Thursday, October 3, 2013

విజ్ఞతతో ఆలోచిద్దాం

తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో రెండో దశ పూర్తయింది.. ఇంకా కొన్ని దశలు మిగిలి ఉన్నాయి.. సంబరాలకు ఇది సమయం కాదు.. 
తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర స్వప్నం సాకారం అయ్యేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.. ఇలాంటి సమయంలో ఇటు తెలంగాణ వాదులు, అటు సమైక్యవాదులు.. ముఖ్యంగా ఇరు ప్రాంతాల ఫేస్ బుక్ మిత్రులు విజ్ఞతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది.. మన చర్చలు కేవలం సమాచార బదిలీ, విషయ పరిజ్ఞానం పెంచుకోవడానికే సాగాలి.. సద్విమర్శలు తప్పేంకాదు.. కానీ పరస్పరం నిందించుకోవడం, రెచ్చగొట్టడం తగదు..
విడిపోవాలనే భావన తలెత్తినప్పడు, బలవంతంగా కలిపి ఉంచడం కష్టం.. తాత్కాలికంగా వాయిదా వేయవచ్చేమో కానీ సమస్య తీవ్రమైతే ఇబ్బందులు పెరిగిపోతాయి.. ఇప్పటికే ఆలస్యం జరిగిపోయింది..అపోహలతో నిందించుకోవడం కన్నా స్నేహ పూర్వకంగా విడిపోవడమే మంచిది.. ఏ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైంది.. ఎవరి వల్ల ఎవరు అభివృద్ధి చెందారు.. కలిసి ఉంటే లాభాలేమిటి, విడిపోతే కష్టాలు ఏమిటి అనే చర్చలను కొనసాగించి ప్రయోజనం లేదు..
రాష్ట్ర విభజన వల్ల సమస్యలు ఏర్పడటం సహజం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును బలవంతంగా వాయిదా వేసినా, ఈ సమస్య ఎప్పటికీ రగులుతూనే ఉంటుందనేది వాస్తవం.. కాలచక్రాన్ని వెనక్కి తిప్పలేం.. రాష్ట్ర విభజన వల్ల తెలుగు వారి మధ్య సరస్పర సంబంధాలకు వచ్చిన ముప్పు కూడా ఏమీ లేదు.. తెలంగాణ వారు సీమాంధ్రకు వెళతారు.. సీమాంధ్రులు తెలంగాణకు వస్తారు.. ఇది దేశ విభజన సమస్య కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.. ఇరు ప్రాంతాల నాయకులు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూనే ఉంటారు.. తేలుకు కొండిలో విషం ఉంటుందనేది ఎంత నిజమో, వారి రెచ్చగొట్టే విధానాలూ అంతే సహజం.. ఈ విషయాన్ని గుర్తుంచుకొని ప్రజల మధ్య విధ్వేషాలు తలెత్తకుండా ఫేస్ బుక్ మిత్రులంతా ప్రయత్నించాల్సిన అవసరం ఉంది..
తెలంగాణ ఏర్పడితే సీమాంధ్ర ప్రజలకు భద్రత ఉండదనే ప్రచారం అవాస్తవం అని నిరూపించే బాధ్యత తెలంగాణ వాదులపై ఖచ్చితంగా ఉంటుంది.. తెలంగాణ వచ్చినంత మాత్రానా సీమాంధ్రులకు హైదరాబాద్లో ఉపాధి అవకాశాలకు వచ్చిన ముప్పేమీ లేదనే భరోసా కల్పించాలి.. అయితే హైదరాబాద్ విషయంలో వాస్తవ దృక్పథంతో ఆలోచించాల్సి అవసరం ఉంది.. సీమాంధ్రవాసులకు ఈ నగరం పట్ల ఉన్న అభిమానాన్ని కాదనలేం.. కానీ అదే సమయంలో ఈ నగరం తెలంగాణ నడిబొడ్డున ఉన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఉమ్మడి రాజధానిగా చాలా కాలం కొనగాస్తే సమస్యలు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది..

హైదరాబాద్ చుట్టూ ఉపాధి అవకాశాలు కేంద్రీకృతం కావడం వల్ల, రాష్ట్ర విభజన కారణంగా సీమాంధ్ర వాసుల్లో ఉన్న ఆందోళనను అర్థం చేసుకోవాలి.. సీమాంధ్రలో నూతన రాజధాని ఏర్పాటు జరిగితే వికేంద్రీకరణ కారణంగా ఉపాధి అవకాశాలు ఆ ప్రాంతంలోనే ఘన నీయంగా పెరిగే అవకాశం ఉంది.. కానీ ఈ వాస్తవాన్ని రాజకీయ నాయకులు కావాలనే దాస్తున్నారు.. హైదరాబాద్లో తాము ఆర్జించిన ఆస్తుల కారణంగానే రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నారు..ప్రజలను కూడా రెచ్చగొడుతున్నారు.. ఇది 100% నిజం.
రాష్ట్ర విభజన సమయంలో ఇరు ప్రాంతాల ఉద్యమకారులకు జడిసి మేధావులు స్పందించలేకపోతున్నారు అనేది మరో వాస్తవం.. ఇప్పటికైనా వారు ముందుకు వచ్చి ఇరు ప్రాంతాల పురోభివృద్ధికి తమ సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉంది..


No comments:

Post a Comment