Wednesday, August 31, 2016

వానలకు తట్టుకోలేని నగరమా..

కేవలం ఒకపూట, అదీ కొద్ది గంటలు కురిసిన భారీ వర్షానికే హైదరాబాద్ మహానగరం అతలాకుతలమైపోయింది.. రోడ్లు నదుల్లా మారాయి.. బస్తీలు, కాలనీలు చెరువులను తలపించాయి.. 2000 సం.నాటి విపత్తును తలచుకొని జనం భయపడిపోయారు.. 425 ఏళ్ల మన మహానగరానికి ఏమిటీ దుస్థితి?
ఒకప్పుడు హైదరాబాదు భాగ్ నగర్ (ఉద్యాన నగరం),లేక్స్ సిటీ (చెరువుల నగరం)గా గుర్తింపు ఉండేది.. ఈ మహానగర పరిధిలో 500కు పైగా చిన్నా పెద్ద చెరువులు, కుంటలు, కాలువలు, తోటలు ఉండేవి.. ఇవన్నీ గొలుసుకట్టు పద్దతిలో ఒకదానికొకటి అనుసంధానమై వరద నీరు మూసీలో కలిసేది.. (చిత్రాన్ని చూడండి) కానీ ఇప్పుడు ఇందులో 10వ వంతు కూడా ఇప్పుడు కనిపించడంలేదు..
నగరీకరణ పేరుతో అన్నింటినీ మింగేశారు.. చెరువులు, కాలువలు కబ్జా చేసి కాలనీలు, బస్తీలు, భవన సముదాయాలు నిర్మించారు.. మరి వాన పడితే నీరు ఎక్కడికి పోవాలి.. అందుకే వాన పడితే చాలు నీరంతా రోడ్లమీదకు వస్తోంది.. డ్రైనేజీలు, కాలువలపై వత్తిడి పెరిగి నగరం చెరువులా మారిపోతోంది.. ఈ పరిస్థితికి కారణం ఎవరు?
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నివాస వసతి కల్పించాలంటే చెరువులు, కుంటలను పూడ్చాల్సిందేనా?.. జనావాసాలకు తగ్గట్లుగా డ్రైనేజీలు, కాల్వలను విస్తరించాల్సిన అవసరం లేదా?.. కబ్జాలను తొలగించి, జలప్రవాహాలకు ఆటంకాలు నివాలించే ప్రయత్నం ఎందుకు  చేయడం లేదు? తప్పు ప్రభుత్వానిదేనా? ఇందులో మన పాత్ర లేదా? ఒక్కసారైనా ఆత్మ పరీక్ష చేసుకున్నామా?..

Monday, August 29, 2016

మన తెలుగులో తెలుగెంత?

దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణ దేవరాయలు అన్నారని పదే పదే గుర్తు చేసుకుంటాం.. కానీ తెలుగు క్రమంగా లెస్అవుతున్నా పట్టించుకోం..
హిందీ తర్వాత దేశంలో రెండో అతిపెద్ద భాష తెలుగు.. హిందీకి సొంత లిపి లేదు.. కానీ తెలుగుకు సొంత లిపి, అస్థిత్వం ఉంది.. కానీ ఏమి లాభం?
దేశంలోనే భాష పేరిట ఏర్పడిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.. కానీ అధికార భాషగా ఏనాడూ తెలుగు అమలుకు నోచుకోలేదు.. ఎందుకిలా?
మన సొంత రాష్ట్రాల్లో తెలుగును ఎందుకు బతుకు తెరువు భాషగా మార్చలేకపోయాం? ఎందుకు ఇంగ్లీషు వెంట పడుతున్నాం?

కొద్దిపాటి జనాభా ఉన్న దేశాలు తమ భాషను ప్రపంచ భాషలుగా రుద్దాయి.. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్లకు పెగా ఉన్న మనం తెలుగును ఎందుకు ప్రపంచ భాష చేయలేకపోతున్నాం?
అరవం వాడు తమ భాషకు ప్రాచీన హోదా తెచ్చుకున్నాడని, మనమూ కేంద్ర ప్రభుత్వంతో పోరాడి తెచ్చుకున్నాం.. కానీ ఒరిగిందేమిటి?..
బ్రిటిష్, కుతుబ్ షాహీ, నిజాం పరాయిపాలనలో వికసించిన తెలుగు భాష, సొంత పాలకుల హయాంలో ఎందుకు కొడిగట్టుకుపోతోంది?
ఈ రోజున మనం మాట్లాడుతున్న తెలుగు భాషలో ఎన్ని తెలుగు పదాలు ఉన్నారో గమనించారా?..
తెలుగు టీవీ ఛానళ్లలో కనీసం 50 శాతం తెలుగు కూడా లేని సంగతి మీకు తెలుసా? తెలుగు పత్రికల్లో వాడే భాషలో 20 శాతం కూడా తెలుగు లేని విషయాన్ని గుర్తించారా?
అంతర్జాలంలో ఇంగ్లీషుకు ఉన్న సౌలభ్యం తెలుగు భాషకు ఎందుకు లేదు?.. వందలాది ఇంగ్లీషు ఫాంట్లు ఉచితంగా దొరుకుతాయి.. కానీ మనకు తెలుగు ఫాంట్లు మరీ అంత ఖరీదుగా మారాయెందుకు?
ప్రపంచంలో వేగంగా అంతరిస్తున్న భాషల్లో తెలుగు ఒకటని యునెస్కో ఏనాడో గుర్తించింది.. ఈ సంకేతాలు మీకు కనబడటం లేదా?
తెలుగు భాషకు అన్యాయం జరుగుతోందని, పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నాం.. కానీ మన ఇళ్లలో, మన చుట్టు పక్కల సమాజంలో భాషను కాపాడుకుంటున్నామా?.. ప్రభుత్వాల మీద ఎందుకు వత్తిడి తేలేకపోతున్నాం..
తమిళ, కన్నడ రాష్ట్రాల్లో ఎన్ని రాజకీయాలు ఉన్నా వారి మాతృభాషను కాపాడుకోవడంలో అంతా ఒకటి అవుతారు.. ఈ పరిస్థితి మన తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు లేదు?..
ఈ ప్రశ్నల్లో కనీసం 50 శాతమైనా ఆలోచింపజేస్తే మనలో తెలుగు భాషాభిమానం ఇంకా ఉన్నట్లే.. ఈ ఆశాభావమే తెలుగు భాష సంరక్షణకు పునాది కావాలి..
ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.. 

Sunday, August 28, 2016

అదే పనిగా తప్పు చేస్తే పాకిస్తాన్..

ఒకసారి తప్పు చేస్తే అజ్ఞాన్
రెండోసారి తప్పు చేస్తే నాదాన్
పలుమార్లు తప్పు చేస్తే సైతాన్
అదే పనిగా తప్పులు చేస్తే పాకిస్తాన్
(హర్యానా అసెంబ్లీలో జైన దిగంబర సాధువు తరుణ్ సాగర్ ప్రసంగం నుండి

Thursday, August 25, 2016

*మోదీ వైపు బలూచీల చూపు.. ఖంగుతిన్న పాక్

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తున్న పాకిస్తాన్ కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గట్టి ఝలకే ఇచ్చారు.. స్వాతంత్ర్య దినోత్సవ దినోత్సవ ప్రసంగంలో బలూచిస్తాన్ లో పాకిస్తాన్ ఆగడాలను మోదీ ప్రస్థావించడం తెలిసిందే. పాకిస్తాన్ నుండి వేరు పడేందుకు దశాబ్దాలుగా పోరాడుతున్న బలూచీలకు భారత ప్రధాని సంఘీభావం పలకడాన్ని పాక్ జీర్ణించుకోలేకపోతోంది..
తమ పోరాటాన్ని భారత ప్రధాని గుర్తించడంతో బలూచ్ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. మోదీకి ధన్యవాదాలతో ప్రదర్శనలు చేపట్టారు. తమ పోరుకు భారత్ సహకారంలపై వారు గంపెడాశలు పెట్టుకున్నారు.
పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నసీరాబాద్, డేరాబుగ్తీ, సుయ్, జాఫరాబాద్ తదితర ప్రాంతాల్లో ఆందోళనలు తీవ్రమయ్యాయి. పాకిస్థాన్ జెండాలను కింద పడేసి తొక్కుతున్నారు.  ముషారఫ్ హయాంలో హత్యకు గురైన బలూచీ నేత అక్బరుద్దీన్ భుగ్తీ,నరేంద్ర మోదీ ఫొటోలు, భారత జాతీయ పతాకాలు పట్టుకుని ప్రదర్శనలు జరుపుతున్నారు. మోదీ సహకరిస్తే బంగ్లాదేశ్‌లా బలూచిస్తాన్ కూడా స్వతంత్ర్యదేశంగా ఏర్పడుతుందని వారు ఆశలు పెట్టుకున్నారు. చూడబోతే పాకిస్తాన్ ఎక్కువ కాలం మనుగడలో ఉండే అవకాశాలు కనిపించం లేదు. సింధ్ లో కూడా ఎప్పటి నుండో సింధ్ దేశ్ కోసం ఉద్యమాలు జరుగుతున్నాయి. వాయువ్య సరిహద్దు రాష్ట్రంలో గిరిజన తెగలు చాలా కాలంగా పాక్ సైన్యంతో పోరాడుతున్నాయి.. పీవోకే భారత్ లో కలిస్తే పాకిస్తాన్ ఇక పశ్చిమ పంజాబ్ రాష్ట్రంకే పరిమితం..

గీతాచార్యుని జన్మదినం

Wednesday, August 24, 2016

బాధ్యత ప్రభుత్వానిదేనా? మీది కాదా?

130 కోట్ల జనాభా గల పెద్ద దేశం సాధించింది రెండు పతకాలేనా? అందులో ఒకటి వెండి, ఇంకోటి కాంస్యం.. ఒక్క బంగారు పతకమైనా గెలిచారా సిగ్గు సిగ్గు..పెదవి విరిచాడు మా రావు గారు..
ఇది మన ప్రభుత్వాల వైఫల్యం.. మరోసారి హుంకరించాడు..
మాస్టారూ మీరు మాట్లాడుతున్నది ఏ విషయంలో?.. కాస్త అమాయకంగానే అడిగాను..
నువ్వేమి జర్నలిస్టువయ్యా? ఆ మాత్రం అర్థం చేసుకోలేవా?.. నేను మాట్లాడేది రియో ఒలింపిక్స్ లో మన దేశ వైఫల్యంగురుంచి.. కాస్త కసురుకున్నట్లే జవాబిచ్చాడు రావు..
అది సరేగానీ రావుసాబ్.. మీ పిల్లలేం చేస్తున్నారు?..

అబ్బాయి ఇంజినీరింగ్ సెకండియర్.. మా అమ్మాయి ఇంటర్ బైపీసీ ఫైనల్ ఇయర్.. డాక్టర్ అవ్వాలనుకుంటోంది.. కాస్త కుతూహలంగా చెప్పాడు..
ఓహో.. మీ ఇంట్లో ఒకరు ఇంజినీరు, మరొకరు డాక్టర్ అవుతున్నారన్నమాట..
కాస్త గర్వంగా కాలరెగరేస్తూ నావైపు లుక్కిచ్చుకున్నారు రావుగారు..
మీ పిల్లలు ఏమైనా ఆటలాడతారా? క్రికెట్, హాకీ, టెన్నిస్, కబడ్డీ, చెస్.. ఇంకేమైనా?..
వాళ్లకు అంత తీరికెక్కడిది నాయనా? పొద్దున్నే కాలేజీకి వెళ్లి రాత్రికి గానీ తిరిగి రారు.. కాలేజీలోనే స్పెషల్ కోచింగ్.. రాత్రికి ఇంటికి వచ్చాక కాస్త మింగుడు పడి పడుకుంటారు.. మళ్లీ పొద్దున్నే ఉరుకులు, పరుగులు..
కనీసం సెలవు రోజుల్లో అయినా ఆడుకునేందుకు పోతారా?..
కష్టపడి చదువుకోవాల్సిన వయసులో ఆటలు ఎందుకు?.. ఆటల మీద ధ్యాస పెడితే, వారి చదువు సంకనాకి పోదా? కాస్త ఆగ్రహంగానే బదులిచ్చారు రావు గారు..
గురుడు దొరికి పోయాడు.. నా మొహంపై ఓ చిరునవ్వు మొలిచింది.. ఇక అప్పుడందుకున్నాను..
రావు సాబ్.. ఏమంటిరి ఏమంటిరి?.. ఆటలాడితే చదువు సంకనాకి పోతదా?.. అందరూ కెరీర్ పేరిట తమ పిల్లలకు ఆటలకు దూరం చేసి పుస్తకాల పురుగులను చేస్తే, క్రీడాకారులు ఎలా తయారవుతారు?.. ఒలింపిక్స్, ఏసియన్ గేమ్స్ లో మన దేశానికి పతకాలు ఎలా వస్తాయి?
గతుకుక్కు మన్నారు రావు గారు.. కాస్త ఇబ్బందిగా మొహం పెట్టి అక్కడి నుండి నిష్క్రమించాడు..
మన దేశం ఒలింపిక్స్ లో పతకాలు సాధించలేదని, ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించడం లేదని నిందిస్తారు.. కానీ తమ పిల్లలు క్రీడాకారులు కావాలని ఏ తల్లి దండ్రులూ కోరుకోరు.. సాయంకాలం వేళ వారిని ఆడుకోవడానికి పంపరు.. అందరూ తమ పిల్లలు చదువులకే పరిమితం కావాలని కోరుకుంటే, క్రీడాకారులు ఎలా తయారవుతారు? దేశానికి పతకాలను ఎవరు తీసుకు వస్తారు..
మీ పిల్లలు చదువుకునే స్కూళ్లలో ప్లే గ్రౌండ్స్ ఉన్నాయా? వాటిలో ఏయే ఆటలు ఆడిస్తున్నారు?.. అసలు స్కూళ్లలో పీఈటీలు అనేవారు ఉన్నారా?.. ఈ ప్రశ్నలకు మీ దగ్గర ఏమైనా జవాబు ఉందా?
తల్లి దండ్రులు ముందు తమ పిల్లలు ఆడుకునే స్వేచ్ఛ ఇవ్వాలి.. వారి ఇష్టాఇష్టాలను గమనించాలి.. క్రీడలపై వారికి ఆసక్తి ఉంటే ప్రత్యేక శిక్షణ ఇప్పించాలి.. ఇవేవీ పట్టించుకోకుండా ప్రభుత్వాలదే తప్పు అని బండరాయి పడేయడం ఎంత వరకు సమంజసం?.. ఆలోచించండి..

Monday, August 22, 2016

సామాజిక సేవలో ముందడుగు..

WE CAN CHANGESocial Media for Social Service నినాదంతో తొలి అడుగు ఇది.. Facebook, Whatsapp తదితర సోషల్ మీడియా గ్రూప్స్ కేవలం చర్చలు, కబుర్ల కోసమేనా? ఇందులోని సభ్యుల ద్వారా మనకు సాధ్యమైన సేవా కార్యక్రమాలు చేయలేమా? అనే ఆలోచన చాలా కాలంగా నా మనసును తొలిచేస్తూ వచ్చింది.. 
ఈ దశలో జాతీయభావజాల వేదికగా ప్రారంభించిన WE CAN CHANGE ద్వారా ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాను.. నా ఆలోచనలను బృందంలోని మిత్రులతో పంచుకోగా వారు వెంటనే కార్యాచరణ మొదలు పెడదామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. ఇలా తొలి అడుగు రంగారెడ్డి జిల్లాలోని మారుమూల గ్రామం కడ్మూరులో పడింది..

పూడూరు మండలం కడ్మూరులో ఉన్న ప్రభుత్వ పాఠశాల ఉన్నత పాఠశాలగా ఎదుగుతోంది.. ఈ గ్రామంలో వనరులు చాలా తక్కువ. పాఠశాలలోని విద్యార్థులకు చదువుకోవాలనే తపన ఉంది.. వీరికి మంచి విద్యా సంస్కారాలు అందించేందుకు ప్రధానోపాధ్యాయుడు చిన్ని కృష్ణ తన తోటి ఉపాధ్యాయులతో చాలా కష్టపడుతున్నారు.. గ్రామస్తులు కూడా వీరికి మంచి సహకారం అందిస్తున్నారు.. విరాళాలు వేసుకొని అధనపు ఉపాధ్యాయులను సమకూర్చుకున్నారు..  ఈ దశలో కడ్మూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కొన్ని విజ్ఞాన శాస్త్ర పుస్తకాలు అవసరమని తెలిసింది.. ఈ అవసరాన్ని తీర్చే బాధ్యత WE CAN CHANGE భుజాన వేసుకుంది..

ఈ విషయాన్ని మన గ్రూప్ లో ప్రకటించగానే ఆత్మీయ మిత్రులు స్పందించి విరాళాలు అందజేశారు.. నాతో పాటు మిత్రులు తరుణ్ చక్రవర్తి, నరేంద్ర వర్మ, నీలేశ్ జోషి కడ్మూరు విద్యార్థులకు గ్రామ పెద్దలు, విద్యా కమిటీ సభ్యుల పుస్తకాలను అందజేశాం.. ఇలా మన తొలి కార్యక్రమాన్ని విజయవంతమైంది.. ఇందుకు సహకరించిన మిత్రులందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.. మన WE CAN CHANGE మున్ముందు చేపట్టే కార్యక్రమాలకు మీ అందరి సహకారం, దీవెనలు కోరుకుంటున్నాను..



Sunday, August 21, 2016

అక్షర యోధుడు షోయబ్ బలిదానం

ప్రతి మనిషికి మరణం తప్పదు.. చావు నుండి తప్పించుకోలేం.. అయితే ఆ మరణం ఒక లక్ష్యం కోసం జరగాలి దేశం కోసం మరణించడానికి నేను సంతోషిస్తాను - షోయబుల్లా ఖాన్
హైదరాబాద్ సంస్థానాన్ని నిరంకుశుడైన ఏడో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలిస్తున్న రోజులవి.. మధ్య యుగాల నాటి ప్యూడల్ పాలన.. సంస్థానంలో పౌర హక్కులు లేవు.. మెజారిటీ ప్రజల మతం, విద్య, సంస్కృతి, సాంప్రదాయాలంటే పాలకులకు ఏమాత్రం గౌరవం లేదు.. నిజాం నవాబు ప్రోత్సాహంతో  రజాకార్ల ఆడగాలు మరోవైపు.. పగలంతా నిజాం పాలన సాగితే, రాత్రి రజాకార్లు గ్రామాలపై పడేవారు.. అందిన కాడికి దోచుకోవడం, మహిళలను చెరచడం, అడ్డం వచ్చిన వారిని చంపేయడం, ఇళ్లు, ఆస్తులు తగుల పెట్టడం నిత్యకృత్యంగా మారింది..
1947 ఆగస్టు 15న భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా, హైదరాబాద్ ఇంకా విముక్తి కాలేదు.. బ్రిటిష్ వారి సామంతుడు నిజాం తాను స్వతంత్రుడినని ప్రకటించుకున్నారు.. సంస్థాన ప్రజలంతా భారత దేశంలో విలీనం కావాలని కోరుకుంటున్నారు.. ఆర్యసమాజ్, స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టులపై నిర్భందం పెరిగింది.. నిజాం నవాబుకు అండగా నిలిచిన రజాకార్ల నాయకుడు కాశీం రజ్వీ మరింత రెచ్చిపోయాడు  అనల్ మాలిక్ నినాదంతో  హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెట్టి తన ఆగడాను ఉదృతం చేశారు రజాకార్లు..
ఇలాంటి వేళ గర్జించిందో ముస్లిం జర్నలిస్టు కలం.. నిజాం పాలన, నిజాం దురాగతాలపై షోయబుల్లాఖాన్ తన ఇమ్రోజ్ పత్రిక ద్వారా నిప్పులు చెరిగాడు.. 1920లో వరంగల్‌జిల్లా మహబూబాబాద్‌లో జన్మించిన షోయబుల్లాఖాన్ ఉస్మానియా యూనివర్సిటీ లో గ్రాడ్యుయేషన్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని కాలదన్ని జర్నలిజం వృత్తిని ఎన్నుకున్నాడు.. ముందుముల నరసింగరావు సంపాదకత్వంలోని జాతీయవాద పత్రిక రయ్యత్లో చేరాడు.. రజాకార్లూ, భూస్వాముల ఆగడాలపై వ్యాసాలు రాసేవాడు.. దీంతో ప్రభుత్వం రయ్యత్ ను నిషేధించింది..
ఇంతటితో ఆగని షోయబుల్లాఖాన్ ఇమ్రోజ్అనే సొంత పత్రికను ప్రారంభించాడు.. మరింత దూకుడుగా నిజాం, రజాకార్లను ఎండగట్టాడు.. ఈ ధిక్కార స్వరాన్ని సహించలేకపోయాడు కాశిం రజ్వీ.. అందునా ఇక ముస్లిం ఇలా అక్షరాయుధాలు ఎక్కుపెట్టడం జీర్ణించుకోలేకపోయాడు..  ఇలాగైతే ప్రాణాలకు ముప్పు అని షోయబుల్లాకు బెదిరింపులు వచ్చాయి..  ‘‘సత్యాన్వేషణలో మరణిస్తే అది గర్వించదగిన విషయం’’ అంటూ నిజాం షోయబుల్లాఖాన్‌ లేఖ రాశాడు..
1948 ఆగస్టు 21 అర్ధరాత్రి.. తెల్లవారితే 22.. కాచీగూడలోని ఇమ్రోజ్ కార్యాలయంలో పనిముగించుకుని ఇంటికి బయలుదేరాడె షోయబుల్లా.. లింగంపల్లి చౌరస్తా దగ్గర కత్తులు, తుపాకులతో రజాకార్లు దాడి చేశారు.. నిజాలను నిర్భయంగా రాసిన షోయబుల్లా అమరుడైపోయాడు.. షోయబుల్లా ప్రాణ త్యాగం వృధాగా పోలేదు.. మరికొద్ది హైదరాబాద్ సంస్థానం విముక్తమై భారత దేశంలో విలీనమైంది..
జాతీయవాద జర్నలిస్టు షోయబుల్లాఖాన్ స్మృతిలో ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం శాఖ ప్రతి ఏటా అత్యధిక మార్కులు సాధించిన జర్నలిస్టుకు గోల్డ్ మెడల్ ప్రధానం చేయడం ఆనవాయితీగా వస్తోంది.. ఈనాడు దేశంలో మత తీవ్రవాదం, విద్రోహ కార్యకలాపాలు పెరిగిపోతున్న నేపథ్యంలో షోయబుల్లా ఖాన్ లాంటి జాతీయవాద జర్నలిస్టు అవసరం చాలా ఉంది.. షోయబుల్లా ఖాన్ అమర్ హై..


సింధుకు కులం అంటించకండి..

అరె కుల గజ్జి వెధవల్లారా.. మీకు సింధు కులం కావాలి అంతే కదా?.. అయితే చూడండి..

ప్రోత్సహించండి.. కానీ..

సింధు ఒలింపిక్స్ లో పతకం తెచ్చింది.. దేశ ప్రజలంతా ఆనందించారు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వాలు, ప్రజలు సింధు విజయాన్ని తమ రాష్ట్రాలకు గర్వకారణంగా చెప్పుకోవడంలో తప్పు లేదు.. కానీ ఇక్కడ కులం ప్రసక్తి ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు.. సింధు తాను పలానా కులం ప్రతినిధిగా ఒలింపిక్ గేమ్స్ కు వెళుతున్నానని చెప్పిందా?.. లేదే.. మరి ఎందుకు ఈ కులం గోల?..
ఇక కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, ఏపీ, ఢిల్లీ ప్రభుత్వాలు ఎంతో ఉదారంగా సింధుకు నజరానాలు ప్రకటించాయి.. సంతోషమే.. కానీ ఇవి ఆచరణలో చూపించండి.. గతంలో కొందరు క్రీడాకారులకు ప్రకటించిన బహుమతులు, ఇళ్ల స్థలాలు, భూకేటాయింపులు ఇప్పటి వరకూ అందని ఉదాహరణలు ఉన్నాయి..
అయినా క్రీడాకారులకు ప్రోత్సాహకాలు కావాలి కానీ ఈ నజరానాలు ఎందుకు?.. విజేతలను ఘనంగా సత్కరించండి.. అభినందించండి.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించండి.. క్రీడారంగ వికాసానికి మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయండి.. కొత్త క్రీడాకారులను తయారు చేయండి.. ఇంతకు మించిన నజరానాలు ఇంకేముంటాయి?.. మనకు మరింత మంది సింధులు కావాలి..

Friday, August 19, 2016

జయహో సింధు

రజతమే కానీ.. కోట్లాది భారతీయుల హృదయాలను గెలిచింది..

సింధుకు అండగా..

మన భారత్.. మన తెలంగాణ.. మన సింధు

Thursday, August 18, 2016

దేశానికి రక్ష..

మీకు నేను రక్ష.. నాకు మీరు రక్ష.. మనమంతా ఈ దేశానికి, సమాజానికి రక్ష..

Tuesday, August 16, 2016

పాక్ ఆటలు ఇక సాగవు..

పిచ్చి కుక్కను అలాగే వదిలేస్తే వెంటబడి కరుస్తుంది.. కర్రతో గట్టిగా ఒకటిచ్చుకోవాల్సిందే.. పాకిస్తాన్ జమ్మూ కశ్మీర్ లో వేర్పాటు వాదానికి ఆజ్యం పోయడం, ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ మన దేశంపై ఉసిగొల్పం బహిరంగ రహస్యమే..

కశ్మీర్ లో ఏదో జరిగిపోతోందని గోబెల్స్ ప్రచారం చేస్తున్న పాక్ పాలకులు ఆక్రమిత కశ్మీర్ లో మానవ హక్కుల విషయాన్ని మాత్రం ప్రస్థావించరు.. అక్కడి ప్రజల తిరుగుబాటును కర్కషంగా అణచివేస్తున్నారు.. బలూచిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ ఏర్పాటుకు ముందు నుంచే స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నారు.. గురవింద తమ కింద మచ్చెరగదు అన్నట్లు, తమ దేశంలో జరుగుతున్న అరాచకాలను దాచిపెట్టి కశ్మీర్ విషయంలో ప్రతి సందర్భంలోనూ అంతర్జాతీయ వేదికలపై కోడై కూస్తోంది పాక్..
ఈ విషయంలో భారత నాయకులు మౌనం పాటిస్తుంటే, అవతలి వారికి మౌనం అర్ధాంగీకారం అనే సందేశం పోతోంది.. దాల్ మే కుచ్ కాలా హై..’ అందుకే ఇండియా కశ్మీర్ విషయంలో గట్టిగా మాట్లాడలేకపోతోందని తటస్త దేశాలు తప్పుగా అర్థం చేసుకుంటున్నాయి.. ఈ అపవాదును అనవసరంగా భరించాల్సిన అవసరం మనకేమిటి? అందుకే ప్రధాని నరేంద్ర మోదీ మన విదేశాంగ విధానాన్ని సమూలంగా తిరగేస్తున్నారు..
రెండు రోజుల క్రితం పాకిస్తాన్ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ దేశ పాలకులు కశ్మీర్ అంశాన్ని మరోసారి లేవనెత్తారు.. దీనికి ధీటైన సమాధానం ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట మీద నుండి ఇచ్చారు.. ఆక్రమిత కశ్మీర్, బలూచిస్తాన్ రాష్ట్రంలో పాక్ అవలంభిస్తున్న విధానాలను, ఉగ్రవాదం విషయంలో అవలంభిస్తున్న ద్వంద్వ వైఖరిని గట్టిగా ఎండగట్టారు.. పాకిస్తాన్ ఇకపై కశ్మీర్ గురుంచి మాట్లాడే ముందు ఆక్రమిత కశ్మీర్, బలూచిస్తాన్ ల గురుంచి కూడా సమాధానం ఇచ్చుకోవాలి.. లేదా నోరు మూసుకోవాలి..

బలూచిస్తాన్ స్వాతంత్ర్య సమరయోధులకు భారత్ సాయం చేస్తోందని ఆరోపిస్తున్న పాక్, ఇందుకు ఆధారాలను మాత్రం చూపలేకపోయింది.. కానీ భారత్ లో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని చెప్పానికి మన దగ్గర బోలెడు ఆధారాలు ఉన్నాయి.. ఇకనైనా పాకీల పాచి పాటకు, కాకిగోలకు ఫుల్ స్టాప్ పడుతుందని ఆశిద్దాం.. లేకుంటే అది వారి కర్మ.. మనకు ఎలాగూ మోదీ అస్త్రం ఉంది.. 

Monday, August 15, 2016

ఏది జాతీయవాదం?

ఆగస్టు 15, 2016
భారత 70వ స్వాతంత్య్ర దినోత్సవం.
అంటే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇప్పటికి 69 సంవత్సరాలు గడిచి 70వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం.
అయినప్పటికి మనలో ఒక ప్రశ్న ఇప్పటికీ మెదులుతూనే ఉంది.
మనసులను తొలుస్తూనే ఉంది.
భారతదేశం ఒక జాతేనా? అని..
ఈ ప్రశ్న వేస్తున్నది సామాన్య పౌరుడు కాదు.. విపరీత భావజాలం, విచ్ఛిన్నకర మనస్థత్వం తలకెక్కిన స్వయం ప్రకటిత మేధావులు ఇలాంటి వాదనలు వినిపిస్తుంటారు.. వారి చెబుతున్నదాని ప్రకారం భారత దేశం ఒక జాతి కాదు.. బ్రిటిష్ వారు విభిన్న భాషలు, సంస్కృతులు ఉన్న ప్రాంతాలను ఒకటిగా చేశారు.. ముస్లింలకు ప్రత్యేకంగా పాకిస్తాన్ ఏర్పాటు చేసి మిగతా ప్రాంతానికి ఇండియా అనే పేరు పెట్టి స్వాతంత్ర్యం ఇచ్చారు.. ఆ తర్వాత ఐదు వందలకు పైగా సంస్థానాలను ఇండియన్ గవర్నమెంట్ విలీనం చేసుకుంది.. కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలకు ఈ దేశంతో సంబంధం లేదు, బలవంతంగా కలుపబడ్డాయి..
ఇదీ మేధావుల వాదన..  ఈ వాదనలోని నిజం ఎంత? ఒక్కసారి ఆలోచించండి..
చరిత్రను వక్రీకరించే ప్రయత్నం
వామపక్ష భావజాల చరిత్రకారులు మన దేశ చరిత్రను ఎంతగా వక్రీకరించినా, నిజాలను అబద్దాలుగా మార్చలేరు.. అర్య, ద్రావిడ అనే తలా తోక లేని నిరాధార సిద్ధాంతాలతోనే వీరి కుట్రలు ప్రారంభమవుతాయి.. వీటిని మనం అర్థం చేసుకోవాలి..
ఎందరో త్యాగధనుల పోరాట ఫలితం కారణంగా మన దేశానికి విదేశీ బానితస్వ శృంఖలాల నుండి స్వాతంత్ర్యం వచ్చింది.. కానీ నాటి కాంగ్రెస్ నాయకులు పదవీ వ్యామోహ రాజకీయాల కారణంగా దేశ విభజన అనే మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది..
సోషలిస్టు, పాశ్యాత్య ఆలోచనా ధోరణి ఉన్న జవహర్ లాల్ నెహ్రూ దేశ తొలి ప్రధానికిగా బాధ్యతలు స్వీకరించారు.. కానీ అదే సమయంలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కేంద్ర హోం మంత్రి కావడం దేశ ప్రజల అదృష్టం.. స్వదేశీ సంస్థానాలన్నింటినీ విలీనం చేయడంలో ఆయన పాత్రను మరచిపోలేం.. విలీనం చేసేది లేదు, స్వతంత్రంగా ఉంటాం అంటూ తోకజాడించిన హైదరాబాద్ నిజాం, జునాగడ్ నవాబులపై దండోపాయం ఉపయోగించి దారిలోకి తెచ్చారు.. అయితే జమ్మూ కాశ్మీర్ విషయంలో నెహ్రూ అనవసర జోక్యం అనర్ధాలు తెచ్చి పెట్టింది.. తన మిత్రుడు షేక్ అబ్దుల్లాకు అధికారం కట్టబెట్టమే లక్ష్యంగా ఆయన పన్నిన వ్యూహం బెడిసి కొట్టింది.. కాశ్మీర్ భారత దేశంలో సంపూర్ణంగా విలీనం అయినా, నెహ్రూ అనాలోచిత విధానాల కారణంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను నేటికీ విడిపించలేకపోతున్నాం.. నోటితో పోయే దాన్ని గొడలితో అన్నట్లు అంతర్జాతీయ సమస్యగా మార్చారాయన.. ఈ సమస్య ఈనాటికీ రావణ కాష్టంలా రగులుతూనే ఉంది..
అసహన మంత్రం
ముఖ్యంగా కేంద్రంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు మేతావులకు ఎక్కడ లేని అసహనం పుట్టుకొచ్చింది.. ఎంతగా అంటే ఆజాదీ అని గొంతెత్తి అరిచేంతగా.. అసలు వారు కోరుకుంటున్న ఆజాదీ ఏమిటి?.. దేశ ద్రోహ కార్యకలాపాలకు పర్యాయపదమే వీరు కోరే ఆజాదియా?
ముంబై పేలుళ్ల కేసులో దోషి యాకూబ్ మెమన్ కు ఉరిశిక్ష పడితే తీవ్రవాదులకు మద్దతుగా జె.ఎన్.యూ.లో సభ పెట్టి కాశ్మీర్ కు ఆజాదీ కోరడం.. వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలవడం తెలిసిందే.. హెచ్.సి.యూ.లో పార్లమెంటుపై దాడి కేసులో అఫ్జల్ గురు ఉరికి వ్యతిరేకంగా మద్దతుగా ప్రదర్శన, రోహిల్ వేముల ఆత్మహత్య వ్యవహారంలో కూడా ఈ రెండు రాజకీయ పక్షాలు ఏవిధంగా వ్యవహరించాయో కొత్తగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు..
ఈ మేధావుల విచ్చిన్నకర రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయంటే చివరకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదానికి, వేర్పాటు వాదానికి సైతం అండగా నిలుస్తున్నారు.. చివరకు వీరి దృష్టిలో భారత్ మాతాకీ జై అనండం కూడా తప్పయిపోయింది.. వందేమాతరం పాడటం నేరమైపోయింది.. చివరకు జాతీయ గీతం జనగణమన కూడా అభ్యంతరకరమే..
విచ్ఛిన్నకర రాజకీయాలు
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఒకవైపు వామపక్ష తీవ్రవాదం, మరోవైపు ఇస్లామిక్ ఛాందన ఉగ్రవాదం వెర్రితలలు వేస్తున్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు బాధ్యతగా వ్యవహరించాలి. ఇలాంటి శక్తులకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి..
కానీ స్వార్థ రాజకీయ పార్టీలు తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పరోక్షంగా వారికి అండగా నిలుస్తున్నాయి.. భారత రాజ్యాంగం సమాజంలో తరతరాలుగా అన్యాయానికి గురైన వర్గాల ప్రజలకు రిజర్వేషన్లు ఇచ్చింది.. వీరంతా సమాజంలో ఇతర వర్గాలతో సమానంగా సర్వంగా తలెత్తులొని ఎదగాలని రాజ్యాంగ కమిటీ ఛైర్మన్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించారు.. దురదృష్టవశాత్తు కొన్ని శక్తులు తమ కుటిల రాజకీయాలకు బాబాసాహెబ్ పేరును వాడుకుంటున్నాయి.. ఈ నాయకులు సమాజంలో వైషమ్యాలను రెచ్చగుతున్నారు.. రాజ్యాంగ బద్దంగా దక్కాల్సిన రిజర్వేషన్లు దుర్వినియోగం అవుతున్నాయి.. నకిలీలకు దక్కుతున్నాయి..  వేర్పాటువాద భావాలను అండగా నిలుస్తున్నది ఇలాంటి శక్తులే..
తమిళనాడులో ద్రవిడ వాదం ముసుగులో వచ్చిన్నకర శక్తులు పేట్రేగిపోతున్నాయి.. ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నో తిరుగుబాటు గ్రూపులు తమ అస్థిత్వం కోసం విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నాయి.. ఒకప్పుడు ఎంతో విశాలంగా ఉండే మన దేశం విదేశీ శక్తుల కుట్రల కారణంగా ఎన్నో భూభాగాలను కోల్పోయింది.. మళ్లీ ఇలాంటి పరిస్థితులే పునరుథ్థానం అవుతున్నాయి.. భారత దేశాన్ని వచ్చిన్నం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి.. ఇలాంటి సమయంలో జాతీయ వాదం మరింత బలం పుంజుకోవాల్సిన అవసరం ఏర్పింది..
జాతీయ వాదం అంటే..
ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత దేశానికి ఎంతో విశిష్టత ఉంది.. వివిధ దేశాల చరిత్రలను మనం గమనిస్తే వాటి సరిహద్దులు దురాక్రమణల ద్వారా ఏర్పడ్డవే.. ఆ దేశాల నిర్మాణం వెనుక ఎవరో ఒక మూల పురుషుడు కనిపిస్తాడు.. ప్రపంచ దేశాలను గమనిస్తే వీటిలో చాలా వరకు 500-1500 సంవత్సరాల చరిత్ర కలవే కనిపిస్తాయి.. నేడు ప్రపంచాన్ని శాసించాలని చూస్తున్న దేశాలేవీ అప్పటికి ఉనికిలో లేవు.. చాలా దేశాల్లో నాగరికత పూర్తి స్థాయిలో వికసించలేదు.. 16వ శతాబ్దం తర్వాతే ఐరోపాలో జాతి రాజ్యాల భావన పురుడు పోసుకుంది..
కానీ భారత దేశ చరిత్ర ఇందుకు పూర్తిగా భిన్నం.. దాదాపు ఐదువేల సంవత్సరాలకు పైగా ప్రాచీన చరిత్ర ఉన్న దేశం మనది..
ప్రపంచంలోని అతి ప్రాచీన సంస్కృతి, వారసత్వం ఉన్న దేశాల్లో భారత దేశం అగ్ర స్థానంలో నిలుస్తుంది.. ప్రాచీన కాలంలో భారతీయ సాంస్కృతిక వైభవం ప్రపంచంలోని పలు ప్రాంతాలకు విస్తరించింది.. కానీ ఇది దురాక్రమణల ద్వారా కాదు.. ప్రపంచానికి ఆధ్యాత్మికం, వైద్యం, జ్యోతిషం, ఖగోళం, గణతం, సాహిత్యం, కళలు, జ్ఞాన సంపదలను అందించిన దేశం మనది.. ఎందరో ఆధ్యాత్మిక గురువులు, వీరులు ఇక్కడ జన్మించారు.. దేశ విదేశాల నుండి వచ్చిన విద్యార్థులు ఇక్కడి విద్యాలయాల్లో చదువుకునేందుకు వచ్చేవారు.. ఓడ రేవుల ద్వారా వర్తక వాణిజ్యాలు ఎన్నో దూర దేశాలకు వ్యాపించాయి.. ఈ వైభవాన్ని చూసి కన్నుకుట్టిన విదేశీ శక్తులు మన దేశంపై దండయాత్రకు వచ్చాయి.. స్వదేశీ రాజుల అనైక్యత కారణంగా వందలాది సంవత్సరాల పాటు మనం పరాధీనం పాలయ్యాం..
కాల పరీక్షలో నిలబడిన జాతి
గ్రీకులు, శకులు, కుషానులు, హూణులు, అరబ్బులు, మొగలాయీలు, ఐరోపా దేశాల వారు భారత దేశంపై దండెత్తారు.. కర్కషంగా మత మార్పులకు పాల్పడ్డారు.. వారు ఎంత క్రూరంగా పాలించినా మన జాతి సాంస్కృతిక మూలాలను మాత్రం చెరపలేకపోయారు.. విదేశీ దండయాత్రలు, పరాయి పాలనకు వ్యతిరేకంగా ఎందరో వీరులు పోరాటం సాగించారు.. వీరి త్యాగాల పుణ్యమా అని మన దేశం ఆధ్యాత్మిక మూలాలను కోల్పోకుండా స్థిరంగా నిలబడింది.. ప్రపంచంలో దండయాత్రలు, మత యుద్దాల కారణంగా ఎన్నో జాతులు కాలగర్భంలో కలిసిపోయాయి..
కానీ వేలాది సంవత్సరాలుగా మన సాంస్కృతిక వైభవం అవిచ్చినంగా కొనసాగుతూ వచ్చింది.. విశాలమైన భారత దేశంలో విభిన్న మతాలు భాషలు, ఆచార వ్యవహాలు వేరుగా ఉండవచ్చు.. కానీ సంస్కృతి సాంప్రదాయాల పరంగా ఉన్న భావ సమైక్యతే ఈ దేశానికి శ్రీరామ రక్షగా నిలిచింది.. ఈ దేశ ప్రజల్లో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకూ, అటక్ నుండి కటక్ వరకూ మనమంతా ఒకే జాతి, ఒకే దేశం అనే భావన తరతరాలుగా కొనసాగుతూ వస్తోంది.. భారత జాతీయవాదానికి ఈ భావనే మూలం..  
జాతీయ వాదాన్ని కాపాడుకోవం ఎలా?
మొక్కై వంగనిది మానై వంగునా అంటారు.. అందుకే చిన్నప్పటి నుండే విద్యార్థుల్లో జాతీయ భావాలను పెంపొందించాలి.. మన దేశ చరిత్రను, సాంస్కృతిక వైభవ విశిష్టతను వారికి అర్థమయ్యేలా చెప్పాలి.. మన ధర్మాన్ని కాపాడిన మహనీయులు, స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీరులు, మహనీయులు చరిత్రను బోధించాలి.. మన ధర్మం, ఆధ్యాత్మిక మూలాలను భావితరాలకు అందేలా కాపాడుకోవాలి.. ధార్మిక చింతన పెంపొందించాలి.
ముఖ్యంగా పెద్దలను గౌరవించడం, కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవశ్యకతను మన చిన్నారులకు బోధించాలి.. మన జాతి పట్ల స్వాభిమానాన్ని పెంపొందించే విద్యా విధానాన్ని రూపొందించాలి.. దేశభక్తి, జాతీయ భావం అంటే కేవలం మన భూభాగాలను కాపాడుకోవం మాత్రమే కాదు.. మన సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వ సంపదను భావి తరాలకు అందించం కూడా ముఖ్యం..
భారత దేశంలో విభిన్న మతాలు ఉండవచ్చు.. ఎవరి మతాన్ని వారు అవలంభించే స్వేచ్ఛ ఉంది.. జాతీయతకు ఇది అవరోధం కాదు.. మతం, జాతీయతలకు మధ్య తేడా ఉంది.. దేశ సమగ్రత విషయంలో ఏదైనా సమస్య ఉత్పన్నమైన సమయంలో మతం కన్నా దేశం ముఖ్యం అనే భావన అందరిలోనూ కలగాలి.. ఈ భావనే జాతీయతను ప్రతిబింభిస్తుంది..
స్వాతంత్ర్యం జరుపుకోవం అంటే మిఠాయిలు పంచుకోవడం మాత్రమే కాదు.. దానితో పాటు మనసులో జాతీయవాదాన్ని నింపుకోవాలి.. జాతీయవాదమే మన దేశానికి శ్రీరామ రక్ష..
(జాగృతి వార పత్రిక 15-21 ఆగస్టు సంచిక ముఖపత్ర కథనం)


-        క్రాంతి దేవ్

70 స్వతంత్ర్య వేడుకలు.. ఎందో మహనీయుల త్యాగ ఫలం


Sunday, August 14, 2016

భారతజాతి చరిత్రలో విషాద దినం..

‘ ప్రపంచమంతా నిద్రిస్తున్న వేళ భారత జాతి జాగృతమై స్వాతంత్ర్యాన్ని పొందుతున్నది.. ’మరి కొద్ది గంటల్లో తాను చేసే ఉపన్యాస ప్రతికి మెరుగులు దిద్దుకుంటూ మురిసిపోతున్నారు జవహర్ లాల్ నెహ్రూ.. కానీ ఆ సమయంలో భారత మాత మహా విషాదంలో మునిగిపోయింది.. స్వాతంత్ర్యంతో పాటే కన్నీరు కార్చాల్సిన దురదృష్టకర సందర్భం..
ఆగస్టు 15, 1947 అర్ధరాత్రి బానిసత్వ పాలన నుండి విముక్తి.. కానీ ఒక రోజు ముందే ఆగస్టు 14న దేశం ముక్కలైంది.. బ్రిటిష్ వారి కుటిల నీతి, కాంగ్రెస్ – ముస్లింలీగ్ నాయకుల అధికార దాహానికి మన మాతృభూమి చీలిపోయింది.. పాకిస్తాన్ ఆవిర్భావం.. భరతమాతకు తీరని శోకం.. లక్షలాది మంది భారతీయులు రాత్రికి రాత్రే పరాయి దేశస్తులైపోయారు.. కొత్త సరిహద్దులకు ఆవతల, దేశమంతటా నెత్తురు చిందింది.. ఎందరో అభాగ్యులు మాన ప్రాణాలు కోల్పోయారు.. తరతరాలుగా పూర్వీకుల నుండి వచ్చిన ఆస్తులను విదిలేసుకొని కట్టుబట్టలతో కాందీశీకులుగా తరలి వచ్చారు.. మన నాయకులు చేసిన పాపానికి లక్షలాది మంది సామాన్య ప్రజలు మూల్యం చెల్లించుకున్నారు.. దేశ చరిత్రలోనే అత్యంత విషాదకర సందర్భమిది..
భారత దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు పోరాటం చేశారు.. త్యాగాలు చేశారు.. ప్రాణాలు కోల్పోయారు.. కానీ ప్రతి ఫలం ఏమిటి? దేశ విభజనతో స్వాతంత్ర్యమా?.. త్యాగాలు చేసింది ఒకరైతే, అప్పనంగా ఫలాలు అనుభవించింది మరి కొందరు..
రెండో ప్రపంచ యుద్దంలో బ్రిటిష్ వారు విజయం సాధించినా, రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఇక నిలుపుకోలేమని గ్రహించారు.. అప్పటికే భారత దేశమంతటా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు, పోరాటాలు పతాక స్థాయికి చేరాయి.. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ తదితర విప్లవ వీరుల పోరాటాలను చూసి భయపడిపోయిన లండన్ పాలకులు ఇలాంటి స్థితిలో భారత దేశాన్ని నిలుపుకోవడం సాధ్యం కాదని నిర్ణయానికి వచ్చేశారు.. కానీ యధాతథంగా స్వాతంత్ర్యం ఇచ్చేస్తే భారత దేశం నుండి ఏనాటికైనా తమకు ముప్పు అని భయపడ్డారు..  ఇలాంటి కుట్రలో పురుడు పోసుకున్న విషాద ఘటలనే దేశ విభజన..
బ్రిటిష్ వారి కుట్రకు పావులుగా దొరికారు కాంగ్రెస్, ముస్లిం లీగ్ నాయకులు.. మహ్మద్ అలీ జిన్నాను దువ్వి ద్విజాతి సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు.. ముస్లింట కోసం ప్రత్యేక దేశం ఏర్పాటు చేయకుండా భారత దేశానికి స్వాతంత్ర్యం ఇస్తే ఒప్పుకునేది లేదని పట్టుబట్టాడు జిన్నా.. ఆయన ఇచ్చిన ప్రత్యక్ష చర్య పిలుపుతో దేశ వ్యాప్తంగా మత కల్లోలాలను చెలరేగి అమాయక ప్రజలెందరో ఊచకోతకు గురయ్యారు.. దేశ విభజన కోసం కాంగ్రెస్ నాయకులపై వత్తిడి పెరిగింది.. అప్పటికే వీరిలో చాలా మంది వృద్ధులు.. తమ జీవిత కాలంలో పదవులు అనుభవిస్తామో లేదో అనే బెంగ పట్టుకుంది వారికి.. పైకి ఇష్టం లేనట్లు మేకపోతు గాంభీర్యాన్నిప్రదర్శిస్తూనే దేశ విభజనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు..
స్వాతంత్ర్యం వచ్చిందని సంబర పడాలా భారత మాత ముక్కలైందని బాధను  పడాలా అన్నది తేల్చుకోలేని దుస్థితి..  స్వాతంత్ర్య దినోత్సవాలు జరుపుకోవాల్సిందే.. మన పెద్దల త్యాగాలను స్మరించుకోవాల్సిందే.. కానీ అదే సమయంల్ చరిత్ర నుండి గుణపాఠం నేర్చుకోవాలి.. మళ్లీ ఇలాంటి దుస్థితి మన దేశానికి రాకూడదు.. అందుకు మనం చేయాల్సిన కర్తవ్యం ఏమిటో ఆలోచించండి..