Monday, March 25, 2013

'ఖల్ నాయక్' నేరం చేయలేదా?

1993 నాటి ముంబయి పేలుళ్ల కేసులో ఆయుధాల చట్టం కింద  బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు సుప్రీం కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష ఖరారు చేయగానే దేశంలో విచిత్రమైన వాదలను వినిపిస్తున్నాయి.. కొందరు గుండెలు బాదుకుంటున్నారు.. నింగి విరిగి నేల మీద పడ్డట్లు అరచిగోల పెడుతున్నారు.. అసలు వీరు స్పృహతోనే మాట్లాడుతున్నారా? అన్నది తేలాల్సి ఉంది..
ఒక నటుడిగా సంజయ్ దత్ అంటే నాకెంతో అభిమానం..  అలాగే సంజయ్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సహ నటులు ఆయనకు సంఘీభావం ప్రకటించడాన్ని తప్పు పట్టలేం.. ఇక సినిమా వారి విషయానికి వస్తే ఆయనను నమ్ముకొని పెట్టిన కోట్లాది రూపాయల పెట్టుబడి వారికి ఆందోళనకు గురి చేసి ఉంటుంది.. అయితే చట్టం గురుంచి తెలిసిన నాయకులు, న్యాయ కోవిధులు చేస్తున్న వాదనలు విచిత్రంగా ఉన్నాయి..
మంచి కుటుంబం నుండి వచ్చిన వాడు, వారి కుటుంబం దేశానికి ఎంతో సేవ చేసింది.. అంటున్నారు. నిజమే కాదన్నది ఎవరు? ఆయన తండ్రి సునీల్ దత్, తల్లి నర్గీస్ గురుంచి తెలియని ఎవరికి? మంచి కుటుంబంలో జన్మించడం శిక్షకు మినహాయింపు కాదు కదా?
ముంబయ్ నగరాన్ని బలి తీసుకున్న పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాద ముఠాలతో సంజయ్ దత్ సంబంధాలు పెట్టుకొని ఏకే 56 గన్ సంపాదించడం అమాయకత్వం ఎలా అవుతుంది? ఇలాంటి ఆయుధాన్ని భారత సైన్యం లేదా ఉగ్రవాదులే ఉపయోగిస్తారు.. సైన్యం సంజయ్ కి ఆయుధాన్ని ఇచ్చే అవకాశమైతే లేదు.. ఇక ఆ ఆయుధం ఆయనకు ఎలా వచ్చిందో చెప్పాల్సిన అవసరం ఉందా? లేదా?
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసి, కాంగ్రెస్ జాతీయ నాయకుల్లో ఒకరైన దిగ్విజయ్ సింగ్ సంజయ్ దత్ ను వెనుకేసుకు వస్తున్న తీరు చూస్తే ఆయన రాజకీయ పరిపక్వతపై నాకే అనుమానం కలుగుతోంది.. సంజయ్‌దత్ యువకుడిగా ఉన్నప్పుడు నేరం చేశారు.. అంతేతప్ప ఆయనేం క్రిమినల్, ఉగ్రవాది కాదు.. సంజయ్‌దత్ తండ్రి సునీల్‌దత్ మతతత్వానికి వ్యతిరేకంగా, మైనారిటీలకు అనుకూలంగా గళమెత్తినందున ఆయనపై దాడులు జరుగుతాయని సంజయ్ భావించి ఉంటాడు.. ఆ సమయంలో యువకుడిగా ఉన్న సంజయ్‌దత్ వీటిని ఎదుర్కోవాలనుకునే క్రమంలోనే నేరానికి పాల్పడ్డారు.. అయితే దానికి తగిన శిక్షను ఆయన ఇప్పటికే అనుభవించారు.. ఇలా సాగాయండీ దిగ్విజయుడి వ్యాఖ్యలు.
ఇక సుప్రీం కోర్టు జడ్జిగా పని చేసిన, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ మార్కండేయ ఖట్టూ మహారాష్ట్ర గవర్నర్ కు రాసిన లేఖ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.. అత్యున్నత న్యాయ స్థానం సంజయ్ నేరం చేసినట్లు నిర్ధారించి శిక్ష ఖరారు చేసిన తర్వాత ఆయనను క్షమించ మంటూ లేఖ రాయడం న్యాయ కోవిధుడైన ఖట్టూ ఎలా సమర్థిచుకోగలరు.. సంజయ్ ఒక నటుడు, ప్రముఖుని కుమారుడు అయినంత మాత్రాన క్షమించి వదిలేయాలా? చట్టం ముందు అందరూ సమానులే అయినప్పుడు మనిషిని బట్టి న్యాయం ఉండాలని కోరుకోవడం ఏమిటి? ఇలా వ్యక్తులు, వారి హోదాలను బట్టి శిక్షలు ఖరారు చేస్తే ఇక న్యాయస్థానాలు ఉండి ఎందుకు?.. దేశ భద్రతతో ఆడుకుంటున్నామనే స్పృహతోనే క్షమాభిక్ష కోరేవారు మాట్లాడుతున్నారా?
ముంబయ్ బాంబు పేలుళ్లలో ఎంతో మంది ప్రాణాలు పోయాయి.. వాటిని తిరిగి తేగలరా? వారి కుటుంబ సభ్యుల మనోభావాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.. దాదాపు 20 ఏళ్లు ఆలస్యంగా తీర్పు వచ్చింది.. అదీ అరకొరగానే.. 

No comments:

Post a Comment