Wednesday, July 24, 2013

గ్రేటర్ రాయలసీమ అంటే ఇలా..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండుకు ప్రతిగా కొందరు రాయలసీమ నేతలు రాయల తెలంగాణ ప్రతిపాదన తెచ్చారు.. అంటే రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణతో కలిపి కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయాలట.. ఇందులో కొందరు నాయకుల సామాజిక, రాజకీయ ఎత్తుగడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.. రాయల తెలంగాణ పేరిట సీమను విభజించే కుట్ర జరుగుతున్నా, ఒకరిద్దరు నేతలు తప్ప చాలా మంది ఈ ప్రాంత నాయకులు అంతగా నోరు మెదపకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది..
తెలంగాణ ఇస్తే గ్రేటర్ రాయలసీమ ఇవ్వాలంటాడో నాయకుడు.. సంతోషమే కానీ సీమలోని నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల, ఆలంపూర్ కూడా అందులో కలపాలట? ఇదెక్కడి చోద్యం?.. అసలు ఈ జిల్లాల నాయకులు ఈ ప్రతిపాదనకు ఒప్పుకుంటారా?
ఒకప్పడు రాయలసీమ అంటే బళ్లారి, కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలు.. పాత మద్రాసు స్టేట్ చిత్ర పటాన్ని ఒకసారి చూడండి.. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు బళ్లారి మైసూరు రాష్ట్రం (ప్రస్తుత కర్ణాటక)లో కలిసిపోయింది.. ఆనాటి మన నాయకుల అసమర్ధ నిర్వాకం వల్ల తెలుగు ప్రజలు అత్యధికంగా ఉన్న బళ్లారి రాయలసీమకు దూరమైంది.. అలాగే ప్రకాశం జిల్లా ఏర్పడ్డప్పుడు కర్నూలు జిల్లాలోని గిద్దలూరు, మార్కాపురం ప్రాంతాలను విడదీసి అందులో కలిపారు.. సీమకు తలకాయ లాంటి బళ్లారిని వదులుకొని తమవి కాని నెల్లూరు, ప్రకాశం జిల్లాలు, గద్వాల, ఆలంపురం ప్రాంతాలు కలిపి రాయలసీమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం తగునా? ఇక్కడ నేను రాయలసీమ చరిత్ర, శ్రీభాగ్ ఒప్పందంలాంటి చారిత్రక అంశాలజోలికి పోకుండా క్లుప్తంగా విషయానికొస్తున్నాను..
రాయలసీమ నాయకులు నిజంగా గ్రేటర్ రాయలసీమను  ఏర్పాటు చేయాలని కోరుకుంటే ప్రస్తుత నాలుగు జిల్లాలు బళ్లారికి తోడు ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, మర్కాపురం ప్రాంతాలను కలుపుకోవచ్చు.. (నా ఊహా చిత్రాన్ని చూడండి) గ్రేటర్ రాయలసీమను మరింతగా విస్తరించాలంటే  కర్ణాటకలోని చిత్రదుర్గ, తుంకూరు, కోలారు జిల్లాలు.. తమిళనాడులోని కృష్ణగిరి, ధర్మపురి, సేలం, తిరువల్లూరు, వేలూరు జిల్లాలు కలుపుకునే ప్రయత్నం చేయవచ్చు.. ఇవన్నీ తెలుగు వారి ఆధిక్యత గల జిల్లాలు.. కానీ ఇది అంత సులభమైన విషయం కాదు.. ఆలోచించాల్సిందే..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఖాయమైతే రాయలసీమ కూడా ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించమే సమంజసం.. వర్ష పాతం అంతగా లేని రాయలసీమ ప్రధానంగా ఎదుర్కొంటున్నది సాగునీటి సమస్య,, తెలంగాణ ఏర్పడితే తమకు కృష్ణా నది నీళ్లు రావని భావించడం అపోహ మాత్రమే.. జల వివాదాలు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా ఉండేవే.. వాటికి పరిష్కారాలు కూడా ఉంటాయి.. బళ్లారిని కలుపుకొని గ్రేటర్ రాయలసీమగా ఏర్పడితే ఈ సమస్యను అధిగమించవచ్చు.. కృష్ణా, తుంగభద్ర, పెన్నా నదులకు తోడు రాయలసీమలో అపారమైన సహజవనరులు, గనులు ఉన్నాయి.. ఇవన్నీ సక్రమంగా ఉపయోగించుకుంటే రాయలసీమ నిజంగా రతనాల సీమ అవుతుంది.. బెంగళూరు, చెన్నై నగరాలు దగ్గరగా ఉండటం పారిశ్రామీకరటణకు, ఐటీ అభివృద్ధికి కలిసి వచ్చే అంశం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అత్యధిక కాలం పాలించింది రాయలసీమ ప్రాంత ముఖ్యమంత్రులే.. నీలం సంజీవ రెడ్డి, దామోదరం సంజీవయ్య, కోట్ల విజయభాస్కర రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, వైస్ రాజశేఖర రెడ్డి.. ప్రస్తుత సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఈ ప్రాంత వాసులే.. ఎన్టీరామారావు కోస్తాంధ్ర వాసి అయినా, ఆయనకు రాయలసీమతో ఉన్న అనుబంధమే ఎక్కువ.. ఇందరు హేమా హేమీలు ఉన్నా, రాయలసీమ వెనుక బాటుకు కారణం ఏమిటి?.. చిత్తశుద్ధి లేకపోవడమే.. ఫ్యాక్షన్ రాజకీయాలతో కొట్టుకునే ఇక్కడి నేతలు సీమ ప్రయోజనాలను మొదటి నుండి నిర్లక్ష్యం చూస్తూ వచ్చారు.. (నేను నేతలందరినీ నిందించడం లేదు) ఇక్కడి నాయకుల్లో చాలా మందికి హైదరాబాద్ తో పాటు బెంగళూరు, చెన్నై నగరాల్లో ఆస్తులు, వ్యాపారాలు ఉన్నాయి..  కానీ తమ సొంత నేల రాయలసీమ అభివృద్దిని మాత్రం వారికి పట్టదు.. ఫ్యాక్షన్ రాజకీయాలతో సీమలో నెత్తురు పారించిన నాయకులు ఈ ప్రాంత అభివృద్దిపై దృష్టి పెడితే అసలు వెనుకబాటు సమస్య ఉండేదా?

గ్రేటర్ రాయలసీమ రాష్ట్రం ఈ సమస్యలకు పరిష్కారం చూపుతుందా? ఆలోచించాల్సిన విషయమే.. ఇక్కడ నేను కొత్త వివాదం సృష్టించడం లేదు... ఉన్న సమస్యకు నా వంతు పరిష్కార మార్గాన్ని సూచిస్తున్నానంటే..


No comments:

Post a Comment