Sunday, April 30, 2017

విజయాన్ని కాపాడుకోవాలి..


జీవితం అంటేనే ఒక ఇక సమర భూమి.. కష్ట సుఖాలు మన శత్రు మిత్రులు.. కష్టమనే శత్రువుతో నిరంతరం పోరాడుతూ ఉండాలి..
పోరాటంలో కొన్నిసార్లు ఓడిపోతాం.. ఈ ఓటమే శాశ్వతం అని కృంగిపోవద్దు.. అలాగే విజయం సాధించిన వాడు ఆ గెలుపే శాశ్వతం అని మురిసిపోవద్దు.. 
ఓడినవాడు విజయం కోసం తిరిగి పోరాటం మొదలు పెట్టాలి.. అలాగే గెలిచినవాడు ఆ విజయాన్ని శాశ్వతంగా నిలుపుకోవడానికి ప్రయత్నించాలి.. విజేతకు అసలైన సవాలు ఇక్కడే.. ఈ ప్రయత్నం చేసినవాడు చరిత్రలో నిలచిపోతాడు..
- క్రాంతి దేవ్ మిత్ర 
(వివేక వాణి స్పూర్తితో)

కేజ్రీవాల్ కు చెంపపెట్టు

అసలే తిక్క.. దానికో లెక్క కూడా లేదు.. బాసలెన్నో చేసి ఆశలు పెంచాడు.. అవన్నీ అడియాశలైపోయాయి.. ఈయన అరవింద కాదు, గురవింద అని తెలుసుకున్నారు హస్తిన జనం.. ఎంసీడీ ఎన్నికల్లో చెంప పెట్టులాంటి తీర్పు ఇచ్చారు..

ఏదో చేస్తానని వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ.. ఊకదంపుడు ఉపన్యాసాలు, వాగ్దానాలు ఇచ్చేసింది.. కొత్త పార్టీపై ఢిల్లీ ప్రజలు ఆశలు పెట్టుకొని అసెంబ్లీ ఎన్నికల్లో కనీవినీ ఎరుగనంత మెజారిటీతో అధికారం అప్పగించారు.. కానీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసింది ఏమిటి? పరిపాలన గాలికి వదిలేసి ఎప్పుడూ ప్రధానమంత్రి మోదీని ఆడిపోసుకోవడం.. ఆయన విద్యార్హతలు ఏమిటా అని ఆరా తీయడం.. కేంద్రం, లెఫ్టినెంట్ జనరల్ సహకరించడం లేదంటూ గిల్లీ కజ్జాలు పెట్టుకోవడం.. ఢిల్లీ గల్లీల్లో జనం గోడును పక్కన పెట్టి జాతీయ, ఇతర రాష్ట్రాల రాజకీయాల్లో తల దూర్చడం..
రాజకీయాలను ప్రక్షాళన చేస్తానంటూ వచ్చిన ఆమ్ ఆద్మీ మంత్రులు, ఎమ్మెల్యేల్లో చాలా మందికి నేర చరిత ఉండటం, కేసుల్లో ఇరుక్కోవడం చూస్తుంటే వారి స్వచ్ఛత ఏపాటిదో అర్థమవుతోంది..ఇది ఆప్ కాదు, పాప్ అని హస్తినవాసులకు అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు.. అందుకే ఎంసీడీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయం.. భాజపా విజయకేతనం..
ఇంత జరిగినా కేజ్రీవాల్ లో మార్పు రాలేదు.. తప్పంతా ఈవీఎంలదే అంటూ అరగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డును మళ్లీ వినిపిస్తున్నాడు.. హుమ్.. మారడు గాక మారడీయన (27.04.17)

సోషల్ మీడియా విశ్వసనీయత కోల్పోవద్దు..

దున్నపోతు ఈనింది అని ఒకడు అంటే, దూడను కట్టేయండ్రా అంటూ స్పందించాడట మరొకడు..
ప్రస్తుతం సోషల్ మీడియా తీరు ఇలాగే ఉంది.. రాందేవ్ బాబా విషయంలో ఇప్పుడు జరిగింది ఇదే.. వార్త నిజమా కాదా అని తెలుసుకునే ప్రయత్నం చేయకుండానే ఎవరో మార్ఫింగ్ చేసి పంపిన ఫోటోలను గుడ్డిగా ఫార్వర్డ్ చేసేశారు.. చివరకు వాస్తవం తెలుసుకొని నాలిక కరచుకున్నారు.. 
ఇలాంటి కారణాలు చూపించే ప్రభుత్వాలు సోషల్ మీడియాను కంట్రోల్ చేయాలంటూ కారాలు మిరియాలు నూరుతుంటాయి.. సోషల్ మీడియాకు స్వీయ నియంత్రణ ఆవశ్యకతను ఈ ఘటన గుర్తు చేస్తుంది..
26.04.2017

Thursday, April 20, 2017

చైనాకు బుద్ధి చెప్పాల్సిందే..

ఓ మోతుబరి ఆసామి పక్కనే ఉన్న చిన్న రైతు పొలాన్ని ఆక్రమించాడు.. ఆ తర్వాత దాని పక్కన ఉన్న మరో ఆసామి పొలంపై కన్నేశాడు.. పొలం గట్ల దగ్గర వివాదం సృష్టించి, అవి తనవేనని చాటుకొని పెత్తనం చేస్తున్నాడు..
చైనా తీరు కూడా ఇలాగే ఉంది.. అన్యాయంగా స్వతంత్ర టిబెట్ దేశాన్ని అక్రమించి కలిపేసుకుంది.. టిబెట్ ను ఆనుకొని ఉన్న భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ భూభాగాలు తనవేనని దబాయిస్తోంది.. అవి దక్షిణ టిబెట్ లోని భాగాలని దబాయిస్తోంది.. అసలు టిబెట్టే చైనాది కానప్పుడు, ‘దక్షిణ టిబెట్’ అనే వాదనలో పస ఉందా?.. ఇక్కడే భారత్ ఇరకాటంలో పడుతోంది..
1949లో టిబెట్ పై దురాక్రమణ చేసి ఆక్రమించినప్పుడు అందరికన్నా ముందు సమర్ధించి, చైనాకు దానిపై హక్కును గుర్తించింది జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని భారత ప్రభుత్వమే..  ‘హిందీ-చీనీ భాయ్ భాయ్’ అంటూ చైనాతో మైత్రి చైశారు నెహ్రూ. మరోవైపు తాను శాంతి దూతగా పేరు తెచ్చుకోవలని తపనతో దలైలామాకు భారత్ లో ఆశ్రయం ఇచ్చారు నెహ్రూ..
ఈ ద్వంద్వ విదేశాంగ నీతే భారత్ ప్రయోజనాలకు ముప్పుగా మారింది. భారత్ తో చైనా యుద్దం, జమ్మూ కశ్మీర్ లోని అక్సాయ్ చిన్ దురాక్రమణ, అరుణాచల్ ప్రదేశ్ వివాదం.. భారత్ లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ కు బహిరంగంగా బాసటగా నిలిచింది చైనా వీటన్నింటికీ నెహ్రూ విధానాలే వారసత్వ శాపంగా కొనసాగుతున్నాయి..

ఇప్పటి వరకూ ఉన్న ప్రభుత్వాలన్నీ చైనాను దారిలో పెట్టలేకపోయాయి.. కనీసం నరేంద్ర మోదీ ప్రభుత్వమైనా చైనాతో మనకు ఉన్న సమస్యను పరిష్కరిస్తుందని ఆశిద్దాం..

పెద్దవాడివైతే ప్రయోజనం ఏమిటి?

' నీవు అందరికన్నా పెద్దవాడినని మురిసిపోతే ఏం ప్రయోజనం.. ఖర్జుర చెట్టు ఎత్తుగా ఉంటుంది. దాని నీడ ఎవరికీ అందదు.. పండ్లు కూడా ఎంతో ఎత్తులో ఉంటాయి..' - సంత్ కబీర్
కొందరు అందరికన్నా తాము ఉన్నతులం అని, ఎంతో ఎదిగి పోయామని మురిసిపోతారు.. తోటి వారి కష్ట సుఖాలను పట్టించుకోరు.. ఇలాంటి ఎదుగుదల వారి మానసిక ఆనందానికి పనికి వస్తుందేమో కానీ, సమాజానికి వీరి వల్ల ఉపయోగం ఏమిటి?..

Wednesday, April 19, 2017

అర్థం మారిన లౌకికవాదం

'మతతత్వం' అనే పదానికి అర్థం మారిపోయింది..
మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తే 'మతతత్వం'..
మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వడాన్ని సమర్థిస్తే 'లౌకికవాదం'

Monday, April 17, 2017

ఈ రిజర్వేషన్లు న్యాయమేనా?

మన సమాజానికి అన్నింటికన్నా మొదటి శత్రువు పేదరికం.. ఆ తర్వాతే ఏదైనా.. సమాజంలో సామరస్య వాతావరణం నెలకొని అందరూ సుఖ సంతోషాలతో జీవించేలా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది.. దురదృష్టవశాత్తు మన నాయకులు ఓటు బ్యాంకు రాజకీయాలతో సమాజంలో చిచ్చు పెడుతున్నారు..

కుల రహిత సమాజ నిర్మాణం కోసం కలలు కన్న బాబాసాహెబ్ సామాజిక న్యాయం కోసం పరిమిత కాలం పాటు రిజర్వేషన్లు ఉండాలన్నారు.. కానీ ప్రభుత్వాలు, పార్టీలు తమ ప్రయోజనాల కోసం పదే పదే పొగిస్తూ పోతున్నాయి.. కొత్తగా మరికొన్ని వర్గాలను చేరుస్తూ ఇప్పటికే జాబితాలో ఉన్న వారితో ఘర్షణ పూరిత వాతావరణం కల్పించారు. వీరి కుఠిల విధానాలు, ఓటు బ్యాంక్ రాజకీయాల కారణంగా రిజర్వేషన్ల ప్రక్రియ మొత్తం ప్రమాదంలో పడింది..  వాస్తవానికి నేటికీ రిజర్వేషన్ ఫలాలు అందని అర్హుత గల కులాలు, వ్యక్తులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.. వారి ఓట్లకు పెద్దగా విలువ లేదేమో?. ఎవరికీ వారి గోడు పట్టదు..
మరోవైపు ఇప్పటికే రిజర్వేషన్ల ద్వారా లబ్ది పొందిన వారు కొత్తగా మరికొందరు జాబితాలో చేరడాన్ని ఇష్టపడటం లేదు.
వాస్తవానికి రిజర్వేషన్ల కారణంగా సామాజిక స్థితి మారుతుంది అనే వాదన అవాస్తవం అని ఇప్పటి వరకూ ఉన్న అనుభవాలు చెబుతున్నాయి.. సమాజంలో కులతత్వం తగ్గక పోగా మరింత బలపడుతోంది.. కులాన్ని వదులుకుంటే రిజర్వేషన్ పోతుంది అనే భయమే ఇందుకు కారణం.. పరిస్థితి ఇలాగే కొనసాగితే బాబాసాహెబ్ ఆశించిన కుల రహిత సమాజ నిర్మాణం ఎప్పటికి సాధ్యం అవుతుంది?
తాజాగా తెలంగాణలో మత ప్రాతిపదికన రిజర్వేషన్ల చిచ్చు మొదలైంది.. ఆ మతం వారికి సామాజిక, ఆర్థిక న్యాయం కోసమే అని ప్రభుత్వ వాదన.. ప్రభుత్వం చూపిస్తున్న కారణాలు కేవలం ఒక మతంలో మాత్రమే లేవు అన్నది కఠిన వాస్తవం.. మరి ఎందు కోసం ఈ రిజర్వేషన్లు?..
ఇప్పటికే మన సమాజం కుల మతాల కుంపటితో రగిలిపోతోంది. మత ప్రాతిపదికన రిజర్వేషన్ కారణంగా మత మార్పిడులు మొదలైతే ఎంత ప్రమాదమో ఆలోచించారా?.. ఇప్పుడు ఈ వ్యాసం మొదటికి వద్దాం..
అన్ని మతాలు, కులాలకు మొదటి శత్రువు పేదరికమే.. పేదరికానికి కుల మతాలు లేవు.. అన్ని కులాలు, మతాల్లోని పేదలను గుర్తించి వారికి రిజర్వేషన్లు ఇవ్వాలి.. వారి కుటుంది ఆర్థిక స్థితి మారగానే రిజర్వ్ కేటగిరీ ఎత్తివేసి ఇతర పేదలకు ఇవ్వాలి.. ఆధార్ అనుసంధానం అమలవుతున్న ఈ రోజుల్లో అర్హులైన పేదలకు గుర్తించడం కష్టమేమీ కాదు.. ఇప్పుడు అమలవుతున్న రిజర్వేషన్లను పూర్తిగా ఎత్తేయలని నేను కోరుకోవడం లేదు.. ఇవి ఆయా సామాజిక వర్గాల్లోని పేదలకు మాత్రమే చెందేలా చూడాలి.. ధనికులకు రిజర్వేషన్ సదుపాయాన్ని తొలగించాలి..
నిజమైన సామాజిక న్యాయం, వివక్ష లేని సమాజం ఏర్పడాలనే తలంపు ఉన్న వారంతా ఇందు కోసం పోరాడాలి.. మనం కుల మతాల కోణాలు వదిలేసి భారతీయులుగా ఆలోచిద్దాం..
స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ఆనాటి సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు.. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, బడుగు బలహీన వర్గాల సామాజిక-ఆర్థిక-రాజకీయ అభివృద్ధి ఈ రిజర్వేషన్ల లక్ష్యం.. రిజర్వేషన్ల కారణంగా కోట్లాది మందికి సామాజిక న్యాయ ఫలాలు అందాయి ఆనండంలో ఎలాంటి అనుమానం లేదు..

సంఘంతో బాబాసాహెబ్ అనుబంధం

ఈరోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు చెప్పుకుంటూ కొన్ని సంఘాలు, సంస్థలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, పరివార్ సంస్థలపై విమర్శలు, దాడులు చేస్తున్నాయి.. నిజానికి అంబేద్కర్ సంఘంలో మంచి సంబంధాలను నెరిపారు..
బాబాసాహెబ్ కు ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ తో మంచి పరిచయం ఉంది.. 1939 ఏప్రిల్ 21వ తేదీన పూణేలో జరిగిన సంఘ శిబిరాన్ని సందర్శించారు.. అక్కడ స్వయం సేవకులు ఎలాంటి అస్పృశ్యతను పాటించకుండా కలిసి మెలిసి ఉండటం చూసి ఆనందం వ్యక్తం చేశారు..  ఈ సందర్భంగా అంబేద్కర్‘అస్పృశ్య వర్గాల ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యలు- హిందూ సమాజం బాధ్యత’అన్న అంశంపై  ప్రసంగించారు.

మరో సందర్భంలో ఆర్‌ఎస్‌ఎస్‌. సంక్రాంతి ఉత్సవానికి కూడా అంబేద్కర్ హాజరయ్యారు. సామాజిక సమత నిర్మాణం,అస్పృశ్యతా నిర్మూలనకు సంఘం చేస్తున్న ప్రయత్నాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.1956లో అంబేద్కర్ బౌద్ధ ధర్మాన్ని తీసుకునే సమయంలో ఆర్ఎస్ఎస్ నాయకులు మోరోపంత్‌ పింగళే, దత్తోపంత్‌ ఠేంగ్డీ లు కలిసారు. వారితో తాను బౌద్ధధర్మం తీసుకోవడానికి గల కారణాలను బాబాసాహెబ్ చర్చించారు.  ‘సంఘం చేస్తున్న పని నాకు తెలుసు, దేశంలో జనాభా పెరుగుతున్న వేగంతో పోలిస్తే సంఘం పెరుగుదల వేగం తక్కువగా ఉంది. నేను పెద్దవాణ్ణి అయ్యాను. ఆగ్రహంతో, అసంతృప్తితో ఉన్న దళిత అనుచరులకు నేనుండగానే సరియైన మార్గాన్ని చూపాలి. అందుకే బౌద్ధ ధర్మాన్ని స్వీకరిస్తున్నాను’ అని వివరించారు.

Friday, April 14, 2017

అంబేద్కర్ ను అర్థం చేసుకుందాం..

డాక్టర్ భీంరావ్ రాంజీ అంబేద్కర్
ఆధునిక భారత దేశ చరిత్రను ప్రభావితం చేసిన మహనీయుల్లో అగ్రగామి.. స్వతంత్ర భారత దేశ తొలి న్యాయశాఖ మంత్రి, భారత రాజ్యాంగ నిర్మాత, అణగారిన వర్గాల హక్కులు, అభ్యున్నతి కోసం పోరాడిన యోధుడు, స్వాతంత్రోద్యమ నేత, గొప్ప దేశ భక్తుడు, న్యాయవాది, సామాజిక శస్త్రవేత్త, చరిత్రకారుడు, రచయిత, ఉపన్యాసకారుడు.. ఇలా ఎంత చెప్పినా తక్కువే..
మహర్ కుటుంబంలో పుట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్నప్పటి నుంచే పేదరికంకన్నా ఎక్కువగా అంటరానితనం, కుల వివక్షను ఎదుర్కొన్నారు.. సమాజంలో అడుగడుగునా అవమానాలు భరిస్తూనే ఎంతో పట్టదలతో ఉన్నత చదువులు చదివారు.. భారత దేశం బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందేందుకు పోరాటం తీవ్రవైన రోజులు అవి.. స్వాతంత్ర్యంతో పాటు అస్పృశ్యతకు వ్యతిరేకంగా అదే స్థాయి ఉద్యమం జరగాలని భావించారు అంబేద్కర్.. అంటరానితనానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉద్యమం చేపట్టారు. సమాజంలో అణగారిన వర్గాల హక్కులు, సంక్షేమం కోసం పోరాడారు..
స్వతంత్ర భారత దేశ తొలి న్యాయ శాఖమంత్రిగా, రాజ్యాంగ పరిషత్ ఛైర్మన్ బాధ్యతలు నిర్వహించారు బాబాసాహెబ్. ప్రపంచ దేశాల రాజ్యాంగాలన్నింటినీ అధ్యయనం చేసి మన దేశానికి అత్యుత్తమ రాజ్యాంగాన్ని అందించేందుకు విశేషంగా కృషి చేశారు. చదువు, ఉద్యోగం, రాజ్యాధికారం మాత్రమే అణగారిన వర్గాల కష్టాలను తీర్చేందుకు పరిష్కారం అని భావించిన అంబేద్కర్ రిజర్వేషన్లను పొందుపరిచారు.. హిందూ సమాజానికి రాచపుండులా దాపురించిన కుల వ్యవస్థను నిర్మూలించేందుకు జీవితాంతం పోరాడారు.. హిందూ మతాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్న అంబేద్కర్ విదేశీ మతాలను అవలంభించేందుకు తిరస్కరించారు.. జీవిత చరమాంకంలో బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారు..
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భౌతికంగా దూరమై ఎన్నో ఏడు దశాబ్దాలు గడచినా, ఆయన రగిలించిన స్పూర్తి ఇంకా కొనసాగుతోంది.. బడుగు బలహీన వర్గాలు తమకు న్యాయంగా దక్కాల్సిన హక్కుల కోసం పోరాడి సాధించుకుంటున్నాయి.. కానీ ఎక్కడో లోపం జరుగుతోంది.. ఈ రోజున బాబాసాహెబ్ పేరును దుర్వినియోగం చేస్తున్నవారు పెరిగిపోయారన్నది నిజం..
రిజర్వేషన్లు పరిమిత కాలం ఉండాలని అంబేద్కర్ భావించారు.. కానీ ప్రస్తుత నాయకులు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రిజర్వేషన్లను తాయిలంగా మార్చేశారు.. రిజర్వేషన్లను పొడగిస్తూ పోతున్నారు.. ఇవి కొన్ని వర్గాలకు పరిమితం అవుతున్నాయి.. దక్కిన వారే మళ్లీ మళ్లీ పొందుతున్నారు. రిజర్వేషన్లు న్యాయంగా అందాల్సిన వారు ఇంకా పోరాడుతూనే ఉన్నారు.. ప్రస్తుతం కొన్ని అగ్ర కులాలు సైతం రిజర్వేషన్లు కావాలంటూ ఉద్యమాలకు దిగాయి.. చివరకు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చేందుకు బరితెగించాయి ప్రస్తుత ప్రభుత్వాలు..
కుల నిర్మూళన ద్వారానే సమ సమాజ నిర్మాణం సాధ్యమని బాబాసాహెబ్ అంబేద్కర్ చేప్పేవారు.. దురదృష్లవశాత్తు కులాల పేరిట ఉద్యమాలు కుంపట్లుగా మారి దేశ సమగ్రత, సామరస్యానికి విఘాతంగా కలిగించేవిగా మారాయి.. అవి అగ్రవర్ణాలవి కావచ్చు.. బడుగు బలహీనవర్గాలని కావచ్చు.. ఈరోజున ప్రతి ఒక్కరూ అంబేద్కర్ పేరును వాడుకుంటున్నారు.. కానీ ఆయనను అర్థం చేసుకున్నవారు, విధానాలను అనుసరిస్తున్నవారు చాలా అరుదు.. ముందు మనం తక్షణం చేయాల్సిన పని ఇదే..
(ఏప్రిల్ 14న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడు కోరుకున్న సమాజ నిర్మాణం కోసం మనమంతా అంకితం అవుదాం)

Wednesday, April 5, 2017

రామరాజ్యం కావాలి

స్వాతంత్ర్యానికి పూర్వం మన దేశ నాయకులు అందరూ అనేవారు ‘రామ రాజ్యం’ కావాలని.. మన దేశం పరాయి పాలన నుండి విముక్తి పొందితే రామ రాజ్యంగా వెలుగొందుతుందని నమ్మేవారు.. మహాత్మాగాంధీ ‘రఘుపతి రాఘవ రాజారామ్..’ అనే గీతాన్ని పాడించేవారు.. అసలు ఏమిటి రామరాజ్యం అంటే..
ఆదర్శ నాయకుడు, పితృవాక్య పాలకుడు, గురు భక్తుడు, ఏక పత్నీ వ్రతుడు, మర్యాదా పురుషోత్తముడు, ధర్మ సంరక్షకుడు, సద్గుణవంతుడు, మహా వీరుడు, ప్రేమాస్పదుడు, ఆదర్శ మిత్రుడు.. సకల గుణాభిరాముడు.. శ్రీరామున్ని గురుంచి ఎంత చెప్పినా తక్కువే.. రాముడు కేవలం విష్ణుమూర్తి అవతారం కావడం వల్లే భగవంతుడు కాలేదు.. ఆయన ధర్మాచరణే ఆరాధ్యున్ని చేసింది..
శ్రీరాముడు గొప్ప నాయకుడు.. వ్యక్తిగత ప్రయోజనాలు విడిచిపెట్టి ప్రజల ఆకాంక్షలకే విలువ ఇచ్చాడు.. రామ రాజ్యంలో ప్రజలంతా ఆకలి దప్పుడు లేకుండా సుఖ సంతోషాలతో, సరి సంపదలతో జీవించారు. భయం, దొంగతనాలు లేదు.. ప్రతి పౌరుడు ధర్మాన్ని ఆచరించారు.. మహాత్మా గాంధీ రామ రాజ్యం కావాలని కోరుకున్నది ఇందుకే.. రామ రాజ్యం అంటే ఆదర్శ రాజ్యం..
రామాయణంలో ఎన్నో ఆదర్శపాత్రలు కనిపిస్తాయి.. ఆదర్శ పత్నులుగా సీత, ఊర్మిళ.. ఆదర్శ సోదరులుగా లక్ష్మణ, భరత శత్రుజ్ఞులు.. ఆదర్శ భక్తునిగా ఆంజనేయుడు.. ఇలా అన్ని పాత్రలను విశ్లేషించవచ్చు..
రాముడు అందరివాడు.. ఆసేతు హిమాచలం రామతత్వం వ్యాపించింది.. ముఖ్యంగా తెలుగు నేలకు రామభక్తికి విడదీయరాని సంబంధం ఏర్పడింది. ఉత్తరాదిన అయోధ్యలో పుట్టిన రాముడు వనవాసంలో భాగంగా దక్షిణాదికి వచ్చాడు.. సీతాపహరణంతో లంకకు వెళ్లి రావణున్ని సంహరించాడు.. రాముని కథ భారత దేశానికే పరిమితం కాలేదు.. తూర్పు ఆసియా దేశాలు కూడా రామాయణాన్ని సొంతం చేసుకున్నాయి..
శ్రీరామ నామం ఎంతో మధురం.. రామాయణం కేవలం ఒక పౌరాణిక కథ కాదు.. రామున్ని భగవంతునిగా ఎందుకు పూజిస్తున్నామో అర్థం చేసుకోనిదే రామ కథ పరిపూర్ణం కాదు..
శ్రీరామ నవమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.

Monday, April 3, 2017

సత్యం బాబుకు జరిగింది న్యాయమేనా?

గ‌డ‌చిన కాలం, తరిగిన జీవితం తిరిగి రావు..
ఎనిమిదేళ్లు అంటే ఒక మ‌నిషి జీవితంలో ఎంతో విలువైన స‌మ‌యం.. అది నాలుగు గోడ‌ల మ‌ద్య గ‌డ‌చిపోవ‌డం, అందునా చేయ‌ని నేరానికి శిక్ష అనుభ‌వించ‌డం అంటే దారుణం.. వంద మంది దోషులు త‌ప్పించుకున్నా, ఒక్క నిర్దోషికి అన్యాయం జ‌ర‌గొద్ద‌ని చెబుతున్నాయి మ‌న చ‌ట్టాలు.. కానీ న్యాయ స్థానాల్లో వాజ్యాలు ఏళ్ల త‌ర‌బ‌డి న‌డుస్తుంటే, చివ‌ర‌కు తీర్పు ఎలా వ‌స్తుందో తెలియ‌క ఎంతో మంది అమాయ‌కులు అన్యాయంగా జైళ్ల‌లో మ‌గ్గిపోతుంటే ఇలాంటి హితోక్తులు ఎలా వ‌ళ్లించ‌గ‌లం?
స‌త్యం బాబు అన‌గానే అయేషా మీరా హ‌త్య కేసులో నిందితుడు క‌ళ్ల ముందు క‌ద‌లాడాడు.. కాపాలా జ‌వాన్ల మ‌ధ్య‌ కోర్టుకు, జైలుకు తిప్పుతుంటే దీనంగా అల్లాడిపోతూ క‌నిపించిన దృశ్యాల‌ను ఇంకా మ‌ర‌చిపోలేదు.. అదంతా ఓవ‌ర్ యాక్ష‌న్ అని పోలీసులు చెప్పేవారు.. కానీ ఇప్పుడు స్ప‌ష్ట‌మైపోయింది ఓవ‌ర్ యాక్ష‌న్ చేసింది పోలీసులేన‌ని.. స్వ‌యాన హ‌తురాలి త‌ల్లి సైతం స‌త్యంబాబు నేరం చేశాడంటే న‌మ్మ‌లేదు.. త‌న కూతురు మ‌ర‌ణించింద‌నే వ్య‌ధను ప‌క్క‌న పెట్టి నిర్దోషికి శిక్ష ప‌డొద్ద‌ని ఆమె సైతం త‌పించింది..
అన్యాయంగా జైలులో మ‌గ్గిపోయిన స‌త్యంబాబుకు రూ.1,00,000 చెల్లించ‌మంది ఉన్నత న్యాయస్థానం.. ఈ రోజుల్లో ఒక కూలీ రోజుకు రూ.

.200 పైగానే సంపాదిస్తున్నాడు. ఇంత కాలంగా స‌త్యం బాబు కుటుంబం కోల్పోయిందెంతో లెక్క‌గ‌డితే?.. ముష్టి ల‌క్షేనా అని అనిపిస్తుంది.. డ‌బ్బు విష‌యాన్ని ప‌క్క‌న పెడితే ఆ కుటుంబానికి క‌లిసిన మాన‌సిక వ్య‌ధ‌, అవ‌మానాల‌కు ప‌రిహారం ఎవ‌రిస్తారు? నేను ఇక్క‌డ న్యాయ వ్య‌వ‌స్థ‌ను త‌ప్పు ప‌ట్ట‌లేను.. కానీ చ‌ట్ట ప‌రిదిలో జ‌రిగిపోతున్న అన్యాయాన్ని చూసి త‌ట్టుకోలేక పోతున్నాను..

Saturday, April 1, 2017

మీరు తెలివైన వారేనా?

తెలివి తేటలు ఒకరి సొంతం కాదు.. ప్రతి మనిషి తెలివైనవాడే.. సమాజంలో ఎవరి స్థాయి వారిదే.. ఎవరికి వారే గొప్ప.. 
అందరికీ సొంత వ్యక్తిత్వం ఉంటుంది.. అవతలి వారిని తెలివితక్కువ వారని హేళన చేయడం కించపరచడం బుద్ది తక్కువ తనం, అమానుషం, అవివేకం.. 
సాటి వారిని తెలివి తక్కువ వారిగా జమ కట్టడం.. దానికో రోజును పెట్టుకోవడం అంతకన్నా దారుణం.. అవతలి వాడిని తెలివి తక్కువ వాడని అవమానించే ముందు నిన్ను నీవు అద్దంలో చూసుకో.. ఆత్మ విమర్శ చేసుకో.. నీవు నిజంగా తెలివైన వాడివేనా?.
నిజమే అయితే ఏప్రిల్ ఫూల్ అంటూ సాటి మనిషిని గేలి చేస్తూ ఆనందించడం.. వేడుకగా దీనికో దినం జరుపుకోవడం సరైన పనేనా? ఇలాంటి దిక్కుమాలిన దినాలకు దినం పెడదాం..
 ..... SAY NO APRIL FOOL.....