Wednesday, April 9, 2014

టైగర్ నరేంద్ర అమర్ హై..

టైగర్ నరేంద్ర.. అవును ఆయన నా దృష్టిలో నిజంగా పులే..
హైదరాబాద్ పాతనగరంలో పుట్టి పెరిగిన నాకు మొదట తెలిసిన నాయకుడు నరేంద్ర గారే.. నా చిన్నప్పుడు కందికల్ గేట్ ప్రాంతంలో ఓ సభలో చూశాను.. గంభీరంగా మీసాలతో ఉన్న వ్యక్తి రాగానే టైగర్ నరేంద్ర జిందాబాద్ అనే నినాదాలు వినిపించాయి.. కొందరు వ్యక్తలు భాయ్ సాబ్ అని పలకరించారు.. ఆయనే ఆలె నరేంద్ర గారు.. ప్రభుత్వం మా బస్తీ ప్రజలను కాందీశీకుల కన్నా హీనంగా చూస్తూ పట్టించుకునేది కాదు.. ముష్కరులు తరచూ దాడులు చేసేవారు.. అలాంటి సమయంలో నేనున్నానంటూ అండగా నిలిచారు భాయ్ సాబ్..
పాత నగరంలో మత ఘర్షణలు జరిగిన సమయంలో పోలీసులు అమాయకులను పట్టుకుపోయి హింసిస్తే , భాయ్ సాబ్ వెళ్లి వారికి గట్టి వార్నింగ్ ఇచ్చి విడిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి.. ఆర్ఎస్ఎస్ స్వయంసేవక్ గా జీవితాన్ని ప్రారంభించిన తొలి తరం బీజేపీ నాయకుల్లో ఒకరైన నరేంద్ర, పాత నగర ప్రజల తలలో నాలికలా మెదిలారు.. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితిని స్థాపించి సామూహిక వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించడం ద్వారా సమాజంలో ఐక్యతను తీసుకురావడంలో వారి కృషి ఎనలేనిది.. ఎన్నో ప్రజా ఉద్యమాల్లో ప్రముఖంగా కనిపించేవారు నరేంద్ర గారు..
నరేంద్ర గారు శాసన సభ్యునిగా, పార్లమెంట్ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా ఎదిగినా.. నిగర్విగా అందరి ముందూ ఒదిగే కనిపించేవారు.. కానీ ఆత్మగౌరవానికి దెబ్బ తగిలితే మాత్రం సహించలేదు నరేంద్ర గారు.. భాయ్ సాబ్ బీజేపీని వీడినప్పడు నేను అందరితో చెప్పేవాన్ని.. కచ్చితంగా ఆయన తిరగి వస్తారని.. నా నమ్మకం వమ్ముకాలేదు..  హైదరాబాద్ పాత నగరం ఆయనకు జన్మభూమి మాత్రమే కాదు.. కర్మభూమి కూడా.. ఇక్కడి ప్రజల ప్రతి చూపులోనూ, శ్వాసలోనూ భాయ్ సాబ్ కనిపిస్తారంటే అతిశయోక్తి కాదు..

భాయ్ సాబ్ లేరనే వార్త ఎంతో ఆవేదన కలిగించింది.. వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసింది.. చిన్నప్పడు నేను టైగర్ అనే పదాన్ని నరేంద్ర గారి రూపంలోనే విన్నాను.. అందుకే నాకు టైడర్ అంటే భాయ్ సాబ్ రూపమే గుర్తుకు వస్తుంది.. అవును ఆయన నా దృష్టిలో నిజమైన టైగర్.. 

No comments:

Post a Comment