Tuesday, May 31, 2016

పొగాకు కాదిది.. పగాకు..

*మీ జీవితాన్ని బూడిద చేసుకోకండి..*   _-క్రాంతి దేవ్ మిత్ర_
మీకెవడైనా పగోడున్నాడా?.. వాన్ని మూడో కంటికి తెలియకుండా లేపేద్దామనుకుంటున్నారా?.. చాలా సులభం..  వాడితో తీయగా, స్నేహంగా మాట్లాడుతూ సిగరెట్ ఆఫర్ చేయండి.. అలవాటుగా మార్చేయండి.. ఇక వాడి చావుకూ, మీకూ ఎలాంటి బాధ్యత లేదు.. ఇది హస్యాస్పదంగా అనిపించవచ్చు.. కానీ నమ్మలేని వాస్తవం..
_సిగరెట్ సైలెంట్ కిల్లర్.. అది కాలుతూ మీ జీవితాన్ని బూడిద చేస్తుంది.. చివరకు పాడె మీదకు చేరుస్తుంది.._
సిగరెట్ తో పాటు ఇతర పొగాకు ఉత్పత్తులైన చుట్ట, బీడీ, జర్దా, గుట్కా, పాన్ మసాలా ఏదైనా ప్రమాదకరమైనవే.. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 60 లక్షల మందిని పొగాకు ఉత్పత్తులు పొట్టన పెట్టుకుంటున్నాయి.. భారత దేశంలో ఈ సంఖ్య 10 లక్షలు.. అంటే పొగాకు చంపేస్తున్న వారిలో ఆరో వంతు భారతీయులే.. మన దేశంలో ప్రమాదకరమై క్యాన్సర్ వ్యాధితో మరణిస్తున్న వారిలో నూటికి 66 శాతం పొగాకు ఉత్పత్తులను వాడే వారే.. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2020 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఏటా కోటి మంది పొగాకు కారణంగానే మరణిస్తారని అంఛనా..
పొగాకు ఉత్పత్తులు మొదట దెబ్బతీసేది మన నోటినే.. ఆ తర్వాత ఊపిరితిత్తులను, మెదడు, రక్తనాళాలు, జీర్ణకోశం, మూత్ర పిండాలను పనికి రాకుండా చేస్తాయి..
సిగరెట్, బీడీ, చుట్ట ఏదైనా.. అది పీల్చే వారితో పాటు, పక్కనుండే వారికీ ముప్పే.. సో మీరు ఆ అలవాటు ఇతరులకు నేర్పినా, వారి పక్కన ఉండే మీకు కూడా ముప్పే..
సిగరెట్టు పెట్టెపై పొగాకు వాడకం ప్రమాదకరమని ఎంత పెద్దగా రాసినా ఫలితం ఉండదు.. అసలు ప్రభుత్వాలు పొగాకు ఉత్పత్తులను నిషేధిస్తాయని ఆశించడమే అత్యాశ.. పొగాకు ఉత్పత్తుల అమ్మకాల వల్ల ప్రభుత్వానికి భారీ సుంకాలు వసూలవుతున్నాయి.. అలాగే ఎగుమతులు భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి..  ప్రభుత్వానికి బంగారు గుడ్లు పెట్టే కోళ్ల లాంటి పొగాకు ఉత్పత్తులను వదులు కోవడం కత్తిమీద సాములాంటిదే..
బహిరంగ ప్రదేశాల్లో పొగాకు వాడకాన్ని నిషేధించడంతో పాటు, అమ్మకాలను కూడా పూర్తిగా అరికట్టాల్సిందే..  పొగాకు రైతులకు, ఈ వ్యాపారంపై ఆధారపడే వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి.. ప్రయత్నం చేస్తే సాధ్యం కానిదంటూ ఉండదు.. ఇకప్పుడు ఐటీసీ కంపెనీకి పొగాకు వ్యాపారమే పెద్ద దిక్కు.. ఈ రోజు ఆ కంపెనీ ఇతర ఉత్పత్తులపై కూడా దృష్టి పెట్టి భారీగా విస్తరించింది.. అన్నింటకన్నా ముఖ్యం ప్రజల ఆరోగ్యానికి ముప్పు తెచ్చిపెట్టే పొగాకు ఉత్పత్తులను పూర్తిగా అరికట్టాలంటే ప్రజల్లో చైతన్యం రావాల్సిందే.. పొగాకు వల్ల కలిగే అనర్ధాలను తెలుసుకొని, వాటికి దూరంగా ఉండటంతో పాటు ఇతరులనూ అప్రమత్తం చేయాలి..

Thursday, May 26, 2016

మోదీజీ హమ్ తుమారే సాథ్ హై..

ఇదేం ప్రభుత్వమండీ.. ఒక్క కుంభకోణం లేదు.. అవినీతి ఆరోపణలు లేవు.. లాబీయిస్టులను పక్కన పెట్టారు.. ఆర్థిక రంగంలో దేశం దూసుకుపోతోంది.. చైనాను కూడా దాటి పోతున్నాం. అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయి.. మేకిన్ ఇండియా కొత్త పుంతలు తొక్కుతోంది.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగాయి.. ఉపాధి అవకాశాలు పెరిగాయి.. ముద్రయోజన, స్కిల్ ఇండియా, స్టాండప్ ఇండియా ఈ దిశలో భాగమే..
రెండేళ్ల పాలనలో జనానికి ఒరిగింది ఏమిటి?.. అచ్చే దిన్ ఏమైంది?.. ప్రజల జీవన స్థితిగతులు మారాయా?.. విదేశాల నుండి నల్ల ధనం వెనక్కి వచ్చిందా?.. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించారా?.. గుడ్డు మీద ఈకలు పీకే వారు ఇలాంటి ప్రశ్నలు చాలా వేస్తారు.. పండుగ చేసుకోవాలంటే ముందు ఇంట్లో దుమ్ము దులిపి చెత్తను ఊడ్చేయాలి.. గుమ్మానికి తోరణాలు కట్టి, ముగ్గులు వేసుకోవాలి.. ఈలోగా పిల్లలు ఆకలి అంటూ మారం చేయడం సహజం.. ఆ తర్వాత తీపి వంటకాలు ఆస్వాదించేది ఎవరు?.. ప్రస్తుతం దేశంలో పరిస్థితి ఇలాగే ఉంది..
ఇంతలోగా నిరాశ పడనక్కరలేదు.. జన్ ధన్ యోజన, సురక్ష బీమా, జీవన్ జ్యోతి పాలసీలు, ధనికుల వంటగ్యాస్ రాయితీ ఉపసంహరణ, ఇంకా సంక్షేమ కార్యక్రమాలు వారికి ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ది కలిగిస్తున్నాయి.. అన్నింటికన్నా ముఖ్యమైనది సమాజ నిర్మాణంలో ప్రజలందరినీ భాగస్వాములను చేసిన స్వచ్ఛ భారత్..
ప్రధాని విదేశీ పర్యటనలపై కూడా విమర్శలు ఉన్నాయి.. ఆయన ఇప్పటి వరకూ చేసిన నిష్ప్రయోజన పర్యటన ఏదైనా ఉంటే చూపగలరా?.. అంతర్జాతీయంగా మన దేశ ప్రతిష్ట పెరగలేదా?.. వివిధరకాల ఒప్పందాలతో దేశానికి ప్రయోజనాలు కలగడంలేదా?..
విమర్శించడం ప్రతిపక్ష లక్షణం.. కానీ అంది దేశాభివృద్ధిని, సంక్షేమాన్ని అడ్డుకునేదిగా ఉండరాదు.. గోటితో పోయే ప్రతీ అంశాన్ని పట్టుకొని భూతద్దంలో చూపి రాద్ధాంతం చేయడం వళ్ళ ఎవరికీ ప్రయోజనం ఉండదు.. ఇలాంటి వారిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. వీరంతా వేసుకోవాల్సిన ప్రశ్న ఇదే.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వమైనా ఇంత పారదర్శకంగా, ఇంతవేగంగా పని చేసిందా?
ప్రధానమంత్రిగా రెండేళ్ల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్న నరేంద్రమోడీకి అభినందనలు.. భారత దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రశక్తిగా తీర్చిదిద్దుతిన్న మీకు ప్రజల అండదండలు ఎల్లవేళలా ఉంటాయి..
లాగేరహో మోదీజీ.. హమ్ తుమారే సాథ్ హై..

Friday, May 20, 2016

దేశ రాజకీయం మారుతోంది..

ఇది జాతీయ రాజకీయాల్లో పెనుమార్పులకు సంకేతం.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అసోంలో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. మిగతా రాష్ట్రాల్లో సీట్లు రాకున్నా ఓట్ల శాతం ఘననీయంగా పెరిగింది..
కాంగ్రెస్ తన ప్రభావాన్ని దాదాపు కోల్పోయింది.. అసోం, కేరళలను పోగొట్టుకుంది.. ఇప్పుడు ఆ పార్టీ కర్ణాటకలో తప్ప కొన్ని చిన్న రాష్ట్రాలకే పరిమితం అయింది..  కేరళలో వామపక్షాలతో పోరు, బెంగాల్లో దోస్తీ ఇది కాంగ్రెస్ దుస్థితి.. తమిళనాడులో డీఎంకేతో పొత్తు ఫలితం లేకుండా పోయింది..
ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో బీజేపీ మరింత బలమైన శక్తిగా అవతరిస్తోంది.. మోదీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు రాజ్యసభలో అడుగడుగునా అడ్డుపడుతున్న కాంగ్రెస్ ఆటలు ఇక చెల్లవు.. రాజ్యసభలో బీజేపీ బలం పెరుగుతోంది.. ఇది ఆర్థిక సంస్కరణలకు ఊతం ఇస్తుంది.. ఇప్పుడు కాంగ్రెస్ శత్రువులయిన ఏఐఏడీఎంకే, టీఎంసీలు కేంద్ర ప్రభుత్వానికి అవసరమైనప్పుడు సహకరిస్తాయి.. మోదీ వ్యతిరేకతే ఎజెండాగా పని చేస్తున్న పార్టీలకు ఇది చెంపపెట్టు.. ఇవన్నీ దేశానికి దీర్ఘకాలంలో మేలు చేసే పరిణామాలు..

Monday, May 16, 2016

అసలు గాంధీ..

భార‌త స్వాతంత్ర్య స‌మ‌ర ఉద్య‌మంలో భాగంగా మ‌హాత్మా గాంధీ ఉప్పు స‌త్యాగ్ర‌హం చేప‌ట్టిన విష‌యాన్ని చ‌రిత్ర‌లో చ‌దువుకున్నాం.. ఉప్పు స‌త్యాగ్ర‌హం చేస్తున్న గాంధీజీ చేతిక‌ర్ర‌ను ఓ కుర్రాడు ప‌ట్టుకొని లాక్కుపోతున్న దృశ్యం చారిత్రిక ఛాయా చిత్రాల్లో ఒక‌టిగా నిలిచింది..
ఈ ఫోటోలో ఉన్న బాలుడు గాంధీజీకి స్వ‌యంగా మ‌న‌వ‌డు.. ఆయ‌న మూడో కుమారుడు రాందాస్ గాంధీ కొడుకు కానూ భాయి గాంధీ..
అమెరికాలో చ‌దువుకొని నాసాలో ప‌రిశోధ‌న‌లు చేసిన కానూభాయి గాంధీ దంప‌తుల‌కు సంతానం లేదు. విదేశాల్లో కాలం క‌లిసి రాక వృద్ధాప్యంలో స్వ‌దేశం వ‌చ్చారు.. కానీ ఇక్క‌డ వారిని ఆద‌రించేవారే క‌రువ‌య్యారు.. చేసేది లేక ఓ వృద్ధాశ్ర‌మంలొ కాలం వెల్ల‌దీస్తున్నారు కానూభాయి దంప‌తులు.. ఈ విష‌యం ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీకి తెలియ‌డంతో ఆయ‌న కేంద్ర‌మంత్రి మ‌హేష్ శ‌ర్మ‌ను కానూభాయి ద‌గ్గ‌ర‌కు పంపారు.. మోదీ ఫోనులో కానూభాయితో మాట్లాడ‌మే కాదు, ఆయ‌న‌కు అన్ని విధాలా సాయం చేస్తాన‌ని అభ‌య హ‌స్తం అందించారు..
చెట్టు పేరు చెప్పుకొని కాయ‌లు అమ్ముకున్న చందాన‌ మ‌హాత్మా గాంధీ పేరు చెప్పుకున్న న‌కిలీ గాంధీలు ఈ దేశాన్ని దశాబ్దాల పాటు పాలించి అందినంత దండుకొని స్కాముల్లో ఇరుక్కున్నారు.. కానీ అస‌లైన గాంధీ వార‌సులు మాత్రం కీర్తి గుర్తింపున‌కు నోచుకోకుండా పోయారు.. 
హే రామ్‌.. దేశ ప్ర‌జ‌లు ఇకనైనా అస‌లుకు, న‌కిలీకి తేడా గ్ర‌హించాల‌ని కోరుకుందాం.. 

Wednesday, May 11, 2016

సనాతన ధర్మ రక్షకుడు అది శంకరుడు..

'ఎవరు తప్పుకోవాలి?.. తప్పుకోమన్నది నన్నా?.. నాలోని ఆత్మనా?.. అన్నమయమైన ఇరువురి శరీరాల్లోని ఆత్మ ఒకటే కదా?.. ఒక ఆత్మ మరొక ఆత్మకు చెప్పు మాటలా ఇవి?..'
కాశీలో గంగానదిలో స్నానం చేసి శిష్యులతో కలిసి విశ్వనాథుని దర్శనానికి వెళుతున్న శంకరాచార్యులకు దారిలో కుక్కలతో వస్తున్న చండాలుడు ఎదురయ్యాడు.. శిష్యులు అతన్ని తప్పుకొమ్మన్నారు.. అప్పుడు చండాలుడు వేసిన ప్రశ్నలు ఇవి.. చండాలుని ప్రశ్నలతో శంకరునికికి జ్ఞానోదయమైంది.. తన ఎదుట ఉన్నది సాక్షాత్తు పరమ శివుడే అని, ఆ కుక్కలు నాలుగు వేదాలకు ప్రతీక తెలుసుకున్నాడు.. వెంటనే ప్రణమిల్లాడు..
కేరళలో జన్మించిన శంకరుడు చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించి సకల శాస్త్రాభ్యాసం చేశారు.. కాలి నడకన భారత దేశం నలుమూలలా పర్యటించి పీఠాలను నెలకొల్పారు..  ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీతకు భాష్యం రాశారు.. అద్వైతాన్ని బోధించి, బ్రహ్మం ఒక్కటే జ్ఞానమని చాటి చెప్పారు.. శాస్త్ర చర్చలో ఎందరో పండితులను ఓడించారు.. సనాతన ధర్మాన్ని చాటి చెప్పారు..
శంకర భగవత్పాదుల కృషి కారణంగా ఈనాడు హైందవ ధర్మం సగర్వంగా తలెత్తుకొని కాల పరీక్షలో నిలబడింది. కానీ మనలో అంటరానితనం, మూఢనమ్మకాలు ఇంకా కొనసాగుతున్నాయి.. శంకరుని ఆనాడే బోధ పడినా, మనకు ఈనాటికీ జ్ఞానోదయం కాలేదు.. వీటిని అంతమొందించడమే శంకరుడు బోధించిన నిజమైన బ్రహ్మ జ్ఞాన పరమార్థం.. (ఆది శంకరాచార్య జయంతి సందర్భంగా)

Monday, May 9, 2016

అక్షయ తృతీయ శుభాకాంక్షలు..

అక్షయ తృతీయ అంటే ఇదేదో బంగారం కొనాల్సిన పండుగ రోజు అనే భ్రమ జనాల్లో ఏర్పడింది.. కొద్ది సంవత్సరాల క్రితం వరకూ తెలుగు వారికి ఈ తిధి గురుంచి పెద్దగా తెలియదు.. బంగారం, ఆభరణాల వ్యాపారుల ప్రకటనల పుణ్యమా అని అక్షయ తృతీయ అంటే అందరికీ ఈ భావన ఏర్పడింది..
మన పురాణాల ప్రకారం వైశాఖ శుద్ధ తృతీయ నాడు కృతయుగం ప్రారంభమైంది. ఈ రోజునే అక్షయ తృతీయ పేర్కొన్నారు. శ్రీమహా విష్ణువు పరశురాముని అవతారం ఎత్తింది ఈ రోజునే.. నరసింహ స్వామి ప్రహ్లాదున్ని అనుగ్రహించింది కూడా అక్షయ తృతీయ నాడే..
అక్షయ తృతీయ నాడు ఏదైనా శుభకార్యం మొదలు పెడితే అది నిర్విఘ్నంగా సాగుతుందని పెద్దలు చెబుతారు.. ఇందులో బంగారం కొనుగోలు, కొత్త ఇల్లు కట్టడం, స్థలం కొనుగోలు, బావి తవ్వకం, నూతన విద్యాభ్యాసం, పుస్తకావిష్కరణ తడితరాలున్నాయి.. ఇవన్నీ వదిలేసి బంగారం కొనాలనే అంశమే ప్రాచుర్యం పొందింది.
బంగారం కొనే స్థోమత ఉంటేనే కొనండి.. ఇందుకోసం అప్పులు చేసి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.. అక్షయ తృతీయ రోజున భగవంతునికి భక్తి పూర్వకంగా దండం పెట్టుకుంటే అదే పదివేలు..

Sunday, May 8, 2016

ఈనాడు 90,s..

90వ దశాబ్దంలో ఈనాడు దిన పత్రిక  దిల్ సుఖ్ నగర్ జోన్ పరిధిలో పాత్రికేయ వృత్తి జీవితం ప్రారంభించాం మేమంతా.. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఇలా కలిశాం.. నాగోల్ లోని సూర్యా హోటల్ ఇందుకు వేదికైంది.. ఆనాటి తీపి జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ అల్పాహారం తీసుకున్నాం..

మాతృ దేవో భావ:

మాతృ దేవో భవ.. అంటే తల్లి దైవంతో సమానం.. భారతీయ సమాజం, కుటుంబ వ్యవస్థలో తల్లికి విశిష్ట స్థానం ఉంది.. మనకు జన్మనిచ్చి, పెంచిన తల్లికి జీవితాంతం సేవ చేసినా ఋణం తీరదు.. కుటుంబంలో భార్యాపిల్లలతో పాటు తల్లిదండ్రులూ భాగమే.. వారు మనకు భారం కాదు.. వారిని కాపాడుకోవడం మన బాధ్యత..
విదేశీయులకు తల్లిదండ్రుల విషయంలో పెద్దగా సెంటిమెంట్ లేదు.. పిల్లలు వయసు పెరిగి సంపాదన మొదలు కాగానే పేరెంట్స్ భారంగా కనిపిస్తారు.. వారిని వృద్ధాశ్రమాని పంపి 'భారం' వదిలించుకుంటారు.. అయితే వారికి 'అప్పుడప్పుడు' తల్లిదండ్రులు గుర్తుకొస్తారు.. ఎంతైనా వారూ మనుషులే కదా.. ఇందుకోసం వారు.. మదర్స్ డే, ఫాదర్స్ డే.. అంటూ కొన్ని 'దినాలు' పెట్టుకున్నారు.. ఆ రోజున వృద్ధాశ్రమాలకు వెళ్లి వారికి గ్రీటింగ్స్ చెప్పి, బహుమతులు ఇచ్చి, కొంతసేపు గడిపి వస్తారు..
తల్లిదండ్రులను ప్రేమతో చూసుకోవడానికి ఒక రోజు మాత్రమే చాలా?.. మిగతా రోజులు పట్టించుకొనక్కరలేదా?.. మరి మనకెందుకు ఈ దినాలు?.. మనకు ప్రతిరోజూ తల్లిదండ్రులు పూజనీయులే..
భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శం.. ఇంత గొప్ప సంస్కృతి ఉన్న మనం విదేశాల నుండి పనికిమాలిన, కపట ప్రేమ, వ్యాపార దృక్పద దినాలను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏమిటి?.. ఆలోచించండి..