Monday, January 29, 2018

సీపీఎం చైనా భజన సిగ్గు సిగ్గు..

పిల్ల చచ్చినా పురిటి కంపు చావలేదు అన్నట్లు చైనాలో కమ్యూనిజం చచ్చినా దాని ప్రేతాత్మ భారత కమ్యూనిస్టులకు ఆరాధనీయంగా కనిపిస్తోంది. భారత దేశానికి చైనా శత్రువని చిన్న పిల్లవాన్ని అడిగినా చెబుతాడు. అయినా సిగ్గు లేకుండా చైనా భజన చేస్తున్నారు సీపీఎం నాయకులు.. ముఖ్యంగా కేరళ సీఎం పినరయ్ మన దేశానికి వ్యతిరేకంగా, చైనాకు అనుకూలంగా చేసిన భజనకు ఆ పార్టీ క్షమాపణలు చెప్పుకోవాల్సిందే..
చైనా పేరుకు మాత్రమే కమ్యూనిస్టు దేశం.. కానీ అక్కడ ఆచరణలో ఉన్నది మాత్రం పెట్టుబడిదారీ వ్యవస్థ.. ప్రజాస్వామ్యం లేదు.. ఎన్నికలు ఉండవు. ఏక పార్టీ వ్యవస్థ ఉన్న నియంతృత్వ దేశం.. చైనాలో కార్మిక చట్టాలు పేరుకు మాత్రమే.. కనీస వేతనాలు ఇవ్వరు.. కార్మికులు 10-12 గంటల గొడ్డు చాకిరీ చేస్తారు. మన దేశంలో కార్మిక ఉద్యమాలమీదే బతికే కమ్యూనిస్టులు కార్మిక వ్యతిరేక చైనాను ఎలా సమర్ధిస్తున్నారు?
అమెరికా, ఇజ్రాయిల్ దేశాలను కాకుండా గుంట నక్క చైనానే మన దేశం విశ్వసించాలని సీపీఎం నాయకులు భావిస్తున్నారా?.. మన దేశ ప్రయోజనాలకు పూర్తి వ్యతిరకేకమైన చైనాను తెలివున్న వాడెవడూ సమర్ధించడు..
చైనాలో కమ్యూనిస్టు పాలన ఏర్పడింది మొదలు నేటి వరకూ మన దేశానికి వ్యతిరేకంగానే పని చేస్తోంది. పంచశీల ఒప్పందానికి తూట్లు పొడచి భారత దేశంపై దండెత్తిన నీతి లేని చరిత్ర ఆ దేశానిది. అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని చెరబట్టడం, తాజాగా డోక్లామ్ లో దురాక్రమణ చరిత్ర లోకానికి తెలియనిది కాదు. అంతే కాదు లద్దాక్, అరుణాచల్ సహా సరిహద్దుల్లో మనతో కయ్యానికి కాలు దువ్వుతోంది చైనా.. బ్రహ్మపుత్ర నది మన దేశంలోకి రాకుండా దారి మళ్లించే ప్రయత్నాలు చేస్తోంది.
మన దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను చేపట్టిన పాకిస్తాన్ కు సిగ్గు లేకుండా మద్దతు ఇస్తూ, వివాదాస్పద ఆక్రమిత కాశ్మీర్ మీదుగా ‘సీపీఈసీ’ కారిడార్ నిర్మిస్తోంది. పాకిస్తాన్ లో ఉంటూ భారత దేశంలో ఉగ్రవాద దాడులను నిర్వహించిన మౌలానా మసూద్ అజర్ ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించే ప్రయత్నాలకు మోకాలడ్డుతోంది. భారత ప్రయోజనాలకు వ్యతిరేకంగా శ్రీలంక, నేపాల్, మాల్దీవ్స్, బంగ్లాదేశ్, మయాన్మార్ దేశాల్లో వ్యాపార, సైనిక స్థావరాలను ఏర్పాటు చేస్తోంది.
1962 చైనా యుద్ద సమయంలో మన దేశంలో కమ్యూనిస్టు పార్టీ సీపీఐ, సీపీఎంగా చీలిపోయింది. ఒకరు రష్యా, మరొక్కరు చైనాకు ఉపగ్రహాలుగా మారారు. చైనా మన దేశంపై దండెత్తడాన్ని సిగ్గు లేకుండా స్వాగతించింది సీపీఎం. నాటి నుంచి నేటి వరకూ సీపీఎం నీతి మారలేదు. తాజాగా ఉత్తర కొరియా నియంత కిమ్ భజనలు కూడా మొదలు పెట్టారు కేరళ సీపీఎం నాయకులు. భారత దేశంలో స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ, ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని అనుభవిస్తూ నియంతృత్వ చైనాను కీర్తించడంలో ఏమైనా అర్థం ఉందా?
అడుగడుగునా భారత దేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న చైనాకు వత్తాసు పలకడం దేశ ద్రోహం కాదా?.. ఇందుకు సీపీఎం పార్టీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పుకోవాలి..

రథ సప్తమి



సకల జీవరాశికి ప్రాణశక్తి, ఉత్తేజాన్ని కలిగించే అధి దేవత సూర్యుడు. కోట్లాది సంవత్సరాలుగా విశ్వమండలానికి వెలుగులు ప్రసాదిస్తున్న సూర్య భగవానుడు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ప్రతిరూపంగా పూజలు అందుకుంటున్నాడు..
మాఘశుద్ద సప్తమి సూర్యభగవానుడు పుట్టిన తిథి. సూర్య గమనం ప్రకారం ఉత్తరాయనం, దక్షిణాయనం అని రెండు విధాలు. ఆషాఢ మాసం నుండి పుష్య మాసం వరకు దక్షిణాయనం. సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభ సూచకముగా రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈరోజు పవిత్రదినముగా భావించి సూర్యున్ని ఆరాధిస్తారు.
రోజులు ఏడు . సూర్యుడి రథం గుర్రాలు ఏడు . సప్తాశ్వారథమారూఢం - రోజులనే గుర్రాలుగా కిరణాల దారులమీద కోట్ల ఏళ్లుగా అలుపెరుగని రథం మీద ఆగని , ఆగకూడని ప్రయాణం సూర్యుడిది.
మొక్కల పత్రహరిత ప్రాణం పాదుకొల్పడానికి సూర్యుడు కారణం . మన శరీరంలో విటమిన్ లు ఏర్పడి ఎముకలు నిలబడడానికి కారణం సూర్యుడు . నీరు ఆవిరి అయి మేఘం ఏర్పడడానికి కారణం సూర్యుడు . నానా మురికి ఎండి చెత్త తగ్గడానికి కారణం సూర్యుడు . కుళ్ళినవి అలాగే మిగలకుండా వాడిపోయేలా కావడానికి కారణం సూర్యుడు.
సూర్యుడు అసాధారణ పండితుడు . లెక్కల ఉపాధ్యాయుడు . అపరిమిత శక్తి ప్రదాత . అపరిమిత వేడితో తను రగిలిపోతూ - లోకాలకు వెలుగులు పంచే త్యాగి . అంతులేని వెలుగులు విరజిమ్మే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ
(24.01.2018)

నిస్సుగ్గు ఉల్లంఘన


గంపెడు మందిని కనుడు కాదు.. గుప్పెడు బుద్ది కూడా ఉండాలి.. ఈ ద్విచక్ర వాహనదారున్ని చూడండి.. హెల్మెట్ లేదు.. భార్య, ముగ్గురు పిల్లలు.. పైగా దర్జాగా సిగ్నల్ జంప్.. చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ కింద ఇటీవల కనిపించిన దృశ్యం..
(22.01.2018)

కేజ్రీ స్వయంకృతం


ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు ఉంది కేజ్రీవాల్ వ్యవహారం. రాజ్యాంగ విరుద్ధంగా పార్లమెంటరీ కార్యదర్శుల పదవులు సృష్టించి ఎమ్మెల్యేలకు కట్టడం ఎందుకు? ఎన్నికల సంఘంతో వారిపై వేటు వేయించుకునుడు ఎందుకు?.. చేజేతులరా నష్టం చేసుకొని ప్రధాని మోదీపై ఏడ్వడం ఎందుకో?
ఇలా చేయి అంటూ మోదీ ఏమన్నా నీకు సలహా ఇచ్చి ఇరికించిండా కేజ్రీ?.. 
(20.01.2018)🤔
(

హజ్ సబ్సిడీ రద్దు సమంజసం



ఏ మతంలో అయినా తీర్థ యాత్రలకు ప్రాధాన్యత ఉంటుంది. భక్తులు ఇష్ట దైవాన్ని దర్శించుకొని మొక్కు చెల్లించుకుంటారు. ఈ యాత్రల కోసం తమ కష్టార్జితం నుంచి కొంత మొత్తం పక్కన పెట్టుకోవడం ఆనవాయితీ..
దురదృష్టవశాత్తు ఈ యాత్రలపై దశాబ్దాల క్రితమే రాజకీయ కన్ను పడింది.. ఆయా వర్గాలను ప్రసన్నులను చేసుకోవడానికి ప్రభుత్వాలు నిధులు ఇవ్వడం మొదలు పెట్టాయి.. ఇందులో భాగమే ముస్లింలకు హజ్ యాత్ర సబ్సిడీ.. కొన్ని రాష్ట్రాల్లో క్రైస్తవులకు జెరూసలేం యాత్ర సబ్సిడీ కూడా మొదలు పెట్టారు.. దీన్ని చూసి మెజారిటీ మతస్తులైన హిందువులు తమ తీర్థ యాత్రలకు ప్రభుత్వాలు సబ్సిడీలు ఇవ్వకపోగా, పన్నులు వేయడానికి పలు సందర్భాల్లో ప్రస్థావించారు.. 
తాజాగా కేంద్ర ప్రభుత్వం హజ్ యాత్ర సబ్సిడీ నిలిపివేయడం ఆహ్వానించదగిన పరిణామం. నిజానికి ఈ సబ్సిడీ ఇస్లాం వ్యతిరేకం అని గతంలో ఆ మతానికి చెందిన ప్రముఖులు, ఎంపీలు కూడా స్పష్టం చేశారు.. కష్టపడి సంపాదించిన సొమ్ముతోనే యాత్ర చేయాలి, తప్ప ఇతరుల దాయాదక్షిణ్యాల సొత్తుతో హజ్ వెళ్లొద్దని వారి వాదన..
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హిందూ మత ఉత్సవాలు, జాతరలు, కుంభమేళాలకు డబ్బు ఖర్చు చేయడాన్ని కొందరు మేతావులు తప్పు పడుతున్నారు.. అయితే ఇక్కడ ఒక అంశాన్ని గ్రహించాలి.. ఈ యాత్రలకు పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజలకు సౌకర్యాలు, భద్రత కల్పించడం ప్రభుత్వ విధి.. ఏ మతాలకు సంబంధించిన ఉత్సవాలు అయినా ప్రభుత్వాలపై ఈ బాధ్యత ఉంటుంది.
హజ్ యాత్ర సబ్సిడీ నిలిపి వేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఏటా రూ.700 కోట్ల రూపాయలు ఆదా అవుతుంది.. ఈ సొమ్మును ముస్లిం బాలిక విద్యపై ఖర్చు చేయడం సముచిత నిర్ణయమే..
(17.01.2018)

ఇది న్యాయమేనా?



ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అని మనం చెప్పుకుంటాం.. కానీ దురదృష్టవశాత్తు తాజా పరిణామాలు మన ప్రజాస్వామ్యానికే మచ్చ తెచ్చే విధంగా ఉన్నాయి..
ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల పాత్రను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ మూడు వ్యవస్థలు దేని పని అది సక్రమంగా పని చేస్తేనే వ్యవస్థ విజయవంతంగా సాగి ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తారు.. ఈ విషయాలు అన్నీ మనం చిన్నప్పుడే స్కూలు పాఠాల్లో చదువుకొని ఉంటాం..
శాసన, న్యాయ వ్యవస్థల ఘర్షణ కొత్తేమీ కాదు. మన రాజ్యాంగం న్యాయ వ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తిని కట్టబెట్టింది.. ఇందులో ప్రభుత్వాల జోక్యాన్ని పరిమితం చేసింది..
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు న్యాయ వ్యవస్థ తమకు అండగా ఉండాలని కోరుకోవడం సహజం. ప్రభుత్వ పెత్తనాన్ని న్యాయ వ్యవస్థ ఒప్పుకోదు.. ఇది మంచిదే.. 
ఇటీవలి కొన్ని పరిణామాలు గమనిస్తే కోర్టులు పరిధిని మించి క్రియాశీలకంగా పని చేస్తున్నాయా అనిపిస్తుంది.. పలు సందర్భాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వడం, విధానాలు, చర్యలను తప్పు పట్టడం చూస్తున్నాం.. 
ఇలాంటి జోక్యం ప్రజలకు మేలు చేసేదిగా ఉంటే ఆహ్వానించవచ్చు.. కానీ ప్రతి విషయంలో బెత్తం పట్టిన మాస్టారు మాదిరిగా ఉంటే ఇబ్బందిగానే ఉంటుంది.. ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా అనిపిస్తోంది.. సుప్రీం కోర్టు న్యాయమూర్తుల నియామకంలో ప్రభుత్వ జోక్యం వద్దంటున్నారు.. సరే మరి వారు వేసుకున్న కొలీజియం ఏమి చేస్తోంది? జడ్జీల నియామకాల్లో జాప్యం కారణంగ ఎన్నో కీలకమైన కేసులు పెండింగులో పడిపోయాయి. 
ఇక అసలు విషయానికి వద్దాం..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వ్యతిరేకంగా నాలుగు న్యాయమూర్తులు గళం ఎత్తారు.. ఇక్కడ నేను సీజేను కానీ తిరుగుబాటు జడ్జీలను కానీ సమర్ధించడం లేదు.. వ్యతిరేకించడం లేదు.. వారి వెనుక ఎవరు ఉన్నారు?.. ఎందుకు ఈ పని చేయిస్తున్నారు అనేది కూడా చర్చించడం లేదు.. కానీ వీరు మీడియాకు ఎక్కి దేశ సర్వోత్తమ న్యాయస్థాన ప్రతిష్టను మాత్రం మంటకలిపారు.. వీరి టార్గెట్ ప్రధాన న్యాయమూర్తి.. ఈ వ్యవహారంలో తమకూ సమిష్టి బాధ్యత ఉందని గుర్తించడంలో పూర్తిగా విఫలం అయ్యారు.. ప్రధాన న్యాయమూర్తి కూడా పట్టు విడుపులతో వ్యవహరించాల్సింది..
అంతా అయిపోయాక ఆకులు పట్టుకున్న చందాన వీధిన పడ్డ వ్యవహారాన్ని అంతర్గతంగా పరిష్కరించుకోవాలనే ప్రతిపాదన మరీ విచిత్రం.. వీధిన పడి పరువు తీసుకున్న తర్వాత, దేశ ప్రజల దృష్టిలో పలచన అయ్యాక ఎన్ని రాజీలు, సర్దుబాట్లు చేసుకున్నా ఫలితం ఏముంటుంది?
(15.01.2018)

కనిమొళి మతి చెడిందా?

డీఎంకే అధినేత కరుణానిధి కూతురు కనిమొళి తిరుపతి వెంకటేశ్వర స్వామిపై చేసిన వ్యాఖ్యలు నాకు వింతగా ఏమీ అనిపించలేదు, కొత్తగా ఆగ్రహం కూడా కలగలేదు..

రాక్షసులకు ఎలాగూ దేవతలు అంటే గిట్టదు.. ఎప్పుడూ ద్వేషిస్తుంటారు.. పాపం పండిన తర్వాత ఫలితం అనుభవిస్తారు.. ఇది పురాణాల్లో మనం చూసిన సత్యమే కదా.. వెంకన్న స్వామితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో మన తెలుగు వారికి కొత్తగా ఎవరూ గుర్తు చేయాల్సిన అవసరం లేదు అనుకుంటా..


ద్రవిడ - నాస్తిక వాదాలు అవిభక్త కవల పిల్లల్లాంటివి.. తమిళనాట ఈ సంకుచిత వాద సిద్ధంతకర్త పెరియర్ రామస్వామి నాయకర్.. ఇక్కడ ఆయన గురుంచి చెప్పుకోవడం అప్రస్తుతం.. కానీ కమ్యూనిస్టు పార్టీ లాగే చీలికలు పేలికలు అయిన ద్రవిడ పార్టీల నాయకులంతా తామే అసలైన పెరియార్ వారసులం అంటూ చెప్పుతున్నారు. ద్రవిడ వాదం ముసుగులో వారు చేస్తున్న అరాచకాలను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు..
ఈ ద్రవిడ పార్టీలకు పెద్దన్న డీఎంకె.. దీనికి నాయకత్వం వహిస్తున్న కరుణానిధి డీఎంకెను ఏనాడో కుటుంబ పార్టీగా మార్చేశాడు. అవకాశవాద, ఊసరవెల్లి రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ ఈ పెద్దాయన.. అవకాశాన్ని బట్టి యూపీఏ, ఎన్డీఏ కూటమిల మధ్య దోబూచులాట ఆయన విధానం.. రామసేతు విషయంలో రాముడు ఏ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదివాడు అని ఎక్కసెక్కాలు ఆడాడు ఈ గడసరి ముసలి..
కనిమొళి ఈరోజున తానో అస్తికురాలిని అని ఫోజు కొడుతోంది.. కానీ ఇంట్లో మాత్రం పూజలు, పునస్కారాలు చేస్తుంది.. కరుణానిధి అనారోగ్యంతో ఉన్నప్పుడు, కనిమొళి 2జీ స్కామ్ లో ఇరుక్కొని జైలుకు పోయినప్పుడు వారి కుటుంబ సభ్యులు గుడులు, గోపురాలు తిరగడం వాస్తవం కాదా?
కరుణానిధి కుటుంబం గతంలో శ్రీవారిని దర్శించుకుకోవడం వాస్తవం కాదా?.. వేదపండితులు ఆయనను ఆశీర్వదించడం ఏ నాస్తికవాదం?.
కరుణానిధి కుటుంబ పూర్వీకులు ఒకప్పుడు తెలుగు నేల నుంచి వలస పోయిన వారే.. కొత్త మతం పుచ్చుకున్న వాడికి ఊపు ఎక్కువ అన్నట్లు ద్రావిడవాదం (తమిళ్ పైత్యం) వంట పట్టించుకున్నారు వీరు.. హిందీ, సంస్కృత భాషలు అంటే ద్వేషం.. మరి 'కరుణానిధి' అనే అందమైన పేరు ఏ భాషదో?..
ఇంతకీ కరుణానిధి కుటుంబం అవలంభిస్తున్నది ద్రవిడవాదమా?, నాస్తికవాదమా?.. నాకు తెలిసి పచ్చి అవకాశవాదం..

(12.01.2018)

యువతకు స్వామీజీ సందేశం

ఆయన జీవించింది కేవలం 39 ఏళ్లు మాత్రమే.. కానీ భారత జాతికి శాశ్వత మార్గదర్శిగా నిలిచారు.. దేశ ప్రజలకు, ముఖ్యంగా యువతలో స్పూర్తిని నింపే సందేశాన్ని ఆయన కొద్ది సంవత్సరాల జీవిత కాలంలోనే ఇచ్చారు.. అత్యంత ప్రాచీన సాంస్కృతిక ఆధ్యాత్మిక వైభవం ఉన్న భారత దేశం విశ్వగురువు అని ప్రపంచానికి చాటి చెప్పారాయన.. ఆ మహనీయుడే స్వామి వివేకానంద..
ఆంగ్ల కాలమానం ప్రకారం జనవరి 12వ తేదీ స్వామీజీ జన్మదినం.. ఈ శుభ సందర్భంలో వారి సందేశాన్ని సంక్షిప్తంగా గుర్తు చేసుకుందాం..

‘లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకూ విశ్రమించకండి.. లేవండి! మేల్కొనండి!.. మిమ్మల్ని మీరు మేల్కొల్పుకొని ఇతరులను మేల్కొల్పండి! ఇకపై నిద్రించకండి!.. మీరు మరణించే లోపే జీవిత పరమావిధిని సాధించండి..
లేవండి!మేల్కొనండి!.. గమ్యం చేరేవరకూ ఎక్కడా నిలవకండి.. ఎప్పటికీ జాగృతంగానే ఉండండి.. బలమే జీవితం, బలహీనతే మరణం.. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్ప మనసున్న యువత ఈ దేశానికి కావాలి..’
‘ఆధునిక యువతపైనే నాకు విశ్వాసం ఉంది.. నేను నిర్మించిన ఆదర్శాన్ని దేశ మంతా వ్యాప్తి చేసేది యువతే.. యువత ముందు బలిష్టులు, జవ సంపన్నులు, ఆత్మ విశ్వాసుల, రుజువర్తనులు కావాలి.. ఇలాంటి వారు వంద మంది ఉన్నా చాలు,ఈ ప్రపంచాన్నే మార్చేయ వచ్చు..’
‘మీరంతా మహత్కార్యాలు సాధించడానికే జీవించామని విశ్వసించండి.. బలం, శక్తి మీలోనే ఉన్నాయని గుర్తుంచుకోండి.. ఎంతో విశ్వాసంతో లేచి నిలబడండి.. ధైర్యంగా బాధ్యతను మీ భుజ స్కంధాలపై వేసుకోండి.. భవిష్యత్తుకు మీరే బాధ్యులమని తెలుసుకోండి.. ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడకండి.. క్రమంగా ఘనమైన ఫలితాలు వస్తాయి.. సాహసంగా పని చేయండి..’
‘తమ సర్వస్వాన్ని త్యాగం చేసి, దేశం కోసం తమ జీవితాలను ఆహుతి చేసే యువత మనకు కొందరు కావాలి.. దేశ ప్రజలను ఉద్దరించే ఏకైక లక్ష్యంతో పని చేసే యవతను గుర్తించి పని చేయాలి.. త్యాగం,ఉత్సాహాలతో వారిని జాగృతం చేసి ఐక్యం చేయాలి.. మన స్థితికి మనమే బాధ్యులం.. లక్ష్యాన్ని సాధించే శక్తి, ఆపై శక్తి మనకే ఉంది..’
‘విజయాన్ని సాధించడానికి కావలసినవి మూడు. అవి.. పవిత్ర, సహనం, పట్టుదల. వీటన్నింటినీ మించి కావలసింది ప్రేమ.. మీరు నిజంగా నా బిడ్డలే అయితే దేనికీ భయపడరు.. ఎక్కడా ఆగిపోరు.. మీరు సింహాల్లా ఉండాలి.. మన భారత దేశాన్నే కాక,ప్రపంచాన్నే జాగృతం చేయాల్సి ఉంది. ఉద్యమ నిర్వహణలో అవసరమైతే అగ్నిలో దూకడానికైనా సంసిద్ధంగా ఉండాలి..’
భారత దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం జాతి పునర్ నిర్మాణమే మార్గమని సూచించారు స్వామీ వివేకానంద.. ధర్మాన్ని పాటించమన్నారు.. స్వధర్మం తల్లివంటిదని, పర ధర్మం సవతి వంటిదని అన్నారు.. ఏ విధంగా చూసినా హిందుత్వమే అన్ని ధర్మాలకన్నా గొప్పదని చికాగోలో జరిగిన ప్రపంచ మతాల సదస్సులో చాటి చెప్పారు వివేకానంద.. ప్రపంచానికి భారత దేశం ఆధ్యాత్మిక నాయకత్వం వహించాలన్నారు..
నేడు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలు మర్కెట్లో కుప్పలు తెప్పలుగా దొరుకుతున్నాయి.. కానీ స్థూలంగా పరిశీలించి చూడండి.. ఎందరు ఎన్ని విధాలుగా చెప్పినా సారాంశం ఒకటే.. కానీ వందేళ్ల క్రితమే వ్యక్తి నిర్మాణం గురుంచి స్వామీజీ చక్కని బోధనలు చేశారు.. ఆయన బోధనలు చదివితే చాలు,మరే వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు.. యువతకు ఆశాజ్యోతి, మార్గదర్శి అయిన స్వామీ వివేకాంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నారు..
స్వామీ వివేకానందను గుర్తు తెచ్చుకుందాం.. ఆయన చూపిన మార్గాన్ని అనుసరిద్దాం.. ఈ దేశాన్ని పునర్నిర్మిద్దాం..

(12.01.2018)

వీటిని బ్యాన్ చేయగలరా?


'జల్లికట్టు నిషేధం..'
'ఓకే సర్..'
'కోడి పందాలు కూడా వద్దు..'
'సరే సరే..'
'జాతరల్లో జంతు బలుల నిషేధం..'
'ఎందుకు సర్?'
'ఇవన్నీ జీవ హింసయ్యా!.. ఆ మాత్రం తెలీదూ బుద్ధూ..'
'అయితే ఓ పని చేద్దాం సర్.. అన్ని మతాల్లో జీవ హింసకు కారణం అవుతున్న జంతు బలులను నిషేదిద్దామా?..'
'ఓరి మతోన్మాదీ.. ఇదేం ఫిట్టింగ్ రా..'
...బతికింది గొర్రె.. సెక్యులరిజం జిందాబాద్!..

(11.01.2018)

పంచ్ పంచ్..

31.01.2018
సంపూర్ణ'చంద్ర'గ్రహణమా?.. 2014లో పట్టిన గ్రహణమే ఇంకా వీడలేదు కదా?

3101.2018
ఇంటి దొంగలు అంతర్గత శత్రువులు చాలా ప్రమాదకరం

29.01.2018
ఛాయ్, సమోసాలు అమ్మేవాళ్లంటే
చిన్న చూపు ఎందుకు వంకరయ్యర్, చీడ అంబరం?

27.01.2018
*సక్సెస్ మంత్ర*
1.సినిమా తీయి
2.పుకార్లు లేపు
3. లొల్లి చేయించు
4.రిటర్న్స్ గ్యారంటీ

26.01.2018
సెన్సార్ కట్స్ పడి స్కెలిటన్ అయ్యింది పద్మావత్..
సెన్సార్ భయంతో ముందే youtubeలో దూరింది GST

25.01.2018
మహోన్నత దర్శకుడు దిగజారిపోయాడు..
నీలి చిత్రం తీసి ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకునే స్థాయికి..
ఇంతకీ ఆయన కుటుంబం దీన్ని చూస్తుందా?

23.01.2018
అక్కడా ఉంటా ఇక్కడా ఉంటా అంటే కుదరదు..
ఎక్కడో ఒక దగ్గరే ఉండాలి.. లేకుంటే అక్కడా ఇక్కడా లేకుండా పోతాం..

21.01.2018
'పద్మావత్' ముద్దు.. 'GST' వద్దు అట..
భావ ప్రకటన స్వేచ్ఛలో మీ ద్వంద్వ వైఖరి తగలడ
నేనైతే రెండూ వద్దంటున్నా..

20.01.2018
మేతావులతో మేవానీ భేటీ.. ఎందుకో

19.01.2018
🐺🦊🐺🦊
తో
తోడేళ్లు, గుంట నక్కల రహస్య భేటీ..
కలిసికట్టుగా పని చేయాలని తీర్మాణం
కొడుకో జరభద్రం..

17.01.2018
ఇంతకీ ఆ నలుగురు ఇప్పుడు మొహం ఎక్కడ పెట్టుకుంటారు?

16.01.2018
సొంతూరు పోవడం సంగతి సరే
సంక్రాంతి పండుగ ప్రారంభించి కూడా ఆయన గారేనా
జస్ట్ క్లారిటీ కోసం అంతే..

12.01.2018
నన్ను అడగకండి..
నేను సినీ క్రిటిక్ కాదు..
అజ్నాతవాసి, జైసింహ
సమీక్షలు కోరిన వారికి వివరణ అంతే

09.01.2018
హైందవ ధర్మ సంస్థ నేతృత్వానికి
అన్యమత విశ్వాసం అర్హతనా

08.01.2018
నిన్నెవడూ గుర్తిస్తలేడా?
facebook తెర్వు..
సెలబ్రిటీల మీద పడు..
ఇగ సూస్కో నీ ఫాలోయింగ్..

బీజేపీకి ఓటు పడితే..


కిమ్: నా టేబుల్ మీద న్యూక్లియర్ బటన్ ఉంది తెలుసా?
ట్రంప్: నా టేబుల్ మీద అంత కన్నా పెద్ద న్యూక్లియర్ బటన్ ఉంది..
పప్పు: ఆ బటన్ నొక్కకండి.. బీజేపీకి ఓటు పడుతుంది ఏమో?..   (07.01.2018)
(😀

యాజులు గార్కి అభినందనలు

ఆప్త మిత్రులు, నా పాత కొలీగ్ సీనియర్ జర్నలిస్ట్ చావలి నరసింహ సర్వతోముఖ యాజులు (యాజులు) తెలంగాణ మీడియా అకాడమి నుంచి అరుణ్ సాగర్ స్మారక పురస్కారం అందుకోవడం ఆనందాన్ని కలిగించింది.. వారికి నాఅభినందనలు.. 🌹🌻(03.01.2018)🌷

Monday, January 1, 2018

క్యాలండర్ మారిన వేళ..

పాతది పోయి కొత్తదొచ్చింది
ఏటా మారే క్యాలండరే కదా?
మరి ఎందుకింత హడావుడి?
సంబరాల సందర్భమిదేనా?
కాలమెప్పుడూ కరిగిపోయేదే
మార్పు క్యాలండర్లో కాదు
ఆలోచనలు, పనుల్లో రావాలి
అది మన చేతల్లోనే ఉంది
మంచిని పంచి బంధాన్ని పెంచు
అందరిలో వెలుగు రేఖలు నింపు
ఈ మార్పుతో ప్రారంభిద్దాం
మన కొత్త దినచర్యను.. ✒
----- మీ క్రాంతి దేవ్ మిత్ర 🙏🏽