Tuesday, July 30, 2013

తెలంగాణలో నిజమైన పండుగ..

తెలంగాణ అంతటా బోనాల పండుగ జరుపుకుంటున్న వేళ అంతకన్నా పెద్ద పండుగ జరుపుకోవాల్సిన అవసరం వచ్చింది.. బోనాలే కాదు.. బతుకమ్మ, దసరా, సంక్రాంతి, ఉగాది లాంటి పండుగలన్నీ ఒక్కసారిగా చూస్తున్నంత ఆనందంగా ఉంది..
అమర వీరుల త్యాగం వృధా పోలేదు.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ అధిష్టానం దిగిరాక తప్పలేదు..
ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిస్తున్నసుధీర్ఘ పోరాటం ఫలించింది..  ఈ విజయం ఏ ఒక్కరిదో కాదు.. తెలంగాణ ప్రజలందరిదీ ఈ విజయం..
ఈ పోరాటం ఇంతటితో ఆగిపోరాదు.. మనకు కావాల్సింది భౌగోళిక తెలంగాణ కాదు.. సువర్ణ తెలంగాణ కావాలి.. ఆకలి, పేదరికం, నిరుద్యోగం లేని.. అందరికీ సమాన అవకాశాలు గల తెలంగాణ రావాలి.. అన్నిరంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిచేలా తెలంగాణను నిలుపుదాం..
మన పోరాటం దోపిడి మనస్థత్వం గత నాయకులపైనే.. తోటి తెలుగువారైన సీమాంధ్ర ప్రజలు మనకు శాశ్వత సోదరులు.. తెలుగు వారికి రెండు రాష్ట్రాలు ఉన్నందుకు గర్విద్దాం.. ఉమ్మడిగా ముందుకు సాగుదాం..
ముందు మనం భారతీయులం.. ఆ తర్వాతే తెలంగాణ రాష్ట్ర వాసులం..

Monday, July 29, 2013

మాయల తెలంగాణ వద్దు..

అడిగింది ఇవ్వరట.. ఎవరూ అడగనిది ఇచ్చేందుకు సిద్దపడ్డారు.. దానికే రాయల తెలంగాణ అనే పేరు పెట్టారు..
అర్ధ శతాబ్ద కాలంగా తెలంగాణ సమస్య రగులుతోంది.. 1969లో ఉవ్వెత్తున ఉద్యమం చెలరేగింది.. కాంగ్రెస్ అధిష్టానం కొందరు నాయకులను లోబరుచుకొని తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను అణచివేసింది.. దశాబ్ద కాలంగా మలిదశ ఉద్యమం సాగుతోంది.. దాదాపు ఆరేడు వందల మంది ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేశారు..
ఇదేమీ పట్టని కాంగ్రెస్ అధిష్టానం రాయల తెలంగాణను తెరపైకి తెచ్చింది.. అసలు రాయల తెలంగాణ కావాలని అడిగింది ఎవరు? ఒక వ్యాపార రాజకీయ వేత్త చేసిన ప్రతిపాదనకు మరో మతోన్మాద రాజకీయ వేత్త వత్తాసు పలికాడు..  ఈ తలతిక్క ప్రతిపాదనను తన స్వరాష్ట్రంలోనే దిక్కూ దివానం లేని కాంగ్రెస్ అధిష్టాన పెద్ద ఒకరు అందరిపైనా రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు..
అసలు రాయల తెలంగాణ కోసం ఉద్యమించిన వారెవరైనా ఉన్నారా? ఇందు కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారెవరైనా ఉన్నారా? ఒకరిద్దరి పుర్రెల్లో మెదిలిన ఆలోచనను పట్టుకొని రాయలసీమను నిలువునా చీలుస్తారా? కర్నూలు, అనంతపురం జిల్లాల నాయకుల్లో ఎంత మంది రాయల తెలంగాణ కోరుతున్నారు? తెలంగాణతో బలవంతంగా ఈ రెండు జిల్లాలను బలవంతంగా ముడిపెట్టే అధికారం కాంగ్రెస్ అధిష్టానం పెద్దలకు ఎవరిచ్చారు? మీ సామాజిక సమీకరణాలకు, ఓటు బ్యాంకులకు తెలంగాణ, రాయలసీమలను బలి చేస్తారా?
తెలంగాణ నాయకులు, ఉద్యమకారులు ఎవరు కూడా రాయల తెలంగాణ కోర లేదు.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని దీర్ఘ కాలం పాలించింది రాయలసీమ నేతలే.. మూడు ప్రధాన రాజకీయ పార్టీలకు నాయకత్వం వహిస్తున్నది సీమ నాయకులే.. రాయలసీమను చీల్చే ప్రతిపాదనను వీరు సమర్ధిస్తున్నారా?.. దీన్ని స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది.. సీమను చీల్చిన తర్వాత వీరు తమ స్వప్రాంతాల్లో తెలెత్తుకు తిరగగలరా?
రాయలసీమ నుండి ఆరు దశాబ్దాల క్రితం బళ్లారి జిల్లా పోయింది.. ప్రకాశం జిల్లా ఏర్పడ్డప్పుడు మార్కాపురం, గిద్దలూరు తాలుకాలు పోయాయి.. ఇప్పడు మిగిలిన నాలుగు జిల్లాలు రెండు కొత్త రాష్ట్రాలకు బదిలీ అయిపోతే, రాయలసీమకు సొంత అస్థిత్వం అనేది ఉంటుందా?.. తెలంగాణ, రాయలసీమలకు సొంత అస్థిత్వాలు ఉన్నాయి.. ఒకే ఒరలో రెండు కత్తులు ఇరికించే ప్రయత్నం చేయడం అర్థరహితం.. హైదరాబాద్ నగరంలో కొందరి వ్యాపార ప్రయోజనాలు, కులతత్వ, మతోన్మాద రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని తెరపెకి వచ్చిన రాయల తెలంగాణ ప్రతిపాదనను మొగ్గలోనే తుంచేయాలి..
అసలు దీన్ని రాయల తెలంగాణ అని పిలవడం తప్పు.. మాయల తెలంగాణ అనాలి..

Wednesday, July 24, 2013

రోజుకు రూ.33.33 సంపాదనతో బతకగలరా?

దేశంలో పేదలు తగ్గారట 2004-05తో 37.2 శాతం పేదలు ఉంటే 2011-12 నాటికి 21.9 శాతం మందే పేదలు కనిపించారట.. అంటే 15.3 శాతం పేదరికం తగ్గినట్లు.. ప్రజల తలసరి ఆదాయం పెరగడ వల్లే పేదరికం తగ్గిందట.. ప్రణాళికా సంఘం తాజాగా వెల్లడించిన లెక్కలు ఇవి..
నేను వారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను.. ఈ లెక్కలు తయారు చేసిన వారికి సిగ్గుందా? అని.. ఈ 7,8 ఏళ్ల కాలంలో ప్రజల జీతాలు ఎంత పెరిగాయి? నిత్యావసర వస్తువులు, ఇతర ఖర్చులు ఏ మేరకు పెరిగాయి? ఈ లెక్కలు తీశారా అసలు.. పెరిగిన జీతాలు, సంపాదనకు ఖర్చులకు పొంతన ఏమాత్రం లేదు..
గతంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా సెలవిచ్చిందేమిటంటే.. కూడు, గుడ్డ, గూడు కలిపి పట్టణాల్లో రూ. 33.33, గ్రామాల్లో రూ. 27.20 సంపాదించుకోగలిగితే హాయిగా బతికేయొచ్చట.. నెలకు రూ.1,000/- ఖర్చు చేసే స్థితిలో ఉన్న వారు పేదరికం నుండి బయట పడినట్లేనట..
మన దేశాన్నేలుతున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆర్థిక మంత్రి చిదంబరం, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు అహ్లువాలియా చేతిలో రూ.33.33 చొప్పున పెట్టి భారత దేశంలో ఏ గ్రామమైనా, పట్టణమైనా వెళ్లి ఒక రోజు బతికి చూపమనండి.. అయితే ఓ కండిషన్ వారు ఎక్కడా తమ హోదాలు, పరపతిని ఉపయోగించుకోకుండా సామాన్య ప్రజల్లాగే ఖర్చు చేయాలి.. ఈ డబ్బుతో వారు తమ ఆకలి తీర్చుకొని, గూడు, గుడ్డ కల్పించుకోగలిగితేనే ఒప్పుకుందాం దేశంలో పేదరికం తగ్గిందని..

పార్లమెంటు క్యాంటీన్లో కాకా హోటల్ కన్నాకారు చౌకగా ఆహార పదార్థాలు దొరుకుతాయట.. నిజమే అక్కడ పేదవారు ఎక్కువ కదా?

గ్రేటర్ రాయలసీమ అంటే ఇలా..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండుకు ప్రతిగా కొందరు రాయలసీమ నేతలు రాయల తెలంగాణ ప్రతిపాదన తెచ్చారు.. అంటే రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణతో కలిపి కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయాలట.. ఇందులో కొందరు నాయకుల సామాజిక, రాజకీయ ఎత్తుగడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.. రాయల తెలంగాణ పేరిట సీమను విభజించే కుట్ర జరుగుతున్నా, ఒకరిద్దరు నేతలు తప్ప చాలా మంది ఈ ప్రాంత నాయకులు అంతగా నోరు మెదపకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది..
తెలంగాణ ఇస్తే గ్రేటర్ రాయలసీమ ఇవ్వాలంటాడో నాయకుడు.. సంతోషమే కానీ సీమలోని నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల, ఆలంపూర్ కూడా అందులో కలపాలట? ఇదెక్కడి చోద్యం?.. అసలు ఈ జిల్లాల నాయకులు ఈ ప్రతిపాదనకు ఒప్పుకుంటారా?
ఒకప్పడు రాయలసీమ అంటే బళ్లారి, కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలు.. పాత మద్రాసు స్టేట్ చిత్ర పటాన్ని ఒకసారి చూడండి.. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు బళ్లారి మైసూరు రాష్ట్రం (ప్రస్తుత కర్ణాటక)లో కలిసిపోయింది.. ఆనాటి మన నాయకుల అసమర్ధ నిర్వాకం వల్ల తెలుగు ప్రజలు అత్యధికంగా ఉన్న బళ్లారి రాయలసీమకు దూరమైంది.. అలాగే ప్రకాశం జిల్లా ఏర్పడ్డప్పుడు కర్నూలు జిల్లాలోని గిద్దలూరు, మార్కాపురం ప్రాంతాలను విడదీసి అందులో కలిపారు.. సీమకు తలకాయ లాంటి బళ్లారిని వదులుకొని తమవి కాని నెల్లూరు, ప్రకాశం జిల్లాలు, గద్వాల, ఆలంపురం ప్రాంతాలు కలిపి రాయలసీమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం తగునా? ఇక్కడ నేను రాయలసీమ చరిత్ర, శ్రీభాగ్ ఒప్పందంలాంటి చారిత్రక అంశాలజోలికి పోకుండా క్లుప్తంగా విషయానికొస్తున్నాను..
రాయలసీమ నాయకులు నిజంగా గ్రేటర్ రాయలసీమను  ఏర్పాటు చేయాలని కోరుకుంటే ప్రస్తుత నాలుగు జిల్లాలు బళ్లారికి తోడు ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, మర్కాపురం ప్రాంతాలను కలుపుకోవచ్చు.. (నా ఊహా చిత్రాన్ని చూడండి) గ్రేటర్ రాయలసీమను మరింతగా విస్తరించాలంటే  కర్ణాటకలోని చిత్రదుర్గ, తుంకూరు, కోలారు జిల్లాలు.. తమిళనాడులోని కృష్ణగిరి, ధర్మపురి, సేలం, తిరువల్లూరు, వేలూరు జిల్లాలు కలుపుకునే ప్రయత్నం చేయవచ్చు.. ఇవన్నీ తెలుగు వారి ఆధిక్యత గల జిల్లాలు.. కానీ ఇది అంత సులభమైన విషయం కాదు.. ఆలోచించాల్సిందే..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఖాయమైతే రాయలసీమ కూడా ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించమే సమంజసం.. వర్ష పాతం అంతగా లేని రాయలసీమ ప్రధానంగా ఎదుర్కొంటున్నది సాగునీటి సమస్య,, తెలంగాణ ఏర్పడితే తమకు కృష్ణా నది నీళ్లు రావని భావించడం అపోహ మాత్రమే.. జల వివాదాలు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా ఉండేవే.. వాటికి పరిష్కారాలు కూడా ఉంటాయి.. బళ్లారిని కలుపుకొని గ్రేటర్ రాయలసీమగా ఏర్పడితే ఈ సమస్యను అధిగమించవచ్చు.. కృష్ణా, తుంగభద్ర, పెన్నా నదులకు తోడు రాయలసీమలో అపారమైన సహజవనరులు, గనులు ఉన్నాయి.. ఇవన్నీ సక్రమంగా ఉపయోగించుకుంటే రాయలసీమ నిజంగా రతనాల సీమ అవుతుంది.. బెంగళూరు, చెన్నై నగరాలు దగ్గరగా ఉండటం పారిశ్రామీకరటణకు, ఐటీ అభివృద్ధికి కలిసి వచ్చే అంశం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అత్యధిక కాలం పాలించింది రాయలసీమ ప్రాంత ముఖ్యమంత్రులే.. నీలం సంజీవ రెడ్డి, దామోదరం సంజీవయ్య, కోట్ల విజయభాస్కర రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, వైస్ రాజశేఖర రెడ్డి.. ప్రస్తుత సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఈ ప్రాంత వాసులే.. ఎన్టీరామారావు కోస్తాంధ్ర వాసి అయినా, ఆయనకు రాయలసీమతో ఉన్న అనుబంధమే ఎక్కువ.. ఇందరు హేమా హేమీలు ఉన్నా, రాయలసీమ వెనుక బాటుకు కారణం ఏమిటి?.. చిత్తశుద్ధి లేకపోవడమే.. ఫ్యాక్షన్ రాజకీయాలతో కొట్టుకునే ఇక్కడి నేతలు సీమ ప్రయోజనాలను మొదటి నుండి నిర్లక్ష్యం చూస్తూ వచ్చారు.. (నేను నేతలందరినీ నిందించడం లేదు) ఇక్కడి నాయకుల్లో చాలా మందికి హైదరాబాద్ తో పాటు బెంగళూరు, చెన్నై నగరాల్లో ఆస్తులు, వ్యాపారాలు ఉన్నాయి..  కానీ తమ సొంత నేల రాయలసీమ అభివృద్దిని మాత్రం వారికి పట్టదు.. ఫ్యాక్షన్ రాజకీయాలతో సీమలో నెత్తురు పారించిన నాయకులు ఈ ప్రాంత అభివృద్దిపై దృష్టి పెడితే అసలు వెనుకబాటు సమస్య ఉండేదా?

గ్రేటర్ రాయలసీమ రాష్ట్రం ఈ సమస్యలకు పరిష్కారం చూపుతుందా? ఆలోచించాల్సిన విషయమే.. ఇక్కడ నేను కొత్త వివాదం సృష్టించడం లేదు... ఉన్న సమస్యకు నా వంతు పరిష్కార మార్గాన్ని సూచిస్తున్నానంటే..


Tuesday, July 23, 2013

హైదరాబాద్ నగరాన్ని మీరు అభివృద్ధి చేశారా?..

ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడక ముందు హైదరాబాద్ తొండలు గుడ్లు పెట్టడానికి కూడా భయపడిన ప్రాంతమన్నాడు కొన్నాళ్ల క్రితం ఓ  మేధావి.. తాము వచ్చాకే రాళ్ల హైదరాబాద్ రతనాల హైదరాబాద్ అయ్యిందని నిన్న మొన్న చెప్పు కొచ్చాడు మరో  మేధావి.. అసలు ఈ వ్యాపార రాజకీయ నేతాజీలకు హైదరాబాద్ చరిత్ర తెలుసా?.. సమాచార సాంకేతిక విప్లవం కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత ప్రపంచంలో ఇంకా చరిత్రను వక్రీకరించి మట్లాడితే నమ్మేవారుంటారనుకోవడం అమాయకత్వమే అవుతుంది.. మీకు చరిత్ర తెలియకుంటే తెలుసుకోండి.. కానీ అవాస్తవాలను ప్రచారం చేయకండి..
వీరి తండ్రులు, తాతలు పుట్టక ముందు నుండే హైదరాబాద్ ప్రపంచ ప్రసిద్ధి గాంచిన నగరాల్లో ఒకటి.. 1948లో భారత దేశంలో విలీనమయ్యే నాటికే హైదరాబాద్ కాస్మోపాలిటన్ నగరం.. విశాలమై రోడ్లు, అందమైక భవనాలు, చారిత్రిక కట్టడాలు ఉన్న నగరమిది.. ఆ రోజుల్లో హైదరాబాద్ నగరాన్ని దేశానికి రెండో రాజధాని చేయాలని బాబాసాహెబ్ అంబేద్కర్ సూచించారంటే ఈ నగర ప్రతిష్ట ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు..  హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశామని చంకలు చరచుకునేవారు ఫ్లై ఓవర్లు, హైటెక్ సిటీ తప్ప కొత్తగా నిర్మించిందేమిటి? నాయకుల ఆస్తులు, అక్రమ సంపాదన తప్ప..  1956కు ముందు హైదరాబాద్ దేశంలో కెళ్లా 5వ అతి పెద్ద నగరం.. 2013లోనూ అదే స్థానంలో ఉంది.. వీరు కొత్తగా అభివృద్ధి చేసిందేమిటి? 5 నుండి కనీసం 2 లేదా 3వ స్థానానికైతే తీసుకెళ్లలేదే?  నాలుగు శతాబ్దాల పైబడి చరిత్ర గల నగరాన్ని నాలుగు దశాబ్దాల క్రితం వచ్చిన వారు ఇక్కడంతా శూణ్యం.. తామే అభివృద్ది చేశాం. . అని గొప్పలకు పోతారు ఎందుకో?
హైదరాబాద్ రాష్ట్ర రాజధాని కాబట్టే అన్ని ప్రాంతాల ప్రజలు అవకాశాల కోసం రావడం సహజం.. ఈ నగరం అందరినీ ఆదరించింది.. కానీ వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ నగరాన్ని తామే అభివృద్ది చేశాం అని ప్రగల్భాలు పలకడం ఎందుకు? స్థానికులను కించపరడం, అవమానించడం ఎందుకు? కర్నూలును వదులుకొని హైదరాబాద్ వచ్చామని బాధ పడటం ఎందుకు? కర్నూలు నగరానికి ఏం తక్కువ? దాన్ని అగ్ర నగరంగా తీర్చిదిద్ది డొచ్చు కదా? అది సాధ్యం కాకపోవడం వల్లే అప్పటికే అభివృద్ధి చెందిన హైదరాబాద్ నగరంపై మీ కన్ను పడింది..
కొందరు సీమ నేతల నిర్వాకం ఎలా ఉంది? అసలైన రాయలసీమ ఎలా ఉండేది? గ్రేటర్ రాయల సీమ మతలబు ఏమిటి? అనే విషయాలను నా తదుపరి వ్యాసంలో చర్చిస్తాను..

Monday, July 22, 2013

Sunday, July 21, 2013

భాగ్ మిల్ఖా భాగ్..

నేను మూడో తరగతిలో ఉన్ప్పడు అనుకుంటా.. సర్దార్జీల గురుంచి ఓ మిత్రుడు చెప్పిన జోక్ ఇది.. సముద్ర తీరంలో ఓ సిక్కు యువకుడు రన్నింగ్ చేసి అలిసిపోయి విశ్రాంతి తీసుకుంటుంటాడు.. ఓ విదేశీయురాలు ఆర్ యు రిలాక్సింగ్?.. అని అడిగింది.. ఇంగ్లీషు అంతగా రాని మన సర్దార్జీ నో నో అయామ్ మిల్ఖాసింగ్.. అంటూ తడబడుతూ సమాధానం చెప్పాడు..
అప్పటికి నాకు ఇంకా తెలియదు మిల్ఖాసింగ్ అంటే భారత దేశం గర్వించదగ్గ గొప్ప అథ్లెట్ అని.. ఆ విషయం తెలిసేందుకు మరో ఏడాదిన్నర పట్టింది.. నేనూ ఆయనంత గొప్పగా కాకున్నా పరుగు పందెంలో రాణించాలనుకున్నా.. పాఠశాల స్థాయిలో కొన్ని ఫలితాలు సాధించినప్పటికీ దాన్ని కొనసాగే అదృష్టం లేకపోయినందుకు ఇప్పటికీ చింతిస్తుంటాను..
తెరపై కనిపించే అర్థంలేని హీరోయిజాలు, నిజ జీవితంలో కనిపించని వారి నకిలీ ఫీట్లు, అర్థం పర్థంలేని రొటీన్ ప్రేమ కథలు నచ్చని నేను సాధారణంగా సినిమాలు చూడటం చాలా అరుదు.. నేను అభిమానించే ఫ్లయింగ్ సిఖ్ మిల్కా సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన భాగ్ మిల్ఖా భాగ్ మా అబ్బాయితో కలిసి చూశాను..
చిన్న వయస్సులో దేశ విభజన కారణంగా తల్లి దండ్రులను పోగొట్టుకున్న మిల్ఖాసింగ్ కట్టు బట్టలతో ఢిల్లీ వచ్చి అల్లరి చిల్లరగా తిరగడం, ఆ తర్వాత ఆర్మీ చేరడం.. పాలు, గుడ్లు అధనంగా లభిస్తాయనే ఆశతో పరుగు పందాన్ని ఎంచుకొని భారత తరపున అంతర్జాతీయ క్రీడల్లో విజయాలు సాధించడం కళ్లకు కట్టినట్లు చూపించారు ఈ చిత్రంలో.. మిల్ఖాసింగ్ గా ఫర్హాన్ అఖ్తర్ చాలా అద్భుతంగా నటించారు.. ఎంతో స్పూర్తిదాయకమైన మిల్ఖాసింగ్ జీవితాన్ని ఈ చిత్రం ద్వారా తెరకెక్కించిన దర్శక నిర్మాత ఓంప్రకాశ్ మెహ్రా అభినందనీయుడు.. ప్రతి ప్రేక్షకుడు, క్రీడాభిమాని తప్పకుండా చూడదగ్గ చిత్రం ఇది.. చిన్నప్పుడు నేను విన్న రిలాక్సింగ్ జోక్ ఈ చిత్రంలో కనిపించడం గమనార్హం.. 

భాగ్ మిల్ఖా భాగ్ చిత్రం విడుదలై రెండో వారం అవుతున్నా సినిమా హాళ్లు కిక్కిరిసి కనిపిస్తున్నాయి, ప్రేక్షకాదరణ ఏమాత్రం తగ్గలేదు.. కానీ కొందరు తెలుగు సినీ పెద్దల మాయాజాలంలో చిక్కుకున్న మన సినిమా హాళ్లు, పంపిణీ వ్యవస్థ కారణంగా హైదరాబాద్ నగరంలో రెండో వారానికే చాలా థియేటర్ల నుండి ఈ సినిమాను ఎత్తేశారు.. ఇది కొంత బాధాకరమైన విషయమే..

Wednesday, July 17, 2013

రూ.5 చెల్లిస్తే తప్పేమిటి?..

హైదరాబాద్ లో జరగబోయే నరేంద్రమోడీ సభకు బీజేపీ రూ.5 రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేయడాన్ని కాంగ్రెస్ నేతలు తట్టుకోలేక పోతున్నారు.. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ధనమయం చేస్తోందని గగ్గోలు పెట్టేస్తున్నారు.. ఈ రిజిస్ట్రేషన్ ఫీజుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే బీజేపీ కార్యకర్తలకు, హాజరయ్యేవారికి ఉండాలి కానీ కందకు లేని దురద కత్తికి ఎందుకో అర్థం కావడంలేదు.. బహుషా వారు కూడా మోడీ సభకు రావాలనుకొని రూ.5 చెల్లించలేని దుర్భర దారిద్ర్యం వల్ల రాలేకపోతున్నారా?.. పర్వాలేదు.. బీజేపీ కార్యకర్తలే చెల్లించి వారి ముచ్చట తీరుస్తారు.. ఈ రిజిస్ట్రేషన్ ఫీజు ద్వారా వచ్చే మొత్తాన్ని ఉత్తరాఖండ్ వరద బాధితులకు ఇస్తామని, ఇది నిర్భందమేమీ కాదని బీజేపీ నేతలు ఇప్పటికే సెలవిచ్చారు.. ఒక సదాశయంలో తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శల్లోని ఔచిత్యం ఏమిటో నాకైతే అర్థం కాలేదు..
సాధారణంగా రాజకీయ సభలకు జనాలను తోలుకు రావడానికి ఒక రోజు కూలీ, మద్యం, తిండి ఇస్తారనేది అందరికీ తెలసిన బహిరంగ రహస్యం.. కానీ నరేంద్ర మోడీ సభకు బీజేపీ ఎదురు డబ్బు చెల్లించే అవకాశం ఇవ్వడం గమనిస్తే ఈ సభపై పెట్టుకున్న అంఛనాలను అర్థం చేసుకోవచ్చు.. భారత రాజకీయాల్లో ఇదొక సరికొత్త ట్రెండ్.. ప్రజల నుండి పారదర్శకంగా విరాళం తీసుకోవడంలో తప్పేమీ లేదని చెప్పక తప్పదు..
సాధారణంగా ఫ్లాప్ సినిమాలకు విలువ ఉండదు.. కానీ కాంగ్రెస్ నాయకులు రూ.200-500 దాకా వెచ్చించి చూస్తారట (మనీష్ తివారీ ప్రకటన చూడండి).. తాము సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ సభలకు రూ.5 వసూలు చేయబోమని చిదంబరం గారు సెలవిచ్చారు.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వారికి సీనుందా? వసూలు చేసి చూడండి ఎవరి సత్తా ఏమిటో తేలిపోతుంది కదా?

Monday, July 15, 2013

చరిత్ర పుటల్లోకి టెలిగ్రామ్..

కొనేళ్ల క్రితం బీఎస్ఎన్ఎల్ చీఫ్ హైదరాబాద్లో తమ సెల్ ఫోన్ సేవలు ప్రారంభించేందుకు వచ్చినప్పడు, పబ్లిక్ టెలిఫోన్, ఎస్టీడీ బూత్ ఆపరేటర్ల సంఘం ఆయన్ని ఘెరావ్ చేసేందుకు ప్రయత్నించింది.. ప్రజలందరికీ సెల్ ఫోన్లు అందుబాటులోకి వస్తే తమ ఉపాధి దెబ్బతింటుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.. ఆయన వారి వైపు జాలిగా చూసి టెక్నాలజీని అడ్డుకోవడం వెర్రితనం అని స్పష్టం చేశారు.. ప్రజలు తమకు సౌకర్యవంతమై సేవలు కోరుకుంటున్నప్పడు, మీ ఉపాధి పోతుందనే సాకుతో వ్యతిరేకించడంలో అర్థం లేదని చెప్పేశాడాయన..
భారత దేశంలో సుదీర్ఘకాలం పాటు సేవలందించిన టెలిగ్రామ్ సర్వీస్ ఇవాళ్టితో నిలచిపోయింది.. మన పొరుగు దేశాల్లో ఏనాడో టెలిగ్రామ్ సర్వీసులు నిలిపి వేశారు.  తర్వలో పోస్టల్ డిపార్ట్మెంట్ కు ఇదే పరిస్థితి ఏర్పడవచ్చు.. అందుకే పోస్టల్ శాఖ బ్యాంకింగ్ రంగంలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తోంది.. కమ్యూనికేషన్ పరిణామ క్రమాన్ని ఒకసారి పరిశీలిస్తే పోస్ట్, టెలిగ్రామ్, టెలిఫోన్, పేజర్, మొబైల్ ఫోన్, ఈ మెయిల్, ఎస్ఎంఎస్.. ఇలా వరుసగా ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.. మరింత పాత కాలంలోకి పోతే పావురాలు కూడా సేవలు అందించాయి..
మెరుగైన సమాచార వ్యవస్థ ఉన్నప్పుడు పాత కాలం వ్యవస్థనే ఇంకా కొనసాగడం శుద్ధ దండగ.. మన కోర్టులు, ప్రభుత్వ కార్యాలయాలు నిన్నటి దాకా టెలిగ్రామ్ నే ప్రమాణికంగా పరిగణించడం ఆశ్చర్యాన్ని కలిగించింది.. అందుకే వాటి పనితీరు అంత నాసిరకంగా ఉంది కాబోలు.. టెలిగ్రామ్ లేకపోతే సరిహద్దుల్లో ఉండే జవాన్లకు మాత్రం కొంత ఇబ్బందే..
భారతీయులకు సెంటిమెంట్లు సహజం.. టెలిగ్రామ్ లతో పాతతరం వారికి ఎన్నో తీపి చేదు గుర్తులు ముడిపడి ఉన్నాయి.. గిట్టిన వారు మరు జన్మ ఎత్తక తప్పదు.. పుట్టిన వారు గిట్టక తప్పదు.. ఇది కమ్యూనికేషన్ వ్యవస్థకూ వర్తిస్తుంది..

Sunday, July 14, 2013

ఇటలీ వారికి ఎందుకింత అలుసు..

బోఫోర్స్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు ఒట్టావియా ఖత్రోచి తన స్వదేశం ఇటలీలోని మిలన్ నగరంలో మరణించాడనే వార్త చూశాక ఆయన గురుంచి, మన భారత రాజకీయ వ్యవస్థ గురుంచి కాస్త రాస్తే మంచిదనిపించింది..  కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి ఇటలీ అంటే ఎందుకో ప్రేమ.. అందుకు కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో.. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుటుంబానికి ఖత్రోచి కుటుంబ మిత్రుడు.. ఇటలీకి చెందిన సోనియా గాంధీ కారణంగానే ఆయనకు రాజీవ్ కుటుంబంతో బంధం ఏర్పడటం, అది బోఫోర్సు ఆయుధాల కుంభకోణానికి దారి తీయడం.. ఖత్రోచికి కాపాడే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం కావడం(1989) చరిత్ర.. కాంగ్రెస్ అండదండలతోనే ఆయన దేశం విడచి పారిపోయి, అరెస్టు వారెంట్లను తప్పించుకోవడం తెలిసిందే.. నిజంగా ఆయన నిర్ధోషి అయితే చట్టం నుండి తప్పించుకోవడం ఎందుకు?
కానీ ఇప్పటికీ కాంగ్రెస్ నాయకులు ఖత్రోచి నిర్దోషి అని వాదిస్తారు.. ఆయన చట్టానికి దొరికితే డొంక కదిలి అసలుకే ఎసరు పడుతుందని వారి భయం..

కొద్ది నెలల క్రితం అరేబియా సముద్రంలో భారత జాలర్లను కాల్చి చంపి అరెస్టయిన ఇటలీ జాలర్లు బెయిల్ మీద స్వదేశానికి పోయి, తిరిగి రావడానికి ముప్పు తిప్పలు పెట్టారు.. దౌత్య పరమైన వత్తిడితో వారు తిరిగి రాక తప్పలేదు..
ఖత్రోచి, ఈ నావికులు ఉదంతాలు చూస్తుంటే ఇటలీ వానికి భారత దేశం అంటే ఎంటే ఎంత చులకనో అర్ధం అవుతుంది.. అసలు వారికి ఎందుకు కింత అలుసు.. కారణాలు అందరికీ తెలిసినవే..


Saturday, July 13, 2013

మంచికి మారు పేరు..

అజాత శత్రువు, మంచికి మారు పేరైన రవి శంకర ప్రసాద్ గారు ఇక లేరనే వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది.. రవి శంకర్ ప్రసాద్ గారి నేతృత్వంలో తేజ న్యూస్ (తర్వాత జెమిని న్యూస్) ప్రారంభమైనప్పడు నేను ఆ సంస్థలో చేరాను.. ఉద్యోగులను ఏంతో ఆత్మీయంగా చూసుకునేవారు.. వారి కష్ట సుఖాలు వాకబు చేసి, అవసరమైతే సహాయం కూడా చేసిన గొప్ప మనసు రవిశంకర్ ప్రసాద్ గారిది.. మంచి వార్తలు, స్టోరీలు ఇచ్చినప్పడు ప్రత్యేకంగా అభినందించే వారు.. ఒకసారి నేను ఒక స్టోరీ కోసం బయలు దేరితే ఆఫీస్ వాహనం దొరకలేదు.. అది గమనించి తన సొంత కారు ఇచ్చి పంపడం నేను ఎప్పటికీ మరవలేను.. ఒక సంక్షోభ సమయంలో న్యూస్ డిపార్ట్ మెంట్ పని తీరుకు మెచ్చి, అందరికీ వ్యక్తిగత హోదాలో ఇక నెల జీతం పారితోషికంగా ఇచ్చారు.. అలాంటి మహోన్నత వ్యక్తిని కోల్పోవడం నాకు ఎంతో విచారాన్ని కలిగించింది.. వారి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నాను..

Friday, July 12, 2013

అంతులేని కథ.. తెలంగాణ

ఏదో తేల్చేస్తామన్నారు.. అందరూ నమ్మేశారు.. ప్రత్యేక రాష్ట్రం వస్తుందని తెలంగాణ నాయకులు సంబర పడ్డారు.. సమైక్యాంధ్రను విడగొడితే ఊరుకునేది లేదని సీమాంధ్ర నేతలు బెదిరించారు.. కానీ జరిగిందేమిటి?.. కాంగ్రెస్ కోర్ కమిటీ ముగ్గురు నాయకుల దగ్గర రోడ్డు మ్యాపులు తీసుకొని వర్కింగ్ కమిటీలో చర్చిస్తామని చల్లగా చెప్పేసింది..
తెలంగాణ సమస్యను పరిష్కరించే ఉద్దేశ్యం కాంగ్రెస్ పార్టీకి ఏ కోశానాలేదని మరోమారు స్పష్టంగా తేలిపోయింది.. నిజంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంటే ఇన్ని నాటకాలు ఆడాల్సిన అవసరం లేదు..   
తెలంగాణను కాంగ్రెస్ అంతులేని కథగా మార్చేసింది.. కాంగ్రెస్ తనకు ప్రయోజనం లేనిదే ఏ పనీ చేయదు.. వారి ఓట్ల లెక్కలకు తెలంగాణ ప్రజలు పదే పదే మోసపోతున్నారు.. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాన్ని గుర్తు తెచ్చుకోండి..
మొదటి తెలంగాణ ఉద్యమాన్ని చెన్నారెడ్డి ద్వారా వెన్నుపోటు పొడిపించారు..
తెలంగాణ ఇస్తామంటే టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నారు.. ఆ పార్టీ ఎమ్మెల్యేలను కొనేశారు..
రెండో ఎస్సార్సీ అన్నారు.. నిజంగా అది వేశారా? లేదు.  
శ్రీకృష్ణ కమిటీ అన్నారు.. కమిటీ నివేదికను అటక మీద భద్రంగా పెట్టేశారు..
రాయల తెలంగాణ అట.. అసలు అడిగిందెవరు?
తాజాగా రోడ్డు మ్యాపులు, కోర్ కమిటీ అన్నారు.. జరిగిందేమిటో చూశారు కదా?
వద్దు.. ఒక వద్దే వద్దు.. ఎన్నాళ్లీ మోసం?
తెలంగాణ ఒకరు దయాదాక్షిణ్యాల మీద ఇచ్చేది, వచ్చేది కాదు.. పోరాడి సాధించాల్సిందే..

Wednesday, July 10, 2013

చైనా మరోసారి హద్దు మీరింది.. లడక్ లోని ఛుమర్ సెక్టార్లోకి దూసుకొచ్చినట్లు మన సైన్యం పసిగట్టింది.. మన నాయకుల అసమర్ధ విధానాలకు తాజా చొరబాటు ఉదాహరణ.. చైనాకు గట్టిగా బుద్ది చెప్పే ధైర్యం మన పాలకులకు లేదా? ఇంకా ఎంతకాలం చైనా అగడాలను సహించాలి?

Sunday, July 7, 2013

గయపై అమానుష దాడి..

బుద్ధగయలో తీవ్రవాదులు జరిపిన అమానుష పేలుళ్లను ప్రతి ఒక్కరు ఖండించాలి.. గౌతమ బుద్ధునికి జ్ఞానోదయమైన గయలో జరిగిన ఈ ఘటన బౌద్ధులనే కాకుండా యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రంతికి గురి చేసింది.. తీవ్రవాదుల పన్నాగంపై స్పష్టమై ముందస్తు హెచ్చరికలు ఉన్నా, బిహార్ ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవం దారుణం..