Wednesday, March 27, 2013

అధ్యక్షా.. ఇది చూశారా?

విద్యార్థులు క్లాస్ రూమ్ లో బబుల్ గమ్ నమిలితే అయ్యవార్లు ఏమి చేస్తారు?.. మందలిస్తారు లేదా బెత్తానికి పని చెబుతారు..
అదే పని శాసన సభలో గౌరవ సభ్యులు చేస్తే అధ్యక్షుల వారు ఏమి చేస్తారు?.. ఏమీ చేయరు.. ఎందుకంటే ఎంతైనా వారు ప్రజలచే ఎన్నుకోబడ్డ  గౌరవసభ్యులు కదా?
రాష్ట్రాన్ని పీడిస్తున్న అత్యంత ప్రధాన సమస్య విద్యుత్ సంక్షోభంపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో ఓ ఎమ్మెల్యే గారు ఏమి చేస్తున్నారో తిలకించండి.. కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రసంగిస్తున్న సమయంలో సదరు సభ్యుడు హాయిగా బబుల్ గమ్ నములుతూ బుడగలు ఊదుతున్న దృశ్యమిది.. ఈ మహత్తర సన్నివేశాన్ని రాష్ట్ర ప్రజలంతా లైవ్లో తిలకించారు.. ఆ సమయంలో స్పీకర్ గారు గమనించలేదేమో? మరి సదరు సభ్యునికి ఇది తప్పు అని చెప్పాల్సిన బాధ్యత తోటి సభ్యులకు లేదా?
కొద్ది నెలల క్రితం కర్ణాటక శాసనసభలో అధికార పార్టీ సభ్యులు సెల్ ఫోన్లో నీలి చిత్రాలు చూస్తూ కెమెరా కంటికి చిక్కిపోయారు.. కొన్నా రాష్ట్రాల అసెంబ్లీల్లో సభ్యులు కొట్టుకోవడం, మైకులు విరవడం గతంలో చూశాం.. మన రాష్ట్ర అసెంబ్లీకి ఇంకా ఆ దుస్థితి రానందుకు సంతోషిద్దాం..
అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలు అవసరమా? అనే విషయంలో తరచూ చర్చ జరుగుతోంది.. ఇవాళే ఓ పత్రికలో సీనియర్ పాత్రికేయుడు భావ నారాయణ గారి ఆర్టికల్ చదివాను.. అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా సభ్యుల్లో బాధ్యత పెరుగుతుందని, తమ ఎమ్మెల్యేల పని తీరును ప్రజలు నేరుగా చూస్తారని భావించి అప్పటి పాలకులు దీనికి పచ్చ జెండా ఊపారు.. కానీ జరుగుతున్నది ఏమిటి? ప్రత్యక్ష ప్రసారాల కారణంగా అసెంబ్లీ వాగ్వాదాల కేంద్రం అవుతోంది.. అర్థ వంతమైన చర్చలు జరగడం లేదు.. అధికార, విపక్ష సభ్యులు సమస్యల పరిష్కారం కన్నా తమ వాగ్దాటిని ప్రజల ముందు ప్రదర్శించుకోవడానికి లైవ్ టెలికాస్టింగ్ ను ఉపయోగించుకుంటున్నారు..
అసెంబ్లీకి, వీధి బజార్లకు తేడా లేకుండా పోతోంది.. తాము కోరుకున్నట్లే సభ నడవాలని, తమ ఎజెండా ప్రకారమే చర్చ జరగాలనే పార్టీల ధోరణి వల్ల కొద్ది సంవత్సరాలుగా ఏనాడు సభ సవ్యంగా సాగకుండ వాయిదాల అసెంబ్లీ తయారైంది.. ఈ దుస్థితికి వారిని ఎన్నుకున్నందుకు రాష్ట్ర ప్రజలంతా సిగ్గుపడాల్సిందే..( Thanks to Bhanu)

No comments:

Post a Comment