Tuesday, December 31, 2013

అర్థంలేని సందడి..

అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.. మరి కొద్ది గంటల్లో, నిమిషాల్లో, క్షణాల్లో వచ్చేస్తోందట.. న్యూ ఇయరట.. జనవరి 1..
డిసెంబర్ 31 అర్ధరాత్రి మద్యం చిమ్ముతుంది.. కేకులు కట్ చేస్తారు.. చెవులు పగిలే మ్యూజిక్ మధ్య పిచ్చి గంతులు వేస్తారు.. యువతీ యువకులు రోడ్లపై రాష్ గా వాహనాలు నడిపి నిబంధనలు ఉల్లంఘిస్తారు.. అనుకోని దుర్ఘటనలు జరిగిపోతుంటాయి.. హద్దులు మీరే చోట్ల నిర్భయలాంటి చీకటి ఘటనలు జరిగిపోతాయి.. (ఇందులో వెలుగు చూసేవి తక్కువే)
ఎందుకీ హడావుడి.. అవసరమా ఇదంతా.. అసలు జనవరి 1 అంటే ఏమిటి.. జస్ట్ క్యాలెండర్లో మార్పు.. ఒక పేజీ మార్చే సందర్భానికి ఎందుకీ పిచ్చి పనులు.. అంతగా సెలబ్రేట్ చేసుకోవాలనే దురద ఉంటే నలుగురికీ పనికి వచ్చే ఏవైనా మంచి పనులు చేయండి.. కాస్త పేరైనా దక్కుతుంది..

నిజానికి ఈ రోజును అంతర్జాతీయ తానుబోతుల దినంగా ప్రకటించడం సమంజసం.

Monday, December 30, 2013

ఆమ్ ఆద్మీ పరేషాన్..

వెనుకటికి (90) చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో గల్ఫ్ యుద్దం జరిగి ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు విపరీంతా పెరిగాయి.. మన దేశంలో కూడా పెట్రోలు, డీజీల్, గ్యాస్ ధరలు ఏకంగా 100 శాతం మేర పెరిగాయి.. కేంద్ర ప్రభుత్వం పొదుపు పాటించాలని పిలుపునిచ్చింది.. అప్పట్లో పీసీసీ అధ్యక్షనిగా ఉన్న వీ.హనుమంతరావు పొదుపు పేరిట ఓ రోజంతా రిక్షాలో తిరిగారు.. అసెంబ్లీకి, సచివాలయానికి ఆయన రిక్షలో రావడం, మందీ మార్బలం, సెక్కూరిటీ ఆయన వెంట తిరడం అందరికీ వింతగా కనిపించింది.. తీరా ఖర్చును లెక్కేస్తే ప్రతిరోజూ కారుకు అయ్యే ఇంధన వ్యయం కన్నా అధికంగా లెక్కతేలింది.. పోనీలే హనుమన్న ఎంతో కొంత పెట్రోలు ఆదాచేసి శ్రమశక్తి(రిక్షా)కి విలువ ఇచ్చారు కదా అని అంతా సరి పెట్టుకున్నారు..
కొద్ది కాలం క్రితం ఇంధన ధరలు, నిత్యావసర ధరలు పెరిగాయనే కారణంలో నిరసనగా చంద్రబాబు నాయుడు గారు, ఇతర ఎమ్మెల్యేలు సైకిల్ పై అసెంబ్లీకి వచ్చారు.. సంతోషమే. కానీ ఆయన రక్షణ కోసం ఏర్పాటు చేసిన సెక్యూరిటీ, ట్రాఫిక్ జామ్ ప్రజలను తీవ్రంగా ఇబ్బందిని పెట్టింది..
తాజాగా అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు మెట్రోరైలులో వెళ్లారట.. ఇందుకు అనవసరర సెక్యూరిటీ హంగామా, ఖర్చును తగ్గించడం లాంటి కారణాలు చూపారు.. ఇదీ సంతోషమే. కానీ జరిగింది ఏమిటి? కేజ్రీవాల్ మెట్రోలో ప్రయాణిస్తున్నాడనే సాకును చూపి పోలీసు భద్రతా సిబ్బంది సాధారణ ప్రయాణీకులను  స్టేషన్ బయటే అడ్డుకున్నారట.. పాపం సాధారణ ప్రజలు (ఆమ్ ఆద్మీలు) తమ దైనందిన పనులకు సకాలంలో వెళ్లలేక ఇబ్బంది పడ్డారు.
ఈ మూడు ఘటనలు మంచి  చెడుల విషయాన్ని పక్కన పెడితే ఒకటి మాత్ర పక్కన స్పష్టంగా చెప్పగలను.. నాయకులు పబ్లిసిటీ జిమ్మిక్కుల కోసం ఎంతకైనా దిగజారతారు.. ఇందులో కేజ్రీవాల్ రెండాకులు ఎక్కువే చదివాడు..

Saturday, December 28, 2013

కొందరు వ్యక్తుల అతి ప్రవర్తన, విశృంఖలత కారణంగా సనాతన ధర్మాన్ని పాటించేవారు ఇబ్బంది పడుతున్నారు.. మీడియా వారిని టార్గెట్ చేస్తూనే, పనిలో పనిగా మన ధర్మంపై కూడా దాడి చేస్తోంది.. ఇలాంటి వ్యక్తులను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది..
ఒక పనికి రాని, చెత్త సన్యాసితో శృంగార చేష్టల్లో పాల్గొన్నట్లుగా వీడియో టేపుల ద్వారా బయటపడి అభాసుపాలైన నటి ఇప్పడు కొత్త అవతారం ఎత్తింది.. సన్యాసం స్వీకరించినట్లు బిల్డప్..
కానీ ఆమె మేకప్, వస్త్ర ధారణ, మేకప్, చేతికి బంగారు నగ చూస్తుంటే సన్యాసిని అనిపించడం లేదు..
ఆమె పేరు కానీ, ఫోటో కానీ ప్రచురించడం నాకు ఇష్టంలేకే క్లుప్తంగా వదిలేస్తున్నాను..

Friday, December 27, 2013

ఈ తిండి ఆరోగ్యానికి మంచిదేనా?..

వెనకటికి ఓ అయ్యవారు ఉల్లి, వెల్లిపాయలు తామస గుణాన్ని కలిగిస్తాయి.. కాబట్టి  ఆహారంలో అవి నిషిద్దం.. అని రచ్చబండ దగ్గర గ్రామస్తులందరికీ సెలవిచ్చారు.. ఇంటికొచ్చి భోజనం చేస్తున్న ఆ అయ్యవారు రుచీ పచీ లేకుండా వండావేం.. అంటూ భార్య మీద కసురుకున్నాడు.. మీరే కదండి చెప్పారు ఉల్లి, వెల్లుల్లి వాడొద్దని.. అవి లేనిదే రుచి ఎలా వస్తుంది?అంటూ నిలదీసింది.. ఓసి పిచ్చి మొహమా.. నేను చిప్పింది జనాలకు అది మనకు వర్తించదు అంటూ తేల్చేశారు అయ్యవారు..
దీనికి కాస్త రివర్స్..  అయినా ఇలాంటిదే మరో కథను చూద్దామా?..
ఓ బహుళజాతి సంస్థ తమ ఉద్యోగుల సంక్షేమం కోరుకుంటూ తన అంతర్గత అంతర్జాలంలో ఓ లేఖ పెట్టింది.. ఫాస్ట్ ఫుడ్ మంచిది కాదు..  అందులో కాలొరీలు, కొవ్వు, చక్కెర, ఉప్పుడు శరీరానికి చేటు చేస్తాయి.. ఇవి ఎంత తక్కువ తింటే అం మంచిది..అంటూ సెలవిచ్చింది.. ఆహా ఆ సంస్థకు తమ ఉద్యోగుల మీద ఎంత ప్రేమ.. వారి ఆరోగ్యం కోసం ఎంత చక్కని సలహాలు ఇస్తోందని ప్రశంసించేస్తున్నారా?.. తొందర పడకుండా కాస్త ఆగండి..
ఇలాంటి చెత్త ఆహారాన్ని తయారు చేస్తున్న సంస్ధే, తమ ఉద్యోగులు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది.. తమ రెస్టారెంట్లో తయారయ్యే అడ్డమైన తిండి జనం మాత్రం సుష్టుగా తిని ఆరోగ్యాన్ని పోగొట్టుకోవాలి.. మనం మాత్రం మనం తయారు చేసే తిండి తినకుండా ఆరోగ్యాలు కాపాడుకోవాలి.. వాట్ ఎన్ ఐడియా సర్జీ..
మరి ఆ సంస్థ నిజంగా తమ ఉద్యోగుల క్షేమం కోరి అంతర్గత లేఖను రాసిందా? లేక ఉద్యోగులు అడ్డగోలుగా తినేస్తున్నారనే దుగ్దతో వారికి కంట్రోల్ చేద్దామనుకుందా.. ఏది ఎలా ఉన్నా మనం బాగుంటే చాలు.. జనం ఎట్టా చస్తే మనకెందుకు? వాడి పైసా మన జేబు నింపుతోందా.. అనేదే ముఖ్యం.. భలే బహుళ నీతి కదూ?..

ఇంతకీ ఆ సంస్థ పేరు చెప్పలేదు కదూ?.. అదే మెక్ డొనాల్డ్స్ ’.. ఈ లేఖ వివాదాస్పదం కావడంతో అంతర్జాలం మాయమైపోయింది..


Wednesday, December 25, 2013

మోడీ చాయ్..

బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ చిన్నప్పుడు చాయ్ అమ్మారు.. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు చాయ్ వాలా అని ఈసడించినప్పుడు, చాయ్ అమ్మేవాడు ప్రధాని కావద్దా అని మోడీతో సహా బీజేపీ నేతలు వాగ్భాణాలు సంధించారు.. మోడీ చాయ్ పేరుతో దేశంలోని పలు చోట్ల టీ కొట్లు తెరవడంతో పాటు ముంబయ్ నరేంద్ర మోడీ సభకు చాయ్ వాలాలను ప్రత్యేకంగా ఆహ్వానించారు.. దీంతో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడి చాయ్ అమ్మేవారు ప్రధాని కావడంలో తప్పు లేదని సన్నాయి నొక్కులు నొక్కింది..
హైదరాబాద్ లో ఇప్పడు ఒక టీ పొడి హల్ చల్ చేస్తోంది.. దాని పేరు 'మోడీ టీ'.. నేను టీ పొడి కోందామని వెళ్లితే కనిపించింది. ఇదేదో విచిత్రంగా ఉందని కొన్నాను.. ఈ టీ పొడికి మోడీ పేరు ఎందుకు పెట్టారని షాపువారిని అడిగాను.. తమకూ తెలియదన్నారు.. దీని లోగుట్టు తెలియకున్నా టీ రుచి మాత్రం అదిరిపోయింది..

మళ్లీ రావాలి అటల్జీ పాలన..

దేశ సేవ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దేశ భక్తుడు.. మహోన్నత జాతీయ వాది, ఉత్తమ పార్లమెంటేరియన్.. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో నాయకత్వ బాధ్యతలు చేపట్టారు.. సమర్థ నాయకత్వంతో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేశారు.. సంస్కరణలతో దేశాన్ని ఆర్థికంగా పటిష్టం చేశారు.. స్వర్ణ చతుర్భుజి లాంటి పథకాలతో దేశంలో మౌళిక సదుపాయాలను మెరుగుపరిచారు.. పార్టీలకు అతీతంగా అందరికీ ఆత్మీయుడు.. ఒక కవిగా, వక్తగా అందరినీ కట్టిపడేసిన మహా వ్యక్తి.. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయిజీ 89వ జన్మదినోత్సవం నేడు.. వారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. అటల్జీకి సంపూర్ణ ఆయురారోగ్యాలు చేకూరాలని, వారి మార్గదర్శకత్వంలో దేశానికి మళ్లీ సుపరిపాలన అందాలని కోరుకుందాం..

Tuesday, December 24, 2013

ఎందుకీ వివక్ష?..

మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి శత జయంతి, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు వర్ధంతి ఒకే రోజున వచ్చాయి.. దేశంలోని అత్యున్నత పదవులు అలంకరించిన ఈ ఇద్దరూ గతంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా సేవలు అందించిన వారే.. మరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లోనే ఉన్న పీవీ సమాధికి నివాళ్లు అర్పించడంలో వివక్ష చూపించి, అనంతపురంలో జరిగిన నీలం జయంతికి మాత్రమే ఎందుకు ప్రాధాన్యత ఇచ్చినట్లు? అది రాష్ట్రపతి ప్రణబ్ పాల్గొన్న కార్యక్రమమని సాకులు చూపడం అవసరమా.. నిజానికి హైదరాబాద్ లోనే బసచేసిన రాష్ట్రపతి, ప్రణబ్ మొదట పీవీకి నివాళులు అర్పించి, ఆ తర్వాత నీలం జయంతి కార్యక్రమానికి వెళితే ఎంత హుందాగా ఉండేది.. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటులో కీలకపాత్ర వహించిన ప్రథమ ముఖ్యమంత్రి సంజీవరెడ్డి గారిపై తెలంగాణ ప్రజలు గుర్రుగా ఉన్నా నేపథ్యంలో సమైక్యవాదాన్ని సమర్థిస్తున్న సీఎం కిరణ్ కు నరసింహారావుపై వివక్ష చూపించి తెలంగాణ వ్యతిరేకతను చాటుకోడానికి ఇంతకన్నా మంచి సందర్భం దొరకలేదా? లేక పీవీ వర్థంతి సందర్భంగా నివాళులు అర్పిస్తే ఢిల్లీ అమ్మోరు ఆగ్రహిస్తారని భయపడ్డారా?
భారత ప్రభుత్వం ఇస్తున్నపద్మ అవార్డులు అనర్హులకు ఇవ్వడం ద్వారా ఏనాడో విలువ కోల్పోయాయి. అవి ఎవరికి ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారో తెలియని పరిస్థితి.. వివిధ రంగాలల ద్వారా వారు చేస్తున్న సామాజిక సేవలకు గుర్తింపుగా ఇవ్వాల్సిన ఈ అవార్డులు, సమాజానికి ఏ మాత్రం పనికి రాని వారికి ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. వారు తమ వాణిజ్య అవసరాల కోసం అవార్డులను దుర్వినియోగం చేస్తున్నారు.. ఇలాంటి వ్యక్తులకు పద్మశ్రీ అవార్డులు ఇస్తే ఎలా భ్రష్టు పట్టిస్తారో చెప్పేందుకు హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పే ఉదాహరణ.. ఈ అంశంపై హైకోర్టులో పిటిషన్ వేసిన బీజేపీ అగ్రనేత ఇంద్రసేనారెడ్డి గారు నిజంగా అభినందనీయులు.. హైకోర్టు ఆదేశాల మేరకు మోహన్ బాబు, బ్రహ్మానందం అమ అవార్డులను తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేసి తమ హుందాతనాన్ని కాపాడుకుంటే బాగుంటుంది..

Monday, December 23, 2013

కాంగ్రెస్ కే హాత్.. ఆమ్ ఆద్మీకే సాత్..

కొత్త బిచ్చగాడు పొద్దెరగడని సామెత.. ఇప్పడు అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న పని అలాగే ఉంది..
ఢిల్లీ ప్రజలు చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ ఓటు వేశారు.. బీజేపీకి 31 స్థానాలు, ఆమ్ ఆద్మీకి 28 సీట్లు కట్టబెట్టారు.. కాంగ్రెస్ పార్టీకి కేవలం 8 సీట్లు మాత్రమే దక్కాయి.. తమకు స్పష్టమైన మెజారిటీ రాలేదనే కారణంతో చూపి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరించలేదు..
ఇక్కడ న్యాయంగా చూస్తే ప్రజలు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తిరస్కరించినందుకు ప్రజాభిప్రాయాన్ని గౌరవించి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కేజ్రీవాల్ చొరవ చూపి  మద్దతు ఇచ్చి సహకరించాలి.. కానీ ఆయన చేసిన పని ఏమిటో గమనించడండి.. ప్రజలు వద్దనుకున్న కాంగ్రెస్ మద్దతుతో ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్దం అయ్యాడు..
ఇందులో ఏ మాత్రమైనా నైతికత ఉందా ఆలోచించండి?.. తాము నిర్వహించిన అభిప్రాయ సేరకరణలో 75 శాతం ఎస్.ఎం.ఎస్.లు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని వచ్చాయంటున్నారు కేజ్రీవాల్.. ఈ ఎస్.ఎం.ఎస్.లలో పారదర్శకత ఏమైనా ఉందా? ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ కన్నా గొప్పదా ఎస్.ఎం.ఎస్.. ఇటీవలి ఎన్నికల ఫలితాలు బీజేపీకి ప్రథమ ప్రాధాన్యతను ఇచ్చాయి.. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలనే ఇంగితం ఉన్న వాడెవడైనా ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీకి అవకాశం ఇవ్వాలనే అంటాడు.. కానీ కేజ్రీవాల్ చేస్తున్న పని ఏమిటి?.. ఎందుకీ కక్కుర్తి?
కాంగ్రెస్ కే హాత్.. ఆమ్ ఆద్మీకే సాత్..
ఇది గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ  నినాదం.. అరవింద్ కేజ్రీవాల్ ఏ ఉద్దేశ్యంతో తన పార్టీకి ఆమ్ ఆద్మీ పేరు పెట్టుకొని కాంగ్రెస్ అవాక్కయ్యేలా చేశారు.. ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు.. కాంగ్రెస్ బేషరతుగా మద్దతు ఇచ్చిందని ఆయన చెబుతున్నారు.. కానీ బేషరతు మద్దతు కాదని షీలా దీక్షిత్ కుండ బద్దలు కొట్టారు..

కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారో, కాంగ్రెస్సే కేజ్రీవాల్ తో కుమ్మక్కయిందో దేవుడెరుగు.. కానీ ఒకటి మాత్రం నిజం.. కాంగ్రెస్ పార్టీని మామూలు హస్తం కాదు.. అది భస్మాసుర హస్తం.. ఇప్పడు ఆ హస్తానికి కేజ్రీవాల్ చిక్కాడు.. కాంగ్రెస్ కే హాత్ మే ఆమ్ ఆద్మీ..

Thursday, December 19, 2013

లోక్ నాయక్.. లోక్ పాలక్

ఇద్దరూ ఇద్దరే.. నిన్న జయప్రకాశ్ నారాయణ్.. నేడు అన్నా హజారే..
ఇద్దరూ గాంధేయ వాదులే.. అవినీతిపై పోరాటంలో ఇద్దరూ జాతిని ఏకం చేశారు.. నాలుగు దశాబ్దాల క్రితం జయప్రకాశ్ నారాయణ్ చేసిన పోరాటానికి, ఇప్పడు అన్నా హజారే సాగించిన పోరాటానికి స్పష్టమైన పోలికలు ఉన్నాయి..
స్వాతంత్ర సమరయోధుడు, సోషలిస్టు నాయకుడైన జయప్రకాశ్ నారాయణ్ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పాలనలో పెరిగిపోయిన అవినీతికి వ్యతిరేకంగా సంపూర్ణ విప్లవానికి పిలుపునిచ్చాడు.. ప్రజల్లో వస్తున్న తిరుగుబాటుకు బయపడిన ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించి జేపీతో సహా ప్రతిపక్ష నాయకులందరినీ జైలుకు పంపింది.. జయప్రకాశ్ నారాయణ్ ప్రతిపక్షాలన్నింటినీ ఒక తాటిపైకి తెచ్చి జనతా పార్టీని స్థాపించారు. అలా జైలులో పుట్టిన కొత్త పార్టీ కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించి ఇందిరను ఇంటికి పంపింది.. దురదృష్టవశాత్తు నాయకుల మధ్య అనైక్యత వల్ల జనతా ప్రభుత్వం పడిపోయింది.. ప్రజలు జయప్రకాశ్ నారాయణ్ ను లోక్ నాయక్గా పిలుచుకున్నారు..
వర్తమాన కాలంలో మాజీ సైనిక ఉద్యోగి, సామాజిక కార్యకర్త అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా లోక్ పాల్ వ్యవస్థ కోసం మరో పోరాటం సాగించారు.. దేశ ప్రజలంతా అన్నా పోరాటానికి నైతిక మద్దతు ఇచ్చారు.. అనాటి జయప్రకాశ్ నారాయణ్ పోరాటాన్ని తలపించింది ఈ ఉద్యమం.. లోక్ పాల్ బిల్లు కోసం రెండు సార్లు నిరవధిక నిరాహార దీక్షకు పూనుకున్నారు హజారే.. పరిస్థితి చేజారక ముందే దిగి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా కోరుకున్నట్లే లోక్ పాల్ బిల్లును పార్లమెంట్లో ఆమోదింపజేసింది.. జయప్రకాశ్ నారాయణ్ అనుభవం కారణంగానే అన్నా హజారే రాజకీయ పార్టీ ఏర్పాటుకు అంగీకరించలేదు.. రాజకీయాలను ప్రక్షళన చేయాలి కానీ పార్టీ వ్యవస్థలోకి దిగొద్దని ఆయన ఉద్దేశ్యం..

జేపీకి, అన్నాకు చాలా విషయాల్లో దగ్గరి పోలికలు కనిపిస్తున్నాయి.. అందుకే జయప్రకాశ్ నారాయణ్ ను లోక్ నాయక్ గా గౌరవించినట్లే అన్నా హజారేను లోక్ పాలక్ పేరిట గుర్తిద్దాం..

నిజమే విలువలు పడిపోతున్నాయి..

సమాజంలో విలువలు మరీ దారుణంగా పడిపోయాయని బాధను వ్యక్తం చేశాడు నా గుత్తేదారు మిత్రుడు..
అసలు సంగతేమిటని అడిగా.. 
నిన్నటి దాకా రూ.5,000 తీసుకున్న గుమస్తా ఇప్పుడు రూ.10,000 అడిగాడని వాపోయాడు మా గు.మి.
ఇంతకూ ఇది ఏ పని తాలూకు అని అడిగాను..  
గుంతలు పడ్డ రోడ్డుపై ప్యాచ్ వేసే పని అని చెప్పాడు.. 
మరి గతంలో ఆ రోడ్డును అంత అధ్వానంగా వేసిన గాడిద ఎవడని ఆరా తీశాను (జర్నలిస్ట్ బుద్ది పోదుగా మరి)
ఆ రోడ్డు వేసింది కూడా తానే అని నసిగాడు..
కొస మెరుపు: ఈ గుత్తేదారు మిత్రుడు గుమాస్తాకు ఇచ్చిన నోట్లలో సగం నకిలీవి ఉన్నాయట. పై అధికారికి  వాటా ఎలా ఇచ్చేదని వాడు లబోదిబోమంటున్నాడు.. నిజమే సమాజంలో విలువలు మరీ దారుణంగా పడిపోయాయి..  

ఇది అన్నా విజయం

ఇది కచ్చితంగా అన్నా హజారే విజయమే.. ఒక సామాన్యుడు తలచుకుంటే ప్రభుత్వం మెడలు వంచడం సాధ్యమేనని నిరూపించారు అన్నా.. హింసకు తావు లేకుండా శాంతియుత ఉద్యమం ద్వారా తాను అనుకున్నది సాధించారు అన్నా హజారే.. కోట్లాది మంది భారతీయులను ఏకతాటికి తెచ్చి ప్రభుత్వానికి విధిలేని పరిస్థితి కల్పించడం ద్వారా లోక్ పాల్ ను తేగలిగారు.. లోక్ పాల్ బిల్లును పార్లమెంట్ ఆమోదించడంతో ఇక రాష్ట్రపతి ముద్రతో చట్టంగా మారడమే తరువాయి.. అవినీతి రహిత భారత దేశం రూపొందే దిశగా ఇదో ముందడుగు మాత్రమే..
చట్టాలు ఎన్ని ఉన్నా అమలు చేయడంలో అలసత్వం చూపితే అవి వృధాకాక తప్పదు.. లోక్ పాల్ కూడా అంతే.. ప్రస్తుతానికి ఈ చట్టం కోరలు పదునుగా లేకున్నా మున్ముందు మరింత సమర్ధవంతంగా తయారు చేసుకునే వెసులుబాటు ఉంది..
లోక్ పాల్ కోసం పోరాటం సాధించిన అన్నా హజారే ఇక ఇతర సమస్యలపై కూడా పోరాలడాలని చాలా మంది కోరుతున్నారు.. కానీ అన్నా మాత్రమే ఎందుకు పోరాడాలి?.. ఆయనను స్పూర్తిగి తీసుకొని మనమూ పోరాడొచ్చుకదా?

రక్షణ రంగంలో దేశానికి సేవ చేసిన ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ గారిని మనం రాష్ట్రపతిని చేసి గౌరవించాం.. ఇప్పడు అన్నా హజారేను కూడా రాష్ట్రపతి చేయాల్సిన అవసరం ఉంది.. ఇది ఆయనకు మాత్రమే కాదు, దేశ ప్రజలందరికీ దక్కే గౌరవం కూడా..

Wednesday, December 18, 2013

అమెరికా పట్ల మన దౌత్య విధానం మారాలి..

కొన్నేళ్ల క్రితం అమెరికా వెళ్లిన మన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంను అక్కడి విమానాశ్రయంలోని ఇమిగ్రేషన్ సిబ్బంది షూ విప్పించి తనఖీలు చేశారు.. అలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన పట్ల భారత్లో నిరసనలు వ్యక్తమయ్యాయి.. ఇంకా నయం నన్నయితే బట్టలు విప్పించి మరీ తనిఖీ చేశారని బయట పెట్టుకున్నారు మాజీ రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్.. జరిగిన సంఘటనలకు అమెరికా ప్రభుత్వం చింతిస్తున్నట్లు ప్రకటించి చేతులు దులుపుకుంది.. ఆనాడే మన కఠినంగా వ్యవహరిస్తే దేవయానీ రూపంలో తాజా అవమానం జరిగేదా?
అమెరికాలోని భారత దౌత్య కార్యాలయంలో డిప్యూటీ కాన్సుల్ జనరల్ హోదాలో పని చేస్తున్న దేవయానీ ఖోబ్రాగాడేను అక్కడి పోలీసులు అరెస్టు చేసిన తీరు ఆశ్చరాన్ని కలిగిస్తోంది.. ఆమె తన ఇంట్లొ పని చేసేందుకు భారత్ నుండి తీసుకొచ్చిన ఆయాకు కనీస వేతనం ఇవ్వడం లేదనే కారణంగా అరెస్టు చేశారట.. అమెరికా కార్మిక చట్టాల ప్రకారం ఆమెకు నెలకు 4500 డాలర్లు (రూ.2.85 లక్షలు) వేతనంగా చెల్లించాలి.. కానీ దేవయాని కేవలం 573 డాలర్లు (రూ.35 వేలు) మాత్రమే ఇస్తోందట.. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంలే దేవయానికి భారత ప్రభుత్వం చెల్లిస్తున్న వేతనం రూ.4 లక్షలకు మించదు. అందులో పని మనిషికి రూ.2.85 లక్షలు చెల్లించాలట..
ఇంత పెద్ద నేరం చేసిందని దేవయానిని ఎంత అమానుషంగా హింసించారో తెలుసా?.. విచారణలో భాగంగా ఆమె దుస్తులు విప్పించి స్మగ్లర్లు, సెక్స్ వర్కర్ తో సమానంగా ట్రీట్ చేశారట. భారత్ తన సన్నిహిత దేశంగా చిలుక పలుకులు పలికే అమెరికా, అందుకు భిన్నంగా మన దౌత్య సిబ్బంది పట్ట ఎలా వ్యవహరించిదో చూశారు కదా.. చట్టం ముందు అందరూ సమానులంటారు నిజమే.. కానీ అది ఎవరి చట్టం అనేది కూడా పరిగణనలోకి తీసుకోవాలి.. అన్ని దేశాలపై తమ దేశ చట్టాలే రుద్దుతామనడం ఎంత వరకు సబబు.. ఏ దేశంలో అయినా దౌత్య సిబ్బందికి కొన్ని రక్షణలు ఉంటాయి.. ఈ మాత్రం విచక్షణ కూడా చూపకపోవడం దురహంకారమే అవుతుంది..
మీ ఇంటికి మేం వస్తే ఏమిస్తారు?.. మా ఇంటికి మీరు వస్తే ఏం తెస్తారు? అన్నట్లుగా ఉంటుంది అమెరికా నీతి.. తన దేశ ప్రయోజనాల ముందు ఇతర దేశాలు ఎంతటివైనా తలొగ్గాల్సిందే అన్నంత దురహంకారం వారిది.. భారత్ లో అమెరికా దౌత్య సిబ్బందికి మన దేశం ఎన్నో రాయితీలు, రక్షణలు కల్పిస్తోంది. ఆలస్యంగానైనా కళ్లు తెరచిన మన దేశం ఇక్కడి దౌత్యవేత్తల విషయంలో అదే స్థాయిలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది.. కానీ ఈ పని ఎప్పుడో చేయాల్సింది.. అమెరికా నుండి వచ్చే ప్రతి కుర్రనా అధికారులకు అధికార లాంఛనాలతో స్వాగతం పలికి, మర్యాదలు చేసే పద్దతి మానాలి..
మిత్రుత్వమైనా, శత్రుత్వమైనా సమ ఉజ్జీని ఎంచుకోవాలని మన పెద్దలు ఏనాడో చెప్పారు.. అమెరికా ఒకవైపు మన దేశంలో సన్నిహితంగా ఉన్నట్లు నటిస్తూ, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు అనే కబుర్లు చెబుతూ ఉంటుంది.. మరోవైపు ప్రపంచ ఉగ్రవాదులు తండాగా మారిన పాకిస్తాన్ కు అన్ని విధాల ధన, ఆయుధ సాయం చేస్తుంటుంది.. ఇదేం నీతి అని మన దేశం ఏనాడూ గట్టిగా ప్రశ్నించిన పాపాన పోలేదు.. అమెరికా మనతో ఎలా వ్యవహరిస్తోంది.. మనం వారితో ఎలా వ్యవహరిస్తున్నోమో గమనించారు కదా?  ఇకనైనా మన విదేశాంగ నీతిని సమీక్షించుకోవాలి..

Tuesday, December 17, 2013

అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ప్రవేశ పెట్టిన తీరు, జరిగిన పరిణామాలను చర్చించేవారు ఇద్దరు ప్రధాన నాయకుల బాధ్యతారహితమైన తీరును ఎందుకు ప్రశ్నించడం లేదు.. ఇంతటి ముఖ్యమైన బిల్లు సభ ముందుకు వస్తుంటే ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు సభలో లేకపోవడం ఏమిటి?
జ్వరం సాకుతో సీఎం కిరణ్ అసెంబ్లీకి డుమ్మా కొడితే, అసెంబ్లీ ప్రాంగణంలో ఉండీ ఉండనట్లు టీడీపీ అధినేత బాబు దోబూచులాడారు.. ఇరువురు నాయకులు కూడా తమ ఎమ్మెల్యేలపై పట్టు కోల్పోయారని, ప్రాంతీయ మనస్థత్వంతో వ్యవహరిస్తున్నారని చెప్పేందుకు ఇంతకన్నా ఉదాహరణ మరేం ఉంటుంది?

Sunday, December 15, 2013

ఈ పొత్తు తేనె పూసిన కత్తే..

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు.. ప్రజలను మాయ చేయడానికి ఎంత అందమైన ముసుగు ఇది..
అందిన ద్రాక్ష తీయన, అందని ద్రాక్ష పుల్లన.. తెలుగుదేశం పార్టీ విధానం ఇది.. 1985లో ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని నాదెండ్ల భాస్కర రావు కూల దోసినప్పడు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం పేరిట తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీల మధ్య పొత్తు కుదిరింది.. 90వ దశకం ఆరంభంలో రామ జన్మభూమి ఉద్యమ సమయంలో మతతత్వ పార్టీ పేరిట బీజేపీకి ఎన్టీఆర్ రాం రాం పలికారు.. ఆయన తర్వాత టీడీపీ పగ్గాలు చేపట్టిన చంద్రబాబు నాయుడు యునైటెడ్ ఫ్రంట్ ఛైర్మన్ గా మతతత్వాన్ని సాకుగా చూపి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకున్నారు.. 1998లో బీజేపీ రాష్ట్రంలో సొంతంగా 4 లోక్ సభ సీట్లు సాధించి, దాదాపు 50, 60 అసెంబ్లీ సీట్లలో ప్రథమ స్థానంలో, మరో 60 సీట్లలో నిర్ణయాత్మక శక్తిగా ఎదగడంతో చంద్రబాబు విధిలేక ఎన్డీఏకు మద్దతు ఇచ్చారు.. 1999లో బీజేపీతో పొత్తు కారణంగానే రాష్ట్రంలో టీడీపీ తిరిగి అధికారంలోకి రాగలిగింది..
2004లో కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో టీడీపీ ఓటమి పాలయ్యాక చంద్రబాబుకు బీజేపీలో మళ్లీ మతతత్వం కనిపించింది.. అంతే ఇక మైత్రికి చెల్లు చీటీ ఇచ్చేశారు..
కాలం ఎప్పడూ ఒకేలా ఉండదు.. దేశంలో మోడీ ప్రభంజనంతో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని తెలుస్తోంది.. రాష్ట్ర విభజన పరిణామాలతో బెంబేలెత్తిపోతున్న చంద్రబాబుకు మళ్లీ బీజేపీ కావాల్సి వచ్చింది.. ఇప్పడు మళ్లీ దోస్తీకి సయ్యంటున్నారు.. ఎన్డీఏ హయాంలో గుజరాత్ అల్లర్ల సమయంలో నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేసి భంగపడ్డ బాబు గారికి ఇప్పడు ఆయనే ఆశాకిరణంలా కనిపించడం గమనార్హం..
బీజేపీతో పొత్తు వల్ల టీడీపీకి రాజకీయంగా లాభం ఉండొచ్చు.. కానీ రాష్ట్ర బీజేపీకి ఇది కోలుకోలేని దెబ్బ.. దశాబ్దన్నర క్రితం రాష్ట్రంలో తమ మిత్రుడి కోసం స్వయం త్యాగం చేసుకొని మోసపోయిన బీజేపీ మళ్లీ అదే ఉచ్చులో పడుతోంది.. ఈ పొత్తు కొందరు నేతలకు లాభ దాయకంగా ఉండొచ్చు.. కానీ పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్న కింది స్థాయి కేడర్ కు మరోసారి అన్యాయం జరుగుతోంది.. గతంలో టీడీపీతో పొత్తు కారణంగా రాష్ట్రంలో పునాదులు కోల్పోయిన బీజేపీ, మళ్లీ సెల్ఫ్ గోల్ కు సిద్దపడుతోంది..

ఒకవైపు చంద్రబాబు, మరోవైపు జగన్ బీజేపీ వైపు ఆశగా చూస్తున్నారంటే అది మోడీ మహిమే.. ఇరువురికి దూరంగా ఉండి రాష్ట్రంలో తన సత్తా చాటు కునేందుకు బీజేపీకి ఇది మంచి అవకాశం.. మరోసారి ఏకపక్ష పొత్తులతో త్యాగాలకు సిద్దపడితే చరిత్ర క్షమించదు.. పార్టీ కార్యకర్తలు అంతకన్నా క్షమించరు.. 

చాయ్ కబుర్లు

గరం గరం చాయ్.. ఇది లేనిదే నాకు రోజు గడవదు.. నాకే కాదు భారతీయులందరి పరిస్థితి ఇంతే..బ్రిటిష్ వాడు పోతూ పోతూ మనకు అంటించిన వ్యసనం అంటారు.. వ్యసనం అనే కంటే బహుమతి అనడం సబబేమో..
శరీరానికి ఉత్తేజాన్ని కలిగించే తేనీటిని పెద్దలు మొదట్లో అనుమానంగానే చూశారు.. నిజానికి ఇందులో కెఫేన్ ఉన్నా ఇది అంతగా అనారోగ్యాన్ని కలిగించేంది కాదు పైగా టీ లోని బి విటమిన్, రొబోప్లేవిన్, నియాన్ తదితర పదార్ధాలు శరీరానికి మేలు చేసేవే.. ముఖ్యంగా క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నట్లు గుర్తించారు.. అయితే అతి ఏ విషయంలో అయినా పనికి రాదు.. ఇది టీకీ వర్తిస్తుంది.. చాయ్ అదే పనిగా తాగితే మన శరీరం ఇతర ఆహార పదార్ధాలను స్వీకరించడం కష్టమవుతుంది.. రోజుకు రెండు లేదా మూడు కప్పులకే టీని పరిమితం చేసుకోవండం ఉత్తమం..

మా హైదరాబాద్ వాళ్లకు చాయ్ అంటే పంచ ప్రాణాలతో సమానం.. ఇరానీ చాయ్ గురుంచి అందరూ గొప్పగా చెప్పుకుంటున్నా అందులో రుచి తప్ప సాధారణ టీతో పోలిస్తే పెద్దగా సుగుణాలు ఏవీ లేవని చెప్పక తప్పదు.. నిజామ్ పాలకుల సమయంలో కొందరు ఇరానీ వ్యాపారులు దక్కన్ కు చాయ్ పరిచయం చేయడం వల్ల ఇరానీ చాయ్ అనే బ్రాండ్ వ్యాప్తిలోకి వచ్చింది.. నిజానికి మనం తాగే చాయ్ ఇరాన్ లో ఎక్కడా తాగరు.. మనం మాత్రం ఆ పేరు చెప్పుకొని లొట్టలేసుకుంటూ జుర్రు కుంటాం..హైదరాబాద్ లో మీకు రుచికరమైన తేనీరు కావాలంటే కేఫ్ నీలోఫర్ (రెడ్ హిల్స్) సర్వి కేఫ్ (బంజారాహిల్స్ రోడ్ నెం1), ప్యారడైజ్ (సికింద్రాబాద్) వెళ్లాల్సిందే.. గత దశాబ్ద కాలంగా నగరానికి పరిచయం అయిన రోడ్ సైడ్ డబ్బా టీ సెంటర్లు సాంప్రదాయ చాయ్ కు గట్టి పోటీ ఇస్తునా అందులో రుచీ పచీ ఉండదు.. సాధారణంగా మనం తాగున్న టీ కన్నా సహజ సిద్దమైన గ్రీన్ టీతో ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.. ప్రయత్నించండి..ఇవాళ అంతర్జాతీయ తేనీటి దినోత్సవం (డిసెంబర్15).. అందుకే ఈ చాయ్ కీ బాత్.. ఈ దినాల సాంప్రదాయం నాకు నచ్చకున్నా ఓ తేనీటి వ్యసనపరుడిగా తప్పలేదు..

Friday, December 13, 2013

మంచి పుస్తకం కొనుక్కో..

చిరిగిన చొక్కా అయినా వేసుకో.. కానీ మంచి పుస్తకం కొనుక్కో అన్నారో మహనీయుడు.. ఆనాటి పరిస్థితుల్లో వారలా సందేశం ఇచ్చి ఉండొచ్చు.. కానీ మంచి చొక్కాతో పాటు మంచి పుస్తకం కూడా కొనుక్కో అని ఈనాటి సమాజ పరిస్థితిని బట్టి ఆ సందేశాన్ని మార్చాలనిపించింది..
సినిమాలు వచ్చినా, టీవీలు వచ్చినా, ఇంటర్నెట్ వచ్చినా, సోషల్ మీడియా విజృంభించినా పుస్తకం ఇంకా నిలబడే ఉంది.. అందులోనే దాని సత్తా కనిపిస్తుంది.. సమాజం ఎంతో పురోగమించినా, మార్పులు వచ్చినా ప్రజల పఠనాసక్తిని తగ్గించలేవు.. అయితే అభిరుచులు మారుతూ ఉండొచ్చు..
గతంలో ఉన్నంత తీరికి ఇప్పడు జనాలకు ఉండటం లేదు.. జీవితంలో వేగం పెరిగిపోయింది.. ఇక చదివే తీరిక ఎవరికి ఉంటుంది అని చాలా మంది చెబుతుంటారు.. ఇది నిజమా? నాకైతే ఇది కచ్చితంగా అబద్దమే అనిపించింది.. హైదరాబాద్ లో ఇప్పడు జరుగుతున్న పుస్తక మేళాను  చూస్తుంటే..
డిసెంబర్ వచ్చిందంటే హైదరాబాద్ లో పుస్తక ప్రియులకు, సాహిత్య అభిమానులకు పండగే.. కాస్త అటు ఇటుగా ఏటా ఈ మాసంలో పుస్తక మేళా జరగడం ఆనవాయితీగా వస్తోంది.. గత పాతికేళ్లుగా నేను క్రమం తప్పకుండా బుక్ ఫెయిర్ సందర్శిస్తున్నాను.. అయితే ఈసారి పుస్తక మేళా కాస్త ప్రత్యేకంగా కనిపించింది.. డిసెంబర్ 7వ తేదీన ప్రారంభమై 14 వరకూ నిర్వహిస్తున్న ఈ మేళాలో అత్యధికంగా 370కి పైగా స్టాల్స్ ఈసారి కనిపించాయి.. వివిధ కేటగిరీల పుస్తకాలు, సాహితీ సదస్సులకు తోడు గతానికి భిన్నంగా అందరికీ ఉచిత ప్రవేశం కలిపించారు..

అయితే పుస్తక మేళాలో స్టాల్స్ పెట్టిన వారు కాస్త అసంతృప్తిగా ఉన్నారు.. అదేమిటని విచారిస్తే గత ఏడాది వరకూ పుస్తక మేళాను నెక్లెస్ రోడ్డుపై నిర్వహిస్తూ వచ్చారు.. సాయంకాల వేళలో అక్కడికి వచ్చే వారందరికీ ఈ ఫెయిర్ సందర్శన సౌలభ్యంగా కనిపించేది.. ఈసారి మాత్రం ఇందిరాపార్క్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో పుస్తక మేళా ఏర్పాటు చేశారు.. పైగా ఈ రూటులో బస్సులు తిరిగేది చాలా తక్కువ.. ఫలితంగా సందర్శకుల తాకిడి తక్కువగా ఉందట.. అయితే నాలాంటి పుస్తక ప్రియులు మాత్రం ఇలాంటొ మేళాలు అండమాన్లో పెట్టినా ఆఫ్రికాలో పెట్టిన వెళ్లడానికి సిద్దంగా ఉంటారంటే అతిశయోక్తి లేదు..

 

Thursday, December 12, 2013

ఇతర అంశాలపై కూడా దృష్టి పెట్టండి..

స్వలింగ సంపర్కులకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మద్దతు పలికారు.. స్వలింగ సంపర్కరం వ్యక్తిగత స్వాతంత్ర్యం అని ప్రకటించారు.. మరోవైపు స్వలింగ సంపర్కం నేరమన్న సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు.. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.. ఈ విషయంలో పార్లమెంట్ చర్చిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు సోనియా గాంధీ.. మరోవైపు కేంద్ర మంత్రులు కపిల్ సిబల్, చిదంబరం కూడా ఈ తీర్పును తప్పు పట్టారు.. సుప్రీం కోర్టు స్వలింగ సంపర్కంపై ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్, క్యూరేటివ్ పిటిషన్ కానీ వేసే ఉద్దేశ్యంలో ఉందట..

ఈ అంశంపై నా స్పందన No Comment అని మాత్రం చెప్పగలను.. కానీ ఈ మహానుభావులకు దేశం ఎదుర్కొంటున్న ఇతర అంశాలపై కూడా ఈ మాత్రం శ్రద్ధ ఉండాలని కోరుకుంటున్నాను..
నెల్సన్ మండేలా 'జాతి విపక్షత'కు వ్యతిరేకంగా పోరాడారు - సిఎం 
మండేలా 'ఈ దశాబ్దపు మేటి యోధుడు' - విపక్ష నేత 
(ఈళ్ల తెలుగు తగలడ.. అందుకే ఏపీకి తెగులు సోకింది)

Tuesday, December 10, 2013

కేజ్రీ.. సో క్రేజీ..

కాంగ్రెస్ కే హాత్ ఆమ్ ఆద్మీకే సాత్.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉపయోగించిన నినాదం ఇది.. విచిత్రంగా ఇదే నినాదం అరవింద్ కేజ్రీవాల్ తన పార్టీకి పేరుగా పెట్టుకున్నారు.. అంతే కాదు ఢిల్లీలో కాంగ్రెస్ ఓటు బ్యాంకునూ తన వైపు మలుపుకున్నాడు.. కొత్తొక వింత పాతొక రోత అంటారు.. కేజ్రీవాల్ విషయంలోనూ అదే జరిగింది..
ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తిరస్కరించారు.. ఈ క్రమంలో వారు రంగంలో ఉన్న బీజేపీ, ఆప్ లకు ఓటు వేశారు.. బీజేపీకి 31 సీట్లు వస్తే, ఆప్ కు 28 వచ్చాయి.. కాంగ్రెస్ పార్టీకి 8 మాత్రమే దక్కాయి.. కనీస మెజారిటీ అయిన 36 సీట్లు రానందున బేరసారాలు సాగించడం ఇష్టం లేక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ ఆసక్తి చూపించడం లేదు.. ఇలాంటి సందర్భంలో కేజ్రీవాల్ విజ్ఞత ప్రదర్శించాలి.. ప్రజలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటేసినందువల్ల బీజేపీ, ఆప్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు..
అయితే ఇక్కడ కేజ్రీవాల్ అతి తెలివి ప్రదర్శిస్తున్నాడు.. తాను ప్రతిపక్షంలో కూర్చుంటాడట.. కాంగ్రెస్ మద్దతు తీసుకొని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలట.. తాను మాత్రం ఆ పని చేయడట.. అంటే ప్రజలు తిరస్కరించిన పార్టీ మద్దతు బీజేపీ ఎలా తీసుకుంటుంది? పైగా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ప్రధాన ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీయే కదా?
ఇంతకీ కేజ్రీవాల్ ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ మద్దతు ఇవ్వడానికి, లేదా తానే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఎందుకు జంకుతున్నాడో తెలుసా? అధికారం చేపడితే ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే సత్తా లేనందు వల్లే.. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అలా ఉన్నాయి మరి..
తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలను 50 శాతం తగ్గిస్తారట.. 700 వందల లీటర్ల తాగునీరు ఉచితంగా ఇస్తారట.. ఈ డిసెంబర్ 29 లోపు జన్ లోక్ పాల్ అమలు చేస్తారట.. మహిళల రక్షణ కోసం ప్రత్యేక కమెండో  ఫోర్స్ ఏర్పాటు చేస్తారట.. మంచిదే ఈ వాగ్దానాలు అమలు చేస్తే సంతోషమే.. కానీ వీటిని అమలు చేసేందుకు ప్రభుత్వంలో భాగస్వాములు కావడమో లేదా తామే ప్రభుత్వానికి సారధ్యం వహించే ప్రయత్నం చేయడమో ఎందుకు చేయడం లేదు.. అక్కడే ఉంది అసలు లోగుట్టు
కొత్త పార్టీ పెట్టిన తొందరలో కేజ్రీవాల్ అడ్డగోలు వాగ్దానాలు చేయడంలో ప్రధాన రాజకీయ పార్టీల నేతలను మించిపోయాడు.. తీరా ప్రజలు నమ్మేసి గెలిపించే సరికి ఎక్కడ అమలు చేయాల్సి వస్తుందో అని భయపడుతున్నాడట.. అసలు అమలుకు సాధ్యమయ్యే వాగ్దానాలేనా ఇవి?

అరవింద్ కేజ్రీవాల్ విషయంలో అన్నా హజారేకు ఉన్న అభిప్రాయం ఏమిటో కొద్ది వారాల క్రితమే మీడియాలో చూశాం..

ఎవరికి దేవత ఈవిడ?..

ఇటీవల కొందరు కాంగ్రెస్ నాయకులు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు.. సోనియా గాంధీకి గుడి కట్టేస్తున్నారు.. ఆ మహా తల్లి వారికి దేవత అయితే తమ ఇంట్లోనే పూజించుకుంటే మంచిది.. ప్రజల నెత్తిన రుద్దడం ఎందుకు? ఇదీ ఒకరకమైన అన్యమత ప్రచారం లాంటిదే.. సోనియాజీ ఏం ఘన కార్యం చేశారని జనమంతా దేవతగా కొలవాలి.. మీకంటే పదవులు ఇచ్చి, తరతరాల ఆస్తులు సంపాదించుకునే అవకాశం ఇచ్చి ఉండొచ్చు కాబట్టే దేవతలా కనిపిస్తోంది.. దేశ వ్యాప్తంగా ఆమెపై వ్యతిరేకత పెరుగుతోంది.. ఇప్పటి తరమే ఆమెను నమ్మనప్పుడు భవిష్యత్ తరాలు ఆమెను ఎలా పూజిస్తారు?.. రేపొద్దున ఎవరైనా ఇలాంటి గుడుల విషయంలో అపచారాలకు పాల్పడితే ఎవరిది బాధ్యత? ఇలాంటి అర్థం లేని సెంటిమెంట్లతో జనాల చెవిలో పూలు పెట్టొద్దని మనవి.

Sunday, December 8, 2013

నాలుగు రాష్ట్రాల ఫలితాలు ఏం చెబుతున్నాయి?..

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏక పక్షంగా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా రావడం కాంగ్రెస్ పార్టీకి చెంప పెట్టని అందరూ విశ్లేషిస్తున్నారు.. అయితే ఎన్నికల ఫలితాలను లోతుగా అధ్యయనం చేస్తే ప్రజల్లో వచ్చిన చైతన్యానికి ప్రతీకగా చెప్పక తప్పదు.. ఫలితాలు నరేంద్ర మోడీ, బీజేపీ విజయంగా చెబుతున్నా దీన్ని మరో కోణంలో కూడాలి..
దేశ ప్రజలు స్వచ్ఛమైన పాలనను, సమర్ధ పనితీరును కోరుకుంటున్నారని ఫలితాలు చెప్పకనే చెబుతున్నాయి.. మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి కాకమునుపు నిజంగానే మధ్య యుగాల నాటి వాతావరణమే కనిపించేది.. బీమారీ రాష్ట్రాల్లో ఒకటిగా పేరొందిన ఈ రాష్ట్రంలో రోడ్లు, మౌళిక సదుపాయాలు, వ్యవసాయం, ఉపాధి అవకాశాలు దారుణంగా ఉండేవి.. చౌహాన్ ఈ పరిస్థితిని చాలా వరకూ మార్చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళుతున్నారు.. నీతి నిజాయితీలకు ఆయన మారుపేరుగా నిలిచారు.. అందుకే శివరాజ్ సింగ్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది..
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రం ఛత్తీస్ గఢ్ లో డాక్టర్ రమణ్ సింగ్ హ్యట్రిక్ సైతం ఆశామాషీది కాదు.. ప్రజల వద్దకు అభివృధి ఫలాలును తీసుకుపోవడంలో ఆయన సఫలమయ్యారు.. ముఖ్యంగా ప్రజా పంపిణీ వ్యవస్థను మెరుగు పరిచిన రమణ్ సింగ్ పేద ప్రజలకు చౌక బియ్యాన్ని సమర్ధ వంతంగా అందేలా చూశారు.. చావల్ బాబాగా పేరొందిన రమణ్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి ఛత్తీస్ గఢ్ లొ శాశ్వతంగా సమాధి కట్టారనడంలో అతిశయోక్తి లేదు..
రాజస్థాన్ ప్రజలు కాంగ్రెస్ పాలనపై తీవ్రంగా విసిగిపోయారు.. గెహ్లాట్ పరిపాలనలో అవినీతి పరాకాష్టకు చేరడంతో ప్రజలు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీకి భారీ మెజారిటీతో అధికారం అప్పగించారు.. వసుంధరా రాజేపై అపారమైన విశ్వాసం కనబరచిన రాజస్థాన్ ప్రజల ఆశలను వమ్ము చేయకుండా పాలించే బాధ్యత ఇప్పుడు బీజేపీపై పడింది..
రేప్ సిటీగా, అసమర్థ పాలనకు నమూనాగా మారిన దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఊహించని పరాభవం మూట గట్టారు.. అదే సమయంలో బీజేపీనీ హెచ్చరిస్తూ తీర్పు చెప్పారు.. సాంప్రదాయ పార్టీతో విసిడిపోయిన విద్యావంతులు, యువత అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీపై ఎంతో ఆసక్తిని కనబరచారు.. అందుకే ఆ పార్టీకి ద్వితీయ స్థానం దక్కింది.. అదే సమయంలో బీజేపీ అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించినా, స్పష్టమైన మెజారిటీ మాత్రం రాలేదు.. బీజేపీ నిజాయితీ పరుడైన హర్షవర్ధన్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం వల్లే ప్రజలు ఆ పార్టీకి ఎక్కువ సీట్లు అందించారు.. ఈ పని ఇంకా ముందు చేసి ఉంటే బీజేపీకి మరిన్ని సీట్లు వచ్చేవి..
దేశ ప్రజలు మార్పు కోరుతున్నది యదార్థమే అయినా అవినీతికి తావులేని స్వచ్ఛమైన పాలన కావాలని వాంచిస్తున్నారని చెప్పేందుకు మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, ఢిల్లీ ఫలితాలే నిదర్శణం.. అదే సమయంలో ఈ ఫలితాలు బీజేపీకి కూడా ముందస్తు హెచ్చరిక లాంటివి..

Saturday, December 7, 2013

"తెలంగాణపై మా అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాను.. తెలంగాణకు మేం వ్యతిరేకం కాదు.. తెలంగాణ సెంటిమెంట్ ను మేం గౌరవిస్తున్నాం.. తెలంగాణకు మేం అడ్డూ కాదూ, నిలువూ కాదు.. అడ్డుకునే శక్తి మాకు లేదు.. తెలంగాణ ఏర్పాటుపై అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీయే నిర్ణయం తీసుకోవాలి.. నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ, మా భుజాలపై గన్ పెట్టే ప్రయత్నం చేయొద్దు.. తెలంగాణ ప్రజల కోరిక మేరకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయడం సమంజసమే.. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిందే.."
కొందరు పెద్దలు చాలా సందర్భాల్లో వల్లించిన ఆణి ముత్యాలు ఇవి.. వారు అప్పుడే మన్నారో, ఇప్పడే చేస్తున్నారో గమనించండి..

Friday, December 6, 2013

నల్ల సూరీడు నెల్సన్ మండేలా ఇక లేరు.. జులై 18 1918లో జన్మించిన మండేలా మహాత్మా గాంధీ స్పూర్తితో దక్షిణాఫ్రికాను శ్వేతజాతి పాలకుల నిరంకుశ పాలన నుండి విముక్తి చేయడానికి, నల్ల జాతి ప్రజల హక్కుల కోసం పోరాడారు.. ఫలితంగా 27 ఏడేళ్లు కారాగారవాసం అనుభవించారు.. 1993లో నోబుల్ శాంతి బహుమతి పొందారు.. 1994 నుండి 1999 దక్షిణాఫ్రికా అధ్యక్షునిగా పని చేశారు.. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న మండేలా అర్ధరాత్రి కన్ను మూశారు.. భారత దేశంతో ఆయనకు అవినాభావ సంబంధం ఉంది.. శాంతి యుతంగా పోరాటం సాగించిన మండేలాకు మహాత్మా గాంధీ స్పూర్తి కావడం విశేషం.. మండేలాకు హృదయ పూర్వకంగా నివాళులర్పిద్దాం..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో మరో ముందడుగు పడింది.. మరిన్ని ముళ్ల దారులు ఉన్నాయి.. సంబరాలకు సమయం కాదిది.. తెలంగాణ ఏర్పాటు కొందరి ఆమోదంగా, మరి కొందరికి ఖేదంగా కనిపించడం సహజం.. అయితే ఇది ఎవరి విజయమూ కాదు, ఎవరి అపజయమూ కాదు.. రాష్ట్రం విడిపోయినా ఇరుగు పొరుగు వాళ్లమే.. ఇరువురికీ ఉమ్మడి అవసరాలు, రాకపోకలు ఉంటాయి.. ఇరు ప్రాంతాల ప్రజల మధ్య స్నేహ, సామరస్యాలు కొనసాగాలని కోరుకుందాం..

Thursday, December 5, 2013

హైదరాబాద్ బిర్యాని.. రాగి సంకటి..  
రెండూ చవులూరించే భిన్న వంటకాలు.. దేని రుచి దానిదే..
ఈ రెండింటినీ కలిపి తింటే.. 
వైవిధ్య రుచుల ప్రత్యేకత తెలుస్తుందా..

Tuesday, December 3, 2013

సీమ భవిత్వం ఏమిటి?

రాయలసీమ.. ఇక ఈ పదం మనం చరిత్ర పుటల్లోనే చూడాలేమో? ఘనత వహించిన కేంద్ర ప్రభుత్వం రాయలసీమను రెండుగా చీల్చేసి అటు తెలంగాణలో.. ఇటు సీమాంధ్రలో కలిపేయాలని నిర్ణయించింది.. నాడు బళ్లారి పోయింది.. ఇప్పడు రాయలసీమే లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది..
రాష్ట్రంలో తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ప్రధానంగా తెలుగే మాట్లాడుతున్నా యాస, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాల్లో తమదైన అస్థిత్వాన్ని కలిగి ఉన్నాయి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న క్రమంలో 1956 నాటి స్థితి ప్రకారం రాయలసీమ ప్రాంతం సీమాంధ్ర (నాడు ఆంధ్ర రాష్ట్రం)లో కొనసాగుతుందని భావించారు.. కానీ స్వార్థ రాజకీయుల కారణంగా రాయలసీమ రెండుగా చీలిపోయే ప్రమాదం ఏర్పడింది.. కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణ(రాయల తెలంగాణ అట)లో కలిపేస్తారట.. కడప, చిత్తూరు జిల్లాలను మాత్రం సీమాంధ్ర(ఆంధ్రప్రదేశ్)లోనే కొనసాగిస్తారట.. ఏమిటి ఈ దుర్మార్గం.. అసలు రాయలసీమ ప్రత్యేకత తెలుసా ఈ ఆలోచన చేసిన వారికి?.. అసలు ఏమిటి ఈ సీమ కథ.. క్లుప్తంగా పరిశీలిద్దాం..
చరిత్రను చూస్తే ఈ ప్రాంతం తూర్పు చాళుక్యుల కాలంలో హిరణ్యక రాష్ట్రంగా పిలిచేవారు.. చోళుల కాలంలో సీమకు ప్రత్యేక అస్థిత్వం ప్రారంభమైంది.. విజయనగర చక్రవర్తుల కాలంలో ఒక వెలుగు వెలిగింది ఈ ప్రాంతం.. శ్రీకృష్ణ దేవరాయల ముద్ర బలంగా పడింది. విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత కుతుబ్ షాహీ, అసఫ్ జాహీల పాలనలోకి వచ్చేసింది.. నిజాం నవాబులు బ్రిటిష్ వారితో సైన్య సహకార పద్దతిలో పన్నులు కట్టలేక ఈ ప్రాంతానికి ధారాదత్తం చేసేశారు.. అలా మద్రాసు ప్రావిన్స్(స్టేట్)లో భాగమైన సీమ జిల్లాలను సీడెడ్ అని పిలిచేవారు..
శ్రీకృష్ణ దేవరాయల పాలన ప్రభావం అధికంగా ఉన్న ఈ ప్రాంతానికి 1928లో చిలుకూరి నారాయణ రావు గారు రాయలసీమ అనే పేరును పెట్టారు.. మద్రాసు నుండి విడిపోయి తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడాలనే ఉద్యమం సాగుతున్న కాలంలో రాయలసీమ నాయకులు తాము మద్రాసుతోనే ఉంటామన్నారు.. ఆంధ్రా కాంగ్రెస్ నాయకులు వారిని నచ్చజెప్పి కొన్ని ప్యాకేజీల ద్వారా కొత్త రాష్ట్రంలో చేరేలా ఒప్పించారు.. అదే శ్రీభాగ్ ఒప్పందం.. ఫలితంగా 1953లో సీమలోని కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ర్పడింది..
ఆంధ్ర రాష్ట్ర ఏర్పడినప్పుడే పెద్ద ఘోరం జరిగిపోయింది.. రాయలసీమ అంటే అప్పట్లో బళ్లారి, అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు.. ఆనాటి నాయకులు అసమర్థ విధానాల కారణంగా తెలుగువారు అధికంగా ఉన్నప్పటికీ బళ్లారిని మైసూర్(ఇప్పడు కర్ణాటక) స్టేట్లో కలిసిపోయింది.. ఇది కోలుకోని దెబ్బగా మారింది.. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.. నీలం సంజీవరెడ్డి ప్రధమ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది మొదలు ఈ రాష్ట్రాన్ని అత్యధిక కాలం పాలించింది రాయలసీమ నేతలే..
రాయలసీమలో తిరుపతి, కాలహస్తి, శ్రీశైలం, మంత్రాలయం, అహోబిలం, లేపాక్షి తదితర లెక్కలేనన్ని పుణ్య క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి.. అపారమైన ఖనిజ సంపద ఉంది.. అయితే సాగునీటి సమస్య ఈ ప్రాంతానికి ప్రధాన సమస్యగా మారిపోయింది.. ఈ కారణం వల్లే అనంతపురం క్రమంగా మరో థార్ ఎడారిగా మారిపోతోంది.. వ్యవసాయ ఆధారిత రాయలసీమలో వర్షపాతం అతి తక్కువ.. సీమకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వాలు ఎన్నో పథకాలు తయారు చేశారు. బ్రిటిషు వారు నిర్మించిన కర్నూలు కడప కాలువ తోపాటు, శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ, తెలుగుగంగ, హంద్రీ-నీవా సుజల స్రవంతి, గాలేరు-నగరి.. ఇలా చెప్పుకోడానికి ఎన్ని ఉన్నా నీటి లభ్యత సక్రమంగా లేక అరకొరగా సాగుతున్నాయి..
తెలంగాణ ఉద్యమం నేపధ్యంలో రాష్ట్ర విభజన అనివార్యమైపోయింది.. ఈ సమయంలో రాయలసీమ అంశం మళ్లీ తెర మీదకు వచ్చింది.. కోస్తాంధ్ర జిల్లాలతో పాటు సీమలోనూ సమైక్యాంధ్ర ఉద్యమం బలంగా నడిచింది.. ఇదే క్రమంలో కొందరు సీమ నాయకులే కుట్రలకు తెర తీశారు.. రాయల తెలంగాణ అంటూ విచిత్రమైన వాదన మొదలు పెట్టారు.. వాస్తవానికి నలుగురైదుగురు నాయకులు తప్ప ఎవరికీ ఈ ఆలోచనే లేదు.. హైదరాబాద్, బెంగళూరులో ఆస్తులు  కూడబెట్టి వ్యాపారాలు చేసుకుంటున్న కొందరు సీమ నాయకులను కలిగిన దురాలోచన ఇది.. ఉన్న నాలుగు రాయలసీమ జిల్లాల్లో రెండు (అనంత, కర్నూలు) తెలంగాణలో కలిపితే మిగతా రెండు (కడప, చిత్తూరు) సీమాంధ్రలో ఉండాలట.. తమ వ్యక్తిగత ఎజెండా కోసం రాయలసీమ భవితవ్యాన్ని బలి పీటంపై పెట్టేశారు.. సీమ అస్థిత్వానికి మరణ శాసనం రాసేశారు..
రాయల తెలంగాణ కుట్రను ఎదుర్కొని, తమ నాయకులకు బుద్ది చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రాంత ప్రజలపైనే ఉంది..
రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలకు నాయకత్వం వహిస్తున్నది సీమ దొరలే.. వారి గడ్డను నిలువునా చీల్చే కుట్ర జరుగుతున్నా తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు ఈ బాబులు.. తమ ప్రాంత అస్థిత్వానికి ముప్పు వాటిల్లినా అవి మా జిల్లాలు కావులే అనుకుంటున్నారేమో.. మీ సమైక్య రాగాలు ఇక చాలు.. రాయలసీమ చీలికను అడ్డుకోండి.. 

Sunday, December 1, 2013

వీరు మనుషులేనా అసలు?..

వారు తీవ్రవాదులు కాదు.. ప్రతిపక్ష పార్టీ వారు అసలే కాదు.. ఉద్యమకారులు కానేకాదు..
బస్సు ప్రమాదంలో అయిన వారిని పోగొట్టుకున్నవారు..
నెల రోజులు గడిచినా ప్రభుత్వం పట్టించుకోలేదు..
రవాణా మంత్రి బొత్సకు మొర పెట్టుకుందామని వచ్చారు.. కానీ అక్కడ జరిగిందేమిటి?.. పోలీసులు విరుచుకు పడ్డారు.. అరెస్టు చేసి పోలీసు స్టేషన్ తీసుకెళ్లారు.. ఆ సమయంలో జరిగిందేమిటో గమనించండి..
బస్సు ప్రమాదంలో భర్తను కోల్పోయి రోదిస్తున్న మహిళ చేతిలోంచి పోలీసులు రెండేళ్ల బాలున్ని లాక్కున్నారు.. అంతే కాదు ఆమె ప్యాంటును లాగేశారు.. ఈ ఘనకార్యం చేసింది మహిళా కానిస్టేబుల్సే..
ఇంత జరిగితే మంత్రి సత్తిబాబు మీడియాను తీసుకొచ్చి రాజకీయం చేస్తారా? అంటూ బాధితులపై రంకెలేశారట..
మహబూబ్ నగర్ జిల్లా పాలెం దగ్గర జబ్బార్ ట్రావెల్స్ (దివాకర్ ట్రావెల్స్ వారి లీజు అట) కాలిపోయి 45 మంది సజీవ దహనం అయింది.. నెల రోజులైనా బాధితులకు న్యాయం చేయకుండా అటు జబ్బార్, దివాకర్ టావెల్స్ యాజమాన్యాలు, ఇటు ప్రభుత్వం నాటకాలాడుతున్నారు.. జబ్బార్, దివాకర్ ట్రావెల్స్ యజమానులను ఇంత వరకూ అరెస్టు చేసిన పాపాన పోలేదు ఈ సర్కారు.. పరిహారం వారే ఇవ్వాలి, థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్ అంటూ కథలు చెబుతోంది.. భర్తలు, బిడ్డలు, తండ్రులు అయిన వారిని పోగొట్టుకొని జీవనాధారం ఏవిటో తెలియని అయోమయంలో ఉన్న బాధితులపట్ల వ్యవహరించాల్సిన తీరు ఇదేనా?
ప్రజలు ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నది ఎందుకో తెలుసా?.. ప్రభుత్వం తమ కష్ట సుఖాలు చూసుకుంటుందనే నమ్మకంతో.. వారి గాలికి వదిలేసే పాలకులను ఏమనాలి?
అసలు వీరు మనుషులేనా అసలు?.. మనవత్వం అనేది ఉందా వీరి కసలు?.. ఛీ ఛీ..
ఈ రాయల్ ఏంది.. గీయల్ ఏంది?.. ఎవడిది ఈ పాగల్ ఐడియా?.. రాయలసీమ ఆస్థిత్వాన్ని, ఉనికిని దెబ్బతీసే దెబ్బ తీసే దిక్కుమాలిన పనులు చేసే ఆ'జాదూ'.. ముందు నీ రాష్ట్రం కాశ్మీర్ సమస్య పరిష్కరించుకో.

Saturday, November 30, 2013

'గొప్ప' కుటుంబంలో పుట్టక పోవడమే పాపమా?

 ఇంద్రకుమార్ గుజ్రాల్.. ఈయన ఎంత మందికి గుర్తున్నారు.. నేటి తరానికి ఈయన తెలియదంటే అందుకు వారిని తప్పుపట్టలేం.. ఎందు కంటే మన దేశంలో మన దేశంలో గాంధీ, నెహ్రూ కుటుంబంలో పుట్టిన వారే గొప్పవారు.. వారే ఈ దేశ పాలకులు.. చరిత్ర వారినే గుర్తిస్తుంది.. ఈ కుటుంబానికి ఛెందని వారు ఎంత గొప్పవారైనా చరిత్రకు పట్టదు..
సంకీర్ణ ప్రభుత్వాల హవా ప్రారంభమయ్యాక దేవగౌడ తర్వాత ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టించారు ఐకే గుజ్రాల్.. జీలం(ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది)లో పుట్టిన గుజ్రాల్ భారత స్వాతంత్ర్య సమర పోరాటంలో భాగంగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు.. ఇందిరా గాంధీ క్యాబినెట్లో సమాచార శాఖ మంత్రిగా పని చేశారు.. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరకు అనుకూలంగా ఏకపక్ష వార్తల విషయంలో సంజయ్ గాంధీతో విభేదించడంతో గుజ్రాల్ ను తప్పించి వీసీ శుక్లాను నియమించారు.. ఆ తర్వాత గుజ్రాల్ రష్యా రాయభారిగా వెళ్లారు.. వీపీ సింగ్, దేవెగౌడ సంకీర్ణ ప్రభుత్వాల్లో విదేశాంగ మంత్రిగా సేవలు అందించారు.. ఆ తర్వాత ప్రధానమంత్రి పదవి వరించింది..
ఇంతకీ గుజ్రాల్ గారిని ఎందుకు గుర్తు చేస్తున్నానంటారా? అసలు విషయానికి వద్దాం..
ఇంద్ర కుమార్ గుజ్రాల్ మరణించి నేటికి ఏడాది అవుతోంది.. ఢిల్లీలో ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి.. అయితే ఆయన సమాధిని మాత్రం దిక్కూ, లేకుండా అనామకంగా సిమెంట్ గచ్చుతో వదిలేశారు.. ఈ పరిస్థితికి నొచ్చుకున్న గుజ్రాల్ కుటుంబం, అరుణ్ జైట్లీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి లేఖ కూడా రాశారు.. తామే ఖర్చు భరించి సమాధిని అభివృద్ధి చేసుకుంటామని చెప్పారు.. కానీ సింగ్ గారి రాతి గుండె స్పందించలేదు.. మరోవైపు ఇందిగాంధీ సమాధి శక్తిస్థల్, రాజీవ్ గాంధీ సమాధి వీర్ భూమి బ్రహ్మాండంగా వెలిగిపోతున్నాయి.. ఎందుకంటే వారు ఎంతో గొప్ప కుటుంబంలో పుట్టినవారు కదా?..
ఇదంతా చదువుతుంటే మన పీవీ నరసింహారావు గారు గుర్తొస్తున్నారా? ఐదేళ్లు దేశానికి ప్రధానిగా పనిచేసి ఆర్థిక సంస్కరణలకు బాటలు వేసిన పీవీకి కనీసం ఢిల్లీలో అంత్యక్రియలు జరిపే అవకాశం కూడా ఇవ్వలేదు సోనియా గాంధీ.. ఆయన శవాన్ని ఏఐసీసీ కార్యాలయం లోపలికి కూడా అనుమతించకుండానే హైదరాబాద్ పంపేశారు.. ఇక్కడ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆయన శవం కూడా సరిగ్గా కాలకుండా జాగ్రత్తలు తీసుకొని సోనియా విధేయతను చాటుకుంది.. ఆయన సమాధి ప్రాంగణాన్ని అనామకంగా వదిలేశారు..
పీవీజీ, గుజ్రాల్జీ చేసిన పాపం ఏమిటి? వారు కూడా దేశానికి ప్రధానులుగా సేవలు చేశారు కదా?.. వారి సమాధులకు ఎందుకు ఈ దుర్గతి?