Saturday, September 15, 2012

ఎఫ్.డి.ఐ.లకు గేట్లు బార్లా.. బరి తెగించిన యూపీఏ

గ్యాస్ డీజిల్ మంటలు చల్లారక ముందే మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది యూపీఏ సర్కారు.. రిటైల్ రంగంలో 51% ఎఫ్‌డీఐలు, 4 ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణ, దేశీయ విమాన యానంలోకి విదేశీ కంపెనీల అనుమతి.. ఇంత కాలం మన నగరాల్లో పెద్ద పెద్ద మాల్స్ చూసి దేశీయ పెట్టుబడిదారులు మన నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నార్లే అని సరిపెట్టుకున్నాం.. ఇప్పడు మన్మోహనుడి పుణ్యమా అని దేశ సంపద క్రమంగా విదేశాలకు వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది.. ఒక్కసారి దేశంలో తిష్టేసిన విదేశీ కంపెనీలు మన ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయనే హామీ ఏమైనా ఉందా? డబ్బు కోసం ఎంతకైనా బరి తెగించే మన పాలకులను నమ్మొచ్చా? మళ్లీ ఈస్టిండియా పాలన రోజులు రానున్నాయా?
సంస్కరణలు అమలులోకి వచ్చి రెండు దశాబ్దాలు అవుతున్నా వాటి ఫలితాలపై అసలు సమీక్షంటూ జరిగిందా? మరుగుదొడ్ల కన్నా సెల్ ఫోన్లు ఎక్కువున్నాయనే విచిత్ర విశ్లేషణలకు బదులు, పేదరికం ఏమేరకు తగ్గింది? వారి బతులుకులు ఏమేరకు మెరుగయ్యాయి అని తెలుసుకునే ప్రయత్నం చేశారా? తెల్ల ఏనుగుల్లాంటి ప్రభుత్వరంగ సంస్థలను ఇలాగే నడపమని కోరుకోవడం సరికాదు, కానీ వాటిని సంస్కరించే బదులు పూర్తిగా వదిలించేసుకోవడం అంటే ప్రభుత్వం బాధ్యత నుండి తప్పుకోవడం కాదా?
మరి కొద్ది నెలల్లో ఎన్నికలు వస్తున్న తరుణంలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకునే అధికారం యూపీఏ సర్కారుకు ఎక్కడిది? పోతూ పోతూ విదేశీ కంపెనీల నుండి అందిన కాడికి దండుకుందామనే ఆలోచనే కదా? మన ప్రతిపక్షాలు కూడా బాధ్యతా రహిత్యంగానే వ్యవహరిస్తున్నాయి.. రోడ్ల మీద తూతూ మంత్రంలా నామ మాత్రం నిరసనలు తెలపడం తప్ప, ప్రభుత్వం మెడలు వంచే ప్రయత్నాలు చేసిన దాఖలాలూ లేవు.. అధికారంలోని వస్తే తమకూ వాటాలు వస్తాయనే దు(దూ)రాలోచన వారికీ ఉందనడంలో సందేహం లేదు.. ఇక ప్రజలే తిరగబడాల్సిన సమయం వచ్చింది..

No comments:

Post a Comment