Wednesday, July 30, 2014

రెండుగ వెలుగు జాతి మనది..

తెలంగాణ గడ్డలో పుట్టి, తెలుగు సాహితీ మాగాణిలో బంగారు పంటలు పండించిన ఆధునికాంధ్ర కవి, సినీ రవి.. సింగిరెడ్డి నారాయణ రెడ్డి.. జ్ఞానపీఠ్ తో సహా  పురస్కారాలు అందుకున్న సినారె కొన్ని వేల గీతాలు రాశారు.. ఆయన కావ్యాలు, రచనలు ఎంతో ప్రసిద్ది పొందాయి.. తెలుగు భాషకు, సాహిత్యానికి అవిశ్రాంతంగా ఎంతో సేవ చేస్తున్న సినారె 84వ జన్మదినం జరుపుకున్న సందర్భంగా శుభాకాంక్షలు..

సినారెకు తెలంగాణ అంటే ఎంతో అభిమానం.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని బలంగా కోరుకున్నారు.. అయినా తొలి తెలంగాణ ఉద్యమ (1969)లో ఎన్టీఆర్ సినిమాలో తెలుగు జాతి మనది.. అనే పాట రాశారు.. దానిపై ఈనాటికీ విమర్శలు ఉన్నాయి.. అయితే ఈ విమర్శలకు ఆ పాటలోనే సమాధానం ఉందనే విషయం చాలా మంది గ్రహించలేదు.. రెండుగ వెలుగు జాతి మనది.. అంటూ ఆ పాట రెండోలైనులో రాశారు.. ఇటీవల సాక్షిలో వచ్చిన సినారె ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికరమైన అంశాన్ని గమనించండి..

Tuesday, July 29, 2014

ఇదేం సవరణ..

వెనకటికి ఒకడు 'కాకరకాయ' అనరా అంటే.. 'కీకరకాయ' అన్నాడని నానుడి..తెలంగాణ రాజముద్ర వ్యవహారం అలాగే ఉంది..
తెలంగాణ రాజముద్రపై ఆది నుండి వివాదాలే..
రాజముద్రలో నాలుగు సింహాల కింద ఉండే 'సత్యమేవ జయతే' అనే దేవనాగరి లిపి అక్షరాల విషయంలో వ్యక్తమైన అభ్యంతరాలు న్యాయస్థానం మెట్లు దాటాయి.. దీంతో ప్రభుత్వం లోగో కింద ఉండే 'సత్యమేవ జయతే'ను రాజముద్ర కింది నుండి తీసి నాలుగు సింహాల కింద చేర్చింది.. ఇప్పడు వ్యవహారం అశ్వథామ హత: (కుంజర) అన్నట్లైంది.. గతంలో సత్యమే జయతే కొట్టొచ్చినట్లు కనిపించేది.. ఇప్పడు బూతద్దం పెట్టి చూసినా కొత్త రాజముద్రలో సత్యమేవజయతే కనిపించకుండా పోయింది..
పాత రాజముద్రలో కాకతీయ శిలాతోరణం అను ఫాంట్ క్లిప్ ఆర్ట్ నుండి సంగ్రహించారనే అపవాదు ఉండేది.. దాన్ని సవరించారు సంతోషం.. అలాగే మూడు మీనార్ల చార్మినార్ నాలుగు మీనార్లకు చేరింది..కానీ మిగతా అభ్యంతరాల సంగతి ఏమిటి? ఆ విషయాలను ఎందుకు పరిశీలించలేదు?..
తెలంగాణ సంస్కృతికి ప్రతి రూపాలైన బతుకమ్మ, బోనం, పూర్ణకుంభంలతో ఏదైనా ఒకటి రాజముద్రలో చేరితే ఎంత హుందాగా ఉండేది.. నాకు తెలిసి సత్యమేవ జయతే వివాదం మళ్లీ కోర్డు దృష్టికి వెళుతుంది.. ఈలోగా ప్రభుత్వం ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని రాజముద్రను సవరిస్తే బాగుంటుంది..

Monday, July 28, 2014

ఈ ఆదర్శ తల్లిదండ్రుల్లో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా సిఎమ్ లు లేరా శ్రీధర్ గారూ..

Wednesday, July 23, 2014

తెలంగాణను రక్షించుకుందాం..

నిన్న, మొన్నటి దాకా కశ్మీర్ హిందుస్తాన్ కా.. నహీ కిసీకా బాప్ కా.. అంటూ దేశ ప్రజలు నినాదాలు చేసేవారు.. ఇప్పుడు తెలంగాణ విషయంలో కూడా అలాంటి నినాదాలు చేస్తే దుస్థితి రానుందా?.. మోకాలికి, బట్ట తలకు ముడి పెట్టినట్లు కొందరు మహానుభావులు కాశ్మీర్, తెలంగాణ సమస్యలు కలిపేసి వాదిస్తున్నారు.. అసలు వీరికి భారత దేశ చరిత్ర తెలుసా? ఈ దేశ ప్రజల మనోభావాలు అర్థం చేసుకున్నారా?
1947కి పూర్వం జమ్మూ కాశ్మీర్, తెలంగాణ భారత దేశంలో భాగం కాదట.. ఈ రెండు ప్రాంతాల భూ చట్టాలు ఒకేలా ఉన్నాయట.. స్థానికేతరులు భూములు కొనడం నిషేధమట.. ఎందుకీ వక్రీకరణ? ఎవరి చెవిలో పూలు పెట్టాలనుకున్నారు?
తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ స్టేట్లోని మూడు ప్రధాన భూభాగాల్లో ఒక భాగం.. దానికి ప్రత్యేక భూచట్టం ఉన్నట్లు చరిత్రలో ఎక్కడా లేదు.. నిజాం నవాబు నిరంకుశ పాలన, రజాకార్ల దురాగతాలకు వ్యతిరేకంగా ఇక్కడి ప్రజలు పోరాడారు.. హైదరాబాద్ స్వతంత్ర దేశంగా ఉంటుందని, అవసరమైతే పాకిస్తాన్లో చేరతామని ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ బెదిరించాడు.. కానీ హైదరాబాద్ రాష్ట్ర ప్రజలంతా భారత దేశంలో కలవాలని కోరుకున్నారు.. స్టేట్ కాంగ్రెస్ , ఆర్యసమాజం, కమ్యూనిస్ట్ పార్టీలు నిజాం పాలనకు వ్యతిరేకంగా తమ తమ మార్గాల్లో పోరాడాయి.. చివరకు భారత హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్వహించిన పోలీస్ యాక్షన్ తో భారత్ లో హైదరాబాద్ విలీనం సంపూర్ణంగా జరిగింది.. నిజాం నవాబు సైతం హుందాగా అంగీకరించి రాజ్ ప్రముఖ్ (గవర్నర్) పదవి స్వీకరించారు.. ఇదీ చరిత్ర..
ఇక తెలంగాణకి ప్రత్యేక భూచట్టం ఎక్కడి నుండి వచ్చినట్లు? ఇప్పటికే ఆర్టికల్ 370 పుణ్యమా అని జమ్మూ కాశ్మీర్ రావణ కాష్టంలా రగులుతోంది.. ఆ రాష్ట్రంలో ఇతరులు భూములు కొనడం నిషేధం.. కాశ్మీరీలు దేశ ప్రజలతో మమేకం కాకుండా మరికొన్ని క్రూర నిబంధనలు ఆర్టికల్ 370 కారణంగా అడ్డు పడుతున్నాయి.. చూడబోతే తెలంగాణకు కూడా ఇలాంటి ఆర్టికల్ కోసం వీరు డిమాండ్ చేయబోతున్నారా అనే అనుమానాలు ఏర్పడుతున్నాయి..
పాకిస్తాన్ ప్రేరిత వేర్పాటువాద శక్తుల కారణంగా ఇప్పటికే కాశ్మీర్ రావణ కాష్టంలా రగులుతూనే ఉంది.. ఈ జాబితాలో తెలంగాణను చేర్చాలనుకుంటున్నారా?

తెలంగాణ ఎక్కడి నుండో ఊడిపడలేదు.. ఈ దేశంలో సంపూర్ణమైన అంతర్భాగమిది.. ముందు మనం భారతీయులం.. ఆ తర్వాతే తెలంగాణ వాసులం.. మన తెలంగాణను రక్షించుకుందాం..

Tuesday, July 22, 2014

తెలంగాణ ప్రాత:స్మరణీయుడు..

ఓ నిజాము పిశాచమా, కానరాడు
నిన్ను బోలిన రాజు మాకెన్నడేని
తీగలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణ కోటి రతనాల వీణ..
.. నాటి నిజాం నవాబు పాలనలో అష్టకష్టాలు పడుతున్న ప్రజల కష్టాలను చూసి చలించిపోయిన ఓ యువకుడు తన సాహితీ అక్షరాలను సంధించాడు.. రజాకార్ల అరాచకాలతో నలిగిపోతున్న పీడిత ప్రజల గొంతుకగా మారాడు..  రైతుదే తెలంగాణము రైతుదే.ముసలి నక్కకు రాచరికంబు దక్కునే అని గర్జించాడు. దగాకోరు బటాచోరు రజాకారు పోషకుడవు, దిగిపొమ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది, దిగిపోవోయ్, తెగిపోనోయ్.. అంటూ గద్దించాడు.. హైదరాబాద్ సంస్థాన విముక్తి పోరాటంలో ఆంధ్ర మహాసభ ద్వారా ప్రజలను చైతన్య పరిపరుస్తున్న అతన్ని చూసి సర్కారు బెంబేలెత్తిపోయింది.. ఫలితంగా అరెస్టయి వరంగల్, నిజామాబాద్ జైళ్లలో బందీగా చిత్రహింసలకు గురికావాల్సివచ్చింది.. జైలు గోడలే ఆ సాహితీ యోధుడికి కాగితాలు అయ్యాయి.. ఆయనే దాశరధి కృష్ణమాచార్య..
1925 జులై 22న జన్మించిన దాశరథి కృష్ణమాచార్య చిన్నప్పటి నుండి తెలుగు సాహిత్యంపై మమకారాన్ని పెంచుకొని రచయితగా, కవిగా మారాడు.. తన సాహిత్యాన్ని ప్రజల కష్టాల అగ్నిధారగా మలిచారు.. ఊరూరా తిరిగి నిజాం పాలపై అక్షరాయుధాలతో పోరాడారు.. దాశరధి బహుముఖ ప్రజ్ఞాశాలి.. ఉపన్యాసకుడిగా, ఉపాధ్యాయుడిగా, రేడియో ప్రయోక్తగా, పంచాయితీ ఉద్యోగిగా ఎన్నో అవతారాలెత్తారు.. సినీ రంగంలో కూడా తన ముద్రను చాటారు.. ఎన్నో అద్భుతమైన గీతాలను రచించారు..  తెలుగులోనే కాకుండా ఉర్దూ సాహిత్యంలోనూ దాశరథి ప్రఖ్యాతుడు కావడం విశేషం..
దాశరథి కృష్ణమాచార్య రాసిన అగ్నిధార, రుద్రవీణ, మహాంద్రోదయం, మార్పునా తీర్పు, తిమిరంతో సమరం, కవితాపుష్పకం, యాత్రా స్మృతి తదితరాలు ఎంతో ప్రఖ్యాతి పొందాయి.. కేంద్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డులు పొందారు.. ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవిగా పని చేశారు..  1987 నవంబర్ 5 న దాశరథి కన్నుమూశారు.. తెలంగాణ వైతాళికుల్లో ఒకరిగా ప్రఖ్యాతి పొందిన దాశరథి తెలుగు సాహితీ రంగంపై చరగని ముద్రవేశారు..
నా తెలంగాణ కోటి రతనాల వీణ.. అనే దాశరథి గర్జన ప్రజలను ఉత్తేజితులను చేసింది..ఓ నినాదంగా మారింది.. నూతన రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ ప్రభుత్వం దాశరథి కృష్ణమాచార్య జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడం ఎంతో సంతోషకరం..

నేడు దాశరథి జయంతి.. ఆయనకు ఘనంగా నివాళులర్పిద్దాం..

Saturday, July 19, 2014

దేవెగౌడకు నిజమైన వారసుడు సిద్దిరామయ్య.. బెంగళూరులోని ఒక స్కూలులో విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనపై అసెంబ్లీలో ప్రతిపక్షాలు నిలదీస్తుంటే ఈ ముఖ్యమంత్రి ఎంత చక్కగా బజ్జున్నడో చూడండి.. 

ఏరు దాటాక ఎవరైనా బోడి మల్లయ్యలే..


Friday, July 18, 2014

1956 తెలంగాణ అంటే..

1956కు పూర్వం తెలంగాణలో స్థిరపడిన వారే స్థానికులని ప్రభుత్వం దాదాపుగా తేల్చేసినట్లు అర్థమవుతోంది.. ఇందుకు అనుగుణంగానే ఫీజు రీయంబర్స్మెంట్ మార్గదర్శకాలు సిద్దం చేస్తున్నారు..  ప్రస్తుతం తెలంగాణలోనే ఉన్న కొన్ని భూభాగాలు 1956 నాటికి ఇక్కడి భూభాగంలో లేవు.. మరి ఆ ప్రాంతాల విద్యార్థుల భవిష్యత్తు ఏమిటి?
హైదరాబాద్ రాష్ట్రం లోని తెలంగాణ భూభాగం, ఆంధ్ర రాష్ట్రం విలీనమై 1956 నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.. అయితే ప్రస్తుత తెలంగాణ భూభాగానికి స్పష్టమైన సరిహద్దులు ఏర్పడింది మాత్రం 1959లోనే..
మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల, ఆలంపూర్ డివిజన్లు 1956కి పూర్వం రాయచూరు జిల్లాలో ఉన్నాయి.. రాయచూరు అప్పటి వరకూ హైదరాబాద్ స్టేట్లో ఉండి ప్రస్తుతం కర్ణాటకలో కలిసింది..
అలాగే మెదక్ జిల్లాలోని జహీరాబాద్ పట్టణం గుల్బర్గా జిల్లాలో ఉండేది.. ఇది కూడా పాత హైదరాబాద్ స్టేట్లో ఉండిన కర్ణాటకలో కలిసిన భూభాగమే..
ఖమ్మం జిల్లాను వరంగల్ నుండి విడదీసి 1953లో ఏర్పాటు చేశారు.. ఆంధ్రప్రదేశ్ 1956లో ఏర్పడితే 1959లో ఖమ్మం జిల్లాకు ప్రస్తుత స్వరూపం వచ్చింది.. తూర్పుగోదావరి జిల్లా (ఆంధ్ర రాష్ట్రం) లోని భద్రాచలం, అశ్వారావు పేట, వెంకటాపురం డివిజన్లను 1959 ఖమ్మం జిల్లాలో కలిపేశారు.. అయితే పోలవరం ప్రాజెక్టు కారణంగా ఇందులోని కొన్ని మండలాలను తెలంగాణ నుండి విడదీసి తిరిగి ఆంధ్ర ప్రదేశ్లో కలుపుతున్నారు. భద్రాచలం పట్టణం మినహా మిగతా మండలం, కుక్కునూరు, వేలరుపాడు, వరరామచంద్రాపురం, చింతూరు, కూనవరం మండలాలు, బూర్గంపాడు మండలంలోని ఆరు గ్రామాలు ఆం.ప్ర.లో కలపాలని పార్లమెంట్ ఉభయసభలు తీర్మానించాయి..
ఇక తెలంగాణ సాయుధ పోరాట పురిటి గడ్డ నల్లగొండ జిల్లాలోని మునగాల పరగణాది (మునగాల, నడిగూడెం, చిల్కూరు(?) మండలాలు) మరో దీన పరిస్థితి.. ఈ పరగణా 1956కి పూర్వం ఆంధ్ర రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో ఉండేది.. హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం పాలన  నుండి విముక్తి చేయడానికి మునగాల ప్రజలు తమవంతు సాయం చేశారు..
ఈ భూభాగాలేవీ 1956కి పూర్వం తెలంగాణలో లేవు.. మరి ఈ ప్రాంతాల పిల్లల భవిష్యత్తు ఏమిటి? 1956 సంవత్సరమే స్థానికతను ప్రమాణమైతే వారి ఫీజు రీయంబర్స్ ఎవరు చేయాలి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమా? కర్ణాటక సర్కారా?

ఈ విషయాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి..

Wednesday, July 9, 2014

భాజపా నూతన సారధికి అభినందనలు..

ఈయన పని తీరే వేరు..మోదీ లాగే పని రాక్షసుడు.. 
టార్గెట్ నిర్ణయించుకోవడం.. అమలు చేయడం.. విజయం సాధించడం.. అదీ ఆయన వర్క్ స్టైల్..
సమర్ధుడికి సరైన న్యాయం జరిగింది..

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అమిత్ షా కు శుభాభినందనలు..

బజ్జున్న బుజ్జోడు

పప్పూ మారడు గాక మారడు.. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలిరోజున కాంగ్రెస్ సభ్యులతో కలిసి వెల్ లోకి వచ్చి నినాదాలు చేసిన రాహుల్ గాంధీని చూసి, మనోడు మారిపోయాడు, యాక్టివయ్యాడు అని చంకలు గుద్దుకున్నారు.. కానీ అప్పుడే నీరసపడిపోయాడేమో పాపం.. లోక్ సభలో ధరల పెరుగుదలపై చర్చ జరుగుతుంటే ఎంచక్కా బజ్జున్నాడు మన బుజ్జోడు.. ఈ ఐదేళ్లు ఆయనకు విశ్రాంతియే కదా.. ఏమైనా ఉంటే బకరా ఖర్గే చూసుకుంటాడు కదా.. మంచి జరిగితే రాగాకు, చెడు జరిగితే మొద్దబ్బాయి ఉన్నాడు కదా?
(మొద్దబ్బాయి అంటే తప్పు చేసిన యువరాజు బదులు దెబ్బలు తినే సేవకుడు)

అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు..