Friday, April 27, 2012

సచిన్ ఎంపిక తెలివైన ఎత్తుగడ..

రాష్ట్రపతి కోటాలో సచిన్ టెండూల్కర్ ను రాజ్యసభకు ఎంపిక చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ అతి తెలివిని ప్రదర్శించింది.. సచిన్నే రాజ్యసభకు ఎందుకు పంపాలి? సచిన్ గొప్ప ఆటగాడే కావచ్చు, శత శతకాలు కొట్టి ఉండొచ్చు కాదనను.. ఆయనకన్నా గొప్ప ఆటగాళ్లు లేరా?  ఆయనకన్నా సీనియర్ ఆటగాళ్లు కపిల్ దేవ్, గవాస్కర్ ఏం పాపం చేశారు.. ఆ మాటకొస్తే క్రికెటర్లను, సినిమా తారలను రాజ్యసభకు పంపాల్సిన అవసరం ఏమిటి? ఈ దేశంలో మేధావులు, కళాకారులు కరువయ్యారా? యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వకుండా, ఇంకా జట్టునే పట్టుకునే ఈ అత్యాశాపరుని వల్ల దేశానికి వచ్చే లాభం ఏమిటి? ఎవరొ గిఫ్ట్ ఇచ్చిన విదేశీ కారుకు పన్ను కట్టకుండా ఎగ్గొట్టేందుకు ప్రభుత్వాన్ని బతిమిలాడుకున్న ఈ అత్యాశాపరుని ద్వారా రాబోయే ఎన్నికల్లో లాభపడాలని కాంగ్రెస్ పార్టీ ఆరాటపడుతోంది.. సచిన్ దంపతులు రాజ్యసభ సభ్యత్వం ఇస్తున్నందుకు రాష్ట్రపతికి, ప్రధానికి ధన్యవాదాలు చెప్పేకన్నా సోనియా గాంధీ ఇంటికి వెళ్లడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి.. కుంభకోణాలు, అసమర్థ పాలనతో సతమతమౌతున్న ఆ పార్టీ ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ ఎత్తుగడ వేసిందనేది చెప్పక తప్పదు.. దేశ ప్రజలంగా ఈ అంశాన్ని గుర్తంచుకోవడం మంచిది..

Thursday, April 26, 2012

పిచ్చుకలు ఇంకా ఉన్నాయి..

ఒక పుస్తకంలో బొమ్మను చూసి, నాన్నా ఇదేమిటని అడిగాడు మా చిన్నోడు..
అది పిచ్చుక కన్నా అని చెప్పాను..
అదెక్కడుంటుందని అడిగాడు..
అంతటా ఉంటుంది.. మన ఇంటి వెంటిలెటర్లో, చెట్లపైనా, వీధి దీపాలపైనా.. ఎక్కడంటే అక్కడే అని చెప్పా..
మరి నాకు ఎప్పడూ కనిపించలేదేంటి నాన్నా? అని ఆశ్చర్యంగా అడిగాడు మా చిన్నోడు..
అవాక్కయ్యాను నేను.. కాంక్రీట్ జంగల్ నగరంలో నేను పిచ్చుకలను చూసి చాలా కాలమే అయ్యింది.. అదే సమయంలో ఒక్క పత్రికలో చదివాను.. సెల్ టవర్ల రేడియేషన్, కాలుష్య ప్రభావానికి పిచ్చుకలు అంతరించిపోతున్నాయని.. నగరంలో అస్సలు కనిపించడం లేదని..

పిచ్చుకలను ఇక చూడలేనేమో అనుకున్న దశలో చాలా రోజుల తర్వాత మా ఇంటి వెంటిలేటర్లో ఓ పిచ్చుక కనిపించింది (మీరు చూస్తున్నది ఈ పిచ్చుకనే)..
పిచ్చుకలు అంతరించలేదు, ఇంకా ఉన్నాయని సంతోషించా.. కానీ మా చిన్నోడికి ఆ పిచ్చుకను చూపించలేకపోయా.. ఆ సమయంలో వాడు స్కూలులో ఉన్నాడు మరి. అయితే ఏంటి? నా మొబైల్లో దాన్ని బందించేశా..
మరో విషయం.. ఓ రోజు కోపంతో మా పెద్దోడిని గాడిదా అని తిట్టా..
నాన్నా గాడిదంటే ఏమిటని వాడు నన్నడిగాడు..
అవును హైదరాబాద్ నగరంలో గాడిదను చూసి ఎన్నాలైంది.. నా చిన్నప్పుడు రోడ్డపై ఎక్కడంటే అక్కడ గాడిదలు కనిపించేవి.. ఇప్పడు ఆధునికత గాడిదల్ని మింగేసింది..