Monday, August 15, 2016

ఏది జాతీయవాదం?

ఆగస్టు 15, 2016
భారత 70వ స్వాతంత్య్ర దినోత్సవం.
అంటే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇప్పటికి 69 సంవత్సరాలు గడిచి 70వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం.
అయినప్పటికి మనలో ఒక ప్రశ్న ఇప్పటికీ మెదులుతూనే ఉంది.
మనసులను తొలుస్తూనే ఉంది.
భారతదేశం ఒక జాతేనా? అని..
ఈ ప్రశ్న వేస్తున్నది సామాన్య పౌరుడు కాదు.. విపరీత భావజాలం, విచ్ఛిన్నకర మనస్థత్వం తలకెక్కిన స్వయం ప్రకటిత మేధావులు ఇలాంటి వాదనలు వినిపిస్తుంటారు.. వారి చెబుతున్నదాని ప్రకారం భారత దేశం ఒక జాతి కాదు.. బ్రిటిష్ వారు విభిన్న భాషలు, సంస్కృతులు ఉన్న ప్రాంతాలను ఒకటిగా చేశారు.. ముస్లింలకు ప్రత్యేకంగా పాకిస్తాన్ ఏర్పాటు చేసి మిగతా ప్రాంతానికి ఇండియా అనే పేరు పెట్టి స్వాతంత్ర్యం ఇచ్చారు.. ఆ తర్వాత ఐదు వందలకు పైగా సంస్థానాలను ఇండియన్ గవర్నమెంట్ విలీనం చేసుకుంది.. కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలకు ఈ దేశంతో సంబంధం లేదు, బలవంతంగా కలుపబడ్డాయి..
ఇదీ మేధావుల వాదన..  ఈ వాదనలోని నిజం ఎంత? ఒక్కసారి ఆలోచించండి..
చరిత్రను వక్రీకరించే ప్రయత్నం
వామపక్ష భావజాల చరిత్రకారులు మన దేశ చరిత్రను ఎంతగా వక్రీకరించినా, నిజాలను అబద్దాలుగా మార్చలేరు.. అర్య, ద్రావిడ అనే తలా తోక లేని నిరాధార సిద్ధాంతాలతోనే వీరి కుట్రలు ప్రారంభమవుతాయి.. వీటిని మనం అర్థం చేసుకోవాలి..
ఎందరో త్యాగధనుల పోరాట ఫలితం కారణంగా మన దేశానికి విదేశీ బానితస్వ శృంఖలాల నుండి స్వాతంత్ర్యం వచ్చింది.. కానీ నాటి కాంగ్రెస్ నాయకులు పదవీ వ్యామోహ రాజకీయాల కారణంగా దేశ విభజన అనే మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది..
సోషలిస్టు, పాశ్యాత్య ఆలోచనా ధోరణి ఉన్న జవహర్ లాల్ నెహ్రూ దేశ తొలి ప్రధానికిగా బాధ్యతలు స్వీకరించారు.. కానీ అదే సమయంలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కేంద్ర హోం మంత్రి కావడం దేశ ప్రజల అదృష్టం.. స్వదేశీ సంస్థానాలన్నింటినీ విలీనం చేయడంలో ఆయన పాత్రను మరచిపోలేం.. విలీనం చేసేది లేదు, స్వతంత్రంగా ఉంటాం అంటూ తోకజాడించిన హైదరాబాద్ నిజాం, జునాగడ్ నవాబులపై దండోపాయం ఉపయోగించి దారిలోకి తెచ్చారు.. అయితే జమ్మూ కాశ్మీర్ విషయంలో నెహ్రూ అనవసర జోక్యం అనర్ధాలు తెచ్చి పెట్టింది.. తన మిత్రుడు షేక్ అబ్దుల్లాకు అధికారం కట్టబెట్టమే లక్ష్యంగా ఆయన పన్నిన వ్యూహం బెడిసి కొట్టింది.. కాశ్మీర్ భారత దేశంలో సంపూర్ణంగా విలీనం అయినా, నెహ్రూ అనాలోచిత విధానాల కారణంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను నేటికీ విడిపించలేకపోతున్నాం.. నోటితో పోయే దాన్ని గొడలితో అన్నట్లు అంతర్జాతీయ సమస్యగా మార్చారాయన.. ఈ సమస్య ఈనాటికీ రావణ కాష్టంలా రగులుతూనే ఉంది..
అసహన మంత్రం
ముఖ్యంగా కేంద్రంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు మేతావులకు ఎక్కడ లేని అసహనం పుట్టుకొచ్చింది.. ఎంతగా అంటే ఆజాదీ అని గొంతెత్తి అరిచేంతగా.. అసలు వారు కోరుకుంటున్న ఆజాదీ ఏమిటి?.. దేశ ద్రోహ కార్యకలాపాలకు పర్యాయపదమే వీరు కోరే ఆజాదియా?
ముంబై పేలుళ్ల కేసులో దోషి యాకూబ్ మెమన్ కు ఉరిశిక్ష పడితే తీవ్రవాదులకు మద్దతుగా జె.ఎన్.యూ.లో సభ పెట్టి కాశ్మీర్ కు ఆజాదీ కోరడం.. వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలవడం తెలిసిందే.. హెచ్.సి.యూ.లో పార్లమెంటుపై దాడి కేసులో అఫ్జల్ గురు ఉరికి వ్యతిరేకంగా మద్దతుగా ప్రదర్శన, రోహిల్ వేముల ఆత్మహత్య వ్యవహారంలో కూడా ఈ రెండు రాజకీయ పక్షాలు ఏవిధంగా వ్యవహరించాయో కొత్తగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు..
ఈ మేధావుల విచ్చిన్నకర రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయంటే చివరకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదానికి, వేర్పాటు వాదానికి సైతం అండగా నిలుస్తున్నారు.. చివరకు వీరి దృష్టిలో భారత్ మాతాకీ జై అనండం కూడా తప్పయిపోయింది.. వందేమాతరం పాడటం నేరమైపోయింది.. చివరకు జాతీయ గీతం జనగణమన కూడా అభ్యంతరకరమే..
విచ్ఛిన్నకర రాజకీయాలు
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఒకవైపు వామపక్ష తీవ్రవాదం, మరోవైపు ఇస్లామిక్ ఛాందన ఉగ్రవాదం వెర్రితలలు వేస్తున్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు బాధ్యతగా వ్యవహరించాలి. ఇలాంటి శక్తులకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి..
కానీ స్వార్థ రాజకీయ పార్టీలు తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పరోక్షంగా వారికి అండగా నిలుస్తున్నాయి.. భారత రాజ్యాంగం సమాజంలో తరతరాలుగా అన్యాయానికి గురైన వర్గాల ప్రజలకు రిజర్వేషన్లు ఇచ్చింది.. వీరంతా సమాజంలో ఇతర వర్గాలతో సమానంగా సర్వంగా తలెత్తులొని ఎదగాలని రాజ్యాంగ కమిటీ ఛైర్మన్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించారు.. దురదృష్టవశాత్తు కొన్ని శక్తులు తమ కుటిల రాజకీయాలకు బాబాసాహెబ్ పేరును వాడుకుంటున్నాయి.. ఈ నాయకులు సమాజంలో వైషమ్యాలను రెచ్చగుతున్నారు.. రాజ్యాంగ బద్దంగా దక్కాల్సిన రిజర్వేషన్లు దుర్వినియోగం అవుతున్నాయి.. నకిలీలకు దక్కుతున్నాయి..  వేర్పాటువాద భావాలను అండగా నిలుస్తున్నది ఇలాంటి శక్తులే..
తమిళనాడులో ద్రవిడ వాదం ముసుగులో వచ్చిన్నకర శక్తులు పేట్రేగిపోతున్నాయి.. ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నో తిరుగుబాటు గ్రూపులు తమ అస్థిత్వం కోసం విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నాయి.. ఒకప్పుడు ఎంతో విశాలంగా ఉండే మన దేశం విదేశీ శక్తుల కుట్రల కారణంగా ఎన్నో భూభాగాలను కోల్పోయింది.. మళ్లీ ఇలాంటి పరిస్థితులే పునరుథ్థానం అవుతున్నాయి.. భారత దేశాన్ని వచ్చిన్నం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి.. ఇలాంటి సమయంలో జాతీయ వాదం మరింత బలం పుంజుకోవాల్సిన అవసరం ఏర్పింది..
జాతీయ వాదం అంటే..
ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత దేశానికి ఎంతో విశిష్టత ఉంది.. వివిధ దేశాల చరిత్రలను మనం గమనిస్తే వాటి సరిహద్దులు దురాక్రమణల ద్వారా ఏర్పడ్డవే.. ఆ దేశాల నిర్మాణం వెనుక ఎవరో ఒక మూల పురుషుడు కనిపిస్తాడు.. ప్రపంచ దేశాలను గమనిస్తే వీటిలో చాలా వరకు 500-1500 సంవత్సరాల చరిత్ర కలవే కనిపిస్తాయి.. నేడు ప్రపంచాన్ని శాసించాలని చూస్తున్న దేశాలేవీ అప్పటికి ఉనికిలో లేవు.. చాలా దేశాల్లో నాగరికత పూర్తి స్థాయిలో వికసించలేదు.. 16వ శతాబ్దం తర్వాతే ఐరోపాలో జాతి రాజ్యాల భావన పురుడు పోసుకుంది..
కానీ భారత దేశ చరిత్ర ఇందుకు పూర్తిగా భిన్నం.. దాదాపు ఐదువేల సంవత్సరాలకు పైగా ప్రాచీన చరిత్ర ఉన్న దేశం మనది..
ప్రపంచంలోని అతి ప్రాచీన సంస్కృతి, వారసత్వం ఉన్న దేశాల్లో భారత దేశం అగ్ర స్థానంలో నిలుస్తుంది.. ప్రాచీన కాలంలో భారతీయ సాంస్కృతిక వైభవం ప్రపంచంలోని పలు ప్రాంతాలకు విస్తరించింది.. కానీ ఇది దురాక్రమణల ద్వారా కాదు.. ప్రపంచానికి ఆధ్యాత్మికం, వైద్యం, జ్యోతిషం, ఖగోళం, గణతం, సాహిత్యం, కళలు, జ్ఞాన సంపదలను అందించిన దేశం మనది.. ఎందరో ఆధ్యాత్మిక గురువులు, వీరులు ఇక్కడ జన్మించారు.. దేశ విదేశాల నుండి వచ్చిన విద్యార్థులు ఇక్కడి విద్యాలయాల్లో చదువుకునేందుకు వచ్చేవారు.. ఓడ రేవుల ద్వారా వర్తక వాణిజ్యాలు ఎన్నో దూర దేశాలకు వ్యాపించాయి.. ఈ వైభవాన్ని చూసి కన్నుకుట్టిన విదేశీ శక్తులు మన దేశంపై దండయాత్రకు వచ్చాయి.. స్వదేశీ రాజుల అనైక్యత కారణంగా వందలాది సంవత్సరాల పాటు మనం పరాధీనం పాలయ్యాం..
కాల పరీక్షలో నిలబడిన జాతి
గ్రీకులు, శకులు, కుషానులు, హూణులు, అరబ్బులు, మొగలాయీలు, ఐరోపా దేశాల వారు భారత దేశంపై దండెత్తారు.. కర్కషంగా మత మార్పులకు పాల్పడ్డారు.. వారు ఎంత క్రూరంగా పాలించినా మన జాతి సాంస్కృతిక మూలాలను మాత్రం చెరపలేకపోయారు.. విదేశీ దండయాత్రలు, పరాయి పాలనకు వ్యతిరేకంగా ఎందరో వీరులు పోరాటం సాగించారు.. వీరి త్యాగాల పుణ్యమా అని మన దేశం ఆధ్యాత్మిక మూలాలను కోల్పోకుండా స్థిరంగా నిలబడింది.. ప్రపంచంలో దండయాత్రలు, మత యుద్దాల కారణంగా ఎన్నో జాతులు కాలగర్భంలో కలిసిపోయాయి..
కానీ వేలాది సంవత్సరాలుగా మన సాంస్కృతిక వైభవం అవిచ్చినంగా కొనసాగుతూ వచ్చింది.. విశాలమైన భారత దేశంలో విభిన్న మతాలు భాషలు, ఆచార వ్యవహాలు వేరుగా ఉండవచ్చు.. కానీ సంస్కృతి సాంప్రదాయాల పరంగా ఉన్న భావ సమైక్యతే ఈ దేశానికి శ్రీరామ రక్షగా నిలిచింది.. ఈ దేశ ప్రజల్లో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకూ, అటక్ నుండి కటక్ వరకూ మనమంతా ఒకే జాతి, ఒకే దేశం అనే భావన తరతరాలుగా కొనసాగుతూ వస్తోంది.. భారత జాతీయవాదానికి ఈ భావనే మూలం..  
జాతీయ వాదాన్ని కాపాడుకోవం ఎలా?
మొక్కై వంగనిది మానై వంగునా అంటారు.. అందుకే చిన్నప్పటి నుండే విద్యార్థుల్లో జాతీయ భావాలను పెంపొందించాలి.. మన దేశ చరిత్రను, సాంస్కృతిక వైభవ విశిష్టతను వారికి అర్థమయ్యేలా చెప్పాలి.. మన ధర్మాన్ని కాపాడిన మహనీయులు, స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీరులు, మహనీయులు చరిత్రను బోధించాలి.. మన ధర్మం, ఆధ్యాత్మిక మూలాలను భావితరాలకు అందేలా కాపాడుకోవాలి.. ధార్మిక చింతన పెంపొందించాలి.
ముఖ్యంగా పెద్దలను గౌరవించడం, కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవశ్యకతను మన చిన్నారులకు బోధించాలి.. మన జాతి పట్ల స్వాభిమానాన్ని పెంపొందించే విద్యా విధానాన్ని రూపొందించాలి.. దేశభక్తి, జాతీయ భావం అంటే కేవలం మన భూభాగాలను కాపాడుకోవం మాత్రమే కాదు.. మన సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వ సంపదను భావి తరాలకు అందించం కూడా ముఖ్యం..
భారత దేశంలో విభిన్న మతాలు ఉండవచ్చు.. ఎవరి మతాన్ని వారు అవలంభించే స్వేచ్ఛ ఉంది.. జాతీయతకు ఇది అవరోధం కాదు.. మతం, జాతీయతలకు మధ్య తేడా ఉంది.. దేశ సమగ్రత విషయంలో ఏదైనా సమస్య ఉత్పన్నమైన సమయంలో మతం కన్నా దేశం ముఖ్యం అనే భావన అందరిలోనూ కలగాలి.. ఈ భావనే జాతీయతను ప్రతిబింభిస్తుంది..
స్వాతంత్ర్యం జరుపుకోవం అంటే మిఠాయిలు పంచుకోవడం మాత్రమే కాదు.. దానితో పాటు మనసులో జాతీయవాదాన్ని నింపుకోవాలి.. జాతీయవాదమే మన దేశానికి శ్రీరామ రక్ష..
(జాగృతి వార పత్రిక 15-21 ఆగస్టు సంచిక ముఖపత్ర కథనం)


-        క్రాంతి దేవ్

No comments:

Post a Comment