్చితికి తెరదించుదామనే సదాలోచన ఏ పార్టీకీ లేదు.. రెండు పడవల మీద కాలు పెట్టి చేసే ఈ ప్రయాణాలు ఇంకెంత కాలం?.. ముసుగులో గుద్దులాటలు, రాజకీయ ప్రయోజనాలు కట్టిపెట్టి, తెలుగు ప్రజల కోసం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది..

Sunday, September 9, 2012

యాదిలో కాళన్న

పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అన్నారు కాళోజీ నారాయణ రావు.. హైదరాబాద్ సంస్థాన విముక్తి, ఈ ప్రాంత రాజకీయ, భాష, రాజకీయ చైతన్యం కోసం కృషి చేసిన మహా వ్యక్తి కాళోజీ.. రెండున్నర జిల్లాల భాషే తెలుగు భాష ఎట్లైతదని నిలదీసిన మహనీయుడాయన.. నేడు కాళోజీ 98వ జయంతి.. కాళన్నను స్మరించుకుందాం..

Saturday, September 8, 2012

గోరక్షణ ఇలాగేనా?

ఇటీవల ఒకటి రెండు పత్రికల్లో, అందునా లోపలి పేజీలో వచ్చిన వార్త ఇది.. ఎవరినీ ఆకర్శించని వార్త అనుకుంటా.. అందుకే అంతగా పట్టించుకొనివుండరు.. ఆంధ్రప్రదేశ్ గోవధ నిషేధం, పశు సంరక్షణ చట్టం-1977ను తీసుకొచ్చి మూడున్నర దశాబ్దాలు అయినా ఇంత వరకూ అమలు చేయకపోవడాన్ని రాష్ట్ర హైకోర్టు తప్పు పట్టింది.. గో సంరక్షణ ఇలాగేనా? అని ప్రభుత్వాన్ని నిలదీసింది.. నాలుగు నెలల్లో నిబంధనలు రూపొందించాలని న్యాయస్థానం ఆదేశించింది.. కొద్ది రోజుల క్రితం ఇదే మరో అంశంపై మరో వార్తను ఓ పత్రికలో చూశాను.. మెదక్ జిల్లాలో విచ్చల విడిగా పశువధ శాలలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని హైకోర్టు న్యాయమూర్తి తప్పు పట్టారు.. గ్రామీణ ప్రాంతాల్లో పశు సంపద తగ్గి వ్యవసాయాభివృద్ధి తగ్గడాన్ని ప్రస్థావించారు..

హైదరాబాద్ నగరంలో, శివార్లలో రోడ్లపై విచ్చల విడిగా పిచ్చి కుక్కలు తిరుగుతూ, జనాలను కాటేస్తూ భయబ్రాంతులను చేస్తున్నాయి.. ఒక స్వచ్చంధ సంస్థ కుక్కలను చంపొద్దన్న సాకును చూపి ప్రభుత్వం పిచ్చి కుక్కల నిర్మూళనను గాలి కొదిలేసింది.. మన ప్రభుత్వానికి, స్వచ్ఛంద సంస్థలకు పశు సంపదపై ఈ భూత దయ ఎందుకు లేదో అర్థం కావడంలేదు.. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి పశు సంపద ఎంతో అవసరం. పాల ధరలు పేదలకు అందుబాటులో లేక వారి పిల్లలు తాగలేకపోతున్నారు.. మరి మనకు వీధి కుక్కలు ముఖ్యమా? పశు సంపద ముఖ్యమా?.. మత విశ్వాసాల విషయంలో చూసీ చూడనట్లు ఉండే మెజార్టీ వర్గ ప్రజలు ఆవును, పశు సంపదను పవిత్రంగా పూజిస్తారు.. ఈ అంశం మైనారిటీలకు సంబంధించినదో, రిజర్వేషన్ల అంశమో అయితే రాజకీయ నాయకులు పోటీ పడి ఉద్యమించేవారు.. కనీసం బీజేపీ కూడా ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం దురదృష్టకరం..

Thursday, September 6, 2012

ఫారిన్ బ్రాండ్ మహిమ

నిన్న' టైమ్' ఇవాళ 'వాఐింగ్టన్ పోస్టు' మన ప్రధాని అసమర్థ పనితీరును ఎండగట్టాయి.. మన్మోహన్ సింగ్ పరిపాలన గురుంచి ఈ పత్రికలు రాసిందాంట్లో కొత్తేమీ లేదు.. భారతీయ పత్రికలు తరచూ ఇలాంటి కథనాలు రాసినా ఫారిన్ సరకులాగా విదేశీ పత్రికలు రాస్తే మరింత విలువ ఉండటం సహజం.. అంతర్జాతీయ పత్రికలు మన దేశంపై ఏది రాసినా కొంత మేర సంచలనం సహజం.. భారత దేశంలో సింగ్ గారి ప్రతిష్టే ఇప్పటికే మసకబారింది.. ఇప్పడు ఈ పత్రికలు అంతర్జాతీయ స్థాయిలో ఎండగట్టేశాయి.. దేశీయ పత్రికలు ఎంత రాసినా దున్నపోతుపై వాన పడ్డ చందాన పట్టించుకోని ప్రధాని కార్యాలయం, కాంగ్రెస్ అధిష్టానం వాషింగ్టన్ పోస్టు పత్రికపై తీవ్ర అగ్రహంతో రుసరుసలాడుతూ స్పందించాయి..

Wednesday, September 5, 2012

ఉపాధ్యాయుల స్థానం ఎక్కడ?

గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పోల్చాయి మన పురాణాలు.. తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదేనని చెప్పారు మన పెద్దలు.. పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించి వారి భవిష్యత్తుకు పునాదులు వేసే ఉపాధ్యాయులకు మన సంస్కృతిలో ప్రముఖ స్థానమే ఉంది.. అయితే ఇదంతా నిన్నటి చరిత్రగానే మగిలిపోనుందా?

నేటి గురు శిష్య సంబంధాలు చూస్తే బాధ కలుగుతోంది.. విద్య అంగడి సరుకయ్యాక ఇది ఒక వ్యాపారికి, వినియోగదారునికి సంబంధించిన వ్యవహారమైపోయింది.. ఇదీ ఒక క్విడ్ ప్రొకో అంటే ఎలాంటి అతిషయోక్తి లేదు.. చదువుకునే వారు కరువై, చదువు కొనే వారు తయారయ్యారు.. ఉపాధ్యాయుల గౌరవం కూడా మసకబారింది.. నేటి సినిమాల్లో ఉపాధ్యాయులను బఫూన్ల మాదిరిగా, విద్యార్థులు వారిని టీజ్ చేసే వారిగానే చూపిస్తున్నారు.. సారీ టీచర్ లాంటి చిత్రాలు మరీ పరాకాష్టగా మారాయి.. ఇది చాలదన్నట్లు అక్కడక్కడా కీచక టీచర్లకు సంబంధించిన వార్తలు చూస్తున్నాం.. విలువలతో కూడిన విద్యకు, నైతిక విద్యకు స్థానం లేకుండాపోయింది..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పూర్తిగా దిగజారిపోయాయి.. ప్రయివేటు టీచర్లతో పోలిస్తే ఎన్నో రెట్లు అధిక జీతాలు తీసుకునే ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ బాధ్యతలను ఏనాడో గాలికి వదిలేశారు.. ఈ పరిస్థితిని సరిదిద్దే పని తమది కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి ఉపాధ్యాయ సంఘాలు.. ఈ సంఘాల నేతలు దళారులుగా తయ్యారని చెప్పడానికి బాధ కలుగుతోంది.. ఈ పరిస్థితులు మారాలని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కోరుకుందాం.. - క్రాంతి దేవ్ మిత్ర