Friday, July 18, 2014

1956 తెలంగాణ అంటే..

1956కు పూర్వం తెలంగాణలో స్థిరపడిన వారే స్థానికులని ప్రభుత్వం దాదాపుగా తేల్చేసినట్లు అర్థమవుతోంది.. ఇందుకు అనుగుణంగానే ఫీజు రీయంబర్స్మెంట్ మార్గదర్శకాలు సిద్దం చేస్తున్నారు..  ప్రస్తుతం తెలంగాణలోనే ఉన్న కొన్ని భూభాగాలు 1956 నాటికి ఇక్కడి భూభాగంలో లేవు.. మరి ఆ ప్రాంతాల విద్యార్థుల భవిష్యత్తు ఏమిటి?
హైదరాబాద్ రాష్ట్రం లోని తెలంగాణ భూభాగం, ఆంధ్ర రాష్ట్రం విలీనమై 1956 నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.. అయితే ప్రస్తుత తెలంగాణ భూభాగానికి స్పష్టమైన సరిహద్దులు ఏర్పడింది మాత్రం 1959లోనే..
మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల, ఆలంపూర్ డివిజన్లు 1956కి పూర్వం రాయచూరు జిల్లాలో ఉన్నాయి.. రాయచూరు అప్పటి వరకూ హైదరాబాద్ స్టేట్లో ఉండి ప్రస్తుతం కర్ణాటకలో కలిసింది..
అలాగే మెదక్ జిల్లాలోని జహీరాబాద్ పట్టణం గుల్బర్గా జిల్లాలో ఉండేది.. ఇది కూడా పాత హైదరాబాద్ స్టేట్లో ఉండిన కర్ణాటకలో కలిసిన భూభాగమే..
ఖమ్మం జిల్లాను వరంగల్ నుండి విడదీసి 1953లో ఏర్పాటు చేశారు.. ఆంధ్రప్రదేశ్ 1956లో ఏర్పడితే 1959లో ఖమ్మం జిల్లాకు ప్రస్తుత స్వరూపం వచ్చింది.. తూర్పుగోదావరి జిల్లా (ఆంధ్ర రాష్ట్రం) లోని భద్రాచలం, అశ్వారావు పేట, వెంకటాపురం డివిజన్లను 1959 ఖమ్మం జిల్లాలో కలిపేశారు.. అయితే పోలవరం ప్రాజెక్టు కారణంగా ఇందులోని కొన్ని మండలాలను తెలంగాణ నుండి విడదీసి తిరిగి ఆంధ్ర ప్రదేశ్లో కలుపుతున్నారు. భద్రాచలం పట్టణం మినహా మిగతా మండలం, కుక్కునూరు, వేలరుపాడు, వరరామచంద్రాపురం, చింతూరు, కూనవరం మండలాలు, బూర్గంపాడు మండలంలోని ఆరు గ్రామాలు ఆం.ప్ర.లో కలపాలని పార్లమెంట్ ఉభయసభలు తీర్మానించాయి..
ఇక తెలంగాణ సాయుధ పోరాట పురిటి గడ్డ నల్లగొండ జిల్లాలోని మునగాల పరగణాది (మునగాల, నడిగూడెం, చిల్కూరు(?) మండలాలు) మరో దీన పరిస్థితి.. ఈ పరగణా 1956కి పూర్వం ఆంధ్ర రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో ఉండేది.. హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం పాలన  నుండి విముక్తి చేయడానికి మునగాల ప్రజలు తమవంతు సాయం చేశారు..
ఈ భూభాగాలేవీ 1956కి పూర్వం తెలంగాణలో లేవు.. మరి ఈ ప్రాంతాల పిల్లల భవిష్యత్తు ఏమిటి? 1956 సంవత్సరమే స్థానికతను ప్రమాణమైతే వారి ఫీజు రీయంబర్స్ ఎవరు చేయాలి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమా? కర్ణాటక సర్కారా?

ఈ విషయాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి..

No comments:

Post a Comment