Friday, October 31, 2014

ఇదేం వైఖరి బుఖారీ..

మోదీకి నై.. షరీఫ్ కు జై.. ఇదండీ మన ఢిల్లీ జామా మసీదు షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ విధానం.. తన తనయుడు షాబన్ కు నూతన ఇమాం బాధ్యతలు అప్పగిస్తున్న సందర్భంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ను ఆహ్వానించిన బుఖారీ సాబ్, భారత ప్రధాని నరేంద్ర మోదీని మాత్రం ఆహ్వనించడట.. ఎందుకంటే గజరాత్ అల్లర్లకుె మోదీ క్షమాపణ చెప్పలేదట..ఇదేం లాజిక్కో మరి.. మోదీ ముస్లిం వ్యతిరేకట..
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భారతీయ ముస్లింల దేశభక్తిపై ప్రధాని మోదీ ఇచ్చిన కితాబు అందరికీ గుర్తుండే ఉంటుంది.. మరి మోదీ ముస్లిం వ్యతిరేకని ఎలా చెప్పగలడీ బుఖారీ? భారతీయులంతా ఓట్లేసేనే కదా నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారు.. ముస్లింలు అత్యధిక సంఖ్యలో ఉన్న నియోజకవర్గాల్లో కూడా బీజేపీకి ఓట్లు పడ్డాయి.. మరి మోదీని వారు ఆమోదించినట్లా? తిరస్కరించినట్లా?
ఈ బేఖారీ బుఖారీ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. కొద్ది కాలం క్రితం ఢిల్లీకి వచ్చిన ఇమాం బుఖారీ దగ్గరుండీ మరీ జామా మసీదును చూపించారు.. తినేది భారత సొమ్ము.. పాడేది.... జాతీయవాద ముస్లింలు ఇలాంటి మత నాయకులు ద్వంద్వ వైఖరిని గమనిస్తూనే ఉన్నారు..

వల్లభభాయి తొలి ప్రధాని అయ్యి ఉంటే?..

సర్దార్ వల్లభభాయ్ పటేల్ స్వతంత్ర భారత తొలి ప్రధానమంత్రి అయ్యి ఉంటే?.. దేశ చరిత్ర గతి ఎలా ఉండేది?
ఈ ప్రశ్న ఈ మధ్య కాలంలో తరచూ వినిపిస్తోంది.. నిజమే సర్దార్ పటేల్ మన దేశానికి తొలి ప్రధాని అయి ఉంటే బాగుండేది.. ప్రస్తుతం మన దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు ఆనాడే ఫుల్ స్టాప్ పడి ఉండేది..
బ్రిటిష్ వారు స్వాతంత్ర్యం ఇచ్చే నెపంలో దేశాన్ని విభజించారు.. పాకిస్తాన్ అనే శాశ్వత చిచ్చు రగిలించారు.. 552 స్వదేశీ సంస్థానాలకు ఇండియా లేదా పాకిస్తాన్లో చేరవచ్చు లేదా స్వతంత్రంగా ఉండొచ్చు అనే మెలిక పెట్టి వెళ్లారు.. ఈ సంస్థానాల కారణంగా ఎప్పటికీ సమస్యలు తప్పదని గ్రహించారు తొలి ఉప ప్రధాని, హోంమంత్రి సర్ధార్ వల్లభభాయి పటేల్.. సంస్థానాధీశులందరినీ ఒప్పించి భారత దేశంలో సంపూర్ణంగా విలీనం చేశారు.. అయితే హైదరాబాద్, జునాఘడ్, జమ్మూ కాశ్మీర్ సంస్థానాల సంగతి తేలలేదు..  ఈ దశలో పటేల్ కఠిన నిర్ణయం తీసుకున్నారు.. హైదరాబాద్, జునాఘడ్లను దండోపాయంతో దారికి తెచ్చారు.. అయితే కాశ్మీర్ విషయంలో ప్రధాని నెహ్రూ తానే స్వయంగా జోక్యం చేసుకున్నాడు.. అందుకే అది నేటికీ ఎటూ తేలకుండా రావణ కాష్టంలా రగులుతూ ఉంది..
కాశ్మీర్ సమస్యను నెహ్రూ ఐక్యరాజ్య సమితికి నివేదించడాన్ని వల్లభభాయి పటేల్ తప్పు పట్టారు. అలాగే పాకిస్తాన్ కు 55 కోట్ల రూపాయలు ఇవ్వాలనే నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకించారు. సర్దార్ పటేల్ కేవలం 40 నెలలు మాత్రమే ఉప ప్రదాని పదవిలో ఉన్నారు.. ఆయన ఇంకొన్ని సంవత్సరాలు బతికి ఉంటే టిబెట్ సమస్య, చైనా యుద్దం వచ్చేవి కావని చెప్పక తప్పదు.. పాకిస్తాన్, చైనా దురాక్రమణలకు కచ్చితంగా అడ్డుకట్ట వేసి ఉండేవారు..  ప్రధాని నెహ్రూ తొందర పాటు  నిర్ణయాలకు పటేల్ ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేస్తూ వచ్చారు..  వారి మరణం తర్వాత నెహ్రూకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి.. ఎన్నో తప్పటడుగులు వేస్తూ వచ్చారు..
వాస్తవానికి దేశ విభజన తర్వాత సర్ధార్ పటేల్ ప్రధానమంత్రి పదవి చేపట్టాలని దేశ ప్రజలంతా కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీలోని మెజారిటీ నాయకులు, సభ్యుల అభిమతం కూడా అదే.. కానీ మహాత్మా గాంధీ తన ప్రియ శిష్యుడు నెహ్రూ వైపు మొగ్గు చూపించారు.. ఉప ప్రధానిగా, హోంమంత్రిగా పటేల్ బాధ్యతలు చేపట్టిన పటేల్ తానేమిటో ఆచరణలో చూపించారు.. దేశ సమగ్రతకు బాటలు వేశారు.. వల్లభభాయి పటేల్ తొలి ప్రధాని అయి ఉంటే మన దేశ చరిత్ర ఇప్పుడున్నంత అధ్వాన్న స్థితిలో మాత్రం ఉండేది కాదు.. పటేల్ తన ధృడ నిర్ణయాలతో చక్కని బాట వేసేవారు.. నెహ్రూలా తొందర పాటు నిర్ణయాలు తీసుకునేవారు కాదు.. అందుకే అన్ని ఉక్కు మనిషి అన్నారు..

అక్టోబర్ 31న సర్ధార్ వల్లభభాయి పటేల్ జయంతిని భారత ప్రభుత్వం రాష్ట్రీయ ఏక్తా దివస్ గా ప్రకటించింది.. దేశ సమగ్రత, ఐక్యత, భద్రత కోసం చిత్తశుద్దితో పని చేస్తూ పటేల్ ఆశయాల సాధన కోసం మనమంతా ప్రతిన బూనాల్సిన తరుణమిది..

Monday, October 27, 2014

ఎబోలా మరణ మృదంగం..

ఎబోలా.. ఈ పేరు వింటేనే ప్రపంచం వణికిపోతోంది.. ముఖ్యంగా అగ్ర దేశాలు..
పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ఎబోలా సోకి జనం పిట్టల్లా రాలిపోతుంటే అగ్ర దేశాలు పట్టించుకోలేదు.. ఆ అంటరాని పేద దేశాల్లో జనం చస్తే ఎంత, బతికితే ఎంత అని నిర్లక్ష్యం చేశాయి.. కానీ ఈ ప్రాణాంతక రక్కసి తమ గడప దాకా వచ్చేసరి హడలిపోతున్నాయి.. అర్జంటుగా మందును తెచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టాయి.. వాస్తవానికి ఈ ఎబోలా వైరస్ 1976లోనే బయటపడింది.. దీనిపై పరిశోధనలు చేసిన అమెరికా కెనడా దేశాల శాస్త్రవేత్తలు మందును కూడా కనిపెట్టామని ప్రకటించారు.. ఆ తర్వాత దాన్ని విస్మరించారు.. అప్పట్లో అంత అవసరం లేదని భావించి తదుపరి పరిశోధనలు, మందుల ఉత్పత్తికి కొంత నిర్లక్ష్యం  ప్రదర్శించారు.. ఫలితంగా ఇప్పడు ఈ మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది.
పశ్చిమాఫ్రికాలోని గినియాలో మొదలైన మరణ మృదంగం అన్ని దేశాలకు విస్తరిస్తోంది.. ఇప్పటి వరకూ 10,141 ఎబోలా వ్యాధి కేసులు నమోదైతే 4,922 మంది మృత్యువాత పడ్డారు.. ఈ ఏడాది మార్చిలో గినియాలో తొలి కేసు అధికారికంగా నమోదైంది.. కానీ అప్పటికే ఆలస్యం అయింది.. పొరుగునే ఉన్న లైబీరియా, సియెర్రా లియోన్, నైజీరియా దేశాలకుఈ వ్యాధి విస్తరించింది.. ఆఫ్రికా అడవుల్లోని గొరిల్లాలు, చింపాంజీలు, కోతులు, దుప్పులు, గబ్బిలాల నుండి ఈ వ్యాధి మొదలైందని తేలింది.. చనిపోయిన ఈ వన్యప్రాణులను పూడ్చే క్రమంలో వాటి రక్తం, ఇతర స్రావాల నుండి మనుషులకు వైరస్ అంటుకుంది.. ఈ దేశాల్లో గొరిల్లాలు, గబ్బిలాలను తినే అలవాటు కూడా మరో కారణమని భావిస్తున్నారు..
ఎబోలాతో మరణించిన వారిని అంత్యక్రియలు చేసే బంధువులకు, చికిత్స చేసే వైద్య సిబ్బందికి సైతం వైరస్ సోకడంతో దీని తీవ్రత అర్థమెంది.. ఎబోలా నివారణకు మందును అందుబాటులోకి తేవడానికి మరో నాలుగైదు నెలలు పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంఛనా వేస్తోంది,, కానీ డిసెంబర్లోగా మందు అందుబాటులోకి రాకపోతే ఒక్క లైబీరియాలోనే 90, 000 మంది మరణిస్తారని అంఛనా వేస్తున్నారు..  అమెరికా, యూరోప్ దేశాలకు క్రమంగా విస్తరిస్తున్న ఈ వ్యాధి, ఇప్పటి వరకైతే మన దేశానికి చేరినట్లు అధికారికంగా నిర్ధారణ కాలేదు.. కానీ ఈ వ్యాధి తీవ్రంగా ఉన్న దేశాల్లో భారతీయులు కూడా ఉండటంతో మన ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది..
ఎబోలా వైరస్ సోకిన వ్యక్తి రక్తపీడనం పడిపోయి, శరీర అవయవాల పని తీరు దెబ్బతిని మరణిస్తాడు..  వ్యాధి సోకినట్లు బయటపడటానికి కనీసం వారం రోజులు పడుతుంది.. ఈలోగా జరగాల్సిన ముప్పు జరిగిపోతుంది.. జ్వరం, వాంతులు, విరేచనాలు, వికారం, కడుపు నొప్పి, వెన్నునొప్పి, గొంతు తడ ఆరడం, శరీరంపై దద్దుర్లు ఈ వ్యాధి ప్రాథమిక లక్షణాలు.. వ్యాధి తీవ్రమైతే కాలేయం, మూత్ర పిండాలు దెబ్బతినడంతో  పాటు శరీరంలోపల, బయట తీవ్రమైన రక్త స్రావాలు మొదలవుతాయి.. సత్వర చికిత్స అందితేనే మనిషి బతికి బట్టకడతాడు.. లేకపోతే నూటికి 90 శాతం మరణం తప్పదు..

ఎబాలా వ్యాధిపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదకరమే.. బీ అలర్ట్..

Friday, October 24, 2014

ఆర్.ఎస్.ఎస్. క్షేత్ర సంఘచాలక్ టి.వి.దేశ్ ముఖ్ కన్నుమూత

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల క్షేత్ర  సంఘచాలక్ గా శ్రీ టి.వి.దేశ్ ముఖ్ 23 అక్టోబర్, 2014 - దీపావళి పండుగ నాడు హైదరాబాద్ లో స్వర్గస్తులయ్యారు. స్వర్గీయ దేశ్ ముఖ్ గడచిన కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. వారు ఈ రోజు కన్నుమూశారు. 
స్వర్గీయ టి.వి.దేశ్ ముఖ్ బాల్యం నుంచే స్వయంసేవక్ గా ఉన్నారు. వారి మేనమామగారు శ్రీ సీతారామారావు గారు నల్గొండ జిల్లాలో ఖండ సంఘచాలక్ గా పని చేశారు. వారి ద్వారా  టి.వి.దేశ్ ముఖ్ గారు సంఘ పరిచయం లోకి వచ్చారు.  స్వయంసేవక్ అయిన  అనంతరం నుండి నేటి వరకు శ్రీ టి.వి.దేశ్ ముఖ్ సంఘ పనిలో కొనసాగుతూనే ఉన్నారు. సంఘ కార్యకర్తగా క్రియాశీలంగా ఉంటూ అంచెలంచెలుగా ఎదిగారు. స్వర్గీయ దేశ్ ముఖ్ 1994 నుండి 2012 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చమి ప్రాంతానికి (పశ్చిమ ఆంధ్రప్రదేశ్ ప్రాంతం) ప్రాంత సంఘచాలక్ గా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం 2012 మార్చిలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాటి ఆంధ్ర ప్రదేశ్ - కర్నాటక రాష్ట్రాల క్షేత్ర  సంఘచాలక్ గా ఎన్నికయ్యారు. 
ప్రాంత సంఘచాలక్ గా, క్షేత్ర సంఘచాలక్ గా ప్రాంతంలోను, క్షేత్రంలోనూ జరిగిన వివిధ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ స్వయంసేవకులకు చక్కటి మార్గదర్శనం చేశారు. జన జాగరణ ఉద్యమాలలోనూ, వివిధ ప్రకృతి బీభత్సాలలో సంఘం నిర్వహించిన సేవా కార్యక్రమాలలోనూ (కర్నూలు, పాలమూరు లలో వచ్చిన వరదలు మొదలైన వాటి సందర్భాలలో) చురుకుగా పాల్గొని సమర్ధంగా నిర్వహించారు. 
సంఘ కార్యకర్తగానే కాక వివిధ సామాజిక కార్యకలాపాలలో కూడా స్వర్గీయ టి.వి.దేశ్ ముఖ్ క్రియాశీలకంగా పని చేశారు. జాగృతి ప్రకాశాన్ ట్రస్ట్ సభ్యులుగా, శ్రీ సరస్వతి విద్యా పీఠం వ్యవస్థాపక సభ్యులుగా, వైదేహీ ఆశ్రమం నిర్వహణ, ఇంకా అనేక ట్రస్టులలో క్రియాశీలక సభ్యులుగా పని చేశారు, చేస్తున్నారు.

స్వర్గీయ టి.వి.దేశ్ ముఖ్ పూర్తి పేరు తెడ్లపల్లి వెంకట నరసింహరావ్ దేశ్ ముఖ్. పాలమూరు స్వగ్రామం. వారు 1946 జూలై 29 నాడు పాలమూరు జిల్లాలోలని వంగూరు గ్రామంలో జన్మించారు. విద్యాభ్యాసం అనంతరం ప్రచారక్ గా వచ్చి, మూడున్నర సంవత్సరాల పాటు నిజామాబాద్ జిల్లాలోని బోధన లో పని చేశారు. అనంతరం వివాహం చేసుకొని భాగ్యనగరంలోనే స్థిరపడ్డారు. వివాహానంతరం భాగ్యనగర్ దక్షిణ భాగ్ సంఘచాలక్ గా, అనంతరం నేరుగా పశ్చిమాంధ్ర ప్రదేశ్ ప్రాంత సంఘచాలక్ గా ఎన్నికై, నిరంతర క్రియాశీలకంగా ఉంటూ సుదీర్ఘ కాలం పాటు పని చేశారు. ప్రాంత సంఘచాలక్ గా ఈ ప్రాంతంతోనూ, స్వయంసేవకులతోనూ వారికెంతో అనుబంధం ఉంది. 2012 నుండి క్షేత్ర సంఘచాలక్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
వారి మరణం పట్ల ప్రగాఢ సంతాపం, వారి కటుంబానికి సానుభూతి తెలియజేస్తూ.. వారి సేవలను నిరంతరం స్మరించుకుందాం.. (vksts.blogspot.in నుండి)

Thursday, October 23, 2014

దీపావళి శుభాకాంక్షలు..


టపాకాయలు కాలుస్తున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి..

* వీలైనంత దూరంలో ఉండి టపాకాయలు కాల్చండి. టపాకాయలపై ముఖం పెట్టి కాల్చొద్దు.. మొహం కాలడమే కాదు, శాశ్వత అంధత్వానికి గురయ్యే ప్రమాదం ఉంది..
* పొడువైన వెదురు వత్తిని ఉపయోగించి మాత్రమే టపాకాయలు కాల్చండి.. అగర్ బత్తీలను వాడకండి..
* టపాకాయ అంటించిన వెంటనే దూరంగా వెళ్లండి..
* చిచ్చుబుడ్లు, రాకెట్లు, భూచక్రాలు చేతిలో పట్టుకొని కాల్చొద్దు..
* చేతిలో బాంబులు పట్టుకొని అంటించి విసిరివేయడం ప్రమాదకరం.
* ఒకేసారి రెండు మూడు టపాకాయలు కాల్చే ప్రయత్నం చేయకండి.
* టపాకాయల వత్తి సరిగ్గా తెరిచి అంటించండి.. సరిగ్గా పేలని టపాకాయలను వదిలేయండి, మళ్లీ అంటించే ప్రయత్నం చేయకండి..
* చిన్న పిల్లల చేతికి నేరుగా టపాకాయలు ఇవ్వకండి.. దగ్గర ఉండి జాగ్రత్తగా కాల్పించండి..
* ఐదేళ్లలోపు పిల్లలను టపాకాయలకు పూర్తిగా దూరం ఉంచండి..
* చిన్నపిల్లలను ఓ కంట కనిపెట్టుకు ఉండండి..
* పెద్ద శబ్దాలు వచ్చే బాంబులను కాల్చకండి.. ధ్వని, పొగ కాలుష్యాన్ని నివారించండి. రోగులకు, పెద్ద వయసువారికి ఇబ్బంది కలిగించకండి.
* టపాకాయలను వీధుల్లో కాల్చకండి.. తప్పని పరిస్థితుల్లో కాలిస్తే వాహనదారుల రాకపోవకలను గమనించి కాల్చండి..
* అగ్నిప్రమాదాల భారి నుండి కాపాడుకోడానికి బకెట్లలోతగిన నీటిని అందుబాటులో ఉంచండి.. బర్నాల్ వంటి ప్రథమ చికిత్సకు అవసరమైన మందులు అందుబాటులో పెట్టుకోండి..
* దేవతల బొమ్మలు ఉన్న టపాసులను కొనుగోలు చేయకండి.. మన మనోభావాలకు అపచారం కలిగించండి..
* నాణ్యమైన టపాసులకు మాత్రమే కొనుగోలు చేయండి..

* వీలైనంత వరకూ టపాకాయలు కొనుగోలు చేయకపోవడమే చాలా ఉత్తమం.. టపాసులకు అయ్యే ఖర్చును సామాజిక సేవా కార్యక్రమాలకు ఉపయోగించండి.. 

Wednesday, October 22, 2014

సేమ్ టు సేమ్..

రాజకీయాల్లో విదూషక పాత్రలు కరువైపోతున్న తరుణంలో ఇరుగు పొరుగు దేశాలకు మంచి హాస్యగాళ్లు దొరికారు.. మన పప్పూ ఈ మధ్య ఒక బహిరంగ సభలో మోదీని ప్రతిపక్ష నాయకుడు అని సంబోధించాడట.. పాపం ఆయనకు వార్తా పత్రికలు చదివే అలవాటు, టీవీలో వార్తలు చూసే తీరిక లేనట్లున్నాయి.. ఇంకా తామే అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నట్లున్నాడు పాపం.. ఒకవేళ పొరపాటుగా ప్రతిపక్ష నాయకుడు అన్నాడని సరిపెట్టుకున్నా, మోదీ గతంలో ఎప్పుడూ ప్రతిపక్ష నేతగా పని చేసిన దాఖలాలు లేవు.. అన్నట్లు పాపం వారి పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు..
ఇక మన పొరుగున ఉన్న పిల్లకాకి ఎప్పుడు ఏం మట్లాడతాడో ఆయనకే తెలియదట.. తమ దేశానికి క్రిస్టియన్ ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లు ఆ మధ్య ఆయన చేసిన కామెంట్ గగ్గోలు పెట్టించింది.. ఈ మద్య పదే పదే కాశ్మీర్ ను లాక్కుంటాం అని అరుస్తోందా పిల్లకాకి.. ఈ కావురు కేకలను పెద్దగా పట్టించుకోనక్కరలేదంటున్నారు మన పొరుగువారు..
ఎందుకు అంటే మనకు పప్పూ ఎలాగో వారికి ఆ పిల్లకాకి అలాగట.. 

Tuesday, October 21, 2014

లక్ష్మీ బాంబులు వద్దు..

దీపావళి సందర్భంగా లక్ష్మీ పూజలు జరుపుతాం.. సిరి సంపదలు, శుభం చేకూరాలని అమ్మవారిని కోరుకుంటాం.. కానీ దురదృష్టవశాత్తు తెలిసో తెలియకో లక్ష్మీదేవికి మనం అపచారం చేస్తున్నాం.. అది టపాసుల రూపంలో..

లక్ష్మీ బాంబు అందరికీ తెలసే ఉంటుంది.. దాదాపు అన్ని టపాకాయల కంపెనీలు ఈ బ్రాండు టపాసును తయారు చేస్తున్నాయి.. కానీ అమ్మవారి రూపాన్ని మనం టపాకాయ పేరిట పేల్చేస్తున్నాం అనే ఆలోచన ఎవరికీ కలగడం లేదు.. దయచేసి మీ దీపావళి టపాకాయల మెనూలో లక్ష్మీ బాంబును చేర్చకండి.. ఒక లక్ష్మీ బాంబు మాత్రమే కాకుండా అన్ని మతాల దేవతా చిహ్నాలు ఉన్న టపాకాయలను కూడా నిషేదిద్దాం.. మనోభావాలను కాపాడుకుందాం..

పండుగలు జరుపుకోవద్దా?

కొన్ని వికృత ఆలోచనలు ఎలా ఉన్నాయో గమనించండి.. హోలీ జరుపుకోకండి.. రంగులతో కళ్లు చెడిపోతాయి.. వినాయక నిమజ్జనం కారణంగా చెరువులు కాలుష్యం అవుతాయి.. దీపావళి టపాసులతో వాతావరణం కాలుష్యమవుతుంది..  అసలు పండుగలే జరపుకోకుండా ఉంటే.. అంతా బాగుంటుంది కదూ?
మన సంస్కృతిలో ప్రతి పండుగకు, ఉత్సవానికి ఒక పరమార్ధం ఉంది.. ప్రజలు కష్టాలను మరిచి సుఖ సంతోషాలతో గడపాలని మన పూర్వీకులు సంవత్సరం పొడవునా ఉత్సవాలను నిర్ణయించారు.. ఇవన్నీ వ్యక్తిగతంగా, ఇళ్లకే పరిమితం అయినవి కాదు.. అన్నీ సమాజం మొత్తాన్ని కలుపుకొనిపోయేవే.. ఆర్ధికంగా, సామాజికంగా ఏదో ఒక రూపంలో అందరికీ లాభ దాయకమే కానీ నష్టాలేవీ ఉండవు.. మన పెద్దలు సర్వేజనా సుఖినో భవంతు అనే సందేశం ఎందుకు ఇచ్చారో అర్ధం చేసుకున్నారా?
ఏ విషయాన్నయినా చెప్పడానికి ఓ పద్దతి ఉంటుంది.. హోలీ రంగుల విషయంలో జాగ్రత్తలు సూచించవచ్చు.. రసాయన రంగులతో కళ్లకు కలిగే అనర్ధాలను వివరించవచ్చు.. సహజ సిద్దరంగులనే వాడండి అని చెప్పాలి.. కానీ అసలే రంగులే చల్లుకోవద్దంటే ఎలా? అలాగే మట్టితో చేసిన గణపతి విగ్రహాలను ప్రోత్సహించాలి.. కానీ సామూహిక ఊరేగింపులు వద్దు, చెరువుల్లో వేయకుండా మీ ఇంట్లో బకెట్లోనే నిమజ్జనం చేసుకోండి.. అంటే అర్థం ఏమిటి?  అసలు ఉత్సవాలపైనే ఏదో కుట్ర జరుగుతోందని సంకేతాలు ఇచ్చినట్లా కాదా?.. కాలుష్యానికి కేవలం విగ్రహాలే కారణమనే గురవిందలు ఎక్కువయ్యారు.. వారి కళ్ల ముందు ఎన్నిరకాల కాలుష్యాలు కనిపిస్తున్నా పట్టవు..
ఇక దీపావళి విషయానికి వద్దాం.. ఉత్తరాంధ్ర తుఫాను విషాదం కారణంగా టపాకాయలు కాల్చవద్దు అంటే అర్థం చేసుకోవచ్చు.. కానీ కొందరు వ్యక్తులు అసలు దీపావళి పండుగే వద్దు అంటూ ప్రచారం చేస్తున్నారు.. దీపావళి అంటేనే వెలుగులు నింపే పండుగ.. మన జీవితాలు కూడా వెలగాలి అనే శుభ సందేశాన్ని ఇస్తుంది ఈ పండుగ.. ధ్వని, వాయు కాలుష్యాన్ని సృష్టించే టపాసుల నియంత్రణపై ఎవరికీ పెద్దగా అభ్యంతరం లేదు.. కనీ పండుగే జరపుకోవ్వద్దంటే ఎలా? పండుగ నాడు ప్రతి ఇంటా దీపాలు వెలగాలి.. ఈ సందేశాన్ని ఎందుకు తొక్కిపెడుతున్నారు..

దురదృష్టవశాత్తు పండుగల విషయంలో నోరుపారేసుకునే వారంతా మెజారిటీ ప్రజల మనోభావాల విషయంలోనే స్పందిస్తున్నారు.. కేవలం ఒక మతం వారే పండుగలకు దూరంగా ఉండాలా? మరి అన్య మతాల పండుగల విషయంలో ఎందుకు వ్యాఖ్యానాలు చేయరు? ఆలోచించండి..

Sunday, October 19, 2014

సమీప భవిష్యత్తు బీజేపీదే..

కాంగ్రెస్ ముఖ్త్ భారత్ అసాధ్యమేమీ కాదు.. కేవలం ఒక కుటుంబంపై ఆధారపడి రాజకీయాలు నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ చరిష్మా కాల్పోయింది.. సార్వత్రిక ఎన్నికల ఘోరపరాజయ పరంపర కొనసాగుతోంది.. క్రమంగా ప్రధాన రాష్ట్రాలు బీజేపీ, మిత్రపక్షాల ఖాతాలో పడుతున్నాయి.. బీజేపీకి ఇప్పుడు ప్రధాన ప్రత్యర్థులు ఇప్పుడు ప్రాంతీయ పక్షాలే.. ప్రస్తుతం అధికారంలో కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్, సమాజ్ వాదీ, జేడీయు, బీజూ జనతాదళ్, తృణమూల్, అన్నా డీఎంకే వ్యక్తి ఆధార పార్టీలే.. ఈ రాష్ట్రాలన్నింటీలో బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా అవతరించి ప్రాభవం చాటుకుంటోంది.. ఈ రాష్ట్రాల్లో కూడ సమీప భవిష్యత్తులో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం ఖాయం అని స్పష్టమవుతోంది..

మరో రెండు కమలాలు..

దేశంలో మరో రెండు కమలాలు ఉదయించాయి.. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, గోవాల సరసన మహారాష్ట్ర, హర్యానా చేరాయి.. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం తర్వాత వచ్చిన ఎన్నికల ఫలితాలు చూసి మోదీ పని అయిపోయింది అంటూ చంకలు గుద్దుకున్నవారు ఇప్పుడు ఢీలా పడే ఉంటారు.. 
మహారాష్ట్రలో శివసేన పొత్తు లేకుండా బీజేపీ అన్ని సీట్లు సాధించిందంటే సామాన్యమై విషయం కాదు.. శివసేనతోకలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని తెలుస్తోంది.. హర్యానాలో తొలిసారిగా భాజపా సర్కారు ఏర్పాటు కాబోతోంది..

Friday, October 17, 2014

బయటపడ్డ ముషార్రఫ్ దుర్భుద్ది..

పాకిస్తాన్ నాయకుల దుర్భద్ది మరోసారి బయట పడింది.. భారత్ తో యుద్దానికి సిద్దమట.. వేర్పాటు వాదులను రెచ్చగొడతారట.. పాకిస్తాన్ మాజీ పాలకుడు జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ తాజాగా ఒక ఛానల్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇవి.. ఇందులో కొత్తేమీ లేదు.. ఇప్పటికే పాకిస్తాన్ చేస్తున్న పని ఇదే కదా..
భారత వ్యతిరేకతే పాకిస్తాన్ పాలకులకు మనుగడ.. వారి దేశంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రజల దృష్టిని మరల్చడానికి ఇండియా మీద పడి ఏడవడం మామూలే.. గతంలో భారత ప్రధాని అటల్జీ పాకిస్తాన్తో సామరస్య వాతావరణం కోసం బస్సు యాత్ర చేపడితే, ఇది గిట్టని నాటి దేశ సైనిక దళాల ప్రధానాధికారి ముషార్రఫ్ కార్గిల్ దురాక్రమణకు పూనుకున్నాడు.. భారత్ సమర్ధవంతంగా తిప్పి కోట్టిన తర్వాత, తనపై వేటు పడుతుందనే భయంతో ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని కూల్చి తానే పాలకుడయ్యాడు ముషార్రఫ్.. అప్పటి అరాచకాలకు విచారణ ఎదుర్కొంటున్న ఈ పెద్దమనిషి, పాక్  ప్రజల దృష్టిలో మంచి మార్కులు కొట్టేయడానికి మళ్లీ పాత పాచి పాట అందుకున్నాడు..
మోదీ ముస్లిం, పాకిస్తాన్ వ్యతిరేకట.. పర్వేజ్ ముషార్రఫ్ అంటాడు.. మరి ముషార్రఫ్ హిందూ వ్యతిరేకి, భారత్ వ్యతిరేకి కాదా? మన ప్రధాని పదవి చేపట్టాక మోదీ ఏమైనా ముస్లిం వ్యతిరేక పనులు చేశారా? పాకిస్తాన్లో హిందువుల దుస్థితి ఏమిటి? ఇండియాలో మైనారిటీలు అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఆ దేశంలో ఉన్నాయా? పాకిస్తాన్లో కన్నా భారత్లోనే ముస్లింలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.. వారికి పాకిస్తాన్ కన్నా భారత్లోనే భద్రత ఉంది.. ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తూ కొట్టుకు చస్తున్నది ఎవరు? పాకిస్తానీలే కదా? పాకిస్తాన్ ప్రధానికి మోదీ స్నేహ హస్తం అందిస్తే, వేర్పాటు వాదులతో చర్చలు జరిపి సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచి, సామరస్య వాతావరణాన్ని దెబ్బ తీసింది ఎవరు?

ముషార్రఫే కాదు, వాడి తాతలు, పాకిస్తాన్ పాలకులు, నాయకులు అంతా దిగి వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే సత్తా భారత దేశానికి ఉంది.. ముందు పాకిస్తాన్ తన అంతర్గత వ్యవహారాలను చక్కన పెట్టుకుంటే చాలు..

Wednesday, October 15, 2014

ఐఎస్ జేకే మతిలేని పనేనా?

పవిత్ర బక్రీద్ పండగ వేళ శ్రీనగర్లో ఐఎస్ఐస్ జెండాలు.. ఐఎస్ జేకే అట.. పేరు కూడా పెట్టుకున్నారు.. ప్రపంచాన్ని వణికిస్తున్న అతి ప్రమాద ఉగ్రవాద సంస్థ కాశ్మీర్లో ఉనికిని చాటుకోవడంతో దేశమంతా ఉలిక్కిపడింది.. ఒక్క ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తప్ప.. ఇదేమిటయ్యా అబ్దుల్లా అంటే.. అంతా ఉత్తిదే, కొందరు మతిలేని యువకులు చేసిన చిలిపి పనంటాడాయన.. సరదాగా ఓ దర్జీ దగ్గర ఆ జెండాలు కుట్టించుకున్నారట.. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలాంటి ట్వీట్ ఇచ్చాడు కుంభకర్ణ+ధృతరాష్ట్ర వారసుడు.. నిద్ర+దృష్టిలేమితో బాధపడుతున్నాడు మరి.. జెండాలు పట్టిన ఆ యువకులు మతిలేని వారే అయితే ఎందుకు పిచ్చాసుపత్రిలో చేర్చలేదు? అంత ధైర్యం ఉందా?

కాశ్మీర్ ఇప్పటికే వేర్పాటు వాదుల గుప్పిట్లో ఉక్కిరి బిక్కిరి అవుతోంది.. ఓట్ల కోసం మతిలేని నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, కాంగ్రెస్ పార్టీలు వీరిని చూసీ చూడనట్లు వదిలేశాయి.. ఇప్పటికే ఉన్న ఉగ్రవాద శక్తులకు తోడు ఇస్లామిక్ దేశాలను సైతం గడగడలాడిస్తున్న ఐఎస్ఐఎస్ కాశ్మీర్లో ప్రవేశించినట్లు స్పష్టమైపోయింది.. ఇది అప్రమత్తంగా ఉండాల్సిన సమయం.. మొన్నటి వదరల్లో దేశ ప్రజలంతా జమ్మూ కాశ్మీర్ ప్రజలకు అండగా నిలిచారు.. అదే విధంగా ఉద్రవాద కోరల్లోంచి భారతమాత మకుటాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది..

కల్లోల విశాఖను ఆదుకుందాం..

విశాఖపట్నానికి ఇంత పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదు.. దేశ తూర్పు సముద్ర తీరాన ఉన్న ఈ అందమైన విశాఖ, ఒక్కపూటలో విషాద నగరంగా మారిపోయింది.. విశాఖ వాసులంతా భద్రలోకులని భావించాను.. ప్రకృతి కన్నెర్రకు విలవిలలాడిపోయారు.. హుధుద్ తుఫాను భారీ నష్టాన్ని, కష్టాన్ని తెచ్చిపెట్టింది.. ఎక్కడ చూసినా విరిగిన చెట్లు, కూలిన కరెంటు స్థంబాలు, హోర్డింగ్స్, దెబ్బతిన్న ఇండ్లు, భవనాలు.. కమ్యూనికేషన్ల వ్యవస్థ విధ్వంసమై కొన్ని గంటల పాటు ఎక్కడ ఏమి జరిగిందే తెలియని దుస్థితి.. వీటన్నింటికీ తోడు విద్యుత్తు కోత, నీళ్లు, పాలు, నిత్యావరసర వస్తువులు దొరక్క ప్రజల విలవిలలాడిపోయారు.. ప్రభుత్వరంగ సంస్థలు, కార్యాలయాలు, ప్రయివేటు వాణిజ్య సముదాయాలకు భారీగా దెబ్బతిన్నాయి.. వీటన్నింటినీ పునరుద్దరించాలంటే కొన్ని కోట్ల రూపాయల ఖర్చు.. విశాఖ ప్రజలకు ఎంత కష్టం.. ఎంత నష్టం..
ఇక గ్రామీణ విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజల పరిస్థితి మరీ దారుణం.. మీడియా ఫోకసంతా విశాఖ నగరంపైనే ఉండటంతో మిగతా గ్రామాలు, పట్టణాలలు ఎలా ఉన్నాయో తెలిసేందుకు కొంత సమయం పట్టింది.. ఇళ్లు, పంటలు, తోటలు దెబ్బతిన్నాయి.. పశువులు, మేకలు, కోళ్లు చనిపోయాయి.. జాలర్ల పడవలు, వలలు కొట్టుకుపోయాయి.. సామాన్యునికి జరిగిన నష్టం పూడ్చలేనిది.. ప్రభుత్వ యంత్రాంగం ఎంతో ముందు చూపుతో జాగ్రత్తలు తీసుకున్నా ఎంతో కొంత ప్రాణ నష్టమైతే తప్పలేదు..

ఈ కష్ట సమయంలో ఉత్తరాంధ్ర ప్రజలకు అండదండగా ఉండటం తోటి తెలుగువారిగా ఉభయ రాష్ట్రాల ప్రజల కర్తవ్యం.. ఈ విషాదం ఇవాళ వారికి వచ్చింది.. రేపు మనకూ రావచ్చు.. వీరిని ఆదుకోవడం ప్రభుత్వంతో మాత్రమే అయ్యే పని కాదు.. మనమంతా మనకు తోచిన సహాయం అందిద్దాం.. ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల ద్వారా చేయూతనిద్దాం.. వీలైతే స్వయంగా వెళ్లి ఏదైనా చేయగలిగితే చేద్దాం..

Sunday, October 12, 2014

చూసుకొని కొనండి..

ఒకే వస్తువు.. కానీ ధరలో బోలెడంత తేడా.. పండుగల వేళ కొత్త వస్తువులు కొందామనుకుంటున్నారా? అయితే జాగ్రత్తగా ధరలు, నాణ్యతను చూసి కొనుగోలు చేయండి.. ఆన్ లైన్ మార్కెటింగ్ విస్తరించాక, పోటీ తత్వం పెరిగి ఒకరికన్నా ఒకరు తక్కువ ధరకు ఇవ్వడానికి మందుకు వస్తున్నారు.. ఉదాహరణకు lenovo A269i మొబైల్ ప్రత్యేక ఆఫర్ కింద రూ.3,599/- కే ఇస్తున్నట్లు ఓ పత్రికలో ప్రకటన వచ్చింది.. కానీ కానీ ఆన్ లైన్ లో ఈ మొబైల్ రూ.3,056/- రూపాయలకు కూడా దొరుకుతోంది.. ఒకే వస్తువు, ఒకే నాణ్యత, ధర మాత్రం తేడా.. గమనించారా? కొన్ని బోగస్ సైట్లు, ఆన్ లైన్ మోసాలు కూడా ఉంటాయి.. తస్మాత్ జాగ్రత్త..

Friday, October 10, 2014

కుక్క తోక సరిదిద్దాల్సిందే.. పాక్ కు బుద్ది చెప్పాల్సిందే

పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.. సరిహద్దు గ్రామాలు, చెక్ పోస్టులపై విచక్షణా రాహితంగా కాల్పులకు దిగింది.. భారత సైన్యం అంతే ధీటుగా జవాబిచ్చింది.. ఇలాంటి వార్తలు మనకు రొటీన్ అయిపోయాయి.. కానీ ఎందుకిలా జరుగుతోంది?.. భారత్ గట్టిగా తిప్పికొట్టలేకపోతోందా?.. ఆలోచించండి?
భారత్, పాక్ దేశాల మధ్య పోరాటం సర్వసాధారణమైపోయింది.. భారత్ పట్ల శతృత్వం, ఈర్ష, అసూయ, విధ్వేషం లేకుండా పాకిస్తాన్ మనుగడ సాధించలేదు.. అంతర్గత సమస్యలతో సతమతం అవుతున్న పాక్, వీటిని కప్పిపుచ్చుకోవడానికి ఇండియాను బూచిగా చూపించి పబ్బంగడుపుకుంటోంది.. పాకిస్తాన్ ఏర్పడినప్పటి నుండి వరుసగా ఐదేళ్లయినా ప్రజాస్వామ్య ప్రభుత్వం మనుగడ సాగించలేదు.. సైన్యం, ఐఎస్ఐ కనుసన్నల్లోనే ప్రభుత్వాలు నడవాలి.. తోకజాడిస్తే పడగొట్టి సైనికాధికారలు నేరుగా అధికారం చేజిక్కించుకుంటారు..
పాకిస్తాన్ పౌర ప్రభుత్వాలు భారత దేశంలో ఎన్ని చర్చలు జరిపినా, ఒప్పందాలు చేసుకున్నా బూడిదలో పోసిన పన్నీరే.. సైన్యం, ఐఎస్ఐ వాటిని పట్టించుకోవు.. వాటి పని అవి చేసుకుపోతాయి.. కార్గిల్ యుద్దం, సరిహద్దుల్లో కాల్పులు దీనికి ఉదాహరణ..
2003లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ పదేపదే ఉల్లంఘిస్తోంది.. ఇప్పటికి కొన్ని వేల ఘటనలు, మరణాలు చోటు చేసుకున్నాయి.. తాజాగా అ అక్టోబర్ 1వ తేదీ నుండి జరుగుతున్న పాకిస్తాన్ కాల్పుల్లో 8 మంది పౌరులు చనిపోయారు.. 80 మందికి పైగా గాయపడ్డారు.. వీరిలో 9 మంది సైనికులు ఉన్నారు.. సరిహద్దు గ్రామాల్లో దాదాపు 30 వేల మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు.. అయితే భారత సైన్యం సమర్థవంతంగా తిప్పి కొడుతోంది.. పాకిస్తాన్ భూభాగంలో ఇంకా ఎక్కవే నష్టం జరుగుతోంది. కానీవారు పట్టించుకోరు.. తమ రెండు కళ్లు పోయినా పర్వాలేదు.. భారత్ కు ఒక కన్నుపోతే చాలు అన్నదే వారి వైఖరి..వారి తప్పును కప్పిపుచ్చుకొని, భారత్ తమను కవ్విస్తోందని అంతర్జాతీయ మీడియాలో తప్పుడు ప్రచారం చేసుకుంటోంది పాక్..
భారత్, పాక్ ల మధ్య ఇప్పటికి నాలుగు యుద్దాలు జరిగాయి..అన్నిట్లో ఘన విజయం మనదే.. అయినా పాక్ వైఖరి మారదు.. కుక్క తోట వంకరే కదా?.. అయితే పదే పదే రెచ్చగొడుతుంది.. ఈ సారి మాత్రం గట్టి గుణపాఠమే చెప్పక తప్పేలా లేదు..

Wednesday, October 8, 2014

ఆశయాలను నెరవేర్చడమే భీమ్ కు సరైన నివాళి..

జల్-జంగిల్-జమీన్ ఆయన నినాదం.. కానీ ఆదివాసుల నేటికీ అవి తీరని కోరికలే..
ఆదివాసుల హక్కుల కోసం నిజాం ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగుర వేసిన గోండు యోధుడు కొమురం భీమ్ వీరమరణం పొంది 74 ఏళ్లు పూర్తయ్యాయి.. నాగరిక సమాజానికి దూరంగా అడవుల్లో నివసించే ఆదివాసీలు కోరుకునేది స్వేచ్ఛాయుత జీవితం.. అడవులపై ఆధారపడి జీవించే వీరికి, వాటిపై హక్కులేదు పొమ్మంటే ఎక్కడికి పోగలరు.. కొండలు, కోనల్లో పోడు వ్యవసాయం చేయకుండా అడ్డుకోవడంతో పాటు, పన్నులు వెట్టి చాకిరితో గిరజనులను వేధిచింది నిజాం ప్రభుత్వం.. ఇలాంటి పరిస్థితుల్లో భీమ్ తిరగబడ్డాడు.. ఆదిలాబాద్ జిల్లాలోని జోడేఘాట్ కొండల్లో సాయుధ పోరాటం చేపట్టిన కొమురం భీమ్ నిజాం సైన్యం అంతమొందించింది..
భీమ్ త్యాగం వృధాగా పోలేదు.. ఆయనను స్పూర్తిగా తీసుకొని తర్వాత కాలంలో చేపట్టిన పోరాటాల ఫలితాలే 1/70 చట్టం, అటవీ హక్కులు, గిరిజన చట్టాలు వచ్చాయి.. కానీ ఇవన్నీ కంటిపుడుపు చర్యలుగానే మారాయి. అభివృద్ది పేరిట అడవులన నిర్మూళన.. ప్రాజెక్టులు, గనులు అంటూ గూడులేని నిర్భాగ్యులుగా మార్చేస్తున్న వైనం ఆదివాసీలకు శాపాలుగా మారాయి..
కొమురం భీమ్ పోరాటాన్ని, ఆయన చరిత్ర గుర్తించడానికే ఇన్నేళ్లు పట్టడం దారుణం.. భీమ్ జయంతులు, వర్ధంతులు నిర్వహించడమే ఆయన స్మరణ కాదు.. ఆయన ఆశయాలను నెరవేర్చడమే నిజమైన నివాళి.. జై భీం

Saturday, October 4, 2014

దసరా జ్ఞాపకాలు..

దసరా అంటే నాకెంతో సరదా.. హైదరాబాద్ పాత నగరంలో పుట్టి, నాకు పండుగలంటే వినాయక చవితి, విజయ దశమి మాత్రమే.. మా ఓల్డ్ సిటీ జన జీవితంతో ఎంతగానో ముడిపడి ఉన్న పండుగలు ఇవి.. కులాలకు అతీతంగా అందిరినీ కలిపే ఉత్సవాలు ఇవి..
గణేష్ చవితి, దసరా పండుగల పేర్లు వినగానే చిన్ననాటి సంగతులు గుర్తుకు వస్తాయి... ఆ జ్ఞాపకాలు సరాసరి చిత్రగుప్త దేవాలయానికి వెళతాయి.. గుడిల గణేషున్ని తెచ్చిండ్రట.. అనగానే పరుగెత్తుకెళ్లి చూడాల్సిందే.. మా ఆటల ముందు ఆకలి దప్పులు బలాదూర్.. ఇక దసరా వచ్చిందంటే ఆ సందడే వేరుండేది..  బతుకమ్మ ఆటలు, పాట పిట్ట దర్శనం, రథయాత్ర, ఆర్య సమాజ్ శోభాయాత్ర, చివర్లో రావణ దహనం.. రావణాసురున్ని ఎప్పుడు కాలుస్తారా అని క్లైమాక్స్ కోసం ఎదురు చూసేవాళ్లం.. రావణ దహనం తర్వాత బంగారం అంటూ జమ్మి ఆకు పంచుకొని, ఆలింగనం చేసుకొని దసరా శుభాకాంక్షలు చెప్పుకోవడం, పెద్దల కాళ్లకు మొక్కి ఆశీర్వాదాలు తీసుకోవడం.. 1990కి ముందునాటి తీపి గుర్తులివి..
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా?.. చిత్రగుప్త దేవాలయం ఉంది.. కానీ ప్రహరీ గోడను రైల్ ఓవర్ బ్రిడ్జ్ మింగేసింది.. ఆక్రమణలు పోగా ఆలయ ప్రాంగణ మూడో వంతుకు తగ్గిపోయింది.. బతుకమ్మలు నిమజ్జనం చేసే బావి రెండు దశాబ్దాల క్రితమే పూడ్చేశారు.. రథయాత్ర ఎప్పుడో నిలిచిపోయింది.. చిత్రగుప్త దేవాలయంలో దసరా వేడుకలు జరుగుతున్నాయి.. కానీ మునుపటి సందడి లేదు..

తరాలు మారిపోయాయి.. ఆనాటి ముచ్చట్లు చెప్పితే అవునా అని ఆశ్చర్యపోతోంది నేటి తరం.. మనసులో ఏదో కోల్పోయిన బాధ.. జ్ఞాపకాలు అలాగే ఉంటాయి.. కానీ మళ్లీ చిన్న పిల్లలం కాలేం కదా? 

శతృ సంహారం.. ధర్మ విజయం..


Friday, October 3, 2014

చెడుపై విజయమే దసరా..

విజయ దశమి భారత దేశంతో పాటు ప్రపంచంలోని హిందువులంతా ఎంతో వైభవంగా జరుపుకునే పండుగ.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే మహోత్సవం ఇది.. విజయ దశమిలో మనకు ప్రధానంగా కనిపించేది శక్తి ఆరాధన.. 
తొమ్మిది రోజుల పాటు దేవీ నవరాత్రి వేడుకలు ముగిసిన తర్వాత పదో రోజున విజయ దశమి జరుపుకుంటాం.. దీన్నే దసరా అంటాం.. తెలుగు నాట దుర్గమ్మవారికి పూజలతో పాటు బతుకమ్మ ఉత్సవాలను కూడా నిర్వహించుకుంటున్నాం.. అసలు విజయ దశమి ఎందుకు జరుపుకుంటారు?.. ఈ రోజుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి..
దుర్గామాత మహిషాసురున్ని వధించింది ఈ రోజునే.. శ్రీరాముడు రావణున్ని సంహరించింది కూడా ఇదే రోజున.. పాండవులు వన వాసం ముగించుకొని జమ్మి వృక్షం పైనుండి ఆయుధ పూజలు తీసి పూజించింది దసరా ముందు రోజన.. అందుకే మనం ఆయుధ పూజ చేస్తాం.. 
విజయదశమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు..

Thursday, October 2, 2014

స్వచ్ఛ్ భారత్ విజయవంతం కావాలి..

స్వచ్ఛ్ భారత్.. అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లాగే ఇదొకటి అనుకుంటే పొరపాటు.. దీని వెనుక మహోన్నత లక్ష్యం ఉంది.. ప్రతి ఒక్కరూ కనీసం వారానికి రెండు గంటలు కేటాయించి మన ఇళ్లు, వాకిలి, కార్యాలయ పరిసరాలు, వీధులు పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలి.. 2019లో మహాత్మా గాంధీ 150 జయంతి నాటి భారత దేశం మొత్తాన్ని శుభ్రం చేయాలన్న లక్ష్యంతో చేపట్టిన బృహత్తర ఉద్యమం ఇది.. స్వచ్ఛ్ భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలల కార్యక్రమం..
చెత్త తయారు చేయడం మన పని.. ఎత్తేయడం మున్సిపాలిటీ వారి పని.. మనం ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన అవసరం ఏమిటి?.. ఇలా ఆలోచించేవారి మనసిక స్థితిని కచ్చితంగా శంకిచాల్సిందే.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం మనవంతు కర్తవ్యంగా భావించాలి.. పారిశుధ్యం, ప్రజారోగ్యంపై ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయి.. కానీ అపరిశుభ్ర వాతావరణం, అనారోగ్య సమస్యలను దూరం చేయలేకపోతున్నాం.. ఎక్కడుంది లోపం?.. కచ్చితంగా మన ఆలోచనా విధానంలోనే లోపం ఉంది.. కసువు తీసుకెళ్లి వీధి చివర చెత్త కుండీలోనే వేయాలనే స్పృహే చాలా మందికి లేదు.. సిగరెట్లు కాల్చి రోడ్డు మీద విసిరేస్తారు.. పాన్, వక్కపొడి, గుట్కాలు ఊమ్మేస్తాం.. ఆహార పదార్ధ్యాల వ్యర్ధాలను ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం.. రోడ్లపై విఛల విడిగా కాలుష్యాన్ని సృష్టిస్తాం..  ఇదేగా మనం చేస్తున్న పని..

దేశానికి స్వాతంత్ర్యం కన్నా, పరిశుభ్రతకే తాను ప్రధాన్యత ఇస్తానని మహాత్మా గాంధీ ఆనాడే చెప్పారు.. గాంధీ జయంతి రోజున ప్రారంభమైన మహా ఉద్యమం స్వచ్ఛ్ భారత్.. ఈ మహాక్రతువు విజయవంతంగా పూర్తి కావాలని ఆశిద్దాం.. అందులో మనవంతు పాత్రను మరిచిపోవద్దు.. జై హింద్.. జై స్వచ్ఛ్ భారత్..

జై జవాన్.. జై కిసాన్.

ఎంత గొప్ప నినాదం ఇది.. భారతీయుల హృదయాల్లో దేశభక్తిని తట్టి లేపింది..
చైనా దురాక్రమణ విషాదంలో నెహ్రూ మరణించిన తర్వాత దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు లాల్ బహద్దూర్ శాస్త్రి.. అంతలో పాకిస్తాన్ తో యుద్దం వచ్చింది.. శాస్త్రీజీ ఆ దేశం మేరకు మన సైనం శత్రువులను తక్కుగా ఓడించింది.. దేశమంతా విజయ గర్వంతో మళ్లీ తలెత్తుకుంది.. దేశ రక్షణ భాధ్యతలు చూసే సైనికుడు, అందరికీ అన్నం పెట్టే రైతన్నలకు జై కొడుతూ లాల్ బహద్దూర్ శాస్త్రీ ఇచ్చిన ఈ నినాదం ఈనాటికీ మనకు స్పూర్తిని ఇస్తుంది..
శాస్త్రీజీ జీవితం నేటి నేతాజీలకు ఆదర్శం కావాలి.. గాంధీజీ మాదిరిగానే నిరాడంబరంగా జీవించారాయన.. శాస్త్రీజీ రైల్వే మంత్రిగా పని చేసిన కాలంలో ఓ రైలు ప్రమాదం జరిగింది.. ప్రయాణీకులకు భద్రత కల్పించలేకపోయానన్న పశ్చాతాపంతో నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేశారు.. ఈ రోజులు పదవులను అంటి పెట్టుకునే నాయకులనే చూశాం కానీ, అలాంటి గొప్ప నేతలు కనిపిస్తున్నారా?
భారత్ పాక్ ల మధ్య తాష్కెంట్ లో జరిగిన చర్చల తర్వాత అదే రాత్రి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు లాల్ బహద్దూర్ శాస్త్రీజీ.. లాల్ బహద్దూర్ జీ దేశ ప్రధానిగా ఉన్నది కొద్ది రోజులే.. కానీ ఆ పదవికి గొప్ప గుర్తింపు తెచ్చారు.. ఆ మహనీయుని జన్మదినం ఈరోజు.. వారికి ఘన నివాళులు అర్పిస్తూ గుర్తుకు తెచ్చుకుందాం..

మహాత్మా.. ఓ మహాత్మా

మోహన్ దాస్ కరంచంద్ గాంధీ.. భారత మాత మహా పుత్రుడు..దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన నాయకుల్లో ప్రముఖులు.. 20వ శతాబ్దంలో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల్లో మహాత్మా గాంధీయే అగ్రస్థానంలో ఉన్నారు.. గాంధీజీ జీవితమే ఒక సందేశం.. సత్యం, అహింస ఆయన ఆయుధాలు.. వీటితోనే ఆయన స్వాతంత్ర్య సమర పోరాటంలో పాల్గొన్నారు.. సత్యాగ్రహం, సహాయ నిరాకరణ, స్వదేశీ స్వావలంభన గాంధీజీ ఆచరించి చూపించారు.. జాత్యహంకారం, అంటరానితరం, మద్యపానం లాంటి సామాజిక రుగ్మతలపై ఆయన పోరాడారు..
మహాత్మ గాంధీ రామరాజ్యం, గ్రామ స్వరాజ్యం గురుంచి కలలు కన్నారు..స్వదేశీ స్వావలంభన కోసం పిలుపునిచ్చారు.. తాను స్వయంగా నూలు వడికి, అవే బట్టలు ధరించారు.. గాంధీజీ దేశ ప్రజల కష్టాలను చూసి చలించిపోయి జీవితాంతం నిరాడంబరంగా జీవించారు.. ఒంటిపై కేవలం రెండే వస్త్రాలు ధరించారు మహాత్ముడు.. గ్రామ సీమలు సస్యశ్యామలంగా ఉంటేనే దేశం పచ్చగా ఉంటుందని గాంధీజీ చెప్పేవారు.. గో ఆధారిత ఆర్ధిక వ్యవస్థపై ఆయనకు పూర్తి నమ్మకం ఉండేది అందుకే సంపూర్ణ గోవధ నిర్మూలనకు పిలుపునిచ్చారు గాంధీజీ.. మహిళలు అర్ధరాత్రి కూడా నిర్భయంగా తిరిగే పరిస్థితి ఉన్నప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లని చెప్పాడు మహాత్ముడు..
గాంధీజీని భారత దేశం ఎప్పటికీ మరచిపోదు.. కానీ ఆయన బోధనలను మాత్రం పాటించడంలో మాత్రం విఫలమౌతున్నాం.. గాంధీజీ బోధనలు స్వాతంత్ర్యోద్యమ కాలం నాటి సమాజాన్ని ఉద్దేశించినవే కావచ్చు.. కానీ అవి నేటి సమాజానికీ ఎంతో చక్కగా వర్తిస్తాయి.. కాలానుగుణంగా మార్పులు సహజం.. కాని మూల సూత్రాలు మాత్రం ఎన్నటికీ ఆచరణయోగ్యమే.. నేటి తరం నాయకులు గాంధీ పేరు చెబుతారు.. కాని ఆయన సూచించిన నిరాడంబర జీవితాన్ని పాటించడం మాత్రం కష్టమంటారు.. గాంధీజీ మాదిరిగా రెండు వస్త్రాలు ధరించాల్సిన అవసరం లేదు.. కానీ ఆయన సూచించిన మార్గంలో నడుస్తూ, నిజాయితీగా ప్రజా సేవ చేస్తే చాలు..
మహాత్మా గాంధీ 145వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ ఆ మహానుభావున్ని స్మరించుకుందాం..