Thursday, July 4, 2013

చిత్రగుప్తుని శిథిల వైభవం..

మానవుల పాపాల లెక్కలు రాసి యమ ధర్మరాజుకు నివేదించే చిత్రగుప్తుని ఆలయ ఉనికి ప్రమాదంలో పడింది.. భారత దేశంలో చిత్రగుప్తునికి కేవలం ఆరేడు ఆలయాలు మాత్రమే ఉన్నాయి.. అందులో ప్రత్యేకించి చిత్ర గుప్తుని పేరిట వెలసినవి రెండే రెండు.. ఒకటి ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో ఉంటే, రెండోది హైదరాబాద్ పాత నగరంలోని కందికల్ గేట్ ప్రాంతంలో ఉంది.. దురదృష్టవశాత్తు మన చిత్రగుప్త దేవాయానికి సంబంధించిన గత వైభవ చిహ్నాలేవీ ఇప్పుడు లేదు..

దశాబ్దాలుగా కబ్జాలకు గురవుతూ వస్తున్న ఆలయ ప్రాంగణం మూడో వంతుకు తగ్గి పోయింది..  దశాబ్దాల తరబడి తిష్టేసిన కబ్జాదారులు న్యాయ పోరాటంలో ఆలయ ప్రాంగణంలో చాలా భాగం చేజిక్కించుకున్నారు.. (గూగుల్ మ్యాప్ చూడండి) చిత్ర గుప్త దేవాలయంలో ఒకప్పడు దసరా ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగేవి.. ఆర్యసమాజ్ వారి ఊరేగింపు,  రథయాత్ర, రావణ దహన వేడుకలు తీపి గుర్తులుగా మిగిలాయి.. బతుకమ్మలను నిమజ్జనం చేసే బావిని ఏనాడో పూడ్చేశారు.. నేను చిన్నప్పుడు ఆటలాడిన మైదానం, చెట్లూ ఏనాడో మాయమయ్యాయి..

ఇదంతా ఒక ఎత్తైతే విచారకరమైన మరో విషయం ఉంది.. ఇక్కడ మీరు చూసిన అద్భుత ముఖ ద్వారా కట్టడం ఇప్పడు లేదు.. కందికల్ గేట్ రైల్వేలైన్ క్రాసింగ్ మీదుగా నిర్మిస్తున్న రైల్ ఓవర్ బ్రిడ్జ్ పేరుతో ఆలయ ప్రకార గోడను కూల్చేశారు.. (గూగుల్ మ్యాప్ లో ఎర్ర రంగుతో చూపించిన రైల్ ఓవర్ బ్రిడ్జ్ మార్గాన్ని చూడండి) రైలు వంతెన పేరిట అరుదైన చారిత్రిక ఆలయాన్ని మింగేయడం ఏ అభివృద్ధికి చిహ్నం? పాపుల లెక్కలు రాసే చిత్రగుప్తునికే ఇంత అన్యాయం జరిగిపోతుంటే.. పాపం ఆయన ఎవరికి చెప్పుకోవాలి? అయినా చిత్రగుప్తుడు ఎవరికి పట్టాడు గనుక? తెలుగు సినీ రంగం చిత్రగుప్తున్ని హాస్యగానిగా మార్చేసినా నోరు మెదపని ఆయన భక్తులు, తమ దేవుడి ఆలయ ఉనికే ప్రమాదంలో పడితే చలిస్తారనుకోవడం మన అత్యాశ కాకపోతే..

రాకాసిలా దూసుకొస్తున్న ఈ రైల్వే వంతెన శతాబ్ద చరిత్ర ఉన్న కందికల్ గేట్ ఉనికినే కాలగర్భంలో కలిపేసింది.. ఇటువైపు నుండి కందికల్ గేట్ బస్తీలోకి వెళ్లే మార్గమే లేకుండా పోయింది.. నేను పుట్టి పెరిగిన ప్రాంతానికి ఇక వెళ్లలేనని తలచుకోవడానికే బాధగా ఉంది.. చత్రినాఖ నుండి కందికల్ గేట్ వెళ్లే రహదారికి రెండు వైపులా ఇళ్లూ, షాపులు కూల్చేయడంతో ఈ ప్రాంతమంతా శిథిల మరుభూమిని తలపిస్తోంది.. ప్రభుత్వం దగ్గర అత్తెసరు నష్ట పరిహారం తీసుకున్న వారు ఆ డబ్బుతో కొత్త ఇంటిని కట్టుకునే అవకాశం లేక దీనంగా ఈ ప్రాంతాన్ని వదిలేసి ఇతర చోట్ల అద్దె ఇంట్లోకి తరలిపోయారు..

ఈ ప్రాంత వాసుల గోడు ప్రభుత్వానికి, రాజకీయ పార్టీల చెవికి ఎక్కే అవకాశమే లేకుండా పోయింది.. ఎందుకంటే మజ్లిస్ ప్రాభల్య ప్రాంతంలో ఉన్న ఇక్కడి హిందువుల బతుకులు మైనారిటీలకన్నా అధ్వాన్నంగా తయారయ్యాయి.. వీరి ఓట్లకూ విలువలేదు.. వీరు ఓట్లేసినా, వేయకున్నా తాము గెలుస్తామని తెలిసిన మజ్లిస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులకు వీరంటే ఎంతో చులకన.. అలాగే వీరు ఓట్లేసినా గెలిచే అవకాశం లేని బీజేపీ నాయకులు కూడా వీరిని పట్టించుకోకుండా గాలికి వదిలేశారు.. ఇక కాంగ్రెస్, టీడీపీలు ఈ ప్రాంత ఛాయలకే రావు.. పాత నగరంలో హిందువులుగా పుట్టడమే ఇక్కడి వారు చేసుకున్న పాపం.. 

No comments:

Post a Comment