Thursday, May 30, 2013

మాయదారి రోగం మర్మమేమిటి?..

తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా అంటే, దూడకు గడ్డి కోసం అన్నాడట వెనకటికి ఒకరు.. మన కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే వ్యవహారం కూడా ఇలాగే ఉంది.. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు జరిపిన ఘాతుకంపై స్పందించాల్సిన మంత్రి వర్యులు బాధ్య మరచి అమెరికాలో విహారం చేశారు.. మంత్రి గారి తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.. చాలా తీరిక చేసుకొని స్వదేశానికి వచ్చారు షిండేజీ.. ఇదేం మహాశయా అని ప్రశ్నిస్తే.. తనకు అనారోగ్యం ఉన్నందున అమెరికాలో పరీక్షలు చేయించుకున్నానని సెలవిచ్చారు.. పైగా అమెరికాలో వరుస సెలవుల కారణంగా ఆలస్యమైందని అడక్కుండానే సంజాయిషీ ఇచ్చుకున్నారు.. భేష్ సుశీల్జీ..
ప్రపంచంలో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్న దేశంగా భారత్ పేరు తెచ్చుకుంది.. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో సూపర్ స్పెషాలిటీ వైద్యం ఖరీదు కావడంతో విదేశీయులంతా భారత దేశానికి వచ్చి వైద్య చికిత్స చేయించుకుంటున్నారు.. ఇలా మన దేశంలో హెల్త్ టూరిజం వర్ధిల్లుతోంది.. కానీ మన నాయకులకు, ముఖ్యంగా షిండే లాంటి వారికి అమెరికా వైద్యమే నచ్చుతుంది.. ఇదేం మాయ రోగమోమరి.. పొరుగుంటి పుల్లకూర కమ్మన అంటారు ఇందుకేనా?.. లేక తీరగా వచ్చిన ప్రజాధనాన్ని మంచి నీటిలా ఖర్చు చేసేందుకే విదేశాల్లో వైద్యం పేరిట విహార యాత్రలు చేసి వస్తున్నారా?.. సుశీల్ కుమార్ షిండే గారే చెప్పాలి.. అఖరికి ఆయన ఇండియా వచ్చినందుకు సంతోషిద్దాం..

Wednesday, May 29, 2013

మహానాడు అంటే ఇదే మరి..

టీడీపీ నేతలను ఏమైనా ముఖ్యమైన అంశాలపై ప్రశ్నలు సంధిస్తే మహానాడులో తీర్మానం చేస్తామనో, గత మహానాడులోనే స్పష్టం చేశామనో వక్కానిస్తుంటారు.. దీన్ని బట్టే మహానాడు ప్రాధాన్యతను మనం అర్థం చేసుకోవచ్చు.. ఈ లెక్కన మరో ఏడాదిలో ఎన్నికలు వస్తున్నాయనగా జరిగిన ఈ మహానాడుకు మరింత ప్రాధాన్యత ఉండాలి.. కానీ నాకైతే కొత్తదనం ఏమీ కనిపించలేదు..
తాజా మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు కొత్తగా చెప్పిందేమీ కనిపించలేదు.. తీర్మానాలు కూడా రొటీనే.. చివరకు రాజకీయ తీర్మానంలో రాష్ట్రాన్ని కుదిపేస్తున్న తెలంగాణ అంశంపై కూడా మళ్లీ పాతపాటే పాడారు..
బాబు గారు యువతకు ప్రాధాన్యత ఇస్తామంటున్నారు.. టీడీపీ నేతల దృష్టిలో యువత అంటే తమ సంతానమే అనుకుంటా.. వేదికపై వారి హల్ చల్ అధికంగా కనిపించింది.. ఒక నాయకుని తనయుడేతే టీడీపీ కార్యకర్తలు తీవ్రవాదుల్లా పని చేయాలని నోరు జారాడు..
పాపం జూనియర్ ఎన్టీఆర్ ఆహ్వానం లేక మహానాడుకు వెళ్లలేదట.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పాడు.. అయితే నందమూరి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ఆహ్వానం పంపే సంప్రాదాయం లేదని టీడీపీ నాయకుడొకరు సెలవిచ్చారు.. ఇంకొకాయనేతే మేమంతా బొట్టు పెట్టి పిలిస్తేనే మహానాడుకు వెళ్లామా అని ఎక్కసెక్కాలాడాడు.. ఎంత విచిత్రమో చూడంటి.. ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ని బతిమిలాడుకొని ప్రచారం చేయించుకుంటారు.. ఆయనకు యాక్సిడెంట్(?) అయినా ఇంటి నుంచే పడక మీది నుండి లైవ్లో ప్రసంగాలు ఏర్పాటు చేస్తారు.. కానీ మహానాడు మాత్రం పిలవరట..
మహానాడు వేడుకల్లో ఆత్మస్థతి పరనిందకే ప్రాధాన్యత ఉంటుంది.. అయితే 2004 ఎన్నికల్లో ఓటమి తరువాత కొద్ది రోజులకే వచ్చిన మహానాడులో ఆత్మవిమర్శకు పెద్ద పీట వేశారు..
మహానాడు గత రెండు దశాబ్దాలుగా నేను తెలుగుదేశం మహానాడు ఉత్సవాలను గమనిస్తున్నాను.. ఎన్టీఆర్ నాటి టీడీపీని, చంద్రబాబు హయాం టీడీపీని కూడా చూస్తూ వచ్చాను.. గతంలో విలేఖరిగా మహానాడు వేడుకలను కవర్ చేశాను.. ఈ అవగాహనతో నేను ఈ కామెంట్స్ చేస్తున్నాను..


 

కాంగ్రెస్ పాలకులకు ఇది మామూలే..

యూపీఏ హోంమంత్రులు దేశాన్ని కదిలించే ప్రధాన సమస్యలు ఎదురైనప్పుడు ఎంత సీరియస్ గా ఉంటారో ఒకసారి గమనించండి.. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు కాంగ్రెస్ నేతలకు, కార్యకర్తలను పెద్ద సంఖ్యలో హతమార్చినా కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ఇప్పటి దాకా అక్కడికి వెళ్లలేదు.. ఎవరినీ పరామర్శించేదు.. కనీసం సమీక్షించలేదు.. అసలాయన దేశంలో ఉంటే కదా? అమెరికాలో అధికారిక పర్యటన పూర్తయినా అక్కడే విహార యాత్ర చేస్తున్నారు షిండే.. ముంబాయి మీద తీవ్రవాదుల దాడి చేసినప్పడు నాటి కేంద్ర హోంమంత్రి శివరాజ్ పాటిల్ ఇలాగే పిల్ల చేష్టలు చేసి పదవి పోగొట్టుకున్నాడు.. ఇక చిదంబరం గారి తెలంగాణ ప్రకటన ప్రహసనం తెలిసిందే..
ఛత్తీస్ గఢ్ మావోయిస్టుల ఘాతుకానికి మీరంటే మీరే కారకులని కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం విమర్శించుకుంటున్నాయి.. కారకులు ఎవరైనా ఒకటి మాత్రం స్పష్టం.. ఎవరు తీసిన గోతిలో వారే పడతారనేది నిరూపితమైంది.. మహేంద్ర కర్మ కుటుంబ సభ్యులతో సహా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తమ పార్టీలోని ప్రత్యర్థులను అనుమానిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.. నిజానిజాలు విచారణలోనే తేలాలి..

మన దేశంలో నక్సలైట్ల కార్యకలాపాలు ఈ స్థాయిలో విస్తరించాలంటే పాలకుల వైఫల్యాలే కారణం.. ఈ దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీయే ప్రధానంగా బాధ్యత వహించక తప్పదు.. నక్సలిజం మంచిదా? కాదా అనే విషయాన్ని నేను ఇక్కడ చర్చిండం లేదు ఎవరి అభిప్రాయాలు వారివి.. నా వరకైతే వారి సిద్ధాంతాలు, విధానాలపై నమ్మకం లేదు..



Tuesday, May 21, 2013

ఈ ర్యాంకుల మర్మం ఏమిటి?


విద్యార్థుల పరీక్షా ఫలితాల సీజన్ ఇది.. పదో తరగతి పరీక్షా ఫలితాలు వచ్చేశాయి.. ఇక ఇంటర్మీడియట్, ఫలితాలు, ఎంసెట్ ఫలితాలు రావాల్సి ఉంది.. ఈ పరీక్షా ఫలితాల విషయంలో నాకే కాదు, ఎందరికో అంతు పట్టని సందేహాలున్నాయి అవి..
ప్రతి ఏటా కొన్ని కాలేజీలకు మాత్రమే వరుసగా ఉత్తమ ఫలితాలు (ర్యాంకులు) ఎలా వస్తున్నాయి?.. ర్యాంకుల విధానం తీసేసినా అంత తక్కువ సమయంలో ఆయా విద్యా సంస్థలకు తమ విద్యార్థులకే మొదటి ర్యాంకు (లేదా అత్యధిక మార్కులు) వచ్చిన విషయం ఎలా తెలిసిపోతోంది? ఫలితాలు ప్రకటించక  ప్రెస్ మీట్లు ఎలా ఏర్పాటు చేస్తున్నారు?.. ర్యాంకర్లు సరిగ్గా సమయానికి ఎలా అందుబాటులో (వారి బయోడేటా, ఫోటోలు, తల్లి దండ్రులు సహా) ఉంటున్నారు?.. ర్యాంకులు తమకే వస్తాయని వారికి ఎలా తెలుస్తోంది?.. ఈ కాలేజీలకు ర్యాంకులు వచ్చినట్లు ఎస్సెస్సీ, ఇంటర్ బోర్టుల నుండే ముందే సమాచారం ఇస్తున్నారా?.. ఇవ్వక పోతే వారు సందడి, సంబరాలకు ఎలా ఏర్పాట్లు చేసుకోగలుగుతున్నారు?.. వారికి వస్తున్న ర్యాంకుల్లో అసలు ర్యాంకులు ఎన్ని? కొనుకున్నవి ఎన్ని? (ఇతర సంస్థల్లో చదివిన వారిని తమ విద్యార్థులుగా ప్రకటించుకోవడం)
ఇప్పటి వరకూ మనం ప్రశ్నా పత్రాల లీకేజీ, మాస్ కాపీయింగ్, హైటెక్ కాపీయింగ్ల గురుంచే విన్నాం.. కానీ ఫలితాల లీకేజీపై ఎవరైనా ఎందుకు దృష్టి సారించడం లేదు? ఈ ప్రశ్నలకు జవాబులు కష్టమేమీ కాదు.. కానీ ఎవరూ నోరు మెదపరు.. పత్రికలకు, టీవీలకు ఆయా విద్యాసంస్థల నుండి దండిగా ప్రకటనల రూపంలో ఆదాయం వస్తుంటే ఎందుకు ప్రశ్నిస్తారు? ప్రకటనలు రాని మీడియా సంస్థలు మాత్రం అక్కసుతో అరచి గోల పెడుతున్నాయి.. అది వేరే విషయం లెండి.. సరే మీడియా సంగతి అలా పెడితే కార్పోరేట్ విద్యాసంస్థల అక్రమాలపై ప్రభుత్వం, విద్యాశాఖ, పోలీసులు ఎందుకు దృష్టి పెట్టడం లేదు? ఈ అక్రమాల్లో వారి వాటా ఎంత?
హైదరాబాద్ ఇతర ప్రధాన నగరాలతో పాటు ఒక మోస్తరు పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ కార్పోరేట్ విద్యా సంస్థల బ్రాంచీలు కనిపిస్తాయి.. ఇరుకు గల్లీల్లో, కోళ్ల పారాలను తలపించే భవనాల్లో కాలేజీలు పెట్టి ర్యాంకులు అశ చూపి వేలాది రూపాయలు(లక్ష కూడా దాటుతోంది) ఫీజల రూపంలో వసూలు చేస్తున్నారు.. ధనికులు, మధ్య తరగతి వారు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎలాగోలా ఫీజులు కట్టి ఈ కాలేజీల్లో చేరుస్తున్నారు.. కానీ పేదల పరిస్థితి ఏమిటి? వారి పిల్లలు నాసి రకం చదువులకే పరిమితం కావాలా? ఈ దోపిడీకి అంతులేదా?.. పట్టించుకునే నాధుడు లేడా?.. ప్రభుత్వానికి పట్టదా?.. నాయకులు, అధికారులు తమ తమ వాటాలు చూసుకొని ధృత రాష్ట్ర నిద్ర నటిస్తున్నారా?..



Saturday, May 18, 2013

గో హత్య మహా పాతకం..

హిందువులకు ఆవు అత్యంత పవిత్రమైనది.. సకల దేవతలు కొలువైన ఆవును దైవంగా పూజిస్తారు.. తల్లితో సమాన ప్రాధాన్యత ఇచ్చి గోమాత అని పిలుస్తారు.. ఆవు పాలు, పేడ, పంచకానికి ఎంతో విలువ ఉంది.. ఇవి పవిత్రమైనవే కాదు, ఔషద గుణాలు కూడా ఎంతో ఉన్నాయి.. సేంద్రీయ వ్యవసాయంలో వీటి పాత్ర ఎంతో ఉంది.. హిందూ సంస్కృతిలో ఆలయాలతో పాటు ఆవులు కూడా భాగమే...
ప్రాచీన కాలం నుండి ఆలయాల నిర్వహణలో గోశాలలు ఉన్నాయి.. ఆలయాలపై నమ్మకంతో భక్తులు ఆవులను భక్తితో సమర్పించుకుంటారు.. కానీ ఆలయాల నిర్వహణలో గో సంరక్షణ లోప భూయిష్టంగా ఉంటే ఏమనాలి?.. గోహత్య మహా పాతకమని పురాణాలు చెబుతున్నాయి.. ఆలయ అధికారుల నిర్లక్ష్యం కారణంగా గోవులు మృత్యువాత పడితే దీన్ని గోహత్య అనలేమా?
సింహాచలం దేవస్థాన గోశాలలో అధికారులు అపరిశుభ్ర వాతావరణంలో సరైన తాగునీరు, ఆహారం ఇవ్వని కారణంగా ఆవులు మరణించడం ఎంతో బాధను కలిగిస్తోంది.. దీనికి బాధ్యులుగా గోశాల నిర్వహకులను సస్పెండ్ చేసినంత మాత్రాన జరిగిన పాపం పోతుందా? ప్రాయశ్చిత్తం అవసరం లేదా? హిందూ ఆలయాల్లోనే హిందువుల మనోభావాలకు విలువ లేకుండా పోయింది.. ఇది ఒక్క సింహాచలం దేవస్థానానికి మాత్రమే పరిమితం కాదు.. రాష్ట్రంలోని అన్ని ఆలయాల గోశాలల పరిస్థితి ఇలాగే ఉంది..
హిందువులు పవిత్రంగా భావించే ఆవుల పోషణ బాధ్యత దేవాదాయ శాఖకు లేదా? ఇది తమ పరిధిలోని అంశం కాదని, పశు సంవర్ధన శాఖ వారిదని దేవాదాయ శాఖ మంత్రి అన్నట్లు మీడియాలో చూడటం ఎంతో బాధనుకలిగిస్తోంది... దేవాదాయ శాఖ ఉన్నది భక్తులు భగవంతునికి చెల్లించుకునే కట్న కానుకలను మింగేయడానికేనా?.. భక్తుల సొమ్ము మంత్రులు, అధికారులు, సిబ్బంది జీత భత్యాలకే ఉపయోగిస్తారా? వారు ఎంతో పవిత్రంగా భావించే గోవుల సంరక్షణ మీకు పట్టదా?
అసలు ఈ దుస్థితి అంతటికీ ధార్మక భావన లేని నాయకులు, అధికారులే కారణం.. గోవధ, కబేళాలను చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వ పెద్దలు, ఈ పాతకాన్ని అడ్డుకున్న వారిపై ఎదురు కేసులు పెట్టిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.. ఇకనైనా మన నాయకులకు, అధికారులకు సద్భుద్ది, కనువిప్పు కలగాలని, గో సంరక్షణ సక్రమంగా జరగాలని కోరుకుందాం..

Friday, May 17, 2013

క్రికెట్ ఒక్కటే ఆట కాదు..

జార్జ్ బెర్నార్డ్ షా అన్నారు.. 11 మంది వెర్రివాళ్లు ఆడుతుంటే, మరో 11 వేలమంది వెర్రివాళ్లు చూసే ఆటే క్రికెట్ అని. కాల క్రమంలో టీవీలు, ప్రత్యక్ష ప్రసారాలు వచ్చి ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది కోట్లాది మంది క్రికెట్ ఆటను చూడటం మొదలు పెట్టారు.. బెర్నార్డ్ షా చెప్పినట్లు వెర్రి ఎంతగా ముదిరిందంటే క్రికెటర్లను దేవుళ్లుగా ఆరాదించే స్థాయి చేరింది..

క్రికెట్ ఆట ఓ వ్యాపారంగా మారిపోయింది.. ముఖ్యంగా మన దేశంలో.. క్రికెట్ వచ్చిందంటే అందరికీ ఎక్కడ లేని జ్వరాలు వచ్చేస్తాయి.. పని మానేసి స్టేడియంలో టికెట్లు సంపాదించేందుకు కుస్తీ పడతారు.. ఇళ్లలో, ఆఫీసుల్లో టీవీలకు అతుక్కు పోతారు.. ఈ వెర్రి జనాల కోసమే క్రికెట్ అంగడి సరుకైపోయింది.. ఆట ఎలా ఆడినా సరే క్రికెట్ ఆటగాళ్లకు భారీగా పారితోషికాలు వచ్చిపడుతున్నాయి.. ఇక స్పాన్సర్లు, ప్రకటనల ఆదాయం సరేసరి.. ఇప్పుడు ఈ ఆదాయం చాలదా అన్నట్లు క్రికెటర్లు అమ్ముడు పోవడం మొదలు పెట్టారు.. దీనికే బెట్టింగ్ అని ముద్దుపేరు.. ఆటగాళ్లు, బెట్టింగ్ గ్యాంగులు, మాఫియాలు కలిసిపోయి క్రికెట్ ఆటను అభిమానించే వారిని నిజంగానే వెర్రి వాళ్లను చేసేశారు..
ఇప్పడు చెప్పండి.. ఇలాంటి క్రికెట్ ను, ఆటగాళ్లును మనం ఇంకా ఆరాధించాలా.. క్రికెట్ ఇక్కటే ఆటనా? మిగతావేవీ ఆటలు కాదా?.. నిజానికి మన దేశం స్వాతంత్రానికి పూర్వం నుండి హాకీ ఆట ద్వారానే గుర్తింపు పొందింది.. ఒకప్పుడు హాకీలో ప్రపంచ దిగ్గజాలం మనం.. ఎన్నో స్వర్ణ పథకాలు తెచ్చుకున్నాం ఈ ఆటలో..  కానీ ఈ రోజున మన దేశంలో హకీ గుర్తింపు కోల్పోయింది..(ఇలా అనడం కన్నా క్రికెట్ మింగేసింది అంటే బెటర్)..
క్రికెట్ అంతర్జాతీయ క్రీడగా చెప్పుకుంటున్నా ప్రపంచంలేని ఎన్నో దేశాలు ఈ వెర్రి ఆట మత్తులో పడలేదు.. అగ్ర రాజ్యం అమెరికా, ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న చైనాతో సహా పలు దేశాల్లో ఆ ఆటకు అసలు ఆదరణే లేదు.. ఈ కారణం వల్లే వారు ఒలింపిక్స్, ఏసియన్ గేమ్స్ లో కుప్పలు తెప్పలుగా పథకాలు సాధిస్తున్నారు.. క్రికెట్ వెర్రిలో పడి మనం ఇతర క్రీడల్లో ఒకటి అరా కాంస్యమో, రజతమో సాధించుకొని సంతృప్తి పడుతున్నాం.. 100 కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశానికి ఎంతటి అవమానమో ఆలోచించారా?.. ఇకనైనా మేలు కుందాం.. క్రికెట్ మత్తులోంచి బయట పడదాం.. అన్ని ఆటలనూ ఆదరిద్దాం.. క్రికెటేతర క్రీడారంగంలో కూడా రానిద్దాం.. అంతర్జాతీయ క్రీడల్లో మన దేశ గౌరవాన్ని కాపాడుకుందాం..


Wednesday, May 8, 2013

బీజేపీ స్వయంకృత అపరాధం..

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ముందుగా ఊహించినవే, కాబట్టి పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు.. బీజేపీ పరాజయం స్వయంకృతాపరాధమే.. ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చిన అధికారాన్ని నిల్పుకోవడంలో ఆ పార్టీ దారుణంగా విఫలమైంది.. యడ్యూరప్ప అవినీతి- గాలి జనార్ధన రెడ్డి గనుల లూఠీ ఒక ఎత్తైతే, కొందరు మంత్రులు-ఎమ్మెల్యేల అనైతిక చర్యలు కన్నడ ప్రజలకు ఏవగింపు కలిగించాయి.. నిజానికి పరిపాలనా పరంగా సదానంద గౌడ, జగదీష్ షెట్టర్ల  ప్రభుత్వాలను ఎక్కడా తప్పు పట్టలేం.. కానీ యడ్డీ, గాలి చేయాల్సినంత నష్టం చేశారు.. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందాన వీరిద్దరి వదిలించుకున్నాం అని బీజేపీ నాయకులు ఎంత అరిచి గీ పెట్టినా ప్రజలు పట్టించు కోలేదు.. దీని ఫలితమే దారుణ ఓటమి..

యడ్యూరప్ప ముందుగా ప్రకటించినట్లు బీజేపీని ఓడించి ప్రతీకారమైతే తీర్చుకున్నాడు.. కానీ ఆయనకు అధికారం దక్కక పోగా కొబ్బరి చిప్పే (కేజేపీ ఎన్నికల చిహ్నం) మిగిలింలింది.. గాలి అనుచరుడు శ్రీరాములు బీఎస్సార్ కాంగ్రెస్ ( మన వైస్సార్ కాంగ్రెస్) లాంటిదే ప్రభావం బళ్లారీ పరిసరాలకే పరిమితం అయ్యింది.. ఇక దేవెగౌడ కుటుంబ పార్టీ మైసూర్ పరిసర జిల్లాలకే పరిమితం అయినా, బీజేపీతో సమానంగా ఓట్లు తెచ్చుకుంది.. పొత్తులు లేకుండా ఆ పార్టీ ఎన్నటికీ సొంతంగా అధికారంలోకి వచ్చే అవకాశం లేదు..
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత వచ్చినా,  వారేదో ఉద్దరిస్తారనే నమ్మకంతో కర్ణాటక ప్రజలు ఓట్లేశారని భావించలేం.. భాజపాతో పోలిస్తే కాంగ్రెస్ ఎన్నో రెట్ల అవినీతి పార్టీ అని అందరికీ తెలుసు.. కన్నడ ప్రజలు గతంలో కాంగ్రెస్ పాలనతో ఇంతకన్నా ఎక్కువ ఇబ్బందులే పడ్డారు.. అయితే  బీజేపీ, జేడీఎస్ పార్టీలపై నమ్మకం లేనందు వల్లే గత్యంతరం లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు.. ప్రధాని మన్మోహన్ చెప్పినట్లు ఇదేం రాహుల్ గాంధీ ఘనతేం కాదు.. అదే నిజమైతే రాహుల్ గతంలో ప్రచార బాధ్యతలు చేపట్టిన ఉత్తర ప్రదేశ్, గుజరాత్, కేరళ తదితర ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాల్సింది.. ఏమైనా క్రెడిట్ దక్కితే సిద్ద రామయ్యకే దక్కాలి..
ఏది ఏమైనా కర్ణాటక ప్రజలు కోరుకున్న మార్పును గౌరవించాల్సిందే.. కన్నడిగులకు అంతా మేలు జరుగుతుందనే ఆశిద్దాం..

Sunday, May 5, 2013

ఏనుగులు తిరిగిన గడ్డ..

బద్దకంగా రోడ్డు మీద నడచుకుంటూ వెళ్లుతున్న మిమ్మల్ని వెనుక నుండి ఓ ఏనుగు తొండంతో తడితే ఎలా ఉంటుంది?.. ఒక్కసారి ఉలిక్కి పడతారా?.. భయపడకండి ఇప్పుడా పరిస్థితి లేదు.. రాదు కూడా.. నేను ప్రస్థావిస్తున్నది ఒక శతాబ్దం కిందటి హైదరాబాద్ నగర పరిస్థతి.. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ పాలిస్తున్న రోజులు అవి..

హైదరాబాద్ అంటే రద్దీ రోడ్డు, వాహనాల రొద, కాలుష్యం గుర్తు కొస్తాయి.. కానీ ఇది ఒకప్పడు దేశంలోనే అన్ని రకాల సదుపాయాలు గల సుందర నగరం.. బాగ్ నగర్ అంటే తోటల నగరం.. విదేశాలు, ఉత్తర భారత దేశం, సంస్థానంలోని నవాబులు, అమీర్లు, జమీన్ దార్లు, దొరలు, బ్రిటిష్ రెసిడెంట్ ఏజెంట్లు విలాసవంతమైన హైదరాబాద్ నగరంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు.. ఆరోజుల్లో వీరంతా వీధుల్లో ఎంతో ఆడంబరంగా ఎక్కి తిరిగిన వాహనాలు ఏమిటో తెలుసా?.. ఏనుగులు. విశాలమైన రోడ్లు, కొన్ని చోట్ల ఇరుకు గల్లీల్లో కదిలి వెళ్లే గజరాజు కొన్ని సందర్భాల్లో రోడ్లమీద తిరిగే సాధారణ పౌరులను చిరాకుపరిచేవి.. కొన్ని సార్లు ఘీకరిస్తూ అలజడి సృష్టించేవి.. అప్పడు వాటిని నియంత్రించేందుకు పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చేది.. ఫీల్ ఖానా ప్రాంతమంతా ఏనుగుల కొట్టాలతో సందడిగా ఉండేది..
1908లో ఓ చీకటి రాత్రి హైదరాబాద్ పై జల ప్రళయం విరుచుకు పడింది.. భారీ వర్షంతో మూసీనదికి వరద వచ్చి దాదాపు 15 వేల మందిని పొట్టన పెట్టుకుంది.. అంతకు మూడింతల మంది సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు.. ప్రజల కష్టాలు చూసి కన్నీరు పెట్టిన నవాబు మహబూబ్ అలీఖాన్ ఏనుగు అంబారీపై తిరుగుతూ సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారు.. 1911 ఆగస్టు 11వ తేదీ మధ్యాహ్నం మహబూబ్ అలీఖాన్ కన్ను మూశారు.. ఏనుగులపై నల్లజండాలు పట్టుకొని, బాకాలు ఊదుతూ నగర వీధుల్లో తిరిగిన సైనికులు నిజాం నవాబు ఇక లేడు అనే శోక వార్తను ప్రకటించడంతో, తమ ప్రియతమ రాజును తలచుకొని ప్రజలు కన్నీరు మున్నీరయ్యారు.. ఆ మరునాడే 37 ఏనుగులు బారులు తీరి వీధుల్లో తిరిగాయి.. ముందు నడిచిన ఏనుగుకు ఇరువైపులా నాణేల సంచులు ఉన్నాయి.. ఏడో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాజుగా బాధ్యతలు స్వీకరించాడనే వార్తను ప్రకటిస్తూ రోడ్లపై నాణేల వర్షం కురిపించారు.. జనం జయజయ ధ్వానాలు చేస్తే వాటిని స్వీకరించేందుకు ఎగబడ్డారు..
ఆరో నిజాం కాలానికే హైదరాబాద్ వీధుల మీద సైకిళ్ల సందడి ప్రారంభమైంది.. క్రమంగా విదేశాల నుండి కార్లు దిగుమతి అయ్యాయి.. అప్పటి దాకా ఏనుగులపై తిరిగిన వారంతా కొత్త వాహనాల వైపు మొగ్గు చూపారు.. క్రమ క్రమంగా ఏనుగుల యుగం అంతరించింది.. ఒకనాడు ఏనుగుల కొట్టాలు ఉన్న ఫీల్ ఖానా ధాన్యపు వ్యాపార కేంద్రంగా అవతరించింది.. వందేళ్ల క్రితం హైదరాబాద్ రోడ్లపై ఏనుగులు సందడి చేసేవి అనే వార్త నేటి తరానికి ఆశ్చర్యకరమైనదే.. ఇవాళ భాగ్య నగరంలో ఏనుగు కనిపించేది రెండే సందర్భాల్లో ఒకటి బోనాల సంబరాల్లో.. రెండోది మొహర్రం సంతాప ఊరేగింపులో..


ఆంగ్లేయుల వారసులు కాంగేయులు

ఆంగ్లేయులు పెట్టిన చిచ్చును కాంగేయులు కొనసాగిస్తున్నారా?..

మిత్రులారా.. నేనేదో అతిశయోక్తిగా ఈ వ్యాఖ్య చేయడం లేదు.. ఒక్కసారిగా ఆలోచించండి.. దేశ మంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నారు గురజాడ.. దురదృష్టవశాత్తు మన పాలకులకు దేశ భద్రతకన్నా తమ స్వప్రయోజనాలే మిన్నగా కనిపించాయి.. విదేశాంగ విధానంలో అడుగడుగునా వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి..
ఈ రోజున పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, బర్మా, శ్రీలంక, నేపాల్, భూటాన్ గా పిలిచే దేశాలన్నీ ఒకప్పడు భారత దేశంలో అంతర్భాగంగా ఉండేవి.. (జత పరచిన బ్రిటిష్ ఇండియా మ్యాప్ చూడండి) టిబెట్ మన రక్షణలో ఉండేది.. బ్రిటిష్ వారు క్రమ క్రమంగా ఒక్కో ప్రాంతాన్ని విడదీస్తూ వచ్చారు.. చివరగా 1947లో పాకిస్థాన్ శాశ్వత శతృవును ఏర్పాటు చేసి పోయారు.. పోతూ పోతూ అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ చేతిలో పెట్టి పోయారు.. ఈయన గారు కాశ్మీర్ సంస్థానం పూర్తిగా విలీనం కాకుండా ఐక్యరాజ్య సమితి వ్యాజ్యం వేశారు.. ఆ చిచ్చు ఈ నాటికీ రగులుతూనే ఉంది.. మరోవైపు టిబెట్ ను అన్యాయంగా చైనా ఆక్రమిస్తే దాన్ని సమర్ధించారు నెహ్రూ.. హిందీ, చీనీ భాయి భాయి అంటూ పంచశీల మంత్రాన్ని ఆలపించారు.. 1962లో చైనా మన దేశంపై దండయాత్ర చేస్తే గానీ ఈయన గారి భ్రమలు తొలగలేదు.. చైనా అక్సాయ్ చిన్ ప్రాంతంలో తిష్టవేస్తే గడ్డి పోచ చూడా మొలవని ప్రాంతం మనకెందుకు అని నిష్టూరమాడారు.. ఆగ్రహించిన ఓ పార్లమెంట్ సభ్యుడు మీ తలమీద కూడా వెంట్రుకలు లేవు.. ఆ తలకాయెందుకు? అని నెహ్రూకి బుద్ది చెప్పారు..
ప్రపంచ శాంతి దూతగా పేరు తెచ్చుకొని, నోబుల్ బహుమతి కొట్టేయాలనే కలలు కల్లలై నెహ్రూగారు కాలధర్మం చేశారు.. ఆయన కూతురు ఇందిరా గాంధీ పాకిస్థాన్ ని విడదీసి బంగ్లాదేశ్ ఏర్పాటుకు తోడ్పాటును అందించడం అభినందనీయం.. కానీ కచ్చతీవు దీవులను శ్రీలంకకు అప్పగించిన ఘనత ఆమెగారిదే.. ఆమె వారసుడుగా వచ్చిన రాజీవ్ గాంధీ హయంలో చైనా మరోసారి భారత్ లోకి చొరబడి అరుణాచల్ ప్రదేశ్లో తిష్టేసింది.. మరోవైపు తీన్ బిఘా ప్రాంతాన్ని బంగ్లాదేశ్ కు అప్పగించే కార్యక్రమానికి రాజీవ్ శ్రీకారం చుడితే పీవీ నరసింహరావు కాలానికి పూర్తయింది(క్షమించాలి సంవత్సరం కచ్చితంగా చెప్పలేక పోతున్నాను)
ఇక ప్రస్తుత కాలానికి వద్దాం చైనా మరోసారి దూకుడు ప్రదర్శించి లద్దాఖ్ లో స్థావరం ఏర్పాటు చేసింది.. దురదృష్ట వశాత్తు నేటి ప్రధాని మన్మోహన్ సింగ్ గత కాంగ్రెస్ పాలకుల వారసత్వాన్ని కొనసాగిస్తూ చైనాకు ధీటైన సమాధానం ఇవ్వలేక పోతున్నారు..
మిత్రులారా ఇప్పడు చెప్పడి నేను మొదట వాడిన పదాలు సరైనవేనా? కాదా?.. ఆంగ్లేయులకు అసలు సిసలు వారసులుగా కాంగేయులు తయారయ్యారా? లేదా?..