Friday, March 8, 2013

మహిళల పార్టీ రావాలి

చెట్టు ముందా, విత్తు ముందా అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే.. అలాగే ప్రకృతిలో స్త్రీ, పురుషుల్లో ఎవరు అధికం అని ప్రశ్నించడం అవివేకమే.. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ కానే కాదు.. బండికి రెండు ఇరుసుల్లా ఇద్దరూ సమానమే.. దురదృష్ట వశాత్తు ప్రపంచం ఇంత వేగంగా దూసుకెళుతున్నా, మానవుని మేథస్సు కొత్త పుంతలు తొక్కి కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తున్నా పురుష పుంగవుల దృష్టికోణం మారలేదు.. ఆధిక్యత అనేది పోటీలో ఉండాలి.. కానీ లైంగిక కోణంలో ఆధిక్యతను ప్రదర్శించడం వల్లే సమస్యలు వస్తున్నాయి..
ఇవాళ ప్రపంచ మహిళా దినోత్సవం అంటూ ఘనంగా జరుపుకుంటున్నారు.. నిజానికి మంచి పద్దతి కాదని నా అభిప్రాయం.. ఏం మహిళలను ఈ ఒక్కరోజే గౌరవించాలా? ప్రతి రోజూ గౌరవించాల్సిందే.. ఒక తల్లిగా, సోదరిగా, జీవిత భాగస్వామిగా, స్నేహితురాలిగా వారు అన్ని రంగాల్లోనూ విజయాలు సాధించాలని కోరుకుందాం..
మన దేశంతో సహా ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై వివక్షత అన్ని విషయాల్లోనూ కొనసాగుతోంది.. అత్యాచారాల వార్తలు లేని దిన పత్రికను చూడటమే అరుదైపోయింది.. ఇది చాలా సిగ్గు చేటైన విషయం.. ఢిల్లీలో జరిగన అమానవీయ సంఘటనలు దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నాయి.. రేపిస్టులకు కఠిన శిక్షల విషయంలో రాజీ ధోరణి దురదృష్టకరం..
సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మహిళలు తమ సత్తాను చాటుకుంటున్నారు.. చట్ట సభల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేక్షషన్ల విషయంలో జరుగుతున్న నాటకాలు చూస్తుంటే మన రాజకీయ పార్టీల ముసుగులు స్ఫష్టంగా బయటపడుతున్నాయి.. అసలు రిజర్వేషన్లు అవసరమా?
మన దేశంలో కులానికి, వర్గానికి, మతానికి, భాషకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు ఎన్నో ఉన్నాయి.. మరి మహిళలే పార్టీ తమ కోసం రాజకీయ పార్టీ ఎందుకు పెట్టుకోకూడదు.. పటిష్టమైన ఓటు బ్యాంకుగా మారితే రిజర్వేషన్ల కోసం దేబిరించాల్సిన అవసరం ఏమిటి.. వారే పాలకులుగా ఆవిర్భవించొచ్చు కదా? అధికారం చేతిలో ఉంటే చట్టాలను ఉపయోగించి తోక జాడించే పురుష పుంగవులను దారిలో పెట్టొచ్చు.. ఈ దిశగా మనం ఎందుకు ఆలోచించడం లేదు?..

No comments:

Post a Comment