Friday, April 18, 2014

మిత్ర ధర్మానికి అడుగడుగునా తూట్లు..

తెలుగు దేశం పార్టీ అవకాశవాదం మరోసారి స్పష్టంగా బయటపడింది.. రెండు దశాబ్దాలుగా ఇదే తంతు.. మిత్ర ధర్మానికి కట్టుబడే తత్వం ఆ పార్టీకి మొదటి నుండీ లేదు.. పొత్తు కోసం వెంపర్లాడింది ఎవరు?.. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేతలు వద్దు మొర్రో అంటున్నా, జాతీయ నాయకుల వెంటపడి ఒప్పందం కుదుర్చుకుంది ఎవరు?.. అడిగినన్ని సీట్లు ఇవ్వకుండా, గీచి బేరమాడి తగ్గించి ఎవరు?.. టీడీపీయే కదా?.. అంతా జరిగాక ఇప్పుడు మరో వెన్ను పోటు..
బీజేపీ రాష్ట్రంలో బలపడకుండా, అడుగడుగునా దెబ్బ తీస్తూ వచ్చింది టీడీపీ.. బీజేపీకి బలం పెరిగినప్పడు స్నేహ హస్తం అందిస్తారు.. హవా తగ్గగానే కాడి వదిలేసి మతతత్వ పార్టీ అని దూరం పెడతారు.. ఇదేనా మిత్ర ధర్మం.. కష్ట సుఖాల్లో మైత్రికి కట్టుబడి ఉన్న అకాలీదళ్, శివసేన లాంటి పార్టీలకు ఉన్న విజ్ఞత కూడా టీడీపీకి లేదు..
1998 లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ఒంటరి పోరాటం చేసి సికింద్రాబాద్, కరీంనగర్, రాజమండ్రి, కాకినాడ సీట్లు గెలుచుకుంది..  గెలిచింది నాటు సీట్లే.. కానీ అప్పటి లోక్ సభ ఫలితాలను విశ్లేస్తే బీజేపీకి

దాదాపు 40 అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రధమ స్థానం, మరో 20 స్థానాల్లో రెండో స్థానం రావడంతో పాటు ఎన్నో చోట్ల బలంగా ఎదిగింది.. ఈ ఫలితాలు చూసి టీడీపీకి గుబులు పుట్టింది.. అదే సమయంలో కేంద్రంలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు.. వెంటనే చంద్రబాబు చక్రం తిప్పి యునైటెడ్ ఫ్రంట్ ఛైర్మన్ పదవికి వదిలేసి, బీజేపీ వైపు మొగ్గు చూపాడు.. ఎన్డీఏకు మద్దతు ఇచ్చేశాడు.. టీడీపీతో మైత్రి ఫలితంగా 1999 అసెంబ్లీ, పార్టమెంట్ ఎన్నికల్లో బీజేపీ చాలా పరిమిత స్థానాల్లో పోటీ చేయాల్సి వచ్చింది.. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న టీడీపీ వాజ్ పేయ్ హవా పుణ్యమా అని గట్టెక్కి, మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది..
2004 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ మైత్రి కొనసాగినా కేంద్రంలో ఎన్డీయే(బీజేపీ), రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వాలు ఓడిపోయాయి.. అప్పడు చంద్రబాబుకు హఠాత్తుగా జ్ఞానోదయం అయింది.. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకతతో ఓటమి పాలయ్యామనే విషయం మరచిపోయి.. మతతత్వ బీజేపీతో పొత్తు వల్లే ఓడిపోయామంటూ నిందలు వేసి మిత్ర ధర్మానికి తూట్లు పొడిచారు.. నరేంద్ర మోడీ గుజరాత్ సీఎంగా అప్పుడూ ఉన్నారు, ఇప్పుడూ ఉన్నారు.. ఈ సారి మోడీ వేవ్ చూడగానే మళ్లీ బీజేపీ ముద్దొచ్చింది బాబుగారికి..  సోకాల్డ్ మతతత్వాన్ని మరచిపోయి మరోసారి చక్రం తిప్పి తాజా విద్రోహానికి తెరలేపారు..
ఈ మైత్రీ బంధంలో అంతో ఇంతో లాభ పడింది తెలుగు దేశమే.. కానీ అత్యధిక నష్టాలు భారతీయ జనతా పార్టీకే మిగిలాయి.. ఆనాడు ఎన్డీయే భాగస్వాముల కోసం బీజేపీ తన ఎజెండాలోని రామజన్మభూమి, ఆర్టికల్ 370, ఉమ్మడి పౌరస్మృతి లాంటి అంశాలను పక్కన  పెట్టింది.. అందరికీ ఆమోదయోగ్యమైన కామన్ మినియం పోగ్రాం (సీఎంపీ)తో ముందుకు సాగింది.. అందులో భాగంగానే, టీడీపీ వ్యతిరేకించడంతో తెలంగాణ ఏర్పాటు (ఒకే ఓటు-రెండు రాష్ట్రాలు అనే కాకినాడ తీర్మానం)ను తాత్కాలికంగా పక్కన పెట్టి, సరియైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పింది.. కానీ ఈలోగా బీజేపీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. తెలంగాణలో ఇదే నినాదంతో టీఆర్ఎస్ ఆవిర్భవించి పాతుకు పోయింది.. బీజేపీకి స్పష్టమైన విధానం ఉన్నా, తెలంగాణ ద్రోహి అని ముద్ర వేసుకోవాల్సి వచ్చింది.. అదే సమయంలో టీడీపీలో వరస పొత్తుల కారణంగా చాలా నియోజకవర్గాల్లో బీజేపీ పునాదులు దెబ్బతిన్నాయి.. తాజాగా బీజేపీ ఘననీయంగా కోలుకొని బలపడుతున్న సమయంలో టీడీపీ మరో వెన్నుపోటు పొడిచేసింది..

స్నేహమంటే కష్ట సుఖాల్లో ఒకేలా ఉండాలి.. కానీ తాయిలం ఉంటేనే దోస్తీ అనే పిల్లలాట కాదు.. పొత్తుల వల్ల లాభాలు, నష్టాలు సమానంగా స్వీకరించాలి కానీ, నీకన్నా నేనే ఎక్కువ అనే ఆధిపత్యం మొదటికే మోసం తెస్తుంది..

 

No comments:

Post a Comment