Wednesday, November 5, 2014

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న మతి లేని, హాస్యాస్పదమైన నిర్ణయం ఏదైనా ఉందంటే.. అది ఏటీఎంల వాడకంపై నియంత్రణ. మెట్రో నగరాల్లో సొంత బ్యాంకు ఏటీఎంను నెలకు ఐదు సార్లే ఉపయోగించాలట.. ఇతర బ్యాంకుల ఏటీఎంలను మూడు సార్లు మాత్రమే ఉపయోగించాలి. అంతకు మించితే ప్రతి లావాదేవీకి అధనంగా రూ.20 వసూలు చేస్తారట.
ఏటీఎంలు ఎన్నిసార్లు ఉపయోగించుకుంటే ఏమిటి నష్టం?.. మధ్యలో ఆర్బీఐకీ ఏమిటి నొప్పి?.. ఖాతాదారులను ఇబ్బంది పెట్టే ఈ చెత్త ఐడియా వారికి ఎవరిచ్చారు?..

బ్యాంకింగ్ సర్వీసులు ఎక్కువగా ఉపయోగించుకునేది వేతన జీవులే.. గతంలో జీతాలు చేతికి ఇచ్చే రోజుల్లో చిరుద్యోగులు వారం పది రోజుల్లో అంతా ఖర్చయిపోయి, మిగతా నెలంతా ఇబ్బంది పడేవారు.. బ్యాంక్ అకౌంట్లో జీతాలు వేసే విధానం వచ్చాక వారిలో పొదుపు చేసుకునే అలవాటు పెరిగింది.. ప్రతిసారీ చెక్కు పట్టుకొని బ్యాంకుకు వెళ్లి ఇబ్బంది పడాల్సి అవసరం లేకుండా ఏటీఎం కార్డులు అందరికీ ప్రయోజనకరంగా మారాయి..
ఏటీఎంల వాడకంపై నియంత్రణ కారణంగా ఖాతాదారులు తమ వేతనాలను రెండు మూడు విడతల్లో మొత్తం లాగేసుకుంటారు. ఫలితంగా వారి అకౌంట్లో నెలాఖరుదాకా ఉండాల్సిన నిల్వలు తగ్గుతాయి.. ఇక్కడ ఎక్కువ నష్టపోతున్నది బ్యాంకులే.. మరోవైపు ఏటీఎంలను ఐదు సార్లు వినియోగించుకున్నాక, ఛార్జీల భారాన్ని తప్పించుకునేందుకు నేరుగా బ్యాంకుకే వచ్చేస్తారు.. ఇలా అయితే బ్యాంకు సిబ్బందిపై పని భారం పెరగడం మాత్రమే కాదు, ఖతాదారుకు సమయం కూడా వృధా..

ప్రతి పౌరునికి బ్యాంకు ఖాతా ఉండాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ ఇటీవల జన్ ధన్ పథకాన్ని ప్రారంభించారు.. ప్రజల్లో పొదుపు అలవాటు పెంచడంతో పాటు, ప్రభుత్వ ప్రయోజనాలు వారికి నేరుగా చేరాలన్నదే ఈ పథకం ఆశయం.. కానీ ఆర్బీఐ అధికారుల మతి లేని విధానాలకు ప్రజలను బ్యాంకుల సేవలను మరింత దూరం చేసేవిలా ఉన్నాయి.. పరోక్షంగా వారిలో పొదుపుపై ఆసక్తిని తగ్గిస్తున్నాయి.. ఇక్కడ అంతిమంగా నష్టం కలిగేది ఎవరికి? అంతో ఇంతో దేశ ఆర్థిక వ్యవస్థకే కదా?..

No comments:

Post a Comment