Sunday, November 2, 2014

ఆంధ్రప్రదేశ్ అవతరణ అక్టోబర్ 1..

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఎప్పుడు? నవంబర్ ఒకటా?. జూన్ రెండా?.. లేక అక్టోబర్ ఒకటా? ఈ విషయంలో అధికార పక్షం, ప్రతిపక్షం పరస్పర విరుద్దంగా ప్రకటనలు చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయి.. నిజానికి ఇద్దరి వాదనలు అర్థం లేనివనే చెప్పక తప్పదు..ఈ ప్రశ్నకు చరిత్రలో స్పష్టమైన సమాధానం ఉంది..
ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని తెలుగు వారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం చిరకాల పోరాటం చేశారు.. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం ఫలితంగా అక్టోబర్ 1, 1953న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.. ఆ తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతం, ఆంధ్ర రాష్ట్రం విలీనమై నవంబర్ 1, 1956న ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో జూన్ 2, 2014న రాష్ట్రం రెండుగా విడిపోయింది.. తెలంగాణ మినహా మిగతా ప్రాంతం ఆంధ్రప్రదేశ్ పేరుతోనే కొనసాగుతోంది..
తెలంగాణ విషయానికి వచ్చే సరికి జూన్ 2 అవతరణ దినోత్సవం.. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సైతం ఇదే తేదీ జరపవచ్చా అన్నదే సందిగ్దం.. రాష్ట్ర క్యాబినెట్ ఈ తేదీకి ఆమోద ముద్ర వేయడాన్ని వైఎస్సార్సీపీ తప్పు పట్టింది.. నవంబర్ ఒకటినే ఉత్సవాలకు సిద్దమైంది..
నవంబర్ ఒకటి సమైక్యాంధ్రప్రదేశ్ ఆవిర్భవించిన రోజు.. అసలు సమైక్యాంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఇప్పుడు లేదు.. మరి ఈ తేదీన అవతరణ ఉత్సవాలు జరపడంలో అర్థం ఉందా? జూన్ రెండు అనే సరికి తెలంగాణ ఆవిర్భావమే అందరికీ గుర్తుకు వస్తుంది.. ఆ రోజున ఉత్సవాలు జరపడంలోనూ అర్థం లేదు.. ఇక మిగిలింది అక్టోబర్ ఒకటి..
1953 అక్టోబర్ ఒకటిన మద్రాసు రాష్ట్రం ఉండి విడిపోయి ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు మళ్లీ దాదాపు అదే రూపంలో (ఖమ్మంలో కొన్ని ప్రాంతాలు తప్ప) ఆంధ్ర ప్రదేశ్ పేరుతో కొనసాగుతోంది.. 1956 నవంబర్ ఒకటిన ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావంతో ఈ తేదీని అంతా మరిచిపోయారు.. వాస్తవానికి తాజా నవ్వాంధ్రప్రదేశ్ అయినా, నాటి ఆంధ్ర రాష్ట్రమైనా అక్టోబర్ ఒకటి 1953న ఏర్పడిన భౌగోళిక స్వరూపమే.. మరి ఈ తేదీనే అవతరణ దినోత్సవం జరుపుకుంటే ఎవరు కాదంటారు?

చారిత్రిక వాస్తవాలను పరిగణలోకి తీసుకొని అక్టోబర్ ఒకటినాడే రాష్ట్ర అవతరణ దినోత్సవాలను జరుపుకోవడం సమంజసం.. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే పేరును తిరిగి ఆంధ్ర రాష్ట్రంగా మార్చుకుంటే మరింత స్పష్టత కనిపిస్తుంది..

No comments:

Post a Comment