Thursday, October 31, 2013


ఉక్కు మనిషి, నవ భారత నిర్మాత సర్ధార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం నేడు.. ప్రథమ హోం మంత్రిగా భారత దేశంలోని సంస్థానాలన్నింటినీ విలీనం చేసిన ఘనత ఆయనది.. హైదరాబాద్ సంస్థాన ప్రజలు భారత దేశంలో స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారంటే అందుకు సర్ధార్ పటేల్ చేసిన కృషే కారణం.. ఆ మహనీయున్ని స్మరించుకుందాం..

Sunday, October 27, 2013

జాతీయ గీతం నేర్చుకోండి..

ఇటీవల హైదరాబాద్ లాల్ బహద్దూర్ స్టేడియంలో జరిగిన రెండు వేర్వేరు బహిరంగ సభల్లో జాతీయ గీతానికి అవమానం జరిగింది. కనీసం జాతీయ గీతం సక్రమంగా ఆలాపించడం కూడా రాకపోవడం బాధాకరం.. రాజకీయ, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, యువజన ఇతర ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు ముందు జాతీయ గీతం పాడటం, గౌరవించడం నేర్చుకోండి.. బహిరంగ ప్రదేశాల్లో జాతీయ గీతాన్ని గౌరవించడండి..

Saturday, October 26, 2013

ఎప్పుడు ఏ మాట్లాడతాడో తెలియదు.. అపరిపక్వత్వమే ఆయన విధానం..ఇలాంటి పప్పూజీ నేతాజీగా తగునా?..

Thursday, October 24, 2013

నిన్నెవరయ్యా చంపేది?..


పిరికివాడు అనుక్షణం చస్తాడు..

ధైర్యవంతుడు ఒకేసారి చస్తాడు.. పిరికివాడు అనుక్షణం చస్తాడు. రాహుల్ గాంధీ ఎంత బలహీన మనస్కుడో చూడండి.. ఆయన నానమ్మ, నాన్నల్లా తననూ చంపేస్తారట.. అదీ రాజకీయ ప్రత్యర్థి బీజేపీపై అనుమానం వ్యక్తం చేశాడు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలను ఎవరు హత్య చేశారో రాహుల్ కి తెలియదా?
ఖలిస్తాన్, ఎల్టీల్టీఈలను ప్రోత్పహించింది ఎవరు? వీరిద్దరు నాయకులే కదా? బింద్రన్ వాలే, ప్రభాకరన్ లను తయారు చేసింది ఎవరు?.. పాముకు పాలుపోసి పెంచితే చివరికి ఏమైంది..
ఇందిర హత్య తర్వాత ఢిల్లీలో 3000 మంది సిక్కులను ఊచకోత కోసిందెవరు? ప్రభాకరన్ కు మద్దతు ఇచ్చినందుకే కదా 1991లో రాజీవ్ హత్య తర్వాత తమిళనాట డీఎంకు సర్కారును డిస్మిస్ చేశారు?.. అదే డీఎంకేను యూపీఏలోకి తీసుకొని అంటకాగుతున్న పార్టీ కాంగ్రెస్ కాదా? రాజీవ్ హంతకులకు క్షమాభిక్ష పెట్టమన్న మహాతల్లి సోనియా కాదా?
వాస్తవ చరిత్ర ఇలా ఉంటే రాహుల్ గాంధీ ఎవరి మభ్య పెట్టడానికి కపట భయం ప్రదర్శిస్తూ, ఉద్వేగ ప్రసంగంతో దేశ ప్రజలను మభ్య పెడుతున్నారు.. రాహుల్ ఎంత ప్రయత్నించినా ఐసీయూలో ఉన్న యూపీఏ, కాంగ్రెస్ పార్టీలకు ప్రాణ ప్రతిష్ట చేయలేరు. 

Wednesday, October 23, 2013

అమూల్.. తెలంగాణ

అమూల్.. దేశంలో క్షీర విప్లవానికి నాంది పలికిన సంస్థ.. కురియన్ సృష్టించిన ఈ బ్రాండ్ ఎంతో విజయవంతం అవడమే కాకుండా దేశంలోని ఎన్నో డెయిరీలకు ఆదర్శంగా మారింది. అమూల్ దేశంలోనే అతి పెద్ద పాల ఉత్పత్తుల సంస్థగా ఆవిర్భవించడానికి ఆ సంస్థ చేపట్టిన వినూత్న ప్రకటనల ప్రచారం కూడా చాలా మేర ఉపయోగపడుతోంది.. అమూల్ బేబీ ప్రకటన ఎంత ఆకట్టుకుంటాయో, అన్ని వివాదాలు కూడా మూట కట్టుకుంటాయి.. రాజకీయాలు, క్రీడలు, సినిమాలు, కుంభకోణాలు, సామాజికాంశాలు, చివరకు వివాదాలను సైతం అమూల్ బేబీ వదలదు.. చివరకు తెలంగాణ అంశం కూడా అమూల్ బేబీ ప్రకటనల్లో ఒదిగిపోయింది.. తెలంగాణపై అమూల్ బేబీ ప్రకటనలు చూడండి.. అమూల్ ది టేస్ట్ ఆఫ్ ఇండియా అంటే ఇదేనేమో?




ఒక వైపు వానలు.. మరో వైపు మున్సిపల్ పారిశుధ్య  కార్మికుల సమ్మె..  వీధుల్లో ఎక్కడి చెత్త అక్కడే.. అంటు రోగాలతో జనం చస్తారేమో అన్న భయం.. 
గీ సర్కారుకు దమాఖ్ ఉందా అసలు?.. జనాన్ని సంపే బదులు ఆళ్ళ సమస్యలేవో పరిష్కరించి సావొచ్చుగా?.. 

సామాన్యుడు బతకొద్దా?..

పెట్రోలు ధర ఎన్నో రెట్లయింది.. కూరగాయల ధరలు భగ్గు మంటున్నాయి.. రైలు, బస్సు ప్రయాణాలూ భారమైపోయాయి.. చివరకు దిన పత్రికల ధరలూ ఆకాశంలోకి పోయాయి..
ధరలు అందనంత ఎత్తుకు పోతున్నా, జీతాలు మాత్రం పెరగవు.. పేదలు, మధ్య తరగతి ప్రజలు ఎలా జీవించాలి?.. ప్రభుత్వం ఉద్యోగులకు అన్నిరకాల 'బెనిఫిట్లు' ఉంటాయి. సమ్మెలు చేసినా ఎప్పుడో ఒకప్పుడు వేతనాలు చేతికొస్తాయి.. పీఆర్సీలు ఉండనే ఉన్నాయి.. మరి మా బోటి ప్రయివేటు జీవులు బతకడం ఎలా?
ఈ స్పృహ పాలకులకు ఉందా? అనే అనుమానం కలుగుతోంది.. ప్రభుత్వం ధరలు పెంచినప్పుడల్లా ప్రతిపక్షాలు రోడ్లపైకి వచ్చి రస్తారోకోలు చేసి దిష్టి బొమ్మలు కాల్చి చేతులు దులుపుకొని పోతాయి.. కానీ సమస్య మాత్రం ఎక్కడి గొంగలి అక్కడే అన్నట్లు ఉంటోంది.. ఈ సమస్యకు పరిష్కారం లేదా? సామాన్యుడు చస్తునా పట్టించుకోరా?

Wednesday, October 16, 2013

యత్ర నార్యంతు పూజ్యతే..

'యత్ర నార్యంతు పూజ్యతే, రమంతే తత్ర దేవత..' అంటే ఎక్కడ నారీ మణులు పూజింప బడుతారో అక్కడ దేవతులు కొలువై ఉంటారు.. మన పురాణాలు, ధర్మ శాస్త్రాలు చెప్పిన విషయమిది..
మతాలు ఏవైనా మహిళలను గౌరవించమని చెబుతాయి.. వారికి పవిత్ర స్థానాన్ని కల్పించాయి.. మహిళలను గౌరవించలేని వారు రాక్షసులతో సమానులు. కులాలు, మతాలు, ప్రాంతాలు, ఉద్యమాలు, పార్టీలకు అతీతంగా మనం స్త్రీలను గౌరవించాల్సిందే..
సోనియా గాంధీ పుట్టుకతో విదేశీయురాలే కావచ్చు, ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాష్ట్ర విభజనకు అంగీకరించి ఉండొచ్చు, రాజకీయంగా సోనియా గాంధీతో మనకు విబేధాలు ఉండొచ్చు.. అంత మాత్రాన అమెను అవమానించడం తగునా? తిరుపతిలో 'సోనియా ఘాట్' పేరిట బతికి ఉన్న వ్యక్తికి సమాధి కట్టడం నీఛత్వాని పరాకాష్ట.. ఏ ఉద్యమానికైనా ఇలాంటి పనులు కళంకమే అవుతాయి. మనం విబేధించే అంశాలపై నిరసన తెలిపేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి.. కానీ ఇంతగా దిగజారడం ఎంత మాత్రం సమంజసం కాదు.
కొద్ది రోజుల క్రితం ఒక కేంద్ర మహిళా మంత్రిని అవమానిస్తూ ఒక జిల్లాలో ఫ్లెక్సీ పెట్టారు. పత్రికలు, టీవీ ఛానెల్స్ ఎంతో సంయమనంతో ఆ వార్తను పక్కన పెట్టాయి.
దయచేసి మహిళలను అవమానించకండి.. రాజకీయాలు, పార్టీలకు, ప్రాంతాలకు, ఉద్యమాలకు, కుల మతాలకు అతీతంగా ఇలాంటి ఘటనలను ముక్త కంఠంతో ఖండిద్దాం.. నేను రాజకీయంగా సోనియా గాంధీకి వ్యతిరేకిని. కానీ ఒక మహిళను ఇలా అవమానించడం బాధను కలిగించింది.

Monday, October 14, 2013

ఒకప్పడు హంసలు ఉండేవని మన పురాణాలు చూస్తే కానీ తెలియదు.. మున్ముందు పాలపిట్ట పరిస్థితి అంతే అవుతుందేమో? విజయ దశమి నాడు పాలపిట్టను దర్శించుకోవడం మన ఆచారం.. కానీ గత కొన్నేళ్లుగా పాలపిట్టలు కనబడని పరిస్థితి ఏర్పడింది.. కొద్ది కాలానికి పిచ్చుకలకూ ఈ పరిస్థితి వస్తుందేమో? ఇప్పటికే నగరాల నుండి పిచ్చుకలు మాయమయ్యాయి.. మన రాష్ట్ర పక్షి పాలపిట్టను కాపాడుకుందాం..


Thursday, October 10, 2013

ఇద్దరూ ఇద్దరే..

వెండి తెరపై ఇద్దరూ ఇద్దరే.. విలక్షణ నటులు.. ఏ పాత్ర అయినా ఇట్లే ఇమిడిపోయేవారు.. ముఖ్యంగా ప్రతి నాయక పాత్రలను చాలా అద్భుతంగా పండించారు.  నేను సినిమాలు అంతంత మాత్రంగానే చూస్తాను. అయితే నేను అభిమానించే నటుల్లో రాంరెడ్డి, శ్రీహరి కూడా ఉన్నారు..  వీరిద్దరూ సినిమాల్లో స్పష్టమైన తెలంగాణ యాస, భాషల్లో మైమరిపించారు.. ఎంతగా అంటే వారిద్దరూ తెలంగాణ ప్రాంతీయులే అనుకున్నంత.. కానీ ఇద్దరి మూలాలు తెలంగాణ కాదు.. అయినా ఇక్కడి సంస్కృతిలో అంతగా కలిసిపోయారు.. దురదృష్టవశాత్తు విధి వీరిద్దరినీ అర్ధాయుష్కులను చేసింది.

ఏది న్యాయం?.. ఏది సమ న్యాయం?

ఒక సమస్యపై ఆందోళన చేస్తున్న వారికి తమ డిమాండ్ ఏమిటి అనే విషయంలో స్పష్టత ఉండాలి.. తెలంగాణ వాదులు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకుంటుంటే, సమైక్య వాదులు ఆంధ్రప్రదేశ్ విభజనను వ్యతిరేకిస్తున్నారు.. ఈ రెండు భిన్న మార్గాలైనా, ఆయా ఉద్యమకారులకు స్పష్టత ఉంది..
కానీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు మాత్రం తన దీక్ష విషయంలో స్పష్టత ఇవ్వలేకపోతున్నారు.. తెలంగాణకు వ్యతిరేకం కాదని చెబుతూనే సమ న్యాయం అంటున్నారు.. కానీ సమ న్యాయం ఎలా ఉండాలి అనే విషయంలో ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేకపోయారు.. దీన్ని ఎవరికి తోచినట్లు వారు అన్వయించుకుంటున్నారు..
తెలంగాణ టీడీపీ నాయకులు ప్రత్యేక రాష్ట్రానికి తమ నాయకుడు వ్యతిరేకం కాదని, కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన లేఖకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని చెబుతున్నారు.. కానీ సీమాంధ్ర టీడీపీ నాయకులు మాత్రం సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు.. మరోవైపు బాబును పరామర్శించిన కాంగ్రెస్ పీ రాయపాటి సాంబశివరావు మాత్రం బాబు సమైక్యాంధ్ర కోసం దీక్ష చేస్తున్నారని ప్రశంసించారు. మరి టీడీపీ తెలంగాణకు మద్దతుగా ఉందనుకోవాలా? సమైక్యాంధ్రవైపు మొగ్గు చూపుతుందనుకోవాలా?
కాంగ్రెస్ పార్టీ తన స్వార్థ ప్రయోజనాల కోసం తెలుగు జాతిని ముక్కలు చేస్తోందని, రెండు ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను పరిణనలోకి తీసుకోవాలని చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. ఇరు ప్రాంతాలకు సమన్యాయం కోసం తాను దీక్ష చేస్తున్నట్లు చెబుతున్నారు. మరి సమన్యాయం ఎలా ఉండాలి అనే విషయంలో మాత్రం ఒప్పటి వరకూ స్పష్టత ఇవ్వలేదు. కేంద్రమే సమస్యను పరిష్కరించాలని బాబు గారు చెబుతున్నారు. కానీ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నారు.
ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ లో దీక్ష చేస్తున్న చంద్రబాబు గారిని సీఎన్ఎన్ ఐబీఎన్ ఛానెల్ కు చెందిన సుప్రసిద్ధ పాత్రికేయుడు రాజ్ దీప్ సర్దేశాయి పావు గంటపాటు ఫోన్ ద్వారా ఇంటర్వూ చేశారు. ఆయన సూటిగా అడిగిన ప్రశ్నలు వేటికీ బాబుగారు జవాబు ఇవ్వలేకపోయారు. విసిగిపోయిన సర్దేశాయి చంద్రబాబు ఏమి కోరుకుంటున్నారనే విషయం తనకు స్పష్టం కాలేదని వాపోయారు.
చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో మూడున్నర దశాబ్దాలకు పైగా కొనసాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కు 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా, గత 9 ఏళ్లుగా ప్రతిపక్ష నేతగా, గతంలో యునైటెడ్ ఫ్రంట్ సారధిగా పని చేసిన ఘనత ఆయనది.. అసలు మలి దశ తెలంగాణ ఉద్యమం ఆరంభమైందే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. ఆంధ్ర ప్రదేశ్ వ్యవహారాలపై బాబు గారికి ఉన్నంత అవగాహన మరే నాయకునికి లేదని చెప్పక తప్పదు. కానీ అనుభవాన్ని ప్రస్తుత సంక్షోభ సమయంలో ఎందుకు ఉపయోగించడం లేదు?

చంద్రబాబు గారు తన డిమాండ్లు ఏమిటో నేరుగా కేంద్రం ముందు పెట్టి, వాటిని పరిష్కరించాలి అని అడగాలి.. కానీ ఏమీ చెప్పకుండా సమన్యాయం పేరుతో దీక్ష చేస్తే నీరసం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు.. 

Thursday, October 3, 2013

విజ్ఞతతో ఆలోచిద్దాం

తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో రెండో దశ పూర్తయింది.. ఇంకా కొన్ని దశలు మిగిలి ఉన్నాయి.. సంబరాలకు ఇది సమయం కాదు.. 
తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర స్వప్నం సాకారం అయ్యేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.. ఇలాంటి సమయంలో ఇటు తెలంగాణ వాదులు, అటు సమైక్యవాదులు.. ముఖ్యంగా ఇరు ప్రాంతాల ఫేస్ బుక్ మిత్రులు విజ్ఞతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది.. మన చర్చలు కేవలం సమాచార బదిలీ, విషయ పరిజ్ఞానం పెంచుకోవడానికే సాగాలి.. సద్విమర్శలు తప్పేంకాదు.. కానీ పరస్పరం నిందించుకోవడం, రెచ్చగొట్టడం తగదు..
విడిపోవాలనే భావన తలెత్తినప్పడు, బలవంతంగా కలిపి ఉంచడం కష్టం.. తాత్కాలికంగా వాయిదా వేయవచ్చేమో కానీ సమస్య తీవ్రమైతే ఇబ్బందులు పెరిగిపోతాయి.. ఇప్పటికే ఆలస్యం జరిగిపోయింది..అపోహలతో నిందించుకోవడం కన్నా స్నేహ పూర్వకంగా విడిపోవడమే మంచిది.. ఏ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైంది.. ఎవరి వల్ల ఎవరు అభివృద్ధి చెందారు.. కలిసి ఉంటే లాభాలేమిటి, విడిపోతే కష్టాలు ఏమిటి అనే చర్చలను కొనసాగించి ప్రయోజనం లేదు..
రాష్ట్ర విభజన వల్ల సమస్యలు ఏర్పడటం సహజం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును బలవంతంగా వాయిదా వేసినా, ఈ సమస్య ఎప్పటికీ రగులుతూనే ఉంటుందనేది వాస్తవం.. కాలచక్రాన్ని వెనక్కి తిప్పలేం.. రాష్ట్ర విభజన వల్ల తెలుగు వారి మధ్య సరస్పర సంబంధాలకు వచ్చిన ముప్పు కూడా ఏమీ లేదు.. తెలంగాణ వారు సీమాంధ్రకు వెళతారు.. సీమాంధ్రులు తెలంగాణకు వస్తారు.. ఇది దేశ విభజన సమస్య కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.. ఇరు ప్రాంతాల నాయకులు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూనే ఉంటారు.. తేలుకు కొండిలో విషం ఉంటుందనేది ఎంత నిజమో, వారి రెచ్చగొట్టే విధానాలూ అంతే సహజం.. ఈ విషయాన్ని గుర్తుంచుకొని ప్రజల మధ్య విధ్వేషాలు తలెత్తకుండా ఫేస్ బుక్ మిత్రులంతా ప్రయత్నించాల్సిన అవసరం ఉంది..
తెలంగాణ ఏర్పడితే సీమాంధ్ర ప్రజలకు భద్రత ఉండదనే ప్రచారం అవాస్తవం అని నిరూపించే బాధ్యత తెలంగాణ వాదులపై ఖచ్చితంగా ఉంటుంది.. తెలంగాణ వచ్చినంత మాత్రానా సీమాంధ్రులకు హైదరాబాద్లో ఉపాధి అవకాశాలకు వచ్చిన ముప్పేమీ లేదనే భరోసా కల్పించాలి.. అయితే హైదరాబాద్ విషయంలో వాస్తవ దృక్పథంతో ఆలోచించాల్సి అవసరం ఉంది.. సీమాంధ్రవాసులకు ఈ నగరం పట్ల ఉన్న అభిమానాన్ని కాదనలేం.. కానీ అదే సమయంలో ఈ నగరం తెలంగాణ నడిబొడ్డున ఉన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఉమ్మడి రాజధానిగా చాలా కాలం కొనగాస్తే సమస్యలు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది..

హైదరాబాద్ చుట్టూ ఉపాధి అవకాశాలు కేంద్రీకృతం కావడం వల్ల, రాష్ట్ర విభజన కారణంగా సీమాంధ్ర వాసుల్లో ఉన్న ఆందోళనను అర్థం చేసుకోవాలి.. సీమాంధ్రలో నూతన రాజధాని ఏర్పాటు జరిగితే వికేంద్రీకరణ కారణంగా ఉపాధి అవకాశాలు ఆ ప్రాంతంలోనే ఘన నీయంగా పెరిగే అవకాశం ఉంది.. కానీ ఈ వాస్తవాన్ని రాజకీయ నాయకులు కావాలనే దాస్తున్నారు.. హైదరాబాద్లో తాము ఆర్జించిన ఆస్తుల కారణంగానే రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నారు..ప్రజలను కూడా రెచ్చగొడుతున్నారు.. ఇది 100% నిజం.
రాష్ట్ర విభజన సమయంలో ఇరు ప్రాంతాల ఉద్యమకారులకు జడిసి మేధావులు స్పందించలేకపోతున్నారు అనేది మరో వాస్తవం.. ఇప్పటికైనా వారు ముందుకు వచ్చి ఇరు ప్రాంతాల పురోభివృద్ధికి తమ సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉంది..


Wednesday, October 2, 2013

భారత దేశ మహా పుత్రుడు మహాత్మా గాందీ 144వ జన్మదినోత్సవం నేడు.. సత్యం, అహింస, సహాయ నిరాకరణ, సత్యాగ్రహం, స్వదేశీ స్వావలంభన ఆనే ఆయుధాలతో స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నారు ఆయన.. జాత్యహంకారం, అంటరానితనం లాంటి సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడారు.. రామ రాజ్యం కోసం కలలు కన్నారు.. దేశ ప్రజల కష్టాలను చూసి జీవితాంతం చిన్న పంచె, నూలు కండువాకే పరిమితం అయ్యారు.. 20వ శతాబ్దంలో ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేసిన నాయకుల్లో మహాత్మ గాంధీయే అగ్రగామిగా ఉన్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి.. ఆయన జీవితమే ఒక సందేశం.. అందుకే మోహన్ దాస్ కరంచంద్ గాంధీ 'మహాత్మడు' అయ్యారు

షట్ డౌన్..

ఉదయం ఆఫీసుకు వెళ్లి కూర్చోగానే అమెరికా షట్ డౌన్ అని.. ప్రభుత్వ శాఖలను మూసేస్తూ వైట్ హౌస్ ఉత్తర్వులు జారీ చేసిందని అంతర్జాతీయ ఛానెల్స్ బ్రేకింగ్ ఇస్తున్నాయి.. ప్రభుత్వ కార్యాలయాలు నిలిచిపోయాయని 8లక్షల మంది ఉద్యోగులు సెలవుపై పోయారని వస్తున్న వార్తలు చూసి అందరూ ఆశ్చర్యపోయారు..
విడ్డూరం కాకపోతే.. ఉద్యోగులు లేక, కార్యాలయాలు పనిచేయక పోతే ప్రపంచాన్ని శాసించే అమెరికా ప్రభుత్వం ఎలా నడుస్తుంది అని కొందరు మిత్రుల సందేహం..
మా సందేహాలను తీరుస్తూ మరో మిత్రుడు ఇచ్చిన సమాధానం నవ్వులు కురిపించింది..
ప్రభుత్వోద్యోగులు, కార్యాలయాలు పని చేస్తేనే ప్రభుత్వం అనుకుంటే మరి మన దేశం, మన రాష్ట్రం ఎలా నడుస్తోందని ఎదురు ప్రశ్న వేశాడాయన..

నిజమే ఒక్కసారి ఆలోచించండి ఆంధ్రప్రదేశ్ లో ఎందరు ప్రభుత్వ ఉద్యోగులు విధులకు సక్రమంగా వస్తున్నారు? మారు మూల ప్రాంతాల్లో అయితే ఉద్యోగులు రాక ప్రభుత్వ కార్యాలయాలు తాళం వేసి కనిపిస్తాయి.. అంత వరకూ ఎందుకు? రాష్ట్ర సచివాలయంలో ఎందరు ఉద్యోగులు విధులకు సక్రమంగా హాజరు అవుతున్నారు? సచివాలయ క్యాంటీన్లను చూస్తే ఉద్యోగులంతా అక్కడే ఉన్నారా అనిపిస్తుంది.. కొందరు ఉద్యోగులు ఎప్పుడూ అక్కడే బాతాఖానీ కొడుతూ తచ్చాడుతూ కనిపిస్తారు.. వీళ్లు డ్యూటీ ఎప్పడు చేస్తారబ్బా అనిపిస్తూ ఉంటుంది..
ఇక తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల కారణంగా సచివాలయంలోని అన్ని శాఖల్లో కుర్చీలు ఖాళీగా కనిపిస్తున్నాయి.. మరి ఇప్పడు చెప్పండి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా షట్ డౌన్ అయ్యిందా? లేదా?