Monday, October 27, 2014

ఎబోలా మరణ మృదంగం..

ఎబోలా.. ఈ పేరు వింటేనే ప్రపంచం వణికిపోతోంది.. ముఖ్యంగా అగ్ర దేశాలు..
పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ఎబోలా సోకి జనం పిట్టల్లా రాలిపోతుంటే అగ్ర దేశాలు పట్టించుకోలేదు.. ఆ అంటరాని పేద దేశాల్లో జనం చస్తే ఎంత, బతికితే ఎంత అని నిర్లక్ష్యం చేశాయి.. కానీ ఈ ప్రాణాంతక రక్కసి తమ గడప దాకా వచ్చేసరి హడలిపోతున్నాయి.. అర్జంటుగా మందును తెచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టాయి.. వాస్తవానికి ఈ ఎబోలా వైరస్ 1976లోనే బయటపడింది.. దీనిపై పరిశోధనలు చేసిన అమెరికా కెనడా దేశాల శాస్త్రవేత్తలు మందును కూడా కనిపెట్టామని ప్రకటించారు.. ఆ తర్వాత దాన్ని విస్మరించారు.. అప్పట్లో అంత అవసరం లేదని భావించి తదుపరి పరిశోధనలు, మందుల ఉత్పత్తికి కొంత నిర్లక్ష్యం  ప్రదర్శించారు.. ఫలితంగా ఇప్పడు ఈ మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది.
పశ్చిమాఫ్రికాలోని గినియాలో మొదలైన మరణ మృదంగం అన్ని దేశాలకు విస్తరిస్తోంది.. ఇప్పటి వరకూ 10,141 ఎబోలా వ్యాధి కేసులు నమోదైతే 4,922 మంది మృత్యువాత పడ్డారు.. ఈ ఏడాది మార్చిలో గినియాలో తొలి కేసు అధికారికంగా నమోదైంది.. కానీ అప్పటికే ఆలస్యం అయింది.. పొరుగునే ఉన్న లైబీరియా, సియెర్రా లియోన్, నైజీరియా దేశాలకుఈ వ్యాధి విస్తరించింది.. ఆఫ్రికా అడవుల్లోని గొరిల్లాలు, చింపాంజీలు, కోతులు, దుప్పులు, గబ్బిలాల నుండి ఈ వ్యాధి మొదలైందని తేలింది.. చనిపోయిన ఈ వన్యప్రాణులను పూడ్చే క్రమంలో వాటి రక్తం, ఇతర స్రావాల నుండి మనుషులకు వైరస్ అంటుకుంది.. ఈ దేశాల్లో గొరిల్లాలు, గబ్బిలాలను తినే అలవాటు కూడా మరో కారణమని భావిస్తున్నారు..
ఎబోలాతో మరణించిన వారిని అంత్యక్రియలు చేసే బంధువులకు, చికిత్స చేసే వైద్య సిబ్బందికి సైతం వైరస్ సోకడంతో దీని తీవ్రత అర్థమెంది.. ఎబోలా నివారణకు మందును అందుబాటులోకి తేవడానికి మరో నాలుగైదు నెలలు పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంఛనా వేస్తోంది,, కానీ డిసెంబర్లోగా మందు అందుబాటులోకి రాకపోతే ఒక్క లైబీరియాలోనే 90, 000 మంది మరణిస్తారని అంఛనా వేస్తున్నారు..  అమెరికా, యూరోప్ దేశాలకు క్రమంగా విస్తరిస్తున్న ఈ వ్యాధి, ఇప్పటి వరకైతే మన దేశానికి చేరినట్లు అధికారికంగా నిర్ధారణ కాలేదు.. కానీ ఈ వ్యాధి తీవ్రంగా ఉన్న దేశాల్లో భారతీయులు కూడా ఉండటంతో మన ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది..
ఎబోలా వైరస్ సోకిన వ్యక్తి రక్తపీడనం పడిపోయి, శరీర అవయవాల పని తీరు దెబ్బతిని మరణిస్తాడు..  వ్యాధి సోకినట్లు బయటపడటానికి కనీసం వారం రోజులు పడుతుంది.. ఈలోగా జరగాల్సిన ముప్పు జరిగిపోతుంది.. జ్వరం, వాంతులు, విరేచనాలు, వికారం, కడుపు నొప్పి, వెన్నునొప్పి, గొంతు తడ ఆరడం, శరీరంపై దద్దుర్లు ఈ వ్యాధి ప్రాథమిక లక్షణాలు.. వ్యాధి తీవ్రమైతే కాలేయం, మూత్ర పిండాలు దెబ్బతినడంతో  పాటు శరీరంలోపల, బయట తీవ్రమైన రక్త స్రావాలు మొదలవుతాయి.. సత్వర చికిత్స అందితేనే మనిషి బతికి బట్టకడతాడు.. లేకపోతే నూటికి 90 శాతం మరణం తప్పదు..

ఎబాలా వ్యాధిపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదకరమే.. బీ అలర్ట్..

No comments:

Post a Comment