Tuesday, July 23, 2013

హైదరాబాద్ నగరాన్ని మీరు అభివృద్ధి చేశారా?..

ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడక ముందు హైదరాబాద్ తొండలు గుడ్లు పెట్టడానికి కూడా భయపడిన ప్రాంతమన్నాడు కొన్నాళ్ల క్రితం ఓ  మేధావి.. తాము వచ్చాకే రాళ్ల హైదరాబాద్ రతనాల హైదరాబాద్ అయ్యిందని నిన్న మొన్న చెప్పు కొచ్చాడు మరో  మేధావి.. అసలు ఈ వ్యాపార రాజకీయ నేతాజీలకు హైదరాబాద్ చరిత్ర తెలుసా?.. సమాచార సాంకేతిక విప్లవం కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత ప్రపంచంలో ఇంకా చరిత్రను వక్రీకరించి మట్లాడితే నమ్మేవారుంటారనుకోవడం అమాయకత్వమే అవుతుంది.. మీకు చరిత్ర తెలియకుంటే తెలుసుకోండి.. కానీ అవాస్తవాలను ప్రచారం చేయకండి..
వీరి తండ్రులు, తాతలు పుట్టక ముందు నుండే హైదరాబాద్ ప్రపంచ ప్రసిద్ధి గాంచిన నగరాల్లో ఒకటి.. 1948లో భారత దేశంలో విలీనమయ్యే నాటికే హైదరాబాద్ కాస్మోపాలిటన్ నగరం.. విశాలమై రోడ్లు, అందమైక భవనాలు, చారిత్రిక కట్టడాలు ఉన్న నగరమిది.. ఆ రోజుల్లో హైదరాబాద్ నగరాన్ని దేశానికి రెండో రాజధాని చేయాలని బాబాసాహెబ్ అంబేద్కర్ సూచించారంటే ఈ నగర ప్రతిష్ట ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు..  హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశామని చంకలు చరచుకునేవారు ఫ్లై ఓవర్లు, హైటెక్ సిటీ తప్ప కొత్తగా నిర్మించిందేమిటి? నాయకుల ఆస్తులు, అక్రమ సంపాదన తప్ప..  1956కు ముందు హైదరాబాద్ దేశంలో కెళ్లా 5వ అతి పెద్ద నగరం.. 2013లోనూ అదే స్థానంలో ఉంది.. వీరు కొత్తగా అభివృద్ధి చేసిందేమిటి? 5 నుండి కనీసం 2 లేదా 3వ స్థానానికైతే తీసుకెళ్లలేదే?  నాలుగు శతాబ్దాల పైబడి చరిత్ర గల నగరాన్ని నాలుగు దశాబ్దాల క్రితం వచ్చిన వారు ఇక్కడంతా శూణ్యం.. తామే అభివృద్ది చేశాం. . అని గొప్పలకు పోతారు ఎందుకో?
హైదరాబాద్ రాష్ట్ర రాజధాని కాబట్టే అన్ని ప్రాంతాల ప్రజలు అవకాశాల కోసం రావడం సహజం.. ఈ నగరం అందరినీ ఆదరించింది.. కానీ వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ నగరాన్ని తామే అభివృద్ది చేశాం అని ప్రగల్భాలు పలకడం ఎందుకు? స్థానికులను కించపరడం, అవమానించడం ఎందుకు? కర్నూలును వదులుకొని హైదరాబాద్ వచ్చామని బాధ పడటం ఎందుకు? కర్నూలు నగరానికి ఏం తక్కువ? దాన్ని అగ్ర నగరంగా తీర్చిదిద్ది డొచ్చు కదా? అది సాధ్యం కాకపోవడం వల్లే అప్పటికే అభివృద్ధి చెందిన హైదరాబాద్ నగరంపై మీ కన్ను పడింది..
కొందరు సీమ నేతల నిర్వాకం ఎలా ఉంది? అసలైన రాయలసీమ ఎలా ఉండేది? గ్రేటర్ రాయల సీమ మతలబు ఏమిటి? అనే విషయాలను నా తదుపరి వ్యాసంలో చర్చిస్తాను..

No comments:

Post a Comment