Thursday, March 21, 2013

లంకతో శతృత్వం మనకే నష్టం

లంక విషయంలో భారత ప్రభుత్వం ఎందుకు ఊగిసలాట వైఖరితో ఉంది?.. అక్కడి తమిళులపై జరుగుతున్న అరాచకాలపై ఎందుకు నోరు మెదపలేకపోతున్నాం?.. యావత్ దేశ ప్రజలను కలవర పెడుతున్న విషయం ఇది..
ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో అమెరికా తీర్మానం, యూ.పీ.ఏ. ప్రభుత్వానికి డీ.ఎం.కే. మద్దతు ఉప సంహరణ నేపథ్యంలో శ్రీలంక సమస్యపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.. ఈ సందర్భంగా చాలా మందికి తెలియని కఠోర వాస్తవాలు మరుగున పడుతున్నాయి..


ఎల్.టీ.టీ.ఈ.తో యుద్ద సమయంలో తమిళులపై పెద్ద ఎత్తున అత్యాచారాలు, హత్యాకాండ జరిగిందని.. ప్రభాకరన్, ఆయన కుమారుడు బాలచంద్రన్ లను లంక సైన్యం దారుణంగా చంపేసిందని.. ఈ అంశాలపై అంతర్జాతీయ స్థాయి విచారణ జరిపి, అధ్యక్షడు రాజపక్షను యుద్ద నేరస్తుడుగా ఉరి తీయాలని తమిళనాడులోని రాజకీయ పార్టీలు, కొన్ని సంస్థలు ఆందోళన చేస్తున్నాయి.. ఇందులో వాస్తవం ఉంది.. కాదనలేం.. కానీ అదే సమయంలో మనం కొన్ని నగ్న సత్యాలను విస్మరిస్తున్నాం..
శ్రీలంక సాంస్కృతికంగా భారత దేశానికి సన్నిహితమైన పొరుగు దేశం.. వందల సంవత్సరాల క్రితం అశోక చక్రవర్తి కాలంలో కళింగ ( నేటి ఒడిషా) నుండి, చోళ దేశం (నేటి తమిళనాడు) నుండి ప్రజలు అక్కడికి వలసపోయారు.. ఐరోపా దేశాల వారు వర్తకం పేరిట భారత దేశానికి వచ్చినట్లే సిలోన్ (శ్రీలంక)కూ వచ్చారు.. వలస రాజ్యంగా మార్చేశారు.. బ్రిటిష్ వారు పరిపాలనా సౌలభ్యం కోసం బర్మాతో పాటు సిలోన్ ను కూడా చాలా కాలం భారత దేశంలో భాగంగానే కొనసాగించినా, తర్వాత కాలంలో విడదీశారు.. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన మరుసటి ఏడాదే (1948)లో వారికీ స్వాతంత్రం వచ్చింది.. బ్రిటిష్ వారు పోతూ పోతూ ఇండియాలో హిందూ, ముస్లింలకు చిచ్చు పెట్టి పాకిస్తాన్ ఏర్పాటు చేసినట్లే సింహళ, తమిళ వర్గాల మధ్య వివాదాలు రగిలించి మరీ పోయారు..
సిలోన్ కాస్తా శ్రీలంకగా ఆవిర్భవించింది.. బౌద్ధ మతస్తులైన సింహళీల ఆధిక్యత గల శ్రీలంకలో తమిళ భాష, సంస్కృతులుపై వివక్షత, సామాజిక ఆర్థిక, ఉద్యోగ ఉపాధి రంగాల్లో వారికి జరుగుతున్న అన్యాయం అవాస్తవాలేమీ కాదు.. ఇరు వర్గాల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు కొనసాగాయి.. సహజంగానే అధిక సంఖ్యాకులైన సింహళీలదే పైచేయి అయ్యింది.. ఈ పరిస్థితుల్లో తమిళ సంస్థలు, పార్టీలు తమ హక్కుల కోసం ఉద్యమించాయి.. ఇలాంటి ఉద్యమాల్లో విద్యార్థిగా ప్రవేశించిన వేలుపిళ్లై ప్రభాకరన్ తరువాత కాలంలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం ప్రారంభించాడు..
జాప్నా మేయర్ ను హత్య చేయడం ద్వారా లోకం దృష్టిలో పడ్డ ప్రభాకరన్ శ్రీలంకలో తన ఉనికి కోసం సాటి తమిళ సంస్థలను, వాటి నాయకులను నిర్మూలించాడు.. శ్రీలంక నుండి వేరుపడి ఈలం పేరిట ప్రత్యేక తమిళ దేశం ఏర్పడాలన్నది ఎల్.టీ.టీ.ఈ. లక్ష్యం.. ఇందు కోసం ఉగ్రవాదబాట పట్టాడు.. ప్రపంచంలోనే తొలిసారిగా మానవ బాంబులను తయారు చేసిన ఘనట ఈ సంస్థదే .. నిజానికి వారి ఈలం ప్రణాళికలో భారత దేశంలోని తమిళనాడు కూడా ఉంది..
అసలు లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్.టీ.టీ.ఈ.), దాని అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ లను తయారు చేసింది ఎవరో తెలుసా? ఈ సంస్థకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించింది ఎవరు?.. ఇంకెవరో కాదు మన భారత ప్రభుత్వాధి నేతలు, తమిళనాడు రాజకీయ నాయకులు.. ఈ సంస్థకు అప్పట్లో తమిళనాడు భూభాగంలో సైనిక శిక్షణ కూడా ఇచ్చారు.. ప్రభాకరన్ కు నాటి భారత ప్రధాని రాజీవ్ గాంధీ, తమిళనాడు సీఎం ఎంజీఆర్, కరుణానిధి తదితర నాయకులతో సన్నిహిత సంబంధాలు కూడా ఉండేవి..
శ్రీలంకలో అక్కడి ప్రభుత్వానికి, ఎల్.టీ.టీ.ఈ దళాలకు జరిగిన భీకర పోరులో ఎందరో లంక తమిళులు కట్టుబట్టలతో సముద్రం దాటి తమిళనాడుకు శరణార్థులుగా రావడంతో భారత ప్రభుత్వానికి సెగ తగలడం ప్రారంభమైంది.. ప్రభాకరన్ ను కట్టడి చేయక తప్పదని అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీకి అర్థం అయ్యింది.. ఫలితంగా లంక అధ్యక్షుడు జే.ఆర్.జయవర్ధనేతో జరిగిన ఒప్పందంలో భాగంగా అక్కడికి భారత సైన్యాన్ని శాంతి పరిరక్షక దళం పేరిట పంపారు. ఈ పోరులో ఎందరో ఎల్టీటీఈ దళాలతో పాటు భారత సైనికులు కూడా పెద్ద సంఖ్యలో చనిపోయారు.. దేశం కాని దేశంలో ఎవరి కోసం ఈ త్యాగాలు అనే విమర్శలు కూడా వచ్చాయి.. ఈలోగా ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయి రాజీవ్ గాంధీ గద్దె దిగాల్సి వచ్చింది.. ఇండియాలో వీపీ సింగ్ ప్రధానిగా, లంకలో ప్రేమదాస అధ్యక్షునిగా అధికారం చేపట్టారు.. ఇరువురూ ఒప్పందాన్ని తిరగదోడారు.. ఈ పరిస్థితుల్లో అత్యంత అవమానకరంగా భారత సైన్యం శ్రీలంక నుండి వెనుదిరగాల్సి వచ్చింది..
ఇక్కడే అసలు కథ మలుపు తిరిగింది.. తమపై పోరుకు భారత సైన్యాన్ని పంపిన రాజీవ్ గాంధీపై ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ కన్నెర్ర చేశాడు.. దీని ఫలితమే రాజీవ్ గాంధీ దారుణ  హత్య.. లోక్ సభ ఎన్నికల వేళ తమిళనాడులో ప్రచారానికి వచ్చిన రాజీవ్ ను మానవ బాంబుతో ప్రభాకరన్ హత్య చేయించాడు.. ఆ సమయంలో తమిళనాడు సీఎం కరుణానిధి.. సరిగ్గా ఎన్నికల వేళ రాజీవ్ హత్య జరగడంలో ఎల్టీటీఈ సానుభూతి పరుడైన కరుణానిధి పార్టీ డీఎంకే చిత్తుగా ఓడిపోయింది.. తమిళనాడు ప్రజలంతా ఆ సంస్థను అసహ్యించుకున్నారు..
విచిత్రం ఏమిటంటే తన భర్తకు చంపిన ఎల్టీటీఈ ఉగ్రవాదులకు సోనియా గాంధీ క్షమించేయడం.. సరే ఈ విషయంలో ఆమె విశాల హృదయాన్ని అభినందిద్దాం.. కానీ ఎల్టీటీఈకి సానుభూతి తెలిపే కరుణానిధి డీఎంకేతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం మరో విచిత్రం.. శ్రీలంక సైన్యం ప్రభాకరన్ను, ఎల్టీటీఈ దళాలను పూర్తిగా మట్టు పెట్టినప్పుడు తమిళనాడు సీఎంగా ఉండి, యూపీఏ సర్కారులో మంత్రి పదవులు ఎంజాయ్ చేసిన కరుణానిధి కిమ్మనలేదు.. చెన్నయ్ బీచ్లో ఒక పూట నిరహార దీక్ష చేశాడు అంతే.. కానీ అదే కరుణానిధి వారు ఇప్పడు అధికారం పోయాక, లంకలో ఇప్పడే ఏదో కొత్తగా జరిగినట్లు ఇల్లు పీకి పందిరేయడాన్ని ఏవిధంగా అర్ధం చేసుకోవాలి..
ప్రతి దేశం తన ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని ఎదుటి దేశం గౌరవించాలని కోరుకుంటుంది.. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీలంక ఆంతరంగిక వ్యవహారాల్లో మన దేశం తల దూర్చడం ఎంత వరకూ సమంజసం? కాశ్మీర్ విషయంలో మనం ఇతరుల జోక్యాన్ని ఎలా వ్యతిరేకిస్తున్నామో, శ్రీలంక సైతం మన దేశం తనతో అలాగే ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు.. తమిళనాడు రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం అక్కడి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి.. లంక సైన్యం పోరాటం చేసింది తమిళులపై కాదు, ఎల్టీటీఈపైన.. నిజానికి ప్రభాకరన్ మన దేశానికి కూడా శత్రువు, మన మాజీ ప్రధానిని హత్య చేసిన సంస్థకు మనం ఎలా మద్దతు ఇవ్వగలం?

ఇప్పటికే మన విదేశాంగ విధానం గాడి తప్పింది.. శ్రీలంక క్రమంగా చైనాకు సన్నిహితం అవుతోంది.. ఈ పరిస్థితుల్లో లంకతో శత్రు వైఖరి మన దేశ ప్రయోజనాలకు నష్టదాయకమే అవుతుంది.. శ్రీలంకలో మైనారిటీలుగా ఉన్న తమిళుల ప్రయాజనాల కోసం మనం వత్తిడి తేవాల్సిందే.. అయితే లంకతో కయ్యానికి దిగితే నష్టపోయేది అక్కడి తమిళులే అని గ్రహించాల్సిన అవసరం ఉంది.. ఈ విషయంలో తమిళనాడు ప్రజలు స్వార్థ రాజకీయ పార్టీల ప్రచార మత్తులో పడకుండా విశాల దృష్టితో ఆలోచించాలి.. శ్రీ

No comments:

Post a Comment