Wednesday, April 30, 2014

పాపం బ్రహ్మీ..

ఓటర్లలో చైతన్యం తీసుకు రావడానికి ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం పేరిట పత్రికల్లో  ప్రకటనలు ఇచ్చింది ఎన్నికల సంఘం..
కానీ సదరు బ్రహ్మీ గారు ఓటు వేయలేక పోయారు.. కారణం జాబితాలో పేరు లేదట.. బ్రహ్మానందం సతీమణి పేరుకూడా గల్లంతయ్యింది..
ఓటు వేయడానికి వచ్చిన బ్రహ్మానందం తనయుడు గౌతమ్ మీడియాకు ఈ సంగతి చెప్పారు..

నేను ఓటేసిన..

మొత్తానికి పొద్దుగాలనే పోయి ఓటేసొచ్చిన.. దేశ ప్రజాస్వామ్యంల భాగమైన..
నాకు ఓటుకు ఎన్ని కష్టాలో.. ఇళ్ల మారిన వెంటనే కొత్త ప్రాంతంలో ఓటరుగా నమోదయ్యాను.. మా చుట్టూ ఎల్.బి.నగర్ నియోజకవర్గం ఉంటే.. మధ్యలో ద్వీపంలా మా కాలనీలను దూరాన ఉన్న యాకుత్ పురా నియోజకవర్గంలో చేర్చారు.. మా అపార్ట్ మెంట్, కాలనీకి బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలతో ఎవరూ ప్రచారానికి రాలేదు.. వారికి మా ఓట్ల పట్ల పెద్దగా ఆసక్తి లేదేమో.. అభ్యర్థులు ఎవరో కూడా తెలియదు.. మాకు వచ్చే దిన పత్రికలో ఎల్.బీ.నగర్ నియోజకవర్గ వార్తలే ఉంటాయి మరి.. అభ్యర్థులకే పట్టనప్పుడు ఓటు వేయడం అవసరమా అనే ఆలోచన నాకు కలగలేదు..

తీరా పోలింగ్ దగ్గర పడుతున్న సమయంలో చూస్తే కానీ మా కాలనీ ఓట్లున్న బూత్ లో నా ఓటు లేదు.. ఎన్నికల కమిషన్ వెబ్ సైట్లో వెతికితే దూరాన మరో చోట నా ఓటు ఉంది.. మొత్తానికి అక్కడికి వెళ్లి ఓటేసాను.. దేశ హితం కోరేవారికే ఓటేసిన.. ప్రజాస్వామ్యం పట్ల నిబద్దతను చాటుకున్నందుకు సంతోషంగా ఉంది..

ఓటేసినవా?..

తెలంగాణల ఓట్ల పండుగ ఇయ్యాల..
అరెరె.. ఇంకా నా బ్లాగ్ సూస్కుంట కూసున్నవా?..
లెవ్.. లెవ్ ముందుగాల ఓటేసి రాపో..
జై తెలంగాణ.. జై భారత్..

ప్రతి ఓటు ఆయుధమే..

ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటుకూ విలువ ఉంది.. నేనొక్కడిని ఓటు వేయకుంటే ఏమవుతుంది అనుకోవడం సరికాదు.. మీ ఓటు దేశ దిశ, దశను మారుస్తుంది.. ప్రతి ఓటూ ఒక వజ్రాయుధమే..
మతం, కులం, వర్గం, ప్రాంతం ఆధారంగా ఓటు వేయకండి.. డబ్బు, మద్యం, కానుకలకు లొంగి ఓటు వేసి అమ్ముడు పోతే, పరోక్షంగా ప్రజాస్వామ్యాన్ని అమ్ముకున్నట్లే.. మీరు ఓటు వేసు అభ్యర్థి మీ సమస్యలను పరిష్కరిస్తాడా? అతడి వల్ల సమాజానికి, దేశానికి ఉపయోగం ఏమిటి అని ఆలోచించండి.. ఎవరూ నచ్చలేదని నోటా ఉపయోగిస్తే ప్రయోజనం శూన్యం.. ఉన్నవారిలో మంచి అభ్యర్థులనే ఎందుకోండి..
మనం ఓటు వేసేది భారతదేశ బంగారు భవిష్యత్తుకోసం.. our
vote for INDIA

Tuesday, April 29, 2014

పండిట్ల సాక్షిగా ఈ మాటలనగలరా?

నరేంద్ర మోదీకి ఓటేసేవాళ్లంతా సముద్రంలో మునగాలట.. కేంద్ర మంత్రినేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా అన్నాడు..
అంతే కాదు.. మోదీకి ఓటేస్తే భారత దేశం మత రాజ్యంగా మారుతుందని, కశ్మీర్ ఈ దేశంలో అంతర్భాగంగా ఉండబోదని హెచ్చరించాడు.. మతవాదం కశ్మీర్ ప్రజలకు ఆమోదయోగ్యం కాదని సుద్దులు చెబుతున్నాడు ఫరూఖ్ అబ్దుల్లా..
అరె.. మూర్ఖ్ ఫరూఖ్! ఈ మాటలనే అర్హత ఉందా నీకు?.. కశ్మీర్లో మతతత్వ బీజాలు పడింది నీ కుటుంబ పాలనలోనే కదా?.. నీ తండ్రి షేక్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూపొందిన ఆర్టికల్ 370 కారణంగానే వేర్పాటు తలెత్తింది కదా?.. నీవు సీఎంగా ఉన్నప్పుడు పండిట్లపై అత్యాచారాలు, హత్యకాండ కొనసాగించి.. వారి ఇండ్లు, ఆస్తిపాస్తులు లాక్కొని కశ్మీర్ లోయ నుండి తరిమేయలేదా?.. ఇప్పుడు సీఎంగా ఉన్న నీ కొడుకు ఒమర్ అబ్దుల్లా చేతగానితనంతో ఉగ్రవాదుల ఆగడాలు కొనసాగడం తెలియనిది ఎవరికి?.

ఫరూఖ్ అబ్దుల్లా తన మొహం అద్దంలో ఒకసారి చూసుకొని చెప్పాలి.. మీ కుటుంబం కన్నా గొప్ప మతవాదులు, వేర్పాటు వాదులు, దేశ ద్రోహులు ఇంకెవరున్నారని.. కశ్మీరీ సంస్కృతి, చరిత్రకు అసలైన వారసులైన పండిట్ల కళ్లలోకి సూటిగా చెప్పండి మీరు లౌకికవాదులేనా? ఆ ధైర్యం మీకు ఉందా?

ఆలోచించి ఓటు వేయండి..

..మీ ఓటుపై భారత దేశం, మన రాష్ట్ర భవిష్యత్తును ఆధారపడి ఉంది..
అవినీతి, కుంభకోణాలు, అసమర్ధ పాలనతో మనం విసిగిపోయాం.. పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలతో అల్లాడిపోతున్నాం.. జనాభాతో పాటు నిరుద్యోగులు, పేదల సంఖ్య పెరిగిపోతోంది.. రూపాయి విలువ పడిపోయి దేశ ఆర్థిక రంగం దిగజారుతుంటే.. దేశ సంపద కొద్ది మంది చేతిలో పడి విదేశీ బ్యాంకులకు తరలిపోయింది.. దేశ అవసరానికి తగిన ఆహారాన్ని అందించలేకపోతున్నాం.. అన్నదాతలను పట్టించుకోకుండా అనాధలను చేస్తున్నాం.. చదువులు ముగించుకొని కాలేజీల నుండి బయటకు వస్తున్న యువతకు సరైన ఉపాది అవకాశాలు చూపించలేక పోతున్నాం.. రాజకీయ నాయకులు ప్రజల సమస్యలను పట్టించరకోవడం మానేశారు..
దేశ భద్రత ప్రమాదంలో పడింది.. శత్రువులు సరిహద్దులు దాటి మన సైనికుల తలలు నరికి తీసుకెళుతున్నా సోయి లేని ప్రభుత్వాల కాలమిది.. దేశ సరిహద్దులనే రక్షించలేనివారు ప్రజలకు రక్షణ కల్పిస్తారమే గ్యారంటీ ఉందా? ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.. మహిళలకు రక్షణలేకుండాపోయింది.. అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నా ప్రభుత్వాలకు పట్టడంలేదు..

ప్రజల సమస్యలను పరిష్కరించలేని నాయకులు, తమ ప్రయోజనాల కోసం వారిని ఓటు బ్యాంకులుగా మార్చేశారు.. కులం, మతం, వర్గం పేరిట తాయిలాలు చూపిస్తున్నారు.. తమ సొమ్మేం పోయింది అన్నట్లుగా రిజర్వేషన్లు, రుణాల మాఫీ, పెంఛన్లు, స్కాలర్ షిప్స్.. సెల్ ఫోన్లు, లాప్ టాప్ లు అంటూ ఊరిస్తున్నారు.. మీ ఓట్లకు ధర నిర్ణయించి కొనేస్తున్నారు... ఇలాంటి వారిని నమ్మి ఓటేస్తే మన భవిష్యత్తు ఏమిటి ఆలోచిండి..
వారసత్వ రాజకీయాలు, కుటుంబ పాలనకు రాజకీయ పార్టీలు పెద్ద పీట వేశాయి.. పార్టీల్లో పదవులతో పాటు ఎన్నికల్లో టికెట్లు తమ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులకు ఇచ్చేశాయి.. పార్టీకోసం కష్టపడి పనిచేసిన వారి చేతిలో చిప్ప పెట్టి గెంటేశాయి.. ప్రజాస్వామ్యం ముసుగులో నయా రచరికాలా? ఇదే ప్రజాస్వామ్యం?
నూతన తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తు ఈ ఎన్నికలపై ఆధారపడి ఉంది.. తెలంగాణ వచ్చేసింది.. ఇంకా సెంటిమెంట్, ఆయింట్ మెంట్ అంటూ వేళాడటం సరికాదు.. నూతన రాష్ట్ర భవిష్యత్తుపై ఆలోచించండి.. ఉపాధి అవకాశాలు, సాగునీరు, విద్యుత్తు తదితర సమస్యలు మన రాష్ట్రం ముందున్న ప్రధాన సమస్యలు.. వీటి పరిష్కారం కోసం గట్టిగా కృషి చేసే నాయకులు కావాలి.. మనకు కావాలసించి మంచి పాలన.. రెచ్చగొట్టే విధానాలతో సమస్యలు పరిష్కారం కావు.. కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం ఉన్నప్పుడే మనం ఈ సమస్యలను అదిగమించగం.. తెలంగాణ అభివృద్ధి ఎవరి వల్ల సాధ్యమవుతుందో ఆత్మ సాక్షిగా ఆలోచించండి.. బంగారు తెలంగాణ ఏర్పాటు కోసం మన వంతు కృషి కూడా అవసరం..

కేంద్రంలో, రాష్ట్రంలో ఇప్పడు మనకు కావలసింది దృఢమైన, సమర్ధవంతమైన ప్రభుత్వాలు.. ఇప్పడు మనం సరైన నిర్ణయం తీసుకోకుంటే మరో ఐదేళ్లు విచారిస్తూ గడపాల్సిందే.. ఆలోచించి ఓటు వేయండి.. నిజమైన ప్రజాస్వామ్యానికి మద్దుతు ఇవ్వండి..

Monday, April 28, 2014

సన్నాసి అనే పదానికి అర్థం తెలుసా?

సన్యాసులకు హిందూ ధర్మంలో పవిత్రమైన స్థానం ఉంది..
సన్యాసులను హిందువులు గౌరవిస్తారు.. ప్రతి మతంలోనూ సన్యాసులు ఉంటారు.. ఈ విచక్షణ ఉన్న వారెవరూ సన్నాసి అనే అనే పదాన్ని వ్యతిరేక అర్థంలో వాడారు..
నరేంద్ర మోదీని సన్నాసి అని నిందించిన కేసీఆర్, పరోక్షంగా ధర్మాన్ని కించపరిచారు.. ఆయన తన వ్యాఖ్యలను సవరించుకుంటారని ఆశిద్దాం.. లేకపోతే ఆయన వివేకానికే వదిలేద్దాం..

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి SILICON WAFER ప్రణాళిక..

ఈనాడు (28.04.14)లో నరేంద్ర మోదీ ఇంటర్వ్యూ....

Sunday, April 27, 2014

తెలంగాణకు మోదీ  దుష్మన్.. అసద్ దోస్త్..
వహ్వా.. భలే చెప్పినవన్నా..
నీ సూడో సెక్యులరిజానికి జోహార్లు..

తమ్ముళ్ల బాధితులు..

తన సోదరుడు పవన్ కల్యాణ్ జనసేన పేరిట పార్టీ పెట్టి నరేంద్ర మోదీకి మద్దతు ఇవ్వడం సీమాంధ్ర కాంగ్రెస్ ప్రచార సారధి చిరంజీవిని ఇరకాటంలో పడేసింది.. ఇప్పడు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ సోదరుడు దల్జిత్ సింగ్ కోహ్లీ కూడా బీజేపీలో చేరడం ఆయనకు ఈ ఇబ్బందిని దూరం చేసింది.. సమర్ధించుకోడానికి సాకు దొరికింది కదూ?.

నా తమ్ముడే కాదు ప్రధాని తమ్ముడూ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నాడని చెప్పుకోవచ్చు..
తమ్ముళ్లనే ఒప్పించలేని వారు ఇతరులను తమ పార్టీకి ఓటేయమని ఎలా అడగగలరు?

తెలంగాణ ఏమైనా వేరే దేశమా?.. భారత దేశంలో భాగం కాదా?..

మేడ్ ఇన్ తెలంగాణ (Made in Telangana) అట.. అసలు దీన్ని కనిపెట్టింది ఎవడు?.. వాడికి బుర్ర ఉందా అసలు?..
భారత దేశంలో తయారయ్యే ఏ వస్తువుపై అయినా Made in India అని ఉంటుంది.. అంతే కానీ Made in Delhi, Made in West Bengal, Made in Tamilanadu, Made in Gujarat, Made in Maharashtra అనో రాసి ఉండదు.. అలాగే విదేశాల్లో తయారయ్యే వస్తువులపై Made in China, Madi in USA, Made in United Kindgdom, Made in Japan అని రాసి ఉంటాయి..
రాష్ట్రాల పేరిట వస్తువులు తయారీ ప్రాంతాన్ని పేర్కొనడం నేనైతే ఎక్కడా చూడలేదు.. తెలంగాణ భారత దేశంలో 29వ రాష్ట్రంగా అవతరిస్తోంది.. అంతే తప్ప ప్రత్యేక దేశంగా కాదు.. భారత దేశంలో తెలంగాణ అంతర్భాగం అయినప్పుడు ఈ Made in Telangana ఏమిటి?.. ఎవడికైనా ఇలాంటి ఆలోచన వస్తే వాన్ని దేశం నుండి గెంటేయాలి.. ఒకవేళ పిచ్చిపట్టి ఇలా మాట్లాడి ఉంటే వాన్ని మానసిక చికిత్సాలయానికి పంపుదాం..

తెలంగాణ రాష్ట్రం భారత దేశంలో సుసంపన్నమైన, అగ్ర రాష్ట్రంగా తీర్చి దిద్దుదాం.. విభజన మనస్థత్వాన్ని పెంచే ప్రకటనలతో సామరస్య వాతావరణాన్ని చెడగొట్టకండి..

Saturday, April 26, 2014

కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరు?

మన కర్మకొద్దీ కాంగ్రెస్ తెలంగాణలో అధికారానికి వస్తే ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇస్తారు?..
జైరామ్ రమేష్ కొద్ది రోజుల క్రితం దళితులకే సీఎం పదవి అన్నారు.. ఇప్పుడేమో రాహుల్ గాంధీ మహిళా సీఎం అంటూ కొత్త కార్డు తీశారు..
అసలు కాంగ్రెస్ పేకాటలో ఎన్ని కార్డులు ఉన్నాయి?.. కానీయండి ఇంకా బీసీ సీఎం, మైనారిటీ సీఎం..
గాలికి  పోయే తేల పిండి కృష్ణార్పణం అన్నట్లు.. అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు అని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లుంది.. అందుకే నోటికేది వస్తే అది మాట్లేడేస్తున్నారు..

Friday, April 25, 2014

‘ సర్కార్ కెల్లి అన్ని సౌలత్ లు ఇప్పిస్త.. మీ అందర్కి అన్యాలం చేస్త..’



మలక్ పేట ప్రాంతంలో ఓ ఆటో నుండి వినిపించిందిన ఇండిపెండెంట్ అభ్యర్థి రికార్డెడ్ ప్రచార సందేశం ఇది.. ఓటర్లకు అన్యాయం చేస్తానని ఇంత బాహటంగా చెప్పుతున్నాడేంటి అని ఆరా తీస్తే తేలింది ఏమిటంటే.. పాపం సదరు అభ్యర్థికి తెలుగు రాదట.. ఆయన నమ్ముకున్న స్క్రిఫ్ట్ రైటర్ తెలుగు కూడా అంతంతేనట..

సీటు బెల్ట్ విధిగా ధరించండి..

ప్రాణం పోవడానికి క్షణం చాలు.. అది మన అజాగ్రత్త వల్లే..
మన దేశంలో ప్రతి నిమిషానికో రోడ్డు ప్రమాదం జరిగితే, అందులో ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారు.. ఇందుకు కారణం అజాగ్రత్తే.. కారు చేతిలో ఉంటే చాలు అంతులేని వేగంతో దూసుకెళతాం.. ఈ స్పీడు ఆనందాన్ని ఇవ్వొచ్చు.. కానీ అప్రమత్తంగా లేకపోతే ప్రాణాలకే ప్రమాదం..
కారు ప్రమాదాల్లో మరణించే వారిలో అత్యధికులు తమ సీటులోంచి ముందుకో, పక్కకో ఎగిరిపడి తలకు, ఛాతికి, మూత్ర పిండాలకో దెబ్బలు తగిలినవారే.. వేగంగా వెళ్లే కారు చెట్టుకో, మరోవాహనానికో, లేక డివైడర్, కరెంట్ స్థంబానికో ఢీ కొట్టినప్పుడు ముందు సీట్లో ఉన్నవారు అద్దంలోంచి దూసుకెళ్లి తలకు బలమైన గాయాలు తగిలించుకుంటారు... డ్రైవింగ్ చేసేవారి ఛాతి స్టీరింగ్, పక్కనుండే వారి ఛాతి డాష్ బోర్డుకు బలంగా తాకి నలిగిపోతాయి.. ప్రమాదానికి గురైనవారు చాలా వరకు అక్కడికక్కడే చనిపోతారు..
వీరు ఒక జాగ్రత్త పాటించి ఉంటే ప్రాణాలు నిలిచేవి.. అదే సీట్ బెల్ట్..
ప్రతి కారులోనూ అన్ని సీట్లకూ సీట్ బెట్లులు ఉంటాయి.. వీటిని ధరిస్తే ప్రమాద సమయంలో ప్రయాణీకులు తమ సీటులోనే స్థిరంగా ఉండిపోతారు.. ఫలితంగా గాయాలు మినహాయిస్తే ప్రాణాపాయం చాలా వరకూ తగ్గుతుంది.. సుమారు 50 శాతం ప్రాణాలు సీటు బెల్ట్ ధరించడం వల్లే నిలిచే అవకాశం ఉంది.. దురదృష్ట వశాత్తు డ్రైవింగ్ చేసేవారితో సహా, కారు ప్రయాణీకులెవరూ సీటు ధరించడానికి ఇష్టపడరు.. సీటు బెల్ట్ తప్పని సరి చెబితే పోలీసులు కనిపిస్తే పెట్టుకుంటారు.. ఆ తర్వాత తీసేస్తారు.. కానీ ఈ రూల్ మన సేఫ్టీ కోసం పెట్టిందే అనే ఆలోచన ఉండదు..
ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన కొందరు నాయకులు సీటు బెల్ట్ ధరించలేదని గమనించాలి.. తాజాగా శోభా నాగిరెడ్డి.. గతంలో వనం ఝాన్సీ, ఎర్రన్నాయుడు, లాల్ జాన్ బాషా ప్రయాణంలో సీటు బెల్ట్ ధరించి ఉంటే మనకు దూరమయ్యేవారు కాదు..
మీరు కారు డ్రైవింగ్ చేస్తున్నా, పక్కసీటులో కూర్చున్నా సీటు బెల్ట్ కచ్చితంగా ధరించండి.. వెనుక సీటులో ఉన్నవారు కూడా సీటు బెల్ట్ ధరించడమే మంచిది.. ఈ విషయంలో మీ కుటుంబ సభ్యులకు, బంధు మిత్రులకు కూడా అవగాహన కల్పించండి.. వీలైతే ఈ పోస్టును అందరికీ షేర్ చేయండి..

విష్ యూ ఏ హ్యాపీ జర్నీ..


Thursday, April 24, 2014

సెవన్ సీటర్, గాలి మోటర్ కి తేడా తెలుసుకో లక్ష్మయ్యా.. సెవన్ సీటర్ ఆటో యాడబడితే ఆడ ఆపుతం.. మరి హెలిక్యాప్టర్ ఏడికంటే ఆడికి తీసుకుపోవాల్నంటే ఎట్లనయ్యా?.. గాలికి సిగ్నలు, అనుమతీ, కతా ఖార్కనా ఉంటదని తెల్వదా?..

Tuesday, April 22, 2014

మోడీ కాదు.. మోదీ

నరేంద్ర మోడీ కాదు.. నరేంద్ర మోదీ అని రాయాలి. మన పత్రికలు మోదీ పేరును తప్పుగా రాస్తున్నాయి.. ఇంగ్లీషులోని Narendra Modi ని మనం నరేంద్ర మోడీ అని అనువదించి రాస్తున్నాం.. కానీ హిందీలో नरेंद्र मोदी అని, ఆయన మాతృభాష గుజరాతీలో નરેન્દ્ર મોદી అని రాస్తారు.. వీటినే ప్రామాణికంగా తీసుకోవాలి.. తెలుగు మీడియా మాత్రమే కాదు.. మన రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా ఈ విషయాన్ని పట్టించుకున్నట్లు లేదు..
మన తెలుగు మీడియా వ్యక్తుల పేర్లను వారి మాతృ భాషలోని ఉచ్ఛారణ నుండి కాకుండా, ఆంగ్ల లిపిని ప్రామాణికంగా తీసుకోవడం వల్ల మనం చాలా మంది నాయకులు, స్థలాల పేర్లు మారిపోతున్నాయి.. ఉదాహరణకు అడ్వానీ పేరు అద్వానీగా మార్చేశారు.. ఒకప్పుడు అటల్ బిహారీ వాజ్ పేయ్ పేరును వాజ్ పాయ్ గా రాసేవారు.. ఆయన ప్రధాని అయ్యాక వాజ్ పేయి అని సరిదిద్దుకున్నారు.. ఠాక్రే పేరును థాకరే, దిల్లీని ఢిల్లీ, ఇలహాబాద్ ను అలహాబాద్, బిహార్ ను బీహార్ అని రాయడం కూడా తప్పే..
వ్యక్తులు, ప్రాంతాల పేర్లను సక్రమంగా రాయమని మీడియా ఆఫీసులో చెప్పేవారు కరువయ్యారు.. అందుకే ఈ దుస్థితి ఏర్పడింది.. కనీసం సోషల్ మీడియా ద్వారా అయినా మనం లోపాన్ని సరిదిద్దుదాం..
ఈ ప్రయత్నమేదో కాబోయే ప్రధానమంత్రి (మీకు నమ్మకం లేకపోతే వదిలేయండి) నరేంద్ర మోదీ నుండే ప్రారంభిద్దాం..

భలే సత్కారం..

తెలంగాణా కాంగ్రెస్ నాయకులు తమ యువరాజా వారిని సందర్భోచితంగా ముస్తాబు చేసి సత్కరించారు కదూ.. 

ఈ బేకార్ గాళ్లను ఓడిద్దాం..

కోట్లకు పడగలెత్తినా.. వారు బే'కార్'గాళ్లే..
మన అభ్యర్థుల అఫిడవిట్లు చెబుతున్నాయి మరి..
రాజకీయ నాయకుల ద్వంద్వ విధానాలు ఎన్నికల్లో పోటీ  చేసేందుకు సమర్పిస్తున్న నామినేషన్ల ద్వారాగనే బయటపడిపోయాయి.. తమ ఆస్తుల వివరాలు దాచేవారు పారదర్శకంగా సమాజానికి సేవ సేస్తారని నమ్మగలమా?.. వందల కోట్ల ఆస్తులు ఉన్న నాయకులు సైతం తమ కారు కూడా లేదని బీద తనాన్ని బయట పెట్టుకోవడం హాస్యాస్పదం కాదా? ఎవరిని మోసం చేయడానికి ఈ నాటకాలు.. ఈ రోజున మధ్య తరగతి వాడు కాస్త డబ్బు చేతిలో ఉంటే అప్పడు చేసి ఏ మోస్తరు చవకరకం కారైనా కొంటున్నాడు.. మరి వీరికి కార్లు లేవంటే నమ్మగలమా?.. అలాగే తమ నేర చరితను దాచే నాయకులూ ఉన్నారు.. ఇలాంటి నాయకుల వల్ల సమాజానికి కచ్చితంగా ముప్పే.. సాంకేతిక కారణాల వల్ల నామినేషన్ల తిరస్కరణను తప్పించుకున్న అభ్యర్థులు చాలా మంది ఉన్నారు.. వారిని తిరస్కరించడం ఇక ఓటర్ల వంతు.. ఆలోచించండి..

ఎవరీయన.. గుర్తు పట్టారా?

నరేంద్ర దామోదర్ దాస్ మోదీ..
మరిన్ని ఆసక్తికరమైన చిత్రాల కోసం క్లిక్ చేయండి..
 https://in.news.yahoo.com/photos/unseen-pictures-of-narendra-modi-1398058471-slideshow/

Monday, April 21, 2014

స్క్రిఫ్ట్ ఒక్కటే..


..కానీఅమ్మగారు చూచి చదివారు.. అబ్బాయిగారు బట్టీయం వేసి అప్పజెప్పారు..
తెలంగాణలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మట్లాడింది ఒకటే.. కొత్త విషయాలేమీ లేవు..
ఈ సోది మరి కొన్ని సభల వరకూ భరించక తప్పదు..

ఉండవల్లి లేని లోటు తీరింది..

కాంగ్రెస్ పార్టీకి మరో గడసరి అనువాదకుడు దొరికాడు..
రాజీవ్ గాంధీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చినప్పుడు బహిరంగ సభల్లో ఆయన ప్రసంగాలను అనువదించిన ఉండవల్లి అరుణ్ కుమార్, సోనియా గాంధీ హయాంలోనూ ఈ పని చేశారు.. ఆయన అనువాదం ఎంత గొప్పదంటే.. సోనియా గాంధీ ఒక వాక్యం మాట్లాడితే, అనువాదం రెండు వాక్యాలంత పొడుగుండేది.. ఆమె చెప్పని మాటలను కూడా అరుణ్ కుమార్ తన వ్యాఖ్యానంలో చక్కగా పొందు పరిచేవారు...
పాపం.. ఉండవల్లివారు జైసపా అంటూ కిరణ్ కుమార్ రెడ్డి వెంట పోయాక, కాంగ్రెస్ వారికి కష్టం వచ్చిపడిందట.. సోనియమ్మ ప్రసంగాన్ని అరుణ్ కుమార్ అంత చక్కగా ఎవరు అనువదించేవారున్నారా అని బెంగపెట్టుకున్నారు.. ఇలాంటి సమయంలో మై హూనా.. అంటూ వచ్చేశారు రాపోలు ఆనంద భాస్కర్..

తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన రాహుల్ గాంధీ ప్రసంగాలను చక్కగా అనువదించి పారేశాడు రాపోలు.. ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్న ఈ పూర్వాశ్రమ జర్నలిస్టు, అచ్చం ఉండవల్లిలాగే ఒకటికి రెండు వాక్యాలు అనువదించేసి బ్రేవ్ అనిపించుకున్నాడు.. ఇంకేం సీమాంధ్ర కాంగ్రెస్ వారు కూడా ఆనంద భాస్కరుల వారి సేవలు వినియోగించుకోవచ్చు..

Friday, April 18, 2014

మిత్ర ధర్మానికి అడుగడుగునా తూట్లు..

తెలుగు దేశం పార్టీ అవకాశవాదం మరోసారి స్పష్టంగా బయటపడింది.. రెండు దశాబ్దాలుగా ఇదే తంతు.. మిత్ర ధర్మానికి కట్టుబడే తత్వం ఆ పార్టీకి మొదటి నుండీ లేదు.. పొత్తు కోసం వెంపర్లాడింది ఎవరు?.. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేతలు వద్దు మొర్రో అంటున్నా, జాతీయ నాయకుల వెంటపడి ఒప్పందం కుదుర్చుకుంది ఎవరు?.. అడిగినన్ని సీట్లు ఇవ్వకుండా, గీచి బేరమాడి తగ్గించి ఎవరు?.. టీడీపీయే కదా?.. అంతా జరిగాక ఇప్పుడు మరో వెన్ను పోటు..
బీజేపీ రాష్ట్రంలో బలపడకుండా, అడుగడుగునా దెబ్బ తీస్తూ వచ్చింది టీడీపీ.. బీజేపీకి బలం పెరిగినప్పడు స్నేహ హస్తం అందిస్తారు.. హవా తగ్గగానే కాడి వదిలేసి మతతత్వ పార్టీ అని దూరం పెడతారు.. ఇదేనా మిత్ర ధర్మం.. కష్ట సుఖాల్లో మైత్రికి కట్టుబడి ఉన్న అకాలీదళ్, శివసేన లాంటి పార్టీలకు ఉన్న విజ్ఞత కూడా టీడీపీకి లేదు..
1998 లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ఒంటరి పోరాటం చేసి సికింద్రాబాద్, కరీంనగర్, రాజమండ్రి, కాకినాడ సీట్లు గెలుచుకుంది..  గెలిచింది నాటు సీట్లే.. కానీ అప్పటి లోక్ సభ ఫలితాలను విశ్లేస్తే బీజేపీకి

దాదాపు 40 అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రధమ స్థానం, మరో 20 స్థానాల్లో రెండో స్థానం రావడంతో పాటు ఎన్నో చోట్ల బలంగా ఎదిగింది.. ఈ ఫలితాలు చూసి టీడీపీకి గుబులు పుట్టింది.. అదే సమయంలో కేంద్రంలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు.. వెంటనే చంద్రబాబు చక్రం తిప్పి యునైటెడ్ ఫ్రంట్ ఛైర్మన్ పదవికి వదిలేసి, బీజేపీ వైపు మొగ్గు చూపాడు.. ఎన్డీఏకు మద్దతు ఇచ్చేశాడు.. టీడీపీతో మైత్రి ఫలితంగా 1999 అసెంబ్లీ, పార్టమెంట్ ఎన్నికల్లో బీజేపీ చాలా పరిమిత స్థానాల్లో పోటీ చేయాల్సి వచ్చింది.. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న టీడీపీ వాజ్ పేయ్ హవా పుణ్యమా అని గట్టెక్కి, మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది..
2004 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ మైత్రి కొనసాగినా కేంద్రంలో ఎన్డీయే(బీజేపీ), రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వాలు ఓడిపోయాయి.. అప్పడు చంద్రబాబుకు హఠాత్తుగా జ్ఞానోదయం అయింది.. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకతతో ఓటమి పాలయ్యామనే విషయం మరచిపోయి.. మతతత్వ బీజేపీతో పొత్తు వల్లే ఓడిపోయామంటూ నిందలు వేసి మిత్ర ధర్మానికి తూట్లు పొడిచారు.. నరేంద్ర మోడీ గుజరాత్ సీఎంగా అప్పుడూ ఉన్నారు, ఇప్పుడూ ఉన్నారు.. ఈ సారి మోడీ వేవ్ చూడగానే మళ్లీ బీజేపీ ముద్దొచ్చింది బాబుగారికి..  సోకాల్డ్ మతతత్వాన్ని మరచిపోయి మరోసారి చక్రం తిప్పి తాజా విద్రోహానికి తెరలేపారు..
ఈ మైత్రీ బంధంలో అంతో ఇంతో లాభ పడింది తెలుగు దేశమే.. కానీ అత్యధిక నష్టాలు భారతీయ జనతా పార్టీకే మిగిలాయి.. ఆనాడు ఎన్డీయే భాగస్వాముల కోసం బీజేపీ తన ఎజెండాలోని రామజన్మభూమి, ఆర్టికల్ 370, ఉమ్మడి పౌరస్మృతి లాంటి అంశాలను పక్కన  పెట్టింది.. అందరికీ ఆమోదయోగ్యమైన కామన్ మినియం పోగ్రాం (సీఎంపీ)తో ముందుకు సాగింది.. అందులో భాగంగానే, టీడీపీ వ్యతిరేకించడంతో తెలంగాణ ఏర్పాటు (ఒకే ఓటు-రెండు రాష్ట్రాలు అనే కాకినాడ తీర్మానం)ను తాత్కాలికంగా పక్కన పెట్టి, సరియైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పింది.. కానీ ఈలోగా బీజేపీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. తెలంగాణలో ఇదే నినాదంతో టీఆర్ఎస్ ఆవిర్భవించి పాతుకు పోయింది.. బీజేపీకి స్పష్టమైన విధానం ఉన్నా, తెలంగాణ ద్రోహి అని ముద్ర వేసుకోవాల్సి వచ్చింది.. అదే సమయంలో టీడీపీలో వరస పొత్తుల కారణంగా చాలా నియోజకవర్గాల్లో బీజేపీ పునాదులు దెబ్బతిన్నాయి.. తాజాగా బీజేపీ ఘననీయంగా కోలుకొని బలపడుతున్న సమయంలో టీడీపీ మరో వెన్నుపోటు పొడిచేసింది..

స్నేహమంటే కష్ట సుఖాల్లో ఒకేలా ఉండాలి.. కానీ తాయిలం ఉంటేనే దోస్తీ అనే పిల్లలాట కాదు.. పొత్తుల వల్ల లాభాలు, నష్టాలు సమానంగా స్వీకరించాలి కానీ, నీకన్నా నేనే ఎక్కువ అనే ఆధిపత్యం మొదటికే మోసం తెస్తుంది..

 

Thursday, April 17, 2014

అర్ధం లేని ఆరోపణలు..

బీజేపీపై ఆర్ఎస్ఎస్ పెత్తనం ఎక్కవైందని కొందరు టీడీపీ నేతలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు.. ఏం చంద్రబాబు పెత్తనంలో బీజేపీ పని చేయాలని కోరుకుంటున్నారా వారు?.. వారు సంఘ్ నుండి స్పూర్తి పొందితే టీడీపీ నేతలకు వచ్చిన నష్టం ఏమిటి?.. తమ అభ్యర్థులను ఎంచుకునే స్వేచ్చ బీజేపీకి లేదా?.. ఆడ లేక మద్దెలపై సాకు చూపినట్లు ఉంది వీరి వ్యవహారం.. బీజేపీ బలహీనంగా ఉందని, తమ పార్టీ ఏదో మా లావుగా ఉందని ఎలా భావిస్తున్నారు? అంత సక్రమంగా ఉంటే మీరెందుకు కాంగ్రెస్ నేతలను అరువు తెచ్చుకుంటున్నారు?.. కేవలం పురందేశ్వరి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకే కదా టీడీపీ అధినేత ఏడుపు? అ సంగతి నేరుగా చెప్పకుండా డొంక తిరుగుడు ఎందుకట?

బాబు ద్వంద్వ నీతి..

వివాహం కావాలి.. కానీ సంసారం వద్దు.. బీజేపీతో ఎన్నికల పొత్తు విషయంలో టీడీపీ పాటిస్తున్న విధానం ఇది.. పొత్తులో భాగంగా భాజపాకు దక్కిన సీట్లలో వారు ఎవరిని పోటీకి దింపితే బాబుకు, తేదేపాకు కలిగే కష్టం ఏమిటో?.. అయినా ఎవరిని అని ఏమి లాభం.. వద్దు మొర్రో అని మొత్తుకుంటున్నా వినకుండా సంబంధం కుదిర్చిన వారిదే తప్పంతా.. ఎన్నికలు ముంచుకొచ్చాక, ఏమిచేసినా చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లే   కదా.. వంటరిగా పోటీ చేస్తే ఎవరి సత్తా ఏమిటో తెలిసేది..

సోనియా కొత్తగా ఏమి చెప్పినట్లు?..

ఏ పార్టీ అయినా ఎన్నికల సమయంలో అగ్ర నేతలు వచ్చి ప్రసంగిస్తే తమ విజయావకాశాలు మెరుగవుతాయని భావిస్తారు.. వారి ప్రసంగం ఎలా ఉన్నా స్పూర్తిని పొందడానికి ప్రయత్నిస్తారు.. ప్రతిపక్షాలు విమర్షించినా, సభ సక్సెస్ అని డబ్బా కొట్టుకుంటారు.. కానీ కరీంనగర్ సోనియా గాంధీ కాంగ్రెస్ సభకు భిన్నంగా చెప్పుకోవచ్చు.. ఈ సభలో ఆమె ప్రసంగం చప్పగా, నిస్తేజంగా సాగింది.. వేదికపై నాయకలు మొహాలు చూస్తే తెలుస్తోంది కదూ?.. సభలో కేరింతలు, ఈలలు ఎలా ఉన్నా సోనియా ప్రసంగంలో కొత్తగా చెప్పిందేమీ లేదని నాయకులే ఒప్పుకుంటున్నారు.. సోనియా వచ్చినా, రాహుల్, మన్మోహన్ వచ్చినా కొత్తగా ఒరిగేదేమీ లేదు.. ఆట ఆడే ప్రారంభమయ్యే జనం టీమ్ లీడర్ ను కూడా చూస్తారు.. టీమ్ లీడరే సరిగ్గాలేకపోతే ఆట ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.. కానీ ఎవరి టీమ్ లీడర్ వారికి ఇష్టం.. మునిగే నావను వారే కాపాడుకోవాలి కాదా?

Wednesday, April 16, 2014


మనోభావాలు మెజారిటీలకు ఉండవా?

కాంగ్రెస్ పార్టీ గంగా నది లాంటిదట.. పాపులు ఎవరైనా ఆ పార్టీలో చేరి పునీతులవుతారట.. పాలమూరు నుండి ఎంపీగా పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డి చెప్పిన మాటలివి?.. ఇంకా హిందువులు, ముస్లింలు, గంగా, మక్కా లాంటి పదాలు వాడేశారు.. చివర్లో తన మాటలు మైనారిటీలకు ఇబ్బంది కలిగించి ఉంటే క్షమించేయమన్నారు.. మరి మెజారిటీలకు క్షమాపణలు అక్కడరలేదా?.. వారికి మనోభావాలు లేవా? 'ఉత్త'మ పార్లమెంటీరియన్ లక్షణం అంటే ఇదేనేమో.. ఈ అంశంపై భాజపేయులు స్పందించకపోవడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది నాకు..

Tuesday, April 15, 2014

Monday, April 14, 2014

కేజ్రీవాల్ పబ్లిసిటే ఎక్కువట..

ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ఏ పని చేసిన ప్రచారం కోసమే అని అందరికీ తెలుసు.. ముఖ్యమంత్రి హోదాలో ధర్నా చేసినా.. ఆటోలో, మెట్రోలో ప్రయాణం చేసినా.. మఫ్లర్ మీదుగా టోపీ పెట్టినా.. గంగానదిలో అర్ధ నగ్నంగా స్నానం చేసినా.. చివరకు తనను కొట్టిన వ్యక్తుల ఇంటికి వెళ్లి పరామర్శించినా మీడియా కెమెరాలు ఉండాల్సిందే..
అసలు నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీలకన్నా కేజ్రీవాలే టీవీల్లో ఎక్కవగా కనిపిస్తున్నారట.. ఒక అధ్యయనం ప్రకారం ప్రైమ్ టైమ్ టీవీ న్యూస్ కేజ్రీవాల్ కవరేజే ఎక్కువగా ఉంటోంది.. ఐదు టాప్ న్యూస్ ఛానెళ్లను అధ్యయనం చేసి ఈ విషయాన్ని తేల్చారట..

మరి మీడియా తనకు కవరేజీ సరిగ్గా ఇవ్వడం లేదని, మోడీకి అమ్ముడు పోయిందని ఎందుకు కేజ్రీవాల్ ఆరోపిస్తున్నట్లు?.. తాను అధికారంలోకి వస్తే మీడియా వారిని జైలుకు పంపుతానని ఎందుకు బెదిరించినట్లు?.. అదీ ఒకరకమైన పబ్లిసిటీ జిమ్మిక్కే సుమా?.. ఎంతైనా గోరంత పనికి కొండంత పబ్లిసిటీ పొందడం కేజ్రీవాల్ కే సాధ్యం కదూ..  ఆధారాలు లేకుండా ప్రత్యర్ధులపై ఆరోపణలు చేయడం, ఆధారాలు చూపమంటే మీరే విచారించుకోండి అని గడుసుగా జవాబు చెప్పడంలోనూ సిద్ద హస్తుడే.. ఎంతైనా మీడియా పెంచి పోషిస్తున్న నాయకుడు కదా?
బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 124వ జయంతి శుభాకాంక్షలు.. బాబాసాహెబ్ ఆశయాలను ఆచరణలో చూపిద్దాం.. నవ భారతాన్ని నిర్మిద్దాం.. జై భీం.. జై హింద్.. 

Sunday, April 13, 2014

తెలంగాణ.. ఎవరి ఘనత?

హైదరాబాద్ నగరంలో ఒక విచిత్రమైన పోస్టర్ చూశాను.. తెలంగాణ చిత్ర పటంలో చిరునవ్వుల రాహుల్, అభివాదం చేస్తున్న సోనియా, ఓ మూలన మౌనీ మన్మోహన్.. అరవై ఏళ్ల స్వప్నం.. కాంగ్రెస్ తో సాకారం.. తెలంగాణ ఆవిర్భావ వేళ అందరికీ శుభాకాంక్షలు అని పోస్టర్లో రాసి ఉంది..
తెలంగాణ ఇవ్వడాన్నికి 60 ఏళ్లు పట్టినందుకు సిగ్గు పడాల్సిన కాంగ్రెస్, అది తమ ఘనత అని చెప్పుకోవడం విడ్డూరం అనిపించింది.. ఇన్నేళ్ల జాప్యం కారణంగా వేయికి పైనా జరిగిన ఆత్మ బలిదానాలకు బాధ్యత ఎవరిదో కూడా సెలవిస్తే బాగుండేది.. మరి ఈ పోస్టర్లు హైదరాబాద్, తెలంగాణ జిల్లాల్లోనే వేశారా? లేక సీమాంధ్రలో కూడా వేశారా? మీరు చేసిన గొప్ప పని అక్కడి ప్రజలకు కూడా తెలియాలి కదా?..
అసలు తెలంగాణ ఇచ్చామని చెప్పుకునే అర్హత వీరికి ఉందా?.. పార్లమెంట్లో చర్చ జరుగుతున్న వేళ సోనియా, రాహుల్ మూగనోము పట్టిన విషయం తెలియనిది ఎవరికి?.. తెలంగాణ ఎందుకు ఇస్తున్నారో ఒక్కమాటైనా మాట్లాడారా?..  మరి అప్పనంగా క్రెడిట్ కోట్టేసేందుకు మనసెలా ఒప్పింది?..

అసలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ మోహం చూసి ఎన్నాళ్లయింది?.. నాకు తెలిసి రాజశేఖర రెడ్డి మరణం, సత్య సాయిబాబా నిర్యాణం సందర్భంగా సోనియా వచ్చినట్లు గుర్తు.. రాహుల్ గాంధీ ప్యారడైజ్ బిర్యానీ, చట్నీస్ ఇడ్లీలు తినడానకి వచ్చినట్లు మీడియాలో చూశాను.. ఇంత కాలం ఎందుకు మొహం చాటేశారో వివరణ ఇవ్వగలరా?
నరేంద్ర మోడీ, రాందేవ్ బాబాలు.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు చేస్తున్న పని ఒక్కటే..

కాంగ్రెస్ పార్టీని దుంప నాశనం చేయడం..

కాకపోతే వారు బయటి నుండి చేస్తున్నారు.. వీరు లోపలి నుండి చేస్తున్నారు..

అంతే తేడా..

Saturday, April 12, 2014

ప్రమాదవశాత్తు ప్రధానమంత్రి..

భారత దేశాన్ని పాలించిన అత్యంత బలహీన, వెన్నెముక లేని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అని దేశ ప్రజలందరికీ తెలుసు.. సోనియా గాంధీ చేతిలో కీలు బొమ్మ అని కూడా తెలుసు.. మన్మోహన్ గొప్ప ఆర్థిక వేత్తే అయినా, సొంతంగా నిర్ణయం తీసుకోలేని అసమర్థత కారణంగా మన ప్రతిష్ట మసకబారింది.. దేశ ఆర్థిక వ్యవస్థ అదుపు తప్పింది.. ధరలు చుక్కలనంటి ప్రజలు విలవిలలాడుతున్నారు.. ప్రజలు చెల్లించిన పన్నుల సొమ్మంతా కుంభకోణాలు, అవినీతి కారణంగా నేతలు, బడా బాబుల ఖజానాల్లోకి పోయింది.. పైగా తనకు ఇష్టంలేని పనులెన్నో చేయాల్సి వచ్చింది మన్మోహన్.. రిమోట్ కంట్రోల్డ్ ప్రధాని అనే ముద్ర పడింది.. ఆయన ప్రమేయం లేకుండానే కీలక నిర్ణయాలు జరిగిపోయాయి.. ఫలింతంగా ప్రధాని పదవిలో ఉన్న మన్మోహన్ కూ అవినీతి మరకలంటక తప్పలేదు.. 
ఇలాంటి నిస్సహాయ నేత గురించి ప్రముఖ జర్నలిస్టు సంజయ్ బారు రాసిన ACCIDENTAL PRIME MINISTER (ప్రమాదవశాత్తు ప్రధానమంత్రి) అనే పుస్తకం సంచలనం సృష్టిస్తోంది.. నిజమే కదా మన్మోహన్ ప్రమాదవశాత్తు ప్రధాని అయ్యారు..  సంజయ్ బారు ప్రధాని కార్యాలయంలో పని చేశారు.. స్వయంగా తాను చూసిన సంఘటనలనూ, అనుభవాలనూ ఈ పుస్తకంలో పాందు పరిచారు.. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి అంచులో ఉన్నకాంగ్రెస్ పార్టీకి, అందునా ప్రధాన మంత్రికి ఈ పుస్తకం పిడుగుపాటులా మారింది.. మన్మోహన్ సింగ్ గారి అసహాయ పరిస్థితిపై జాలి కలిగిస్తోంది.. తెలుగువాడైన సంజయ్ బారు ఈ పుస్తకాన్ని తెలుగులో కూడా తెస్తే బాగుండేది..

Friday, April 11, 2014

మేడం ప్రియాంక గారికి మోడీ ప్రభంజనం ఎక్కడా కనిపించలేదట.. నిజమే హై సెక్యూరిటీ నడుమ తిరుగుతూ, జేజేలు కొట్టించుకుంటుంటే బయట ప్రపంచం ఎలా తెలుస్తుంది.. కాస్త వీటి నుండి బయటకు వస్తే కదా తెలిసేది.. అయినా మరో నాలుగు వారాలే కదా?.. ఆ ప్రభంజనం స్పీడు ఎంతో తెలిసివస్తుంది.. ఆ గాలికి ఎవరు కొట్టుకుపోతారో ఎవరు మిగులుతారో చూద్దాం.. ముందు మీ ఆయన్ని బనీను మీద కోటు కాకుండా, చొక్కా వేసుకోమని చెప్పమ్మా ప్రియాంకా..

మోడీ వ్యక్తిగత జీవితంపై రాద్ధాంతం ఎందుకు?

నరేంద్ర దామోదర్ దాస్ మోడీ తనకు వివాహం కాలేదని చెప్పారా?.. లేదు. ఈ విషయంలో ఎవరైనా ఆయనను ప్రశ్నించారా?.. లేదే. మోడీ తన వ్యక్తిగత జీవితంలో విచ్ఛల విడిగా ప్రవర్తించారా?.. ఈ ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఆయన వల్ల ఎవరైనా అన్యాయం జరిగిందని భావిస్తున్నారా?.. ఎవరూ అలా చెప్పలేదే. మరెందుకు ఇంత రాద్ధాంతం?..
నరేంద్ర మోడీ జీవితం తెరచి ఉంచిన పుస్తకం.. ఆయన వ్యక్తిగత వివరాలు చెప్పుకోకున్నా, అందరికీ తెలిసిన విషయాలే.. గుజరాత్ రాష్ట్రంలో ఇది బహిరంగ విషయమే.. పేద కుటుంబంలో పుట్టిన మోడీ తల్లిదండ్రులు పెద్దగా చదువుకోలేదు.. ఆనాటి ఆచారాల ప్రకారం చిన్నప్పుడే జశోదాబెన్ తో వివాహం చేశారు.. వివాహం తర్వాత ఆయన ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది.. దేశం కోసం పని చేయాలని భావించి ఆరెస్సెస్ ప్రచారక్ అయ్యారు.. వైవాహిక జీవితాన్ని వదిలేశారు.. ఈ విషయంలో జశోదాబెన్ కు కూడా ఎలాంటి అభ్యంతరాలు లేవు. (రెండేళ్ల క్రితం నాటి ఆమె ఇంటర్వ్యూ ఆధారం).. కాంగ్రెస్ వారికి తప్ప..
నరేంద్ర మోడీ తన జీవిత గమ్యాన్ని మార్చుకున్నప్పటి నుండి కుటుంబ సభ్యులతో సంబంధాలు లేదు.. ఆయన సోదరులు సైతం మోడీ పరపతిని ఉపయోగించుకోలేదు.. తన తల్లిని మాత్రం తరచూ కలిసి ఆశీర్వాదం తీసుకుంటారు మోడీ.. మచ్చలేని ఆయన జీవితంపై ఎవరూ వేలెత్తి చూపించే అవసరమే రాలేదు.. సాదాసీదా జీవితం గడిపే మోడీకి ఆస్తులు పెద్దగా లేవు.. అవినీతికి పాల్పడి కుటుంబం కోసం కూడబెట్టాల్సిన అవసరం ఆయనకు లేదు.. ముఖ్యమంత్రిగా వచ్చే ఆదాయం, ఇతర సదుపాయాలతోనే సర్దుకుపోతున్నారు.. అయితే అందరినీ ఆకట్టుకునే దస్తులను ధరిస్తారు.. అవీ మరీ ఖరీదైనవి కాదు.
ప్రధానమంత్రి పదవి రేసులో అగ్రభాగంలో ఉన్న నరేంద్ర మోడీని ఎలా దెబ్బ తీయాలా అని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి గుజరాత్ అల్లర్లు సాకుగా కనిపించాయి.. కానీ న్యాయస్థానాలు మోడీకి క్లీన్ చీట్ ఇచ్చేసరికి, ఛాయ్ వాలా అని నిందించారు.. అవును నేను ఛాయ్ అమ్మే వ్యక్తి కొడుకునే అని గర్వంగా చెప్పుకున్న మోడీ ఛాయ్ పే చర్చాకు నాంది పలికారు.. ఇలా అయితే లాభం లేదని భావించి మోడీ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేశారు కాంగ్రెస్ నేతలు.. తన వ్యక్తిగత జీవితంపై చర్చలు, ఊహాగానాలకు ఇక తావివ్వరాదని భావించారు మోడీ.. అందుకే ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో వైవాహిక స్థితిని వెల్లడించారు..

మోడీ వ్యక్తిగత జీవితంపై బురదజల్లే కాంగ్రెస్ నాయకులు ముందు తమ మొహాలను అద్దాల్లో చూసుకుంటే మంచిది.. వారి పిల్లలు, కుటుంబ సభ్యుల విచ్ఛల విడి వ్యవహారాలు ఏవిటో అందరికీ తెలిసినవే.. ఛాయ్ పే చర్చా మాదిరి ఈ విషయంలోనూ చర్చ జరిగితే ఇక వారు ఎప్పటికీ కోలుకోలేరు..
 

Thursday, April 10, 2014

రేపిస్టులకు ములాయం ప్రోత్సాహం

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని పాలిస్తున్న సమాజ్ వాదీ పార్టీని గూండాల పార్టీ అంటారు ఉత్తరాదిన.. యూపీలో గూండారాజ్ అంటే ఏంటో అనుకున్నాను.. ఆ పార్టీ అధినేత ములాయం సింగ్ ఏమంటున్నారో విన్నారు కదా?..
మహిళలపై అత్యాచారం చేసే యువకులకు ఉరి శిక్ష వేయడం నేరమట.. కుర్రాళ్లు తప్పులు చేయడం సహజం, అంత మాత్రాన చంపేస్తారా? అని అమాయకంగా ప్రశ్నించాడు ములాయం.. రేప్ చేసిన వారికి ఉరేసే శిక్షను తాము రద్దు చేస్తామని, కేసులు పెట్టిన వారిని కూడా శిక్షిస్తామని సెలవిచ్చేశారు.. ఇటీవల ముంబైలో గత ఏడాది ఓ మహిళా జర్నలిస్టుపై అత్యాచారం చేసిన ముగ్గురు మృగాళ్లకు న్యాయస్థానం మరణశిక్ష పడాన్ని ఆయన తప్పు పట్టారు.. ములాయం సింగ్ వ్యాఖ్యలపై దుమారం చెలరేగి, మహిళా సంఘాలు ఆయనపై మండి పడుతున్నాయి..

సమాజ్ వాదీ నేతలు, కార్యకర్తల్లో అత్యధికులు రౌడీలే.. వారిపై హత్యలు, దోపిడీలు, మానభంగం కేసులు చాలా ఉన్నాయట.. తమ కార్యకర్తలకు కూడా ఉరి శిక్ష పడుతుందని ములాయంకు బెంగపట్టుకుందేమో? అందుకే రేపిస్టులకు ఉరి శిక్షను రద్దు చేస్తానంటున్నాడు.. 

వీరికి బుద్ధి చెప్పండి..

ఎవడు ఏ పార్టీలో ఉన్నాడో తెలియడం లేదు.. నిన్నటి దాకా ఒక పార్టీలో ఉన్నోడు మరో పార్టీలోకి దూకేసి ఎన్నికల బరిలో నిలిచాడు.. పార్టీలు ఎవడికి పడితే వాడికి టికెట్లు ఇచ్చేశాయి.. టికెట్ల రేట్లకు రెక్కలొచ్చేశాయి.. పార్టీలన్నీ బాక్సాఫీసు కలెక్షన్లను లెక్కించుకుంటున్నాయి.. ఇంత కాలం పార్టీ కోసం కష్టపడి పని చేసి టికెట్ వస్తుందని ఆశ పెట్టుకున్నవారిపై నీళ్లు చల్లిన పార్టీలు గోడ దూకిన వాడికే పెద్ద పీట వేసి బరిలోకి దింపాయి.. పార్టీని నమ్ముకున్నోడికి నెత్తిన కుచ్చుటోపీ, చేతికి చిప్పే మిగిలింది..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓ నాయకుడు టికెట్ సాధించడమే లక్ష్యంగా ముచ్చటగా మూడు రోజుల్లో మూడు పార్టీలు మారాడు.. ఉభయ ఎర్ర పార్టీలకూ ఫిరాయింపుల బెడద తప్పలేదు.. నాయకులు సిద్దాంతాలకు, విలువలకు, క్రమశిక్షణకు తూట్లు పొడిచేశారు.. ఎన్నికల్లో పోటీ చేయడం.. ఎమ్మెల్యే, ఎంపీలుగా గెలవడమే ప్రజాసేవా? ఇతర మార్గాల్లో ప్రజలకు సేవ చేయలేరా? టికెట్ల కోసం, గెలవడం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న ఈ నాయకులు రేపు గెలిచాక ఖర్చులు రాబట్టుకునేందుకు ఎంతగా దోపిడీ చేస్తారో ఆలోచించండి..

ఎన్నికల వేళ ఓటర్లు ఇలాంటి జంప్ జిలానీలకు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది.. పార్టీలతో సంబంధం లేకుండా గోడ దూకిన నేతల కాళ్లిరగొట్టి వాతలు పెట్టండి.. చిత్తుగా ఓడించండి..

Wednesday, April 9, 2014

టైగర్ నరేంద్ర అమర్ హై..

టైగర్ నరేంద్ర.. అవును ఆయన నా దృష్టిలో నిజంగా పులే..
హైదరాబాద్ పాతనగరంలో పుట్టి పెరిగిన నాకు మొదట తెలిసిన నాయకుడు నరేంద్ర గారే.. నా చిన్నప్పుడు కందికల్ గేట్ ప్రాంతంలో ఓ సభలో చూశాను.. గంభీరంగా మీసాలతో ఉన్న వ్యక్తి రాగానే టైగర్ నరేంద్ర జిందాబాద్ అనే నినాదాలు వినిపించాయి.. కొందరు వ్యక్తలు భాయ్ సాబ్ అని పలకరించారు.. ఆయనే ఆలె నరేంద్ర గారు.. ప్రభుత్వం మా బస్తీ ప్రజలను కాందీశీకుల కన్నా హీనంగా చూస్తూ పట్టించుకునేది కాదు.. ముష్కరులు తరచూ దాడులు చేసేవారు.. అలాంటి సమయంలో నేనున్నానంటూ అండగా నిలిచారు భాయ్ సాబ్..
పాత నగరంలో మత ఘర్షణలు జరిగిన సమయంలో పోలీసులు అమాయకులను పట్టుకుపోయి హింసిస్తే , భాయ్ సాబ్ వెళ్లి వారికి గట్టి వార్నింగ్ ఇచ్చి విడిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి.. ఆర్ఎస్ఎస్ స్వయంసేవక్ గా జీవితాన్ని ప్రారంభించిన తొలి తరం బీజేపీ నాయకుల్లో ఒకరైన నరేంద్ర, పాత నగర ప్రజల తలలో నాలికలా మెదిలారు.. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితిని స్థాపించి సామూహిక వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించడం ద్వారా సమాజంలో ఐక్యతను తీసుకురావడంలో వారి కృషి ఎనలేనిది.. ఎన్నో ప్రజా ఉద్యమాల్లో ప్రముఖంగా కనిపించేవారు నరేంద్ర గారు..
నరేంద్ర గారు శాసన సభ్యునిగా, పార్లమెంట్ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా ఎదిగినా.. నిగర్విగా అందరి ముందూ ఒదిగే కనిపించేవారు.. కానీ ఆత్మగౌరవానికి దెబ్బ తగిలితే మాత్రం సహించలేదు నరేంద్ర గారు.. భాయ్ సాబ్ బీజేపీని వీడినప్పడు నేను అందరితో చెప్పేవాన్ని.. కచ్చితంగా ఆయన తిరగి వస్తారని.. నా నమ్మకం వమ్ముకాలేదు..  హైదరాబాద్ పాత నగరం ఆయనకు జన్మభూమి మాత్రమే కాదు.. కర్మభూమి కూడా.. ఇక్కడి ప్రజల ప్రతి చూపులోనూ, శ్వాసలోనూ భాయ్ సాబ్ కనిపిస్తారంటే అతిశయోక్తి కాదు..

భాయ్ సాబ్ లేరనే వార్త ఎంతో ఆవేదన కలిగించింది.. వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసింది.. చిన్నప్పడు నేను టైగర్ అనే పదాన్ని నరేంద్ర గారి రూపంలోనే విన్నాను.. అందుకే నాకు టైడర్ అంటే భాయ్ సాబ్ రూపమే గుర్తుకు వస్తుంది.. అవును ఆయన నా దృష్టిలో నిజమైన టైగర్.. 

Tuesday, April 8, 2014

NOTA ఎంత వరకు అవసరం?

ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లకు కొత్త అవకాశం ఇచ్చింది భారత ఎన్నికల సంఘం.. అదే NONE OF THE ABOVE.. దీన్నే సంక్షిప్తంగా NOTA అంటున్నారు.  ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో అభ్యర్థులందరి పేర్లు, గుర్తుల దిగువన ఉంటుంది ఈ బటన్.. బ్యాలట్ పేపర్ ద్వారా ఓటింగ్ జరిగే రోజుల్లో అభ్యర్ధులు ఎవరూ ఇష్టం లేకపోతే.. ఓట్ ముద్రను సరిగ్గా వేయకపోవడమో, లేదా ముద్ర లేకుండానే పేపర్ బ్యాలట్ పేపర్ను బాక్సులో వేసేవారు.. కానీ EVMలు వచ్చాక చెల్లని ఓట్లకు స్థానం లేకుండా పోయింది. అభ్యర్థులు ఎవరూ ఇష్టం లేకున్నా, ఎవడో ఒక గొట్టంగాడికి కచ్చితంగా ఓటేయక తప్పదు.. ఈ పరిస్థితిని నివారించేందుకు కొందరు ఉద్యమ కారుల పోరాట ఫలితంగా NOTA వచ్చి చేరింది.. అభ్యర్థులెవరూ ఇష్టంలేకపోతే ఈ బటన్ నొక్కేయవచ్చనమాట..
నిజంగా ఈ NOTA వల్ల ప్రయోజనం ఉందా?.. ఇందులో భిన్నవాదనలు ఉన్నాయి.. నా వరకైతే ఈ NOTA వల్ల అంతగా ప్రయోజనం లేదనే అంటాను.. ప్రజాస్వామ్యం మనకు ఇచ్చిన పవిత్రమైన ఆయుధం ఓటు హక్కు.. మనకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకునే స్వేచ్చ మనకు ఉంది.. ఉన్నవారిలోనే ఉత్తములను ఎన్నుకుంటే బాగుంటుంది.. ప్రతి మనిషి(అభ్యర్థి)లో మంచి, చెడు రెండూ ఉంటాయి.. మనం మంచినే ఎన్నుకొని పాజిటివ్ గా ఆలోచించాలి.. అభ్యర్థులు ఎవరూ నచ్చలేదని వాదించేవారు నా దృష్టిలో మూర్ఖులు, తామే గొప్పవారమనే ఇగోయిస్టుల కిందే లెక్క.. సాటి మనిషిని నమ్మనివాడు అసలు సంఘజీవేనా?..
ప్రజాస్వామ్య వ్యవస్థను నమ్మని కొన్ని సంస్థలు ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునివ్వడం చూస్తూనే ఉన్నాం.. అలాగే నాయకులెవరూ తమ గోడును పట్టించుకోవడం లేదని ఓటింగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించే వారూ ఉన్నారు.. ఇలాంటి వారు నిరసన తెలిపేందుకు NOTA కొంత మేర ఉపయోగపడుతుంది.. కొన్ని గ్రామాల ప్రజలు తమ గోడును వినిపించేందుకు సామూహికంగా వందల సంఖ్యలో నామినేషన్లు వేసి ఎన్నికల ప్రక్రియను సంక్లిష్టం చేసి అందరి దృష్టిని ఆకర్శించే ప్రయత్నం చేస్తుంటారు.. ఇలా చేయడం కన్నా NOTA ఎంచుకోవడమే మంచిది..
ఇక వీరందరినీ మించిన సోకాల్డ్ మేధావులు కొందరు మన సమాజంలో ఉన్నారు.. వారు ఎన్నికల వ్యవస్థే వేస్టంటారు వారు.. తుపాకి గొట్టం ద్వారా వచ్చే విప్లవం కోసం కలలు కనేవారే వీరిలో అధికం.. మరి కొందరికి ఓటు వేయడానికి వెళ్లాలంటే బద్దకం. ఓటెందుకు వేయలేదని అడిగితే ఎందుకు వేయాలని ఎదురు ప్రశ్నిస్తారు.. పోలింగ్ కేంద్రానికి వెళ్లి క్యూలో నిల్చోవడం, ఓటు వేసేందుకు వేచి ఉండటం వీరికి నామోషి.. తిన్నది అరగని వాదనలు చేసే ఇలాంటి వారి వల్ల సమాజానికి నష్టమే ఎక్కువ.. ఇలాంటి వారు కూడా NOTAను వాడుకోవచ్చు..

ఓటింగ్ మిషన్ దిగువన NOTA బటన్ అయితే పెడుతున్నారు.. కానీ ఈ విషయంలో చాలా మంది ఓటర్లకు అవగాహనే లేదనేది వాస్తవం.. చదువుకున్న వారికి సైతం ఈ సారి ఇలాంటి అవకాశం వచ్చిందనే విషయం వారి వరకు చేరలేదు.. అందుకు కారణం ఎన్నికల కమిషన్ తగిన ప్రచారం చేయకపోవడమే.. ఇక నిరక్షరాస్యుల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. NOTAకు సైతం ప్రత్యేక చిహ్నం ఇవ్వాలని సుప్రీం కోర్టు సూచిస్తున్నా, ఈ సారి ఎన్నికలల్లో ఇలాంటి గుర్తు లేనట్టే అని ఎన్నికల సంఘం సెలవిచ్చేసింది..

రామ రాజ్యం రావాలి..

రామ రాజ్యం కావాలని మహాత్మా గాంధీ కలలు కన్నారు.. రామ రాజ్యం అంటే గాంధీజీ దృష్టిలో..  పేదరికం, ఆకలిలేని సమాజం.. అందరికీ ఉపాధి అవకాశాలు.. ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టకు లోటు ఉండొద్దు.. గ్రామాలు స్వయం సంవృద్ధిని సాధించాలి.. ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి..’ 
ఎంత గొప్పదో చూడండి ఈ రామరాజ్య భావన.. మర్యాదా పురుషోత్తముడు, ఆదర్శ నాయకుడు, పితృవాక్య పాలకుడు, ధర్మ సంరక్షకుడు, ప్రజలందరినీ కన్న బిడ్డల్లా చూసుకొని సుపరిపాలన అందించిన శ్రీరాముడు నేటి పాలకులకు ఆదర్శం కావాలి.. అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.. శ్రీ రామచంద్ర భగవాన్ కీ జై..

Monday, April 7, 2014

వారసత్వాలను తిరస్కరించండి..

మన దేశ ప్రజాస్వామ్యానికి పట్టిన చీడ వారసత్వ రాజకీయం.. దీన్ని కొనసాగించే వారిని ఓడించండి..
ఆరున్నర దశాబ్దాల స్వాతంత్ర్యం మిగిల్చింది ఇదేనా?.. రాజరికాలు పోయాయని ఘనంగా చెప్పుకుంటాం.. కానీ జరుగుతున్నది ఏమిటి?.. ప్రజాస్వామ్యం ముసుగులో కొన్ని వంశాలు, కుటుంబాలు పెత్తనం చేయడాన్ని ఏమనాలి?.. గతంలో ప్రజల ప్రమేయం లేకుండా రాజవంశాలు వారసత్వంగా పాలించేవి.. ఇప్పుడు ప్రజలతో ఓట్లేయించుకొని పాలిస్తున్నాయి.. అంతే తేడా..
తాత పోతే గొంగడి నాదే అన్నట్లు సాగుతోంది ఈ వ్యవహారం.. తాతలూ, తండ్రులూ, కొడుకులూ, మనవళ్లూ.. ఇలా కొన్ని కుటుంబాలను భరించాల్సిందేనా?.. ఇతరులు రాజకీయాల్లోకి రాకూడదా?.. పాలించే అర్హత వారికిలేదా?.. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ కుల మతాలకు అతీతంగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది..
అవినీతికి ఆలవాలంగా, ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా మారిన ఈ వారసత్వ రాజకీయాలకు ఈ ఎన్నికల్లో ముగింపు పలకాల్సిన అవసరం ఉంది.. ఇందుకు మన వంతు ప్రయత్నం చేద్దాం..

ముందు కుటుంబ పార్టీలను నిరభ్యంతరంగా తిరస్కరించే విషయాన్ని పరిశీలిద్దాం.. ప్రజాస్వామ్య స్పూర్తి ఉన్న పార్టీలకే ఓటేద్దాం.. అయితే ఇందులో మీకేమైనా ఇబ్బంది ఉన్నట్లు అనిపిస్తే?.. దానికీ పరిష్కారం ఉంది.. ఎన్నికల్లో ఒక కుటుంబం నుండి ఒక సభ్యున్నే గెలిపిద్దాం.. ఒకే కుటుంబం నుండి వేర్వేరు పార్టీల్లో అభ్యర్థులు ఉన్నా, ఒకే పార్టీలో వేర్వేరు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నా ఒక కన్నేసి ఉంచండి.. అందులో ఎవరు ఉత్తమమో వారికే ఓటేయడండి.. ఏ మంచి పనైనా అయినా ప్రారంభమయ్యేది ఒక అడుగుతోనే.. ఈ తొలి అడుగు మనమే ఎందుకు వేయకూడదు.. ఆలోచించండి..

Friday, April 4, 2014

పగటి కలలు..

సినిమాలు రాక ముందు తోలు బొమ్మలాటలో కేతిగాడు అనే పాత్ర ఉండేది..
కొందరు నాయకులను చూస్తే ఆ పాత్రే గుర్తుకు వస్తుంటుంది..
సీఎం పదవి వదులుకోడానికి దమ్ముండాలి అంటారీయన.. మీకు దమ్ము, దగ్గు, జలుబూ అన్ని ఉన్నాయని జనానికి తెలుసు..
అడ్డగోలు వాగ్దానాలు ఇచ్చి, అమలు చేయడం చేతగాక మఖ్యమంత్రి పదవిని వదిలేసీ పారిపోయిన విషయమూ తెలుసు..
ఉల్టా చోర్ కోత్వాల్ కో మారా.. అన్నట్లు తన వైఫల్యాన్ని బీజీపీపై రుద్దే ప్రయత్నం చేస్తున్నదీ తెలుసు..
ఈ కేతిగాడు పాత్రను ఆడిస్తుంది ఎవరో అందరికీ తెలుసు..
ఎవరైనా అధికారంలో ఉన్న పార్టీపై పోరాటం చేస్తారు.. కానీ ఈయన తలపడుతున్నది అధికారపక్షంతో కాదు.. ప్రతిపక్ష నేతతో పోరాడుతున్నాడు.. ప్రధాన మంత్రి పదవి కోసం పోరాడుతున్ననాయకునిపై తాను పోటీ చేస్తూ ఆయన్ని ఓడిస్తానని గొప్పలకు పోతున్నాడు.. కానీ తనను ఆడిస్తున్న యువరాజాపై మాత్రం తేలికగా ఓడిపోయే బకరాను పోటీకి పెట్టేశాడు..
మోడీని ఓడిస్తాడట.. నిజమే.. కలలో కావచ్చు..

Thursday, April 3, 2014

కాంగ్రెస్సే పెద్ద మతతత్వ పార్టీ

కాంగ్రెస్సే పెద్ద మతతత్వ పార్టీ అంటున్నారు సయ్యద్ యాహ్యా బుఖారీ.. ఢిల్లీ జామా మసీద్ షహీ ఇమాం సయ్యద్ అహ్మద్ బుఖారీ తమ్ముడీయన.. కాంగ్రెస్ పార్టీకి తాము మద్దతు పలుకాలన్న తన అన్న ప్రతిపాదనను వ్యతిరేకించారు యాహ్యా.. ఆయన ఇంకా ఏమన్నారో గమనించండి..
బీజేపీని మతతత్వ పార్టీ అని ముస్లింలు అంటారు.. ఆ పార్టీ చెప్పాల్సింది నేరుగా చెప్పేస్తుంది.. కానీ కాంగ్రెస్ అలా కాదు వెన్నుపోటు పొడుస్తుంది.. గత మూడున్నద దశాబ్దాలుగా  చూస్తే భాగల్ పూర్, మీరట్, మొరాదాబాద్, సూరత్ తదితర అల్లర్లు కాంగ్రెస్ హయాంలో జరిగినవే.. అమాయక ముస్లింలను జైలుకు పంపారు.. కాంగ్రెస్ పార్టీయే అత్యంత మతతత్వ పార్టీ.. దానికి మద్దతు ఇవ్వడం సరికాదు..

విన్నారా సయ్యద్ యాహ్యా బుఖారీ గారి మాటలు..

నో చెవిలో పువ్వెట్టింగ్..

ఎన్నికలు జరిగే సమయంలో, నో చెవిలో పువ్వెట్టింగ్..
ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ మీద కనిపించిన ఐడియా మొబైల్ ప్రకటన చూసి తెలుగు భాషను మరీ ఇంతగా ఖూనీ చేశారేంటి అనుకున్నా.. నో చెవిలో పువ్వెట్టింగ్ కాస్త సంకర భాషా ప్రయోగంలా అనిపించింది.. కానీ ఆలోచించి చూస్తే ఈ ప్రకటనలో భాష కాదు, భావం ప్రధానం అనిపించింది..
సోషల్ మీడియా విస్తరించిన ప్రస్తుత కాలంలో రాజకీయ నాయకులు మాట మార్చినా, తప్పినా జనం కడిగిపారేస్తున్నారు.. ముఖ్యంగా ఎన్నికల వేళ నాయకులు కాస్త నోరు దెగ్గర పెట్టుకోవాల్సిందే.. గతంలో మాదిరిగా చెవిలో పూవు పెడతామంటే కుదరదు..
ప్రజల్లో వచ్చిన చైతన్యానికి ఐడియా ప్రకటన అద్దం పడుతోంది అనిపించింది..
నిజమే కదూ.. ఎన్నికలు జరిగే సమయంలో నో చెవిలో పూవెట్టింగ్..