Monday, July 15, 2013

చరిత్ర పుటల్లోకి టెలిగ్రామ్..

కొనేళ్ల క్రితం బీఎస్ఎన్ఎల్ చీఫ్ హైదరాబాద్లో తమ సెల్ ఫోన్ సేవలు ప్రారంభించేందుకు వచ్చినప్పడు, పబ్లిక్ టెలిఫోన్, ఎస్టీడీ బూత్ ఆపరేటర్ల సంఘం ఆయన్ని ఘెరావ్ చేసేందుకు ప్రయత్నించింది.. ప్రజలందరికీ సెల్ ఫోన్లు అందుబాటులోకి వస్తే తమ ఉపాధి దెబ్బతింటుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.. ఆయన వారి వైపు జాలిగా చూసి టెక్నాలజీని అడ్డుకోవడం వెర్రితనం అని స్పష్టం చేశారు.. ప్రజలు తమకు సౌకర్యవంతమై సేవలు కోరుకుంటున్నప్పడు, మీ ఉపాధి పోతుందనే సాకుతో వ్యతిరేకించడంలో అర్థం లేదని చెప్పేశాడాయన..
భారత దేశంలో సుదీర్ఘకాలం పాటు సేవలందించిన టెలిగ్రామ్ సర్వీస్ ఇవాళ్టితో నిలచిపోయింది.. మన పొరుగు దేశాల్లో ఏనాడో టెలిగ్రామ్ సర్వీసులు నిలిపి వేశారు.  తర్వలో పోస్టల్ డిపార్ట్మెంట్ కు ఇదే పరిస్థితి ఏర్పడవచ్చు.. అందుకే పోస్టల్ శాఖ బ్యాంకింగ్ రంగంలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తోంది.. కమ్యూనికేషన్ పరిణామ క్రమాన్ని ఒకసారి పరిశీలిస్తే పోస్ట్, టెలిగ్రామ్, టెలిఫోన్, పేజర్, మొబైల్ ఫోన్, ఈ మెయిల్, ఎస్ఎంఎస్.. ఇలా వరుసగా ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.. మరింత పాత కాలంలోకి పోతే పావురాలు కూడా సేవలు అందించాయి..
మెరుగైన సమాచార వ్యవస్థ ఉన్నప్పుడు పాత కాలం వ్యవస్థనే ఇంకా కొనసాగడం శుద్ధ దండగ.. మన కోర్టులు, ప్రభుత్వ కార్యాలయాలు నిన్నటి దాకా టెలిగ్రామ్ నే ప్రమాణికంగా పరిగణించడం ఆశ్చర్యాన్ని కలిగించింది.. అందుకే వాటి పనితీరు అంత నాసిరకంగా ఉంది కాబోలు.. టెలిగ్రామ్ లేకపోతే సరిహద్దుల్లో ఉండే జవాన్లకు మాత్రం కొంత ఇబ్బందే..
భారతీయులకు సెంటిమెంట్లు సహజం.. టెలిగ్రామ్ లతో పాతతరం వారికి ఎన్నో తీపి చేదు గుర్తులు ముడిపడి ఉన్నాయి.. గిట్టిన వారు మరు జన్మ ఎత్తక తప్పదు.. పుట్టిన వారు గిట్టక తప్పదు.. ఇది కమ్యూనికేషన్ వ్యవస్థకూ వర్తిస్తుంది..

No comments:

Post a Comment