Tuesday, June 30, 2015

యమగోల.. యమ అర్జెన్సీ

యముడి నిరంకుశ పాలన వద్దు, యమ అర్జెన్సీ ఇకపై రద్దు .. యమగోల చిత్రం పాటలోని చరణం ఇది.. నరక లోకంలో యమ ధర్మరాజుపై యమ భటులతో తిరుగుబాటు చేయిస్తాడు సత్యం (ఎన్టీఆర్).. ఆ సందర్భంగా పాడిన సమరానికి నేడే ప్రారంభంపాటలో ఎమర్జెన్సీని ప్రస్థావించారు.. ఇందిరా గాంధీ దేశంపై ఎమర్జెన్సీని రుద్ది..ప్రతిపక్షాన్ని, ప్రజలను అష్టకష్టాలపాలుజేశారు.. ఈ నేపథ్యాన్ని ఈ పాటలో గుర్తు చేశారు ఎన్టీఆర్..

1975 జూన్ 25 నుండి 1977 మార్చి 21 వరకూ ఎమెర్జెన్సీ అమల్లో ఉంది.. అదే సంవత్సరం అక్టోబర్ 21న యమగోల విడుదలైంది.. సమరానికి నేడే ప్రారంభం పాటను శ్రీశ్రీ రాశారు. ఈ గీతాన్ని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడగా, చక్రవర్తి సంగీతాన్ని అందించారు.. ఈ చిత్రంలో కార్మిక సంఘాల పడిగట్టు భాష కాబట్టి కామ్రేడ్స్ నేను చెప్పేది ఏమిటంటే.. ఏమి లేదు..’ అంటు హాస్యాన్ని పండించారు ఎన్టీఆర్.. ఎమర్జెన్సీ విధించి 40 ఎళ్లు పూర్తయిన నేపథ్యంలో యమగోల గుర్తుకు వస్తోంది.. 

Monday, June 29, 2015

ప్రధాని, విపక్ష నేతల సంబంధాలు ఎలా ఉండాలంటే..

పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజపేయి.. ఒకరు దేశ ప్రధానమంత్రి, మరొకరు ప్రతిపక్షనేత.. ఇద్దరూ ఇద్దరే.. రాజకీయ దురంధరులు, సాహితీ వేత్తలు.. ఇద్దరివీ వేర్వేరు రాజకీయ సిద్దాంతాలు..
పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకునిగా ప్రజా సమస్యలపై అధికార పక్షాన్ని ఎలా నిలదీయాలో, ఎక్కడ ఇబ్బంది పెట్టాలో చూపించారు అటల్జీ.. అదే సమయంలో దేశ ప్రయోజనాల కోసం పలు అంశాల్లో ప్రభుత్వానికి నిర్మాణాత్మక సహకారాన్ని అందించారు. ప్రధాని పీవీ సైతం అంతే హుందాగా ప్రతిపక్ష నేతను గౌరవించారు. ఐక్యరాజ్య సమతికి దేశం తరపున వెళ్లే బృందానికి విపక్ష నేత వాజపేయి నేతృత్వం వహించారు. పాకిస్తాన్ విధానాలను ఎండగట్టారు.. చట్టసభల్లో తన వాగ్దాటితో నిర్మాణాత్మ విమర్శలతో పాటు అధికార పక్షానికి సలహాలు అందజేసేవారు వాజపేయి.. ఈ కారణం వల్లే ఆయన్నిఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు వరించింది.
అటల్జీ ప్రధాని అయిన తర్వాత పీవీ సైతం ప్రతిపక్ష నేతగా ఉన్నా, అమ్మోరు సోనియా ఆగ్రహం వల్ల ఎక్కువ కాలం ఆ హోదా దక్కలేదు. రాజకీయంగా ఎన్నో అంశాల్లో అటల్జీ, పీవీ సంఘర్షించుకున్నా వ్యక్తిగతంగా మంచి మిత్రులు.. ఇద్దరినీ కలిపింది సాహిత్యం. బహుభాషా కోవిధుడైన నరసింహారావు, వాజపేయి కవిత్వాన్ని చాలా ఇష్టపడేవారు.. పీవీ నరసింహా రావు రాసిన తన జీవిత కథ ఇన్ సైడర్ను ప్రధానమంత్రి హోదాలో ఆవిష్కరించారు అటల్జీ..

ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేతల సంబంధాలు ఎలా ఉండాలో ఆచరణలో చూపించారు పీవీ, అటల్జీలు.. ఇలాంటి మహానేతలను, వారు అనుసరించిన విధానాలను ఈనాటి పరిస్థితుల్లో ఊహించుకోగలమా?

Sunday, June 28, 2015

లోపలి మనిషి... మహా వ్యక్తి

అపర చాణక్యుడు, రాజనీతి చతురుడు, సంస్కరణల సారధి, బహు భాషా కోవిధుడు, సాహితీ వేత్త.. పాములపర్తి వెంకట నరసింహారావు గురుంచి ఎంత చెప్పినా తక్కువే.. రాజకీయ జీవితాన్ని ముగించుకొని ఆధ్యాత్మిక, సాహితీ, సేవా కార్యక్రమాలతో శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని మూలా ముల్లె సర్దుకొని ఢిల్లీ నుండి హైదరాబాద్ బయలు దేరేందుకు సిద్దమైన వేళ ప్రధానమంత్రి పదవి తలుపు తట్టింది..
దేశం ఆర్ధికంగా వివాళా తీసిన దశలో, రాజీవ్ గాంధీ మరణంతో ప్రధాని పదవి చేపట్టేందుకు పీవీ నరసింహారావును మించిన అర్హులు కాంగ్రెస్ పార్టీలో కనిపించలేదు. క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థిక సంస్కరణలకు బాటలు వేసి దేశాన్ని ప్రగతి పథంలో నడిపించారు.. మైనారిటీ ప్రభుత్వాన్ని చాకచక్యంగా ఐదేళ్లు నెట్టుకొచ్చారు.. రాజకీయంగా ఎన్నో ఆరోపణలు, కుంభకోణాలు ఆయన్ని వేధించాయి.. ఎవరికీ కొరుకుడు పడని మౌనం మితభాషణం ఆయన ఆభరణాలు.. దురదృష్టవశాత్తు ఈ కారణంగానే రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎన్నో ఇక్కట్ల పాలయ్యారు పీవీ..
కాంగ్రెస్ కోటరీ రాజకీయాలు, సోనియాగాంధీ కంటగింపులకు గురైన పీవీ జీవిత చరమాకం ప్రశాంతంగా సాగలేదు.. మరణించిన తర్వాత మాజీ ప్రధానులకు లభించాల్సిన గౌరవం ప్రకారం ఢిల్లీలో సమాధికి నోచుకోలేదు.. పార్థివ దేహాన్ని పార్టీ కార్యాలయంలోకి కూడా తీసుకురాని కుసంస్కారంతో, రోడ్డు మీద నుండే హైదరాబాద్ పంపేశారు కాంగీయులు.. చివరకు అంతిమ సంస్కారాలు కూడా సక్రమంగా నిర్వహించలేకపోయారు ఈ సోకాల్డ్ గాంధీ కుటుంబ భజనపరులు..
1921 జూన్ 28న తెలంగాణలోని వరంగల్ జిల్లా లక్నేపలిల్లో జన్మించిన నరసింహారావు చిన్నప్పటి నుండే నాయకత్వ లక్షణాలు అలవరచుకున్నారు. హైదరాబాద్ సంస్థాల విముక్తి పోరాటంలో, నిజాం పాలనకు వ్యతిరేకంగా వందేమాతరం నినాదం ఇచ్చి ఉస్మానియా యూనివర్సిటీ నుండి బహిష్కృతులయ్యారు. శాసనసభ్యునిగా, మంత్రిగా సేవలు అందించిన తర్వాత సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. కాంగ్రెస్ వర్గపోరాటాలు ఆయనను పదవి నుండి అర్ధంతరంగా తప్పించాయి.. కానీ ఆయన చేపట్టిన భూసంస్కరణలు ప్రశంసలందుకున్నాయి.. పార్లమెంట్ సభ్యునిగా, మంత్రిగా కేంద్ర మంత్రిగా ప్రతిభను చాటుకున్న పీవీని అనూహ్యంగా ప్రధానమంత్రి పదివి దక్కినా ఆయన ప్రతిష్టకు గ్రహణం తెచ్చింది..
నరసింహారావు గొప్ప సాహితీ వేత్త మాత్రమే కాదు 10కి పైగా భాషలు వచ్చు.. విశ్వనాథ సత్యనారాయణ వేయిపడగలుకు ఆయన పీవీ హిందీ అనువాదం సహస్రపణ్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తెచ్చిపెట్టింది.. పలు అనువాదాలు, కథలతో పాటు తన ఆత్మకథను ఇన్ సైడర్ పేరిట రాశారు.. తెలుగులో ఇది లోపలి మనిషిగా అనువాదమైంది.. దీనికి కొనసాగింపుగా రెండో భాగం తెచ్చేలోపే పీవీ మన మధ్య లేకుండాపోయారు.. 2004 డిసెంబర్ 23న ఈ లోకాన్ని వీడారు..

తనపై వచ్చిన ఆరోపణలు అన్నింటికీ నరసింహారావు చెప్పిన సమాధానాలు.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది.. కాలమే అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది.. చరమాంకంలో అన్ని కేసుల నుండి కడిగిన ముత్యంలా బయట పడ్డారు.. ఆ మహా మనిషిని తలచుకొని నివాళులర్పిద్దాం..

ఎమర్జెన్సీ.. బీజేపీ మహా ప్రస్థానం

స్వతంత్ర భారత చరిత్రలో విషాద ఘట్టం ఎమర్జెన్సీ.. ప్రధాని ఇందిరా గాంధీ ప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డుపై ఖూనీ చేసి, దేశాన్ని రాత్రికి రాత్రి జైలు పాలు చేశారు. ఇందిర నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటంలో కీలక పాత్ర పోషించింది ఆర్ఎస్ఎస్, జనసంఘ్(బీజేపీ) కార్యకర్తలే.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు, దేశం కోసం త్యాగాలు చేశారు.. జనసంఘ్ పేరు బీజేపీగా మారింది ఎమర్జెన్సీ పుణ్యమే..
1952లో ప్రారంభమైన భారతీయ జన సంఘ్ జాతీయవాద రాజకీయాలకు కేంద్రం మారింది.. కాంగ్రెస్ పార్టీ నియంతృత్వ స్వభావం, అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతర పోరు సాగించింది. దేశ సమగ్రత కోసం ఆ పార్టీ అగ్రనేతలు శ్యామప్రసాద్ ముఖర్జీ, దీన దయాళ్ ఉపాధ్యాయ తమ ప్రాణాలు కోల్పోయారు. నెహ్రూ అనంతంరం ఇందిర దేశ ప్రధాని అయిన తర్వాత ఆమెను ధీటుగా ఎదుర్కొన్నది జనసంఘ్.. 1975లో ఇందిరా గాంధీ తమ పదవిని కాపాడుకునేందుకు అత్యవసర పరిస్థితి విధించి ప్రతిపక్ష నాయకులకు జైలుకు పంపారు. అటల్ బిహారీ వాజపేయి, లాల్ కృష్ణ అడ్వానీ తదితర అగ్ర జనసంఘ్ నేతలను చెరసాలతో పెట్టారు.. 
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా పోరాడి ఇందిరాగాంధీని ఎదుర్కోవాలని ప్రతిపాదించారు లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్.. దేశ భవిష్యత్తు కోసం ఇందుకు అంగీకరించింది జనసంఘ్, కొత్తగా ఏర్పడిన జనతా పార్టీలో వినీమైంది.. 1977 లోక్ సభ ఎన్నికల్లో జనతా పార్టీ ఘన విజయం సాధించింది. ఎన్నికల్లో ఆ పార్టీకి 295 సీట్లు రాగా అందులో 93 సీట్లు జనసంఘీయులే గెలిచారు. మిగతా వారిలో 71 మంది లోక్ దళ్, 44 మంది కాంగ్రెస్(ఓ), 28 మంది సోషలిస్ట్, సీఎఫ్ఓ సభ్యులున్నారు. న్యాయంగా ప్రధానమంత్రి పదవి జనసంఘీయులకే దక్కాలి.. కానీ పదవులకన్నా ప్రజాస్వామ్య పరిరక్షణకే ప్రాధాన్యత ఇచ్చారు వారు.. మురార్జీ దేశాయి ప్రధానిగా ఏర్పడిన జనతా ప్రభుత్వంలో అటల్జీ విదేశాంగ మంత్రిగా, అడ్వానీ సమాచార శాఖ మంత్రిగా పని చేశారు..భిన్న రాజకీయ పార్టీలు, సిద్దాంతాల స్వరూపమైన జనతా పార్టీలో నాయకుల అంతర్గత కుమ్ములాటల కారణంగా ఆ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగకుండానే పతనమైంది.. లోక్ సభ ఎన్నికల్లో పరాజయం పాలైంది. జనసంఘీయులు మాత్రం క్రమశిక్షణ, సైద్దాంతిక నిబద్దతను కాపాడుకుంటూ వచ్చారు.. దీంతో ఇతర నాయకులు వీరిని చూసి ఆందోళనకు గురయ్యారు. జనసంఘీయులు ఆర్ఎస్ఎస్ తో అనుబంధాన్ని వదులుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకు వారు అంగీకరించలేదు.. దీంతో ద్వంద్వ సభ్యత్వాన్ని సాకుగా చూపి జనసంఘ్ నాయకులను జనతా పార్టీ నుండి బహిష్కరించారు.
జనతా పార్టీ నుండి బయటనకు రావడం స్వేచ్ఛగా భావించారు జనసంఘీయులు.. తమదైన సైద్దాంతిక దృక్పధాన్ని కొనసాగిస్తూ 1980లో భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేశారు. జనతా పరివార్ ముక్కలు చెక్కలైపోయినా బీజేపీ భారత రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగిందంటే, ఇందుకు కారణం సైద్దాంతిక నిబద్దతే.. అటల్ బిహారీ వాజపేయి, లాల్ కృష్ణ అడ్వానీల నాయకత్వం, ఎందరో కార్యకర్తల త్యాగం, కృషి వృధా పోలేదు.. అటల్జీ, నరేంద్ర మోదీ దేశ ప్రధాన మంత్రులు అయ్యారంటే ఎందరో త్యాగధనుల ఫలితమే
..('చీకటి రోజులకు 40 ఏళ్లు' కథనానికి కొనసాగింపు)

Wednesday, June 24, 2015

ప్రజాస్వామ్య గ్రహణానికి 40 ఏళ్లు..

ఇండియాయే ఇందిర.. ఇందిరే ఇండియా..” దేశమంతా విధేయుల భజన మార్మోగుతున్న రోజులు.. ఇందిరాగాంధీ తిరుగులేని ప్రధానమంత్రిగా ఆవిర్భవించారు.  బ్యాంకు జాతీయీకరణ, రాజభరణాల రద్దు, బంగ్లాదేశ్ యుద్దంలో విజయంతో ప్రజల్లో ఆమె ఖ్యాతి అమాంతం పెరిగిపోయింది. క్రమంగా ఇందిరలో గర్వం పెరిగింది. తానేమీ చేసినా చెల్లతుందనే అహంభావం వచ్చేసింది. తన వారసునిగా తనయుడు సంజయ్‌ గాంధీని ఎంపిక వంశపారం పర్యపాలన శాశ్వతం చేసే ప్రయత్నాలు ప్రారంభించింది.. సంజయ్‌ రాజ్యాంగేతర శక్తిగా, షాడో పీఎంగా ఎదిగారు. పరిపాలన గాడి తప్పి విచ్చల విడితనం వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అవినీతి పెరిగిపోవడం ప్రారంభమయింది. ఇందిర పాలనపై దేశంలో క్రమంగా వ్యతిరేకత ప్రారంభమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రముఖ గాంధేయవాది లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ అవినీతికి వ్యతిరేకంగా ప్రారంభించిన సంపూర్ణ విప్లవ ఉద్యమం యావత్తు దేశాన్ని కదిలిస్తోంది..
సరిగ్గా అప్పుడే ఇందిరా గాంధీపై పిడుగు పడింది.. రాయబరేలీ నుండి పోటీ చేసి విజయం సాధించిన ఇందిర ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పు.. ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకున్నారని  ఆమెపై పోటీ చేసి ఓడిపోయిన రాజ్‌ నారాయణ్‌ ఈ కేసు ఫలితం ఇది. ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా అలజడి.. ఇందిర గద్దె దిగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.. సుప్రీంకోర్టు షరతుల మీద బెయిల్ తీర్పుపై స్టే ఇచ్చినా, తనను చుట్టు ముట్టిన సమస్యల నుండి బయట పడటం ఎలాగో ఆమెకు అర్థం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో చుట్టూ చేరిన వందిమాగదుల సలహాల ఫలితంగా ఇందిరలో దాగిన నియంత నిద్ర లేచింది. ఒక కీలక నిర్ణయానికి వచ్చేశారు. అర్ధరాత్రి వేళ రాష్ట్రపతి ఫకృద్దీన్‌ అలీ అహ్మద్‌ను కలుకొని కీలక పత్రాన్ని ఆయన ముందు పెట్టారు.. ఫకృద్దీన్ మారుమాట్లాడకుండా సంతకం చేశారు.. 352వ నిబంధన క్రింద అత్యవసర పరిస్థితి అమలులోకి వచ్చింది.. అర్ధరాత్రి వేళ భారత ప్రజాస్వామ్యం హత్యకు గురైంది.. చీకటి రోజులకు తెరలేచింది. ఆ రోజు జూన్ 25, 1975..
దేశ వ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులను రాత్రికి రాత్రి, ఎక్కడిక్కడ జైళ్లకు తరలించారు.. జయప్రకాశ్‌ నారాయణ్‌, మురార్జీ దేశాయి, అటల్‌ బిహారీ వాజ్‌పేయి, లాల్‌ కృష్ణ అద్వానీ, చరణ్‌ సింగ్‌, ఆచార్య కృపలానీ, అశోక్ మెహతా, జార్జ్ ఫెర్నాండెజ్‌, మధుదండావతే, రామకృష్ణ హెగ్డే, రాజ్‌నారాయణ్‌ తదితర నాయకులను కటకటాల పాలు చేశారు.. పత్రికలపై సెన్సార్ షిప్ విధించడంతో దేశ ప్రజలకు ఏమి జరుగుతోందో తెలియదు.. ఆరెస్సెస్‌తో పాటు ఎన్నో సంస్థలను రద్దు చేశారు. ప్రశ్నించే వారిని, మేధావులను, పాత్రికేయుల గొంతు నొక్కారు.. వారినీ మీసా చట్టం కింద జైళ్లకు పంపారు. దేశంలోని చెరసాలలన్నీ రాజకీయ ఖైదీలతో కిక్కిరిసి పోయాయి.
ఎమర్జెన్సీ ముసుగులో సంజయ్‌ గాంధీ, కాంగ్రెస్‌ నేతల అరాచకాలకు అంతు లేకుండా పోయింది. 1947లో దేశానికి స్వాతంత్రం వస్తే.. 28 ఏళ్ళకే దేశ దేశ ప్రజలు దాన్ని కోల్పోయారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యానికి చీకట్లు కమ్ముకున్నాయి.. తన పదవిని కొనసాగించుకోవడానికి ఇందిరా గాంధీ లోక్ సభ కాల పరిమితిని ఆరేళ్లకు పెంచారు.. దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా రహస్య ఉద్యమం ప్రారంభమైంది. ప్రజలు జాగృతం కావడం మొదలు పెట్టారు.. ఎక్కడిక్కడ తిరుగుబాటు వాతావరణం కనిపిస్తోంది.. దీంతో 19 నెలల చీకటి రోజుల తర్వాత ప్రధాని ఇందిరాగాంధీలో ఆందోళన ప్రారంభమైంది. ఈ పరిస్థితి ఏనాటికైనా తనకు ముప్పు తెస్తుందని భయపడిపోయింది. ఇక తప్పని పరిస్థితుల్లో 1977 మార్చి 21న ఎమర్జెన్సీ ఎత్తేసింది ఇందిరాగాంధీ..  అలా దేశానికి పట్టిన సుదీర్ఘ గ్రహణం తొలగి పోయింది..
ఎమర్జెన్సీ సమయంలోనే ప్రధాన రాజకీయ పార్టీల్లో కదలిక వచ్చింది.. జయప్రకాశ్ నారాయణ సూచన మేరకు భిన్న రాజకీయ పక్షాలు కలిసిపోయి జనతా పార్టీ ఆవిర్భవించింది.. అదే సంవత్సరం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో దేశ ప్రజలు ఇందిరా గాంధీకి బుద్ది చెప్పుతూ, జనతాకి ఘన విజయం చేకూర్చారు.. మురార్జీ దేశాయి ప్రధానమంత్రిగా కేంద్రంలో జనతా ప్రభుత్వం ఏర్పడింది.. దురదృష్టవశాత్తు భిన్న సైద్దాంతిక నేపథ్యాలు ఉన్న నాయకుల కారణంగా ఈ ప్రభుత్వం ఎక్కవ కాలం నిలవలేదు.. ప్రతిపక్షాల అనైక్యత ఫలితంగా మళ్లీ ఇందిర నేతృత్వంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది.
ఎమర్జెన్సీ మళ్లీ వస్తుందా?.. కొద్ది సంవత్సరాలుగా దేశంలోని మేధావులు, రాజనీతి కోవిధుల్లో నెలకొన్న ఆవేదన ఇది.. ఇందుకు కారణం మన రాజ్యాంగంలో, వ్యవస్థలో ఉన్న లోపాలే.. మన రాజ్యాంగాన్ని ఇప్పటికి వంద సార్లు సవరించుకున్నాం.. మరోవైపు కాంగ్రెస్ తో పాటు మరికొన్ని రాజకీయ పార్టీల్లో వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయి.. వ్యక్తి కేంద్రంగా నడిచే రాజకీయాలు ఏనాటికైనా మన వ్యవస్థకు ప్రమాదకరమే.. 40 ఏళ్ల నాటి ఎమర్జెన్సీ విషాద ఘటనకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పుకోకున్నా, ఈనాటికి విచారం వ్యక్తం చేయలేదు.. మన రాజకీయ వ్యవస్థను ఒకనైనా ప్రక్షాళన చేసుకోకపోతే ఏనాటికైనా మళ్లీ ఎమర్జెన్సీ రాక తప్పదు.. 

Saturday, June 20, 2015

యోగతో రోగ రహిత సమాజం

ప్రపంచానికి భారత దేశం ఇచ్చిన ఎన్నో కానుకల్లో అపూరుపమైనది యోగ’.  ప్రతి ఏటా జూన్ 21ని అంతర్జాతీయ యోగ దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి తీర్మానించింది. ఈ గుర్తింపు లాంఛనం మాత్రమే. యోగా ఏనాడో మన దేశ సరిహద్దులు దాటి ప్రపంచ వ్యాప్తమైంది. పతంజలి మహర్షి సూచించిన అష్టాంగ యోగ సూత్రాల నుండి రూపు దిద్దుకున్న యోగకు అధికారికంగా ప్రపంచ గుర్తింపు రావడం భారతీయులుగా మనందరికీ గర్వకారణం..
ఇంతకీ యోగలో ఏముంది? ఎందుకు దీనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? ఇది ఒక మత ప్రచారంలో భాగం కాదా?.. ఇలాంటి ప్రశ్నలు రావడంతో తప్పులేదు. వాటన్నింటికీ సమాధానం ఉంది. మనం ముందుగా యోగా వల్ల ఉపయోగాలు ఏమిటి అన్న విషయానికి మాత్రమే ప్రాధాన్యత ఇద్దాం.. మొదటి ఉపయోగం సంపూర్ణ ఆరోగ్యం, రెండోది మానసిక ప్రశాంతం.. మన సనాతన ధర్మం (హిందూ మతం) ఒక రూపాన్ని సంతరిచుకోకముందే యోగా పుట్టింది. ఒక మతానికి చెందిన అత్యధికులు ఆచరిస్తున్నారనే సాకుతో యోగకు మతం రంగు పులమడం మూర్ఖత్వమే అవుతుంది.
యోగలో ప్రధానంగా కనిపించేవి ప్రాణాయామం, సూర్యనమస్కారాలు, ముద్రలు, క్రియలు, ఆసనాలు.. ఇందులో ఆసనాలు కనిపిస్తున్నా ప్రధానంగా 25 వరకూ ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ ఆసనాలు వేయడం వల్ల తల నుండి కాలి చిటికన వేలు వరకూ మన శరీరమంతా చురుగ్గా పని చేస్తుంది. శరీరం చక్కగా వంగటం వల్ల రక్త ప్రసరణ అన్ని అవయవాలుకు సక్రమంగా జరుగుతుంది. శ్వాస మెరుగవుతుంది. గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మెదడు, వెన్నుపూస చురుగ్గా పని చేస్తాయి. చక్కగా యోగాసనాలు చేసే వారికి శారీరక కష్టాలు తగ్గుతాయి. గుండెపోటు, రక్తపోటు, మధుమేహం, స్థూలకాయం వంటి సమస్యలను ప్రాథమిక దశలోనే అడ్డుకోవచ్చు. ఇప్పటికే ఉంటే పూర్తిగా నియంత్రణలో పెట్టుకోవచ్చు. తద్వార మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. బద్దకాన్ని విడిచిపెట్టి చురుగ్గా పని చేసుకోగలుగుతాం. మెదడు చురుగ్గా పని చేయడం వల్ల మనలో కొత్త ఆలోచనలు పుంతలు తొక్కుతాయి. మొత్తం మీద సంపూర్ణ ఆరోగ్యానికి యోగ పూర్తి గ్యారంటి ఇస్తుంది..
యోగ ఖరీదైనదనే అపోహలు కొందరిలో వినిపించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ధనికులు, ప్రముఖులు యోగాసనాలను చేయడం, కొన్ని సంస్థలు భారీగా ఫీజులు వసూలు చేసి యోగా నేర్పడం చూసి తెలియని వారికి ఇలా అనిపించడం సహజం. మన ఆరోగ్యం కోసం ఎన్నో మందులు కొని వాడుతున్నాం. వీటి వల్ల మన జేబుకు చిల్లు మాత్రమే కాకుండా సహజ సిద్దంగా ఉండే శరీర రోగ నిరోధక శక్తిని క్రమంగా కోల్పోతున్న విషయాన్ని గ్రహించడం లేదు. అలాగే శరీరాన్ని నియంత్రణలో ఉంచుకోవడం కోసం జిమ్ములు, ఆరోబిక్స్, ఇతర పాశ్చాత్య వ్యాయామాల కోసం డబ్బును ఖర్చు చేస్తున్నాం.. కానీ యోగాకు ఇవేమీ అవసరం లేదు.. చక్కగా మీ ఇంట్లో, లేదా శుద్దమైన గాలి, వెలుతురు సక్రమంగా ఉన్న తగిన చోటు చూసుకొని ఆసనాలు వేసుకోవచ్చు. ఇలా చేసినందుకు మిమ్మల్ని డబ్బు ఇమ్మని అడిగేవారెవరు?

అందరూ యోగాసనాలు వేయండి.. సంపూర్ణ ఆరోగ్యవంతులు కండి.. యోగతో రోగ రహిత సమాజాన్ని రూపొందిద్దాం.. (by: క్రాంతి దేవ్ మిత్ర)

Friday, June 19, 2015

తేలని కోడి పందాల ఆట

రెండు కోళ్లు కలియబడ్డాయి..
పొడుచుకున్నాయి.. రక్కుకున్నాయి.. చురకత్తులతో తీరుకున్నాయి..
జనం రెండు వైపులా ఈలలు.. కేరింతలు..
గెలిచేదెవరు?.. ఓడేదెవరు?..
ఫలితం అటో ఇటో తేలిపోతుందని అంతా ఉత్కంఠత
…………………………..
చివరికేమైంది?
..................................
ఏమీ కాలేదు.. కోళ్లు అలిసిపోయాయి..
ఊరకుండిపోయాయి..
అంతా అయోమయం..
ఫలితం తేలలేదు..
జనం విసుక్కుంటూ ఇళ్ల కెళ్లిపోయారు..
ఆశ చావని వారు లక్కడే ఉండిపోయారు
ఆట మళ్లీ మొదలవుతుందా ఎదురు చూస్తున్నారు..

నేను చెప్పింది నిఝంగా కోడి పందాల గురుంచే సుమా..

అడ్వానీ వ్యాఖ్యలకు వక్రభాష్యం..

గుడ్డు మీద వెంట్రుకలు పీకడం చాలా ఈజీ.. అదెలాగో ఇందులో నిపుణులైన కాంగ్రెస్ నాయకులను అడిగితే చెబుతారు. ఎమర్జెన్సీ మళ్లీ రాదని చెప్పలేం.. ప్రజాస్వామ్యాన్ని నలిపేసే శక్తులు చాలా ఉన్నాయిఅని మాజీ ఉప ప్రధాని, బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అడ్వానీ చేసిన వ్యాఖ్యలను వారు అన్వయించిన తీరే ఇందుకు నిదర్శనం.. అడ్వానీ ఈ వ్యాఖ్యలు ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చేశారని వారంటున్నారు. గురవింద తన కింది నలుపును చూసుకోకుండా ఎదుటి వారిని గేలి చేస్తుందట..
ఎల్.కె.అడ్వానీ చెప్పింది మన ప్రజాస్వామ్య వ్యవస్థ గురుంచి. వ్యవస్థలో లోపాలు ఎప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తాయని మళ్లీ ఎమర్జెన్సీకి దారి తీస్తాయని విశ్లేషించారాయన. ఇక్కడ మోదీని విమర్శించినట్లు వారికి ఎలా అనిపించిందో.. ఈ వ్యవస్థను తయారు చేసింది ఎవరు? దేశాన్ని అత్యధిక కాలం పాలించించి ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా?.. ఒక రకంగా కాంగ్రెస్ వక్ర వ్యాఖ్యానం ఆ పార్టీనే ఇబ్బంది పెడుతుంది. ఎమర్జెన్సీ తాలూకు క్రూర గాయాలను దేశ ప్రజలకు మళ్లీ తడుతోంది..

40 ఏళ్ల క్రితం ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ గురుంచి నేటి తరానికి పెద్దగా తెలియకున్నా, ఆ దారుణ పాలన తాలూకు కష్టాలు అనుభవించిన వారిని అడగండి.. కళ్ల ముందు ఆవిష్కరిస్తారు.. వారిలో అడ్వానీ కూడా ఒకరు.. ఇందిర తాను చేసిన తప్పుకు న్యాయస్థానం విధించిన శిక్ష నుండి తప్పించుకోవడానికి నియంతగా మారారు. యావత్ ప్రతిపక్షాన్ని జైలుపాలు చేసి ఎమర్జెన్సీ విధించారు. పత్రికల నోరు నొక్కి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు.. ఇలాంటి వారసత్వ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఎమర్జెన్సీ గురుంచి మాట్లాడటం, వక్ర వాక్యాలు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించడమే అవుతుంది. 

Thursday, June 18, 2015

గెలిచేది ఎవరైనా, ఓడేది ప్రజలే..

ఏడాది క్రితం రాష్ట్ర విభజనకు ముందే సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. కొత్తగా ఏర్పడే తెలంగాణలో తెరాసకు, ఆంధ్రప్రదేశ్లో తెదేపాకు అధికారం అప్పగించారు ప్రజలు.. దాదాపు పుష్కర కాలంగా ఇరు ప్రాంతాల మధ్య కొనసాగుతున్న ఘర్షణ ముగిసిపోయిందని, ఇక ఎవరి సంసారం వారిదే అని అంతా అనుకున్నారు.. విభజన సమయంలో ఏర్పడ్డ చిక్కుముళ్లు కూడా క్రమంగా తొలిగిపోతున్న సమయంలో కొత్త గిల్లి కజ్జాలు వచ్చిపడ్డాయి. రెండు రాష్ట్రాల్లో ఈ ఏడాది కాలంలో పాలక పార్టీలు కోతలు తప్ప పెద్దగా చేసిందేమీ లేదు.. ప్రతిపక్షాలు వారిపై పోరాటానికి సిద్దమౌతున్న వేళ, ప్రజల దృష్టి మరల్చడానికా అన్నట్లు రెండు ప్రభుత్వాలు కొత్త ఎత్తుగడకు దిగాయి..

ఓటుకు నోటు అంశం వీరికో సాకుగా దొరికింది.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటూ మైండ్ గేమ్ అడుతున్నాయి.. తమ రాజకీయ కక్ష సాధింపు చర్యల కోసం ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి.. ఈ యుద్దంలో ఓడేది, గెలిచేసి ఎవరైనా దుష్పభావ ఫలితం అనుభవించేది మాత్రం తెలుగు ప్రజలే.. చేసిన నిర్వాకం చాలు.. ఇప్పటికైనా ఈ లొల్లి ఆపేసి, ఎవరి ఇళ్లు వారు చక్కదిద్దుకుంటే మేలు.. 

Wednesday, June 17, 2015

వ్యంగ్యానికీ హద్దుంటుంది..

రాజకీయాలు నాయకులకు, సినీ నటులకు కార్యకర్తలు, అభిమానులు ఉంటారు.. తమ నేతలకు, హీరోలకు జిందాబాదులు, ప్రత్యుర్థులకు ముర్దాబాదులు సర్వసాధారణం. వీధుల్లో తిట్టుకోవడం, కొట్టుకోవడం అంతే సహజం. పత్రికలు, టీవీల ద్వారా ఇలాంటివి మరింత రక్తి కట్టిస్తుంటాయి.. సమాచార సాంకేతిక విప్లవం పుణ్యమా అని సోషల్ మీడియా వచ్చాక వీటి స్వరూపమే మారిపోయింది..
2014 సాధారణ ఎన్నికలకు ముందు నుండి రాజకీయ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియాను ప్రచారాస్త్రాలుగా మార్చుకున్నారు.. ఫేస్ బుక్, గూగల్ ప్లస్, ట్విట్టర్, వాట్సప్ లు తమ భావ ప్రకటనకు వేదికలుగా మారాయి.. ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలు, అవతలివారు ధీటుగా ఎదురుదాడికి దిగడంలాంటి చర్యలకు పత్రికలైతే ఒక రోజు, ఛానళ్లయితే ఒక పూట పట్టేది.. ప్రత్యక్ష ప్రసారాలు వచ్చాక ఎప్పటికప్పుడే తేలిపోతున్నాయి.. కానీ సోషల్ మీడియా వచ్చాక పత్రికలు, టీవీలకన్నా వేగంగా ఈ పని జరిగిపోతోంది.. ఇదంతా ఒక స్థాయి వరకూ బాగానే ఉంటుంది.. కానీ ఇప్పుడు వ్యవహారం శృతి మించిపోయింది..
మల్టీ మీడియా, యానిమేషన్ల సహకారంతో విచ్ఛల విడిగా ఫోటోలు మార్పింగులు చేస్తున్నారు.. ఇవి హాస్యానికి బదులు, అపహాస్యం, అసహ్యం కలిగించే రీతితో ఉన్నాయి.. గత కొన్ని రోజులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై సోషల్ మీడియాలో కనిపిస్తున్న మార్ఫింగ్ ఫోటోలు ఇందుకు పరాకాష్ట.. గతంలో జగన్, బాలకృష్ణ ఈ దారుణాలకు బలయ్యారు.. ఇప్పుడు కేసీఆర్, చంద్రబాబులు టార్గెట్ అయిపోయారు. ఫోటోలు మార్ఫింగ్ చేసి అసభ్యమైన రాతలతో వారి అభిమానులు మానసిక ఆనందం పొందుతున్నారు.. తెలిసో తెలియకో అందరూ వారిటిని షేర్ చేసుకొని తరించిపోతున్నారు..

ప్రతి ఒక్కరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది.. అదే సమయంలో వాటికో హద్దు ఉంటుంది.. సోషల్ మీడియాలో మితిమీరిన భావ ప్రకటనా స్వేచ్ఛకు పగ్గాలు లేవనుకుంటే అమాయకత్వమే.. చట్టాలకు పదునైన కోరలు ఉంటాయని అంతా మరచిపోతున్నారు.. బాధ్యతగల పౌరులుగా మనవంతుగా ఇలాంటి అపహాస్య వ్యంగ్య చిత్రాలను వ్యతిరేకిద్దాం.. వీటికి నో చెప్పేద్దాం.. 

Monday, June 15, 2015

కౌటిల్యుని హక్కుల పత్రం అర్థశాస్త్రం

మాగ్నాకార్టా అనే హక్కుపత్రం రూపొంది 800 సంవత్సరాలు అయిందని పాశ్చాత్యులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆధునిక ప్రజాస్వామ్యానికి తొలి బీజం మాగ్నా కార్టా అని వారి నమ్మకం.. దైవాంశ సంభూతుడుగా భూమి మీద తిరుగులేని అధికారాలు చెలాయిస్తున్న రాజుకు అడుడకట్ట వేసింది మాగ్నా కార్టా అనే హక్కుల పత్రం అని అంటారు. ప్రజాస్వామ్యం, న్యాయం, స్వేచ్ఛ దీని ద్వారానే పురుడు పోసుకున్నాయంటారు. 15 జూన్, 1215 నాడు బ్రిటన్ చక్రవర్తి కింగ్ జాన్ జారీ చేసిన మాగ్నాకార్టా ఇంగ్లాండ్లో పార్లమెంటరీ వ్యవస్థకు, అమెరికా రాజ్యాంగం, ఫ్రెంచ్ విప్లవానికి దారి తీసింది.. నిజమే కానీ అది పాశ్చాత్య దేశాల వరకే.. పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్లు మనమూ వారిని వ్యామోహంలో పడి మాగ్నాకార్టా భజన చేస్తున్నాం.. మన అర్థశాస్త్రాన్ని మరచిపోతున్నాం..
పాశ్చాత్యులకు ప్రజాస్వామ్యం పురుడు పోసుకొని 800 ఏళ్లయింది.. కానీ మనకు 2000 ఏళ్ల క్రితమే ఈ వ్యవస్థ ఉంది.. చాణక్యుని అర్థశాస్త్రం చదవండి తెలుస్తుంది.. రాజ్యం ఎలా ఉండాలి.. పాలకుడు, పౌరుల విధులు, సమాజం, ఆర్థిక వ్యవస్థ ఎలా నడవాలి.. ప్రజాసంక్షేమం, పొరుగుదేశాలతో సంబంధాలు.. యుద్దాలు, శిక్షలు.. ఇలా ఎన్నో విషయాలను తెలియజేస్తుంది అర్థశాస్త్రం. రాజ్యం(సమాజం)లో ఎవరి విధి ఏమిటి అనేది స్పష్టపరచిన గ్రంథమిది.. మనం చెప్పుకుంటున్న ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాలు అర్ధశాస్త్రంలో స్పష్టంగా కనిపిస్తాయి.. గొప్ప రాజనీతిజ్ఞుడైన చాణక్యున్ని పాశ్యాత్యులు ఏనాడో గుర్తించారు.. చాణ్యక్య నీతి సూత్రాలను అధ్యయనం చేశారు.. కానీ మన దేశాన్ని పాలించిన బ్రిటిష్ వారు చాలా జాగ్రత్తగా అది మనకు అందకుండా చేశారు..

మన మెకాలే మనస పుత్రుల కారణంగా చాణక్యుని అర్థశాస్త్రం గురుంచి మనకు పెద్దగా తెలియకుండా పోయింది.. మన చరిత్ర పాఠాల్లో కౌటిల్యుని గురుంచి వీలైనంత తక్కువే చెబుతారు.. అయినా మనకు చాణక్యుని అర్థశాస్త్రం అందుబాటులోనే ఉంది.. వీలు చేసుకొని చదవండి..

Saturday, June 13, 2015

ఆప్ సర్కారులో అన్యాయ మంత్రులు

తాను డిగ్రీ చదివిన కాలేజీ, యూనివర్సిటీ ఎక్కడుందో ఆయనకే తెలియదు.. పోలీసులు అక్కడికి తీసుకెళ్లినా తరగతి గదులను, అధ్యాపకులను కూడా గుర్తించలేకపోయాడు. ఫేక్ డిగ్రీల కేసులో అరెస్టయిన ఢిల్లీ న్యాయ శాఖ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ వ్యవహారం ఇది.. తమ మంత్రిని కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్ని అన్యాయంగా అరెస్టు చేయించిందని లొల్లి చేసిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ గొంతులో పచ్చి వెలగకాయ పడింది. పరువు కాపాడుకునేందుకు తోమర్ ను పార్టీలోంచి తొలగించుకునే పనిలో పడ్డాడిప్పుడు..
అంతకు 49 రోజుల పాలనలో న్యాయ మంత్రిగా ని చేసిన సోమనాథ్ భారతిది మరో వ్యవహారం.. మంత్రిగా వెలగబెట్టిన రోజుల్లో అర్ధరాత్రి వేళ అనుచరులతో ఢిల్లీలో ఉగండా యువతుల ఫ్లాట్ మీద దాడి చేసి వారు మత్తు పదార్ధాలు అమ్ముతున్నారని రాద్ధాంతం చేశాడు. అరెస్టు చేయాలని పోలీసుల మీద వత్తిడి తెచ్చాడు.. అందులో నిజం లేదని భావించిన పోలీసులు పట్టించుకోకపోవడంతో, సాక్షాత్తు మంత్రి ఆదేశించినా పట్టించుకోరా అంటు సీఎం కేజ్రీవాల్ రోడ్డెక్కి ధర్నాక దిగి రెండు రోజులు ఢిల్లీ ప్రజలకు నరకయాతన చూపించారు.. ఇంత చేసి కేజ్రీవాల్ సాధించింది ఏమిటయ్యా అంటే సదరు పోలీసులను బదిలీ చేయించడం.. సోమనాథ్ భారతిపై ఉగండా యువతులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితి లేక పోవడంతో మహిళలపై చిన్నచూపును నిరసిస్తూ ఆమ్ ఆదీ పార్టీ నుండి కొందరు మహిళా నేతలు బయటకు వచ్చారు..
తాజాగా సదరు సోమనాథ్ భారతిపై గృహ హింస కేసు నమోదైంది. భర్త తనను అన్ని రకాలుగా హింసిస్తున్నాడని ఆయన భార్య లిపిక పోలీసుల్ని ఆశ్రయించింది.. తాను ఆప్ లో పని చేయడం భార్యకు ఇష్టంలేదని, తమ తల్లిని ఆమె నిర్లక్ష్యం చేస్తోందని సోమనాధ్ డొంక తిరుగుడు వాదన వినిపిస్తున్నాడు.. గతంలో సోమనాథ్ భారతిని వెనుకేసుకు వచ్చిన కేజ్రీవాల్ ఇప్పుడేమంటారో వేచి చూడాలి.. 49 రోజుల పాలనా సమయంలోనే రాఖీ బిర్లా అనే మంత్రి ఒక కేసు విషయంలో పోలీసు స్టేషన్ వెళ్లి దౌర్జన్యంగా వ్యవహరించినట్లు వార్తలు వచ్చాయి.

ఇదండీ ఆప్ అన్యాయ మంత్రుల కథ.. దేశ భద్రత కారణాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం పోలీసు శాఖను ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించలేకపోతోంది.. ఇప్పటికే లెఫ్టినెంట్ గవర్నర్ తో చీటికి మాటికీ గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ, అధికారుల జీవితాలతో ఆడుకుంటున్నాడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. తన పార్టీలో అచారక ప్రజాప్రతినిధులను వెనుకేసుకు వస్తున్నాడు.. కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్నట్లు పోలీసు శాఖ ఢిల్లీ ప్రభుత్వానికి బదలాయిస్తే ఇంకెన్ని అరాచకాలు జరిగేవో అనిపిస్తోంది..

Thursday, June 11, 2015

ఈ కల నిజం కావొద్దు బాబోయ్..

ఏంటేంటి మన ఇద్దరు సీఎంలు జైలులో ఉన్నరా?.. అదీ పక్క రాష్ట్రలోనా?..
అవ్ తమ్మీ నాకు అట్లనే కలొచ్చింది మల్ల..
ఇదేం కల అన్నాయ్.. మన సీఎంలు గా రాష్ట్రం జైళ్లలో ఉండటమేంటి?..
మన ఇద్దరు సీఎంలు ఒకళ్ల మీద ఒకళ్లు కేసు పెట్టుకున్నరు కదా?.. మన రెండు రాష్ట్రాలకు ఒకటే హైకోర్టు.. ఇక్కడైతే న్యాయం జరగదని, పక్క రాష్ట్ర కోర్టుకు కేసు బదిలీ చేయమని పనిలేని పాపారావు పిటిషన్ ఏసిండట.. అట్ల కేసు పక్క రాష్ట్రానికి బదిలీ చేసిండ్రు.. గా పక్క రాష్ట్ర ఒకాలతు మనోళ్లకు ఆడున్న జైలుకు రిమాండు చేసిందంట..
ఇదెలా సాధ్యం? ఏ రాష్ట్రం కేసులు ఆ రాష్ట్రంలే విచారిస్తారు కదా?.. మరి మన కేసులను పక్క రాష్ట్రానికి ఎందుకు పోతాయి?..
ఎందుకు సాధ్యం కాదంటవ్? జయమ్మ తశ్వ కర్ణాటక ఒకాలత్ల నడ్వలేద?.. అమె పరప్పన అగ్రహార జైలుకు పోలేద?
అవునన్నాయ్.. ఇదీ నిజమే..
ఆళ్లే జైలుకు పోరులే తమ్మీ.. గొంగట్ల తింటూ ఎంటుకలు ఏరుతున్న ఇద్దరికీ ఇంత ఇంగితం వస్తె సాలని కోరుకుంటున్న.. పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చె అనె సామతె తెలుసనుకుంట.. మనం మనం కొట్టుకొని అవతలోనికి ఎందుకు అలుసు గావాలే..
ఇంతకీ నీకు ఈ కల ఎప్పుడొచ్చిందన్నాయ్?
ఇయాల పొద్దుగాల వచ్చింది..
ఆ.. తెల్లవారు ఝామున వచ్చిన కలలు నిజమౌతాయట కదా???

 (గమనిక: ఎవరా ఇద్దరు సీఎంలు?.. ఏమా కేసులు?.. ఇదెలా సాధ్యం అంటూ బుర్రులు బద్దలు కొట్టుకోకుండ్రి.. ఇది కల మాత్రమే అనుకొని జస్ట్ నవ్వుకోండి.. అంతే..)

Wednesday, June 10, 2015

సద్గురు అస్తమయం

సనాతన ధర్మ రక్షణకు జీవితాన్ని అంకితం చేసిన ఆధ్యాత్మిక వేత, సద్గురు కందుకూరి శివానంద మూర్తి ఇక లేరనే వార్త బాధాకరం.. సమాజానికి ధార్మిక, సాంస్కృతిక దృక్పధాన్ని బోధించిన పూజ్య సద్గురు లేని లోటు పూడ్చలేనిది.. వారు భౌతికంగా మహా సమాధి చెందినా వారు చూపించిన మార్గం మనందరికీ సదా అనుసరనీయం.. ఓం శాంతి శాంతి శాంతి.. 

Tuesday, June 9, 2015

ఎప్పటికీ యాదికుండు దాశరథి సోదరులు

అన్న వెంట తమ్ముడు.. ఇద్దరిదీ ఒకే బాట.. పోరాటమైనా, సాహిత్యమైనా.. అపూర్వ తెలంగాణ సోదరులు వీరు.. దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్య..

నా తెలంగాణ కోటి రతనాల వీణ.. మా నిజాము రాజు తరతరాల బూజు అంటూ నిరంకుశ పాలనపై తిరగబడి అగ్నిధారను కురిపించారు కృష్ణమాచార్య.. ఆగ్రహించిన ప్రభుత్వం జైలు పాలు  చేసింది.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కుటుంబ బాధ్యతలు స్వీకరించిన రంగాచార్య అన్నయ్య చూపిన మార్గంలోనే నడిచాడు.. హైదరాబాద్ సంస్థానంలో చిల్లర దేవుళ్లను ఎండగట్టారు..

నిజాం పాలన అంతమయ్యాక ఉపాధి కోసం కృష్ణమాచార్య సినీ రంగంలో, రంగాచార్య ప్రభుత్వ ఉద్యోగాలను ఎంచుకొని తన సాహితీ సేవను కొనసాగించారు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్థాన కవిగా గౌరవం అందుకున్న కృష్ణమాచార్య తన యాత్రాస్మృతిని 1987లో ముగించగా, రంగాచార్య పరిపూర్ణ జీవనయాగం ఇప్పుడు ముగిసింది.. తెలుగు సాహిత్యాన్ని మరింద పరిపుష్టం చేసేందుకు తమ వంతు కృషి చేసిన దాశరథి సోదరుల సేవలు విలువ కట్టలేనివి.. తెలుగు భాష ఉన్నత వరకూ ఈ తెలంగాణ సోదరుల సాహితీ సేవ యాదికుండిపోతుంది.. -క్రాంతి దేవ్ మిత్ర

Saturday, June 6, 2015

ఢిల్లీ మన దేశంలో లేదా?

అరవింద్ కేజ్రీవాల్ తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఢిల్లీ, భారత దేశంలో లేదనుకుంటున్నాడు.. దేశ ప్రజలంతా నరేంద్ర మోదీని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారని, ఢిల్లీ ప్రజలు ఆప్ కు పట్టం కట్టారని అంటాడు. అందువల్ల ఎవరి పాలన వారు చూసుకోవాలని ఉచిత సలహా ఇస్తున్నాడు.. లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడింటికి ఏడు సీట్లు బీజేపీ గెలుచుకున్న సంగతి మరచిపోతున్నాడు. ఢిల్లీ మన దేశానికి రాజధాని.. స్థానిక పాలన కోసం అసెంబ్లీ హోదా ఇచ్చినా, కీలకమైన అంశాలన్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి.. భద్రతాకారణాల వల్ల పోలీసు శాఖను రాష్ట్రానికి బదిలీ చేయలేకపోతున్నారు..
సాధారణంగా కేంద్ర, రాష్ట్రాల చక్కని సమన్వయం ఉంటే ఎక్కడా ఘర్షణ తలెత్తే అవకాశం ఉండదు.. కానీ పేచీ కోరు మనస్థత్వం ఉంటేనే పెద్ద సమస్య.. గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి ధర్నాకు దిగిన ఘనత కేజ్రీవాల్ ది.. రిపబ్లిక్ డే వేడుకలు అవసరం లేదంటాడు. ఆప్ వారికి కాశ్మీర్ వేర్పాటు వాదులను సమర్ధించిన చరిత్ర ఉంది.. అలాగే ఆ పార్టీ వెబ్ సైట్ లో కశ్మీర్ ను భారత్ లో చూపించలేదు. విమర్షలు రావడంతో దాన్ని ఎత్తేశారు..

తనకు భారత దేశంలో సంబంధంలేదు, ఢిల్లీ తప్ప దేశం ఏమైపోతే నాకేమిటని కేజ్రీవాల్ అనుకుంటున్నారా?.. మోదీ పాలన నుండి ఢిల్లీని మినహాయించాలని ఆయన కోరుకోవడంలోని సంతకేతం ఏమిటి? కేజ్రీవాల్ వైఖరిని మనం సమర్ధించవచ్చా? 

Thursday, June 4, 2015

పిల్లల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేయకండి..

ఇంటికొచ్చిన తనయుడు అమ్మా ఆకలి అంటాడు.. టూ మినట్స్ అంటూ తల్లి వంటింట్లోకి వెళుతుంది.. పొయ్యిమీద ఏదో మరుగుతుంటుంది..పిల్లోడు ఆసక్తిగా ఎదురు చూస్తుంటాడు.. క్షణాల్లో తల్లి వచ్చి సర్వ్ చేస్తుంది.. ఆసక్తిగా లొట్టలేస్తూ తినేస్తాడు.. టీవీలో వచ్చిన ఈ యాడ్ ఎంతో మంది భారతీయుల్ని కట్టి పడేసింది.. ఫలితంగా ఆ ప్రొడక్ట్ అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయి.. ఇంటింటా డైనింగ్ టేబుల్ పై ఓ భాగమైపోయింది..
మీరు ఎప్పుడైన మ్యాగి ప్రకటనలో సత్యం ఎంతో గ్రహించారా?.. మీ ఇంట్లో రెండు నిమిషాల్లో మ్యాగి ఎప్పుడైనా ఉడికిందా?,, లేదు కదూ?.. అబద్దంతోనే ప్రారంభమైన మ్యాగి పిల్లల ఆరోగ్యాన్ని బుగ్గి చేస్తుంటే ఇంత కాలం మనం ఎలా కళ్లు మూసుకున్నామో.. తలచుకుంటేనే ఆశ్చర్యంగా ఉంది..
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆహార నాణ్యతా ప్రమాణాల ప్రకారం సీసం 0.01 పీపీఎం మాత్రమే ఉండాలి.. కానీ లక్నోలో స్వాధీనం చేసుకున్న మ్యాగి శాంపిళ్లలో ఏకంగా 17 పీపీఎం సీసం ఉంది.. దీంతో దేశ వ్యాప్తంగా దుమారం లేచింది. కేంద్రంతో సహా రాష్ట్రాలన్నీ అప్రమత్తమయ్యాయి.. ఢిల్లీలో వెంటనే కొద్ది రోజులు నిషేధించి దర్యాప్తు ప్రారంభించింది. మిగతా రాష్ట్రాలు అదే బాటలో ఉన్నాయి. సైన్యంలో మ్యాగిపై పూర్తి నిషేధం విధించారు.
సీసం ఒక విషపూరితమైన లోహం.. ఇది మన శరీరంలోకి చేరితే తలనొప్పి, కడుపునొప్పి, గందరగోళం, చికాకు కలుగుతాయి. రక్తహీనత ఏర్పడుతుంది. మోతాదు మించితే మూర్చ, కోమా, మరణమూ సంభవించవచ్చు..ఆహార పదార్థాల రుచి పెంచడానికి మోనోసోడియం గ్లుటామేట్ కలుపుతారు. దీని కారణంగా కారణంగా తలనొప్పి, వెన్నునొప్పి, చికాకు, అయోమయం, మగత కలుగుతాయి. ఛాతిలో మంట, దవడలు బిగుసుకుపోవడం, అలర్జీలు వస్తాయి.. మ్యాగీని తయారు చేస్తున్న నెస్లే ఇండియా అనే బహుళజాతి సంస్థ తన వ్యవహారాన్ని సమర్ధించుకుంటోంది. అయితే ఈ సంస్థ తయారు చేసే పాలపొడిలో పురుగులు కనిపించం కూడా వివాదాస్పదమైంది.
ఎవరి వాదనలు ఎలా ఉన్నా మన పిల్లల ఆరోగ్యం మనకు ముఖ్యం.. ఎందుకొచ్చిన మ్యాగీలు, గీగీలు.. చూస్తూ చూస్తు ఆరోగ్యాలు బుగ్గి చేసుకుంటామా? ఒక మ్యాగినే కాదు, అన్ని ప్యాకింగ్ ఫాస్ట్ -జంక్ ఫుడ్లు, శీతల పానీయాలు కూడా ఆరోగ్యానికి హాని చేసేవే.. పిల్లలకు మన ఇంట్లో తయారు చేసే చిరుతిండ్లు, పళ్ల రసాలు ఇవ్వడమే మంచిది.. ఇంతకు మించిన ఆరోగ్యకర, పౌష్టికాహారం ఇంకేముంటుంది.. ఆలోచించండి..

Wednesday, June 3, 2015

ఇద్దరు చంద్రులు.. ఏడాది పాలన..

తెలుగునాట ఎల్ నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.. ప్రకృతి అంతా గందరగోళం.. వానాకాలంలో సకాలంలో వర్షాలు పడలేదు.. చలికాలం కూడా అంతంతే ప్రభావాన్ని చూపింది.. ఈలోపు వేసవి వచ్చేసింది.. ఎండాకాలం మొదటి భాగమంతా అండపాదడపా చిరు జల్లులు పడ్డాయి.. రెండో భాగం మాత్రం ఉష్ణోగ్రతలు సాధారణాన్ని మించిపోయే సరికి ప్రజలు కళ్లుతేలేశారు.. మళ్లీ వానాకాలం వచ్చేస్తోంది.. ఈసారీ సాధారణంకన్నా తక్కువ వర్షపాతమే అంటూ వాతావరణ శాఖ అధికారులు చల్లగా తమ అంఛనాలు చెప్పేశారు..
ఇద్దరు చంద్రుల ఫోటో వ్యాఖ్య పెట్టి ఈ సోదంతా ఎందుకు రాశాడనుకుంటున్నారా?.. ఏం చేస్తాం మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిస్థితి కూడా ఈ ఎన్ నినోకు భిన్నంగా లేదు మరి.. పోయిన కాలం, వయస్సు తిరిగి రాదని మన పెద్దలు చెబుతుంతారు.. ఏం చేయాలన్నా మన జీవిత కాలంలోనే చేయాలి.. ఐదేళ్లు అంటే ఇంకా చాలా సమయమే ఉందిలే అనుకుంటారు నేతాజీలు.. కానీ కాలచక్రం గిర్రున తిరుగుతున్న కొద్దీ తత్వం బోధపడుతుంది వారికి.. ఇటు చంద్రశేఖర రావు, అటు చంద్రబాబు నాయుడు తన పీఠాలపై బేషుగ్గా, తీరిగ్గా ఏడాది కొలువు పూర్తి చేస్తుకున్నారు.. ఏం చేశారయ్యా అని అడిగితే.. చాలానే చేశాం, ఇంకా అవీ ఇవీ చేస్తాం అంటుంటే వింటున్న జనం ఇంతేనా అని నిట్టూరుస్తున్నారు..
స్వరాష్ట్ర స్వప్నం సిద్ధించి ఏడాది పూర్తయిన సందర్భంగా తెలంగాణలో సంబరాలు జరిగాయి.. రాజధాని లేని గందరగోళ పరిస్థితుల్లో చీలిపోయిన ఆంధ్రప్రదేశ్లో నవ నిర్మాణ దీక్ష జరిగింది.. ఈ రెండింటిలో అధికారంలో ఉన్నవారి హడావుడి తప్ప సాధారణ ప్రజల పాత్ర ఏమాత్రం లేదనేది నిష్టూరమైన నిజం.. ఇద్దరు చంద్రులు ఇరు రాష్ట్రాల్లో అత్తెసరు రుణమాఫీ, ఫించన్లులాంటివి లేపనాలు తప్ప పెద్దగా చేసిందేమీ లేదు.. ప్రభుత్వోద్యోగులను మాత్రం పోటీలు పడి చల్లగా చూసుకుంటున్నారు.. ముఖ్యమైన సమస్యలపై ఇంకా దయ చూపడంలేదు..  రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగ యువత, ఇతర సాధారణ వర్గాల ప్రజలు గుర్రుగా చూస్తున్నారు.. ఎన్నికల వాగ్దానాలను పక్కన పెట్టేసి తమ స్వప్నాలను జనాలకు త్రీడీ ఎఫెక్టుతో చూపిస్తున్నారు.. హైదరాబాద్ నగరాన్ని ఎక్కడికో తీసుకుపోతానని కేసీఆర్ చెబుతుంటే.. సింగపూర్ రేంజిలో హైదరాబాదును మించిన రాజధాని కడతానంటున్నాడు బాబు.. ప్రతిపక్ష సభ్యులకు వల వేయడం.. గిల్లి కజ్జాల్లో మాత్రం ఎవరికి వారే..
ఇప్పటికే ఏడాది గడచిపోయింది.. ఎల్ నినో ప్రభావం నుండి బయటనకు వచ్చి వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకొని జనాలను అంతో ఇంతో మేళ్లు చేసి చూపిస్తే చాలు.. మీ స్వప్నాలను మాటల్లో కాకుండా ఆచరణలో చూపిస్తే 2019లో వద్దు మొర్రో అన్నా జనం మళ్లీ మిమ్మల్నే కోరుకుంటారు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంతా శుభం కలగాలని కోరుకుందాం..

( *ఈ పోస్టుతో ఉన్న ఫోటో వ్యాఖ్య సరదాకి మాత్రమే.. )

ఒకే భాష.. రెండు రాష్ట్రాలు. ఒకే పత్రిక.. రెండు ఎడిషన్లు. ఒకే ఐడియా.. రెండు కార్టూన్లు. నా అభిమాన కార్టూనిస్టు శ్రీధర్ సంగతి ఇదండీ.. నాకెంతో నచ్చాయివి..



Monday, June 1, 2015

దండోపాయానికి చిత్తయిన రేవంత్..

రాజకీయాల్లో దూకుడు చాలా అవసరం.. కానీ అతి దూకుడు ప్రమాదకరం.. చాలా స్వల్పకాలంలో కీలక రాజకీయ నేతగా ఎదిగాడు రేవంత్ రెడ్డి.. 2004లో టీడీపీ పరాజయం పాలై అధికారం కోల్పోయినప్పుడు రేవంత్ ఎవరో ఎవరికీ తెలియదు.. జడ్పీటీసీ, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ఎదగడానికి ఆయనకు కేవలం మూడేళ్ల సమయం మాత్రమే పట్టిందంటే దూసుకుపోయే తత్వమే కారణం.. తెలంగాణ తెలుగుదేశంలో హేమా హేమీలు బీటీ బాట పట్టడంతో ఉన్నా రేవంత్ రెడ్డి కీలక నాయకుడిగా ఎదిగాడు..
రాజకీయాల్లో గుర్తింపు రావడానికి దూకుడు అవసరమే.. కానీ నాయకునిగా ఎదిగిన తర్వాత వ్యూహాత్మకంగా వ్యవహరించాలి.. రేవంత్ ఏకంగా కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ యుద్దానికి దిగాడు..  రాజకీయంగా అది ఆయన మైలేజీకి దోహదం చేస్తుండొచ్చు కానీ, అవతలి వారి వ్యూహాన్ని కనిపెట్టడంలో విఫలమయ్యాడు.. అధికార పార్టీ సామ, దాన, భేదోపాయలను ఉపయోగించినా రేవంత్ వారికి చిక్కలేదు.. చివరకు దండోపాయంలో చతికిల పడ్డాడు..
శాసన మండలి ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన నామినేటెడ్ ఎమ్మెల్యేతో టీడీపీ అభ్యర్ధికి ఓటేయించేందుకు లంచం అడ్వాన్స్ ఇచ్చి గట్టి సాక్షాధారాలతో దొరికిపోయాడు రేవంత్.. విచిత్రం ఏమిటంటే రేవంత్ నామినేటెడ్ సభ్యునికి ఎర వేసినట్లు కనిపించడం,, కానీ ఎర వేసింది అధికార పార్టీయే.. రేవంత్ ను రప్పించి పకడ్భందీగా ఇరికించేశారు.. ఇప్పట్లో కోలుకోలేని విధంగా.. రేవంత్ మాటలు టీడీపీ శ్రేణులను ఇరకాటంలో పడేశాయి..

మనం చేస్తే శృంగారం, అవతలి వాడు చేస్తే వ్యభిచారం.. రాజకీయుల నీతి ఇది.. దొరికిపోయిన వాన్నే దొంగ అంటుంది లోకం.. దొరకనంత కాలం దొరలే.. తెర వెనుక ఏమీ చేసినా అనవసరం.. పాపం అతి దూకుడుతో రేవంత్ ఇలా దొరికిపోయాడు..