Saturday, September 28, 2013

దళపతి కుట్రదారు కారాదు..

కొద్ది రోజుల క్రితం ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహా చేసిన వ్యాఖ్య గుర్తుకొచ్చింది.. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ చూసిన తర్వాత..
ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు చూసిన తర్వాత సమైక్యవాదులు, ఆయన అభిమానులు చంకలు గుద్దుకొని సంబరపడితే.. తెలంగాణ వాదులు మండిపడ్డారు.. సరే కిరణ్ కుమార్ రెడ్డి తన ప్రాంతీయ ఆకాంక్షలతో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడి ఉండొచ్చేమో.. కానీ ఆయన మాట్లాడిన తీరు మాత్రం వివేకవంతంగా లేదని చెప్పక తప్పదు.. సీఎం గారు చెప్పిన విషయాల్లో అవాస్తవాలు, వక్రీకరణలే ఎక్కవ కనిపించాయి..
ఆంధ్రప్రదేశ్ 1956లో ఏర్పడింది.. పొట్టి శ్రీరాములు గారు మరణించే నాటికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడలేదు.. ఆయన మద్రాసుతో కూడిన ఆంధ్ర రాష్ట్రం కోసం అమరజీవి అయ్యారు.. కానీ ఆయన కోరిక నెరవేరలేదు.. చరిత్ర అంత వరకే చెబుతుంది. కానీ ఆంద్రప్రదేశ్ తో పొట్టి శ్రీరాములుకు ఎక్కడ సంబంధం ఉంది?
సర్దార్ వల్లభాయి పటేల్ హైదరాబాద్ సంస్థాన విమోచనలో కీలక పాత్ర పోషించి, తెలంగాణ ప్రజలకు హీరోగా కనిపిస్తున్నారు.. ఆయన చనిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.. ఈ వ్యవహారంలో ఆయన పాత్ర ఉన్నట్లు చరిత్రలో ఎక్కడా కనిపించలేదు..
ఇక నాటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ విషయానికి వస్తే.. ఆంధ్ర-తెలంగాణలు కలిసి ఉండలేని పరిస్థితి లేకపోతే భవిష్యత్తులో విడిపోవచ్చని చెప్పిన విషయం ముఖ్యమంత్రిగారు ఎందుకు దాచారు?
ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పడు ఇరు ప్రాంతాల నాయకుల మధ్య కుదిరిన పెద్ద మనుషుల ఒప్పందం అమలు కాకుండా నిర్వీర్యమైన విషయంలో కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కమాటైనా మాట్లాడారా?
రాష్ట్రం విడిపోతే జలయుద్దాలు ఏర్పడతాయని సీఎం గారు భయపెడుతున్నారు.. మరి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు ఏమాత్రం న్యాయం చేశారు? కృష్ణానదిపై నాగార్జున సాగర్ ఆనకట్ట కట్టినప్పడు కుడి కాలువ ముందుగా కట్టుకొని ఆంధ్రా ప్రాంతాన్ని సస్యశ్యామంలం చేసుకోవడం.. చాలా ఏళ్ల వరకు కూడా ఎడమ కాలువ కట్టకుండా తెలంగాణ జిల్లాలకు అన్యాయం చేయడం నిజం కాదా? పక్కనే కృష్ణమ్మ పారుతుంటే తాగు, సాగు నీరు అందక పాలమూరు, నల్లగొండ జిల్లాలు కరువు, ఫ్లోరోసిస్ సమస్యతో బాధ పడటం అబద్దమా? మ్యాపు ముందేసుకొని వివరించిన కిరణ్, ఈ విషయాలను ఎందుకు దాచారు?
తెలంగాణ ప్రాంతానికి న్యాయంగా రావాల్సిన ఉద్యోగాలను సీమాంధ్రులు అక్రమంగా పొందారని గిర్ గ్లానీ కమిషన్ స్పష్టంగా చెప్పింది.. అంతకు ముందు ఎన్టీరామారావు ఈ అన్యాయాన్ని సరిదిద్దేందుకు 610 జీవో తెచ్చారు.. గత సీఎంలంతా దీన్ని నిర్లక్ష్యం చేశారు.. మరి మీరు ముఖ్యమంత్రిగా వచ్చాక, తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన సమయంలో అయినా న్యాయం చేసే ప్రయత్నం చేశారా?..
తెలంగాణ- సమైక్యాంధ్ర ఉద్యమాలు ఉధృతంగా ఉండి, రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ గారు హుందాగా ఉండాలి.. ఇరు ప్రాంతాలను సమదృష్టితో చూడాలి.. కానీ తాను సమైక్య రాష్ట్ర సీఎంను అని చెప్పుకుంటూనే ఒక ప్రాంత ప్రజల పక్షానే వఖాల్తా పుచ్చుకొని, మరో ప్రాంత ప్రజ ఆకాంక్షలను నిర్లక్ష్యం చేయడం ఏ విధమైన న్యాయం?
రాష్ట్ర విభజనపై నిర్ణయం అయిపోయిన తర్వాత ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయడంపై దృష్టి పెట్టాల్సిన ముఖ్యమంత్రిగారు తన పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించడం ద్వారా తన సొంత ప్రాంతలో హీరో కావచ్చేమో.. కానీ మరో ప్రాంతంలో మాత్రం విలన్ అయిపోయారనే సంగతిని మరువరాదు..
అందుకే ఉప ముఖ్యమంత్రి అన్నారు.. దళపతి కుట్రదారు కారాదు.. అని.

No comments:

Post a Comment