Sunday, December 15, 2013

ఈ పొత్తు తేనె పూసిన కత్తే..

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు.. ప్రజలను మాయ చేయడానికి ఎంత అందమైన ముసుగు ఇది..
అందిన ద్రాక్ష తీయన, అందని ద్రాక్ష పుల్లన.. తెలుగుదేశం పార్టీ విధానం ఇది.. 1985లో ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని నాదెండ్ల భాస్కర రావు కూల దోసినప్పడు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం పేరిట తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీల మధ్య పొత్తు కుదిరింది.. 90వ దశకం ఆరంభంలో రామ జన్మభూమి ఉద్యమ సమయంలో మతతత్వ పార్టీ పేరిట బీజేపీకి ఎన్టీఆర్ రాం రాం పలికారు.. ఆయన తర్వాత టీడీపీ పగ్గాలు చేపట్టిన చంద్రబాబు నాయుడు యునైటెడ్ ఫ్రంట్ ఛైర్మన్ గా మతతత్వాన్ని సాకుగా చూపి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకున్నారు.. 1998లో బీజేపీ రాష్ట్రంలో సొంతంగా 4 లోక్ సభ సీట్లు సాధించి, దాదాపు 50, 60 అసెంబ్లీ సీట్లలో ప్రథమ స్థానంలో, మరో 60 సీట్లలో నిర్ణయాత్మక శక్తిగా ఎదగడంతో చంద్రబాబు విధిలేక ఎన్డీఏకు మద్దతు ఇచ్చారు.. 1999లో బీజేపీతో పొత్తు కారణంగానే రాష్ట్రంలో టీడీపీ తిరిగి అధికారంలోకి రాగలిగింది..
2004లో కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో టీడీపీ ఓటమి పాలయ్యాక చంద్రబాబుకు బీజేపీలో మళ్లీ మతతత్వం కనిపించింది.. అంతే ఇక మైత్రికి చెల్లు చీటీ ఇచ్చేశారు..
కాలం ఎప్పడూ ఒకేలా ఉండదు.. దేశంలో మోడీ ప్రభంజనంతో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని తెలుస్తోంది.. రాష్ట్ర విభజన పరిణామాలతో బెంబేలెత్తిపోతున్న చంద్రబాబుకు మళ్లీ బీజేపీ కావాల్సి వచ్చింది.. ఇప్పడు మళ్లీ దోస్తీకి సయ్యంటున్నారు.. ఎన్డీఏ హయాంలో గుజరాత్ అల్లర్ల సమయంలో నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేసి భంగపడ్డ బాబు గారికి ఇప్పడు ఆయనే ఆశాకిరణంలా కనిపించడం గమనార్హం..
బీజేపీతో పొత్తు వల్ల టీడీపీకి రాజకీయంగా లాభం ఉండొచ్చు.. కానీ రాష్ట్ర బీజేపీకి ఇది కోలుకోలేని దెబ్బ.. దశాబ్దన్నర క్రితం రాష్ట్రంలో తమ మిత్రుడి కోసం స్వయం త్యాగం చేసుకొని మోసపోయిన బీజేపీ మళ్లీ అదే ఉచ్చులో పడుతోంది.. ఈ పొత్తు కొందరు నేతలకు లాభ దాయకంగా ఉండొచ్చు.. కానీ పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్న కింది స్థాయి కేడర్ కు మరోసారి అన్యాయం జరుగుతోంది.. గతంలో టీడీపీతో పొత్తు కారణంగా రాష్ట్రంలో పునాదులు కోల్పోయిన బీజేపీ, మళ్లీ సెల్ఫ్ గోల్ కు సిద్దపడుతోంది..

ఒకవైపు చంద్రబాబు, మరోవైపు జగన్ బీజేపీ వైపు ఆశగా చూస్తున్నారంటే అది మోడీ మహిమే.. ఇరువురికి దూరంగా ఉండి రాష్ట్రంలో తన సత్తా చాటు కునేందుకు బీజేపీకి ఇది మంచి అవకాశం.. మరోసారి ఏకపక్ష పొత్తులతో త్యాగాలకు సిద్దపడితే చరిత్ర క్షమించదు.. పార్టీ కార్యకర్తలు అంతకన్నా క్షమించరు.. 

No comments:

Post a Comment