Friday, January 2, 2015

మర్చిపోలేని 2014

క్యాలెండర్ మారిపోయింది.. చూస్తుండగానే 2015 వచ్చిపడింది.. కానీ 2014 మాత్రం ఇంకా కళ్ల ముందే మెదులుతోంది.. ఎలా మరచిపోగలం ఈ జ్ఞాపకాలు.. చరిత్రలో మరపురాని పుటలను చాలా వరకూ ఈ ఏడాది కేటాయించాల్సి వచ్చింది.. నా వరకు ఈ 2014కి ప్రాధాన్యత ఎంతో ఉంది.. అందుకే మరపురాని ఏడాది అంటున్నాను..
కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం.. తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు, కేసీఆర్ అధికారం చేపట్టడం 2014లో జరిగిన ప్రధాన పరిణామాలు.. ఈ అంశాలపై నేను ఎన్నో ముచ్చట్లు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాను.. ఏ ఘటననైనా జాతీయవాద కోణంలో ఆలోచించే నాకు కొన్ని పరిణామాలు సంతోషాన్ని కలిగించాయి.. అదే సమయంలో అసంతృప్తినీ మిగిల్చాయి..  సోషల్ మీడియాలో నా పోస్టులకు లభించిన స్పందన కొన్ని సందర్భాల్లో నాకే ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది.. ఇందులో రాజకీయేతరమైనవే అధికంగా ఉన్నాయి..
జనరిక్ మందులపై నేను యధాలాపంగా పెట్టిన పోస్టును కొన్ని వేల మంది షేర్ చేయడం, లైక్ చేయడం చాలా ఆనందాన్ని కలిగించింది.. అలాగే హిందుస్థాన్ అంటే భయం ఎందుకు?, కోరంగి విషాదం, ఏడు రెట్టెల కథ, ఫలక్ నూమా అద్దం, దేశ విభజన, హైదరాబాద్ విముక్తి, ఆర్టికల్ 370, రుణమాఫీ షరతులు.., టైగర్ నరేంద్ర, పటేల్ ను మరిచారా?, పటేల్ ప్రధాని అయ్యుంటే.., పూర్ణ కుంభం ఏదీ?, తెలుగు తెగులు, యుద్ద స్మారకం దుస్థితి, ఛాప్లిన్ కథ నా వ్యధ, వాజపేయికి భారత రత్న, మీడియా స్వేచ్చ.. ఇలా చాలా పోస్టులే ఉన్నాయి.. విచిత్రం ఏమిటి అంటే నేను ఎంతో ఇష్టంతో పెట్టిన కొన్ని పోస్టులకు పూర్ రెస్పాన్స్ రావడం.. ఏదో అలా పెట్టానులే అనుకున్న వాటికి ఊహించని స్పందన రావడం.. ఎన్నికల సమయంలో ఓటర్లలో చైతన్యం కోసం నేను తయాలు చేసిన నినాదాలు, వారతస్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పెట్టిన పోస్టులు అందరినీ ఆకర్షించాయి..
నరేంద్ర మోదీ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగుతున్న సమయంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ గ్రామీణుడు ఆయనను కాంగ్రెస్ వ్యక్తిగా పొరపడటంపై నేను రాసిన కథనం చర్చకు దారి తీసింది.. నేను రాసింది అచ్చ తెలుగులో అయినా అది ఢిల్లీ దాకా పోయిందట.. ఇది ఎంత వరకూ నిజమో నాకు తెలియదు.. కానీ ఎన్నికల ప్రచార సమయంలో మోదీ కమలం పూవు బ్యాడ్జీని కొట్టొచ్చినట్లు ధరించారు.. అది నా పోస్టు ప్రభావమే అన్నారు కొందరు మిత్రులు.. కానీ నేనే నమ్మలేకపోతున్నాను..
సోషల్ మీడియాలో నాకు మిత్రులతో పాటు శత్రువులూ తయారయ్యారు.. నా పోస్టులకు విమర్శనాత్మకంగా పెట్టే కామెంట్లను నేను స్వాగతిస్తాను.. కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాను.. కానీ అదే పనిగా రెచ్చగొట్టే కామెంట్లు చేసేవారిని, నిరాధార ఆరోపణలకు దిగే వారిని అస్సలు సహించలేను.. అందుకే ఎంతో మందిని అన్ ఫ్రెండ్స్ చేశాను.. ఫేస్ బుక్ లో ప్రతి రోజూ నాకు పదుల సంఖ్యలో ఫ్రెండ్ షిప్ రిక్వెస్టులు వస్తున్నా, వాటన్నింటినీ యాక్సెప్ట్ చేయలేక పోతున్నాను.. గత నాలుగేళ్లుగా ఫ్రెండ్స్ సంఖ్యలను వేయి దాటకుండా జాగ్రత్త పడ్డాను.. కానీ అనుకోకుండా 15 వందల దాకా పెంచేశాను.. ఇప్పుడు మరింత కుదించే ప్రయత్నం చేస్తున్నాను.

2015లో సోషల్ మీడియాలో నేను ఇప్పుడున్నంత యాక్టివ్ గా ఉండకపోవచ్చు.. అందుకు నా కారణాలు నాకున్నాయి.. ఇది చదివిన వారందరికీ ధన్యవాదాలు..

No comments:

Post a Comment