Wednesday, October 15, 2014

కల్లోల విశాఖను ఆదుకుందాం..

విశాఖపట్నానికి ఇంత పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదు.. దేశ తూర్పు సముద్ర తీరాన ఉన్న ఈ అందమైన విశాఖ, ఒక్కపూటలో విషాద నగరంగా మారిపోయింది.. విశాఖ వాసులంతా భద్రలోకులని భావించాను.. ప్రకృతి కన్నెర్రకు విలవిలలాడిపోయారు.. హుధుద్ తుఫాను భారీ నష్టాన్ని, కష్టాన్ని తెచ్చిపెట్టింది.. ఎక్కడ చూసినా విరిగిన చెట్లు, కూలిన కరెంటు స్థంబాలు, హోర్డింగ్స్, దెబ్బతిన్న ఇండ్లు, భవనాలు.. కమ్యూనికేషన్ల వ్యవస్థ విధ్వంసమై కొన్ని గంటల పాటు ఎక్కడ ఏమి జరిగిందే తెలియని దుస్థితి.. వీటన్నింటికీ తోడు విద్యుత్తు కోత, నీళ్లు, పాలు, నిత్యావరసర వస్తువులు దొరక్క ప్రజల విలవిలలాడిపోయారు.. ప్రభుత్వరంగ సంస్థలు, కార్యాలయాలు, ప్రయివేటు వాణిజ్య సముదాయాలకు భారీగా దెబ్బతిన్నాయి.. వీటన్నింటినీ పునరుద్దరించాలంటే కొన్ని కోట్ల రూపాయల ఖర్చు.. విశాఖ ప్రజలకు ఎంత కష్టం.. ఎంత నష్టం..
ఇక గ్రామీణ విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజల పరిస్థితి మరీ దారుణం.. మీడియా ఫోకసంతా విశాఖ నగరంపైనే ఉండటంతో మిగతా గ్రామాలు, పట్టణాలలు ఎలా ఉన్నాయో తెలిసేందుకు కొంత సమయం పట్టింది.. ఇళ్లు, పంటలు, తోటలు దెబ్బతిన్నాయి.. పశువులు, మేకలు, కోళ్లు చనిపోయాయి.. జాలర్ల పడవలు, వలలు కొట్టుకుపోయాయి.. సామాన్యునికి జరిగిన నష్టం పూడ్చలేనిది.. ప్రభుత్వ యంత్రాంగం ఎంతో ముందు చూపుతో జాగ్రత్తలు తీసుకున్నా ఎంతో కొంత ప్రాణ నష్టమైతే తప్పలేదు..

ఈ కష్ట సమయంలో ఉత్తరాంధ్ర ప్రజలకు అండదండగా ఉండటం తోటి తెలుగువారిగా ఉభయ రాష్ట్రాల ప్రజల కర్తవ్యం.. ఈ విషాదం ఇవాళ వారికి వచ్చింది.. రేపు మనకూ రావచ్చు.. వీరిని ఆదుకోవడం ప్రభుత్వంతో మాత్రమే అయ్యే పని కాదు.. మనమంతా మనకు తోచిన సహాయం అందిద్దాం.. ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల ద్వారా చేయూతనిద్దాం.. వీలైతే స్వయంగా వెళ్లి ఏదైనా చేయగలిగితే చేద్దాం..

No comments:

Post a Comment