Monday, September 30, 2013

మేతగాడికి జైలే దిక్కు..

మేసినోడికి మేసినంత అనుకున్నాడు.. పశువుల నోటికాడికి అందాల్సిన గ్రాసాన్ని మేసాడు.. కానీ చట్టం ఒప్పుకోదుగా.. చివరకు దోషిగా తేలాడు.. పాపం లాలూ ప్రసాద్ యాదవ్ కి ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుందో?.. నాయకులారా బీ కేర్ ఫుల్.. మేం తింటాం, ప్రజలకూ ఇంత పడేసి గెలుస్తాం అంటే కుదరదు.. ఏనాటికైనా శ్రీకృష్ణ జన్మస్థానానికి పోవాల్సిందే..

గీతాంజలి(లక్కీ)కి ద్వితీయ జన్మదిన శుభాకాంక్షలు..


మంచి, చెడు ఒక ప్రాంతానికే పరిమితం కాదు.. అన్ని ప్రాంతాల్లో మంచి వారు, చెడ్డవారు ఉంటారు.. తెలివి తేటల విషయంలోనూ అంతే.. మనతో ఏకీభవించని మాత్రాన అవతలి వారిని నిందించడం సరికాదు.. వారిని ఎలా ఒప్పించాలనే విషయంపై దృష్టి పెట్టాలి.. కానీ నిందిస్తూ పోతో శత్రువులు పెరుగుతారు తప్పి ప్రయోజనం లేదు.. ఆంధ్రా ప్రాంతంలో మేధావులు లేరనడం సమంజసం కాదు.. తెలంగాణ వాదానికి మద్దతు తెలిపిన వారిలో పొత్తూరి వెంకటేశ్వర రావులాంటి వారు ఎందరో ఉన్నారు.. బీజేపీతో పాటు, పలు ప్రజాసంఘాలకు చెందిన ఆంధ్ర మేధావులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇచ్చి సహకరించడం లేదా? ఇలా ఏకపక్షంగా నిందించడం సమంజసమేనా?


Saturday, September 28, 2013

దళపతి కుట్రదారు కారాదు..

కొద్ది రోజుల క్రితం ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహా చేసిన వ్యాఖ్య గుర్తుకొచ్చింది.. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ చూసిన తర్వాత..
ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు చూసిన తర్వాత సమైక్యవాదులు, ఆయన అభిమానులు చంకలు గుద్దుకొని సంబరపడితే.. తెలంగాణ వాదులు మండిపడ్డారు.. సరే కిరణ్ కుమార్ రెడ్డి తన ప్రాంతీయ ఆకాంక్షలతో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడి ఉండొచ్చేమో.. కానీ ఆయన మాట్లాడిన తీరు మాత్రం వివేకవంతంగా లేదని చెప్పక తప్పదు.. సీఎం గారు చెప్పిన విషయాల్లో అవాస్తవాలు, వక్రీకరణలే ఎక్కవ కనిపించాయి..
ఆంధ్రప్రదేశ్ 1956లో ఏర్పడింది.. పొట్టి శ్రీరాములు గారు మరణించే నాటికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడలేదు.. ఆయన మద్రాసుతో కూడిన ఆంధ్ర రాష్ట్రం కోసం అమరజీవి అయ్యారు.. కానీ ఆయన కోరిక నెరవేరలేదు.. చరిత్ర అంత వరకే చెబుతుంది. కానీ ఆంద్రప్రదేశ్ తో పొట్టి శ్రీరాములుకు ఎక్కడ సంబంధం ఉంది?
సర్దార్ వల్లభాయి పటేల్ హైదరాబాద్ సంస్థాన విమోచనలో కీలక పాత్ర పోషించి, తెలంగాణ ప్రజలకు హీరోగా కనిపిస్తున్నారు.. ఆయన చనిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.. ఈ వ్యవహారంలో ఆయన పాత్ర ఉన్నట్లు చరిత్రలో ఎక్కడా కనిపించలేదు..
ఇక నాటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ విషయానికి వస్తే.. ఆంధ్ర-తెలంగాణలు కలిసి ఉండలేని పరిస్థితి లేకపోతే భవిష్యత్తులో విడిపోవచ్చని చెప్పిన విషయం ముఖ్యమంత్రిగారు ఎందుకు దాచారు?
ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పడు ఇరు ప్రాంతాల నాయకుల మధ్య కుదిరిన పెద్ద మనుషుల ఒప్పందం అమలు కాకుండా నిర్వీర్యమైన విషయంలో కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కమాటైనా మాట్లాడారా?
రాష్ట్రం విడిపోతే జలయుద్దాలు ఏర్పడతాయని సీఎం గారు భయపెడుతున్నారు.. మరి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు ఏమాత్రం న్యాయం చేశారు? కృష్ణానదిపై నాగార్జున సాగర్ ఆనకట్ట కట్టినప్పడు కుడి కాలువ ముందుగా కట్టుకొని ఆంధ్రా ప్రాంతాన్ని సస్యశ్యామంలం చేసుకోవడం.. చాలా ఏళ్ల వరకు కూడా ఎడమ కాలువ కట్టకుండా తెలంగాణ జిల్లాలకు అన్యాయం చేయడం నిజం కాదా? పక్కనే కృష్ణమ్మ పారుతుంటే తాగు, సాగు నీరు అందక పాలమూరు, నల్లగొండ జిల్లాలు కరువు, ఫ్లోరోసిస్ సమస్యతో బాధ పడటం అబద్దమా? మ్యాపు ముందేసుకొని వివరించిన కిరణ్, ఈ విషయాలను ఎందుకు దాచారు?
తెలంగాణ ప్రాంతానికి న్యాయంగా రావాల్సిన ఉద్యోగాలను సీమాంధ్రులు అక్రమంగా పొందారని గిర్ గ్లానీ కమిషన్ స్పష్టంగా చెప్పింది.. అంతకు ముందు ఎన్టీరామారావు ఈ అన్యాయాన్ని సరిదిద్దేందుకు 610 జీవో తెచ్చారు.. గత సీఎంలంతా దీన్ని నిర్లక్ష్యం చేశారు.. మరి మీరు ముఖ్యమంత్రిగా వచ్చాక, తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన సమయంలో అయినా న్యాయం చేసే ప్రయత్నం చేశారా?..
తెలంగాణ- సమైక్యాంధ్ర ఉద్యమాలు ఉధృతంగా ఉండి, రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ గారు హుందాగా ఉండాలి.. ఇరు ప్రాంతాలను సమదృష్టితో చూడాలి.. కానీ తాను సమైక్య రాష్ట్ర సీఎంను అని చెప్పుకుంటూనే ఒక ప్రాంత ప్రజల పక్షానే వఖాల్తా పుచ్చుకొని, మరో ప్రాంత ప్రజ ఆకాంక్షలను నిర్లక్ష్యం చేయడం ఏ విధమైన న్యాయం?
రాష్ట్ర విభజనపై నిర్ణయం అయిపోయిన తర్వాత ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయడంపై దృష్టి పెట్టాల్సిన ముఖ్యమంత్రిగారు తన పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించడం ద్వారా తన సొంత ప్రాంతలో హీరో కావచ్చేమో.. కానీ మరో ప్రాంతంలో మాత్రం విలన్ అయిపోయారనే సంగతిని మరువరాదు..
అందుకే ఉప ముఖ్యమంత్రి అన్నారు.. దళపతి కుట్రదారు కారాదు.. అని.


రివర్స్ గన్

రివర్స్ గన్ అంటే మీకు తెలుసా?.. శత్రువులను కాల్చాల్సిన గన్ వెనక్కి పేలితే ఎలా ఉంటుంది?.. ప్రత్యర్థులకు అంతకన్నా ఆనందం మరేమి ఉంటుంది.. మన యువరాజా చేసిన పని కూడా ఇదే..
జైలు శిక్షపడిన ప్రజాప్రతినిధులు సభ్యత్వం కోల్పోకుండా యూపీయే ప్రభుత్వం తీసుకురా తలపెట్టిన ఆర్డినెన్స్ విమర్శలకు దారితీస్తోంది.. బీజేపీ, వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆర్డినెన్స్ ను స్వయంగా రాష్ట్రపతే తిరస్కరించారు.. ఈ దెబ్బ నుండి కాంగ్రెస్ పార్టీ కోలుకోక ముందే మన రివర్స్ గన్ పేలింది.. ఇది నాన్సెన్స్ (అర్థం లేని) ఆర్డినెన్స్ అని వ్యాఖ్యానించిన రాహుల్ గాంధీ.. దీన్ని చించి పారేయాలని పిలుపునిచ్చారు.. అంతే కాదు తన చేతిలోని కాగితాలను కసిగా చించేసి డెమో కూడా ఇచ్చారు.. ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ తల్లి సోనియాగాంధీతో సహా కాంగ్రెస్ శ్రేణులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు ఈ వ్యవహారంతో.. మొత్తానికి ఎవరిని కాపాడేందుకు ఈ వివాదాస్పద ఆర్డినెన్స్ తెస్తున్నారో తెలియదు కానీ, ఇప్పట్లో ముందుకు సాగే అవకాశం లేకుండా పోవడం శుభ పరిణామమే..
రాహుల్ గాంధీ లాంటి శల్య సారధ్యం ఉన్నప్పుడు యూపీఏ సర్కారుకు ఇతర శత్రువులతో పనేముంది.. తాము మొద్దబ్బాయిని కానని రాహుల్ నిరూపించుకున్నారా? లేక తనకూ, తన తల్లికి బురద అంటకుండా ముందే ప్రధానిని బురదలో పడేశారా? అబ్బాయి గారికి ఇంత తెలివి ముందే ఉంటే, కాంగ్రెస్ నేతృత్వ యూపీఏ సర్కారు కుంభకోణాలు, ధరల పెరుగుదల ఇతర అసమర్ధ విధానాలకు ఎందుకు అడ్డుకోలేకపోయారన్నదే సవాలక్ష ప్రశ్న..

Friday, September 27, 2013

అర్థం లేని చర్చలు ఎందుకు?

పాకిస్తాన్ ప్రేరిత లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదులు ముగ్గురు సరిహద్దు దాటి వచ్చి పోలీసు స్టేషన్, సైనిక స్థావరంపై దాడి చేసి 10 మంది భారత జవాన్లను పొట్టన పెట్టుకున్నారు.. సాధారణ పరిస్థితుల్లో తెలుగు దినపత్రికల్లో మొదటి పేజీలో ఈ వార్త రావాల్సి ఉంది.. కానీ రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా లోపలి పేజీల్లో సర్దేశారు.. దేశ సరిహద్దుల ఎంత భద్రంగా ఉన్నాయో, ఈ వార్తే చెబుతోంది.. ఆదివారం నాడు న్యూయార్క్ లో భారత, పాకిస్తాన్ ప్రధాన మంత్రులు సమావేశమవుతున్న నేపథ్యంలో ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారని చెబుతున్నారు.. ఇదే నిజమైతే ఉగ్రవాదులు భారత భూభాగంలోనే ఎందుకు దాడి చేశారు.. ఆ నిరసన ఏదో పాకిస్తాన్లో కూడా వ్యక్తం చేసి ఉండొచ్చు కదా?
భారత్ విషయంలో పాకిస్తాన్ వైఖరి ఇప్పటి వరకూ రవ్వంత కూడా మారలేదు.. ఈ పరిస్థితుల్లో ఆ దేశంతో మనం చర్చలు జరపాల్సిన అవసరం ఏమిటి? పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు ఆ దేశ సైన్యం, శాసన వ్యవస్థలపై ఏ మాత్రం పట్టులేదు.. గతంలో అటల్ బిహారీ వాజ్ పేయి బస్సు యాత్ర తర్వాత ఏమైందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి.. కార్గిల్ లో పాకిస్తాన్ సైనికులు తిష్ట వేయడం, మన సైన్యం సమర్ధవంతంగా తిప్పికొట్టడం తెలసిందే.. అసలు కార్గిల్ వ్యవహారం తనకు తెలియకుండా జరిగిపోయిందని నవాజ్ వాపోయాడు... ఆ తర్వాత పాకిస్తాన్ సైన్యాధిపతి ముషారఫ్ ఆయనను పదవీ భ్రష్టున్ని చేసి తానే అధిపతి అయిపోయాడు..
ఇలాంటి వ్యవస్థ ఉన్న దేశంలో మన దేశం చర్చలు జరిపి ఉపయోగం ఏమిటి? ఈ చర్చల ఒప్పందాలకు ఆ దేశం కట్టుబడి ఉంటుందన్న గ్యారంటీ ఏమిటి? వారి దేశంపై వారికే పట్టులేని వారితో చర్చలు జరపడంలో అర్ధం లేదు..

కాశ్మీర్ విషయంలో, భారత్ లో ఉగ్రవాద కార్యకలాపాల విషయంలో పాకిస్తాన్ వైఖరి మారనంత వరకూ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండదు.. ప్రధాని మన్మోహన్ సింగ్, నవాజ్ షరీఫ్ తో జరిపే అర్ధం లేని చర్చలను నిరసిద్దాం..

Tuesday, September 24, 2013

బెస్ట్ జోక్ ఆఫ్ ది ఇయర్ 2013..

ఈ మధ్య బొత్తిగా హాస్యానికి మొహం వాచిపోయాను.. టీవీ ఆన్ చేసినా, పేపర్ తిరగేసినా కనిపిస్తున్న వార్తలు చిరు నవ్వులను సైతం దూరం చేస్తున్నాయి.. కానీ ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త చూసి బలవంతపు నవ్వు తెచ్చిపెట్టుకున్నాను (శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో పరేష్ రావెల్ మాదిరి)..
తెలంగాణ వాళ్లు హైదరాబాద్ వదిలేసి పోవాలట.. నిజాం పాలన బానిస బతుకుల నుండి విముక్తి కలిగించారట.. కరెంటును, నీళ్లనూ, అభివృద్దిని వాళ్లే తెచ్చారట.. అశోక బాబు గారు వ్యక్తులను(నాయకులను) టార్గెట్ చేసి ఈ వ్యాఖ్యలు చేశారా? లేక తెలంగాణ ప్రజలనే ఎగతాలి చేస్తున్నారా అనే అనుమానంతో టీవీలో ప్రసారమైన ఆయన ప్రసంగ టేప్ రీ ప్లే చేసి చూశారు.. ఆయన నాయకులనే కాదు యావత్తు తెలంగాణ ప్రజలను అపహాస్యం చేశారని అర్థం అయ్యింది..
అయ్యా అశోక బాబు గారూ.. నిజాం పాలన నుండి విముక్తి కలిగించింది మీరు కాదు.. మీ తాతలు కాదు.. ఇక్కడి ప్రజలు పోరాడి స్వాతంత్ర్యం తెచ్చుకున్నారు.. నిరంకుశ పాలన వదిలించుకొని భారత దేశంలో కలిసిపోవాలని కోరుకున్నారు.. కానీ పెనంలోంచి పొయ్యిలో పడ్డట్లయింది తెలంగాణ పరిస్థితి..
హైదరాబాద్ నగరాన్ని అభివృద్ది చేసిన సత్తా ఉన్న మీరు మీ డేరాబాద్ (కర్నూలు)ను ఎందుకు వదులుకున్నారు.. మద్రాసును ఎందుకు వదులుకొని పొట్టి శ్రీరాములు అమరత్వాన్ని వృధా చేశారు?.. అప్పటికే అన్ని వనరులు ఉన్నందునే కదా హైదరాబాద్ పై ఆంధ్రా నాయకులకు కన్ను పడింది.. ఈ వాస్తవాన్ని ఎందుకు తక్కి పెడతారు.. మీరు హైదరాబాద్ రావాలంటే మహబూబ్ నగర్, నల్లగొండ లేదా ఖమ్మం జిల్లా మీదుగా రావాల్సిందే.. సీమాంధ్ర సరిహద్దులు హైదరాబాద్ నగరానికి 200 కి.మీ.పైనే.. రేపు ఉమ్మడి రాజధానిగా ఉన్నా మీరు అంత దూరం నుండి ఫ్లై ఓవర్ కట్టుకొని రాలేరు. (జనం సొమ్ము, తేరగా వచ్చిన అవినీతి సొమ్ము ఉన్నవారు ఫ్లైట్లో రావచ్చు.. అది వేరే విషయం..
నాయనా అశోక్ బాబూ.. హైదరాబాద్ కు కృష్ణా జలాలు వస్తున్నది నల్గొండ జిల్లా నుండి.. కృష్ణా నది బంగాళా ఖాతం నుండి సీమాంధ్ర మీదుగా తెలంగాణలోకి రావడం లేదు.. మహారాష్ట్ర, కర్ణాటకల మీదుగా తెలంగాణ భూభాగంలోని పాలమూరు, నల్గొండ జిల్లాల మీదుగా సీమాంధ్రకు కృష్ణానది పారుతోంది.. ముందు ఆ విషయం తెలుసుకో.. సీమాంధ్రలో విద్యుత్ ఉత్పత్తి అవుతున్నది సింగరేణి బొగ్గు వల్లే.. సింగరేణి బొగ్గు గనులు ఎక్కడున్నాయో అట్లాసులో చూసుకో..
తెలంగాణ వారికి మీరు పదవులు ఇస్తారా? వద్దులే శోక బాబు మీరు వెళ్లిపోతే మేమే పాలించుకుంటాంలే.. మీ ఎంగిలి మెతులకులు వద్దు.. మా తిండి మేం తింటాం.. ఆంద్రప్రదేశ్ అంటే 23 జిల్లాలు కేవలం 13+1 జిల్లాకే కమిటీలు ఉన్న మీ ఏపీఎన్జీవోల సంఘం సమైక్యాంధ్రకు ఎలా ప్రతినిధి కాగలదు.. ముందు మిగతా జిల్లా(తెలంగాణ)లకు కమిటీలు వేసుకొని మాట్లాడండి..

తెలంగాణ నాయకులు రెచ్చగొట్టే పదజాలం వాడి సీమాంధ్రులను కించపరుస్తున్నారని గగ్గోలు పెట్టే మీరు ఇప్పడు చేస్తున్న పనేమిటి? ఎంతో సంయమనంతో ఉన్న నాబోటి వారికే మీ మాటలు విని గుండెలు మండాయంటే, ఇతర తెలంగాణ ప్రజల పరిస్థితి ఏమిటి? అందుకే కోపాన్ని దిగమింగుకొని మీ మాటలు బెస్ట్ జోక్ ఆఫ్ ఇయన్ 2013 అని సరి పెట్టుకుంటున్నా.. మీ హిందూపురం రంకెలకు తెలంగాణ ప్రజలు భయపడుతారనే భ్రమలు వదులుకో అశోక బాబూ.. 

Thursday, September 19, 2013

మీకు తెలుసా?..
ఈ దేశానికి సంస్కరణలు తెచ్చిందెవరు?
సెల్ ఫోన్లను తెచ్చిందెవరు?
హైదరాబాద్ నగరాన్ని కనిపెట్టిందెవరు?

జవాబుల కోసం బంజారాహిల్స్ రోడ్డు నెం.3లో సంప్రదించండి..

Tuesday, September 17, 2013

నరేంద్ర మోడీ జన్మ దినం నేడు..


తరతరాల బూజు వదిలిన రోజు..


1948 సెప్టెంబర్ 17..

ఒక వాస్తవం.. కానీ అనే చరిత్రలు. ప్రపంచంలో ఏ ప్రాంతానికీ ఈ పరిస్థితి ఉండదేమో.. సరిగ్గా ఇదే రోజున 65 ఏళ్ల క్రితం అంటే 1948 సెప్టెంబర్ 17 నాడు హైదరాబాద్ స్టేట్ అంతరించింది పోయింది.. ఇది వాస్తవం. ఈ సందర్భానికి ఎవరికి తోచిన భాష్యం వారు చెప్పుకొస్తున్నారు.. విమోచనం, విముక్తి, విలీనం, విద్రోహం, పోలీసు చర్య, ఆపరేషన్ పోలో.. ఇలా రకరకాల పేర్లు పెట్టేశారు..
1947 ఆగస్టు 15న బ్రిటిష్ వారి పాలన అంతమై భారత దేశ మంతటా స్వాతంత్ర్య సంబరాలు జరుపుకున్నారు.. కానీ దేశం నడి బొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు ఆ అదృష్టం లేకుండా పోయింది.. అప్పటి వరకూ బ్రిటిష్ వారికి సామంతుడిగా ఉన్నహైదరాబాద్ నవాబు అసఫ్ జాహీ వంశస్తుడైన ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తాను కూడా స్వతంత్రుడిని అయ్యానని ప్రకటించుకున్నాడు.. హైదరాబాద్ అటు ఇండియాలో, ఇటు పాకిస్తాన్లో కలవదని స్వతంత్రంగా ఉంటుందని ప్రకటించాడు.. కానీ సంస్థానంలోని మెజారిటీ ప్రజలు తాము భారత దేశంలో కలవాలని కోరుకున్నారు..
ఆనాటి హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ, మరాఠ్వాడా, కర్ణాటక ప్రాంతాల్లో ఇంకా ప్యూడల్ పాలన కొనసాగుతోంది.. ఒకవైపు దేశ్ ముఖ్, జాగీర్దార్, దొరల దాష్టీకం, వెట్టి చాకిరిలో గ్రామీణ ప్రజానీకం మగ్గిపోతుంటే, మరోవైపు నిజాం అండతో రజాకార్లు (నేటి ఎంఐఎం పూర్వరూపం) చెలరేగిపోయారు.. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. గ్రామాలపై పడి ప్రజలను దోచుకొని, హత్యాకాండను కొనసాగించారు. నిజాం ప్రోద్భలవతో రజాకార్ల నాయకుడు కాశీం రజ్వీ ఢిల్లీ ఎర్రకోటపై అసఫ్ జాహీ పతాకాన్ని గురేస్తానని విర్ర వీగాడు..
ఇలాంటి పరిస్థితితో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ, ఆర్యసమాజ్ తమ తమ మార్గాల్లో పోరాటాన్ని చేపట్టాయి.. ఈ సంస్థలన్నింటినీ నిషేధించాడు ఉస్మాన్ అలీఖాన్.. భారత దేశ నడిబొడ్డున క్యాన్సర్ కంతిలా మారిన హైదరాబాద్ సంస్థానంపై చర్య తీసుకోక తప్పదని నాటి హోం మంత్రి, సర్దార్ వల్లభాయి పటేల్ నిర్ణయించుకున్నారు.. పరిస్థితిని ముందే ఊహించిన నిజాం నవాబు పాకిస్తాన్ సాయం కోసం వర్తమానం పంపడంతో పాటు, ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించాడు.. ఈ పరిణామాల నేపథ్యంలో 1948 సెప్టెంబర్ 13న భారత సైన్యం ఆపరేషన్ పోలో పేరిట హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడించింది.. దీనికి పోలీస్ యాక్షన్ అనే పేరు పెట్టారు.. ఐదు రోజుల ప్రతి ఘటన తర్వాత నిజాం నవాబు లొంగుబాటు ప్రకటన చేశారు.. కానీ కమ్యూనిస్టులు మాత్రం తమ సాయుధ పోరాటాన్ని మరి కొంత కాలం కొనసాగించారు..
ఇది మనకు ప్రధానంగా కనిపిస్తున్న వాస్తవ చరిత్ర.. కానీ రకరకాల భావజాలాల నేపథ్యంలో ఈ చరిత్రకు ఎవరికి తోచిన భాష్యం వారు చెబుతారు.. ఇది హైదరాబాద్ పై భారత్ దురాక్రమణ అని, భారత సైన్యాలు ముస్లింలను హింసించాయని, మరి కొంత కాలం సాగి ఉంటే కమ్యూనిస్టుల సాయుధ పోరాటం విజయవంతం అయ్యేదని.. కొందరి వాదన.. దురదృష్టవశాత్తు హైదరాబాద్ పోరాట గాధ చరిత్ర పుటలకు ఎక్కలేదు.. మన పాఠ్య గ్రంధాలకు ఎక్కకపోవడం వల్ల గత రెండు తరాలకు అవగాహన ఈ చరిత్ర తెలిసే అవకాశం లేకుండాపోయింది.. హైదరాబాద్ విమోచనం అన్నా, తెలంగాణ విమోచనం అన్నా ఒకటే.. విమోచనం, విముక్తి అనే పదాల్లో పెద్దగా తేడా లేదు.. దీన్ని భూతద్దంలో శోధించాల్సిన అవసరం లేదు..
హైదరాబాద్ వాసులకు స్వాతంత్ర్యం వచ్చింది 1948 సెప్టెంబర్ 17న.. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏనాడూ ఉత్సవాలు నిర్వహించిన పాపాన పోలేదు.. కానీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత బొంబాయి(మహారాష్ట్ర), మైసూర్(కర్ణాటక) రాష్ట్రాల్లో కలిసిపోయిన పాత హైదరాబాద్ సంస్థాన భూభాగాలైన మరాఠ్వాడా, హైదరాబాద్ కర్ణాటక  ప్రాంతాల్లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా విమోచన వేడుకలు నిర్వహిస్తున్నాయి.. కానీ హైదరాబాద్ సంస్థానంలోని ప్రధాన భూభాగమైన తెలంగాణలో మాత్రం ఇక్కడి సర్కారు వేడుకలు జరిపేందుకు మొదటి నుండీ జంకుతూ వచ్చింది.. దీనికి కారణం ముస్లింలు నొచ్చుకుంటారనే భయమట.. వాస్తవానికి ఎందరో ముస్లింలు కూడా నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు.. షోయబుల్లాఖాన్, ముక్దుం మొయినుద్దీన్, షేక్ బందగీ.. వీరంతా ఎవరు ముస్లింలు కాదా? హైదరాబాద్ సంస్థానంలో మెజారిటీ ప్రజలు హిందువులు కావడం వల్ల సహజంగానే వారు బాధితులు అనే కోణంలో దీన్ని అర్థం చేసుకోవల్సి ఉంది..

1947 ఆగస్టు 15కి ఎంత ప్రాధాన్యత ఉందో, 1948 సెప్టెంబర్ 17కీ అంతే ప్రాధాన్యత ఉంది.. ఈ రెండు కూడా స్వాతంత్ర్య దినోత్సవాలే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్ స్వాతంత్ర్యం పొందిన సందర్భాన్ని గౌరవించకపోవడం కూడా తెలంగాణ సమస్య మూలాల్లో ఒకటి. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి.. ఇప్పటికైనా సంకుచిత భావాలను వదిలేసి ఈ రోజును తెలుగువారంతా గౌరవించి ఉత్సవాలు జరుపుకోవాల్సిన అవసరం ఉంది.. 




Monday, September 16, 2013

ధర్మో రక్షతి రక్షిత:

ధర్మో రక్షతి రక్షిత: అన్నారు మన పెద్దలు.. ధర్మాన్ని రక్షించాల్సినవారు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఏమవుతుందో ఆలోచించండి..
హిందువులకు అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల-తిరుపతిలో జరుగుతున్న పరిణామాలపై ఎవరూ పెద్దగా దృష్టి పెట్టక పోవడం ఆందోళన కలిగిస్తోంది.. సాక్షాత్తు శ్రీవారి మెట్ల మార్గం సమీపంలోనే ఒక ఇస్లామిక్ యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.. ఇంత జరుగుతున్నా మన పాలకులకు, అధికారులకు చీమ కుట్టినట్లయినా లేదు.. రాజకీయ నాయకులతో నిండిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక వర్గానికి ఇదేమీ పట్టడంలేదు.. సదరు ఛైర్మన్ గారు ఉద్యమాల్లో బిజీగా ఉన్నారు.. మన సోకాల్డ్ సెక్యులర్ ప్రభుత్వానికి హిందువుల మనోభావాలు అంటే గిట్టవు.. కానీ వారు సమర్పించు కానుకలు మాత్రం ఎలా మింగేద్దామా అనే అలోచిస్తుంటుంది..
తిరుమలపై కుట్రలు కొత్తేమీ కాదు. కానీ కొద్ది సంవత్సరాలుగా ఇలాంటి కార్యకలాపాలు ఊపందుకున్నాయి.. ఏడు కొండలపై ఎందరో అన్యమతస్తులు తిష్ట వేశారు.. చాపకింద నీరులా తమ మత ప్రచారం సాగిస్తున్నారు.. అప్పుడప్పుడు అధికారులు వారిని పట్టుకున్నట్లు నటిస్తున్నా, వారికి ఏ శిక్ష విధించకుండానే వదిలేస్తున్నారు.. ఇలాంటి పనులు మధ్యప్రాచ్యంలో జరిగితే ఏం చేస్తారో తెలుసా?.. ఏకంగా మరణ దండనే విధిస్తారు..
గతంలో ఒక ముఖ్యమంత్రి ఏడుకొండలను రెండు కొండలకే పరిమితం చేయబోయి, భక్తుల ఆందోళనతో వెనక్కి తగ్గాడు.. అన్యమత అధికారి ఒకరు తిరుమలపైకి రోప్ వే నిర్మించి పర్యాటక విలాస కేంద్రంగా మార్చాలనే ప్రతిపాదన తెచ్చాడు.. ఒక ఛైర్మన్ గారు ఏకంగా బ్రహ్మోత్సవాల్లో శిలువలనే ప్రతిష్టించబోగా స్థానిక బీజేపీ నాయకులు ఈ కుట్రను భగ్నం చేశారు.. దేశం ఆర్థిక సంక్షోభంలో పడిందని అందుకు బంగారమే కారణమని మొత్తుకుంటున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు శ్రీవారి నగలపై కన్నేశారు.. హిందూ భక్తులు స్వామి వారిపై ప్రేమతో ఇచ్చే కానుకలతో ఈ సెక్యులర్ ప్రభుత్వానికి ఏం సంబంధం? అని అడిగేవారే కరువయ్యారు.. ఇటీవల ఉద్యమం పేరిట టీటీడీ దేవస్థాన సిబ్బంది సైతం భక్తులను అగచాట్లకు గురి చేస్తూ శ్రీవారికి దూరం చేస్తున్నారు.. స్వామి వారు కలలో కనిపించి తనకు విశ్రాంతి దొరుకుతోందని శోకబాబుకు చెప్పాడట.. అన్య మతస్తులు తమ ఆరాధనా కేంద్రాల్లో ఎలాంటి ఆటంకం రాకుండా చూసుకుంటూ, ఉద్యమాల్లో పాల్గొంటున్నప్పుడు హిందూ మతస్తులకే ఎందుకు ఈ తిప్పలు?
తిరుపతిలో ఇస్లామిక్ విద్యాలయం వస్తే తప్పేమిటని కొందరు వ్యక్తులు అడ్డగోలుగా వాదిస్తున్నారు.. అలాంటి అన్యమత కేంద్రాలను తిరుపతి దగ్గరే ఎందుకు పెట్టాలి.. దేశంలో, రాష్ట్రంలో వారికి భూమే కరువైంది.. ఇస్లామిక్ ధార్మిక క్షేత్రాల్లో వేద పాఠశాలలకు అనుమతి ఇప్పిస్తారా? ఇప్పటికే తిరుపతి పట్టణం మద్యం మాఫియా, భూబకాసురలతో కలుషితం అవుతోంది.. తాజాగా పులిమీద పుట్రలా అన్యమత కేంద్రం వస్తోంది..
తిరుమల తిరుపతి అంశంపై పోరాడేందుకు ఇకనైనా మనమంతా మేలుకోకపోతే భవిష్యత్ తరాలు మనను క్షమించవు..

ధర్మో రక్షతి రక్షిత:
 

Friday, September 13, 2013

మనది ఏ జాతి?

మీకు పాస్ పోర్టు ఉందా?.. ఉంటే అందులో మీ జాతీయత (Nationality) ఏమని రాసి ఉంది?..TELUGU అని ఉందా? లేక INDIAN అని ఉందా?.. మీకు పాస్ పోర్టు లేనట్లయితే మీరు ఏదైనా దరఖాస్తు ఫారం నింపేటప్పుడు జాతీయత అనే కాలమ్ వద్ద ఏమని రాస్తారు? తెలుగు అని రాస్తారా? ఇండియన్ (భారతీయ) అని రాస్తారా?..
ఇప్పుడు చెప్పండి మీది ఏ జాతి?.. భారత జాతీయులా? తెలుగు జాతీయులా?.. సరే మీరు భారతీయులే అయితే తెలుగు జాతి అనే పదాన్ని ఎందుకు వాడుతున్నారని ఎప్పుడైనా ఆలోచించారా?..
ప్రపంచంలో మనకు ఏ దేశ పౌరసత్వం ఉంటే ఆ జాతీయులుగా పిలవబడతాం.. ఇదాహరణకు ఇండియన్,  అమెరికన్, రష్యన్, చైనీస్, కొరియన్, పాకిస్తానీ..  కానీ భాష పేరుతో జాతీయత ఉంటుందా? ఒకవేళ భాష పేరుతో జాతీయ ఉంటే మన దేశంలో ప్రభుత్వం గుర్తించిన భాషలు 22 ఉన్నాయి. అంటే 22 జాతులు ఉన్నట్లా.. అలాగే చిన్నా, పెద్ద కలిపి 1,576 భాషలు (1991 జనాభా లెక్కల ప్రకారం) ఉనికిలో ఉన్నాయి.. మరి భారతీయులను అన్ని జాతులుగా గుర్తించాలా?
ప్రతి మనిషికి మాతృభాష (లేదా ఇంటి భాష) ఉంటుంది. తన భాషపై తనకు అభిమానం, గౌరవం ఉండటం సహజం.. ఉండాలి కూడా.. మనం తెలుగు తల్లిని ఏర్పాటు చేసుకొని పూజిస్తున్నాం.. ఇది మనకు గర్వకారణం కూడా.. భాషను తల్లిలా గౌరవించడంలో ఎలాంటి తప్పులేదు.. నేను రాసే, మాట్లాడే భాష అంటే నాకు ఎంతో అభిమానం.. కానీ భాషకు జాతీయతకు ఉన్న స్పష్టమైన తేడాను మనం అర్ధం చేసుకోవాలి..
కొంత కాలంగా (కొన్నేళ్లుగా) తెలుగు జాతి అనే పదాన్ని అతిగా వాడుతున్నారు. అంటే తెలుగు వారు భారతీయులు కాదా? తెలుగు జాతి సమైక్యత, తెలుగు జాతి ఐక్యత, తెలుగు జాతిని చీలుస్తారా? అనే మాటలు వినే ఉంటారు.. మనది భారత జాతీయత అయినప్పుడు తెలుగు జాతిగా చెప్పుకోవడం ఎందుకు? తెలుగు వారిమి అనో లేదా ఆంధ్రప్రదేశ్ వాళ్లం అనో చెప్పుకుంటే తప్పు పట్టాల్సిన అవసరం లేదు.. తెలుగు వారు ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే లేరు. తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో కూడా గణనీయంగా ఉన్నారు.. మని వారి భౌగోళిక సరిహద్దులు, జాతీయత మాటేమిటి? వారి బాగోగులు ఎవరైనా పట్టించుకుంటున్నారా?
పరిపాలన సౌలభ్యం దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉండాలా? లేదా తెలంగాణ విడిపోవాలా అనేది తర్వాత విషయం.. కానీ తెలుగు జాతి విడిపోతుంది అని గగ్గోలు పెట్టడం ఎంత వరకు సమంజసం?.. రాష్ట్రం విడిపోయినంత మాత్రాన మన జాతీయత, దేశం విడిపోయినట్లా? ప్రత్యేక రాష్ట్రం కోరే వారిని దేశ ద్రోహులుగా చిత్రీకరించేందుకు కొందరు రాజకీయ నాయకులు, వ్యక్తులు పడరాని పాట్లు పడుతున్నారు. దీనికి తెలుగు జాతి అనే ముసుగును వాడుకుంటున్నారు.. కొందరు సమైక్యవాదులు తమకు తాము జాతీయ వాదులమని సర్టిఫికెట్ ఇచ్చేసుకుంటున్నారు. జాతి అంటే వారి దృష్టితో తెలుగు జాతా? భారత జాతా? తెలుగు మాట్లాడే వారంతా ఒకే రాష్ట్రంగా ఉండాలని కోరుకునే వారు హిందీ మాట్లాడే వారంతా 9 రాష్ట్రాలుగా ఉన్నారెందుకు అంటే సమాధానం చెప్పలేరు.. అప్పుడు మనది తెలుగు జాతి అంటూ నసుగుతారు..
నావరకైతే నేను భారతీయుడినని సగర్వంగా చెప్పుకుంటాను.. ముందు భారతీయుడిని, ఆ తర్వాతే తెలుగువాడిని.. ఇవాళ ఆంధ్రప్రదేశ్ వాన్ని.. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక తెలంగాణ వాడిని.. తెలుగు నా మాతృభాష అని గర్వపడతాను.. నా దేశాన్ని, నేను నివసించే ప్రాంతాన్ని అమితంగా ప్రేమిస్తాను.. మరి మీరు ఏమిటో మీరే నిర్ణయించుకోండి..

(Note: ఇంత కాలం దేశ సమైక్యత గురించి పట్టించుకోకుండా, ఇప్పడు తెలుగు జాతి సమైక్యత అంటూ రాగాలు అందుకున్న కొందరు నా మిత్రులకు సమాధానంగా..)

Wednesday, September 11, 2013

ప్రధాని ఓ డమ్మీ..

అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట మరోసారి దిగజారింది.. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఓ డమ్మీ అని, దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థను సరిదిద్దడంలో విఫలమయ్యారని తాజాగా న్యూయార్క్ టైమ్ పత్రిక విమర్శించింది.. భారత్ పరిస్థితి మరీ దుర్భరంగా ఉందని మన్మోహన్ దుర్భర నాయకుడని, అసలు అధికారాలు సోనియా గాంధీ చేతిలో ఉన్నాయని వ్యాఖ్యానించింది.. కొద్ది నెలల క్రితం టైమ్పత్రిక మన్మోహన్ సింగ్ పై విఫలుడు అనే ముద్ర వేసింది.. ఇప్పడు న్యూయార్క్ టైమ్స అదే విధంగా రాసింది.. ఈ విషయాలన్నీ భారతీయులకు కొత్త కాదు.. అయితే అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి చర్చ జరగడం వల్ల భారత దేశ ప్రతిష్ట ఎంతగా మసగబారుతోందో ఆలోచించండి..

Tuesday, September 10, 2013

లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ చనిపోయినప్పుడు మహాకవి కాళోజీ నారాయణ రావు ఎంత చక్కగా చెప్పారో చూడండి..(కాళోజీ శత జయంతి సందర్భంగా)

Monday, September 9, 2013

ఆయన జీవితం తెరచి ఉంచిన పుస్తకం..  స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు, ప్రజాస్వామ్యవాది, సామాజిక ఉద్యమకారుడు, అన్నించిటికీ మించి గొప్ప కవి.. ఆయనే కాళోజీ.. కాళోజీ నారాయణ రావు శత జయంతి ఈ రోజు.. ఆ మహోన్నత వ్యక్తిని స్మరించుకుందాం..
ఓ దేవాదిదేవా.. గణనాధా..ఈ వినాయక చవితి రోజు నుండి మా అందరికీ సద్బుద్ధి కలిగించు.. మా మనసుల నుండి కల్మషాలను తొలగించు.. మంచి ఆలోచనలు కలిగించు.. మంచి స్నేహితులను ప్రసాదించు..
తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతం ఏవైనా మనమంతా భారతీయులమనే భావన కల్పించు.. నూతనంగా ఏర్పడే తెలంగాణ, సీమాంధ్ర ప్రజలందరికీ సుఖ శాంతులు కలగాలని మనసారా కోరుకుంటున్నాను..
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు..

Saturday, September 7, 2013

Thursday, September 5, 2013

ఇదేనా సమన్యాయం?..

ఒకరిని అనుమతి, మరొకరికి నిరాకరణ ఇదేనా సమన్యాయం?.. సెప్టెంబర్ 7వ తేదీన హైదరాబాద్ నగరంలో ఏపీఎన్జీవోలు సభ పెట్టుకోవచ్చట, తెలంగాణ వాదులు శాంతి ర్యాలీ జరపొద్దట.. ఇదెక్కడి న్యాయం?.. ఇస్తే ఇద్దరికీ అనుమతి ఇవ్వండి. లేదంటే ఇద్దరికీ వద్దని చెప్పండి.. ఎవరు ముందు అనుమతి కోరారన్నది ముఖ్యం కాదిక్కడ.. ఆ మాటకు వస్తే లాల్ బహద్దూర్ స్టేడియంలో క్రీడల నిర్వహణ కోసం ఏపీఎన్జీవోలకన్నా ముందే అనుమతి కోరిన వారికి శాప్ అందుకు ఇవ్వలేదు అనుమతి..
రాష్ట్ర ముఖ్యమంత్రి, అధికార పార్టీ అధ్యక్షుడు తమ హోదాలను గుర్తెరిగి తెలంగాణ, సమైక్యవాదులను సమదృష్టితో చూడాలి.. కానీ వారు తమ ప్రాంతీయ ఆకాంక్షల పేరిట సమైక్యవాదానికి వత్తాసు పలుకుతూ, తమ అధిష్టానం నిర్ణయాన్ని ఎదురిస్తున్నారు.. ఈ కారణం వల్లే తెలంగాణ వాదుల సభకు అనుమతి ఇవ్వకుండా సమైక్యవాదులకే అవకాశం ఇచ్చారు.. ఈ విషయం మెడ మీద తలకాయ ఉన్నోళ్లందరికీ తెలుసు..
ప్రజాస్వామ్యంలో సభలు, ప్రదర్శనలు జరుపుకొని తమ భావజాలాన్ని ప్రచారం చేసుకునే హక్కు అందరికీ ఉంది.. అదే సమయంలో శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లే పరిస్థితి ఉంటే అనుమతి నిరాకరించే హక్కు ప్రభుత్వానికీ ఉంది.. కాని పక్షపాతం చూపడం ఎందుకు? తెలంగాణ వాదుల వల్ల శాంతి భద్రతలకు హాని, సమైక్యవాదుల వల్ల శాంతి భద్రతలకు మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోందా? అదే నిజమైతే ధైర్యంగా ఇదే విషయం చెప్పండి..

Sunday, September 1, 2013

ఉధృతంగా సాగుతున్న తమ ఉద్యమాన్ని జాతీయ మీడియా పట్టించుకోవడం లేదని కొందరు సీమాంధ్ర మిత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. జాతీయ మీడియా ప్రాధాన్యాలే వేరుగా ఉంటాయి.. ఢిల్లీ గల్లీలో వాన పడ్డా వారికి పెద్ద వార్త.. కానీ ఆంధ్ర ప్రదేశ్ వార్తలు వారికి టీఆర్పీ, సర్క్యలేషన్ పరంగా గిట్టుబాటు కావు.. ఆ మాటకు వస్తే తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న కాలంలో జాతీయ మీడియా ఈ మాత్రం కూడా పట్టించుకోలేదు.. కానీ రాష్ట్ర విభజన వార్తలకు మాత్రం విశేషంగా ప్రాధాన్యత ఇచ్చింది..