Saturday, January 31, 2015

ఛ‌త్తీస్‌గ‌డియా స‌బ్‌లే బ‌డియా..

छत्तीसगढ़िया सबले बढ़िया.. రాయ్‌పూర్‌ శివారులో స్వామి వివేకానంద విమానాశ్రయం వెళ్లే రోడ్డులో స్వాగత ద్వారంపై కనిపించిన వాక్యం ఇది.. అంటే ఛ‌త్తీస్‌గ‌డ్‌ చాలా ఉత్తమమైనది అని అర్థం..
ఛ‌త్తీస్‌గ‌డ్‌ రాజధాని రాయ్‌పూర్‌ వెళతానని ఎప్పుడూ అనుకోలేదు.. మహా అయితే మన దేశంలో ఢిల్లీ, ముంబై లాంటి మెట్రో నగరాలకో లేదా పర్యాటక ప్రదేశాలకో, పుణ్యక్షేత్రాలకో ఏదో ఒక సందర్భంలో వెళతాం.. కానీ రాయ్‌పూర్‌ వెళ్లాల్సిన అవసరమే పడకపోవచ్చు.. కానీ ఈ చిన్న నగరానికి అనుకోకుండా వెళ్లాను.. ఒక విధంగా మంచిదే అయింది.. లేకపోతే ఒక అందమైన నగరాన్ని చూసే అవకాశం కోల్పోయేవాన్నే..
రాయ్‌పూర్‌.. 11 లక్షల జనాభా గల ఈ చిన్న నగరం ఎంతో సుందరంగా కనిపించింది. హైదరాబాద్ నగరంతో పోలిస్తే రాయ్‌పూర్‌ రోడ్లు చాలా నయం అనిపించింది. విశాలమైన రోడ్లకు తోడు ట్రాఫిక్, కాలుష్యం కూడా చాలా తక్కువ.. తెల్లని చొక్కాలు, టోపీలతో ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కౌబాయ్స్ మాదిరిగా కాస్త వింతగా కనిపించారు. తక్కువ వ్యవధి ఉన్నందున రాయ్‌పూర్‌ నగరంలోని ప్రదేశాలన్నింటినీ పెద్దగా చూడలేకపోయాం.. కానీ నగర్ గడీ క్లాక్ టవర్, షహీద్ స్మారక్ చౌక్, వివేకానంద సరోవర్, మాలవీయ మార్గ్, బిరాన్ బజార్ల మీదుగా కారులో ప్రయాణించాం..
ఛ‌త్తీస్‌గ‌డ్‌ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ పరిపాలనా దక్షత చూడాలంటే రాయ్‌పూర్‌ చూస్తే చాలనిపించింది.. కొత్తగా నిర్మిస్తున్న నయా రాయ్‌పూర్‌ మరో అద్భుతం.. కానీ సమయాభావం వల్ల సందర్శించలేకపోయాం..
అంతా బాగానే ఉంది కానీ రాయ్‌పూర్‌ ఆహారం తలచుకుంటేనే భయమేసింది.. పొద్దున్నే కచోరీ, జిలేబీల అల్పాహారం.. భోజనంలో లావుపాటి జిడ్డు పూరీలు భరించలేక పోయాం.. రాయ్‌పూర్‌ వాసులు పెరుగు, మజ్జిగ అంతగా వాడరనుకుంటాను.. మనకు అవి లేనిదే ముద్ద దిగదాయే.. అక్కడి ఆహారంలో కారాలు, మసాలాల వాడకం కాస్త తక్కువే.. ఇదీ ఒకందుకు మంచిదే అనిపించింది..

జమ్మూ కశ్మీర్ అధ్యయన కేంద్రం జాతీయ సదస్సు కోసం ఎన్వీకె ప్రసాద్, రాకా సుధాకర్, రవిశంకర్, విక్రం సింహా, చౌదరి గార్లతో ఇటీవల రాయ్‌పూర్‌ నగరానికి వెళ్లాను.. నిజంగా ఈ నగర దర్శనం చాలా చక్కని అనుభూతిని ఇచ్చింది.. రాయ్‌పూర్‌ను చూసి పరవశించిపోయిన మా బృందంలోని ఒక మిత్రుడు ఒక్కడే స్థిరపడి వ్యాపారం పెట్టేసుకుంటాననేశాడు.. నాకైతే మరోసారి ఈ నగరాన్ని చూసేందుకు వెళ్లాలనిపిస్తోంది..

Friday, January 30, 2015

తమశీల్దారుకు షాకిచ్చిన రైతన్న

'మరీ ఇంత అన్యాయమా?.. అసలు ఈ లోకంలో నీతి, నిజాయితీలు లేకుండా పోయాయి..' ఒకటే రొదపెట్టేస్తున్నాడు నా మిత్రుడు.
'ఇంతకీ ఏం జరిగిందో చెప్పండి..' ఆయన మాటలకు అడ్డు పడ్డాను.
'ఛీ వాడు అన్నమే తింటున్నాడా?.. అసలు మనిషేనా వాడు..' తన దండకం ఆపలేదు మన మిత్రుడు.
'విషయం ఏమిటో సూటిగా చెప్పు..' కాస్త గట్టిగానే అడిగేశాను.
'చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది.. అయినా నీకు కాబట్టి చెప్పేస్తున్నా.. మొన్నొక రైతు తీసుకొచ్చి ఇచ్చిన డబ్బులో అన్నీ దొంగ నోట్లే ఉన్నాయి..' గొల్లుమంటూ చెప్పుకొచ్చాడు మనోడు..
'అయ్యయ్యో.. నిజంగానే ఇది అన్యాయం.. అంతే కాదు దేశ ద్రోహం కూడా.. ఇంతకీ ఆ రైతు ఆ డబ్బులు ఎందుకు ఇచ్చాడు?..' ఊరడిస్తూ అడిగాను.
'పట్టాదారు పాసు పుస్తకం కోసం ఇచ్చిన డబ్బు అది..' నిజం కక్కేసి నాలిక కరుచుకున్నాడు మన తహశీల్దారు మిత్రుడు..
అవాక్కవ్వడం నా వంతైంది.. రైతు మిత్రమా.. మీకు పొర్లు దండాలు..

Wednesday, January 28, 2015

దత్తన్న @ కామన్ మాన్

మన దత్తన్న నాకు common manలాగే కనిపిస్తారు.. మీకూ అలాగే అనిపిస్తుందా?..

మా చిన్నబ్బాయి ఆదర్శ్ పుట్టిన రోజు..


జమ్మూ కశ్మీర్ సమస్యను అర్ధం చేసుకోండి..

‘’జమ్మూ కశ్మీర్ సమస్య ఈ దేశ ప్రజలందరిదీ.. శరీరంలో ఏ భాగానికి హాని కలిగినా మొత్తం దేహంపై ప్రభావం చూపినట్లే కశ్మీర్ సమస్య కూడా దేశ భద్రతను ప్రభావితం చేస్తుంది.. భారత దేశంలో జమ్మూ కశ్మీర్ రాష్ట్ర విలీనం విషయంలో ఎలాంటి సమస్య లేదు.. ఇది కేవలం బ్రిటిష్ వారి కుట్రకు తోడు ఢిల్లీ కేంద్రంగా సృష్టించిన సమస్యే.. జమ్మూ కశ్మీర్ సమస్యకు మూలం సరైన సమాచారం అందుబాటులో లేకపోవడమే.. ఇందుకు ప్రధాన బాధ్యత రాజకీయ నాయకులకన్నా విద్యావంతులు, మీడియాదే.. భారత్ లోని అన్ని రాష్ట్రాల మాదిరిగానే కశ్మీర్ దేశంలో సంపూర్ణ అంతర్ భాగం.. ఈ విషయంలో దేశ ప్రజలందరికీ అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.. జమ్మూ కశ్మీర్ గురుంచి ముందుగా తెలుసుకోండి, అర్థం చేసుకోండి, కలుపుకోండి.. ఈ దిశగా మనందరం పని చేద్దాం..’’
జమ్మూ కశ్మీర్:నిజానిజాలు
అనే అంశంపై ఛత్తీస్ గఢ్ రాజధాని రాయపూర్ లో జనవరి 24,25 తేదీల్లో జాతీయ సదస్సు జరిగింది.. ఈ సదస్సుకు వచ్చిన ప్రతినిధులకు జమ్మూ కశ్మీర్ అధ్యయన కేంద్రం డైరెక్టర్ అరుణ్ కుమార్ జీ ఇచ్చిన సందేశం ఇది..

Tuesday, January 27, 2015

సామాన్యునికి మరణం లేదు..

నేను ఎంతో అభిమానించే కార్టూనిస్ట్ ఆర్.కే.లక్ష్మణ్.. ఆయన సృష్టించిన సామాన్యుని పాత్ర కూడా అంతే ఇష్టం.. చాలా కాలంగా లక్ష్మణ్ అనారోగ్యంతో బాధ పడుతూ కనుమూయడం బాధాకరమే.. కానీ పుట్టిన ప్రతి వ్యక్తికీ మరణం తప్పదు అని గుర్తు తెచ్చుకోక తప్పదు.. ఆర్.కే.లక్ష్మణ్ లేకపోవచ్చు.. కానీ ఆయన సృష్టించిన సామాన్యుని పాత్రకు మరణం లేదు..ఈ సామాన్యుడు ఆరు దశాబ్దాలుగా మౌనంగానే ఉన్నాడు.. మౌనంగానే సమాజానికి చురకలంటిస్తూ వచ్చాడు.. సామాన్యుడు కొత్తగా కనిపించకపోవచ్చు కానీ ఆయన సంపుటాల్లో నిక్షిప్తమైన సామాన్యుని చిత్రాలు ఎప్పటికీ పలకరిస్తూ ఉంటాయి.. రేఖా విన్యాసాల్లో.. ఎందరో చిత్రకారులకు, కార్టూనిస్టులకు ఆర్కే లక్ష్మణ్ రేఖలు భగవద్గీత మాదిరే పవిత్రమైనవి..వారిని నేను నిరంతరం స్మరించుకుంటూనే ఉంటాను.. 

Monday, January 19, 2015

25 ఏళ్ల విషాద చరిత్ర..

25 YEARS OF FORCED EXILE.. కశ్మీర్ లోయ నుండి పండిట్స్ బలవంతంగా తరిమివేతకు గురై పాతికేళ్లు పూర్తయింది.. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ అధ్యయన కేంద్రం ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి కశ్మీరీ సమాజ్ హైదరాబాద్ సంస్థ అధ్యక్షుడు భరత్ భూషణ్ ధర్ ముఖ్యఅతిధిగా వచ్చారు.. 1990లో వేర్పాటువాదులు పాకిస్తాన్ అండదండలతో సృష్టించిన అరాచకాలను గుర్తు చేసుకున్నారు.. సనాతన ధర్మాన్ని నమ్ముకున్న తాము లోయను విడచి పెట్టి బయటకు రావడానికి దారితీసిన విషాకదర పరిణామాలను కళ్లకు కట్టినట్లు ధర్ వివరించారు.

Sunday, January 18, 2015

కశ్మీరీ పండిట్ల ఆక్రంధనలు పట్టావా?..

తేదీ:19-01-1990.. సరిగ్గా పాతికేళ్లు పూర్తయింది.. తరతరాలుగా జీవిస్తున్న నేల నుండి అన్యాయంగా గెంటేశారు.. సామూహికంగా బహిష్కరించారు.. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. వేలు, లక్షల మంది జనం... తమ కళ్ల ముందే జరుగుతున్న అన్యాయాన్ని చూడలేక పోయారు.. పట్టించుకునే దిక్కు లేదు.. ప్రభుత్వం అనేదే లేదు.. తమ ఇండ్లు, ఆస్తిపాస్తులు వదిలేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సొంత పట్టణాలు, గ్రామాలను వదిలేసి బయటకి వచ్చేశారు.. వారే కశ్మీరి పండిట్స్.. దేశ విభజన తర్వాత జరిగిన మరో విషాద ఘట్టం ఇది..
ఆజాది.. జీహాదీ.. వారి నినాదం. భారత దేశం నుండి వేరు కావాలి.. పాకిస్తాన్ అండ దండలతో చెలరేగి పోతున్న వెర్రి తలల వేర్పాటు వాదం కాశ్మీర్ లోయలో చిచ్చు పెట్టింది.. వేలాది సంవత్సరాల కశ్మీరి, హిందూ సంస్కృతి సాంప్రదాయలకు ప్రతీక అయిన కశ్మీరి పండిట్స్ వీరికి శత్రువుల్లా కనిపించారు.. వీరిని తరిమేస్తే కానీ తమ లక్ష్యం పూర్తి కాదనే వెర్రితనం వేర్పాటు వాదులను ఆవహించింది.. పొరుగు దేశం స్వార్థ ప్రయోజనాలతో నూరిపోసిన ఆజాదీ అనే మత్తు మందుకు తోడు ఏకే 47 లాంటి ఆయుధాలతో పైశిచికంగా విజృంభించారు.. కశ్మీర్లో ఉండాలంటే హిందూ మతాన్ని వదిలేయాలి.. ఆజాదీకి మద్దతు పలకాలి.. లేదా లోయను వదిలేసి పోవాలి.. ఇవి వేర్పాటు వాదుల బెదిరింపులు.. పండిట్ల ఊచకోతలు, మానభంగాలు, లూఠీలు, గృహ దహనాలు, బెదిరింపులు నిత్యకృత్యంగా మారాయి. ఈ ముష్కరుల ఆగడాలకు విలవిలలాడిపోయారు కశ్మీరీ పండిట్లు.. స్వధర్మాన్ని, భారత దేశంతో ఉన్న అనుబంధాన్ని వదులుకోవడం ఇష్టంలేక, విధిలేని పరిస్థితుల్లో లోయను వదిలేసి వచ్చేశారు.. అలా కశ్మీర్లో 1980ల చివర్లో మొదలైన చిచ్చు 90ల తొలి భాగంలో తీవ్రమైంది.. పండిట్ల గెంటివేత పెద్ద సంఖ్యలో మొదలై, ఈనాటికీ కొనసాగుతోంది..
కశ్మీరీ పండిట్ల వ్యధను పట్టించుకునే నాధుడే లేడు.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైపోయాయి.. తమ నేలను, ఇళ్లూ, ఆస్థి పాస్తులు వదిలేసి వచ్చిన పండిట్లు ఈనాటికీ సొంత దేశంలో శరణార్థుల్లా, దిక్కులేని వారిలా జీవిస్తున్నారు.. ఢిల్లీ, జమ్మూ తదితర నగరాల్లో వేలాది మంది కశ్మీరీ పండిట్స్ గుడారాల్లో మగ్గిపోతున్నారు.. తమ భవిష్యత్తు ఏమిటో తెలియని దుస్థితి.. మానవ హక్కులు, న్యాయం, చట్టం అంటూ గొంతు చించుకు అరిచే వారికి ఆజాదీ, జీహాదీ అనే వేర్పాటు వాదుల పాటలు వీనుల విందుగా వినిపిస్తాయి.. కానీ కశ్మీర్ మూల సంస్కృతికి ప్రతీకలైన పండిట్ల ఆక్రందనలు మాత్రం వినిపించవు..
కశ్మీరీ పండిట్లు పెద్ద సంఖ్యలో లోయను వదిలేసిన తేదీ 19-01-1990ని Kashmiri Pandits Exodus Dayగా పాటిస్తున్నారు.. జమ్మూ కశ్మీర్ రాష్ట్రం ఏవిధంగా చూసినా భారత దేశంలో సంపూర్ణమైన భూభాగం. దీన్ని దేశం నుండి విడదీసే శక్తి ఎవరికీ లేదు..  కశ్మీర్ ను కాపాడుకునే బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉంది.. అలాగే పండట్లకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వారకు వారికి మనమంతా అండగా నిలవాల్సిన అవసరం ఉంది.

Friday, January 16, 2015

పత్రికొక్కటున్న మిత్ర కోటి..

పొద్దున్నే ఛాయ్ తాగుతూ దిన పత్రిక చదువుతుంటే.. ఆ మజాయే వేరు..
ఏదో తెలుగుకోవాలనే తపన.. ఎందుకో వెతుకులాట.. ఒక పేపర్ తర్వాత మరో పేపర్.. అప్పటికీ తనివి తీరకుంటే ఆన్ లైన్ ఎడిషన్లు ఉండనే ఉన్నాయి.. కానీ ఏటా దిన పత్రికలు మూడు, నాలుగు రోజులు సెలవు తీసుకుంటాయి.. అలవాటు కొద్దీ వీధిలోకి చూస్తాం.. కొద్ది సేపటికి గుర్తుకొస్తుంది.. ఇవాళ పేపర్ రాదు.. పునర్దర్శనం తిరిగి రేపేనని.. ఇక రోజంతా ఏదో కోల్పోయిన వెలితి.. ఈ సమస్య చాలా మందికీ ఉండొచ్చు.. కానీ నాతోటి జర్నలిస్టులకు మరింత ఎక్కువ.. టీవీ ఛానళ్లు ఎన్ని ఉన్నా దిన పత్రిక చదివితేనే తృప్తి..
అందుకే నార్ల వారు అన్నారేమో.. పత్రికొక్కటున్న పదివేల సైన్యంబు.. పత్రికొక్కటున్న మిత్ర కోటి అని.. నిజమే పత్రిక లేని రోజు ఒక మిత్రున్ని కలుసుకోలేని ఆదుర్దా.. అనిపిస్తూ ఉంటుంది.. అసలు పత్రికలకు సెలవులు అవసరమా? మీడియా మిత్రులకు ఎలాగూ షిప్టులు, వ్యక్తిగత వారాంతపు సెలవులు ఉండనే ఉన్నాయి.. కానీ కొట్టుకు ఆదివారపు సెలవు అన్నట్లు పత్రికలకు సెలవులేమి అని..

ఒకవేళ కార్మిక చట్టాల ప్రకారం కనీసం ఏడాదికి మూడు, నాలుగు రోజులైనా పత్రికలు సెలవులు ఇవ్వాలనుకుంటే ఒక ప్రత్యామ్నాయం ఉంది.. ఎలాగూ సెలవు ఉంటుంది కాబట్టి, ఆ రోజున కూడా పత్రిక మార్కెట్లోకి పంపడానికి అనుగుణంగా  ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి.. రాజకీయ విశ్లేషణలు, సామాజిక, సాహితీ వ్యాసాలు, వినోదం, శాస్త్ర సాంకేతిక కథనాలను ముందుగాను వండి వార్చి ఒక రోజు ముందుగానే ప్రింట్ చేసి మార్కెట్లోకి పంపితే.. నా బోడి సూచన ఎంత మందికి నచ్చుతుందో.. సీనియర్ మీడియా మిత్రులు, పెద్దలకు నా ఆలోచన నచ్చితే షేర్ చేసుకోగలరని ప్రత్యేక మనవి..

ప్రతి ఉదయం వెలుగులివ్వాలి..


Wednesday, January 14, 2015

రైతన్న నిజంగా పండుగ చేసుకుంటున్నాడా?

సంక్రాంతి.. రైతుల పండుగ. పండిన పంట ఇంటికి చేరిన వేళ జరుపుకునే పండుగ.. రైతన్నలు ఎంతో ఆనందంగా చేసుకునే వేడుకలు భోగి.. సంక్రాంతి.. కనుమ.. ఇదీ మనం వింటున్నది.. ఇందులో నిజమెంత? అతిశయోక్తి ఎంత? మరి రైతన్న కష్టం గురుంచి ఎప్పుడైనా ఆలోచించామా?
తినే అన్నం మెతుకులు ఎక్కడి నుండి వచ్చాయో తెలియని తరం మనది.. షాపులో బియ్యం కొంటాం సరే, మరి వాటిని తయారు చేస్తున్నది ఎవరు? మీ పిల్లలకు ఎప్పుడైనా ఈ విషయం చెప్పారా?..
ఒక ఉత్పత్తిదారుడు తన వస్తువును తయారీకి అయ్యే ఖర్చుపోను లాభం చూసుకొని డిస్ట్రిబ్యూటర్ కు అమ్ముకుంటాడు.. ఆ డిస్ట్రిబ్యూటర్ తన లాభం చూసుకొని రిటైలర్ కు అమ్ముతాడు.. సదరు రిటైలర్ వినియోగదారునికి అమ్మిన మొత్తంలో కొంత లాభం చూసుకుంటాడు.. మరి రైతు సంగతో?
పంట వేయాలంటే అప్పు తేవాలి.. విత్తనాలు, ఎరువులు, మందులు కొనాలి.. నీటి వనరులు, విద్యుత్తు ఉండాలి.. ఆరు గాలం కష్టపడి పండించే పంటకు చీడ పీడల ముప్పు పొంచి ఉంటుంది.. దాన్నుంచి బయట పడేలోపు ఏ ప్రకృతి బీభత్సమో కబలించే ప్రమాదమూ ఉంది.. వీటిన్నింటినీ అధిగమించాక పండిన పంటకు తగిన రేటు ఉంటుందో లేదో తెలియదు.. రేటును నిర్ణయించేది తాను కాదు.. దళారీ చెప్పిన రేటుకే అమ్మాలి.. లేదా ప్రభుత్వం ఇచ్చే గిట్టుబాటు అనే దిక్కుమాలిన ధర ఉంటుంది.. వెరిసి రైతు చేతికి వచ్చింది లెక్కిస్తే చాలా సందర్భాల్లో తాను పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రాదు.. అప్పు తీరదు.. దీన్ని తీర్చేందుకు కొత్త అప్పు చేసి మరో పంటకు సిద్దం కావాలి.. మరి ఆ పంట భవిష్యత్తు ఏమిటి?.. ఏమో తెలియదు.. ఎందుకంటే ఇదో మాయా జూదం..
రైతన్న ఎప్పుడో స్వేచ్ఛ కోల్పోయాడు.. కట్టు బానిసకన్నా దీనమైన పరిస్థితి.. అందరం తినేది రైతన్న కష్టమే.. కానీ అతని బాగోగులు ఎవరికీ పట్టవు.. వ్యవసాయంపై పెట్టుబడి విపరీతంగా పెరుగుతోంది.. కానీ ప్రతి ఫలం మాత్రం రైతుకు దక్కడం లేదు.. వీటి ఫలితమై రుణభారం, ఆకలి చావులు..

ప్రతి రాజకీయ నాయకుడు రైతు గురుంచి మాట్లాడే వాడే.. ఉచిత విద్యుత్తు, రుణ మాఫీ పేరిట తాయిలాలు చూపించి, వారి బతుకులను యాచకునికన్నా హీనంగా మార్చేశారు.. అసలు రైతుకు కావాల్సింది ఏమిటి? ఏం చేస్తే వారి  బతుకులు మారతాయి అని చిత్తశుద్దితో ఆలోచించారా? రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు వారికి పూర్తి స్థాయిలో చేరుతున్నాయా? అందరు వ్యాపారులు లాభసాటిగా సరుకు అమ్ముకునే స్వేచ్ఛ ఉన్నప్పుడు రైతులు మాత్రం ఎవడో నిర్ణయించిన ధర ప్రకారమే ఎందుకు అమ్మాలి..


 

Tuesday, January 13, 2015

భోగి మంటలు.. భోగ భాగ్యాలు..

సంక్రాంతి ముందు రోజు వచ్చేదే భోగి పండుగ.. భోగి పండుగ తెల్లవారు ఝామునే మంటలు వేస్తారు.. అసలు భోగి మంటలు ఎందుకు వేయాలి? భోగి మంటల్లో పాత వస్తువులు వేయడం తప్పు కదా?
సంక్రాంతి ముందు రోజున సూర్యుడు ఉత్తరాయణంలోకి రావడాన్ని స్వాగతిస్తూ భోగి జరుపుకుంటారు.. సంక్రాంతి రోజుల్లో చలి తీవ్రత అధికంగా ఉంటుంది.. చలిని వదిలించుకొని, చైతన్యం తెచ్చుకోవడానికి భోగి మంటలు వేయడం ఆచారంగా వచ్చింది..

భోగి మంటల్లో ఒకప్పుడు తాటాకులు, పాత సామాను, కర్రలు వేసేవారు.. కానీ ఇప్పుడు టైర్లు, కిరోసిన్, ప్లాస్టిక్ వస్తువులు సైతం వేస్తున్నారు. ఇది చాలా పెద్ద తప్పు.. పర్యావరణానికి చాలా చేటు చేస్తోంది.. ఆవు పేడతో చేసిన పిడకలు, మామిడి, రావి, మేడి కర్రలను ఇతర ఔషధ మొక్కలను భోగి మంటల్లో వేస్తే వాతావరణ కాలుష్యాన్ని నివారించవచ్చు.. పైగా ఈ మంటలతో వచ్చే వాయువులు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.. అందరికీ భోగి శుభాకాంక్షలు..

Monday, January 12, 2015

భారత జాతిని మేల్కొలిపిన స్వామి వివేకానంద..

ఆయన జీవించింది కేవలం 39 ఏళ్లు మాత్రమే.. కానీ నాలుగు పదులైనా నిండని జీవితంతో భవిష్యత్తు తరాలకు మార్గదర్శిగా నిలిచారు.. నవ భారత దేశంలో అత్యధిక దేశ ప్రజలకు, ముఖ్యంగా యువతలో స్పూర్తిని నింపే సందేశాన్ని ఆయన కొద్ది సంవత్సరాల జీవిత కాలంలోనే ఇచ్చారు.. అత్యంత ప్రాచీన సాంస్కృతిక ఆధ్యాత్మిక వైభవం ఉన్న భారత దేశం విశ్వగురువు అని ప్రపంచానికి చాటి చెప్పారాయన.. ఆ మహనీయుడే స్వామి వివేకానంద..
జనవరి 12వ తేదీ స్వామీజీ జన్మదినం.. వారి 150వ జయంతి ఉత్సవాలను గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా జరుపుకున్నాం.. ఈ శుభ సందర్భంలో వారి సందేశాన్ని సంక్షిప్తంగా గుర్తు చేసుకుందాం..
లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకూ విశ్రమించకండి.. లేవండిమేల్కొనండి!.. మిమ్మల్ని మీరు మేల్కొల్పుకొని ఇతరులను మేల్కొల్పండిఇకపై నిద్రించకండి!.. మీరు మరణించే లోపే జీవిత పరమావిధిని సాధించండి.. లేవండి!మేల్కొనండి!.. గమ్యం చేరేవరకూ ఎక్కడా నిలవకండి.. ఎప్పటికీ జాగృతంగానే ఉండండి.. బలమే జీవితం, బలహీనతే మరణం.. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్ప మనసున్న యువత ఈ దేశానికి కావాలి..
ఆధునిక యువతపైనే నాకు విశ్వాసం ఉంది.. నేను నిర్మించిన ఆదర్శాన్ని దేశ మంతా వ్యాప్తి చేసేది యువతే.. యువత ముందు బలిష్టులు, జవ సంపన్నులు, ఆత్మ విశ్వాసుల, రుజువర్తనులు కావాలి.. ఇలాంటి వారు వంద మంది ఉన్నా చాలు, ఈ ప్రపంచాన్నే మార్చేయ వచ్చు..
మీరంతా మహత్కార్యాలు సాధించడానికే జీవించామని విశ్వసించండి.. బలం, శక్తి మీలోనే ఉన్నాయని గుర్తుంచుకోండి.. ఎంతో విశ్వాసంతో లేచి నిలబడండి.. ధైర్యంగా బాధ్యతను మీ భుజ స్కంధాలపై వేసుకోండి.. భవిష్యత్తుకు మీరే బాధ్యులమని తెలుసుకోండి.. ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడకండి.. క్రమంగా ఘనమైన ఫలితాలు వస్తాయి.. సాహసంగా పని చేయండి..’
తమ సర్వస్వాన్ని త్యాగం చేసి, దేశం కోసం తమ జీవితాలను ఆహుతి చేసే యువత మనకు కొందరు కావాలి.. దేశ ప్రజలను ఉద్దరించే ఏకైక లక్ష్యంతో పని చేసే యవతను గుర్తించి పని చేయాలి.. త్యాగం, ఉత్సాహాలతో వారిని జాగృతం చేసి ఐక్యం చేయాలి.. మన స్థితికి మనమే బాధ్యులం.. లక్ష్యాన్ని సాధించే శక్తి, ఆపై శక్తి మనకే ఉంది..
విజయాన్ని సాధించడానికి కావలసినవి మూడు. అవి.. పవిత్ర, సహనం, పట్టుదల. వీటన్నింటినీ మించి కావలసింది ప్రేమ.. మీరు నిజంగా నా బిడ్డలే అయితే దేనికీ భయపడరు.. ఎక్కడా ఆగిపోరు.. మీరు సింహాల్లా ఉండాలి.. మన భారత దేశాన్నే కాక, ప్రపంచాన్నే జాగృతం చేయాల్సి ఉంది. ఉద్యమ నిర్వహణలో అవసరమైతే అగ్నిలో దూకడానికైనా సంసిద్ధంగా ఉండాలి..
భారత దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం జాతి పునర్ నిర్మాణమే మార్గమని సూచించారు స్వామీ వివేకానంద.. ధర్మాన్ని పాటించమన్నారు.. స్వధర్మం తల్లివంటిదని, పర ధర్మం సవతి వంటిదని అన్నారు.. ఏ విధంగా చూసినా హిందుత్వమే అన్ని ధర్మాలకన్నా గొప్పదని చికాగోలో జరిగిన ప్రపంచ మతాల సదస్సులో చాటి చెప్పారు వివేకానంద.. ప్రపంచానికి భారత దేశం ఆధ్యాత్మిక నాయకత్వం వహించాలన్నారు..
నేడు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలు మర్కెట్లో కుప్పలు తెప్పలుగా దొరుకుతున్నాయి..కానీ స్థూలంగా పరిశీలించి చూడండి.. ఎందరు ఎన్ని విధాలుగా చెప్పినా సారాంశం ఒకటే.. కానీ వందేళ్ల క్రితమే వ్యక్తి నిర్మాణం గురుంచి స్వామీజీ చక్కని బోధనలు చేశారు.. ఆయన బోధనలు చదివితే చాలు, మరే వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు.. యువతకు ఆశాజ్యోతి, మార్గదర్శి అయిన స్వామీ వివేకాంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నారు..

స్వామీ వివేకానందను గుర్తు తెచ్చుకుందాం.. ఆయన చూపిన మార్గాన్ని అనుసరిద్దాం.. ఈ దేశాన్ని పునర్నిర్మిద్దాం..

Friday, January 9, 2015

చార్లీ హెబ్డో.. ఓ గుణపాఠం

ఆళ్లు మనంత సహనశీలురు కాదు బాబాయ్.. అన్నాడో మిత్రుడు..
ఫ్రెంచ్ పత్రిక చార్లీ హెబ్డో పత్రిక కార్యాలయంలో ఉగ్రవాదులు మరణకాండ అందరినీ నివ్వెర పరిచింది.. ఈ దుశ్చర్యను ప్రతి ఒక్కరూ ఖండించి తీరాలి..
కానీ.. వాక్ స్వాతంత్ర్యం పేరిట మతపరమైన మనోభావాలను కించపరిచే వారికి కూడా ఇది ఒక హెచ్చరిక లాంటిదే.. మన దేశంలో ఒలాంటి పరిస్థితే వస్తే.. ఒక్కసారి ఊహించుకోండి..
ఓ విదేశీ పత్రిక మహ్మద్ ప్రవక్తపై వేసిన కార్డూన్, జీసస్ జీవితంపై వచ్చిన ఓ చిత్రం ఎలాంటి దుమారం రేపాయో అందరికీ తెలసిందే.. ఈ రెండు మతాల వారు ఏక తాటిగా నిరసన తెలిపడమే కాదు.. హింసాత్మక చర్యలకు పాల్పడి గట్టి హెచ్చరికలు పంపారు..
మరి హిందువుల విషయానికి వచ్చేసరికి ఏం జరుగుతోంది.. హిందూ దేవతలను కించపరుస్తూ అడ్డగోలుగా సినిమాలు వస్తున్నాయి.. తాజాగా pk.. ఎంతైనా హిందువులది మొద్దు చర్మం కదా.. దేన్నయినా సహిస్తారు..
హిందువులు కూడా హింసకు పాల్పడమని నేను చెప్పడంలేదు.. మొద్దు నిద్ర నుండి లేచి తమ అస్థిత్వాన్ని కాపాడుకోమని కోరుతున్నానంతే.. ఏ మతమైనా మనో

భావాలు ఒకేరకంగా ఉంటాయని గ్రహించండి.

'నేను సైతం స్వచ్ఛ్ భారత్ కోసం..'

భారత గణతంత్ర దినోత్సవంలో పాల్గొనేందుకు ముఖ్య అతిధిగా వస్తున్నారు అమెరికా అధ్యక్షుడు బకాక్ ఒబామా.. అందుకేనేమో వైట్ హౌస్ లో చీపురు పట్టారు.. స్వచ్ఛ్ భారత్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నరా?

(ఫోటోకు జస్ట్ సరదా వ్యాఖ్య అంతే)

Wednesday, January 7, 2015

ప్రవాస భారతీయ దివస్..

మహాత్మ గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారత దేశానికి తిరిగి వచ్చి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రవాస భారతీయ దివస్ జరుపుకుంటున్నాం.. దేశ విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయ మిత్రులకు శుభాకాంక్షలు..

మీ రక్షణ కోసమే హెల్మెట్..

హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు మళ్లీ హెల్మెట్ కంపల్సీరీ చేశారు.. వీరికేం పోయేకాలం.. అంటూ నిట్టూర్చాడో జర్నలిస్టు మిత్రుడు. పోయే కాలం వారికి కాదు మిత్రమా, హెల్మెట్ పెట్టని నీలాంటోడికి అని మొహమ్మీదే పంచ్ విసిరాను.. మనోడు ఆశ్చర్యంగా చూశాడు.. మన పోలీసులు బుద్ది పుట్టినప్పుడు హెల్మెట్ కంపల్సీరీ అంటారు.. తర్వాత పట్టించుకోరు.. కానీ దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలో టూవీలర్ నడిపే వారికి హెల్మెట్ కంపల్సరీ, వెనుక కూర్చున్న వారికీ తప్పదు..
హెల్మెట్ ధరించకుండా తప్పించుకోడానికి రకరకాల సాకులు చెబుతారు. హెల్మెట్ ఉంటే జుట్టు చెడిపోతుంది.. మెడ నొప్పి వస్తుందట.. పక్కన ఏ వాహనం పోతుందో సరిగ్గా కనిపించదు.. హారన్ వినిపంచదట.. శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది.. హెల్మెట్ పెట్టుకున్నా యాక్సిడెంట్ జరిగితే పోయేవాడు ఎలాడూ పోతాడు.. ఈ వాదనల్లో దీనికీ పసలేదు..
నా దృష్టిలో హెల్మెట్ ధరించడం వల్ల నూటికి 100% లాభాలే ఉన్నాయి.. అన్నింటికన్నా ముఖ్యమైంది.. మీ తలకు భద్రత. ప్రమాదాలు జరిగిన సమయంలో తలకు బలమైన గాయాలు తగలకుండా హెల్మెట్ కాపాడుతుంది.. కాలుష్యం నుండి మీ మొహానికి  రక్షణ.. ఎండా కాలంలో, వానా కాలంలో, శీతాకాలంలో సీజన్ ఏదైనా మీ తల సేఫ్.. హాప్ హెల్మెట్, డిప్ప హెల్మెట్ల కన్నా ఫుల్ హెల్మెట్ ధరించడమే మంచిది.. పోలీసులు స్ట్రిక్ట్ చేస్తున్నారని డబ్బుకు కక్కుర్తి పడి నాసిరకం హెల్మెట్ కొనకండి.. డబ్బు కాస్త ఎక్కువైనా బ్రాండెడ్, నాణ్యమైన హెల్మెట్లే కొని ధరించండి..

నేను టూవీలర్ నడపడం ప్రారంభించిన రెండున్నర దశాబ్దాల్లో ఏనాడూ హెల్మెట్ లేకుండా రోడ్డు ఎక్కలేదు.. చివరకు పక్క వీధికి పోవాలన్నా హెల్మెట్ ఉండాల్సిందే.. ఈ అనుభవంతోనే మీకు సలహా ఇస్తున్నాను.. మరోమాట.. నేనే హెల్మెట్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ కాదు.. ఏ బ్రాండునూ ప్రమోట్ చేయడం లేదు..

శశి థరూర్ పాపం పండుతోంది..

భార్యా భర్తలు గొడవ పడ్డారు.. అనుమానాస్పద పరిస్థితుల్లో భార్య మరణించింది.. పోలీసులు భర్తను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.. మన దేశంలోనే కాదు.. ప్రపంచంలో ఎక్కడైనా జరిగే పరిణామం ఇది.. కానీ గత ఏడాది జనవరి 17న ఢిల్లీలో జరిగిన ఒక ఘటనలో ఇందుకు భిన్నంగా జరిగింది.. కారణం భర్త కేంద్ర మంత్రి..
తన భర్తకు పాకిస్తానీ జర్నలిస్టుతో వివాహేతర సంబంధాలున్నాయని, ఆమె ఐఎస్ఐ ఏజెంట్ అని ట్విట్టర్లో ఆరోపించింది సునందా పుష్కర్.. అలాంటిదీ లేదని వాదించాడు శశి థరూర్.. చివరకూ ఇద్దరూ రాజీ పడి మీడియా ముందుకు వచ్చారు.. మరునాడే ఢిల్లోని ఓ స్టార్ హోటల్ గదిలో ఆమె శవమై తేలింది.. ఏడాది తర్వాత సునందను విష ప్రయోగం ద్వారా హత్య చేశారని వచ్చిన ఫోరెన్సిక్ నివేదికను వెల్లడించారు పోలీసులు..
సునంద పుష్కర్ ఓ సైనికాధికారి కూతురు.. కాశ్మీర్లో తీవ్రవాద కార్యలాపాలు పెరగడంతో జమ్మూకి వలస వచ్చిన పండిట్ల కుటుంబానికి చెందిన యువతి.. జీవితంలో కష్టపడి వ్యాపారవేత్తగా రాణించారు.. శశిథరూర్ తో పరిచయం, క్రికెట్ ఫ్రాంచైజీ వ్యవహారంలో ఆయన మంత్రి పదవి పోవడం ఆమె జీవితాన్ని మలుపుతిప్పింది..  చివరకు ఇద్దరూ వివాహం చేసుకున్నారు.. కానీ ఆమె కాపురం కొన్నాళ్లైనా నిలవకుండా, అర్ధంతరంగా జీవితం ముగిసింది..

నిత్యం వివాదాలతో వార్తల్లో నిలిచే శశిథరూర్ కేంద్ర మంత్రి హోదాలో చట్టం భారి నుండి తాత్కాలికంగా తప్పించుకున్నాడు.. కానీ ఇప్పుడేం జరగబోతోంది? వేచి చూడాలి.. ఆయనపై వచ్చిన ఆరోపణలు సామాన్యమైనవి కాదు.. ఒక వైపు భార్య మరణం కేసులో నిందితుడిగా కనిపిస్తున్నాడు.. కానీ సునంద చేసిన ఆరోపణలపై కూడా దృష్టి సారిస్తే దేశ ద్రోహం కేసు కూడా కనిపిస్తుంది.. 

Tuesday, January 6, 2015

పుట్టుకతో అందరూ ముస్లింలే.. జోక్ అదిరింది కదూ?..

2015లో నేను విన్న తొలి జోక్స్ ఇవే.. పుట్టుకతో అందరూ ముస్లింలేనట.. ఇతర మతాలవారు ఇస్లాంను ఆశ్రయించడమే ఘర్ వాపసీ అట.. ఈ దేశం వారి తాత ముత్తాల గడ్డ అట.. ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పేల్చిన జోక్స్ ఇవి..  ఈ నయా సిద్దాంత కర్తకు ఏదైనా యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చి సన్మానిస్తే బాగుంటుంది.. మహ్మద్ ప్రవక్త స్థాపించన ఇస్లాం మతం పుట్టింది ఏడో శతాబ్దంలో.. ఇస్లాం దండయాత్రల రూపంలో భారత దేశంలో ప్రవేశించింది ఎనిమిదో శతాబ్దం నుండే.. కానీ భారత దేశాని ఐదు వేల సంవత్సరాలకు పైగా ప్రాచీన వారసత్వం చరిత్ర ఉంది.. సనాతన ధర్మం (హిందూ), బౌద్ధ, జైన ధర్మాలు కూడా ఇస్లాం రాకకు ముందే ఈ దేశంలో ఉన్నాయి.. ఇస్లాం ఏ విధంగా మన దేశంలో ప్రవేశించిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.. మరి ఏవిధంగా ఈ దేశం వారి తాత గారి ఆస్తి అయిందో, పుట్టకతో అందరూ ఎలా ముస్లింలు అవుతారో ఓవైసీ సెలవిస్తే బాగుంటుంది..
హిందూ దేవతలపై నోరు పారేసుకొని, అరెస్టయి ఇంకా విచారణ ఎదుర్కొంటున్న అక్బరుద్దీన్ లో పోలిస్తే ఆయన అన్న బారిస్టర్ అసద్ కాస్త మంచివాడని, మేధావని కొందరు జర్నలిస్టు మిత్రులు అంటూ ఉంటారు.. ఈ పాటికి వారి భ్రమలు తొలిగే ఉండాలి.. మజ్లిస్ పార్టీ చరిత్ర, హైదరాబాద్లో ఆ పార్టీ ఎదిగిన క్రమం పరిశీలించన వారికి ఓవైసీలు ఏమిటో తెలుసు.. 

అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు, ఆయన వాదన చాలా పేలవంగా ఉంది.. వీటిని పట్టించు కోవాల్సిన అవసరమే లేదు.. జస్ట్ నవ్వుకొని వదిలేయాలన్నది నా వ్యక్తి గత అభిప్రాయం..

Monday, January 5, 2015

ఉగ్రవాదంపై కాంగ్రెస్ వైఖరి మారదా?

ప్రపంచాన్ని భయపెడుతున్న అతి పెద్ద సమస్య ఉగ్రవాదం.. ముఖ్యంగా భారత దేశానికి ఇది అతిపెద్ద ముప్పుగా మారింది... ముంబై, దిల్లీ, హైదరాబాద్, బెంగళూరులాంటి ఎన్నో నగరాల్లో ఉగ్రవాదులు తమ దుశ్చర్యతో భారతీయుల ప్రాణాలు తీసుకున్నారు.. మన దేశ అస్థిత్వాన్ని ప్రమాదంలో పడేసే ప్రయత్నం చేస్తున్నారు. ఉగ్రవాదంపై ప్రభుత్వంతో పాటు అన్న రాజకీయ పార్టీలు, పౌర సమాజం ఏకతాటిపై నిలవాల్సిన సమయం ఇది.. ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూసే మనస్థత్వాన్ని పెంపొందించిన కాంగ్రెస్ పార్టీ, మరోసారి తన నీఛ వైఖరిని చాటుకుంది..
ముంబై 26/11 మారణకాండ తర్వాత మన నిఘా, రక్షణ దళాలు సముద్రం తీర రక్షణపై నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నాయి.. ఈ నేపథ్యంలో నూతన సంవత్సర వేళ అరేబియా సముద్రంలో పోరుబందర్ రేవు పట్టణ సమీపంలో ఓ అనుమానిత మర పడవ కలకలం రేపింది ను మన భద్రతా దళాలు దాన్ని చుట్టుముట్టేలోపు అందులోని వారు తమను తాము పేల్చేసుకున్నారు.. మరో పడవ పాకిస్తాన్ వైపు పారిపోయింది.. ఎప్పటిలాగే పాకిస్తాన్ ఆ పడవలతో తమకు సంభందంలేదని బొంకింది. ఈ ఘటనపై దేశ వ్యాప్త చర్చ జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు పాకిస్తాన్ వాదనను సమర్ధించే రీతితో చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి.
ముంబైలో 26/11 సంఘటనలో పాకిస్తానీ పౌరుడు కసబ్ పట్టుబడిన తర్వాత కూడా, ఆ దేశం తమకు సంబంధంలేదని వాదించింది. విచారణలో పాకిస్తానీల ప్రమేయంపై ఆధారాలు స్పష్టంగా బయటపడ్డాయి.. ఆనాటి దాడి తర్వాత సోనియా, రాహుల్ సమక్షంలో నాటి హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే కాషాయ ఉగ్రవాదం అంటూ అవాకులు చెవాకులు పేలి నాలిక కరచుకున్న సంగతి తెలిసిందే.. కసబ్ తో పాటు, పార్లమెంట్ పై దాడి కేసు నేరగాడు అఫ్జల్ గురులకు ఉరిశిక్ష పడినా చాలా కాలం పాటు శిక్షను అమలు చేయకుండా ఇంటి అల్లుళ్లలా చూసుకున్న ఘనతను మూట గట్టుకుంది కాంగ్రెస్.. చివరకు విమర్షలకు జడిసి శిక్ష అమలు చేయక తప్పలేదు.. ఢిల్లీ బాట్లా హౌస్ దాడి ఘటనలో ఉగ్రవాదులు మరణిస్తే సోనియా గాంధీ కన్నీరు కార్చారని స్వయంగా ఆ పార్టీ నేత సాల్మాన్ ఖుర్షీదే వెల్లడించారు.

కాంగ్రెస్ పార్టీకి ఎన్డీఏ ప్రభుత్వంపై కోపం ఉంటే ఉండొచ్చు కానీ దేశ నిఘా, రక్షణ విభాగాలను నైతిక సామర్ధ్యాన్ని అగౌరవ పరిచే హక్కు ఎవరు ఇచ్చారు? దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ అసమర్ధత కారణంగానే ఈ రోజున ఉగ్రవాదం వివిధ రూపాల్లో వెర్రి తలలు వేస్తోంది.. ఉగ్రవాదాన్ని అరికట్టడం చేతగాక, మెజారిటీ ప్రజలను మనోభావాలతో ఆడుకున్న కారణంగానే కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నడూ లేనంత పరాజయాన్ని మూట కట్టుకుంది.. ఈ విషయాన్ని ఆంటోనీ, దిగ్విజయ్ లాంటి నాయకులే ఒప్పుకున్నారు. అయినా కుక్కతోక వంకర చందాన కాంగ్రెస్ పార్టీ తన విధానాన్ని మార్చుకోకుండా దేశ ప్రజలచే మరోసారి ఛీ కొట్టించుకుంటోంది.

Sunday, January 4, 2015

బ్రిటిష్ వాళ్లూ, నిజాములూ మంచోళ్లా?

కొమురం భీంను నిజాం చంపలేదు అంటూ సెలవిచ్చారు తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి..
అవునవును అల్లూరి సీతారామరాజును చంపించింది కూడా కింగ్ జార్జ్ చక్రవర్తి కాదు.. నిజాము తప్పు చేయలేదు, జార్జ్ చక్రవర్తి కూడా తప్పు చేయలేదు.. ఇద్దరూ మంచోళ్లే, గొప్పేళ్లే.. కానీ అసఫ్ జాహీ పాలనకు, బ్రిటిష్ పాలనకూ వ్యతిరేకంగా పోరాడిన వారే దుర్మార్గులు, పిచ్చోళ్లూ.. ఇలా కొత్త చరిత్ర రాసేద్దామా?.. ఆగస్టు 15, 1947, సెప్టెంబర్ 17, 1948 తేదీలను చరిత్రలోంచి చరిపేద్దామా?
ఏ రాజైనా, చక్రవర్తి అయినా తమ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వారిని నేరుగా చంపరు.. వారి ఆదేశాల ప్రకారమే శిక్షలు అమలవుతాయి.. కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజులు యోధులుగా కీర్తించబడుతున్నారంటే ప్రజల హక్కులను కాలరాసే నిరంకుశ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడటం వల్లే..

నిరంకుశ ప్రభువులను కీర్తించడం బానిసత్వానికి, దేశ ద్రోహానికి చిహ్నం కాదా?.. సమర యోధుల త్యాగాలు, బలిదానాలను కించపరచడం కాదా?.. అధికారం, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అమరుల ఆత్మలను క్షోభ పెట్టడం సమంజసమేనా?

అసఫ్ జాహీ (నిజాం) పాలనలో హైదరాబాద్ సంస్థాన ప్రజల దుస్థితి, పాలకుల భోగభాగ్యాలకు అద్దం పట్టే చిత్రాలు చూడండి.. నిజంగా నిజాం గొప్పోడు, మంచోడు కదూ..



Saturday, January 3, 2015

శృతి మించిన నిజాం భజన

ఏడో నిజాం రాజు మన గొప్ప రాజు.. ఆయన పాలనలో తప్పులు జరిగి ఉండొచ్చు.. కానీ సెక్యులర్ రాజు.. అని కొనియాడారు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు.. ఇది నిజమా? మీర్ ఉస్మాన్ అలీఖాన్ అంత గొప్పోడా?
నిజాం నవాబు అంత మంచివాడు, గొప్పవాడైతే కొమురం భీం ఎందుకు ఆయన మీద పోరాటం చేశారు?.. షోయబుల్లా ఖాన్ ఎందుకు నిజాం, ఆయన తొత్తులు రజాకార్లపై అక్షరాయుధాలు ఎక్కుపెట్టారు?.. మరి చాకలి ఐలమ్మ ఎందుకు నవాబు పాలన మీద తిరగబడింది? వీరి బలిదానాలు ఇక విలువలేనివేనా?
అంత గొప్ప మారాజుపై ఆర్యసమాజీయులు, స్టేట్ కాంగ్రెస్ వాళ్లు, కమ్యూనిస్టులు ఎందుకు పోరాటం చేశారు? వీరందరినీ మనం ఎందుక పూజిస్తున్నాం?.. ఆరాధిస్తున్నాం? చివరకు హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనం కావడం కూడా తప్పేనా? అందుకేనా మీరు సెప్టెంబర్ 17 ఉత్సవాలు జరపడానికి వెనుకాడుతున్నది?
మా నిజాము రాజు తరతరాల బూజు అని రాసిన దాశరధి కృష్ణమాచార్య చాలా పెద్ద తప్పు చేశాడు కదూ..
నిజాం నవాబుకు గోల్కండ ఖిలా కింద ఘోరీ కడతానంటాడా నల్లగొండ యాదగిరి.. ఏం పోయే కాలం ఈయనకు?
నిజాం నవాబు మీద బాంబు వేసి హతమార్చే ప్రయత్నం చేసిన ద్రోహినారాయణ రావు పవారు నిన్నమొన్నటి దాకా మన ముందే ఉన్నా ఎలా సహించాం మనం?
ఏమంటిరి సీఎం గారూ?.. నిజాము నవాబు సెక్యులరా?.. మరి ఏడో నిజాం నవాబు ఉస్మాన్ అలీఖాన్ అధికారంలోకి రాగానే తన తండ్రి కాలం నుండి ప్రధానమంత్రి పదవిలో ఉన్న మహారాజా కిషన్ పర్షాద్ ను ఎందుకు అధికారంలోంచి తొలగించాడు.. ఒక హిందువుకు అత్యున్నత పదవిలో ఉండే అర్హత లేదని సాకు చూపాడు.. పైగా తూ కిషన్ పర్ షాద్ హైతో మై ఖుదా పర్ షాద్.. (నీవు కృష్ణుని ప్రసాదమైతే, నేను ఖదా ప్రసాదాన్ని) అంటూ ఈసడించాడు.. మరో సందర్భంలో బందే నా ఖూన్ హువా సున్కే నిదాయే తక్బీర్, జలజలా హి అహి గయారిప్త యే జున్మార్మేభి అంటూ రహబరే దక్కన్ అనేపత్రికలో హిందువుల తమ చిహ్నాలపై విధ్వేషాన్ని బయట పెట్టుకున్నాడు..
ఏడో నిజాం పాలనలో మెజారిటీ ప్రజల భాష తెలుగుపై నిషేధం అమలులో ఉండేది.. వినాయక చవితి, దసరా పండుగలు బహిరంగంగా జరుపుకునే వీలు లేదు.. ఊరేగింపులు, సభలపైనా నిషేధం అమలులో ఉండేది.. తబ్లిగ్ పేరిట విచ్చల విడిగా మత మార్పిడులు జరిగాయి.. ఇందు కోసం ప్రభుత్వంలో ఒక విభాగాన్నే ఏర్పాటు చేశారు.. హైదరాబాద్ సంస్థానంలో మెజారిటీ ప్రజలైన హిందువులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత లేదు..
నిజాం ప్రభువు చల్లని పాలనలో ఆయన తొత్తు, రజాకార్ల అధినేత కాశిం రజ్వీ సాగించిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.. నియంతృత్వ పాలనను, మత మార్పిడులను ప్రశ్నించిన ఎంతో మంది ఆర్యసమాజ్, కాంగ్రెస్ కార్యకర్తలను హత్య చేశారు.. కాశిం రజ్వీ నాయకత్వంలోని రజాకర్ల దండు, నిజాం సైన్యం, పోలీసులు విచ్ఛలవిడిగా సాగించిన దోపిడీలు, హత్యలు, అత్యాచారాల గురుంచి ఇంకా బతికే ఉన్న ఆనాటి పెద్దవాళ్లు తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికీ చెప్పుకుంటునే ఉంటారు.. మహిళలను నగ్నంగా బతుకమ్మలు ఆడించడం.. గ్రామలపై పడి మగవాళ్లను సామూహికంగా హత్యలు చేసి, ఆడవాళ్లను మానభంగం చేయడం.. ఇంకా వారి కండ్ల ముందే మెదులుతుంటాయి.. చెప్పుకుంటూ పోతే భారీ పుస్తకమే రాయాలి..
నిజాము రాజు అవి కట్టించాడు ఇవి కట్టించాడు అని గొప్పలు చెప్పకోవడం సరికాదు.. ఎంత నిరంకుశ, నియంతృత్వ పాలకుడైనా తన రాజ్యాన్ని వల్లకాడుగా ఉంచుకోలేడు కదా? ప్రజల కోసం చేస్తున్నాం అని చెప్పుకోవడానికి ఎంతో కొంత అభివృద్ధి చూపించుకుంటారు. తమ రాజ్యాలకు అందాలు అద్దు కుంటుంటారు.. రాజ్యంలో కొన్ని సౌకర్యాలు అయినా ఉంటాయి.. నిజాం ఉస్మాన్ అలీఖాన్ చేసింది కూడా అదే పని.. వీటిని భూతద్దంలో చూపించి నిజాం నవాబు మంచోడు, గొప్పోడు అనడం సమంజసమేనా?

ఓటు బ్యాంకు రాజకీయాలతో మెజారిటీ ప్రజల మనోభావాల పరిహసించడం ఎందుకు? నిజాము గొప్పోడు, మంచోడు అని భావించే వారు ఆయన చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకొని నిరభ్యంతరంగా పూజించుకోవచ్చు.. కానీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధులు, అమరులు, త్యాగధనుల ఆత్మలకు క్షోభ కలిగించే భజనలు వద్దు..

Friday, January 2, 2015

మర్చిపోలేని 2014

క్యాలెండర్ మారిపోయింది.. చూస్తుండగానే 2015 వచ్చిపడింది.. కానీ 2014 మాత్రం ఇంకా కళ్ల ముందే మెదులుతోంది.. ఎలా మరచిపోగలం ఈ జ్ఞాపకాలు.. చరిత్రలో మరపురాని పుటలను చాలా వరకూ ఈ ఏడాది కేటాయించాల్సి వచ్చింది.. నా వరకు ఈ 2014కి ప్రాధాన్యత ఎంతో ఉంది.. అందుకే మరపురాని ఏడాది అంటున్నాను..
కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం.. తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు, కేసీఆర్ అధికారం చేపట్టడం 2014లో జరిగిన ప్రధాన పరిణామాలు.. ఈ అంశాలపై నేను ఎన్నో ముచ్చట్లు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాను.. ఏ ఘటననైనా జాతీయవాద కోణంలో ఆలోచించే నాకు కొన్ని పరిణామాలు సంతోషాన్ని కలిగించాయి.. అదే సమయంలో అసంతృప్తినీ మిగిల్చాయి..  సోషల్ మీడియాలో నా పోస్టులకు లభించిన స్పందన కొన్ని సందర్భాల్లో నాకే ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది.. ఇందులో రాజకీయేతరమైనవే అధికంగా ఉన్నాయి..
జనరిక్ మందులపై నేను యధాలాపంగా పెట్టిన పోస్టును కొన్ని వేల మంది షేర్ చేయడం, లైక్ చేయడం చాలా ఆనందాన్ని కలిగించింది.. అలాగే హిందుస్థాన్ అంటే భయం ఎందుకు?, కోరంగి విషాదం, ఏడు రెట్టెల కథ, ఫలక్ నూమా అద్దం, దేశ విభజన, హైదరాబాద్ విముక్తి, ఆర్టికల్ 370, రుణమాఫీ షరతులు.., టైగర్ నరేంద్ర, పటేల్ ను మరిచారా?, పటేల్ ప్రధాని అయ్యుంటే.., పూర్ణ కుంభం ఏదీ?, తెలుగు తెగులు, యుద్ద స్మారకం దుస్థితి, ఛాప్లిన్ కథ నా వ్యధ, వాజపేయికి భారత రత్న, మీడియా స్వేచ్చ.. ఇలా చాలా పోస్టులే ఉన్నాయి.. విచిత్రం ఏమిటి అంటే నేను ఎంతో ఇష్టంతో పెట్టిన కొన్ని పోస్టులకు పూర్ రెస్పాన్స్ రావడం.. ఏదో అలా పెట్టానులే అనుకున్న వాటికి ఊహించని స్పందన రావడం.. ఎన్నికల సమయంలో ఓటర్లలో చైతన్యం కోసం నేను తయాలు చేసిన నినాదాలు, వారతస్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పెట్టిన పోస్టులు అందరినీ ఆకర్షించాయి..
నరేంద్ర మోదీ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగుతున్న సమయంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ గ్రామీణుడు ఆయనను కాంగ్రెస్ వ్యక్తిగా పొరపడటంపై నేను రాసిన కథనం చర్చకు దారి తీసింది.. నేను రాసింది అచ్చ తెలుగులో అయినా అది ఢిల్లీ దాకా పోయిందట.. ఇది ఎంత వరకూ నిజమో నాకు తెలియదు.. కానీ ఎన్నికల ప్రచార సమయంలో మోదీ కమలం పూవు బ్యాడ్జీని కొట్టొచ్చినట్లు ధరించారు.. అది నా పోస్టు ప్రభావమే అన్నారు కొందరు మిత్రులు.. కానీ నేనే నమ్మలేకపోతున్నాను..
సోషల్ మీడియాలో నాకు మిత్రులతో పాటు శత్రువులూ తయారయ్యారు.. నా పోస్టులకు విమర్శనాత్మకంగా పెట్టే కామెంట్లను నేను స్వాగతిస్తాను.. కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాను.. కానీ అదే పనిగా రెచ్చగొట్టే కామెంట్లు చేసేవారిని, నిరాధార ఆరోపణలకు దిగే వారిని అస్సలు సహించలేను.. అందుకే ఎంతో మందిని అన్ ఫ్రెండ్స్ చేశాను.. ఫేస్ బుక్ లో ప్రతి రోజూ నాకు పదుల సంఖ్యలో ఫ్రెండ్ షిప్ రిక్వెస్టులు వస్తున్నా, వాటన్నింటినీ యాక్సెప్ట్ చేయలేక పోతున్నాను.. గత నాలుగేళ్లుగా ఫ్రెండ్స్ సంఖ్యలను వేయి దాటకుండా జాగ్రత్త పడ్డాను.. కానీ అనుకోకుండా 15 వందల దాకా పెంచేశాను.. ఇప్పుడు మరింత కుదించే ప్రయత్నం చేస్తున్నాను.

2015లో సోషల్ మీడియాలో నేను ఇప్పుడున్నంత యాక్టివ్ గా ఉండకపోవచ్చు.. అందుకు నా కారణాలు నాకున్నాయి.. ఇది చదివిన వారందరికీ ధన్యవాదాలు..

Thursday, January 1, 2015

నా కొత్త క్యాలెండర్ రెడీ..


బంధు మిత్రులకు, శ్రేయోభిలాషులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.


మహా విష్ణువు కరుణాకటాక్షాలతో మీ అందరికీ సుఖ సంపదలు,ఆయురారోగ్య ఆనంద ఐశ్వర్యాలు కలగాలని మనసారా కోరుకుంటున్నాను..
సర్వేజనా సుఖినోభవంతు.. మీ క్రాంతి దేవ్ మిత్ర