Sunday, March 31, 2013

జనానికి భారం.. సర్కారుకు ఆనందం


ఏప్రిల్ ఒకటో తేదీ నాడే రాష్ట్ర ప్రభుత్వం జనాలను ఫూల్స్ చేసేసింది.. ప్రజల నెత్తిన విద్యుత్ ఛార్జీల భారం మోపింది..
విద్యుత్ కోతలతో జనం అల్లాడి పోతున్నారు.. నగరాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో జనం బతుకు దుర్భరంగా మారింది.. కోతల కారణంగా తాగు నీటికి, సాగు నీటికి కటకట ఏర్పడింది.. కర్మాగారాలు మూత పడుతున్నాయి.. కొత్తగా ఉద్యోగాలు రాకపోగా ఉన్న ఉద్యోగాలు ఊడే పరిస్థితి..
ఈ ప్రభుత్వానికి కరెంటు సరిగ్గా ఇవ్వడం చేతగాదు.. కేంద్ర నుండో, పొరుగు రాష్ట్రాలను దేబరించో అధనపు విద్యుత్తు తెద్దామన్న ముందు చూపు అసలే లేదు..  పైగా ఎప్పుడో వాడిన కరెంటుకు సర్ ఛార్జీ అంటూ వసూలు చేస్తారు..
ఇలాంటి పరిస్థితిని సరిదిద్ది ప్రజలను కష్టాల భారి నుండి బయట పడేయకుండానే, ఛార్జీలు పెంచే నైతిక హక్కు ఈ ప్రభుత్వానికి ఉందా? అసలు ఈ రెగ్యులేటరీ అధారిటీ ఏమిటి? ఛార్జీలు పెంచే హక్కు వారికి కట్టబెట్టడం ఏమిటి? ఛార్జీలు పెంచొద్దని అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమించినా, నిరాహార దీక్షలు చేసినా చెవిటోడి ముందు శంఖారావం ఊదినట్లే అయ్యింది..
ఉచిత విద్యుత్ ఎవరడిగారు?.. రూపాయికి కిలో బియ్యం ఎవరడిగారు?.. ఇవన్నీ సాకుగా చూపి ప్రజల జేబులు కత్తిరించడం ఏమిటి?.. ఇదేనా సంక్షేమ రాజ్యం?..
కరెంటు ఛార్జీలు పెరిగాయి.. భూములు, రిజిస్ట్రేషన్ రేట్లు పెరిగాయి.. రైలు టికెట్ల రేట్లు పెరిగాయి.. రింగు రోడ్డు ఎక్కితే జేబుకు చిల్లే.. ఈ కష్టాలన్నీ మరచిపోయేందుకు ఇంట్లో టీవీ చూద్దామన్నా కష్టమే.. సెట్ అప్ బాక్స్ లేనిదే టీవీ రాదాయే.. హైదరాబాద్ బతుకు ఎంత దుర్భరం అయిపోయింది.. ఏప్రిల్ ఒకటి నాడే ప్రభుత్వం జనాలను ఫూల్స్ చేసేసింది..


Saturday, March 30, 2013

నచ్చని నేతను బూటుతో కొట్టే హక్కు..

SHOE పేరు వినగానే నాయకులు భయపడిపోతున్నారు.. నిన్న ముషరఫ్, మొన్న బుష్.. మన దేశంలో సైతం బూటు బారి నుండి తృటిలో తప్పించుకున్న నాయకులు ఉన్నారు.. నచ్చని నాయకులపై బూట్లు విసిరి నిరసన తెలిపే సాంప్రదాయం క్రమంగా వ్యాపిస్తుంది.. ఈ పరిణామం ఎక్కడికి దారి తీస్తుందో ఏమో?.. మున్ముందు బహిరంగ సభలకు, సమావేశాలకు, ప్రెస్ మీట్లకు షూస్, చెప్పులు లేకుండా రావాలని హెచ్చరిస్తారేమో.. లోక్ పాల్ బిల్లు, పని తీరు బాగా లేని ప్రజా ప్రతినిధిని తిరస్కరించే హక్కు కోసం వచ్చిన ఉద్యమాల మాదిరే, నచ్చని నేతాశ్రీని బూట్లతో సత్కరించే హక్కు కావాలనే ఉద్యమం కూడా వస్తుందేమో?..

Friday, March 29, 2013

తెలుగు 'లేని' దేశం


తెలుగు దేశం పార్టీ.. 1982 మార్చి 29న నందమూరి తారక రామారావు ఈ పార్టీని ఏర్పాటు చేసినప్పుడు ఇదేమి పేరని అంతా చర్చించుకున్నారు.. తెలుగు జాతి ఆత్మ గౌరవ నినాదంతో రాజకీయాల్లోకి వచ్చిన తొమ్మిది నెలల కాలంలోనే ఎన్టీ రామారావు రాష్ట్రంలో ఎదురు లేని కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారాన్ని కైవసం చేసుకున్నారు.. అప్పటి వరకూ ఢిల్లీ పాలకులకు దక్షిణ భారతీయులంటే మద్రాసీలనే తెలుసు.. ఎవరు అవునన్నా కాదన్నా తెలుగు వారికి జాతీయ స్థాయిలో గౌరవ స్థానం కల్పించడంలో ఎన్టీఆర్ పాత్రను కాదనలేం.. తెలుగు భాష , సంస్కృతీ సాంప్రదాయాలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారాయన..
1995లో రామారావును బలవంతంగా పదవీచ్యుతున్ని చేసి పార్టీ పగ్గాలు, ముఖ్యమంత్రి పదవిని కైవసం చేసుకున్న ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు పార్టీ రూపు రేఖలే మార్చారు.. పార్టీ పేరులోనే తెలుగు ఉంది కానీ మన భాషా సంస్కృతుల పరిరక్షణకు బాబు పెద్దగా చేసిందేమీ లేదు.. ప్రభుత్వ పాలనలో తెలుగు భాష అమలు దిగజారింది కచ్చితంగా చంద్రబాబు హయాలోనే.. సచివాలయం దగ్గర  ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం తెలుగు తల్లి విగ్రహాన్ని క్రేన్ తో పెకిలిస్తే సగానికి విరగడం ఇందుకు పరాకాష్ట.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు హడావిడిగా కొత్త విగ్రహాన్ని చేయించి సచివాలయం ఎదుట ప్రతిష్టించారు.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రచారం హోరులో తెలుగు మీడియం పాఠశాలు దెబ్బతిని ఒక తరం మాతృ భాషకు దూరమైంది బాబు గారి హయాంలోనే అని గర్వంగా చెప్పుకోవచ్చు.. చివరకు టీడీపీ వెబ్ సైట్ల్ లోనూ ఆంగ్లానికే పెద్ద పీట..
వరుగగా రెండు పర్యాయాలు అధికారానికి దూరమై మళ్లీ ముఖ్యమంత్రి పదవి కోసం అష్ట కష్టాలు పడుతూ పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగు దేశం ఇప్పడు నాలుగు రోడ్ల కూడలిలో ఉంది.. తెలంగాణా ఏర్పడుతుందా? సమైక్యాంధ్రగానే కొనసాగుతుందా అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది.. కానీ తెలుగు దేశం అనే పార్టీ అవసరం కొంతైనా ఉందని నేను నమ్ముతున్నాను.. నిజానికి నేను చాలా విషయాల్లో ఈ పార్టీకి బద్ధ వ్యతిరేకిని..
దురదృష్ట వశాత్తు తెలుగు దేశం తెలుగు వారందరి ప్రయోజనాలు కాపాడటం కోసం ఏర్పడ్డ పార్టీ.. కానీ టీడీపీ ఒక పరిధి గీసుకొని ఆంధ్ర ప్రదేశ్ కే పరిమితమైపోయింది.. తనకు తాను ఒక చెరసాల నిర్మించుకుంది.. తమిళనాడులో అక్కడి ద్రవిడ పార్టీలన్నీ శ్రీలంకలో తమిళుల ప్రయోజనాల కోసం పోరాడుతున్నాయి..(మొసలి కన్నీరే అనుకోండి) కానీ తెలుగు దేశం పార్టీ ఏనాడైనా పొరుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారి కష్టాలను పట్టించుకుందా? అక్కడి తెలుగు వారు తమ భాష, సంస్కృతుల విషయంలో అడుగడుగునా వివక్షకు గురై ద్వితీయ శ్రేణి పౌరులుగా బతుకుతున్నారు.. వారి హక్కుల గురుంచి టీడీపీ ఏనాడైనా పోరాడిందా?
32వ ఆవిర్భావ వేడుకలను జరుపుకున్న తెలుగుదేశం పార్టీ ఇప్పటికైనా పేరుకే పరిమితం కాకుండా నిజంగా తెలుగువారి గురుంచి పని చేయాలని కోరుకుంటున్నారు..


 

Wednesday, March 27, 2013

అధ్యక్షా.. ఇది చూశారా?

విద్యార్థులు క్లాస్ రూమ్ లో బబుల్ గమ్ నమిలితే అయ్యవార్లు ఏమి చేస్తారు?.. మందలిస్తారు లేదా బెత్తానికి పని చెబుతారు..
అదే పని శాసన సభలో గౌరవ సభ్యులు చేస్తే అధ్యక్షుల వారు ఏమి చేస్తారు?.. ఏమీ చేయరు.. ఎందుకంటే ఎంతైనా వారు ప్రజలచే ఎన్నుకోబడ్డ  గౌరవసభ్యులు కదా?
రాష్ట్రాన్ని పీడిస్తున్న అత్యంత ప్రధాన సమస్య విద్యుత్ సంక్షోభంపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో ఓ ఎమ్మెల్యే గారు ఏమి చేస్తున్నారో తిలకించండి.. కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రసంగిస్తున్న సమయంలో సదరు సభ్యుడు హాయిగా బబుల్ గమ్ నములుతూ బుడగలు ఊదుతున్న దృశ్యమిది.. ఈ మహత్తర సన్నివేశాన్ని రాష్ట్ర ప్రజలంతా లైవ్లో తిలకించారు.. ఆ సమయంలో స్పీకర్ గారు గమనించలేదేమో? మరి సదరు సభ్యునికి ఇది తప్పు అని చెప్పాల్సిన బాధ్యత తోటి సభ్యులకు లేదా?
కొద్ది నెలల క్రితం కర్ణాటక శాసనసభలో అధికార పార్టీ సభ్యులు సెల్ ఫోన్లో నీలి చిత్రాలు చూస్తూ కెమెరా కంటికి చిక్కిపోయారు.. కొన్నా రాష్ట్రాల అసెంబ్లీల్లో సభ్యులు కొట్టుకోవడం, మైకులు విరవడం గతంలో చూశాం.. మన రాష్ట్ర అసెంబ్లీకి ఇంకా ఆ దుస్థితి రానందుకు సంతోషిద్దాం..
అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలు అవసరమా? అనే విషయంలో తరచూ చర్చ జరుగుతోంది.. ఇవాళే ఓ పత్రికలో సీనియర్ పాత్రికేయుడు భావ నారాయణ గారి ఆర్టికల్ చదివాను.. అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా సభ్యుల్లో బాధ్యత పెరుగుతుందని, తమ ఎమ్మెల్యేల పని తీరును ప్రజలు నేరుగా చూస్తారని భావించి అప్పటి పాలకులు దీనికి పచ్చ జెండా ఊపారు.. కానీ జరుగుతున్నది ఏమిటి? ప్రత్యక్ష ప్రసారాల కారణంగా అసెంబ్లీ వాగ్వాదాల కేంద్రం అవుతోంది.. అర్థ వంతమైన చర్చలు జరగడం లేదు.. అధికార, విపక్ష సభ్యులు సమస్యల పరిష్కారం కన్నా తమ వాగ్దాటిని ప్రజల ముందు ప్రదర్శించుకోవడానికి లైవ్ టెలికాస్టింగ్ ను ఉపయోగించుకుంటున్నారు..
అసెంబ్లీకి, వీధి బజార్లకు తేడా లేకుండా పోతోంది.. తాము కోరుకున్నట్లే సభ నడవాలని, తమ ఎజెండా ప్రకారమే చర్చ జరగాలనే పార్టీల ధోరణి వల్ల కొద్ది సంవత్సరాలుగా ఏనాడు సభ సవ్యంగా సాగకుండ వాయిదాల అసెంబ్లీ తయారైంది.. ఈ దుస్థితికి వారిని ఎన్నుకున్నందుకు రాష్ట్ర ప్రజలంతా సిగ్గుపడాల్సిందే..( Thanks to Bhanu)

నీళ్లు లేని హోలీ అట..


ఎవరి పుర్రెకు పుట్టిన ఆలోచనో తెలియదు కానీ బాలీవుడ్లో ఈ సారి పలువురు సెలబ్రిటీలు హోలీ వేడుకలకు దూరంగా ఉన్నారు.. నీళ్లు లేకుండా డ్రై కలర్స్ చల్లుకొని హోలీ జరుపుకోవాలని అమితాబ్, హ్రితిక్ రోషన్ సహా పలువురు ప్రముఖులు పిలుపునిచ్చారు.. ముంబయ్, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి దృష్ట్యా ఈ నిర్ణయమట..
అసలు హోలీ పండుగ అంటేనే రంగుల పండుగ.. పురాతన కాలంలో వసంతోత్సవం పేరిట జరుపుకునే వారు.. పురాణ గాథలు ఎలా ఉన్నా, వసంత రుతువు ఆగమనంలో రంగు నీటిని చల్లుకుంటూ సరదాగా గడిపేవారు.. ప్రజలు దైనందిన కష్టాలు మరచి సంతోషంగా గడపాలన్నదే మన పండుగల పరమార్థం.. నీరు లేకుండా హోలీ జరుపుకోవాలని పిలుపునివ్వడంలో ఏమైనా అర్థం ఉందా?
గాఢత ఎక్కువగా ఉండే రంగులు వాడితే శరీరానికి హానికరం లేదా కడిగేందుకు నీరు ఎక్కువ ఖర్చు అవుతుంది అని చెప్పితే అర్థం చేసుకోవచ్చు.. డ్రై కలర్స్ తో హోలీ జరుపుకున్నంత మాత్రాన అవి పోయేందుకు స్నానం చేయమా?..
నీటికి కరువు ఉన్నందున పొదుపుగా వాడాలని ప్రచారం చేసే బదులుగా, అసలు హోలీ పండుగపైనే దుష్ప్రచారం చేసే హక్కు ఈ సెలబ్రిటీలకు ఎక్కడిది?.. ఇటీవల ఓ స్వామీజీ హోలీ వేడుకల పేరిట భక్తుల మీద నీరు చల్లి దుర్వినియోగం చేశారని గోల పెట్టేశారు.. ప్రజల మనోభావాలను దెబ్బ తీయడం ఎందుకు?.. నీటికి కరువు ఉందని చెప్పి వీరు ఇళ్లలో స్నానపానాదులకు దూరంగా ఉంటున్నారా? వారానికి ఒక్కసారే స్నానాలు చేస్తూ అత్తర్లు పూసుకుంటున్నారా? మీ పబ్లిసిటీ జిమ్మిక్కుల కోసం మెజారిటీ ప్రజల విశ్వాసాలతో ఆడుకోకండి..

Tuesday, March 26, 2013

Monday, March 25, 2013

'ఖల్ నాయక్' నేరం చేయలేదా?

1993 నాటి ముంబయి పేలుళ్ల కేసులో ఆయుధాల చట్టం కింద  బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు సుప్రీం కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష ఖరారు చేయగానే దేశంలో విచిత్రమైన వాదలను వినిపిస్తున్నాయి.. కొందరు గుండెలు బాదుకుంటున్నారు.. నింగి విరిగి నేల మీద పడ్డట్లు అరచిగోల పెడుతున్నారు.. అసలు వీరు స్పృహతోనే మాట్లాడుతున్నారా? అన్నది తేలాల్సి ఉంది..
ఒక నటుడిగా సంజయ్ దత్ అంటే నాకెంతో అభిమానం..  అలాగే సంజయ్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సహ నటులు ఆయనకు సంఘీభావం ప్రకటించడాన్ని తప్పు పట్టలేం.. ఇక సినిమా వారి విషయానికి వస్తే ఆయనను నమ్ముకొని పెట్టిన కోట్లాది రూపాయల పెట్టుబడి వారికి ఆందోళనకు గురి చేసి ఉంటుంది.. అయితే చట్టం గురుంచి తెలిసిన నాయకులు, న్యాయ కోవిధులు చేస్తున్న వాదనలు విచిత్రంగా ఉన్నాయి..
మంచి కుటుంబం నుండి వచ్చిన వాడు, వారి కుటుంబం దేశానికి ఎంతో సేవ చేసింది.. అంటున్నారు. నిజమే కాదన్నది ఎవరు? ఆయన తండ్రి సునీల్ దత్, తల్లి నర్గీస్ గురుంచి తెలియని ఎవరికి? మంచి కుటుంబంలో జన్మించడం శిక్షకు మినహాయింపు కాదు కదా?
ముంబయ్ నగరాన్ని బలి తీసుకున్న పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాద ముఠాలతో సంజయ్ దత్ సంబంధాలు పెట్టుకొని ఏకే 56 గన్ సంపాదించడం అమాయకత్వం ఎలా అవుతుంది? ఇలాంటి ఆయుధాన్ని భారత సైన్యం లేదా ఉగ్రవాదులే ఉపయోగిస్తారు.. సైన్యం సంజయ్ కి ఆయుధాన్ని ఇచ్చే అవకాశమైతే లేదు.. ఇక ఆ ఆయుధం ఆయనకు ఎలా వచ్చిందో చెప్పాల్సిన అవసరం ఉందా? లేదా?
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసి, కాంగ్రెస్ జాతీయ నాయకుల్లో ఒకరైన దిగ్విజయ్ సింగ్ సంజయ్ దత్ ను వెనుకేసుకు వస్తున్న తీరు చూస్తే ఆయన రాజకీయ పరిపక్వతపై నాకే అనుమానం కలుగుతోంది.. సంజయ్‌దత్ యువకుడిగా ఉన్నప్పుడు నేరం చేశారు.. అంతేతప్ప ఆయనేం క్రిమినల్, ఉగ్రవాది కాదు.. సంజయ్‌దత్ తండ్రి సునీల్‌దత్ మతతత్వానికి వ్యతిరేకంగా, మైనారిటీలకు అనుకూలంగా గళమెత్తినందున ఆయనపై దాడులు జరుగుతాయని సంజయ్ భావించి ఉంటాడు.. ఆ సమయంలో యువకుడిగా ఉన్న సంజయ్‌దత్ వీటిని ఎదుర్కోవాలనుకునే క్రమంలోనే నేరానికి పాల్పడ్డారు.. అయితే దానికి తగిన శిక్షను ఆయన ఇప్పటికే అనుభవించారు.. ఇలా సాగాయండీ దిగ్విజయుడి వ్యాఖ్యలు.
ఇక సుప్రీం కోర్టు జడ్జిగా పని చేసిన, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ మార్కండేయ ఖట్టూ మహారాష్ట్ర గవర్నర్ కు రాసిన లేఖ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.. అత్యున్నత న్యాయ స్థానం సంజయ్ నేరం చేసినట్లు నిర్ధారించి శిక్ష ఖరారు చేసిన తర్వాత ఆయనను క్షమించ మంటూ లేఖ రాయడం న్యాయ కోవిధుడైన ఖట్టూ ఎలా సమర్థిచుకోగలరు.. సంజయ్ ఒక నటుడు, ప్రముఖుని కుమారుడు అయినంత మాత్రాన క్షమించి వదిలేయాలా? చట్టం ముందు అందరూ సమానులే అయినప్పుడు మనిషిని బట్టి న్యాయం ఉండాలని కోరుకోవడం ఏమిటి? ఇలా వ్యక్తులు, వారి హోదాలను బట్టి శిక్షలు ఖరారు చేస్తే ఇక న్యాయస్థానాలు ఉండి ఎందుకు?.. దేశ భద్రతతో ఆడుకుంటున్నామనే స్పృహతోనే క్షమాభిక్ష కోరేవారు మాట్లాడుతున్నారా?
ముంబయ్ బాంబు పేలుళ్లలో ఎంతో మంది ప్రాణాలు పోయాయి.. వాటిని తిరిగి తేగలరా? వారి కుటుంబ సభ్యుల మనోభావాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.. దాదాపు 20 ఏళ్లు ఆలస్యంగా తీర్పు వచ్చింది.. అదీ అరకొరగానే.. 

Friday, March 22, 2013

చైనాను నమ్మొచ్చా?


పంచశీల.. ఈ పదం ఎక్కడో విన్నట్లుందా?.. దీని గురుంచి తెలిసిన ఏ భారతీయుడికైనా రక్తం సలసల మరుగుతుంది.. అర్ధ శతాబ్దం నాటి చైనా వంచన గుర్తుకు వస్తుంది..
హిందూ-చీనీ భాయి భాయి అంటూ భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చైనాకు స్నేహ హస్తం ఇచ్చారు.. పంచశీల సూత్రాలపై భారత ప్రధాని నెహ్రూ, చైనా ప్రధాని చూ ఎన్ లై మధ్య ఒప్పందం జరిగింది.. ఒకరి ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని మరొకరు గౌరవించాలి, ఒకరి అంతరంగిక విషయాల్లో మరొకరు జోక్యం చేసుకోవద్దు, పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ఇరువురికీ ఆమోదయోగ్యమైన విధానాలు అవలంభించాలి, శాంతి సామరస్యాలతో మెలగాలి.. తదితర అంశాలతో రూపొందిన పంచశీల అవగాహన ఇది..
జవహర్ లాల్ నెహ్రూ గారు చైనాను గుడ్డిగా నమ్మేశారు.. అప్పటికే చైనా టిబెట్ ను ఆక్రమించేసింది.. నిజానికి బ్రిటిష్ ఇండియా సైన్యం టిబెట్ను కాపాడుతూ వచ్చింది.. భారత స్వాతంత్రం తర్వాత ఆ రక్షణ భారం మన దేశంపై పడింది.. అయితే చైనా మాయలో పడ్డ నెహ్రూజీ భారత సైన్యాన్ని అక్కడి నుండి క్రమంగా తొలగించేశారు.. చైనా సునాయాసంగా టిబెట్ ను కబ్జా చేసేసింది.. దీన్ని ప్రపంచ దేశాలన్నీ ఖండిచినా నెహ్రూ మహాశయుడు మాత్రం టిబెట్ చైనాలో అంతర్భగం అంటూ గుర్తించేశాడు.. మరోపక్క దలైలామాకు మన దేశంలో ఆశ్రయం ఇచ్చి తాను ప్రపంచ శాంతి దూతగా పేరు తెచ్చుకోవాలని కలలు కన్నారు.. కానీ ఆయన కలలు కల్లలైపోయాయి..
ఓ మాంచి ముహూర్తం చూసుకొని చైనా దొంగ దెబ్బ తీసింది.. 1962 అక్టోబరు 20న భారత దేశంపై ఏక పక్షంగా యుద్దానికి దిగింది.. ప్రపంచ శాంతి అంటూ అలీన ఉద్యమానికి నాంది పలికి ప్రపంచ నాయకుడు కావాలని కలలు కంటున్న నెహ్రూ షాక్ తిన్నాడు.. ఏ మాత్రం యుద్దానికి సిద్దంగా లేని భారత సైన్యం చిత్తుగా ఓడిపోయింది.. బ్రిటిష్ వారు మన దేశానికి స్వాతంత్రం ఇచ్చి వెళ్లిన తర్వాత సైన్యాన్ని బలోపేతం చేసే విషయంలో జవహర్లాల్ నెహ్రూ చాలా నిర్లక్ష్యం చేశారు.. ఆయనకు తోడు అసమర్ధ రక్షణ మంత్రి కృష్ణ మీనన్.. దాని ఫలితమే మన ఓటమి.. చైనాను గుడ్డిగా నమ్మి దేశం పరువు తీసిన నెహ్రూ మానసికంగా చాలా కృంగిపోయారు.. మరో రెండేళ్లకే కన్ను మూశారు..
మొదటి నుండి చైనా భారత దేశంతో శతృ వైఖరిని అవలంభిస్తూ వచ్చింది.. భారత్ పై యుద్దానకి దిగక మునుపే చైనా 1959లో పాకిస్తాన్ సహకారంతో కాశ్మీర్లోని అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని కబ్జా చేసేసింది.. భారత పార్లమెంట్ లో ఈ అంశంపై దుమారం రేగితే, గడ్డి పరక మొలవని ప్రాంతం మనకు ఉంటే ఎంత? లేకుంటే ఎంత? అన్న ధోరణితో నెహ్రూ సమాధానం ఇచ్చారు.. వళ్లు మండిన ఓ సభ్యుడు వెంటుకలు లేని మీ బట్టతల ఉంటే ఎంత? లేకుంటే ఎంత అని నిలదీశాడు.. అంతే కాదు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం తమవేనని చైనా చెప్పు కుంటోంది..
గడచిన 60 ఏళ్లలో చైనా రక్షణ పరంగా భారీగా ఆయుధ సంపత్తిని పోగేసింది.. భారత దేశం చుట్టూ ఉన్న పాకిస్తాన్, బర్మా, శ్రీలంక, మాల్దీవుల్లో సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకునే దిశగా ఆ దేశాలకు ప్యాకేజీలు చూపి బుట్టలో వేసుకుంటోంది.. ఎక్కువ పని గంటలు, చవక వేతనాలకే పని చేసే కార్మికులు ఉండే చైనా తన చవక, నాసిరకం సరుకులతో తెలివిగా భారత మర్కెట్ ను కబ్జా చేస్తోంది.. (ఇవేమీ అర్థం కాని మన వెర్రి భారతీయులు చైనా వస్తులు, చైనా బజార్ల మోజులో పడుతున్నారు..
ఇన్ని రకాలుగా భారత దేశంతో కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్న చైనా ఇప్పడు కొత్త సీసాలో పాత సారా బయటకు తీసింది.. అదే పంచశీల.. ఆనాడు పంచశీల సూత్రాలను ఉల్లంఘించి భారత దేశాన్ని మోసగించిన చైనా, ఇప్పడు మన పంచశీల సూత్రాలనే మనకు వల్లించే ప్రయత్నం చేస్తోంది.. ఇప్పడు చెప్పండి చైనాను మనం నమ్మొచ్చా? ఎన్డీఏ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా ఉన్న జార్జ్ ఫెర్నాండెజ్ చైనా మన దేశానికి అసలైన శత్రువని ప్రకటించి కుండ బద్దలు కొట్టారు.. అయితే ఇండియాలోని చైనా మిత్రులు (తొత్తులు అనడం నాకు ఇష్టం లేదు) ఆయనపై గయ్యిన లేచారు.. కానీ ఇది ముమ్మాటికి నిజం.. చైనాను నమ్మలేం..





Thursday, March 21, 2013

లంకతో శతృత్వం మనకే నష్టం

లంక విషయంలో భారత ప్రభుత్వం ఎందుకు ఊగిసలాట వైఖరితో ఉంది?.. అక్కడి తమిళులపై జరుగుతున్న అరాచకాలపై ఎందుకు నోరు మెదపలేకపోతున్నాం?.. యావత్ దేశ ప్రజలను కలవర పెడుతున్న విషయం ఇది..
ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో అమెరికా తీర్మానం, యూ.పీ.ఏ. ప్రభుత్వానికి డీ.ఎం.కే. మద్దతు ఉప సంహరణ నేపథ్యంలో శ్రీలంక సమస్యపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.. ఈ సందర్భంగా చాలా మందికి తెలియని కఠోర వాస్తవాలు మరుగున పడుతున్నాయి..


ఎల్.టీ.టీ.ఈ.తో యుద్ద సమయంలో తమిళులపై పెద్ద ఎత్తున అత్యాచారాలు, హత్యాకాండ జరిగిందని.. ప్రభాకరన్, ఆయన కుమారుడు బాలచంద్రన్ లను లంక సైన్యం దారుణంగా చంపేసిందని.. ఈ అంశాలపై అంతర్జాతీయ స్థాయి విచారణ జరిపి, అధ్యక్షడు రాజపక్షను యుద్ద నేరస్తుడుగా ఉరి తీయాలని తమిళనాడులోని రాజకీయ పార్టీలు, కొన్ని సంస్థలు ఆందోళన చేస్తున్నాయి.. ఇందులో వాస్తవం ఉంది.. కాదనలేం.. కానీ అదే సమయంలో మనం కొన్ని నగ్న సత్యాలను విస్మరిస్తున్నాం..
శ్రీలంక సాంస్కృతికంగా భారత దేశానికి సన్నిహితమైన పొరుగు దేశం.. వందల సంవత్సరాల క్రితం అశోక చక్రవర్తి కాలంలో కళింగ ( నేటి ఒడిషా) నుండి, చోళ దేశం (నేటి తమిళనాడు) నుండి ప్రజలు అక్కడికి వలసపోయారు.. ఐరోపా దేశాల వారు వర్తకం పేరిట భారత దేశానికి వచ్చినట్లే సిలోన్ (శ్రీలంక)కూ వచ్చారు.. వలస రాజ్యంగా మార్చేశారు.. బ్రిటిష్ వారు పరిపాలనా సౌలభ్యం కోసం బర్మాతో పాటు సిలోన్ ను కూడా చాలా కాలం భారత దేశంలో భాగంగానే కొనసాగించినా, తర్వాత కాలంలో విడదీశారు.. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన మరుసటి ఏడాదే (1948)లో వారికీ స్వాతంత్రం వచ్చింది.. బ్రిటిష్ వారు పోతూ పోతూ ఇండియాలో హిందూ, ముస్లింలకు చిచ్చు పెట్టి పాకిస్తాన్ ఏర్పాటు చేసినట్లే సింహళ, తమిళ వర్గాల మధ్య వివాదాలు రగిలించి మరీ పోయారు..
సిలోన్ కాస్తా శ్రీలంకగా ఆవిర్భవించింది.. బౌద్ధ మతస్తులైన సింహళీల ఆధిక్యత గల శ్రీలంకలో తమిళ భాష, సంస్కృతులుపై వివక్షత, సామాజిక ఆర్థిక, ఉద్యోగ ఉపాధి రంగాల్లో వారికి జరుగుతున్న అన్యాయం అవాస్తవాలేమీ కాదు.. ఇరు వర్గాల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు కొనసాగాయి.. సహజంగానే అధిక సంఖ్యాకులైన సింహళీలదే పైచేయి అయ్యింది.. ఈ పరిస్థితుల్లో తమిళ సంస్థలు, పార్టీలు తమ హక్కుల కోసం ఉద్యమించాయి.. ఇలాంటి ఉద్యమాల్లో విద్యార్థిగా ప్రవేశించిన వేలుపిళ్లై ప్రభాకరన్ తరువాత కాలంలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం ప్రారంభించాడు..
జాప్నా మేయర్ ను హత్య చేయడం ద్వారా లోకం దృష్టిలో పడ్డ ప్రభాకరన్ శ్రీలంకలో తన ఉనికి కోసం సాటి తమిళ సంస్థలను, వాటి నాయకులను నిర్మూలించాడు.. శ్రీలంక నుండి వేరుపడి ఈలం పేరిట ప్రత్యేక తమిళ దేశం ఏర్పడాలన్నది ఎల్.టీ.టీ.ఈ. లక్ష్యం.. ఇందు కోసం ఉగ్రవాదబాట పట్టాడు.. ప్రపంచంలోనే తొలిసారిగా మానవ బాంబులను తయారు చేసిన ఘనట ఈ సంస్థదే .. నిజానికి వారి ఈలం ప్రణాళికలో భారత దేశంలోని తమిళనాడు కూడా ఉంది..
అసలు లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్.టీ.టీ.ఈ.), దాని అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ లను తయారు చేసింది ఎవరో తెలుసా? ఈ సంస్థకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించింది ఎవరు?.. ఇంకెవరో కాదు మన భారత ప్రభుత్వాధి నేతలు, తమిళనాడు రాజకీయ నాయకులు.. ఈ సంస్థకు అప్పట్లో తమిళనాడు భూభాగంలో సైనిక శిక్షణ కూడా ఇచ్చారు.. ప్రభాకరన్ కు నాటి భారత ప్రధాని రాజీవ్ గాంధీ, తమిళనాడు సీఎం ఎంజీఆర్, కరుణానిధి తదితర నాయకులతో సన్నిహిత సంబంధాలు కూడా ఉండేవి..
శ్రీలంకలో అక్కడి ప్రభుత్వానికి, ఎల్.టీ.టీ.ఈ దళాలకు జరిగిన భీకర పోరులో ఎందరో లంక తమిళులు కట్టుబట్టలతో సముద్రం దాటి తమిళనాడుకు శరణార్థులుగా రావడంతో భారత ప్రభుత్వానికి సెగ తగలడం ప్రారంభమైంది.. ప్రభాకరన్ ను కట్టడి చేయక తప్పదని అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీకి అర్థం అయ్యింది.. ఫలితంగా లంక అధ్యక్షుడు జే.ఆర్.జయవర్ధనేతో జరిగిన ఒప్పందంలో భాగంగా అక్కడికి భారత సైన్యాన్ని శాంతి పరిరక్షక దళం పేరిట పంపారు. ఈ పోరులో ఎందరో ఎల్టీటీఈ దళాలతో పాటు భారత సైనికులు కూడా పెద్ద సంఖ్యలో చనిపోయారు.. దేశం కాని దేశంలో ఎవరి కోసం ఈ త్యాగాలు అనే విమర్శలు కూడా వచ్చాయి.. ఈలోగా ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయి రాజీవ్ గాంధీ గద్దె దిగాల్సి వచ్చింది.. ఇండియాలో వీపీ సింగ్ ప్రధానిగా, లంకలో ప్రేమదాస అధ్యక్షునిగా అధికారం చేపట్టారు.. ఇరువురూ ఒప్పందాన్ని తిరగదోడారు.. ఈ పరిస్థితుల్లో అత్యంత అవమానకరంగా భారత సైన్యం శ్రీలంక నుండి వెనుదిరగాల్సి వచ్చింది..
ఇక్కడే అసలు కథ మలుపు తిరిగింది.. తమపై పోరుకు భారత సైన్యాన్ని పంపిన రాజీవ్ గాంధీపై ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ కన్నెర్ర చేశాడు.. దీని ఫలితమే రాజీవ్ గాంధీ దారుణ  హత్య.. లోక్ సభ ఎన్నికల వేళ తమిళనాడులో ప్రచారానికి వచ్చిన రాజీవ్ ను మానవ బాంబుతో ప్రభాకరన్ హత్య చేయించాడు.. ఆ సమయంలో తమిళనాడు సీఎం కరుణానిధి.. సరిగ్గా ఎన్నికల వేళ రాజీవ్ హత్య జరగడంలో ఎల్టీటీఈ సానుభూతి పరుడైన కరుణానిధి పార్టీ డీఎంకే చిత్తుగా ఓడిపోయింది.. తమిళనాడు ప్రజలంతా ఆ సంస్థను అసహ్యించుకున్నారు..
విచిత్రం ఏమిటంటే తన భర్తకు చంపిన ఎల్టీటీఈ ఉగ్రవాదులకు సోనియా గాంధీ క్షమించేయడం.. సరే ఈ విషయంలో ఆమె విశాల హృదయాన్ని అభినందిద్దాం.. కానీ ఎల్టీటీఈకి సానుభూతి తెలిపే కరుణానిధి డీఎంకేతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం మరో విచిత్రం.. శ్రీలంక సైన్యం ప్రభాకరన్ను, ఎల్టీటీఈ దళాలను పూర్తిగా మట్టు పెట్టినప్పుడు తమిళనాడు సీఎంగా ఉండి, యూపీఏ సర్కారులో మంత్రి పదవులు ఎంజాయ్ చేసిన కరుణానిధి కిమ్మనలేదు.. చెన్నయ్ బీచ్లో ఒక పూట నిరహార దీక్ష చేశాడు అంతే.. కానీ అదే కరుణానిధి వారు ఇప్పడు అధికారం పోయాక, లంకలో ఇప్పడే ఏదో కొత్తగా జరిగినట్లు ఇల్లు పీకి పందిరేయడాన్ని ఏవిధంగా అర్ధం చేసుకోవాలి..
ప్రతి దేశం తన ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని ఎదుటి దేశం గౌరవించాలని కోరుకుంటుంది.. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీలంక ఆంతరంగిక వ్యవహారాల్లో మన దేశం తల దూర్చడం ఎంత వరకూ సమంజసం? కాశ్మీర్ విషయంలో మనం ఇతరుల జోక్యాన్ని ఎలా వ్యతిరేకిస్తున్నామో, శ్రీలంక సైతం మన దేశం తనతో అలాగే ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు.. తమిళనాడు రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం అక్కడి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి.. లంక సైన్యం పోరాటం చేసింది తమిళులపై కాదు, ఎల్టీటీఈపైన.. నిజానికి ప్రభాకరన్ మన దేశానికి కూడా శత్రువు, మన మాజీ ప్రధానిని హత్య చేసిన సంస్థకు మనం ఎలా మద్దతు ఇవ్వగలం?

ఇప్పటికే మన విదేశాంగ విధానం గాడి తప్పింది.. శ్రీలంక క్రమంగా చైనాకు సన్నిహితం అవుతోంది.. ఈ పరిస్థితుల్లో లంకతో శత్రు వైఖరి మన దేశ ప్రయోజనాలకు నష్టదాయకమే అవుతుంది.. శ్రీలంకలో మైనారిటీలుగా ఉన్న తమిళుల ప్రయాజనాల కోసం మనం వత్తిడి తేవాల్సిందే.. అయితే లంకతో కయ్యానికి దిగితే నష్టపోయేది అక్కడి తమిళులే అని గ్రహించాల్సిన అవసరం ఉంది.. ఈ విషయంలో తమిళనాడు ప్రజలు స్వార్థ రాజకీయ పార్టీల ప్రచార మత్తులో పడకుండా విశాల దృష్టితో ఆలోచించాలి.. శ్రీ

Sunday, March 17, 2013

Saturday, March 16, 2013

రత్నాలయంలో నాకు కనిపించిన 10 నిత్య సత్యాలు


1. వంద కోట్లకు అధిపతైనా నిమిషం ఆయుష్షు కొనలేవని తెలుసుకో..
2. కోటి కోట్లకు వారసునివైనా ఊపిరి పోగానే ఊరి బయట పారేస్తారని తెలుసుకో..
3. వంద మంది డాక్టర్లు నీ వెంట ఉన్ననూ పరలోక ప్రయాణం ఆపలేరని తెలుసుకో..
4. ప్రపంచానికంతా అధిపతివైననూ నీ ఆయుష్షుకు అధిపతి కాలేవని తెలుసుకో..
5. యావత్ ప్రపంచాన్ని జయించగలిగిననూ మృత్యువును జయించలేవని తెలుసుకో..
6. కాలం విలువైనది.. రేపు అనుదానికి రూపు లేదు.. మంచి పనులు వాయిదా వేయరాదని తెలుసుకో..
7. లక్షలు, కోట్లు ఉన్నాయని మురిసిపోవద్దు.. ఆ కోట్లు నీ వెంట రావని, మృత్యువు నుండి తప్పించుకోలేవని తెలుసుకో..
8. నీవు తిన్నది మట్టిపాలు.. ఇతరులకు ఇచ్చినది నీపాలని తెలుసుకో..
9. నీవు దాచుకున్నది జారిపోతుంది.. ఇతరులకు ఇచ్చి సహకరించినది నీ ఖాతాలో జమ అవుతుందని తెలుసుకో..
10. భోగాలకు ఖర్చు చేసి రోగాలను తెచ్చుకోకు.. మంచి పనులకు ఖర్చు చేసి పుణ్యాన్ని పెంచుకో.. నీ పుణ్యమే నీ చేతి రాతను నిర్ణయించునని తెలుసుకో..

అలిపిరి నుండి తిరుమల వెళ్లే మెట్ల మార్గంలో నాకు కనిపించిన భక్త హనుమాన్..


విఫల విదేశాంగ విధానం

జనాభా రీత్యా ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది మన దేశం.. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు ఉంది మన దేశానికి.. ఏ దేశానికి వెళ్లినా భారతీయులు తమదైన ముద్రను వేస్తున్నారు.. శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకెళ్లుతున్నారు.. మన సంస్కృతీ సాంప్రదాయాల కారణంగా ప్రత్యేక గౌరవాన్ని అందుకుంటున్నాం.. కానీ..
దురదృష్టవశాత్తు విదేశాంగ విధానంలో భారత దేశం రాను రానూ అంతర్జాతీయంగా చులకనైపోతోంది.. ఇతర దేశాలు మనను చూసి నవ్వుకునే పరిస్థితి ఏర్పడింది.. భారతీయ మత్స్యకారులను చంపిన తమ నావికులకు అప్పగించేది లేదని ఇటలీ తేల్చి చెప్పడంతో దిక్కుతోచని పరిస్థితే ఇందుకు నిదర్శనం.. సముద్రంలో భారతీయ జలాల్లో మన దేశ పౌరులను చంపడమే తప్పయితే, వారు సోమాలియా సముద్ర దొంగలుగా పొరబడ్డామని.. అంతర్జాతీయ సముద్ర జలాల్లో జరిగిన సంఘటనకు తమను శిక్షించే అధికారం భారత దేశానికి లేదని దబాయించడం ఇటలీకే చెల్లింది.. తమ దేశంలో ఎన్నికలు ఉన్నాయని, ఓటు వేసేందుకు తమ పౌరులకు బెయిల్ ఇవ్వాలని కోరి విడిపించుకున్న ఇటలీ ప్రభుత్వం, ఇప్పడు వారిని అప్పగించేది లేదు పొమ్మనడం చేయడం స్పష్టంగా కండకావరమే..
నిజానికి ఇటలీని గుడ్డిగా నమ్మి ఆ దేశ నావికులకు బెయిల్ ఇవ్వడం మన అమాయకత్వమే.. ఈ విషయంలో మనం ఉదారంగా ఉన్నా, ఆ దేశం అవమానకరంగా వ్యవహరించడం ద్వారా భారత దేశ సార్వభౌమత్వానికే సవాలు విసిరింది.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఇటలీపై ఎన్ని రకాలుగా హుంకరించినా ఫలితం ఏముంటుంది?.. దౌత్య విధానంలో భారత దేశ వైఫల్యానికి ఈ సంఘటన ఉదాహరణ మాత్రమే.. నిజానికి ఈ రకమైన వైఫల్యం మన దేశానికి తొలిసారి కానేకాదు.. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాలం నుండీ మనం ఇలాంటి తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నాం..
కాశ్మీర్ కుంపటి ఈనాటికి రగలడానికి కారణం ఎవరో ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. 1947లో భారత దేశంలో విలీనం అవుతున్న కాశ్మీర్ పై పాకిస్తాన్ సైన్యం దొంగదాడి చేస్తే మన సైన్యాలు విజయవంతంగా తిప్పి కొట్టాయి.. కానీ నెహ్రూజీ ఈ అంశాన్ని ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్లి అంతర్జాతీయం చేశారు.. సగం కశ్మీర్ ఇంకా పాక్ చేతిలోనే ఉంది.. ఆ దేశం కాశ్మీర్ సమస్యకు నిత్యం ఆజ్యం పోస్తూనే ఉంది.. మన దేశంలో తీవ్రవాద కార్యకలాపాల వెనుక పాక్ ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తున్నా, ఇంకా ఆ దేశంతో స్నేహ సంబంధాలు ఆశించడం వెర్రిబాగుల తనమే.. అలాగే హిందీ-చీనీ భాయ్ భాయ్ అంటూ నెహ్రూ గుడ్డిగా చైనాను నమ్మేశారు.. ఆయన స్నేహ హస్తాన్ని వమ్ము చేస్తూ చైనా 1962లో భారత దేశంపై యుద్దానికి దిగింది.. కాశ్మీర్లోని అక్సాయి చిన్, ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన అరుణాచల్ ప్రదేశ్ తమవేనంటూ చైనా దబాయిస్తున్నా ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నాం..
నెహ్రూ తదనంతరం కూడా మన దౌత్య వైఫల్యాలు కొనసాగుతూనే ఉన్నాయి.. పాకిస్తాన్ కబంద హస్తాల నుండి విడిపోయి స్వతంత్ర దేశంగా నిలిచేందుకు బంగ్లాదేశ్ కు మన ఎంతో సాయం చేశాం.. కానీ ఈ విషయంలో మనకు రుణ పడాల్సిన బంగ్లాదేశ్ నేతలు అందుకు విరుద్దంగా మన దేశంలో తీవ్రవాద శక్తులకు ఊతం ఇస్తూనే ఉన్నారు..
భారత దేశానికి విశ్వాసపాత్ర మిత్రునిగా ఉండాల్సిన శ్రీలంక కూడా క్రమంగా చైనా విష కౌగిలిలోకి జారుకుంటోంది.. కరవ మంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లు తయారైంది మన దేశ పరిస్థితి.. తమిళుల సమస్య మనకు కొరగాని కొయ్యగా మారిపోయింది.. తమిళనాడు రాజకీయ పార్టీల వత్తిడి కారణంగా లంక ప్రభుత్వంతో మన దేశ సంబంధాలు డోలాయామంలో పడ్డాయి..
భారత దేశం నుండి ఎంతో లబ్ది పొందిన ద్వీప రాజ్యం మాల్దీవ్స్ సైతం తోక జాడించేసింది.. అక్కడి తిరుగుబాటు దారులు భారత అనుకూల అధ్యక్షున్ని గద్దె దించారు.. చైనాతో సంబంధాలు పెంచుకున్నారు.. జీఎంఆర్ కాంట్రాక్ట్ రద్దు చేయడం ద్వారా భారత దేశానికే సవాలు విసిరింది మాల్దీవ్స్ ..
సాంస్కృతికంగా భారత దేశంతో పురాతన కాలం నుండి సంబంధాలు ఉన్న నేపాల్ సైతం చైనా ఉచ్చులో పడింది.. చైనా చాలా తెలివిగా మన దేశాన్ని చుట్టు ముడుతోంది.. హిందూ మహా సముద్రంలో స్థావరాలు నెలకొల్పినా చేష్టలుడిగిపోతున్నాం.. చైనా భయంతో బర్మాలో ప్రజాస్వామ్య పోరాటానికి మద్దతు ఇవ్వలేక, సైనిక పాలకులను సమర్ధించలేక మన దేశం సతమతం అవుతోంది..
ప్రచ్చన్న యుద్ద కాలంలో భారత దేశం అలీనోద్యమాన్ని తెరపైకి తెచ్చినా, దాన్ని కొనసాగించకుండా కమ్యూనిస్టు సోవియట్ యూనియన్ తో దోస్తీ కట్టింది.. ఫలితంగా పెట్టుబడి దారీ అమెరికా మనపై శీత కన్నేసింది.. సోవియట్ యూనియన్ పతనం తర్వాత అనివార్యంగా అమెరికా-ఇండియాలు సంబంధాలు ఏర్పరచుకున్నాయి.. ఇందుకు మార్కెట్ అవసరాలే కారణమని చెప్పక తప్పదు.. ప్రపంచీకరణ, సరళీకృత ఆర్ధిక విధానల పేరిట మన విదేశాంగ నీతిని దారి మరలిస్తున్నాం..


ప్రపంచానికి నాయకత్వం వహించే స్థితిలో ఉండాల్సిన మన దేశం ఇతర దేశాల దృష్టిలో చులకనైపోవడం భారతీయులందరికీ అవమానకరం.. దక్షిణాసియాలో పెద్దన్న పాత్ర పోషించాల్సిన ఇండియాను పొరుగు దేశాలే ఖాతరు చేయనప్పడు.. ఇటలీ, అమెరికా, చైనాలు గౌరవిస్తాయని భావించడం అత్యాశే అవుతుంది.. చివరగా ఈ పరిస్థితికి కారణం ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం కటువుగానే చెప్పక తప్పదు.. మన దేశానికి సమర్ధ నాయత్వం లోపించింది.. స్వతంత్రించి నిర్ణయాలు తీసుకునే నాయకత్వమే లేదు.. ఇప్పడు మన దేశం సమర్థ నాయకుని కోసం ఎదురు చూస్తోంది.. ఈ విషయంలో మనం రాజకీయాలు పక్కన పెట్టి సీరియస్ గా అలోచించాల్సిన సమయం వచ్చింది.. 

Tuesday, March 12, 2013

యూపీఏ ప్రభుత్వానికి, కాంగ్రెస్ అధిష్టానం పెద్దలకు తెలుసో లేదో..

Saturday, March 9, 2013


మహాశివరాత్రికి ఎంతో ప్రాధాన్యత ఉంది.. త్రిమూర్తుల్లో ఒకరు, లయకారుడై పరమ శివుడు ఈ రోజే జన్మించాడని శివ పురాణం చెబుతోంది.. ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి హిందువులకు అత్యంత పర్వదినం. శివరాత్రి రోజున తెల్లవారుజామున లేచి, స్నానం చేసి, పూజలు చేసి రోజంతా ఉపవాసం ఉంటారు.. రాత్రి అంతా జాగరణము చేసి మరునాడు భోజనం చేస్తారు. శివరాత్రి నాడు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు, మన రాష్ట్రంలోని పంచారామాలు, శైవ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకములు, అర్చనలు, శివలీలా కథాపారాయణలు జరుపుతారు..
అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు..

హట్సాప్ దివాన్ సాబ్..

 పాకిస్తాన్ ప్రధానమంత్రి రజా పర్వేజ్ అష్రాఫ్ కు పరాభవం ఎదురైంది.. ఆజ్మీర్ లోని ప్రఖ్యాత ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గాను సందర్శించారు పాక్ ప్రధాని.. దర్గా దివాన్ జైనుల్ అబేదిన్ అలీఖాన్ అష్రాఫ్ రాకను వ్యతిరేకించారు.. ఇటీవల సరిహద్దులో భారత జవాన్ల తలలు నరికిన పాకిస్తాన్ కనీసం క్షమాపణ అయినా చెప్పనందుకు నిరసనగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.. మతం కన్నా దేశ గౌరవానికి ప్రాధాన్యత ఇచ్చిన అలీఖాన్ సాబ్ కు నిజంగా దేశ ప్రజలు జేజేలు చెప్పాలి..

ఒకవైపు దర్గా దివాన్ పాకిస్తాన్ ప్రధాని పర్యటనను బహిష్కరిస్తే, ఘనత వహించిన మన విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఆయనకు ఎదురేగి స్వాగతం పలికి గౌరవార్ధం విందు కూడా ఇచ్చారు.. సరే అతిధి దేవో భవ అని విందు ఇచ్చారనే అనుకుందాం.. పనిలో పనిగా నిరసన తెలిపితే ఎంత హుందాగా ఉండేది..

Friday, March 8, 2013

మహిళల పార్టీ రావాలి

చెట్టు ముందా, విత్తు ముందా అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే.. అలాగే ప్రకృతిలో స్త్రీ, పురుషుల్లో ఎవరు అధికం అని ప్రశ్నించడం అవివేకమే.. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ కానే కాదు.. బండికి రెండు ఇరుసుల్లా ఇద్దరూ సమానమే.. దురదృష్ట వశాత్తు ప్రపంచం ఇంత వేగంగా దూసుకెళుతున్నా, మానవుని మేథస్సు కొత్త పుంతలు తొక్కి కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తున్నా పురుష పుంగవుల దృష్టికోణం మారలేదు.. ఆధిక్యత అనేది పోటీలో ఉండాలి.. కానీ లైంగిక కోణంలో ఆధిక్యతను ప్రదర్శించడం వల్లే సమస్యలు వస్తున్నాయి..
ఇవాళ ప్రపంచ మహిళా దినోత్సవం అంటూ ఘనంగా జరుపుకుంటున్నారు.. నిజానికి మంచి పద్దతి కాదని నా అభిప్రాయం.. ఏం మహిళలను ఈ ఒక్కరోజే గౌరవించాలా? ప్రతి రోజూ గౌరవించాల్సిందే.. ఒక తల్లిగా, సోదరిగా, జీవిత భాగస్వామిగా, స్నేహితురాలిగా వారు అన్ని రంగాల్లోనూ విజయాలు సాధించాలని కోరుకుందాం..
మన దేశంతో సహా ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై వివక్షత అన్ని విషయాల్లోనూ కొనసాగుతోంది.. అత్యాచారాల వార్తలు లేని దిన పత్రికను చూడటమే అరుదైపోయింది.. ఇది చాలా సిగ్గు చేటైన విషయం.. ఢిల్లీలో జరిగన అమానవీయ సంఘటనలు దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నాయి.. రేపిస్టులకు కఠిన శిక్షల విషయంలో రాజీ ధోరణి దురదృష్టకరం..
సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మహిళలు తమ సత్తాను చాటుకుంటున్నారు.. చట్ట సభల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేక్షషన్ల విషయంలో జరుగుతున్న నాటకాలు చూస్తుంటే మన రాజకీయ పార్టీల ముసుగులు స్ఫష్టంగా బయటపడుతున్నాయి.. అసలు రిజర్వేషన్లు అవసరమా?
మన దేశంలో కులానికి, వర్గానికి, మతానికి, భాషకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు ఎన్నో ఉన్నాయి.. మరి మహిళలే పార్టీ తమ కోసం రాజకీయ పార్టీ ఎందుకు పెట్టుకోకూడదు.. పటిష్టమైన ఓటు బ్యాంకుగా మారితే రిజర్వేషన్ల కోసం దేబిరించాల్సిన అవసరం ఏమిటి.. వారే పాలకులుగా ఆవిర్భవించొచ్చు కదా? అధికారం చేతిలో ఉంటే చట్టాలను ఉపయోగించి తోక జాడించే పురుష పుంగవులను దారిలో పెట్టొచ్చు.. ఈ దిశగా మనం ఎందుకు ఆలోచించడం లేదు?..

Thursday, March 7, 2013

చీకటి రాజ్యం


ఆంధ్రప్రదేశ్ ఎన్నడూ లేనంతగా విద్యుత్ సంక్షోభంలో పడింది.. కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియదు.. పరీక్షల వేళ కరెంటు కోతలు విద్యార్థులను హడలెత్తిస్తున్నాయి.. మా రోజుల్లో కిరోసిన్ దీపాలు, వీధి లైట్ల కింద చదువుకునేవారం అని పెద్దలు చెప్పుకోవడాన్ని నమ్మలేక పోయిన పిల్లలకు ఇప్పడు అసలు విషయం తెలిసొచ్చింది పాపం..
పట్టణాలకన్నా గ్రామాల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది.. మోటార్లకు కరెంటు అందక పంటలన్నీ ఎండిపోతున్నాయి.. భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి.. వేసవి ఆరంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే రెండు నెలలు ఇంకెంత గడ్డుగా ఉంటాయో, ఊహించడానికే భయంగా ఉంది..
కరెంటు కోతలతో ఇప్పటికే పారిశ్రామిక రంగం దివాలా తీసే స్థితికి చేరించి.. హైదరాబాద్ శివార్లలో చిన్న తరహా పరిశ్రలు ఎన్నో మూత పడ్డాయి.. కొన్ని వేల మంది ఉపాధికి ముప్పు వచ్చే పరిస్థితి ఏర్పడింది.. ఉత్పాదన, ఉపాధి అవకాశాలే దెబ్బతిన్నప్పుడు రాష్ట్రం ఎలా అభివృద్ధి సాధిస్తుంది?..
ప్రాజెక్టుల్లో నీరే లేనప్పడు జల ఉత్పత్తి ఎలా చేస్తారు? గ్యాసే లేనప్పడు గ్యాస్ ఆధారిత ఉత్పత్తి అసాధ్యంగా మారింది.. భారమంతా థర్మల్ విద్యత్తు పైనే పడింది.. అసలు ఈ పరిస్థితికి కారణం ఎవరు? ముందు చూపులేని చేతగాని ప్రభుత్వమే.. విద్యుత్తు ఛార్జీలు అడ్డగోలుగా పెంచేసి ప్రజలను దోచుకోవడంలో చూపే శ్రద్ధలో పదో వంతైనా విద్యుత్తు రంగ సంక్షోభం నుండి గట్టెక్కడం పై పెట్టి ఉంటే ఈ కష్టాలు వచ్చి ఉండేవా?


ముఖ్యమంత్రి సైతం విద్యుత్తు సంక్షోభాన్ని అంగీకరిస్తూ చేతులెత్తేసినప్పుడు ఇక ఈ రాష్ట్ర ప్రజలకు దిక్కెవరు? ఆంధ్ర ప్రదేశ్ కాస్తా అంధేరాప్రదేశ్ గా మారిపోయింది..

Tuesday, March 5, 2013

ఇంకా అర్హత రాలేదు పాపం..


రాహుల్ గాంధీకి ప్రధాన మంత్రి పదవిపై ఆసక్తి లేదంట.. వచ్చే ఎన్నికల్లో రాహుల్ ప్రధాని అభ్యర్థి అనే ప్రచారానికి స్వయంగా తెరదించుకున్నారు.. అవునులే చేతిలో రిమోట్ (అధికారం) ఉన్నాక ప్రధాని పెదవి ఎందుకు? నరేంద్ర మోడి అన్నట్లు ప్రధాని పదవి అంటే వారి దృష్టిలో అది రాత్రి కాపలారునికి పని.. మంచొ జరిగితే క్రెడిట్ మనకు, చెడు జరిగితే ఆ పదవిలో ఉన్నాయనే బలి.. వాట్ ఎన్ ఐడియా రాహుల్ జీ.. పాపం మన కాపలాదారుడిని పాపాలను భరించే రాత్రి ఇంత సుదీర్ఘ కాలం ఉంటుందని తెలియదు పాపం..
సో చివరగా చెప్పొచ్చే దేమిటంటే రాహుల్ జీకి ప్రధాని పదవిపై ఆశ లేదు.. అన్నారంటే తనకు దేశానికి పాలించే అర్హత లేదనో లేక శక్తి లేదనో స్వయంగా ఒప్పేసుకున్నారు.. మరెందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం?

దోశె క్యాంపులకు రెడీ కండి..

తెలంగాణకు పరిష్కారం దోశ వేసినంత సులువు కాదంటున్నారు వయలార్ రవి.. రవి భోజన ప్రియుడని చూస్తూనే తెలుస్తోంది.. ఆ మాటకొస్తే పాలక కుటుంబ భజన పరుడు కూడా.. కానీ వంటలు చేయడంలో కూడా అనుభవం ఉందని చెప్పకనే చెప్పారు.. దోశ వేయడమంత సులువు కాదని.. వయలార్ రవి కేరళలో ఏనాడో కొట్టు కట్టేశారు.. రేపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోతే.. రవి దోశె కొట్టు (Dose Camp) పెట్టుకోవాల్సిందే.. తెలంగాణ సమస్యను పరిష్కరించడం చేతగాక పోతే చేతులెత్తేయండి వయలార్ గారూ.. వెటకారాలు ఎందుకు? ఇంకా తెలుగు ప్రజలను ఎంత కాలం మోసం చేస్తారు?

Saturday, March 2, 2013

మొద్దు చర్మాలు భరిస్తున్నాయి

 మళ్లీ పెట్రోలు రేటు పెరిగింది.. సామాన్యుడి నడ్డి విరిగిందని ప్రతి పక్షాలు గోల పెట్టేశాయి.. ధరను తగ్గించే దాకా ఉద్యమిస్తాం.. ప్రభుత్వం మెడలు వంచుతాం అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాయి..

ఈలోగా నాలుగు రోజులు గడచిపోతుంది.. ప్రజలకు నొప్పి తగ్గిపోతుంది.. ప్రతిపక్షాలు మౌనంగా ఉండిపోతాయి.. అదను చూసి మరోసారి ప్రభుత్వం పెట్రోలు ధరను పెంచేస్తుంది.. మళ్లీ సీన్ రిపీట్..
యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోలు, డీజీల్, గ్యాసు ధరలు లెక్కలేనన్నిసార్లు పెరిగాయి.. 2013 సంత్సరంలో మూడు సార్లు పెట్రోలు ధర పెరిగితే.. పక్షం రోజుల్లోనే రెండు సార్లు వాత పడింది.. ఇలా ఎన్ని సార్లు పెట్రో పడ్డా భరించే రీతిలో దేశ ప్రజలకు ప్రజలకు మొద్దు చర్మం వచ్చేసింది..

Friday, March 1, 2013

ఎందుకీ ఏడ్పులు?

నాయకుడంటే సామాన్య ప్రజల దృష్టిలో తమ కష్టాలు తీర్చేవారు.. మార్గదర్శులు.. ముందు ఉండి పోరాడే వారు.. కానీ వారే కన్నీరు పెట్టేస్తే ఎలా? కన్నీరు పెట్టడం అంటే ఓటమిని అంగీకరించడమే.. ధృడమైన మనస్సుతో ఒకరికి ఆదర్శంగా ఉండాల్సిన నాయకులే ఏడ్చేస్తే ఎలా? 
ఇక్కడ నేను లోతుల్లోకి పోదలచెకోలేదు కానీ తెలుగుదేశం నాయకులు ఇటీవల ఒక్కోరు ఒక్కో కారణంతో కంట తడి పెట్టడం , వలవలా ఏడ్చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది.. ప్రజల సమస్యలు చూసి కన్నీరు వచ్చిందని సమర్ధించుకోవచ్చునేమో కానీ వారి కన్నీరు తూడ్చి ధైర్యం చెప్పాల్సిన వారే ఏడ్చేస్తే ఎలా? 
అయితే ఒక రకమైన కన్నీరుకు, విచారానికి మినహాయింపు ఉంది.. దీన్ని అందరూ అర్థం చేస్తుకోవచ్చు.. అత్యంత సన్నిహితులను కోల్పోయినప్పడు లేదా దారుణ సంఘటనలు జరిగినప్పుడు ఎంతటి వారికైనా కన్నీరు వచ్చేస్తుంది.. నిజానికి ఇలాంటి సమయాల్లో కన్నీరు రాని వారు మానవత్వం లేని వారికిందే లెక్క.. కానీ ఇతరత్రా కారణాలకు కన్నీరు పెట్టడంలో ఔచిత్యం ఏమిటో నాకైతే అర్థం కాదు..