Wednesday, November 26, 2014

తీవ్రవాదంపై సమరం సాగాలి..

1857.. ఈ సంఖ్య మన ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామ (సిపాయిల తిరుగుబాటు) సంవత్సరం అనుకుంటున్నారా?.. అంతే కాదు యాదృచ్చికంగా తీవ్రవాదులు ఇప్పటి దాకా మన దేశ పౌరులను పొట్టన పెట్టుకున్న పౌరుల సంఖ్య కూడా ఇంతే.. ఆగస్టు 2,1984 నాటి మీనం బాకం బాంబు పేలుడు మొదలుకొని ఈ ఏడాది మే 1, 2014 వరకూ దేశంలో జరిగిన 58 ఉగ్రవాద ఘటనల్లో మరణించిన పౌరుల సంఖ్య 1857.. ఇందులో అత్యధికంగా ముంబయిలో జరిగిన మూడు ఘోర బాంబు దాడుల సంఘటనల మృతులు ఉన్నారు..(సోర్స్:వికీపీడియా)
తీవ్రవాదం మన దేశానికి ప్రధాన సమస్యగా మారింది.. శతృవు ఎక్కడో ఉండడు.. మన మధ్యలోనే ఉంటాడు.. చెప్పిరాడు.. హఠాత్తుగా వచ్చి పని కానిచ్చుకొని పోతాడు.. అప్రమత్తంగా లేకపోతే మనకే ప్రమాదం.. ఇందులో పొరుగు దేశాల ప్రోత్సాహంతో కొనసాగుతున్న ఉగ్రవాద సంస్థలు కొన్నయితే.. వివిధ రాష్ట్రాల్లో ఉద్యమాల పేరుతో కొనసాగుతున్న సంస్థలు మరికొన్ని..
దేశ ప్రజలంతా తీవ్రవాదానికి వ్యతిరేకంగా గళం ఎత్తాలి.. కలిసికట్టుగా పోరాడాలి.. ఐక్యతను ప్రదర్శించాలి.. మనకెందుకులే అని తప్పించుకునే పరిస్థితి లేదు.. మనం వెళ్లుతున్న రోడ్డు మీదో, హోటళ్లోనో, థియేటర్లోనే ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేని పరిస్థితి.. హైదరాబాద్లో ఛాట్ తినేందుకు వెళ్లి, తిరిగి రాని లోకాలకు పోయారు అమాయక ప్రజలు.. తీవ్రవాదులు ఎప్పుడు ఏ రూపంలో పొంచి ఉంటారో, ఎవరిని పొట్టనపెట్టుకుంటారో ఎవరికి తెలుసు?
26/11 దేశ చరిత్రలో మరుపురాని తేదీగా మిగిలిపోయింది నవంబర్ 26, 2008నాడు పాకిస్తాన్ నుండి వచ్చిన తీవ్రవాదులు దేశ వాణిజ్య రాజధాని ముంబై మీద దాడి చేసి మారణ హోమం సృష్టించారు.. ఎందరో పౌరులు బలైపోయారు.. తీవ్రవాదులను తిప్పికొట్టే క్రమంలో వీర జవానులు, పోలీసులు నేలకొరిగారు.. ఈ రోజున వారందరికీ నివా
ళులర్పిద్దాం.. తీవ్ర వాదానికి వ్యతిరేకంగా మన గళం వినిపిద్దాం..

Tuesday, November 25, 2014

చరిత్ర పుటల్లో కోరంగి

మారిషస్ దేశంలో తెలుగు వారిని కోరంగిలంటారు.. అలాగే బర్మా (మయాన్మార్)లో కూడా తెలుగువారిని కోరంగీలుగానే పిలుస్తారు.. ఎందుకలా?  శతాబ్దాలుగా కోస్తాంధ్ర తీరంలోని కోరంగి నుండి ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, శ్రీకాకుళం తదితర జిల్లాల ప్రజలు వారు ఉపాధి చైనా, బర్మా, మలేషియా తదితర తూర్పు ఆసియా దేశాలకు, శ్రీలంక, మారిషస్, ఇతర ఆఫ్రికా దేశాలకు వలస వెళ్లారు.. అందుకే వారికి కోరంగీలనే పేరు వచ్చింది.. తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ సమీపంలో ఉన్న గ్రామమే కోరంగి.. అయితే ఇప్పుడున్న కోరంగి, ఒకనాటి కోరంగి వేరు..
కోరంగి ఒకప్పుడు అతి కీలకమైన ఓడ రేవు.. అంతే కాదు ఇక్కడి నౌకా నిర్మాణ పరిశ్రమకు ఎంతో పెద్ద చరిత్ర ఉంది.  క్రీస్తు పూర్వం నుండే దీని ఆనవాళ్లు ఉన్నాయి.. ఈస్టిండియా కంపెనీ మన దేశానికి వచ్చిన తర్వాత కూడా కోరంగి నౌకాయాన పరిశ్రమ ప్రపంచంలోనే గొప్పదిగా పేరు తెచ్చకుంది.. లండన్ రేవులో లంగరు వేసిన కోరంగి మేడ్ నౌకలను చూసి బ్రిటిష్ వారికి కన్ను కుట్టింది.. నౌకా వ్యాపారంపై పట్టు సాధించిన బ్రిటిష్ వారు కోరండి నౌకా పరిశ్రమను నిర్వీర్యం చేసేందుకు పన్నుల భారాన్ని మోపారు.. అయినా తట్టుకొని నిలబడింది ఇక్కడి పరిశ్రమ.. కోరండి ఓడ రేవు అతి పెద్ద వ్యాపార కేంద్రంగా వర్దిల్లేది..
రెండు అతి పెద్ద తుఫానును కోరంగిని కాల గర్భంలో కలిపేశాయి.. 1789, 1839 సంవత్సరాలు కోరంగికి మరణ శాసనాలుగా మారాయి.. 1789 డిసెంబర్ మాసంలో వచ్చిన మహా తుఫాను ధాటికి కోరంగి అల్లకల్లోలం అయిపోయింది.. దాదాపు 20 వేల మంది మరణించారు.. ఇక్కడి ప్రజలు సర్వ కోల్పోయారు.. అయినా క్రమంగా కలుకొని మళ్లీ నౌకా నిర్మాణ పరిశ్రమను కొనసాగించారు.. కానీ 1839లో నవంబర్ 25 తేదీ కోరంగి ఉనికి కాలగర్భంలో కలిపేసింది.. 40 అడుగుల ఎత్తున లేచిన మహా అల ఊరంతటినీ ఇసుక సమాధి చేసేసింది.. దాదాపు 3 లక్షల మంది ప్రాణాలు పోయాయి.. ఇళ్లూ, గిడ్డంగులు, నౌకా పరిశ్రమ మాయమైపోయాయి.. ప్రపంచ తుఫానుల చరిత్రలో మూడో అతిపెద్ద విషాదంగా నమోదైంది ఈ ఘటన.. అసలు cyclone అనే పదాన్ని ఇంగ్లీషు వారు ఈ విషాదం తర్వాతే ఉనికిలోకి తెచ్చారంటారు..

కోరంగి ఇప్పుడు లేదు.. ఆనాటి నౌకా పరిశ్రమ కూడా లేదు.. ఇసుక దిబ్బల కింద దాని చరిత్ర సమాధి అయిపోయింది.. ఈ మహా విషాదం జరిగి ఈ రోజుకు సరిగ్గా 175 సంవత్సరాలు.. 

మాంసాహార వ్యతిరేక దినోత్సవం

ఈ సృష్టిలో అన్ని ప్రాణుల్లాగానే మనిషి కూడా ఓ భాగమే.. ప్రాణులన్నీ తమ మనుగడ కోసం పరస్పరం పోరడుకుంటాయి.. తోటి ప్రాణిని భక్షించేస్తాయి.. ఈ పోరాటంలో ఇతర ప్రాణులకన్నా అధికంగా బుద్ధి జీవిగా భావించే మానవుడు పై చేయి సాధించేశాడు.. కానీ తన ఆటవిక లక్షణాలను ఇంకా కొనసాగిస్తున్నాడు.. తన ఆహారం, సౌకర్యం, వినోదం అనే స్వార్థాల కోసం తోటి ప్రాణులను, వాటి స్వేచ్ఛను హరిస్తున్నాడు.. జీవించే హక్కు కేవలం మనిషికేనా? ఇతర ప్రాణులు ఏం పాపం చేశాయి..
మనం కనీసం మాంసాహారం మానేయడం ద్వారా అయినా తోటి ప్రాణుల హక్కును కాపాడవచ్చు.. మాంసాహాహారం లేకుండా జీవించలేమా? వాస్తవానికి మాంసాహారం కన్నా శాఖాహారంలోనే పోషక విలువలు అధికంగా ఉన్నాయి.. మాంసాహారం సర్వ రోగాలకు మూలం.. ఏ జంతువు ఏ రోగంతో బాధ పడుతుందో ఎవరికి తెలుసు.. అది మాంసాహారంగా మారి మన పొట్టలో చేరితే మనకు తెలియకుండానే రోగాలపాలవుతాం.. దీని బదులు తాజా శాఖాహారం తీసుకుంటే మేలు కదా? మాంసాహారం రుచికరం అనేది మన జిహ్వా చాపల్యానికి సంబంధించిన భ్రమ మాత్రమే.. ఇష్టపడితే శాఖాహారంలోనే అద్భుతమైన రుచిని ఆస్వాధించ వచ్చు.. తద్వారా జీవ హింసకు దూరంగా ఆరోగ్యంగా ఉండవచ్చు..

సాధు టీఎల్ వాస్వాని జయంతి అయిన నవంబర్ 25ను భారత దేశ వ్యాప్తంగా ప్రతి ఏటా Meatless Day  మాంసాహార వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటున్నారు.. జంతువుల హక్కులు, వాటి స్వేచ్ఛా స్వాతంత్రాలను కాపాడేందుకు ఎంతో కృషి  చేసిన సాధు వాస్వాని జయంతి రోజైనా మాంసాహారానికి దూరంగా ఉందాం.. ఈ ఒక్కరోజే కాదు శాశ్వతంగా శాఖాహారులుగా మారుదాం..

Friday, November 21, 2014

పేరు.. పోరు.. హైదరాబాద్ విమానాశ్రయం

శంషాబాద్ విమానాశ్రయ దేశీయ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని సమర్ధిస్తారా?.. వ్యతిరేకిస్తారా?.. కొందరు మిత్రులు నన్ను అడిగిన ప్రశ్నలు ఇవి.. అభిప్రాయాన్ని ప్రకటించేందుకు నేనేం రాజకీయ నాయకున్ని కాదు.. అలాగని నా అభిప్రాయాన్ని దాచుకోవాల్సిన అవసరం కూడా లేదు..
ఇది అసందర్భమైన చర్య.. తొందర పాటు నిర్ణయం అని నేరుగా, ముందుగానే చెబుతున్నాను.. ఎన్టీ రామారావు గొప్ప తెలుగు నాయకుడు.. అత్యధిక సంఖ్యలో ప్రజలు అభిమానించే రాజకీయ నాయకుడు, సినీ నటుడు.. దీన్ని అంగీకరించాల్సిందే.. మరి ఇంతటి మహనీయుని పేరును వివాదాల్లోకి లాగడం అవసరమా?.. ఎన్టీఆర్ నెంబర్ వన్ తెలుగు వాడు, సమైక్య ఆంధ్రప్రదేశ్ కు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారని వాదించినా మారిన పరిస్థితుల్లో ఎవరైనా ఆయన స్వరాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనే అంటారు కధా? పీవీ నరసింహారావు దేశ ప్రధానిగా పని చేసిన గొప్ప తెలుగువాడు కావచ్చు కానీ ఆయన స్వస్థలం వచ్చే సరికి అది తెలంగాణ రాష్ట్రంలో భాగం అని మనం అంగీకరిస్తున్నామా లేదా?
రాజశేఖర రెడ్డి హయాంలో బేగంపేటలోని విమానాశ్రయాన్ని శంషాబాద్ కు తరలించినప్పుడు అప్పటి వరకూ దేశీయ టెర్నినల్ కు ఉన్న ఎన్టీ రామారావు పేరును అక్కడ కొనసాగించక పోవడం అన్యాయమే.. తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఎన్టీఆర్ పేరును మళ్లీ పెడతామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆనాటి పరిస్థితుల్లో ప్రకటించారు.. కానీ రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితులు మారిపోయాయి.. శంషాబాద్ విమానాశ్రయం కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో భాగమైపోయింది..
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతి రాజును నిమమించినప్పుడే తేనెటీగ తుట్టెను కదిపే ఈ తొందరపాటు నిర్ణయం తీసుకుంటారేమో అని నేను ఊహించాను.. నేను ఊహించిందే  నిజం అయింది.. శంషాబాద్ విమానాశ్రయం విషయంలో  తీసుకున్న వివాదాస్పద నిర్ణయాన్ని టీఆర్ఎస్ తో పాటు అన్ని పార్టీలు వ్యతిరేకించక తప్పని పరిస్థితి ఏర్పడింది.. చివరకు ఈ తుంటరి పని వల్ల తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు కూడా ఇరకాటంలో పడాల్సి వచ్చింది.. అశోకుని సాయంతో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి ఎన్టీఆర్ పేరును పెట్టించడంతో ఇక్కడ బీజేపీ నాయకులు కూడా ఇబ్బందికర పరిస్థితినే ఎదుర్కొన్నారు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ (గన్నవరం), తిరుపతి (రేణిగుంట) విమానాశ్రయాలు ఉన్నాయి.. కొత్త రాష్ట్రం రాజధానితో పాటు కొత్త విమానాశ్రయం కూడా నిర్మించుకోవడానికీ అవకాశం ఉంది.. వీటిలో దేనికి ఎన్టీరామారావు పేరును పెట్టినా వ్యతిరేకించే వారు ఉండరు.. ఒక టెర్మినల్ కేం కర్మ ఏకంగా విమానాశ్రయం మొత్తానికి ఆ మహనీయుని పేరును పెట్టుకున్నా అభ్యంతరం ఎవరికుంటుంది.. ఇంత చక్కని అవకాశం ఉన్నప్పుడు పొరుగు రాష్ట్రం వారి విమానాశ్రయానికి బలవంతంగా ఎన్టీఆర్ పేరును రుద్దడంలోని ఆంతర్యం ఏమిటి.. ఇది తెంపరితనం కాదా? కోరి జగడం పెట్టుకోవడానికి మహనీయుడు ఎన్టీరామారావు పేరే దొరికిందా?.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు దాదాపులో అన్ని విషయాల్లో ఇప్పటికే ప్రతి రోజూ సిగపట్లు పడుతున్నాయి.. ఈ పరిస్థితిలో మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు మరో కొత్త వివాదం అవసరమా?

శంషాబాద్ విమానాశ్రయంలోని రెండు టెర్నినళ్లకు పీవీ నరసింహారావు, కొమరం భీమ్ పేర్లు పెడితే అభ్యంతరం ఎవరికి? అలాగే నవ్యాంధ్ర రాజధాని, విమానాశ్రయాలకు ఎన్టీఆర్ పెరు పెట్టుకుంటే వ్యతిరేకించేది ఎవరు?

1947.. ఒక శరణార్ధి కథ

యువరాజ్ గుప్తా.. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ మీర్పూర్ జిల్లా కోట్లి పట్టణ వాసి.. భారత దేశంలో జమ్మూ కాశ్మీర్ విలీన సందర్భంగా పాకిస్తాన్ సైన్యం ఆయన స్వస్థలాన్ని ఆక్రమించింది.. 27 నవంబర్, 1947 రోజున 14 ఏళ్ల వయస్సులో యువరాజ్ గుప్తా తన కుటుంబ సభ్యులతో జమ్మూకు వలస వచ్చేశారు.. రైల్వే శాఖలో పని చేసి రిటైర్ అయిన యువరాజ్ గుప్తా తన పుట్టిన ఊరు, చిన్నప్పటి జ్ఞాపకాలను మరువలేదు.. ఆ ప్రాంతంతో మనసిక సంబంధం వదులుకోలేక 2004లో అతికష్టం మీద పాకిస్తాన్ ఆక్రమిక కాశ్మీర్ వెళ్లారు.. వీసాపై పీవోకే వెళ్లిన తొలి హిందూ ఆయనే కావడం మరో విశేషం..

హైదరాబాద్ వచ్చిన యువరాజ్ గుప్తా జమ్మూ కాశ్మీర్ అధ్యయన కేంద్రం (హైదరాబాద్ విభాగం) బృందంతో తన జ్ఞాపకాలను పంచుకున్నారు.. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజల కడగండ్లను, ఉగ్రవాదుల దుశ్యర్యలను చెప్పుకొచ్చారు.. తనకు జన్మనిచ్చిన స్వస్థలం ప్రస్తుతం ఎదుర్కొంటున్న కడగండ్లకు చెప్పుడూ భావోద్వేగంతో కంటతడి పెట్టారు.. యువరాజ్ గుప్తా చెప్పిన విషయాలు చాలా ఆసక్తిని, బాధను కలిగించాయి.. ప్రస్తుతం పీవోకేలో హిందువుల జనాభా శాతం ‘0’ .. పాకిస్తాన్ సైన్యం దాదాపుగా వారిని నిర్మూలించడమో, తగలేయడమే, తరిమేయడమే చేసేసింది.. విధిలేని పరిస్థితుల్లో కొందరు మతం మార్చుకున్నారు.. పీవొకే ప్రజలు పాకిస్తాన్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని యువరాజ్ గుప్తా అంటున్నారు.. పాకిస్తాన్ చెర నుండి విముక్తి కోసం వారు తపిస్తున్నారట.. తన జ్ఞాపకాలు, అనుభవాలతో యువరాజ్ గుప్తా త్వరలో ఓ పుస్తకం రాస్తున్నారు.. కొద్ది వారాల్లోనే అది మన ముందుకు రాబోతోంది..

Wednesday, November 19, 2014

ఈయనకు పబ్లిసిటీ పిచ్చి ముదిరింది..

ఈ వ్యక్తిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదనిపిస్తుంది.. తన కొత్త సినిమా రిలీజింగ్ సమయంలో పబ్లిసిటీ కోసం ఏదో వాగేస్తాడు.. వార్తల్లోకి వస్తాడు.. అందరి దృష్టి పడుతుంది.. సాధారణంగా తిట్లే ఉంటాయి.. కానీ అదే ఆయనకు కావాలి.. చాలా ఛీప్ ట్రిక్ ఇది..
ఇతని పబ్లిసిటీ పిచ్చి కొన్ని సార్లు చిరాకు తెప్పిస్తుంది.. స్వతహాగా నాస్తికుడైన ఈయన దురద్దేశ్యాలతో హిందూ దేవుళ్లను వివాదాల్లోకి లాగుతుంటాడు.. తాజాగా తెలంగాణ వారికి యాదగిరి నరసింహ స్వామి ఉన్నాక, తిరుపతి వెంకటేశ్వరుడు ఎందుకు అని వాగాడు.. తెలంగాణ వారు తిరుపతి దేవున్ని మొక్కితేనేం.. ఆంద్రావారు యాదగిరి దేవున్ని పూజిస్తేనేం.. మధ్యలో ఈ నాస్తికునికి ఏం నొప్పి?
దేవుళ్లకు ప్రాంతాలను ఆపాదించి ఉద్రిక్తతలు సృష్టించి పబ్లిసిటీ పొందే ఈయన మనస్థత్వం చాలా నీఛం.. ఏ ప్రాంతానికైనా దేవుడు ఒక్కడే.. దేవుళ్లు సరిహద్దులుంటాయా? ఈ పెద్ద మనిషికి విష్ణువు అవతారాలు తెలియవని అనుకోను..వెంటేశ్వరుడైనా, నరసింహుడైనా ఒక్కరే..
ఇలాంటి వ్యక్తులను ఎంత తక్కువ పట్టించుకుంటే అంత మంచిదేమో..

Tuesday, November 18, 2014

విశ్వ నాయకుని పాత్రలో మోదీ..

సిడ్నీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం ప్రవాస భారతీయుల మదిని తట్టింది.. భారతీయులుగా పుట్టినందుకు ఎందుకు గర్వించాలో సూటిగా చెప్పారుు మోదీ.. భారత దేశం ఒకనాటి విశ్వ గురువు స్థానాన్ని తిరిగి సంపాదించడానికి ఇక ఎంతో దూరం లేదు అనే విశ్వాసం కలిగించింది..
నరేంద్ర మోదీ భారతీయుల మనస్సు గెలుచుకొని ప్రధానమంత్రి కావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.. ఇప్పుడు చాలా తక్కువ సమయంలోనే ప్రపంచ నాయకుని స్థాయిని పొందుతున్నారు.. మోదీ ఏ దేశానికి వెళ్లినా ప్రవాస భారతీయులు బ్రహ్మరథం పడుతున్నారు.. అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో నరేంద్ర మోదీ బహిరంగ సభలు ఎంతో విజయవంతం అయ్యాయి.. అక్కడి ప్రభుత్వాలు ఆయనకు రాక్ స్టార్ ఇమేజీని ఇచ్చాయి.. గతంలో ఏ భారత ప్రధానమంత్రికీ లేనంతటి ఆదరణ మోదీ పట్ల చూపించారు ప్రవాస భారతీయులు.. అమెరికా, ఆస్ట్రేలియా దేశాలకు ఎంతో మంది విదేశీ నాయకులు వస్తుంటారు.. కానీ వారి సభలో ఎంత భారీగా, ఆర్భాటంగా జరిగిన దాఖలాలు లేవు.. భారత దేశమంటే విదేశీయులకు తెలిసింది గాంధీ, నెహ్రూ మాత్రమే.. ఇప్పుడు నరేంద్ర మోదీని సైతం శక్తివంతమైన విశ్వ నాయకునిగా గుర్తిస్తున్నారు.. ఇది మోదీకి మత్రమే కాదు భారతీయులందరికీ గౌరవమే..

Wednesday, November 12, 2014

వైస్ ఛాన్సలర్ తిక్క..

ఈయన్ని చూస్తే బీటు కానిస్టేబుల్ మాదిరిగా కనిపిస్తున్నాడా?.. కానీ బీట్ కానిస్టేబుల్కి ఉన్న ఇంగితం కూడా ఈ పెద్ద మనిషికి లేదు.. గస్తీ తిరిగే కానిస్టేబుల్ రోడ్లపై పోకిరీలకు కంట్రోల్ చేస్తాడు.. కానీ ఈ పెద్దాయన అమ్మాయిలు చదువుకోడానికి లైబ్రరీలకే రావద్దని అంటాడు.. ఇంతకీ ఈ పెద్దాయన ఎవరో తెలుసా?.. ఆలీగర్ ముస్లిం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జమీరుద్దీన్ షా..
ఆడ పిల్లలు కూడా అబ్బాయిలతో సమానంగా, ఇంకా చెప్పాలంటే వారికన్నా ధీటుగా చదువుకొన్ని అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్న కాలం ఇది.. ప్రతి తండ్రీ తన కూతురును కొడుకతో సమానంగా చదివిస్తున్నాడు.. కానీ ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయిన ఈ పెద్దాయన ఇంకా ఛాందసవాదం వదులుకోకపోవడం దారుణం.. తన యూనివర్సిటీ పరిధిలోని విద్యార్ధినులు లైబ్రరీకి రావద్దని, వస్తే విద్యార్థుల చదువులకు ఆటంకం ఏర్పడుతుందని వాదించడానికి ఇతగాడికి ఎంత ధైర్యం? ఇలాంటి దౌర్భాగ్య మనస్థత్వం ఉన్నవారు ఉన్నత పదవులకు అర్హులేనా?

Monday, November 10, 2014

ఆధారే సర్వస్వం.. (కార్టూన్)

ప్రజలందరికీ ఆధార్ కార్డులు ఇక తప్పనిసరి.. ఈ కార్డు ఉంటేనే ఇక మనుషులుగా గుర్తిస్తారు.. సంక్షేమ కార్యక్రమాలకు అయినా, సిమ్ కార్డు తీసుకోవాలన్నా, బ్యాంకు అకౌంట్ తెరవాలన్నా ఆధారే గుర్తింపు.. ఈ చిత్రాన్ని చూసి జస్ట్ నవ్వుకోండి అంతే..

Sunday, November 9, 2014

జనం నేతకు మళ్లీ కేంద్ర మంత్రి పదవి

కొందరికి పదవులతోనే గుర్తింపు.. పదవులకు గుర్తింపు తెచ్చేవారు మరి కొందరు.. ఇక పదవులు ఉన్నా, లేకున్నా గుర్తింపు ఉన్నవారు చాలా అరుదు.. మన దత్తన్నది ఈ కోవే..
ఆరు దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉన్న బండారు దత్తాత్రేయ గారిని మూడోసారి కేంద్ర మంత్రి పదవి వరించడం బీజేపీ కార్యకర్తలకు మాత్రమే కాదు, రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలను, నాయకులను, పార్టీలకు అతీతంగా ఆనందం కలిగించిన వార్త..
దత్తాత్రేయ గారు ఆర్ఎస్ఎస్ ద్వారా సమాజ సేవకు అంకితమైన దత్తాత్రేయ ఎమర్జెన్సీ సమయంలో నిర్వహించిన పాత్ర, దివిసీమ ఉప్పెన అప్పుడు చేపట్టిన సేవ మరువలేనిది.. బీజేపీలో పదవులను సమర్ధవంతంగా చేపట్టారు.. నాలుగు సార్లు సికింద్రాబాద్ నుండి ఎంపీగా ఎన్నికయ్యారు.. అటల్జీలో పాటు నేడు మోదీ మంత్రి వర్గంలో మంత్రి పదవులు నిర్వహించడం సంతోషకరం..
బండారు దత్తాత్రేయ గారు ఎప్పుడు ప్రజల మధ్యే ఉంటారు.. అధికారంలో ఉన్నా, లేకున్నా వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం ఆయన నైజం.. గతంలో కేంద్ర రైల్వే, పట్టణాభివృద్ధి శాఖలకు సహాయ మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నగరానికి ఎంఎంటీఎస్ రైలును తీసుకొచ్చారు దత్తాత్రేయ.. అలాగే వాంబే పథకం కింద ఎంతో మంది పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చారు.. కానీ దీనికి అంతగా ప్రచారం దక్కకపోవడం ఆశ్చర్యకరం..
దత్తాత్రేయకు పార్టీలకు అతీతంగా అందరితో కలుపుగోరుగా ఉంటారు.. రాజకీయ ప్రత్యర్థులను సైతం ఆత్మీయంగా పలకరిస్తారు.. ప్రతి ఏటా దసరా సమయంలో తెలంగాణలో అలయ్ బలయ్ కార్యక్రమంతో అన్ని పార్టీల నేతలను ఒకే వేదికపైకి తేవడం సామాన్య విషయం కాదు..
మరోసారి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దత్తన్న తెలుగు రాష్ట్రాల సర్వతో ముఖాభివృద్ధిలో తనదైన ముద్రను చూపుతారని కచ్చితంగా చెప్పగలను..వారికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు..

Wednesday, November 5, 2014

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న మతి లేని, హాస్యాస్పదమైన నిర్ణయం ఏదైనా ఉందంటే.. అది ఏటీఎంల వాడకంపై నియంత్రణ. మెట్రో నగరాల్లో సొంత బ్యాంకు ఏటీఎంను నెలకు ఐదు సార్లే ఉపయోగించాలట.. ఇతర బ్యాంకుల ఏటీఎంలను మూడు సార్లు మాత్రమే ఉపయోగించాలి. అంతకు మించితే ప్రతి లావాదేవీకి అధనంగా రూ.20 వసూలు చేస్తారట.
ఏటీఎంలు ఎన్నిసార్లు ఉపయోగించుకుంటే ఏమిటి నష్టం?.. మధ్యలో ఆర్బీఐకీ ఏమిటి నొప్పి?.. ఖాతాదారులను ఇబ్బంది పెట్టే ఈ చెత్త ఐడియా వారికి ఎవరిచ్చారు?..

బ్యాంకింగ్ సర్వీసులు ఎక్కువగా ఉపయోగించుకునేది వేతన జీవులే.. గతంలో జీతాలు చేతికి ఇచ్చే రోజుల్లో చిరుద్యోగులు వారం పది రోజుల్లో అంతా ఖర్చయిపోయి, మిగతా నెలంతా ఇబ్బంది పడేవారు.. బ్యాంక్ అకౌంట్లో జీతాలు వేసే విధానం వచ్చాక వారిలో పొదుపు చేసుకునే అలవాటు పెరిగింది.. ప్రతిసారీ చెక్కు పట్టుకొని బ్యాంకుకు వెళ్లి ఇబ్బంది పడాల్సి అవసరం లేకుండా ఏటీఎం కార్డులు అందరికీ ప్రయోజనకరంగా మారాయి..
ఏటీఎంల వాడకంపై నియంత్రణ కారణంగా ఖాతాదారులు తమ వేతనాలను రెండు మూడు విడతల్లో మొత్తం లాగేసుకుంటారు. ఫలితంగా వారి అకౌంట్లో నెలాఖరుదాకా ఉండాల్సిన నిల్వలు తగ్గుతాయి.. ఇక్కడ ఎక్కువ నష్టపోతున్నది బ్యాంకులే.. మరోవైపు ఏటీఎంలను ఐదు సార్లు వినియోగించుకున్నాక, ఛార్జీల భారాన్ని తప్పించుకునేందుకు నేరుగా బ్యాంకుకే వచ్చేస్తారు.. ఇలా అయితే బ్యాంకు సిబ్బందిపై పని భారం పెరగడం మాత్రమే కాదు, ఖతాదారుకు సమయం కూడా వృధా..

ప్రతి పౌరునికి బ్యాంకు ఖాతా ఉండాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ ఇటీవల జన్ ధన్ పథకాన్ని ప్రారంభించారు.. ప్రజల్లో పొదుపు అలవాటు పెంచడంతో పాటు, ప్రభుత్వ ప్రయోజనాలు వారికి నేరుగా చేరాలన్నదే ఈ పథకం ఆశయం.. కానీ ఆర్బీఐ అధికారుల మతి లేని విధానాలకు ప్రజలను బ్యాంకుల సేవలను మరింత దూరం చేసేవిలా ఉన్నాయి.. పరోక్షంగా వారిలో పొదుపుపై ఆసక్తిని తగ్గిస్తున్నాయి.. ఇక్కడ అంతిమంగా నష్టం కలిగేది ఎవరికి? అంతో ఇంతో దేశ ఆర్థిక వ్యవస్థకే కదా?..

Tuesday, November 4, 2014

న్యూయార్క్ టైమ్స్ అహంకారం అణిగే ఉండాలి..

భారతీయుల అంతరిక్ష ప్రయోగ విజయంపై ఓర్వలేక న్యూయర్క్ టెమ్స్ పత్రిక వేసిన కార్టూన్ గుర్తుండే ఉంటుంది.. ఆ కార్టూన్ వివాదాస్పదం కావడంతో న్యూయార్క్ టైమ్స్ క్షమాపణలు చెప్పిందనుకోండి.. అయితే ఇటీవల ఓ రాకెట్ ప్రయోజంలో అమెరికా ఫెయిల్ అయిన ఉదంతంపై మన హిందుస్థాన్ పత్రిక వేసిన కార్టూన్ అందరినీ ఆకర్షించింది.. అమెరికన్ పత్రిక అహంకారానికి, దెబ్బకు దెబ్బ అన్నట్లుందా కార్టూన్..

Sunday, November 2, 2014

పేదలకు వరం.. ఉచిత వైద్యం

చాలా కాలంగా ప్రభుత్వాలు ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేస్తున్నాయి.. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలు, సౌకర్యాలు అందుబాటులో లేకుండా పోయాయి.. ఫలితంగా ప్రజలు ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు.. ఇక పేదవాడికి పెద్ద రోగం వస్తే అప్పు చేసి, ఆర్థికంగా చితికిపోతున్నాడు.. వైద్యానికి డబ్బు పుట్టక విధిలేక మరణిస్తున్న సందర్భాలు ఉన్నాయి.. ఇక ఇదంతా గతం కాబోతోంది.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెస్తున్న సరికొత్త పథకం దేశ ప్రజలకు, ముఖ్యంగా పేదలకు ఆశాజ్యోతిగా కనిపిస్తోంది..
ఇకపై ఆస్పత్రులకు వెళ్లితే డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.. ఎంత పెద్ద రోగానికై ఉచితంగా చికిత్స చేస్తారు.. మందులు కూడా ఉచితమే.. ఈ ఖర్చునంతా కేంద్ర ప్రభుత్వమే భరించబోతోంది.. ఇది కల కాదు నిజం రూపం దాల్చబోతోంది.. ప్రజారోగ్యం బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదే.. ప్రజలు వైద్యం కోసం పెట్టే ఖర్చు ఆదా కావడం, వారి ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుస్తుంది.. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఇప్పటికే ఈ మేరకు నివేదికను తయారు చేసింది..

అమెరికాలో అమలవుతున్న తరహా యూనివర్సల్ హెల్త్ ఫ్లాన్ భారత దేశంలోనూ తీసుకురావడానికి ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి ప్రారంభమయ్యే ఈ పథకం 2019 నాటికి దేశ వ్యాప్తంగా అమలు చేయబోతున్నారు. ఇందు కోసం 1.6 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చుచేయబోతున్నారు.. దేశంలోనే అతిపెద్ధ ఆరోగ్య పథకం అతి త్వరలో మన ముందుకు రాబోతోంది.. 

ఆంధ్రప్రదేశ్ అవతరణ అక్టోబర్ 1..

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఎప్పుడు? నవంబర్ ఒకటా?. జూన్ రెండా?.. లేక అక్టోబర్ ఒకటా? ఈ విషయంలో అధికార పక్షం, ప్రతిపక్షం పరస్పర విరుద్దంగా ప్రకటనలు చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయి.. నిజానికి ఇద్దరి వాదనలు అర్థం లేనివనే చెప్పక తప్పదు..ఈ ప్రశ్నకు చరిత్రలో స్పష్టమైన సమాధానం ఉంది..
ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని తెలుగు వారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం చిరకాల పోరాటం చేశారు.. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం ఫలితంగా అక్టోబర్ 1, 1953న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.. ఆ తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతం, ఆంధ్ర రాష్ట్రం విలీనమై నవంబర్ 1, 1956న ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో జూన్ 2, 2014న రాష్ట్రం రెండుగా విడిపోయింది.. తెలంగాణ మినహా మిగతా ప్రాంతం ఆంధ్రప్రదేశ్ పేరుతోనే కొనసాగుతోంది..
తెలంగాణ విషయానికి వచ్చే సరికి జూన్ 2 అవతరణ దినోత్సవం.. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సైతం ఇదే తేదీ జరపవచ్చా అన్నదే సందిగ్దం.. రాష్ట్ర క్యాబినెట్ ఈ తేదీకి ఆమోద ముద్ర వేయడాన్ని వైఎస్సార్సీపీ తప్పు పట్టింది.. నవంబర్ ఒకటినే ఉత్సవాలకు సిద్దమైంది..
నవంబర్ ఒకటి సమైక్యాంధ్రప్రదేశ్ ఆవిర్భవించిన రోజు.. అసలు సమైక్యాంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఇప్పుడు లేదు.. మరి ఈ తేదీన అవతరణ ఉత్సవాలు జరపడంలో అర్థం ఉందా? జూన్ రెండు అనే సరికి తెలంగాణ ఆవిర్భావమే అందరికీ గుర్తుకు వస్తుంది.. ఆ రోజున ఉత్సవాలు జరపడంలోనూ అర్థం లేదు.. ఇక మిగిలింది అక్టోబర్ ఒకటి..
1953 అక్టోబర్ ఒకటిన మద్రాసు రాష్ట్రం ఉండి విడిపోయి ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు మళ్లీ దాదాపు అదే రూపంలో (ఖమ్మంలో కొన్ని ప్రాంతాలు తప్ప) ఆంధ్ర ప్రదేశ్ పేరుతో కొనసాగుతోంది.. 1956 నవంబర్ ఒకటిన ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావంతో ఈ తేదీని అంతా మరిచిపోయారు.. వాస్తవానికి తాజా నవ్వాంధ్రప్రదేశ్ అయినా, నాటి ఆంధ్ర రాష్ట్రమైనా అక్టోబర్ ఒకటి 1953న ఏర్పడిన భౌగోళిక స్వరూపమే.. మరి ఈ తేదీనే అవతరణ దినోత్సవం జరుపుకుంటే ఎవరు కాదంటారు?

చారిత్రిక వాస్తవాలను పరిగణలోకి తీసుకొని అక్టోబర్ ఒకటినాడే రాష్ట్ర అవతరణ దినోత్సవాలను జరుపుకోవడం సమంజసం.. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే పేరును తిరిగి ఆంధ్ర రాష్ట్రంగా మార్చుకుంటే మరింత స్పష్టత కనిపిస్తుంది..