Sunday, April 13, 2014

తెలంగాణ.. ఎవరి ఘనత?

హైదరాబాద్ నగరంలో ఒక విచిత్రమైన పోస్టర్ చూశాను.. తెలంగాణ చిత్ర పటంలో చిరునవ్వుల రాహుల్, అభివాదం చేస్తున్న సోనియా, ఓ మూలన మౌనీ మన్మోహన్.. అరవై ఏళ్ల స్వప్నం.. కాంగ్రెస్ తో సాకారం.. తెలంగాణ ఆవిర్భావ వేళ అందరికీ శుభాకాంక్షలు అని పోస్టర్లో రాసి ఉంది..
తెలంగాణ ఇవ్వడాన్నికి 60 ఏళ్లు పట్టినందుకు సిగ్గు పడాల్సిన కాంగ్రెస్, అది తమ ఘనత అని చెప్పుకోవడం విడ్డూరం అనిపించింది.. ఇన్నేళ్ల జాప్యం కారణంగా వేయికి పైనా జరిగిన ఆత్మ బలిదానాలకు బాధ్యత ఎవరిదో కూడా సెలవిస్తే బాగుండేది.. మరి ఈ పోస్టర్లు హైదరాబాద్, తెలంగాణ జిల్లాల్లోనే వేశారా? లేక సీమాంధ్రలో కూడా వేశారా? మీరు చేసిన గొప్ప పని అక్కడి ప్రజలకు కూడా తెలియాలి కదా?..
అసలు తెలంగాణ ఇచ్చామని చెప్పుకునే అర్హత వీరికి ఉందా?.. పార్లమెంట్లో చర్చ జరుగుతున్న వేళ సోనియా, రాహుల్ మూగనోము పట్టిన విషయం తెలియనిది ఎవరికి?.. తెలంగాణ ఎందుకు ఇస్తున్నారో ఒక్కమాటైనా మాట్లాడారా?..  మరి అప్పనంగా క్రెడిట్ కోట్టేసేందుకు మనసెలా ఒప్పింది?..

అసలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ మోహం చూసి ఎన్నాళ్లయింది?.. నాకు తెలిసి రాజశేఖర రెడ్డి మరణం, సత్య సాయిబాబా నిర్యాణం సందర్భంగా సోనియా వచ్చినట్లు గుర్తు.. రాహుల్ గాంధీ ప్యారడైజ్ బిర్యానీ, చట్నీస్ ఇడ్లీలు తినడానకి వచ్చినట్లు మీడియాలో చూశాను.. ఇంత కాలం ఎందుకు మొహం చాటేశారో వివరణ ఇవ్వగలరా?

No comments:

Post a Comment