Tuesday, September 24, 2013

బెస్ట్ జోక్ ఆఫ్ ది ఇయర్ 2013..

ఈ మధ్య బొత్తిగా హాస్యానికి మొహం వాచిపోయాను.. టీవీ ఆన్ చేసినా, పేపర్ తిరగేసినా కనిపిస్తున్న వార్తలు చిరు నవ్వులను సైతం దూరం చేస్తున్నాయి.. కానీ ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త చూసి బలవంతపు నవ్వు తెచ్చిపెట్టుకున్నాను (శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో పరేష్ రావెల్ మాదిరి)..
తెలంగాణ వాళ్లు హైదరాబాద్ వదిలేసి పోవాలట.. నిజాం పాలన బానిస బతుకుల నుండి విముక్తి కలిగించారట.. కరెంటును, నీళ్లనూ, అభివృద్దిని వాళ్లే తెచ్చారట.. అశోక బాబు గారు వ్యక్తులను(నాయకులను) టార్గెట్ చేసి ఈ వ్యాఖ్యలు చేశారా? లేక తెలంగాణ ప్రజలనే ఎగతాలి చేస్తున్నారా అనే అనుమానంతో టీవీలో ప్రసారమైన ఆయన ప్రసంగ టేప్ రీ ప్లే చేసి చూశారు.. ఆయన నాయకులనే కాదు యావత్తు తెలంగాణ ప్రజలను అపహాస్యం చేశారని అర్థం అయ్యింది..
అయ్యా అశోక బాబు గారూ.. నిజాం పాలన నుండి విముక్తి కలిగించింది మీరు కాదు.. మీ తాతలు కాదు.. ఇక్కడి ప్రజలు పోరాడి స్వాతంత్ర్యం తెచ్చుకున్నారు.. నిరంకుశ పాలన వదిలించుకొని భారత దేశంలో కలిసిపోవాలని కోరుకున్నారు.. కానీ పెనంలోంచి పొయ్యిలో పడ్డట్లయింది తెలంగాణ పరిస్థితి..
హైదరాబాద్ నగరాన్ని అభివృద్ది చేసిన సత్తా ఉన్న మీరు మీ డేరాబాద్ (కర్నూలు)ను ఎందుకు వదులుకున్నారు.. మద్రాసును ఎందుకు వదులుకొని పొట్టి శ్రీరాములు అమరత్వాన్ని వృధా చేశారు?.. అప్పటికే అన్ని వనరులు ఉన్నందునే కదా హైదరాబాద్ పై ఆంధ్రా నాయకులకు కన్ను పడింది.. ఈ వాస్తవాన్ని ఎందుకు తక్కి పెడతారు.. మీరు హైదరాబాద్ రావాలంటే మహబూబ్ నగర్, నల్లగొండ లేదా ఖమ్మం జిల్లా మీదుగా రావాల్సిందే.. సీమాంధ్ర సరిహద్దులు హైదరాబాద్ నగరానికి 200 కి.మీ.పైనే.. రేపు ఉమ్మడి రాజధానిగా ఉన్నా మీరు అంత దూరం నుండి ఫ్లై ఓవర్ కట్టుకొని రాలేరు. (జనం సొమ్ము, తేరగా వచ్చిన అవినీతి సొమ్ము ఉన్నవారు ఫ్లైట్లో రావచ్చు.. అది వేరే విషయం..
నాయనా అశోక్ బాబూ.. హైదరాబాద్ కు కృష్ణా జలాలు వస్తున్నది నల్గొండ జిల్లా నుండి.. కృష్ణా నది బంగాళా ఖాతం నుండి సీమాంధ్ర మీదుగా తెలంగాణలోకి రావడం లేదు.. మహారాష్ట్ర, కర్ణాటకల మీదుగా తెలంగాణ భూభాగంలోని పాలమూరు, నల్గొండ జిల్లాల మీదుగా సీమాంధ్రకు కృష్ణానది పారుతోంది.. ముందు ఆ విషయం తెలుసుకో.. సీమాంధ్రలో విద్యుత్ ఉత్పత్తి అవుతున్నది సింగరేణి బొగ్గు వల్లే.. సింగరేణి బొగ్గు గనులు ఎక్కడున్నాయో అట్లాసులో చూసుకో..
తెలంగాణ వారికి మీరు పదవులు ఇస్తారా? వద్దులే శోక బాబు మీరు వెళ్లిపోతే మేమే పాలించుకుంటాంలే.. మీ ఎంగిలి మెతులకులు వద్దు.. మా తిండి మేం తింటాం.. ఆంద్రప్రదేశ్ అంటే 23 జిల్లాలు కేవలం 13+1 జిల్లాకే కమిటీలు ఉన్న మీ ఏపీఎన్జీవోల సంఘం సమైక్యాంధ్రకు ఎలా ప్రతినిధి కాగలదు.. ముందు మిగతా జిల్లా(తెలంగాణ)లకు కమిటీలు వేసుకొని మాట్లాడండి..

తెలంగాణ నాయకులు రెచ్చగొట్టే పదజాలం వాడి సీమాంధ్రులను కించపరుస్తున్నారని గగ్గోలు పెట్టే మీరు ఇప్పడు చేస్తున్న పనేమిటి? ఎంతో సంయమనంతో ఉన్న నాబోటి వారికే మీ మాటలు విని గుండెలు మండాయంటే, ఇతర తెలంగాణ ప్రజల పరిస్థితి ఏమిటి? అందుకే కోపాన్ని దిగమింగుకొని మీ మాటలు బెస్ట్ జోక్ ఆఫ్ ఇయన్ 2013 అని సరి పెట్టుకుంటున్నా.. మీ హిందూపురం రంకెలకు తెలంగాణ ప్రజలు భయపడుతారనే భ్రమలు వదులుకో అశోక బాబూ.. 

No comments:

Post a Comment