Friday, March 29, 2013

తెలుగు 'లేని' దేశం


తెలుగు దేశం పార్టీ.. 1982 మార్చి 29న నందమూరి తారక రామారావు ఈ పార్టీని ఏర్పాటు చేసినప్పుడు ఇదేమి పేరని అంతా చర్చించుకున్నారు.. తెలుగు జాతి ఆత్మ గౌరవ నినాదంతో రాజకీయాల్లోకి వచ్చిన తొమ్మిది నెలల కాలంలోనే ఎన్టీ రామారావు రాష్ట్రంలో ఎదురు లేని కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారాన్ని కైవసం చేసుకున్నారు.. అప్పటి వరకూ ఢిల్లీ పాలకులకు దక్షిణ భారతీయులంటే మద్రాసీలనే తెలుసు.. ఎవరు అవునన్నా కాదన్నా తెలుగు వారికి జాతీయ స్థాయిలో గౌరవ స్థానం కల్పించడంలో ఎన్టీఆర్ పాత్రను కాదనలేం.. తెలుగు భాష , సంస్కృతీ సాంప్రదాయాలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారాయన..
1995లో రామారావును బలవంతంగా పదవీచ్యుతున్ని చేసి పార్టీ పగ్గాలు, ముఖ్యమంత్రి పదవిని కైవసం చేసుకున్న ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు పార్టీ రూపు రేఖలే మార్చారు.. పార్టీ పేరులోనే తెలుగు ఉంది కానీ మన భాషా సంస్కృతుల పరిరక్షణకు బాబు పెద్దగా చేసిందేమీ లేదు.. ప్రభుత్వ పాలనలో తెలుగు భాష అమలు దిగజారింది కచ్చితంగా చంద్రబాబు హయాలోనే.. సచివాలయం దగ్గర  ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం తెలుగు తల్లి విగ్రహాన్ని క్రేన్ తో పెకిలిస్తే సగానికి విరగడం ఇందుకు పరాకాష్ట.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు హడావిడిగా కొత్త విగ్రహాన్ని చేయించి సచివాలయం ఎదుట ప్రతిష్టించారు.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రచారం హోరులో తెలుగు మీడియం పాఠశాలు దెబ్బతిని ఒక తరం మాతృ భాషకు దూరమైంది బాబు గారి హయాంలోనే అని గర్వంగా చెప్పుకోవచ్చు.. చివరకు టీడీపీ వెబ్ సైట్ల్ లోనూ ఆంగ్లానికే పెద్ద పీట..
వరుగగా రెండు పర్యాయాలు అధికారానికి దూరమై మళ్లీ ముఖ్యమంత్రి పదవి కోసం అష్ట కష్టాలు పడుతూ పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగు దేశం ఇప్పడు నాలుగు రోడ్ల కూడలిలో ఉంది.. తెలంగాణా ఏర్పడుతుందా? సమైక్యాంధ్రగానే కొనసాగుతుందా అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది.. కానీ తెలుగు దేశం అనే పార్టీ అవసరం కొంతైనా ఉందని నేను నమ్ముతున్నాను.. నిజానికి నేను చాలా విషయాల్లో ఈ పార్టీకి బద్ధ వ్యతిరేకిని..
దురదృష్ట వశాత్తు తెలుగు దేశం తెలుగు వారందరి ప్రయోజనాలు కాపాడటం కోసం ఏర్పడ్డ పార్టీ.. కానీ టీడీపీ ఒక పరిధి గీసుకొని ఆంధ్ర ప్రదేశ్ కే పరిమితమైపోయింది.. తనకు తాను ఒక చెరసాల నిర్మించుకుంది.. తమిళనాడులో అక్కడి ద్రవిడ పార్టీలన్నీ శ్రీలంకలో తమిళుల ప్రయోజనాల కోసం పోరాడుతున్నాయి..(మొసలి కన్నీరే అనుకోండి) కానీ తెలుగు దేశం పార్టీ ఏనాడైనా పొరుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారి కష్టాలను పట్టించుకుందా? అక్కడి తెలుగు వారు తమ భాష, సంస్కృతుల విషయంలో అడుగడుగునా వివక్షకు గురై ద్వితీయ శ్రేణి పౌరులుగా బతుకుతున్నారు.. వారి హక్కుల గురుంచి టీడీపీ ఏనాడైనా పోరాడిందా?
32వ ఆవిర్భావ వేడుకలను జరుపుకున్న తెలుగుదేశం పార్టీ ఇప్పటికైనా పేరుకే పరిమితం కాకుండా నిజంగా తెలుగువారి గురుంచి పని చేయాలని కోరుకుంటున్నారు..


 

No comments:

Post a Comment