Tuesday, July 22, 2014

తెలంగాణ ప్రాత:స్మరణీయుడు..

ఓ నిజాము పిశాచమా, కానరాడు
నిన్ను బోలిన రాజు మాకెన్నడేని
తీగలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణ కోటి రతనాల వీణ..
.. నాటి నిజాం నవాబు పాలనలో అష్టకష్టాలు పడుతున్న ప్రజల కష్టాలను చూసి చలించిపోయిన ఓ యువకుడు తన సాహితీ అక్షరాలను సంధించాడు.. రజాకార్ల అరాచకాలతో నలిగిపోతున్న పీడిత ప్రజల గొంతుకగా మారాడు..  రైతుదే తెలంగాణము రైతుదే.ముసలి నక్కకు రాచరికంబు దక్కునే అని గర్జించాడు. దగాకోరు బటాచోరు రజాకారు పోషకుడవు, దిగిపొమ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది, దిగిపోవోయ్, తెగిపోనోయ్.. అంటూ గద్దించాడు.. హైదరాబాద్ సంస్థాన విముక్తి పోరాటంలో ఆంధ్ర మహాసభ ద్వారా ప్రజలను చైతన్య పరిపరుస్తున్న అతన్ని చూసి సర్కారు బెంబేలెత్తిపోయింది.. ఫలితంగా అరెస్టయి వరంగల్, నిజామాబాద్ జైళ్లలో బందీగా చిత్రహింసలకు గురికావాల్సివచ్చింది.. జైలు గోడలే ఆ సాహితీ యోధుడికి కాగితాలు అయ్యాయి.. ఆయనే దాశరధి కృష్ణమాచార్య..
1925 జులై 22న జన్మించిన దాశరథి కృష్ణమాచార్య చిన్నప్పటి నుండి తెలుగు సాహిత్యంపై మమకారాన్ని పెంచుకొని రచయితగా, కవిగా మారాడు.. తన సాహిత్యాన్ని ప్రజల కష్టాల అగ్నిధారగా మలిచారు.. ఊరూరా తిరిగి నిజాం పాలపై అక్షరాయుధాలతో పోరాడారు.. దాశరధి బహుముఖ ప్రజ్ఞాశాలి.. ఉపన్యాసకుడిగా, ఉపాధ్యాయుడిగా, రేడియో ప్రయోక్తగా, పంచాయితీ ఉద్యోగిగా ఎన్నో అవతారాలెత్తారు.. సినీ రంగంలో కూడా తన ముద్రను చాటారు.. ఎన్నో అద్భుతమైన గీతాలను రచించారు..  తెలుగులోనే కాకుండా ఉర్దూ సాహిత్యంలోనూ దాశరథి ప్రఖ్యాతుడు కావడం విశేషం..
దాశరథి కృష్ణమాచార్య రాసిన అగ్నిధార, రుద్రవీణ, మహాంద్రోదయం, మార్పునా తీర్పు, తిమిరంతో సమరం, కవితాపుష్పకం, యాత్రా స్మృతి తదితరాలు ఎంతో ప్రఖ్యాతి పొందాయి.. కేంద్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డులు పొందారు.. ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవిగా పని చేశారు..  1987 నవంబర్ 5 న దాశరథి కన్నుమూశారు.. తెలంగాణ వైతాళికుల్లో ఒకరిగా ప్రఖ్యాతి పొందిన దాశరథి తెలుగు సాహితీ రంగంపై చరగని ముద్రవేశారు..
నా తెలంగాణ కోటి రతనాల వీణ.. అనే దాశరథి గర్జన ప్రజలను ఉత్తేజితులను చేసింది..ఓ నినాదంగా మారింది.. నూతన రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ ప్రభుత్వం దాశరథి కృష్ణమాచార్య జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడం ఎంతో సంతోషకరం..

నేడు దాశరథి జయంతి.. ఆయనకు ఘనంగా నివాళులర్పిద్దాం..

No comments:

Post a Comment